“సత్య రత్నాలు”
“సత్య రత్నాలు.” యెహోవాసాక్షుల నైజీరియా బ్రాంచి కార్యాలయానికి వ్రాయబడిన ఒక ఉత్తరం రెండు ప్రత్యేక పత్రికలను అలా వర్ణించింది. దాన్ని వ్రాసిన ఆ యౌవనస్థుడు, ఇలా వివరిస్తున్నాడు:
“కావలికోట మరియు తేజరిల్లు! పత్రికల ద్వారా అనుదిన జీవితంలోని దాదాపు అన్ని అంశాలనూ చర్చించడంలో మీ కృషి విషయమై నేను మీకు యథార్థమైన కృతజ్ఞతలను వ్యక్తం చేసేందుకు ఈ ఉత్తరాన్ని వ్రాస్తున్నాను.
“నాకు 17 సంవత్సరాలు. గత సంవత్సరం ఒక ప్రాంతీయ రేడియో స్టేషన్, ‘ప్రేమంటే లైంగిక ఆనందం మాత్రమే కాదు—ఎయిడ్స్ వాస్తవమైనది’ అనే అంశంపై ఒక వ్యాస రచనా పోటీని ఏర్పాటు చేసింది. ప్రతి వ్యాసమూ నాలుగు వందల పదాలకు తక్కువ ఉండకూడదు. ఉత్తమ వ్యాసానికి 1,000 నయారాలు [12.50 అమెరికా డాలర్లు] బహుమానంగా ఇవ్వబడతాయి. అయితే, కేవలం బహుమానాన్ని గెలుచుకునేందుకే కాక కొంత నేర్చుకుందామన్న ఉద్దేశంతో వ్రాయాలని వారు అన్నారు. . . .
“నేను ఎయిడ్స్‌ను గురించిన సమాచారాన్ని రెండు పత్రికల్లోనూ కనుగొన్నాను. ప్రేమను గురించిన శీర్షికలకు కొదువే లేదు. నేను 1978, ఆగస్టు 8 తేజరిల్లు! (ఆంగ్లం) నందలి అంశాలను ఉపయోగించుకున్నాను.
“నేను నా వ్యాసాన్ని పంపిన రెండు నెలలకే, ఫలితాలు తెలిశాయి. నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తుతూ, నాకు క్రాస్ రివర్ మరియు ఆక్వా ఇబోమ్ రాష్ట్రాల్లో మొదటి స్థానం లభించింది!
“నేను ఉపయోగించిన సమాచారమంతా కూడా ఆ పత్రికల్లో లభించినదే. కష్టాలతో నిండిన మరియు రోగగ్రస్థమైన ఈ లోకంలో యెహోవా మనకు సమయోచితమైన సమాచారాన్ని అందిస్తాడనేది నిజంగా ఎంతో అద్భుతమైన విషయం. ప్రేమంటే లైంగిక ఆనందం మాత్రమే కాదనే విషయం నిజ క్రైస్తవులముగా మనకు బాగా తెలుసు. మరి పరిశుభ్రమైన, నైతికమైన జీవితాన్ని గడపడం మనలను ఎయిడ్స్ వంటి వ్యాధుల నుండి రక్షిస్తుంది.
“మీరు ఈ సత్య రత్నాలను నిరంతరాయంగా ఉత్పన్నం చేస్తున్నందుకు నేను మీకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మీరు ఈ ప్రశస్తమైన పత్రికలను ఎడతెగక అందిస్తుండగా యెహోవా మీ కృషిని దీవించును గాక.”