-
మత్తయి 14:15-21పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
15 అయితే సాయంత్రం కావస్తుండగా శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “ఇది మారుమూల ప్రాంతం, పైగా సాయంత్రం కావస్తోంది; ఈ ప్రజల్ని పంపించేస్తే, చుట్టుపక్కల ఊళ్లలోకి వెళ్లి ఆహారం కొనుక్కుంటారు” అన్నారు.+ 16 కానీ యేసు, “వాళ్లు వెళ్లాల్సిన అవసరం లేదు, మీరే వాళ్లకు తినడానికి ఏమైనా పెట్టండి” అని శిష్యులతో అన్నాడు. 17 అందుకు వాళ్లు, “ఇక్కడ మా దగ్గర ఐదు రొట్టెలు, రెండు చేపలు తప్ప ఇంకేమీ లేవు” అని అన్నారు. 18 ఆయన, “వాటిని నా దగ్గరికి తీసుకురండి” అన్నాడు. 19 తర్వాత ఆయన ప్రజల్ని గడ్డిమీద కూర్చోమని చెప్పాడు. ఆయన ఆ ఐదు రొట్టెల్ని, రెండు చేపల్ని తీసుకుని ఆకాశం వైపు చూసి ప్రార్థన చేసి,*+ ఆ రొట్టెల్ని విరిచి, తన శిష్యులకు ఇచ్చాడు; శిష్యులు వాటిని ప్రజలకు అందించారు. 20 దాంతో వాళ్లంతా తృప్తిగా తిన్నారు. మిగిలిన ముక్కల్ని శిష్యులు పోగుచేసినప్పుడు 12 గంపలు నిండాయి.+ 21 స్త్రీలు, చిన్నపిల్లలు కాక దాదాపు 5,000 మంది పురుషులు ఆ ఆహారాన్ని తిన్నారు.+
-
-
మార్కు 6:35-44పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
35 సాయంత్రం కావస్తుండగా ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: “ఇది మారుమూల ప్రాంతం, పైగా సాయంత్రం కావస్తోంది.+ 36 వాళ్లను పంపించేస్తే, చుట్టుపక్కల ఊళ్లలోకి, గ్రామాల్లోకి వెళ్లి తినడానికి ఏమైనా కొనుక్కుంటారు.”+ 37 దానికి యేసు వాళ్లతో, “మీరే వాళ్లకు తినడానికి ఏమైనా పెట్టండి” అన్నాడు. వాళ్లు, “ఇప్పుడు మమ్మల్ని 200 దేనారాల* రొట్టెలు కొనుక్కొచ్చి, వాళ్లకు పెట్టమంటావా?” అన్నారు.+ 38 అప్పుడు యేసు వాళ్లతో, “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయో వెళ్లి చూడండి!” అన్నాడు. వాళ్లు చూసి వచ్చి, “ఐదు రొట్టెలు, రెండు చేపలు ఉన్నాయి” అని చెప్పారు.+ 39 అప్పుడు ఆయన ప్రజలందర్నీ పచ్చిక మీద గుంపులవారీగా కూర్చోమని చెప్పాడు.+ 40 వాళ్లంతా 100 మంది చొప్పున, 50 మంది చొప్పున కూర్చున్నారు. 41 అప్పుడు ఆయన ఆ ఐదు రొట్టెల్ని, రెండు చేపల్ని తీసుకొని ఆకాశం వైపు చూసి ప్రార్థించాడు.*+ తర్వాత ఆయన రొట్టెల్ని విరిచి, ప్రజలకు పంచిపెట్టడానికి శిష్యులకు ఇవ్వడం మొదలుపెట్టాడు. అదేవిధంగా ఆయన రెండు చేపల్ని కూడా అందరికీ పంచిపెట్టమని చెప్పాడు. 42 దాంతో వాళ్లంతా తృప్తిగా తిన్నారు. 43 మిగిలినవాటిని శిష్యులు పోగుచేసినప్పుడు, చేపలు కాక రొట్టె ముక్కలే 12 గంపలు నిండాయి.+ 44 రొట్టెలు తిన్న పురుషులు 5,000 మంది.
-
-
యోహాను 6:5-13పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
5 యేసు తల ఎత్తి, చాలామంది ప్రజలు తన దగ్గరికి రావడం చూసి ఫిలిప్పును, “వీళ్లు తినడానికి రొట్టెలు ఎక్కడ కొందాం?” అని అడిగాడు.+ 6 అయితే ఫిలిప్పును పరీక్షించడానికే యేసు అలా అడిగాడు, ఎందుకంటే తాను ఏమి చేయబోతున్నాడో యేసుకు తెలుసు. 7 దానికి ఫిలిప్పు, “వీళ్లలో ప్రతీ ఒక్కరికి కొంచెం ఇవ్వాలన్నా, రెండు వందల దేనారాల* రొట్టెలు కూడా సరిపోవు” అన్నాడు. 8 యేసు శిష్యుడూ సీమోను పేతురు సహోదరుడూ అయిన అంద్రెయ ఇలా అన్నాడు: 9 “ఇక్కడ ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఐదు బార్లీ రొట్టెలు, రెండు చిన్నచేపలు ఉన్నాయి. అయితే ఇంతమందికి ఇవి ఎలా సరిపోతాయి?”+
10 అప్పుడు యేసు, “ప్రజల్ని కూర్చోమనండి” అని చెప్పాడు. అక్కడ చాలా గడ్డి ఉండడంతో వాళ్లు కూర్చున్నారు; వాళ్లలో దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు.+ 11 యేసు ఆ రొట్టెలు తీసుకొని, దేవునికి కృతజ్ఞతలు చెప్పి, వాటిని అక్కడ కూర్చున్నవాళ్లకు పంచిపెట్టాడు; చేపల విషయంలో కూడా ఆయన అలాగే చేశాడు, ప్రజలు తృప్తిగా తిన్నారు. 12 ప్రజలు కడుపునిండా తిన్నాక యేసు తన శిష్యులతో, “మిగిలిన ముక్కలు పోగుచేయండి, ఏదీ వృథా కానివ్వకండి” అన్నాడు. 13 కాబట్టి ఆ ఐదు బార్లీ రొట్టెల నుండి ప్రజలు తిన్నాక మిగిలిన ముక్కల్ని శిష్యులు పోగుచేశారు. వాటితో 12 పెద్ద గంపల్ని నింపారు.
-