జనవరి
శనివారం, జనవరి 1
“పసితనం నుండే నీకు పవిత్ర లేఖనాలు తెలుసు. క్రీస్తుయేసు మీద విశ్వాసం ఉంచడం ద్వారా వచ్చే రక్షణను పొందడానికి కావాల్సిన తెలివిని అవి నీకు ఇవ్వగలవు.”—2 తిమో. 3:15.
తిమోతి నేర్చుకున్న సత్యాలు ఆయన్ని యెహోవాకు దగ్గర చేశాయి, ఆయన విశ్వాసాన్ని బలపర్చాయి. మీరు కూడా బైబిల్ని అధ్యయనం చేసి, యెహోవా గురించి అందులో ఉన్న సత్యాలు నిజమని నమ్మకం కుదుర్చుకోవాలి. మీరు నమ్మకం కుదుర్చుకోవాల్సిన మూడు ప్రాథమిక సత్యాలు ఉన్నాయి. మొదటిగా, యెహోవా దేవుడు సమస్తాన్ని సృష్టించాడని మీకు నమ్మకం కుదరాలి. (నిర్గ. 3:14, 15; హెబ్రీ. 3:4; ప్రక. 4:11) రెండోదిగా, మనుషుల కోసం దేవుడే బైబిల్ని రాయించాడని పరిశీలించి తెలుసుకోవాలి. (2 తిమో. 3:16, 17) మూడవదిగా, క్రీస్తు నాయకత్వం కింద తనను ఆరాధించేలా దేవుడు కొంతమంది ప్రజల్ని ఏర్పర్చుకున్నాడని, ఆ ప్రజలు యెహోవాసాక్షులని అర్థం చేసుకోవాలి. (యెష. 43:10-12; యోహా. 14:6; అపొ. 15:14) అయితే మీకు బైబిలు గురించి పూర్తిగా తెలియాల్సిన అవసరం లేదు. మీరు తెలుసుకున్నది సత్యమనే నమ్మకాన్ని మరింత బలపర్చుకునేలా “మీ ఆలోచనా సామర్థ్యాల్ని” ఉపయోగించడం మీ లక్ష్యమై ఉండాలి.—రోమా. 12:1. w20.07 10 ¶8-9
ఆదివారం, జనవరి 2
“ఐదు నెలలపాటు వాళ్లను హింసించే అధికారం ఆ మిడతలకు ఇవ్వబడింది కానీ చంపే అధికారం ఇవ్వబడలేదు.”—ప్రక. 9:5.
ప్రకటన గ్రంథంలో ప్రవచించబడిన మిడతల ముఖాలు మనుషుల ముఖాల్లా ఉన్నాయి, “వాటి తలల మీద బంగారు కిరీటాల లాంటివి ఉన్నాయి.” (ప్రక. 9:7) అవి, ‘నొసళ్ల మీద దేవుని ముద్రలేని ప్రజలను [దేవుని శత్రువులను]’ ఐదు నెలలపాటు, అంటే సగటున ఒక మిడత జీవించినంత కాలంపాటు హింసిస్తాయి. (ప్రక. 9:4) ఈ ప్రవచనం యెహోవా అభిషిక్త సేవకుల గురించి చెప్తోంది. వాళ్లు ఈ దుష్టలోకం మీద దేవుని తీర్పుల్ని ధైర్యంగా ప్రకటిస్తారు, ఆ తీర్పులు లోకానికి మద్దతిచ్చేవాళ్లను ఇబ్బంది పెడతాయి. అంటే యోవేలు 2:7-9 లో ఉన్న “మిడతలు,” ప్రకటన గ్రంథంలో ఉన్న “మిడతలు” వేర్వేరు విషయాల్ని సూచిస్తున్నాయా? అవును. బైబిల్లో, వేర్వేరు విషయాలను సూచించడానికి ఒకే జీవిని ఉపయోగించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు, ప్రకటన 5:5 లో “యూదా గోత్రపు సింహం” అని యేసు పిలవబడ్డాడు. అయితే, 1 పేతురు 5:8 లో “గర్జించే సింహం” అని అపవాది పిలవబడ్డాడు. w20.04 3 ¶8; 5 ¶10
సోమవారం, జనవరి 3
“యెహోవా కళ్లు ప్రతీ చోట ఉన్నాయి, చెడ్డవాళ్లను, మంచివాళ్లను అవి చూస్తున్నాయి.”—సామె. 15:3.
శారయి సేవకురాలైన హాగరు అబ్రాముకు భార్య అయిన తర్వాత తెలివితక్కువగా ప్రవర్తించింది. హాగరు గర్భవతి అయిన తర్వాత పిల్లలులేని శారయిని హీనంగా చూడడం మొదలుపెట్టింది. అప్పుడు శారయి హాగరును అవమానించడంతో, హాగరు పారిపోయింది. (ఆది. 16:4-6) హాగరు గర్వంగా ప్రవర్తించింది కాబట్టి ఆమెకు తగిన శాస్తే జరిగిందని అపరిపూర్ణులమైన మనకు అనిపించవచ్చు. కానీ యెహోవా హాగరు గురించి మనలా ఆలోచించలేదు. ఆయన ఒక దేవదూతను ఆమె దగ్గరికి పంపించాడు. హాగరు తన ఆలోచనా విధానాన్ని సరిదిద్దుకోవడానికి ఆ దేవదూత సహాయం చేశాడు, ఆమెను దీవించాడు. దాంతో యెహోవా మొదటినుండి తనను చూస్తున్నాడని, తన పరిస్థితి మొత్తం ఆయనకు తెలుసని హాగరుకు అర్థమైంది. ఆమె యెహోవాను స్తుతిస్తూ ఇలా అంది: ‘నువ్వు చూసే దేవుడివి. నన్ను చూసే వ్యక్తివి.’ (ఆది. 16:7-13) హాగరుకు సంబంధించి యెహోవా ఏ విషయాల్ని అర్థం చేసుకున్నాడు? హాగరు గతం గురించి, ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల గురించి యెహోవాకు పూర్తిగా తెలుసు. హాగరు శారయితో అమర్యాదగా ప్రవర్తించడం తప్పని యెహోవాకు తెలుసు. కానీ ఆమె భావాల్ని, పరిస్థితుల్ని అర్థం చేసుకుని యెహోవా ఆమెతో దయగా వ్యవహరించాడు. w20.04 16 ¶8-9
మంగళవారం, జనవరి 4
“నేను . . . పరుగుపందెంలో చివరిదాకా పరుగెత్తాను.”—2 తిమో. 4:7.
నిజ క్రైస్తవులందరూ ఒక పరుగుపందెంలో ఉన్నారని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (హెబ్రీ. 12:1) మనం యౌవనులమైనా లేదా వృద్ధులమైనా, బలంగా ఉన్నా లేదా బలహీనంగా ఉన్నా యెహోవా ఇచ్చే బహుమతిని గెలవాలంటే చివరిదాకా ఓపిగ్గా పరుగెత్తాలి. (మత్త. 24:13) పౌలు ‘పరుగుపందెంలో చివరిదాకా పరుగెత్తాడు’ కాబట్టే దానిగురించి ధైర్యంగా క్రైస్తవులందర్నీ ప్రోత్సహించగలిగాడు. (2 తిమో. 4:7, 8) ఇంతకీ పౌలు చెప్తున్న పరుగుపందెం ఏంటి? కొన్ని సందర్భాల్లో పౌలు ముఖ్యమైన పాఠాలు బోధించడానికి ప్రాచీన గ్రీసులో జరిగే ఆటలకు సంబంధించిన విషయాలను ఉపయోగించాడు. (1 కొరిం. 9:25-27; 2 తిమో. 2:5) ఆయన చాలా సందర్భాల్లో, క్రైస్తవ జీవితాన్ని పరుగుపందెంతో పోల్చాడు. (1 కొరిం. 9:24; గల. 5:7; ఫిలి. 2:16) ఒక వ్యక్తి యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆ పరుగుపందెంలో అడుగుపెడతాడు. (1 పేతు. 3:21) యెహోవా ఇచ్చే శాశ్వత జీవితమనే బహుమతిని గెల్చుకున్నప్పుడు తన పరుగును పూర్తిచేస్తాడు.—మత్త. 25:31-34, 46; 2 తిమో. 4:8. w20.04 26 ¶1-3
బుధవారం, జనవరి 5
“మీరు దేవుడు ఇచ్చే సంపూర్ణ యుద్ధ కవచాన్ని ధరించండి.”—ఎఫె. 6:13.
“ప్రభువు నమ్మకమైనవాడు. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, దుష్టుని నుండి కాపాడతాడు.” (2 థెస్స. 3:3) యెహోవా మనల్ని ఎలా కాపాడతాడు? సాతాను దాడుల నుండి మనల్ని కాపాడడానికి యెహోవా మనకు యుద్ధ కవచాన్ని ఇచ్చాడు. (ఎఫె. 6:13-17) ఈ ఆధ్యాత్మిక కవచం బలమైనది, అది చాలా బాగా పనిచేస్తుంది! అయితే ఆ కవచం మనల్ని కాపాడాలంటే, దానిలో ఏ ఒక్కటీ విడిచిపెట్టకుండా ప్రతీది వేసుకోవాలి; వాటిని ఎప్పుడూ వేసుకునే ఉండాలి. సత్యం అనే దట్టీ, దేవుని వాక్యంలో ఉన్న సత్యాల్ని సూచిస్తుంది. మనం ఈ దట్టీ ఎందుకు కట్టుకోవాలి? ఎందుకంటే సాతాను “అబద్ధానికి తండ్రి.” (యోహా. 8:44) అబద్ధాలు ఆడడంలో సాతానుకు వేల సంవత్సరాల అనుభవం ఉంది. అతను “లోకమంతటినీ” మోసం చేశాడు! (ప్రక. 12:9) కానీ మనం మోసపోకుండా బైబిల్లో ఉన్న సత్యాలు కాపాడతాయి. మనం ఈ దట్టీని ఎలా కట్టుకోవచ్చు? యెహోవా గురించిన సత్యం నేర్చుకోవడం ద్వారా, “పవిత్రశక్తితో, సత్యంతో” ఆయన్ని ఆరాధించడం ద్వారా, అన్ని విషయాల్లో నిజాయితీగా నడుచుకోవడం ద్వారా దాన్ని కట్టుకోవచ్చు.—యోహా. 4:24; ఎఫె. 4:25; హెబ్రీ. 13:18. w21.03 26-27 ¶3-5
గురువారం, జనవరి 6
“అతను సుందరమైన దేశంలోకి కూడా ప్రవేశిస్తాడు.”—దాని. 11:41.
ఆ దేశంలో సత్యారాధన జరిగేది కాబట్టి అది ప్రత్యేకమైన ప్రాంతంగా ఉండేది. క్రీ.శ. 33 పెంతెకొస్తు రోజు నుండి “సుందరమైన దేశం” అనే మాట ఒక దేశాన్నో, ప్రాంతాన్నో సూచించడం లేదు. ఎందుకంటే యెహోవాను ఆరాధించే ప్రజలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. మరి, “సుందరమైన దేశం” అనే మాట నేడు దేన్ని సూచిస్తోంది? సత్యారాధనలో భాగంగా జరిగే కూటాలు, పరిచర్యతో సహా యెహోవా ప్రజల కార్యకలాపాలన్నిటినీ అది సూచిస్తోంది. చివరి రోజుల్లో ఉత్తర రాజు “సుందరమైన దేశంలోకి” ఎన్నోసార్లు ప్రవేశించాడు. ఉదాహరణకు, నాజీ జర్మనీ ఉత్తర రాజుగా ఉన్నప్పుడు, ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో దేవుని ప్రజల్ని హింసించడం ద్వారా, చంపడం ద్వారా “సుందరమైన దేశంలోకి” ప్రవేశించాడు. ఆ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్ ఉత్తర రాజుగా ఉన్నప్పుడు, దేవుని ప్రజల్ని హింసించి, వాళ్లను సైబీరియాకు బందీలుగా పంపించడం ద్వారా “సుందరమైన దేశంలోకి” ప్రవేశించాడు. w20.05 13 ¶7-8
శుక్రవారం, జనవరి 7
“యెహోవాకు భయపడేవాళ్లు ఆయనతో దగ్గరి స్నేహాన్ని అనుభవిస్తారు, తన ఒప్పందాన్ని ఆయన వాళ్లకు తెలియజేస్తాడు.”—కీర్త. 25:14.
క్రీస్తు చనిపోవడానికి కన్నా ముందు జీవించిన కొంతమంది దేవుని స్నేహితుల గురించి ఆలోచించండి. అబ్రాహాము చెక్కుచెదరని విశ్వాసం చూపించాడు. అబ్రాహాము చనిపోయి 1,000 ఏళ్లు గడిచాక కూడా, యెహోవా అతన్ని ‘నా స్నేహితుడు’ అని పిలిచాడు. (యెష. 41:8) అవును, ఆఖరికి మరణం కూడా యెహోవాకు తన దగ్గరి స్నేహితులతో ఉన్న బంధాన్ని తెంచలేదు. అబ్రాహాము యెహోవా దృష్టిలో ఇంకా బ్రతికేవున్నాడు. (లూకా 20:37, 38) అలాంటి మరో వ్యక్తి యోబు. ఒక సందర్భంలో యెహోవా సన్నిధిలో దేవదూతలు సమకూడినప్పుడు, వాళ్ల ముందు ఆయన యోబు గురించి గొప్పగా మాట్లాడాడు. “అతను నింద లేనివాడు, నిజాయితీపరుడు; అతను దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనానికి దూరంగా ఉన్నాడు” అని యెహోవా చెప్పాడు. (యోబు 1:6-8) ఇంకో వ్యక్తి దానియేలు. అతను సుమారు 80 ఏళ్లపాటు అబద్ధ ఆరాధకుల మధ్య జీవించినా యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు. వృద్ధుడైన దానియేలుకు దేవదూతలు మూడు సందర్భాల్లో కనిపించి, అతను దేవునికి ‘ఎంతో అమూల్యమైనవాడని’ అభయమిచ్చారు. (దాని. 9:23; 10:11, 19) చనిపోయిన తన ప్రియమైన స్నేహితుల్ని తిరిగి బ్రతికించే రోజు కోసం యెహోవా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.—యోబు 14:15. w20.05 26-27 ¶3-4
శనివారం, జనవరి 8
“నీ నియమాలు నాకు బోధించు.”—కీర్త. 119:68.
బైబిలు విద్యార్థులు దేవుని నియమాల్ని తెలుసుకుని అవి సరైనవని గ్రహించవచ్చు. అయితే వాళ్లు యెహోవాను ప్రేమించి ఆయనకు లోబడతారా? ఒక విషయం గుర్తుంచుకోండి: హవ్వకు దేవుడు ఇచ్చిన నియమం తెలుసు, కానీ దాన్ని ఇచ్చిన దేవుని పట్ల ఆమెకు నిజమైన ప్రేమ లేదు. ఆదాముకు కూడా అంతే. (ఆది. 3:1-6) కాబట్టి బైబిలు విద్యార్థులకు కేవలం దేవుని నీతియుక్త నియమాలు, నిర్దేశాలు నేర్పిస్తే సరిపోదు. వాళ్లకు యెహోవాను ప్రేమించడం నేర్పించాలి. దేవుని నియమాలు, నిర్దేశాలు ఎల్లప్పుడూ మనకు మంచే చేస్తాయి. (కీర్త. 119:97, 111, 112) బైబిలు విద్యార్థులు ఈ విషయాన్ని అర్థంచేసుకోవాలంటే, ఆయన మన మీద ప్రేమతోనే వాటిని ఇచ్చాడని వాళ్లు గ్రహించాలి. కాబట్టి మనం వాళ్లను ఇలా అడగవచ్చు: “తన సేవకులు ఇలా చేయాలని లేదా ఇలా చేయకూడదని దేవుడు ఎందుకు చెప్తున్నాడని మీరు అనుకుంటున్నారు? ఆయన ఎలాంటి దేవుడని ఇది చూపిస్తుంది?” యెహోవా గురించి ఆలోచించేలా, ఆయన మహిమాన్వితమైన పేరును ప్రేమించేలా, మన విద్యార్థులకు సహాయం చేస్తే నేర్చుకుంటున్న విషయాలు వాళ్ల మనసును హత్తుకుంటాయి. అప్పుడు వాళ్లు ఆ నియమాలతోపాటు, వాటిని ఇచ్చిన దేవున్ని కూడా ప్రేమిస్తారు. దానివల్ల వాళ్ల విశ్వాసం పెరుగుతుంది; అంతేకాదు రాబోయే కష్టమైన పరిస్థితుల్ని సహించేంత బలం సంపాదించుకుంటారు.—1 కొరిం. 3:12-15. w20.06 10 ¶10-11
ఆదివారం, జనవరి 9
“వినడానికి త్వరపడాలి, మాట్లాడడానికి తొందరపడకూడదు.”—యాకో. 1:19.
ఒక వ్యక్తి యెహోవా దగ్గరికి తిరిగి రావడానికి సమయం పడుతుంది కాబట్టి, మనకు ఓర్పు అవసరం. పెద్దలు, సంఘంలోని ఇతరులు ఎన్నోసార్లు కలిసిన తర్వాతే తాము మళ్లీ సంఘానికి రావడం మొదలుపెట్టామని ఒకప్పుడు నిష్క్రియులుగా ఉన్న చాలామంది చెప్పారు. ఆసియాకు చెందిన న్యాన్సీ అనే సహోదరి ఇలా రాసింది: “నాతో సన్నిహితంగా ఉండే ఒక సహోదరి నాకు చాలా సహాయం చేసింది. ఆమె నన్ను చెల్లిలా చూసుకుంది. మేమిద్దరం కలిసి సంతోషంగా గడిపిన సందర్భాల్ని గుర్తుచేసింది. నేను ఏదైనా చెప్పినప్పుడు ఓపిగ్గా వింది, అవసరమైనప్పుడు సలహాలు కూడా ఇచ్చింది. ఆమె నాకు నిజమైన స్నేహితురాలిగా ఉంటూ, ఏ సమయంలోనైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేది.” సహానుభూతి మంచి ఆయింట్‌మెంట్ లాంటిది. మనసుకు తగిలిన గాయాల్ని మాన్పడానికి అది బాగా సహాయం చేస్తుంది. సంఘంలోని ఒకవ్యక్తి వల్ల ఇబ్బందిపడిన కొంతమంది నిష్క్రియులు, ఎన్నో ఏళ్లు గడిచిపోయినా ఆ కోపాన్ని, బాధను మనసులోనే ఉంచుకొని ఉండవచ్చు. దాంతో వాళ్లు సంఘానికి తిరిగి రావడానికి ఇష్టపడకపోవచ్చు. కొంతమంది తమకు అన్యాయం జరిగిందని అనుకోవచ్చు. కాబట్టి వాళ్లు చెప్పేది వినడానికి, వాళ్లను అర్థం చేసుకోవడానికి ఎవరో ఒకరి సహాయం అవసరం. w20.06 26 ¶10-11
సోమవారం, జనవరి 10
“మీరు దుష్టుడిపై విజయం సాధించారు.”—1 యోహా. 2:14.
సెక్స్ విషయంలో ఎదురయ్యే ఒత్తిళ్లను జయించే కొద్దీ, సరైనది చేయడం మీకు మరింత తేలికౌతుంది. సెక్స్ గురించి ఈ లోకంలో ఉన్న తప్పుడు అభిప్రాయాలకు మూలం సాతానని మర్చిపోకండి. మీరు ఈ లోకంలోని ప్రజల ఆలోచనల్ని ఎదిరించినప్పుడు ‘దుష్టుడిపై విజయం సాధిస్తారు.’ తప్పొప్పుల విషయంలో ప్రమాణాల్ని పెట్టే హక్కు యెహోవాకు మాత్రమే ఉందని మనకు తెలుసు. కాబట్టి మనం పాపం చేయకుండా ఉండడానికి తీవ్రంగా కృషిచేస్తాం. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే, ప్రార్థనలో యెహోవా ముందు దాన్ని ఒప్పుకుంటాం. (1 యోహా. 1:9) కానీ ఏదైనా ఘోరమైన పాపం చేస్తే, మనల్ని శ్రద్ధగా చూసుకోవడానికి యెహోవా నియమించిన సంఘ పెద్దల సహాయం తీసుకుంటాం. (యాకో. 5:14-16) అయితే గతంలో చేసిన తప్పుల గురించే ఆలోచిస్తూ కృంగిపోకూడదు. ఎందుకు? ఎందుకంటే మన పాపాలు క్షమించబడేలా మన ప్రేమగల తండ్రి తన కుమారుణ్ణి విమోచన క్రయధనంగా అర్పించాడు. పశ్చాత్తాపపడే పాపుల్ని క్షమిస్తానని యెహోవా మాటిస్తున్నాడు, ఆయన మాట తప్పడు. కాబట్టి మనం స్వచ్ఛమైన మనస్సాక్షితో యెహోవాను సేవించగలం.—1 యోహా. 2:1, 2, 12; 3:19, 20. w20.07 22-23 ¶9-10
మంగళవారం, జనవరి 11
“నీ దగ్గర జీవపు ఊట ఉంది.”—కీర్త. 36:9.
ఒకానొక సమయంలో యెహోవా ఒక్కడే ఉన్నాడు. అలా ఒక్కడే ఉండడం వల్ల ఆయన బాధపడలేదు. సంతోషంగా ఉండాలంటే ఆయనకు ఇంకొకరి తోడు అవసరం లేదు. అయినప్పటికీ జీవాన్ని ఇతరులతో పంచుకోవాలని, వాళ్లు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. ప్రేమ వల్లే యెహోవా సృష్టిని చేయడం మొదలుపెట్టాడు. (1 యోహా. 4:19) యెహోవా ముందుగా తన కుమారుడైన యేసును సృష్టించాడు. తర్వాత ఆ మొదటి కుమారుని ద్వారా కోట్లాది దేవదూతలతో సహా “మిగతా వాటన్నిటినీ” సృష్టించాడు. (కొలొ. 1:16) తన తండ్రితో కలిసి పనిచేసే అవకాశం దొరికినందుకు యేసు సంతోషించాడు. (సామె. 8:30) యెహోవా తన ప్రధానశిల్పి అయిన యేసుతో కలిసి భూమ్యాకాశాల్ని సృష్టించడం దేవుని కుమారులైన దేవదూతలు చూశారు. అప్పుడు వాళ్లకు ఎలా అనిపించింది? భూమిని సృష్టించినప్పుడు వాళ్లు ‘సంతోషంతో స్తుతిగీతాలు పాడారు.’ యెహోవా మిగతా వాటన్నిటినీ, ముఖ్యంగా మనుషుల్ని చేసినప్పుడు కూడా వాళ్లు ఖచ్చితంగా స్తుతిగీతాలు పాడి ఉంటారు. (యోబు 38:7; సామె. 8:31, అధస్సూచి.) యెహోవా సృష్టించిన ప్రతీదానిలో ఆయన ప్రేమ, తెలివి కనిపిస్తాయి.—కీర్త. 104:24; రోమా. 1:20. w20.08 14 ¶1-2
బుధవారం, జనవరి 12
“మీరు నా శిష్యులుగా ఉన్నందుకు అన్నిదేశాల ప్రజలు మిమ్మల్ని ద్వేషిస్తారు.”—మత్త. 24:9.
ఇతరుల్ని ప్రేమించేలా, వాళ్ల ప్రేమను పొందేలా యెహోవా మనల్ని సృష్టించాడు. అందుకే ఎవరైనా మనల్ని ద్వేషించినప్పుడు మనకు బాధగా ఉంటుంది, కొన్నిసార్లు భయమేస్తుంది. ఒక సహోదరుడు ఇలా అంటున్నాడు: “యెహోవాసాక్షిగా ఉన్నందుకు సైనికులు నన్ను కొట్టారు, ఎగతాళి చేశారు, బెదిరించారు. అప్పుడు నాకు భయమేసింది, అవమానంగా అనిపించింది.” ఎవరైనా మనల్ని ద్వేషించినప్పుడు బాధగా ఉంటుంది. కానీ అలా జరిగితే మనం ఆశ్చర్యపోం. ఎందుకంటే, లోకం మనల్ని ద్వేషిస్తుందని యేసు ముందే చెప్పాడు. ఈ లోకం యేసు అనుచరుల్ని ఎందుకు ద్వేషిస్తుంది? ఒక కారణం ఏంటంటే, యేసులాగే మనం ‘లోకానికి చెందినవాళ్లం కాదు.’ (యోహా. 15:17-19) మనం ఈ లోక ప్రభుత్వాల్ని గౌరవిస్తాం కానీ రాజకీయాల్లో తలదూర్చం, జెండా వందనం చేయం, లేదా జాతీయ గీతం పాడం. మనం యెహోవాను మాత్రమే ఆరాధిస్తాం. మనుషుల్ని పరిపాలించే హక్కు దేవునికి ఉందని మనం నమ్ముతాం, కానీ సాతాను, అతని “సంతానం” దాన్ని ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. (ఆది. 3:1-5, 15) దేవుని రాజ్యం మాత్రమే మనుషుల కష్టాల్ని తీసేస్తుందని, దాన్ని వ్యతిరేకించే వాళ్లందర్నీ త్వరలోనే నాశనం చేస్తుందని మనం ప్రకటిస్తాం. (దాని. 2:44; ప్రక. 19:19-21) ఆ సందేశం సాత్వికులకు మంచివార్త, కానీ దుష్టులకు చెడ్డవార్త. w21.03 20 ¶1-2
గురువారం, జనవరి 13
“మనం దేవునివైపు ఉన్నామని మనకు తెలుసు.”—1 యోహా. 5:19.
యెహోవా క్రైస్తవ సహోదరీలకు సంఘంలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని ఇస్తున్నాడు. వాళ్లు చూపించిన తెలివి, విశ్వాసం, ఉత్సాహం, ధైర్యం, ఉదారత వంటి లక్షణాల్ని బట్టి, వాళ్లు చేసిన మంచి పనుల్ని బట్టి బైబిలు వాళ్లను మెచ్చుకుంటోంది. (లూకా 8:2, 3; అపొ. 16:14, 15; రోమా. 16:3, 6; ఫిలి. 4:3; హెబ్రీ. 11:11, 31, 35) సంఘంలో ఉన్న వృద్ధుల్ని బట్టి కూడా మనం ఎంతో సంతోషిస్తాం. వాళ్లు వయసు పైబడడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలతో పోరాడుతుండవచ్చు. అయినా వాళ్లు పరిచర్యలో చేయగలిగినదంతా చేస్తున్నారు; ఇతరుల్ని ప్రోత్సహించడానికి, శిక్షణ ఇవ్వడానికి తమ శక్తిని ధారపోస్తున్నారు! వాళ్ల అనుభవం నుండి మనం ఎంతో ప్రయోజనం పొందుతున్నాం. వాళ్లు యెహోవా దృష్టిలో, మన దృష్టిలో చాలా అందమైనవాళ్లు. (సామె. 16:31) సంఘంలోని యౌవనుల గురించి, పిల్లల గురించి కూడా ఆలోచించండి. అపవాదియైన సాతాను వల్ల, అతని చెడ్డ ఆలోచనల వల్ల ఈ లోకం బాగా చెడిపోయింది. అలాంటి లోకంలో పెరుగుతున్న మన యౌవనులు, పిల్లలు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అయినా వాళ్లు మీటింగ్స్‌లో కామెంట్స్ చెప్తున్నారు, పరిచర్యలో పాల్గొంటున్నారు, తమ నమ్మకాల గురించి ధైర్యంగా మాట్లాడుతున్నారు. వాళ్లను చూసినప్పుడు మనందరికీ ఎంతో ప్రోత్సాహం కలుగుతుంది. అవును యెహోవా సంఘంలో యౌవనులకు, పిల్లలకు కూడా విలువైన స్థానం ఉంది!—కీర్త. 8:2. w20.08 21-22 ¶9-11
శుక్రవారం, జనవరి 14
“తోడేళ్ల మధ్యకు గొర్రెల్ని పంపిస్తున్నట్టు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను.”—మత్త. 10:16.
మనం ప్రకటించడం, యెహోవాసాక్షులమని చెప్పుకోవడం మొదలుపెట్టినప్పుడు కుటుంబ సభ్యులు మనల్ని వ్యతిరేకించవచ్చు, స్నేహితులు ఎగతాళి చేయవచ్చు, ప్రజలు మన సందేశాన్ని వినకపోవచ్చు. మీరు ధైర్యాన్ని ఎలా పెంచుకోవచ్చు? మొదటిగా, యేసు పరలోకం నుండి ఈ పనిని నిర్దేశిస్తూనే ఉంటాడని గుర్తుంచుకోండి. (యోహా. 16:33; ప్రక. 14:14-16) తర్వాత, మిమ్మల్ని చూసుకుంటానని యెహోవా చేసిన వాగ్దానం మీద విశ్వాసం పెంచుకోండి. (మత్త. 6:32-34) మీ విశ్వాసం బలపడే కొద్దీ మీలో ధైర్యం పెరుగుతుంది. మీరు యెహోవాసాక్షుల దగ్గర బైబిలు స్టడీ తీసుకుంటున్నారని, వాళ్ల మీటింగ్స్‌కు వెళ్తున్నారని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు మీరు కూడా గొప్ప విశ్వాసం చూపించారు! అంతేకాదు యెహోవా నీతి ప్రమాణాలకు తగ్గట్టు మీ ప్రవర్తనలో, జీవన విధానంలో పెద్దపెద్ద మార్పులు చేసుకున్నారు. అందుకు చాలా విశ్వాసం, ధైర్యం అవసరమై ఉంటుంది. మీరు ధైర్యాన్ని పెంచుకుంటుండగా, మీరు వెళ్లే ప్రతీ చోట మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉంటాడనే నమ్మకంతో ఉండవచ్చు.—యెహో. 1:7-9. w20.09 5 ¶11-12
శనివారం, జనవరి 15
‘యెహోవా అతనికి విశ్రాంతి ఇచ్చాడు.’—2 దిన. 14:6.
ఆసా రాజు మనకు చక్కని ఆదర్శం ఉంచాడు. అతను యెహోవాపై పూర్తిగా ఆధారపడడం ద్వారా తెలివిగా ప్రవర్తించాడు. అతను కష్ట సమయాల్లోనే కాదు, ప్రశాంతంగా ఉన్న సమయాల్లో కూడా యెహోవాను సేవించాడు. చిన్నప్పటి నుండి ‘ఆసా హృదయం యెహోవా పట్ల సంపూర్ణంగా ఉంది.’ (1 రాజు. 15:14) యూదాలో అబద్ధ ఆరాధనను నిర్మూలించడం ద్వారా తన హృదయం యెహోవా పట్ల సంపూర్ణంగా ఉందని ఆసా చూపించాడు. అతను “అన్య దేవుళ్ల బలిపీఠాల్ని, ఉన్నత స్థలాల్ని తీయించాడు, పూజా స్తంభాల్ని పగలగొట్టించి, పూజా కర్రల్ని నరికించాడు.” (2 దిన. 14:3, 5) అంతేకాదు, ఆసా తన అవ్వ మయకాను రాజమాత స్థానంలో నుండి తీసేశాడు. ఎందుకంటే ఆమె ఒక విగ్రహాన్ని చేయించి, అబద్ధ ఆరాధనను ప్రోత్సహించింది. (1 రాజు. 15:11-13) ఆసా అబద్ధ ఆరాధనను నిర్మూలించడమే కాదు, సత్యారాధనను ప్రోత్సహించాడు కూడా. యూదా ప్రజలు యెహోవా దగ్గరికి తిరిగొచ్చేలా అతను సహాయం చేశాడు. యెహోవా ఆసాకు, ఇశ్రాయేలీయులకు ప్రశాంతమైన కాలాల్ని అనుగ్రహించాడు. ఆసా పరిపాలనలో పది సంవత్సరాల పాటు “దేశం ప్రశాంతంగా ఉంది.”—2 దిన. 14:1, 4, 6. w20.09 14 ¶2-3
ఆదివారం, జనవరి 16
“తిమోతీ, నీకు అప్పగించబడినదాన్ని కాపాడు.”—1 తిమో. 6:20.
మనం తరచూ మన దగ్గరున్న విలువైన వాటిని వేరేవాళ్లకు అప్పగించి, వాటిని భద్రంగా ఉంచమని చెప్తాం. ఉదాహరణకు, మన డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. అలా చేసినప్పుడు, మన డబ్బు దొంగిలించబడకుండా భద్రంగా ఉండేలా బ్యాంకు చూసుకోవాలని ఆశిస్తాం. తిమోతి విలువైన దాన్ని పొందాడని, అంటే మనుషుల విషయంలో దేవుని సంకల్పానికి సంబంధించి సరైన జ్ఞానాన్ని పొందాడని అపొస్తలుడైన పౌలు గుర్తుచేశాడు. అంతేకాదు ‘వాక్యాన్ని ప్రకటించే,’ ‘మంచివార్త ప్రచారకుడిగా పనిచేసే’ గొప్ప అవకాశం కూడా తిమోతికి అప్పగించబడింది. (2 తిమో. 4:2, 5) తనకు అప్పగించబడిన దాన్ని కాపాడుకోమని పౌలు తిమోతిని ప్రోత్సహించాడు. తిమోతికి అప్పగించినట్టే, యెహోవా మనకు కూడా విలువైన వాటిని అప్పగించాడు. తన వాక్యమైన బైబిల్లోని విలువైన సత్యాలకు సంబంధించిన సరైన జ్ఞానాన్ని యెహోవా మనకు అనుగ్రహించాడు. బైబిలు సత్యాలు ఎందుకు విలువైనవి? ఎందుకంటే, యెహోవాతో మంచి సంబంధం కలిగి ఉండడానికి, జీవితంలో నిజమైన సంతోషాన్ని పొందడానికి ఏం చేయాలో అవి మనకు తెలియజేస్తాయి. మనం ఆ సత్యాల్ని అంగీకరించి వాటి ప్రకారం జీవించినప్పుడు అబద్ధ బోధల నుండి, చెడు అలవాట్ల నుండి బయటపడతాం.—1 కొరిం. 6:9-11. w20.09 26 ¶1-3
సోమవారం, జనవరి 17
“మీ మంచి కోసం మేము మీ మధ్య ఎలా పనిచేశామో మీకే తెలుసు.”—1 థెస్స. 1:5.
మీ ఉత్సాహం, బైబిలు సత్యాల పట్ల మీకున్న బలమైన నమ్మకం మీ బైబిలు విద్యార్థికి కనిపించాలి. అప్పుడు, అతను నేర్చుకుంటున్న విషయాల్ని ఇంకా ఎక్కువగా ప్రేమించగలుగుతాడు. బైబిలు సూత్రాల ప్రకారం జీవించడం వల్ల మీరెలాంటి ప్రయోజనాలు పొందారో విద్యార్థికి చెప్పవచ్చు. దానివల్ల, బైబిల్లో ఉన్న సలహాల్ని పాటిస్తే తన జీవితం కూడా మెరుగౌతుందని విద్యార్థి అర్థంచేసుకుంటాడు. స్టడీ చేస్తున్నప్పుడు, విద్యార్థికి ఉన్న లాంటి సమస్యల్నే ఎదుర్కొని వాటిని అధిగమించిన సహోదర సహోదరీల అనుభవాలు చెప్పండి. మీ సంఘంలో ఎవరి ఆదర్శం నుండి విద్యార్థి ప్రయోజనం పొందే అవకాశం ఉందో, అలాంటి వాళ్లను మీతోపాటు తీసుకెళ్లవచ్చు. బైబిలు సూత్రాలు పాటించడం ఎంత తెలివైనదో గ్రహించేలా మీ విద్యార్థికి సహాయం చేయండి. విద్యార్థికి పెళ్లయి, భార్యాభర్తల్లో ఒక్కరు మాత్రమే స్టడీ తీసుకుంటుంటే, వాళ్ల వివాహజతను కూడా స్టడీలో కూర్చోమని ఆహ్వానించండి. నేర్చుకుంటున్న విషయాల్ని కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోమని విద్యార్థిని ప్రోత్సహించండి.—యోహా. 1:40-45. w20.10 16 ¶7-9
మంగళవారం, జనవరి 18
“నువ్వు వాటిని నీ కుమారుల హృదయాల్లో నాటాలి.”—ద్వితీ. 6:7.
యేసు పెరిగి పెద్దవాడౌతూ దేవుని ఆమోదాన్ని పొందేలా యోసేపు మరియలు ఆయన్ని పెంచారు. తల్లిదండ్రుల కోసం యెహోవా ఇచ్చిన నిర్దేశాల్ని వాళ్లు పాటించారు. (ద్వితీ. 6:6, 7) వాళ్లకు యెహోవా మీద ప్రగాఢమైన ప్రేమ ఉంది, తమ పిల్లలు కూడా అలాంటి ప్రేమను పెంచుకోవాలనే లక్ష్యంతో వాళ్లు పనిచేశారు. యోసేపు మరియలు తమ పిల్లలతో కలిసి యెహోవాను క్రమంగా ఆరాధించాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు ప్రతీవారం నజరేతులోని సమాజమందిరానికి, అలాగే ప్రతీ సంవత్సరం పస్కా పండుగ కోసం యెరూషలేముకు వెళ్లేవాళ్లు. (లూకా 2:41; 4:16) ఆ ప్రయాణంలో వాళ్లు యేసుకు, ఆయన తోబుట్టువులకు యెహోవా ప్రజల చరిత్రను వివరించి ఉంటారు, అంతేకాదు లేఖనాల్లో ప్రస్తావించిన ప్రదేశాలను చూపించి ఉంటారు. ఎక్కువమంది పిల్లలు పుట్టిన తర్వాత యెహోవాను క్రమంగా ఆరాధించడం యోసేపు మరియలకు కష్టం అయ్యుంటుంది. కానీ వాళ్లు ఎన్నో ఆశీర్వాదాలు పొందారు. యెహోవా ఆరాధనకు మొదటి స్థానం ఇవ్వడం వల్ల వాళ్ల కుటుంబం ఎప్పుడూ యెహోవాకు దగ్గరగా ఉంది. w20.10 28 ¶8-9
బుధవారం, జనవరి 19
‘ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించడానికి, అందులోని నియమాల్ని బోధించడానికి తన హృదయాన్ని సిద్ధం చేసుకున్నాడు.’—ఎజ్రా 7:10.
మీరు వేరేవాళ్ల స్టడీకి వెళ్తున్నప్పుడు, స్టడీ చేసే పాఠాన్ని మీరు కూడా సిద్ధపడి ఉండడం మంచిది. డోరిన్ అనే ప్రత్యేక పయినీరు ఇలా అంటున్నాడు: “నాతో స్టడీకి వచ్చేవాళ్లు కూడా స్టడీకి సిద్ధపడితే నాకు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే, దానివల్ల వాళ్లు విద్యార్థికి ఉపయోగపడే విషయాల్ని చెప్పగలుగుతారు.” స్టడీ ఇస్తున్న వ్యక్తి, అలాగే మీరు సిద్ధపడి వెళ్తే విద్యార్థి అది గమనించి, ఆయన కూడా స్టడీకి సిద్ధపడే అవకాశం ఉంది. మీరు పాఠాన్ని పూర్తిగా సిద్ధపడకపోయినా, కనీసం ఆ పాఠంలో ఉన్న ముఖ్యమైన విషయాల్ని పరిశీలించడానికి సమయం తీసుకోండి. స్టడీలో ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి, ఒకవేళ ప్రార్థించమని మిమ్మల్ని అడిగితే ఏ విషయాల గురించి ప్రార్థించాలో ముందే ఆలోచించుకుని పెట్టుకోండి. అప్పుడు మీరు విద్యార్థికి తగ్గట్టు చక్కగా ప్రార్థించగలుగుతారు. (కీర్త. 141:2) జపాన్‌లో ఉంటున్న హనాయి తను స్టడీ తీసుకున్న రోజుల్ని గుర్తుచేసుకుంటూ ఇలా చెప్తోంది: “నాకు స్టడీ ఇస్తున్న సహోదరి ఇంకో సహోదరిని తీసుకొచ్చింది. ఆమె ప్రార్థన విన్నప్పుడు ఆమెకు యెహోవాతో ఎంత దగ్గరి స్నేహం ఉందో నాకు అర్థమైంది. నాకూ ఆమెలా ఉండాలనిపించింది. నా పేరు ఉపయోగించి ప్రార్థించినప్పుడు, ఆమెకు నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థమైంది.” w21.03 9-10 ¶7-8
గురువారం, జనవరి 20
“ధైర్యంగా ఉండు! నువ్వు . . . రోములో కూడా సాక్ష్యమివ్వాలి.”—అపొ. 23:11.
అపొస్తలుడైన పౌలు రోముకు చేరుకుంటాడని యేసు మాటిచ్చాడు. కానీ, యెరూషలేములో కొంతమంది యూదులు మాటువేసి పౌలును చంపాలని పథకం వేశారు. ఆ విషయం రోమా సహస్రాధిపతి అయిన క్లౌదియ లూసియకు తెలిసింది. పౌలును రక్షించడానికి క్లౌదియ వెంటనే చర్య తీసుకున్నాడు. అతను పౌలును కైసరయకు పంపించాడు. ఆయనకు కాపలాగా చాలామంది సైనికుల్ని కూడా పంపాడు. కైసరయలో, పౌలును “హేరోదు రాజభవనంలో కాపలావాళ్ల సంరక్షణలో ఉంచమని” అధిపతి అయిన ఫేలిక్సు ఆదేశించాడు. ఆ విధంగా, పౌలు తన శత్రువుల చేతికి చిక్కకుండా యెహోవా కాపాడాడు. (అపొ. 23:12-35) కానీ ఫేలిక్సు స్థానంలో అధిపతి అయిన ఫేస్తు వచ్చాడు. “యూదుల దగ్గర మంచిపేరు సంపాదించుకోవాలనే కోరికతో” ఫేస్తు పౌలును ఇలా అడిగాడు: “మనం యెరూషలేముకు వెళ్లడం, ఈ విషయాల గురించి అక్కడ నా సమక్షంలో నీకు తీర్పు జరగడం నీకు ఇష్టమేనా?” యెరూషలేముకు వెళ్తే శత్రువులు తనను చంపే అవకాశం ఉందని పౌలుకు తెలుసు. అందుకే ఆయన, “నేను కైసరుకే విన్నవించుకుంటాను!” అని అన్నాడు. అప్పుడు ఫేస్తు పౌలుతో ఇలా అన్నాడు: “కైసరుకు విన్నవించుకుంటానని అన్నావు కదా, కైసరు దగ్గరికే వెళ్తావు.” తర్వాత, పౌలు తనను చంపాలనుకుంటున్న వాళ్లకు చాలా దూరంగా రోముకు చేరుకుంటాడు.—అపొ. 25:6-12. w20.11 13 ¶4; 14 ¶8-10
శుక్రవారం, జనవరి 21
“మన హృదయాలు మనల్ని నిందించవచ్చు.”—1 యోహా. 3:20.
మనందరికీ ఏదోక సందర్భంలో అపరాధ భావాలు కలుగుతాయి. ఉదాహరణకు, కొంతమంది తాము సత్యం తెలుసుకోకముందు చేసిన పనుల గురించి బాధపడుతుంటారు. ఇంకొంతమంది, తాము బాప్తిస్మం తీసుకున్న తర్వాత చేసిన తప్పుల గురించి బాధపడుతుంటారు. (రోమా. 3:23) మనం సరైనదే చేయాలనుకుంటాం, కానీ “మనందరం తరచూ పొరపాట్లు చేస్తుంటాం.” (యాకో. 3:2; రోమా. 7:21-23) అపరాధ భావాలు మనకు సంతోషాన్ని ఇవ్వవు, అయితే వాటివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అపరాధ భావాలు కలగడం వల్ల మన తప్పును సరిదిద్దుకుంటాం, మళ్లీ అలాంటి తప్పు చేయకూడదని నిశ్చయించుకుంటాం. (హెబ్రీ. 12:12, 13) అయితే మనం పశ్చాత్తాపపడి, యెహోవా మనల్ని క్షమించిన తర్వాత కూడా మనం గతంలో చేసిన తప్పుల గురించే బాధపడుతుండవచ్చు. అలాంటి విపరీతమైన అపరాధ భావాలు హానికరమైనవి. (కీర్త. 31:10; 38:3, 4) వాటితో నలిగిపోకుండా మనం జాగ్రత్తపడాలి. ఎందుకంటే యెహోవా మనల్ని క్షమించినా, మనల్ని మనం క్షమించుకోకూడదు అన్నది సాతాను కోరిక.—2 కొరింథీయులు 2:5-7, 11 తో పోల్చండి. w20.11 27 ¶12-13
శనివారం, జనవరి 22
“నిజంగా, నేను నా హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవడం, నిర్దోషినని నా చేతులు కడుక్కోవడం వృథా.”—కీర్త. 73:13.
లేవీయుడైన కీర్తనకర్త దుష్టుల, అహంకారుల చెడుతనాన్ని చూసి కాదుగానీ వాళ్లు వర్ధిల్లుతున్నట్లు కనిపించేసరికి ఈర్ష్యపడడం మొదలుపెట్టాడు. (కీర్త. 73:2-9, 11-14) ‘వాళ్లకు అన్నీ ఉన్నాయి: డబ్బు ఉంది, మంచి జీవితం ఉంది, ఏ బాధలు లేవు’ అని ఆయనకు అనిపించింది. ఆ లేవీయుడు విషయాల్ని యెహోవా దృష్టితో చూడాలి. ఆయన అదే చేశాడు, దానివల్ల మనశ్శాంతిని అలాగే సంతోషాన్ని తిరిగి పొందాడు. ఆయన ఇలా అన్నాడు: “భూమ్మీద నేను నిన్ను [యెహోవాను] తప్ప దేన్నీ కోరుకోను.” (కీర్త. 73:25) దుష్టులు వర్ధిల్లుతున్నట్టు అనిపించినా, మనం కూడా వాళ్లను చూసి ఈర్ష్యపడకుండా ఉందాం. వాళ్ల సంతోషం వెంటనే కనుమరుగైపోతుంది. (ప్రసం. 8:12, 13) వాళ్లను చూసి ఈర్ష్యపడడం అంటే నిరుత్సాహాన్ని, ఆధ్యాత్మిక పతనాన్ని కొనితెచ్చుకున్నట్టే. కాబట్టి దుష్టులు వర్ధిల్లడం చూసి మీకెప్పుడైనా ఈర్ష్యగా అనిపిస్తే, లేవీయుడు చేసినట్టే చేయండి. అంటే దేవుడు ప్రేమతో ఇస్తున్న సలహాల్ని పాటించండి, యెహోవా ఇష్టం చేసే వాళ్లతో సహవసించండి. అన్నిటికన్నా ఎక్కువగా యెహోవాను ప్రేమించినప్పుడు మీరు నిజమైన సంతోషం పొందుతారు. అంతేకాదు, ‘వాస్తవమైన జీవితానికి’ నడిపించే దారిలో కొనసాగుతారు.—1 తిమో. 6:19. w20.12 19-20 ¶14-16
ఆదివారం, జనవరి 23
“కొన్నిసార్లు ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు దేనికోసం ప్రార్థించాలో మనకు తెలీదు. అలాంటప్పుడు పవిత్రశక్తే, లోలోపల మూల్గుతున్న మన తరఫున వేడుకుంటుంది.”—రోమా. 8:26.
ప్రార్థనలో మీ ఆందోళనంతా యెహోవా మీద వేస్తున్నప్పుడు కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోకండి. మనం ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా, ఆయన చేసిన మేలుల గురించి ఆలోచించడం మంచిది. ఇంకొన్నిసార్లు మీరు లోలోపల ఎంత వేదన పడుతున్నారో మాటల్లో చెప్పలేకపోవచ్చు. అలాంటప్పుడు ‘దయచేసి సహాయం చేయి’ అని చేసే చిన్న ప్రార్థనను కూడా యెహోవా వింటాడని గుర్తుంచుకోండి. (2 దిన. 18:31) మీ తెలివి మీద కాకుండా, యెహోవా తెలివి మీద ఆధారపడండి. క్రీ.పూ. ఎనిమిదో శతాబ్దంలో యూదా ప్రజలు అష్షూరీయుల దాడి గురించి భయపడ్డారు. ఎలాగైనా అష్షూరీయుల నుండి తప్పించుకోవాలన్న కంగారులో వాళ్లు అన్యులైన ఐగుప్తీయుల సహాయం కోరారు. (యెష. 30:1, 2) వాళ్లు తీసుకున్న తప్పుడు నిర్ణయం నాశనానికి నడిపిస్తుందని యెహోవా హెచ్చరించాడు. (యెష. 30:7, 12, 13) భయపడకుండా ఉండాలంటే ఏం చేయాలో యెహోవా యెషయా ద్వారా వాళ్లకు చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “మీరు కంగారుపడకుండా, [యెహోవా మీద] నమ్మకం చూపిస్తే అదే మీకు బలం.”—యెష. 30:15బి. w21.01 3-4 ¶8-9
సోమవారం, జనవరి 24
“ముద్రించబడిన వాళ్ల సంఖ్య నేను విన్నాను . . . వాళ్ల సంఖ్య 1,44,000.”—ప్రక. 7:4.
నమ్మకంగా ఉన్నందుకు క్రీస్తు అభిషిక్త సహోదరులు ప్రతిఫలం పొందుతారు. అంటే పరలోకంలో ఆయనతో కలిసి రాజులుగా, యాజకులుగా సేవ చేస్తారు. (ప్రక. 20:6) 1,44,000 మంది అభిషిక్తులు తమ పరలోక బహుమానాన్ని పొందినప్పుడు, దేవుని పరలోక కుటుంబమంతా చాలా సంతోషిస్తుంది. రాజులుగా, యాజకులుగా సేవచేసే ఆ 1,44,000 మంది గురించి చెప్పిన తర్వాత అపొస్తలుడైన యోహాను ఒక ఆసక్తికరమైన సంఘటన చూశాడు. ఆయన హార్‌మెగిద్దోనును తప్పించుకునే ఒక ‘గొప్పసమూహాన్ని’ చూశాడు. ఈ రెండో గుంపు వాళ్లు మొదటి గుంపులా కాకుండా చాలా పెద్ద సంఖ్యలో, లెక్కపెట్టలేనంత మంది ఉన్నారు. (ప్రక. 7:9, 10) వాళ్లు “తెల్లని వస్త్రాలు” వేసుకున్నారు. అంటే ఈ సాతాను లోక “మలినం” తమకు అంటకుండా, దేవునికి-క్రీస్తుకు నమ్మకంగా ఉన్నారు. (యాకో. 1:27) యెహోవా అలాగే గొర్రెపిల్ల అయిన యేసు వల్లే రక్షణ పొందామని గొప్పసమూహం వాళ్లు పెద్ద స్వరంతో కేకలు వేస్తున్నారు. అంతేకాదు వాళ్లు ఖర్జూర మట్టలు కూడా పట్టుకుని ఉన్నారు. అంటే, యేసును యెహోవా నియమించిన రాజుగా సంతోషంగా అంగీకరిస్తున్నామని వాళ్లు చూపిస్తున్నారు.—యోహాను 12:12, 13 తో పోల్చండి. w21.01 15-16 ¶6-7
మంగళవారం, జనవరి 25
“నీ వినయం నన్ను గొప్పవాణ్ణి చేస్తుంది.”—2 సమూ. 22:36.
ఒక పురుషుడు శిరస్సత్వాన్ని ఉపయోగించే విషయంలో యెహోవాను, యేసును అనుకరించడం ద్వారా, మంచి కుటుంబ శిరస్సుగా ఉండడం నేర్చుకోవచ్చు. ఉదాహరణకు వినయం గురించి పరిశీలిద్దాం. యెహోవా ఈ విశ్వంలోనే అత్యంత తెలివైన వ్యక్తి. అయినప్పటికీ ఆయన తన సేవకుల అభిప్రాయాల్ని వింటాడు. (ఆది. 18:23, 24, 32) యెహోవా పరిపూర్ణుడు, అయినప్పటికీ ప్రస్తుతం ఆయన మన నుండి పరిపూర్ణతను ఆశించట్లేదు. బదులుగా తనను సేవిస్తున్న అపరిపూర్ణ మనుషులు విజయం సాధించేలా ఆయన సహాయం చేస్తాడు. (కీర్త. 113:6, 7) నిజానికి, బైబిలు ఆయన్ని “సహాయకుడు” అని వర్ణిస్తోంది. (కీర్త. 27:9; హెబ్రీ. 13:6) యెహోవా వినయం చూపించి తనకు సహాయం చేయడం వల్లే, తనకు అప్పగించిన గొప్ప పనిని పూర్తి చేయగలిగానని దావీదు రాజు గుర్తించాడు. యేసు ఉంచిన ఆదర్శాన్ని పరిశీలించండి. యేసు తన శిష్యులకు ప్రభువు, యజమాని అయినప్పటికీ వాళ్ల కాళ్లు కడిగాడు. యేసే స్వయంగా ఇలా అన్నాడు: “నేను మీకు చేసినట్టే మీరు కూడా చేయాలని మీకు ఆదర్శం ఉంచాను.” (యోహా. 13:12-17) యేసుకు ఎంతో అధికారం ఉన్నప్పటికీ, ఇతరులు తనకు సేవ చేయాలని అనుకోలేదు గానీ ఆయనే ఇతరులకు సేవ చేశాడు.—మత్త. 20:28. w21.02 3-4 ¶8-10
బుధవారం, జనవరి 26
“యౌవనుల బలమే వాళ్లకు అలంకారం.”—సామె. 20:29.
యువ సహోదరులారా, మీరు సంఘానికి ఎన్నో విధాలుగా సహాయం చేయవచ్చు. మీలో చాలామందికి బలం, శక్తి ఉన్నాయి. మీరు సంఘానికి నిజంగా ఒక వరం. బహుశా మీరు సంఘ పరిచారకులు అవ్వాలని కోరుకుంటుండవచ్చు. అయితే అంత ప్రాముఖ్యమైన బాధ్యతను చేపట్టడానికి మీ వయసు, అనుభవం సరిపోవని వేరేవాళ్లు అనుకుంటారేమోనని మీరు భయపడుతుండవచ్చు. మీరు యువకులైనప్పటికీ సంఘంలో ఉన్నవాళ్ల నమ్మకాన్ని, గౌరవాన్ని సంపాదించుకోవడానికి మీరు చేయగల విషయాలు కొన్ని ఉన్నాయి. యువకులారా, సంఘంలోని వాళ్లకు ఉపయోగపడే నైపుణ్యాలు ఏవైనా మీకున్నాయా? మీలో చాలామందికి ఉన్నాయి. ఉదాహరణకు, వ్యక్తిగత అధ్యయనం కోసం, మీటింగ్స్ కోసం తమ ఫోన్‌లను లేదా టాబ్లెట్‌లను ఎలా ఉపయోగించాలో ఎవరైనా నేర్పిస్తే బాగుండని కొంతమంది వృద్ధులు అనుకుంటారు. మీకు టెక్నాలజీ గురించి బాగా తెలుసు కాబట్టి మీరు వాళ్లకు సహాయం చేయవచ్చు. మీరు ఏం చేసినా మీ పరలోక తండ్రి మిమ్మల్ని చూసి గర్వపడేలా చేయండి. w21.03 2 ¶1, 3; 7 ¶18
గురువారం, జనవరి 27
“ప్రతీ వ్యక్తి తన బరువు తానే మోసుకోవాలి.”—గల. 6:5.
భర్త కన్నా భార్య ఎక్కువ చదువుకున్నప్పటికీ కుటుంబ ఆరాధనలో, ఇతర ఆధ్యాత్మిక పనుల్లో నాయకత్వం వహించే బాధ్యత భర్తదే. (ఎఫె. 6:4) భార్య భర్తకు లోబడివుండాలి, అయితే తన విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మాత్రం ఆమెదే. అందుకోసం ఆమె వ్యక్తిగత అధ్యయనానికి, చదివిన వాటిని ధ్యానించడానికి సమయం వెచ్చించాలి. అలాచేస్తే యెహోవా మీద ఆమెకున్న ప్రేమ, గౌరవం పెరుగుతాయి. అంతేకాదు ఆమె తన భర్తకు సంతోషంగా లోబడుతుంది. యెహోవా మీద ప్రేమతో తమ భర్తలకు లోబడివుండే భార్యలు, శిరస్సత్వ ఏర్పాటును గౌరవించని వాళ్లకన్నా ఎక్కువ సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు. వాళ్లు యువతీ యువకులకు మంచి ఆదర్శం ఉంచుతారు. వాళ్లు కుటుంబంలోనే కాదు, సంఘంలో కూడా ప్రేమపూర్వక వాతావరణం ఉండేలా సహాయం చేస్తారు. (తీతు 2:3-5) నేడు యెహోవాను నమ్మకంగా సేవిస్తున్న వాళ్లలో ఎక్కువశాతం మంది స్త్రీలే ఉన్నారు.—కీర్త. 68:11. w21.02 13 ¶21-23
శుక్రవారం, జనవరి 28
“దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు.”—యాకో. 4:8.
ధైర్యం, సహనం చూపించే విషయంలో అపొస్తలుడైన పౌలు మంచి ఆదర్శం ఉంచాడు. ఆయనకు కొన్నిసార్లు బలహీనంగా ఉన్నట్టు అనిపించింది. కానీ, ఆయన బలం కోసం యెహోవా మీద ఆధారపడ్డాడు కాబట్టి కష్టాల్ని సహించగలిగాడు. (2 కొరిం. 12:8-10; ఫిలి. 4:13) మనకు యెహోవా సహాయం అవసరమని వినయంగా గుర్తిస్తే బలాన్ని, ధైర్యాన్ని పొందుతాం. (యాకో. 4:10) మనం అనుభవిస్తున్న కష్టాలు యెహోవా నుండి వచ్చిన శిక్ష కాదని ఖచ్చితంగా నమ్మవచ్చు. శిష్యుడైన యాకోబు ఇలా రాశాడు: “కష్టం వచ్చినప్పుడు ఎవ్వరూ, ‘దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు’ అని అనకూడదు. ఎందుకంటే, చెడ్డవాటితో ఎవ్వరూ దేవుణ్ణి పరీక్షించలేరు, దేవుడు కూడా అలా ఎవ్వర్నీ పరీక్షించడు.” (యాకో. 1:13) ఆ వాస్తవాన్ని నమ్మినప్పుడు, మన ప్రేమగల పరలోక తండ్రికి మరింత దగ్గరౌతాం. యెహోవా “మారిపోడు.” (యాకో. 1:17) మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు కష్టాలు ఎదురైనప్పుడు, ఆయన వాళ్లకు మద్దతిచ్చాడు. నేడు కూడా మనలో ప్రతీ ఒక్కరికీ ఆయన సహాయం చేస్తాడు. తెలివిని, విశ్వాసాన్ని, ధైర్యాన్ని సంపాదించుకోవడానికి సహాయం చేయమని యెహోవాను పట్టుదలగా అడగండి. ఆయన మీ ప్రార్థనలు వింటాడు. w21.02 31 ¶19-21
శనివారం, జనవరి 29
“ఇనుము ఇనుముకు పదునుపెట్టినట్టు ఒక వ్యక్తి తన స్నేహితునికి పదునుపెడతాడు.”—సామె. 27:17.
కూటాలకు వస్తున్న బైబిలు విద్యార్థుల పట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపించడం ద్వారా మీరు వాళ్లను ప్రోత్సహించవచ్చు. (ఫిలి. 2:4) మరీ సొంత విషయాల్లో జోక్యం చేసుకోకుండా, ఆయన ఏవైనా మార్పులు చేసుకుంటే మెచ్చుకోండి. ఆయన స్టడీ గురించి, కుటుంబం గురించి, పని గురించి అడగండి. అలా మాట్లాడడం వల్ల మీరు మంచి స్నేహితులు అవుతారు. దానివల్ల విద్యార్థి ప్రగతి సాధించి బాప్తిస్మం తీసుకునేలా మీరు సహాయం చేయగలుగుతారు. విద్యార్థి మార్పులు చేసుకుంటుండగా, ఆయన కూడా సంఘంలో ఒకడని ఆయనకు అనిపించేలా సహాయం చేయండి. ఆతిథ్యం ఇవ్వడం ద్వారా మీరలా చేయవచ్చు. (హెబ్రీ. 13:2) బైబిలు విద్యార్థి ప్రచారకుడైన తర్వాత మీతో పాటు ప్రీచింగ్‌కి రమ్మని ఆయన్ని పిలవవచ్చు. బ్రెజిల్‌లో ఉంటున్న డీగో అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు: “తమతో పాటు ప్రీచింగ్‌కి రమ్మని చాలామంది సహోదరులు నన్ను పిలిచేవాళ్లు. వాళ్ల గురించి తెలుసుకోవడానికి అదొక మంచి అవకాశం. నేను వాళ్ల గురించి తెలుసుకున్నాను, ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. యెహోవాకు, యేసుకు ఇంకా దగ్గరయ్యాను.” w21.03 12 ¶15-16
ఆదివారం, జనవరి 30
“ఎవరైనా మీకు చెడు చేస్తే, తిరిగి వాళ్లకు చెడు చేయకండి.”—రోమా. 12:17.
శత్రువుల్ని ప్రేమించమని యేసు తన అనుచరులకు చెప్పాడు. (మత్త. 5:44, 45) అలా చేయడం తేలికా? కానేకాదు! అయితే దేవుని పవిత్రశక్తి సహాయంతో మనం అలా చేయగలం. పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్లో ప్రేమతోపాటు ఓర్పు, దయ, సౌమ్యత, ఆత్మనిగ్రహం కూడా ఉన్నాయి. (గల. 5:22, 23) ద్వేషాన్ని సహించడానికి ఆ లక్షణాలు మనకు సహాయం చేస్తాయి. యెహోవాసాక్షి అయిన తమ భర్త, భార్య, పిల్లవాడు, లేదా పొరుగువాళ్లు అలాంటి లక్షణాలు చూపించినందుకు చాలామంది వ్యతిరేకులు మనసు మార్చుకున్నారు. కొంతమందైతే సత్యంలోకి కూడా వచ్చారు. మీరు యెహోవాను సేవిస్తున్నారన్న ఒకేఒక్క కారణంతో ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తున్నారా? వాళ్లను ప్రేమించడం మీకు కష్టంగా ఉంటే, పవిత్రశక్తి కోసం ప్రార్థించండి. (లూకా 11:13) అంతేకాదు, దేవునికి లోబడడమే ఎప్పుడూ సరైనదనే పూర్తి నమ్మకంతో ఉండండి. (సామె. 3:5-7) ద్వేషం శక్తివంతమైనదే కావచ్చు, కానీ ప్రేమ అంతకన్నా శక్తివంతమైనది. ద్వేషం మనసుల్ని బాధపెడుతుంది, కానీ ప్రేమ హృదయాల్ని గెల్చుకుంటుంది. అంతేకాదు, అది యెహోవా హృదయాన్ని సంతోషపెడుతుంది. ఒకవేళ ప్రజలు మారకుండా మనల్ని ద్వేషిస్తూనే ఉన్నా మనం సంతోషంగా ఉండవచ్చు. w21.03 23 ¶13; 24 ¶15, 17
సోమవారం, జనవరి 31
“పెద్ద మిడతల దండు ఒక జనంలా నా దేశం మీదికి వచ్చింది.”—యోవే. 1:6.
ఒక సైన్యం చేసే దాడి గురించి యోవేలు ప్రవచిస్తున్నాడు. (యోవే. 2:1, 8, 11) తనకు లోబడని ఇశ్రాయేలీయుల్ని శిక్షించడానికి ఒక ‘గొప్ప సైన్యాన్ని’ (బబులోను సైన్యాన్ని) ఉపయోగించుకుంటానని యెహోవా చెప్పాడు. (యోవే. 2:25) ఆ సైన్యాన్ని ‘ఉత్తరం నుండి వచ్చే అతను’ అని వర్ణించడం సరైనదే. ఎందుకంటే బబులోనీయులు ఉత్తరం నుండి వచ్చి ఇశ్రాయేలు మీద దాడి చేస్తారు. (యోవే. 2:20) ఆ సైన్యం ఒక క్రమపద్ధతిలో వెళ్లే మిడతల దండుతో పోల్చబడింది. బబులోను సైన్యాన్ని సూచించే ఆ మిడతల దండు గురించి యోవేలు ఇలా చెప్పాడు: ‘ప్రతీ ఒక్కటి తన దారిలో సాగిపోతుంది. అవి నగరంలోకి దూసుకొస్తాయి, ఇళ్ల మీదికి ఎక్కుతాయి, దొంగ దూరినట్టు కిటికీల గుండా దూరతాయి.’ (యోవే. 2:8, 9) మీరు దాన్ని ఊహించుకోగలరా? ఎటు చూసినా సైనికులే, దాక్కోవడానికి ఎక్కడా స్థలం లేదు. బబులోను సైన్యం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు! క్రీ.పూ. 607 లో బబులోనీయులు (లేదా కల్దీయులు) యెరూషలేము నగరంపై మిడతల్లా దాడి చేశారు. బైబిలు ఇలా చెప్తుంది: “కల్దీయుల రాజు . . . యువకుల మీద గానీ, యువతుల మీద గానీ, ముసలివాళ్ల మీద గానీ, అనారోగ్యంగా ఉన్నవాళ్ల మీద గానీ కనికరం చూపించలేదు.”—2 దిన. 36:17. w20.04 5 ¶11-12