గురువారం, నవంబరు 30
“నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసుకుంటాను, అప్పటిదాకా మీరు ఇక్కడే కూర్చోండి.”—మత్త. 26:36.
యేసు తాను చనిపోవడానికి ముందురోజు రాత్రి ధ్యానించడానికి, ప్రార్థించడానికి మళ్లీ ఒక ప్రశాంతమైన చోటును చూసుకున్నాడు. దానికోసం ఆయన గెత్సేమనే తోటకు వెళ్లాడు. యేసు అక్కడ తన శిష్యులకు ప్రార్థన గురించి సమయానుకూలమైన సలహా ఇచ్చాడు. వాళ్లు గెత్సేమనే తోటకు వెళ్లినప్పుడు బహుశా మధ్యరాత్రి దాటి ఉంటుంది. యేసు తన అపొస్తలులకు ‘మెలకువగా ఉండమని’ చెప్పి ప్రార్థించడానికి వెళ్లాడు. (మత్త. 26:37-39) అయితే ఈలోపు వాళ్లు నిద్రపోయారు. వాళ్లను అలా చూసినప్పుడు యేసు మళ్లీ, “మెలకువగా ఉంటూ, ప్రార్థన చేస్తూ ఉండండి” అని చెప్పాడు. (మత్త. 26:40, 41) వాళ్లు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని, అలసిపోయారని ఆయన గుర్తించాడు. అందుకే ‘శరీరం బలహీనం’ అని ఆయన కనికరంతో అన్నాడు. ఆ తర్వాత యేసు మరో రెండుసార్లు ప్రార్థించడానికి వెళ్లి తిరిగొచ్చినప్పుడు కూడా, తన శిష్యులు ప్రార్థించే బదులు నిద్రపోతున్నారని గమనించాడు.—మత్త. 26:42-45. w22.01 28 ¶10-11
శుక్రవారం, డిసెంబరు 1
“అవి నా స్వరాన్ని వింటాయి.”—యోహా. 10:16.
యేసుక్రీస్తు తన అనుచరులతో తనకున్న బంధాన్ని, గొర్రెలతో గొర్రెల కాపరికున్న బంధంతో పోల్చాడు. (యోహా. 10:14) ఆ పోలిక సరైనదే. గొర్రెలకు తమ కాపరి ఎవరో తెలుసు అలాగే అవి ఆయన మాట వింటాయి. దాన్ని స్వయంగా చూసిన ఒక వ్యక్తి ఇలా అన్నాడు: “మేము కొన్ని గొర్రెల్ని ఫోటో తీయాలనుకున్నాం. కానీ మేము ఎంత ప్రయత్నించినా అవి మా దగ్గరికి రాలేదు. వాటికి మా స్వరం తెలీదు కాబట్టి అవి మా దగ్గరికి రాలేదు. ఇంతలో గొర్రెల కాపరియైన ఒక పిల్లవాడు వాటిని పిలవగానే అవి అతని వెనకే వెళ్లాయి.” ఈ అనుభవం, గొర్రెలతో పోల్చబడిన తన శిష్యుల గురించి యేసు చెప్పిన మాటల్ని గుర్తుచేస్తుంది. ఆయన ఇలా అన్నాడు: “అవి నా స్వరాన్ని వింటాయి.” కానీ, యేసు ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. అలాంటప్పుడు మనం ఆయన స్వరాన్ని వింటున్నామని ఎలా చెప్పొచ్చు? ఆయన బోధించిన విషయాల్ని పాటించినప్పుడు మనం ఆయన స్వరాన్ని వింటున్నామని చూపిస్తాం.—మత్త. 7:24, 25. w21.12 16 ¶1-2
శనివారం, డిసెంబరు 2
“అందరూ పాపం చేశారు, దేవుని మహిమను ప్రతిబింబించలేకపోతున్నారు.”—రోమా. 3:23.
అపొస్తలుడైన పౌలు ఒకప్పుడు తలబిరుసుగా ప్రవర్తించాడు, క్రైస్తవుల్ని క్రూరంగా హింసించాడు. కానీ కొంతకాలానికి తాను చేసింది తప్పని అర్థంచేసుకుని తన ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనను మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు. (1 తిమో. 1:12-16) పౌలు యెహోవా సహాయంతో ఒక ప్రేమగల, కనికరంగల, వినయంగల పెద్దగా తయారయ్యాడు. ఆయన తన బలహీనతల గురించే ఆలోచిస్తూ ఉండిపోలేదు. బదులుగా, యెహోవా తనను క్షమిస్తాడని నమ్మాడు. (రోమా. 7:21-25) పౌలు పరిపూర్ణుడిగా ఉండడానికి ప్రయత్నించలేదు. బదులుగా, క్రైస్తవ లక్షణాల్ని పెంచుకోవడానికి తీవ్రంగా కృషిచేశాడు. అలాగే తనకిచ్చిన పనిని పూర్తిచేయడానికి యెహోవా సహాయం మీద వినయంగా ఆధారపడ్డాడు. (1 కొరిం. 9:27; ఫిలి. 4:13) పెద్దలు పరిపూర్ణులు కారు. కానీ వాళ్లు తప్పులు ఒప్పుకుని, క్రైస్తవ లక్షణాల్ని పెంచుకోవాలని వాళ్లను నియమించిన యెహోవా కోరుకుంటున్నాడు. (ఎఫె. 4:23, 24) ఒక పెద్ద, వ్యక్తిగత బైబిలు అధ్యయనం ద్వారా తనను తాను పరిశీలించుకుని, అవసరమైన మార్పులు చేసుకోవాలి. అలాచేస్తే సంతోషంగా ఉండడానికి, ఒక మంచి పెద్దగా ఉండడానికి యెహోవా అతనికి సహాయం చేస్తాడు.—యాకో. 1:25. w22.03 29-30 ¶13-15