9 షిఫ్రా, పూయా, అమ్రాము, యోకెబెదు, మిర్యాము
‘విశ్వాసం వల్ల మోషేను దాచిపెట్టారు’
యోసేపు చనిపోయి 60 కన్నా ఎక్కువ సంవత్సరాలు అవుతుంది. కరువు నుండి తమ దేశాన్ని కాపాడడానికి యెహోవా ఉపయోగించుకున్న యోసేపును ఈజిప్టు ప్రజలందరూ (ఐగుప్తీయులు) మర్చిపోయారు. ఇప్పుడు ఈజిప్టును ఒక కొత్త ఫరో పరిపాలించడం మొదలుపెట్టాడు. ఆయనకు ఇశ్రాయేలీయులు అంటే అస్సలు ఇష్టంలేదు. యెహోవా ఆశీర్వాదంతో ఎక్కువౌతున్న ఆ హెబ్రీయుల్ని చూసి ఫరో గుండెల్లో గుబులు మొదలైంది. అందుకే, అతను ఇశ్రాయేలీయుల్ని బానిసలుగా చేసుకున్నాడు. ఈజిప్టు ప్రజలు వాళ్లతో వెట్టిచాకిరి చేయించారు. అయినా, ఈ బానిసల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
దాంతో ఫరో ఒక కుట్ర పన్నాడు. షిఫ్రా, పూయా అనే ఇద్దరు హెబ్రీ మంత్రసానుల్ని పిలిపించి, పుట్టే ప్రతీ మగబిడ్డను చంపేయమని ఆజ్ఞాపించాడు. ఎంతో శక్తివంతమైన ఫరో నోటి నుంచి వచ్చిన ఆ మాట వినగానే వాళ్లకు ఎలా అనిపించి ఉంటుందో ఊహించండి! యెహోవాకు నచ్చని పనిని వాళ్లతో చేయించాలని ఫరో చూస్తున్నాడు. ఇప్పుడు వాళ్లు ఏం చేస్తారు? ధైర్యవంతులైన ఆ ఇద్దరు స్త్రీలు “సత్యదేవునికి భయపడేవాళ్లు” అని బైబిలు చెప్తుంది. తమ ముందు ఉన్నది ఎంత శక్తివంతమైన రాజైనా సరే, విశ్వసర్వాధిపతి అయిన యెహోవాకు లోబడడమే సరైనదని వాళ్లకు తెలుసు. అందుకే వాళ్లు ధైర్యం చూపించి, ‘ఐగుప్తు రాజు చెప్పినట్టు చేయలేదు.’ బదులుగా, ఆ పసిపిల్లల ప్రాణాల్ని కాపాడడానికి వాళ్లు చేయగలిగినదంతా చేశారు. అయితే, వాళ్లు చేసేదంతా ఫరోకు తెలీకుండా ఆ మంత్రసానులు జాగ్రత్తపడ్డారు. తన పన్నాగం ఫలించలేదని అర్థమైనప్పుడు ఫరోకు చాలా కోపం వచ్చింది. తమ ప్రాణాల్ని పణంగా పెట్టి షిఫ్రా, పూయా చేసిన పనిని యెహోవా మర్చిపోలేదు. ఆయన వాళ్లకు పిల్లల్ని ఇచ్చాడు, వాళ్ల కుటుంబాల్ని దీవించాడు.
మంత్రసానులు, తన అమ్మానాన్నలు, అక్క ధైర్యం చూపించకపోయుంటే పసిపిల్లాడైన మోషే పరిస్థితి ఏమైవుండేది?
ఇశ్రాయేలీయుల్ని నమ్ముకుంటే తన పన్నాగం ఫలించదని ఫరోకు అర్థమైంది. అందుకే, అతను ఇంకో దారుణానికి ఒడిగట్టాడు. హెబ్రీయులకు పుట్టే ప్రతీ మగబిడ్డను నైలు నదిలో పారేయండి అని తనవాళ్లకు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ గడ్డు పరిస్థితుల మధ్య అమ్రాము, యోకెబెదు అనే జంట ఉన్నారు. అప్పటికే వాళ్లకు మిర్యాము, అహరోను అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు, యోకెబెదు మూడవసారి గర్భవతి అయ్యింది. ఒకవేళ తమకు పుట్టబోయే బిడ్డ మగపిల్లాడైతే, వాడి ప్రాణం ప్రమాదంలో పడుతుందని వాళ్లు చాలా భయపడ్డారు. వాళ్లు భయపడినట్టుగానే మగపిల్లాడు పుట్టాడు. అమ్రాము, యోకెబెదులకు ఏం చేయాలో అస్సలు పాలుపోలేదు. ఎలాగోలా ఆ పిల్లాడిని ఎవరి కంటా పడకుండా మూడు నెలల పాటు దాచి ఉంచారు. నిజానికి అలా దాచిపెట్టడం కష్టమైన పనే. అందుకే, యోకెబెదు ఒక పెట్టె తీసుకుని దానికి తారు, కీలు పూసి పిల్లాడిని అందులో పెట్టింది. తర్వాత ఆ పెట్టెను తీసుకెళ్లి నైలు నది ఒడ్డున ఉన్న జమ్ముగడ్డి చాటున దాచింది. ఆమె కూతురు మిర్యాము కొంచెం దూరంలో నిలబడి వాళ్ల తమ్ముణ్ణి ఓ కంట కనిపెడుతూ ఉంది.
కాసేపటికి, ఫరో కూతురు స్నానం చేయడానికి నైలు నదికి వచ్చింది. అక్కడ ఉన్న పెట్టెను చూసి దాన్ని తీసుకురమ్మని తన చెలికత్తెను పంపించింది. దాన్ని తెరిచినప్పుడు, ముద్దుగా ఉన్న ఒక బాబు ఏడుస్తూ కనిపించాడు; వాడిని చూడగానే ఆమె మనసు కరిగిపోయింది. ఆ బాబును దత్తత తీసుకోవాలని ఆమె అనుకుంది. అయితే, వాడికి పాలిచ్చి పెంచడానికి, ఆలనాపాలనా చూసుకోవడానికి ఒకరు కావాలి. అప్పుడు మిర్యాము టక్కున పరిగెత్తుకుంటూ ఫరో కూతురు దగ్గరికి వెళ్లి, ‘ఈ పిల్లాడిని చూసుకోవడానికి ఒకామెను తీసుకురానా?’ అని ధైర్యంగా అడిగింది. వెంటనే ఆమె దానికి ఒప్పుకుంది. దాంతో మిర్యాము వాళ్ల అమ్మను వెంటబెట్టుకుని వచ్చింది. తన కొడుకును ఎవరైనా చంపేస్తారనే భయం లేకుండా తన దగ్గరే పెంచుకోవచ్చు అని తెలిసినప్పుడు, ఆ తల్లి మనసు ఎంత సంతోషించి ఉంటుందో ఒక్కసారి ఊహించండి. పైగా జీతం కూడా వస్తుంది! ఆ పిల్లాడికి యెహోవా గురించి నేర్పించడానికి అమ్రాము, యోకెబెదు చేయగలిగినదంతా చేసుంటారు. అయితే కాస్త ఎదిగాక, ఆ పిల్లాడిని ఫరో కూతురు దగ్గరికి తీసుకెళ్లాల్సిన రోజు వచ్చింది. అప్పుడు యువరాణి, ఆ బాబుకు మోషే అని పేరు పెట్టింది.
అమ్రాము, యోకెబెదు, మిర్యాము చూపించిన ధైర్యానికి, విశ్వాసానికి యెహోవా వాళ్లను దీవించాడా? అందులో సందేహమే లేదు. అమ్రాము యోకెబెదులు తమ పిల్లలైన మిర్యాము, అహరోనులకు యెహోవా గురించి నేర్పించి, ఆయనకు నమ్మకమైన సేవకులు అయ్యేలా పెంచారు. అలాగే, యెహోవా మోషేను కాపాడుతూ రావడం కూడా వాళ్లు చూడగలిగారు. మోషే పెరిగి, ఎంతటివాడు అయ్యాడో చూసే అవకాశం అమ్రాము, యోకెబెదులకు దొరికిందో లేదో బైబిలు మనకు చెప్పట్లేదు. (నిర్గ. 6:20) కానీ మిర్యాము, అహరోనులకు ఆ అవకాశం దొరికింది. యెహోవా మోషేను ఉపయోగించి చేసిన అద్భుతమైన పనుల్ని వాళ్లు కళ్లారా చూశారు. ఆ ముగ్గురు తోబుట్టువులు చాలా గొప్ప విశ్వాసాన్ని, ధైర్యాన్ని చూపించారు. తర్వాతి అధ్యాయంలో, మోషే ఎలాంటి పరిస్థితుల మధ్య పెరిగాడో, యెహోవాను సేవించాలని ఎందుకు నిర్ణయించుకున్నాడో చూస్తాం.
ఈ వచనాలు చదవండి:
ప్రశ్న:
షిఫ్రా, పూయా, అమ్రాము, యోకెబెదు, మిర్యాము ఎలా ధైర్యం చూపించారు?
ఎక్కువ తెలుసుకోండి
1. ఇశ్రాయేలీయులు ఒకప్పుడు ఈజిప్టులో జీవించారని చెప్పడానికి ఏ పురావస్తు ఆధారాలు ఉన్నాయి? (g04 4/8 4 ¶4–5 ¶1-wcgr)
2. హెబ్రీయుల పిల్లల్ని చంపమని ఫరో ఇచ్చిన ఆజ్ఞ గురించి, జమ్ము పెట్టె గురించి బైబిలు చెప్పేది నిజమని ఎలా చెప్పవచ్చు? (g04 4/8 6 ¶1-2-wcgr) చిత్రం 1
Christine Osborne Pictures/Alamy Stock Photo
చిత్రం 1: ఈ రోజుల్లో కూడా, పపైరస్‌ని ఉపయోగించి పడవల్ని తయారు చేస్తున్నారు
3. హెబ్రీ మంత్రసానుల గురించి మనకు ఏం తెలుసు? వాళ్లను దేవుడు ఎలా దీవించాడు? (w03 11/1 8 ¶3-4; it “మంత్రసాని”-wcgr) చిత్రం 2
చిత్రం 2
4. వయసుపైబడ్డాక కూడా మిర్యాము ఎలా గొప్ప విశ్వాసాన్ని చూపించింది? (ijwia ఆర్టికల్ 7 ¶14-18)
మనం నేర్చుకునే పాఠాలు
అమ్రాము యోకెబెదుల నుండి తల్లిదండ్రులు ఏం నేర్చుకోవచ్చు?
మిర్యాము నుండి అక్కలు, అన్నలు ఏం నేర్చుకోవచ్చు? చిత్రం 3
చిత్రం 3
షిఫ్రా, పూయా చూపించినట్టు మీరు ఎలా ధైర్యం చూపించవచ్చు?
మనసుపెట్టి ఆలోచించండి
ఈ కథ నుండి యెహోవా గురించి నేను ఏం నేర్చుకున్నాను?
ఈ కథకు, యెహోవా సంకల్పానికి సంబంధం ఏంటి?
కొత్త లోకంలో షిఫ్రాను, పూయాను, అమ్రామును, యోకెబెదును, మిర్యామును కలిసినప్పుడు వాళ్లను నేను ఏం అడగాలనుకుంటున్నాను?
ఇవి కూడా చూడండి
ఫరో ఆజ్ఞకు లోబడని ఇద్దరు స్త్రీల నుండి మీరు ఏం నేర్చుకోవచ్చో తెలుసుకోండి.
ధైర్యం చూపిస్తూ, మనుషుల కన్నా తనకే ఎక్కువ లోబడేవాళ్లను యెహోవా కాపాడతాడా?