వారు యెహోవా చిత్తాన్ని చేశారు
పేతురు పెంతెకొస్తునాడు ప్రకటించడం
అది సా.శ. 33వ సంవత్సరంలోని వసంతకాలమందలి ఆహ్లాదకరమైన ఉదయం. వాతావరణం ఎంతో ఉత్తేజభరితంగా ఉంది! యూదులు, యూద మత ప్రవిష్టుల ఆనందమయ జన ప్రవాహం యెరూషలేము వీధుల్లో క్రిక్కిరిసివున్నారు. వారు ఏలాము, మెసొపొతమియ, కప్పదొకియ, ఐగుప్తు మరియు రోమావంటి స్థలాలనుండి వచ్చారు. వారు తమ సాంప్రదాయ బద్ధమైన వస్త్రాలను ధరించి ఉండగా చూడటం మరియు వారు విభిన్న భాషలను మాట్లాడుతుండగా వినడం ఎంతో ఆకర్షణీయంగా ఉంది! ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యేందుకు కొందరు దాదాపు రెండు వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చారు. అదేమిటి? అది పెంతెకొస్తు, యూదుల యవల కోత ముగింపును సూచించే ఆనందమయ వేడుక.—లేవీయకాండము 23:15-21.
దేవాలయ బలిపీఠంపైన ఉన్న దహనబలి నుండి పొగ పైకెగసి వస్తోంది, లేవీయులు హల్లేల్ (కీర్తనలు 113 నుండి 118) కీర్తనలు పాడుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలు అయ్యేందుకు కాస్త ముందు ఏదో అద్భుతమైనది సంభవించింది. ఆకాశమునుండి, “వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని” వచ్చింది. దాదాపు 120 మంది యేసుక్రీస్తు శిష్యులు సమకూడి ఉన్న ఇంటిని అది నింపివేసింది. లేఖన వృత్తాంతం ఇలా చెబుతుంది: “అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.”—అపొస్తలుల కార్యములు 2:1-4.
ప్రతి వాడు తన స్వంతభాషను వినడం
వెంటనే, అనేకమంది శిష్యులు ఆ ఇంట్లోనుండి బయటకు వెళ్తున్నారు. ఆశ్చర్యకరంగా, వారు ఆ జనసమూహానికి చెందిన వివిధ భాషల్లో మాట్లాడగలుగుతున్నారు! పర్షియానుండి వచ్చిన సందర్శకుడు మరియు ఒక ఐగుప్తు నివాసి తమ స్వంత భాషలో గలిలయులు మాట్లాడటాన్ని విన్నప్పుడు ఎంత ఆశ్చర్యం కలిగివుంటుందో ఊహించండి. జనసమూహం సంభ్రమాశ్చర్యంలో మునిగితేలుతుందంటే అర్థం చేసుకోవచ్చు. “యిదేమగునో అని” వారు అడిగారు. కొందరు “వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని” అంటూ శిష్యులను అపహాస్యం చేయడం ప్రారంభించారు.—అపొస్తలుల కార్యములు 2:12, 13.
తర్వాత అపొస్తలుడైన పేతురు లేచి నిలబడి జనసమూహమునుద్దేశించి మాట్లాడాడు. అద్భుతరీతిలో భాషల వరం ఇవ్వబడటం అనేది ప్రవక్తయైన యోవేలు ద్వారా “మనుష్యులందరిమీద నా ఆత్మను కుమ్మరించెదను” అని దేవుడు చేసిన వాగ్దానం యొక్క నెరవేర్పు అని ఆయన వివరించాడు. (అపొస్తలుల కార్యములు 2:14-21; యోవేలు 2:28-32) అవును, దేవుడు యేసు శిష్యులపై అంతకుక్రితమే తన పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. యేసు మృతులలో నుండి పునరుత్థానం చేయబడ్డాడని, ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడనే దానికి ఇది స్పష్టమైన రుజువు. “మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలె”ను అని పేతురు చెప్పాడు.—అపొస్తలుల కార్యములు 2:22-36.
శ్రోతలు ఎలా ప్రతిస్పందించారు? “వారు ఈ మాట విని హృదయములో పొడువబడి—సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను” అడిగారని ఆ వృత్తాంతం చెబుతుంది. పేతురు ఇలా సమాధానమిచ్చాడు: “మీరు మారుమనస్సు పొంది, . . . ప్రతివాడు . . . బాప్తిస్మము పొందుడి.” దాదాపు 3,000 మంది అలాగే చేశారు! పిమ్మట, “వీరు అపొస్తలుల బోధయందు . . . ఎడతెగక యుండిరి.”—అపొస్తలుల కార్యములు 2:37-42, అధఃస్సూచి.
స్మరణీయమైన ఈ సందర్భంలో అధ్యక్షత వహించడం ద్వారా, తనకు ఇస్తానని యేసు వాగ్దానం చేసిన “పరలోకరాజ్యముయొక్క తాళపుచెవుల”లో మొదటి దానిని పేతురు ఉపయోగించాడు. (మత్తయి 16:19) ఈ తాళపుచెవులు, వేర్వేరు ప్రజల గుంపులకు ప్రత్యేక ఆధిక్యతలను అందించాయి. ఈ మొదటి తాళపుచెవి ఆత్మాభిషిక్త క్రైస్తవులు అయ్యే సాధ్యతను యూదులకు ఇచ్చింది. అటుతర్వాత, రెండవ మరియు మూడవ తాళపుచెవులు, సమరయులకు మరియు అన్యులకు అదే అవకాశాన్ని అందించాయి.—అపొస్తలుల కార్యములు 8:14-17; 10:44-48.
మనకు పాఠాలు
యూదులు మరియు యూదా మత ప్రవిష్టుల ఈ జనసమూహం, దేవుని కుమారుని మరణానికి సమాజపు బాధ్యత వహించినప్పటికీ, పేతురు వారిని “సహోదరులారా” అని పిలుస్తూ, వారిని గౌరవంగా సంబోధించాడు. (అపొస్తలుల కార్యములు 2:29) వారిని ఖండించాలని కాదుగాని వారు పశ్చాత్తాపం చెందేలా చలింపజేయడమే ఆయన లక్ష్యం. కాబట్టి, ఆయన సదుద్దేశంతో ప్రారంభించాడు. ఆయన వాస్తవాలను అందించి, తన అంశాలను లేఖన ఉదాహరణలతో బలపర్చాడు.
నేడు సువార్త ప్రకటించే వారు పేతురు మాదిరిని అనుసరించడం ఎంతో మంచిది. వినువారికి పరిచయమున్న విషయంపై తమ సంభాషణను ప్రారంభించి, తర్వాత లేఖనాల నుండి వారితో యుక్తిగా తర్కించడానికి వారు ప్రయత్నించాలి. బైబిలు సత్యాన్ని సానుకూలంగా అందిస్తే, యథార్థహృదయులు ప్రతిస్పందిస్తారు.—అపొస్తలుల కార్యములు 13:48.
పెంతెకొస్తు దినాన పేతురు చూపిన ఆసక్తి మరియు ధైర్యం, దాదాపు ఏడు వారాలకు పూర్వం ఆయన యేసు ఎరుగనని అన్న విషయానికి పూర్తి భిన్నంగావుంది. ఆ సందర్భంలో పేతురు మనుష్యుల భయంచేత శక్తిహీనుడయ్యాడు. (మత్తయి 26:69-75) అయితే పేతురు కొరకు యేసు విన్నపం చేశాడు. (లూకా 22:31, 32) యేసు పునరుత్థానం తర్వాత పేతురుకు కనిపించడం ఈ అపొస్తలున్ని బలపరిచింది అనడంలో సందేహం లేదు. (1 కొరింథీయులు 15:5) దాని ఫలితంగా, పేతురు విశ్వాసం సన్నగిల్లిపోలేదు. కొద్ది కాలంలోనే, ఆయన ధైర్యంగా ప్రకటించాడు. కాబట్టి, పెంతెకొస్తు నాడే కాకుండా, తన శేష జీవితమంతా ఆయన ప్రకటించాడు.
పేతురు వలె మనం కూడా ఏదో ఒక విధంగా పొరపాటు చేసి ఉంటే ఎలా? మనం పశ్చాత్తాపాన్ని ప్రదర్శించి, క్షమాపణ కొరకు ప్రార్థించి, ఆత్మీయ సహాయం కొరకు చర్యలు తీసుకుందాం. (యాకోబు 5:14-16) దయగల మన పరలోకపు తండ్రియైన యెహోవాకు మన పవిత్ర సేవ అంగీకృతంగా ఉంటుందనే నమ్మకంతో అప్పుడు మనం ముందుకు సాగగలము.—నిర్గమకాండము 34:6.