గురువారం, మార్చి 28
“నువ్వు . . . తిరిగి మట్టికి చేరుతావు.”—ఆది. 3:19.
ఆదాముహవ్వలు చేసిన తప్పును మనం చేయాలనుకోం. మనం వాళ్లలా తయారవ్వకూడదంటే యెహోవా గురించి నేర్చుకుంటూ, ఆయన లక్షణాల్ని ఇష్టపడుతూ, ఆయన ఆలోచనా విధానాన్ని అర్థంచేసుకుంటూ ఉండాలి. అప్పుడు యెహోవా మీద మనకు ఉన్న ప్రేమ ఖచ్చితంగా పెరుగుతుంది. అబ్రాహాము గురించి ఆలోచించండి. ఆయన యెహోవాను నిజంగా ప్రేమించాడు. యెహోవా నిర్ణయాల్ని అర్థం చేసుకోవడం ఆయనకు కష్టంగా అనిపించినా ఆయన ఎదురుతిరగలేదు. బదులుగా యెహోవాను ఇంకా బాగా తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఉదాహరణకు, సొదొమ గొమొర్రాలను నాశనం చేస్తానని యెహోవా అబ్రాహాముకు చెప్పాడు. “భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు,” చెడ్డవాళ్లతో పాటు నీతిమంతుల్ని నాశనం చేస్తాడేమోనని అబ్రాహాము మొదట్లో భయపడ్డాడు. యెహోవా అలా చేయడాన్ని అబ్రాహాము ఊహించుకోలేక పోయాడు. అందుకే వినయంగా, యెహోవాను కొన్ని ప్రశ్నలు అడిగాడు. యెహోవా ఆయన ప్రశ్నలకు ఓపిగ్గా జవాబిచ్చాడు. దాంతో యెహోవా ప్రతీ మనిషి హృదయాన్ని పరిశీలిస్తాడని, చెడ్డవాళ్లతో పాటు నిర్దోషుల్ని ఎన్నడూ శిక్షించడని అబ్రాహాము అర్థం చేసుకున్నాడు.—ఆది. 18:20-32. w22.08 28 ¶9-10
శుక్రవారం, మార్చి 29
“నమ్మదగినవాడు రహస్యాలు దాచిపెడతాడు.”—సామె. 11:13.
క్రీ.పూ. 455 లో యెరూషలేము గోడల్ని తిరిగి కట్టిన తర్వాత, నగరాన్ని చక్కగా చూసుకునే నమ్మదగిన వాళ్లకోసం అధిపతి అయిన నెహెమ్యా వెతికాడు. నెహెమ్యా ఎంచుకున్న వాళ్లలో ఒకరు కోట అధిపతి అయిన హనన్యా. ఆయన “ఎంతో నమ్మకస్థుడు, ఎంతోమంది కన్నా సత్యదేవునికి ఎక్కువగా భయపడేవాడు” అని బైబిలు హనన్యా గురించి చెప్తుంది. (నెహె. 7:2) యెహోవా మీద ప్రేమ, ఆయన్ని బాధపెట్టే ఏ పనీ చేయకూడదు అనే భయం ఉండడం వల్ల, తనకు ఇచ్చిన ప్రతీ నియామకాన్ని హనన్యా కష్టపడి చేశాడు. మనకు కూడా యెహోవా మీద ప్రేమ, భయం ఉంటే ఆయన సేవలో నమ్మదగిన వాళ్లలా ఉంటాం. అపొస్తలుడైన పౌలుకు నమ్మదగిన సహోదరుడిగా ఉన్న తుకికు ఉదాహరణ గురించి ఆలోచించండి. పౌలు తుకికు మీద ఆధారపడ్డాడు. తుకికు ఒక “నమ్మకమైన పరిచారకుడు” అని కూడా పౌలు చెప్పాడు. (ఎఫె. 6:21, 22) ఎఫెసు, కొలొస్సయి సంఘాల్లో ఉన్న సహోదరులకు ఉత్తరాల్ని అందించే పనిని, అలాగే వాళ్లను ప్రోత్సహించే, ఓదార్చే పనిని అప్పగించడం ద్వారా తనకు తుకికు మీద ఎంతో నమ్మకం ఉందని పౌలు చూపించాడు. తుకికు గురించి ఆలోచిస్తే, నేడు మన ఆధ్యాత్మిక అవసరాల్ని చూసుకుంటున్న నమ్మదగిన, ఆధారపడదగిన సహోదరులు గుర్తుకొస్తారు.—కొలొ. 4:7-9. w22.09 9-10 ¶5-6
శనివారం, మార్చి 30
“ప్రేమ చాలా పాపాల్ని కప్పుతుంది.” —1 పేతు. 4:8.
దాదాపు 13 సంవత్సరాల పాటు యోసేపు ఎన్నో కష్టాలు అనుభవించాడు. ‘యెహోవాకు నిజంగా నా మీద ప్రేమ ఉందా? కష్టాల్లో ఆయన నన్ను ఎందుకు వదిలేశాడు?’ అని యోసేపు ఆలోచించవచ్చు. కానీ యోసేపు అలా ఆలోచించలేదు, కోపం పెంచుకోలేదు. ఆయన ప్రశాంతంగా ఉంటూ, తన ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకున్నాడు. తన అన్నల మీద పగతీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు, ఆయన అలా చేయకుండా వాళ్ల మీద ప్రేమ చూపించాడు, క్షమించాడు. (ఆది. 45:4, 5) యోసేపు సరిగ్గా ఆలోచించాడు కాబట్టే, అలా చేయగలిగాడు. ఆయన తన సమస్యల గురించి ఆలోచించే బదులు, యెహోవా ఇష్టం మీదే మనసుపెట్టాడు. (ఆది. 50:19-21) దీన్నుండి మనం ఏం నేర్చుకుంటాం? ఎవరైనా మిమ్మల్ని బాధపెడితే యెహోవా మీద కోపం పెంచుకోకండి లేదా ఆయన మిమ్మల్ని విడిచిపెట్టాడని అనుకోకండి. బదులుగా ఆ సమస్యను సహించడానికి, ఆయన మీకు ఎలా సహాయం చేస్తున్నాడో ఆలోచించండి. అలాగే ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు, ప్రేమతో వాళ్ల తప్పుల్ని కప్పేయడానికి ప్రయత్నించండి. w22.11 21 ¶4