బైబిలు పదాల పదకోశం
అ ఆ ఇ ఈ ఉ ఎ ఒ క గ చ జ ట డ త ద ధ న ప ఫ బ మ య ర ల వ శ స హ
అ
అకయ.
క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో అకయ అనేది రోమా పరిపాలన కిందవున్న దక్షిణ గ్రీసు ప్రాంతం. దాని రాజధాని కొరింథు. పెలపన్నీస్ ప్రాంతమంతా, అలాగే గ్రీసులోని మధ్యభాగం కూడా అకయలో భాగమే.—అపొ 18:12.
అగాధం.
ఈ పదం అబిస్సోస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. దీనికి “చాలా లోతైన” లేదా “అర్థంచేసుకోలేని, హద్దుల్లేని” అనే అర్థాలు ఉన్నాయి. బంధించి ఉంచే చోటును లేదా బంధించబడి ఉండడాన్ని సూచించడానికి క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఈ పదాన్ని వాడారు. సమాధి కూడా దీనిలోకే వస్తుంది, కానీ ఇది సమాధికి మాత్రమే పరిమితం కాదు.—లూకా 8:31; రోమా 10:7; ప్రక 20:3.
అగ్ని సరస్సు.
‘అగ్నిగంధకాలతో మండే’ సూచనార్థక స్థలం. ఇది ‘రెండో మరణం’ అని కూడా వర్ణించబడింది. పశ్చాత్తాపపడని పాపులు, అపవాది అందులో పడవేయబడతారు. ఆఖరికి మరణం, సమాధి (లేదా హేడిస్) కూడా అందులో పడవేయబడతాయి. పరలోక ప్రాణుల్ని, మరణాన్ని, హేడిస్‌ని అగ్ని ఏమీ చేయలేదు. అవి కూడా అందులో పడవేయబడుతున్నాయంటే ఈ సరస్సు నిత్యయాతన పడే స్థలాన్ని కాదుగానీ శాశ్వత నాశనాన్ని సూచిస్తుందని అర్థమౌతుంది.—ప్రక 19:20; 20:14, 15; 21:8.
అతి పవిత్ర స్థలం.
గుడారంలో, ఆ తర్వాత ఆలయంలో ఉన్న చాలా లోపలి గది. అక్కడ ఒప్పంద మందసం ఉండేది; దీన్ని అతి పరిశుద్ధ స్థలము అని కూడా అంటారు. మోషే కాకుండా అతి పవిత్ర స్థలంలోకి వెళ్లడానికి అనుమతి ఉన్న మరో వ్యక్తి ప్రధానయాజకుడు మాత్రమే. ప్రధానయాజకుడు ప్రతీ సంవత్సరం ప్రాయశ్చిత్త రోజున మాత్రమే ఆ స్థలంలోకి వెళ్లవచ్చు.—నిర్గ 26:33; లేవీ 16:2, 17; 1 రాజు 6:16; హెబ్రీ 9:3.
అద్భుతాలు; శక్తివంతమైన పనులు.
మనుషులకు తెలిసిన శక్తులన్నిటినీ మించిన పనులు లేదా సంఘటనలు. మానవాతీత శక్తి వల్ల అవి జరుగుతాయని అంటారు. బైబిల్లో కొన్నిసార్లు “ఆశ్చర్యకార్యాలు,” “అద్భుతాలు” అనే పదాల్ని పర్యాయపదాలుగా వాడారు.—మత్త 11:20; అపొ 4:22; హెబ్రీ 2:4.
అపవాది.
క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, సాతానును వర్ణించడానికి ఉపయోగించిన పేరు. దీనికి “అపనిందలు వేసేవాడు” అని అర్థం. యెహోవా గురించి, ఆయన మంచిమాట గురించి, ఆయన పవిత్రమైన పేరు గురించి లేనిపోనివి కల్పించి చెప్పినవాళ్లలో, బూటకపు నిందలు వేసినవాళ్లలో సాతాను ముఖ్యుడు, ప్రప్రథముడు. అందుకే అతనికి ఈ పేరు ఇవ్వబడింది.—మత్త 4:1; యోహా 8:44; ప్రక 12:9.
అపవిత్రం.
భౌతికంగా మురికిగా ఉండడాన్ని లేదా నైతిక నియమాలు మీరడాన్ని సూచించవచ్చు. బైబిల్లో ఈ పదం తరచూ మోషే ధర్మశాస్త్రం ప్రకారం అంగీకారంకాని లేదా పవిత్రంగాలేని దాన్ని సూచిస్తుంది. (లేవీ 5:2; 13:45; మత్త 10:1; అపొ 10:14; ఎఫె 5:5)—శుభ్రం/పవిత్రం చూడండి.
అపారదయ.
దీని గ్రీకు పదం ముఖ్యంగా ప్రీతికరమైన, మనోహరమైన దాన్ని సూచిస్తుంది. దయతో ఇచ్చే బహుమతిని లేదా దయతో ఇవ్వడాన్ని సూచించడానికి దీన్ని తరచూ ఉపయోగించారు. దేవుని అపారదయను సూచించడానికి ఈ పదాన్ని ఉపయోగించినప్పుడు, తిరిగి ఇస్తారని ఆశించకుండా దేవుడు ఉదారంగా ఇచ్చే ఒక ఉచిత బహుమతిని వర్ణిస్తుంది. కాబట్టి ఈ పదం దేవుడు సమృద్ధిగా ఇవ్వడాన్ని, మనుషుల పట్ల ఆయనకున్న గొప్ప ప్రేమను, దయను సూచిస్తుంది. ఈ గ్రీకు పదాన్ని “అనుగ్రహం,” “దయతో ఇచ్చిన బహుమతి” లాంటి మాటలతో కూడా అనువదించారు. ఒక వ్యక్తి కష్టపడకున్నా, అతనికి అర్హత లేకున్నా, కేవలం ఇచ్చే వ్యక్తి తన ఔదార్యంతో పురికొల్పబడి దీన్ని ఇస్తాడు.—2 కొరిం 6:1; ఎఫె 1:7.
అపొస్తలుడు.
ఈ పదానికి ప్రాథమికంగా “పంపబడినవాడు” అనే అర్థం ఉంది. యేసు గురించి, ఇతరులకు సేవచేయడానికి పంపించబడిన కొంతమంది గురించి చెప్తున్నప్పుడు ఈ పదాన్ని వాడారు. అయితే యేసు స్వయంగా ఎంపిక చేసుకున్న 12 మంది నియమిత ప్రతినిధుల గుంపును సూచించడానికి ఈ పదాన్ని ఎక్కువసార్లు వాడారు.—మార్కు 3:14; అపొ 14:14.
అభిషేకించడం.
హీబ్రూ భాషలో ఉపయోగించిన పదానికి ప్రాథమికంగా “ద్రవాన్ని పూయడం” అని అర్థం. ఒక వ్యక్తిని గానీ వస్తువును గానీ ప్రత్యేకమైన సేవకు సమర్పించారనడానికి గుర్తుగా తైలం రాసేవాళ్లు. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, పరలోక నిరీక్షణ కోసం ఎంచుకోబడిన వాళ్లమీద పవిత్రశక్తి కుమ్మరించడం గురించి చెప్తున్నప్పుడు కూడా ఈ పదాన్ని ఉపయోగించారు.—నిర్గ 28:41; 1 సమూ 16:13; లూకా 4:18; అపొ 10:38; 2 కొరిం 1:21.
అమావాస్య.
యూదా క్యాలెండర్‌లో ప్రతీనెల మొదటి రోజు. అందరూ కలుసుకోవడానికి, విందులు చేసుకోవడానికి, ప్రత్యేక బలులు అర్పించడానికి కేటాయించిన రోజుగా దీన్ని ఆచరించేవాళ్లు. తర్వాత్తర్వాత, ఇది ప్రాముఖ్యమైన జాతీయ పండుగగా మారింది. ఆ రోజున ప్రజలు పనిచేసేవాళ్లు కాదు.—సంఖ్యా 10:10; 2 దిన 8:13; కొలొ 2:16.
అరణ్యం.
గ్రీకు లేఖనాల్లో ఈ పదాన్ని ఇసుక, బండరాళ్లతో కూడిన ఎండిపోయిన ప్రాంతాల్ని వర్ణించడానికి ఉపయోగించారు. (యోహా 3:14) అయితే సంవత్సరంలోని ఆయా సమయాల్లో పచ్చిక ఉండడం వల్ల ఆ ప్రాంతాల్లో పశువుల్ని మేపే అవకాశముంది. (లూకా 15:4) కొన్ని సందర్భాల్లో ఒక ప్రాంతంలోని భౌతిక అంశాలను కాకుండా అక్కడ తక్కువ జనాభా ఉందని సూచించడానికి ఈ పదం ఎక్కువగా ఉపయోగించబడింది.
అరామిక్.
ఇది ఒక భాష పేరు. దీనికి హీబ్రూ భాషతో చాలా దగ్గరి సంబంధం ఉంది. ఈ భాషలో హీబ్రూ అక్షరమాలనే ఉపయోగించేవాళ్లు. మొదట్లో ఈ భాషను అరామీయులు మాట్లాడేవాళ్లు. కానీ ఆ తర్వాత ఇది అష్షూరు, బబులోను సామ్రాజ్యాల్లో అంతర్జాతీయ వ్యాపార భాషగా, వ్యవహార భాషగా మారిపోయింది. అంతేకాదు, పర్షియా సామ్రాజ్యంలో ఇది అధికార కార్యనిర్వాహక భాషగా ఉండేది. (ఎజ్రా 4:7) ఎజ్రా, యిర్మీయా, దానియేలు పుస్తకాల్లోని కొన్ని భాగాలు అరామిక్ భాషలో రాయబడ్డాయి. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో కూడా కొన్ని అరామిక్ పదాల్ని వాడారు.—ఎజ్రా 4:8–6:18; 7:12-26; యిర్మీ 10:11; మార్కు 14:36; అపొ 9:36.
అరేయొపగు.
ఇది ఏథెన్సులో ఉన్న ఒక పెద్ద కొండ. అది అక్రొపొలిస్‌కి వాయవ్యాన ఉంది. అరేయొపగు అనేది ఒక సభ (న్యాయస్థానం) పేరు కూడా; అక్కడ సమావేశాలు జరిగేవి. పౌలు తన నమ్మకాలు వివరించేలా స్తోయికుల, ఎపికూరీయుల తత్త్వవేత్తలు అతన్ని అరేయొపగుకు తీసుకొచ్చారు.—అపొ 17:19.
అలబాస్టర్.
ఐగుప్తులోని అలబాస్ట్రన్ ప్రాంతం దగ్గర దొరికే ఓ రాయితో తయారుచేసిన చిన్న అత్తరు బుడ్డీలను అలబాస్టర్ అంటారు. సాధారణంగా వాటి మూతి భాగం సన్నగా ఉంటుంది; దానివల్ల వాటిలో ఉన్న ఖరీదైన అత్తరు కొంచెం కూడా కారిపోకుండా మూత గట్టిగా బిగించడం వీలౌతుంది. తర్వాత్తర్వాత ఆ రాయికి కూడా అలబాస్టర్ అనే పేరే వచ్చింది.—మార్కు 14:3.
అసెల్జీయ.
లెక్కలేనితనం చూడండి.
ఆ
ఆమేన్.
ఈ మాటకు, “అలాగే జరగాలి” లేదా “ఖచ్చితంగా” అని అర్థం. ఈ పదం అమన్ అనే హీబ్రూ మూలపదం నుండి వచ్చింది. దానికి “నమ్మకంగా, నమ్మదగిన విధంగా ఉండడం” అనే అర్థాలు ఉన్నాయి. ఒక ఒట్టుకు, ప్రార్థనకు లేదా మాటకు అంగీకారం తెలపడానికి “ఆమేన్” అని అనేవాళ్లు. ప్రకటన గ్రంథంలో, ఈ పదాన్ని యేసుకు బిరుదుగా ఉపయోగించారు.—ద్వితీ 27:26; 1 దిన 16:36; రోమా 1:25; ప్రక 3:14.
ఆలయం.
యెరూషలేములో ఇశ్రాయేలీయుల ఆరాధనకు కేంద్రంగా ఉన్న శాశ్వత కట్టడం, ఇది ఒక చోటి నుండి ఇంకో చోటికి తీసుకెళ్లగలిగే గుడారం స్థానంలో వచ్చింది. మొట్టమొదటి ఆలయాన్ని సొలొమోను కట్టించాడు, దాన్ని బబులోనీయులు నాశనం చేశారు. రెండో ఆలయాన్ని బబులోను చెర నుండి తిరిగొచ్చిన తర్వాత జెరుబ్బాబెలు కట్టించాడు. ఆ తర్వాత హేరోద్ ద గ్రేట్ దాన్ని తిరిగి కట్టించాడు. దీన్నే ఒక్కోసారి “మందిరం” అని పిలిచారు.—మత్త 21:13; లూకా 11:51; 1 దిన 29:1; 2 దిన 2:4; మత్త 24:1.
ఆల్ఫా, ఓమెగ.
ఆసియా.
క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, రోమా ఆధిపత్యం కింద ఉన్న ఒక ప్రాంతం. ఇప్పటి పశ్చిమ టర్కీ అందులో భాగంగా ఉండేది; అలాగే కోస్తా ప్రాంతానికి దగ్గర్లో ఉన్న సమొసు, పత్మాసు వంటి కొన్ని ద్వీపాలు కూడా అందులో భాగంగా ఉండేవి. అప్పటి ఆసియా రాజధాని ఎఫెసు.—అపొ 20:16; ప్రక 1:4.
ఇ
ఇతియోపీయుడు.
ఐగుప్తుకు దక్షిణాన ఉన్న ప్రాచీన ఇతియోపియా దేశానికి చెందిన వ్యక్తి. ఇప్పటి ఈజిప్టులో దక్షిణాన చిట్టచివర ఉన్న ప్రాంతం, అలాగే ఇప్పటి సూడాన్‌లోని ఉత్తర సగభాగం అప్పటి ఇతియోపియాలో ఉండేవి.—అపొ 8:27.
ఇల్లూరికు.
గ్రీసుకు వాయవ్య దిశలో ఉన్న రోమా ప్రాంతం. పౌలు తన పరిచర్యలో భాగంగా ఇల్లూరికు వరకు వెళ్లాడు. అయితే ఆయన ఇల్లూరికులో కూడా ప్రకటించాడా లేక కేవలం అక్కడి దాకా వెళ్లాడా అన్నది బైబిలు చెప్పట్లేదు.—రోమా 15:19.
ఇశ్రాయేలు.
దేవుడు యాకోబుకు ఇచ్చిన పేరు. తర్వాత్తర్వాత, ఏదైనా ఒక కాలంలో జీవించిన అతని వంశస్థులందర్నీ కలిపి ఇశ్రాయేలు అని పిలవడం మొదలైంది. యాకోబు 12 మంది కొడుకుల వంశస్థులను తరచూ ఇశ్రాయేలు కుమారులు, ఇశ్రాయేలు కుటుంబం, లేదా ఇశ్రాయేలీయులు అని పిలిచారు. దక్షిణ రాజ్యం నుండి విడిపోయిన పది గోత్రాల ఉత్తర రాజ్యాన్ని కూడా ఇశ్రాయేలు అని పిలిచారు. ఆ తర్వాతి కాలంలో ఈ పదం అభిషిక్త క్రైస్తవుల్ని సూచించడానికి ఉపయోగించబడింది, వాళ్లు “దేవుని ఇశ్రాయేలు” అని పిలువబడ్డారు.—గల 6:16; ఆది 32:28; అపొ 4:10; రోమా 9:6.
ఈ
ఈ వ్యవస్థ ముగింపు.
సాతాను అధికారం కిందవున్న వ్యవస్థ అంతానికి ముందున్న కాలం. ఇది క్రీస్తు ప్రత్యక్షత కాలానికి సమాంతరంగా నడుస్తుంది. యేసు నిర్దేశంలో దేవదూతలు “నీతిమంతుల్లో నుండి దుష్టుల్ని వేరు చేసి” నాశనం చేస్తారు. (మత్త 13:40-42, 49) యేసు శిష్యులు ఆ “ముగింపు” ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలనుకున్నారు. (మత్త 24:3) ఆ సమయం వరకు తన అనుచరులకు తోడుగా ఉంటానని పరలోకానికి వెళ్లేముందు యేసు వాళ్లకు మాటిచ్చాడు.—మత్త 28:20.
ఉ
ఉదయ నక్షత్రం.—
వేకువ చుక్క చూడండి.
ఉపవాసం.
ఇశ్రాయేలీయులు ప్రాయశ్చిత్త రోజున, అలాగే కష్టసమయాల్లో, దేవుని నిర్దేశం అవసరమైన సమయంలో ఉపవాసం ఉండేవాళ్లు. యూదులు తమ చరిత్రలో జరిగిన విపత్కర సంఘటనలకు గుర్తుగా సంవత్సరంలో నాలుగుసార్లు ఉపవాసం ఏర్పాటు చేసుకున్నారు. క్రైస్తవులు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు.—ఎజ్రా 8:21; యెష 58:6; మత్త 4:2; 9:14; లూకా 18:12; అపొ 13:2, 3; 27:9.
ఎ
ఎపికూరీయుల తత్త్వవేత్తలు.
గ్రీకు తత్త్వవేత్త ఎపికూరు (సా.శ.పూ. 341-270) అనుచరులు. సొంత సుఖాలే జీవిత అంతిమ లక్ష్యం అన్నది వాళ్ల సిద్ధాంతం.—అపొ 17:18.
ఒ
ఒట్టు.
ఏదైనా చేస్తానని, ఒక అర్పణ లేదా కానుక ఇస్తానని, ఫలానా సేవలో అడుగుపెడతానని, లేదా ధర్మశాస్త్రం ప్రకారం తప్పుకాని కొన్నిటికి దూరంగా ఉంటానని దేవునికి చేసే ఒక ముఖ్యమైన ప్రమాణం. ఫలానాది నిజం అని ధృవీకరించడానికి ప్రమాణం చేసి చెప్పడం లేదా “ఫలానిది చేస్తాను” అని గానీ, “ఫలానిది చేయను” అని గానీ ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా వాగ్దానం చేయడాన్ని కూడా అది సూచించవచ్చు. అది ఎక్కువగా, తమకన్నా పైస్థానంలో ఉన్నవాళ్లకు, ముఖ్యంగా దేవునికి చేసే ప్రమాణం. యెహోవా ప్రమాణం చేయడం ద్వారా, అబ్రాహాముతో తాను చేసిన ఒప్పందానికి బలాన్ని చేకూర్చాడు.—మత్త 5:33; ఆది 14:22; హెబ్రీ 6:16, 17.
ఒప్పందం.
ఏదైనా ఒక పని చేసేందుకు లేదా చేయకుండా ఉండేందుకు దేవునికి, మనుషులకు మధ్య గానీ మనుషుల్లోనే రెండు పక్షాల మధ్య గానీ లాంఛనప్రాయంగా జరిగే ఒడంబడిక. కొన్నిసార్లు కేవలం ఒక పక్షం వాళ్లే ఒప్పందంలోని షరతుల్ని పూర్తిచేయాల్సి ఉండేది (ఇది ఏకపక్ష ఒప్పందం; ఇది చాలామట్టుకు వాగ్దాన రూపంలోనే ఉంటుంది). వేరే ఒప్పందాల్లో ఇరుపక్షాల వాళ్లు షరతుల్ని పూర్తిచేయాల్సి ఉండేది (ఇవి ద్వైపాక్షిక ఒప్పందాలు). దేవుడు మనుషులతో చేసిన ఒప్పందాల గురించే కాకుండా, మనుషుల మధ్య, గోత్రాల మధ్య, దేశాల మధ్య లేదా ప్రజల గుంపుల మధ్య జరిగిన ఒప్పందాల గురించి కూడా బైబిలు ప్రస్తావిస్తోంది. ఎంతగానో ప్రభావం చూపించిన ఒప్పందాలు కొన్ని ఉన్నాయి. వాటిలో దేవుడు అబ్రాహాముతో, దావీదుతో, ఇశ్రాయేలీయులతో (ధర్మశాస్త్ర ఒప్పందం), దేవుని ఇశ్రాయేలుతో (కొత్త ఒప్పందం) చేసిన ఒప్పందాల వంటివి ఉన్నాయి.—ఆది 9:11; 15:21; 21:27; నిర్గ 24:7; 2 దిన 21:7; లూకా 22:29; అపొ 3:25; 2 కొరిం 3:6; హెబ్రీ 8:6.
ఒప్పంద మందసం.
తుమ్మకర్రతో తయారుచేసి, బంగారు రేకు తొడిగిన పెట్టె. ఇది గుడారంలోని అతి పవిత్ర స్థలంలో ఉండేది. ఆ తర్వాతి కాలంలో దీన్ని సొలొమోను నిర్మించిన ఆలయంలోని అతి పవిత్ర స్థలంలో పెట్టారు. దీనికి బంగారంతో చేసిన గట్టి మూత ఉండేది. ఆ మూత మీద రెండు కెరూబులు ఎదురెదురుగా ఉండేవి. ఆ మందసంలో ముఖ్యంగా పది ఆజ్ఞలు ఉన్న రెండు రాతిపలకలు ఉండేవి.—ద్వితీ 31:25; 1 రాజు 6:19; హెబ్రీ 9:4.
క
కప్పం.
కరుణా పీఠం.
ఇది ఒప్పంద మందసపు మూత. ప్రాయశ్చిత్త రోజున పాపపరిహారార్థ బలుల రక్తాన్ని ప్రధానయాజకుడు చిలకరించేది దీని ముందే. దీనికి ఉపయోగించిన హీబ్రూ పదం “(పాపాన్ని) కప్పడం” లేదా బహుశా “(పాపాన్ని) తుడిచేయడం” అనే మూల క్రియాపదం నుండి వచ్చింది. ఇది గట్టి బంగారంతో చేయబడింది. దానిమీద ఆ చివర ఒక కెరూబు, ఈ చివర ఒక కెరూబు ఉండేవి. కొన్నిసార్లు దీన్ని సూచించడానికి కేవలం “మూత” అని మాత్రమే వాడారు.—నిర్గ 25:17-22; 1 దిన 28:11; హెబ్రీ 9:5, పాదసూచిక.
కల్దీయులు.
టైగ్రీస్, యూఫ్రటీసు నదుల డెల్టా ప్రాంతంలోని ప్రజలు. పూర్వం, కల్దీయుల ప్రాంతంలో “ఊరు” అతి ముఖ్య నగరంగా ఉండేది; అది అబ్రాహాము సొంత ఊరు.—అపొ 7:4.
కాడి.
ఒక వ్యక్తి భుజం మీద మోసే కొయ్య, దీనికి రెండు వైపులా బరువులు తగిలిస్తారు. అలాగే, పొలంలో వాడే పరికరాన్ని గానీ బండిని గానీ లాగేటప్పుడు రెండు జంతువుల (సాధారణంగా ఎద్దుల) మెడల మీద పెట్టే చెక్క కొయ్యను లేదా ఫ్రేమును కూడా కాడి అంటారు. దాసులు తరచూ పెద్దపెద్ద బరువులు మోయడానికి కాడులు ఉపయోగించేవాళ్లు. కాబట్టి వేరే వ్యక్తికి దాసుడిగా ఉండడాన్ని లేదా లోబడి ఉండడాన్ని సూచించడానికి, అలాగే అణచివేతను-బాధను సూచించడానికి కాడిని అలంకారార్థంగా ఉపయోగించారు. కాడిని తీసేయడం లేదా విరగగొట్టడం చెర నుండి, అణచివేత నుండి, దోపిడి నుండి విడుదలవ్వడాన్ని సూచించింది.—లేవీ 26:13; మత్త 11:29, 30.
కాపలావాడు.
ఎక్కువగా రాత్రిపూట, మనుషులకు లేదా ఆస్తికి హాని జరగకుండా కాపలా కాసే వ్యక్తి. ఏదైనా అపాయం వస్తుందని తెలిసినప్పుడు అతను శబ్దం చేయవచ్చు. దగ్గరికి వస్తున్నవాళ్లను కాస్త దూరంలో ఉండగానే చూడడం కోసం కాపలావాళ్లను తరచూ నగర గోడల మీద, బురుజుల మీద నిలబెట్టేవాళ్లు. సైన్యంలో ఉన్న కాపలావాళ్లను తరచూ గార్డు లేదా భటుడు అంటారు.—మత్త 27:65; 28:4.
కీర్తన.
దేవునికి పాడే స్తుతిగీతం. కీర్తనల్ని సంగీతానికి తగ్గట్టు కట్టేవాళ్లు; యెరూషలేము ఆలయంలో యెహోవా దేవునికి బహిరంగంగా చేసే ఆరాధనలో ఆరాధకులు వాటిని పాడేవాళ్లు.—లూకా 20:42; అపొ 13:33; యాకో 5:13, పాదసూచిక.
కుమ్మరి.
కుష్ఠురోగం; కుష్ఠురోగి.
తీవ్రమైన ఒక చర్మవ్యాధి. లేఖనాల్లో ప్రస్తావించిన కుష్ఠురోగం, మన కాలంలో ఉన్న కుష్ఠురోగానికి మాత్రమే పరిమితం కాదు. ఎందుకంటే అది మనుషులకే కాదు బట్టలకు, ఇళ్లకు కూడా వచ్చేది. ఈ వ్యాధి వచ్చిన వ్యక్తిని కుష్ఠురోగి అంటారు.—లేవీ 14:54; లూకా 5:12.
కెరూబులు.
ప్రత్యేక విధులు నిర్వహించే ఉన్నత శ్రేణి దేవదూతలు. వీళ్లు, సెరాపులు ఒకటి కాదు.—ఆది 3:24; నిర్గ 25:20; యెష 37:16; హెబ్రీ 9:5.
కైసరు.
ఇది రోమన్ల ఒక ఇంటి పేరు. తర్వాత అది రోమా చక్రవర్తులకు బిరుదుగా మారింది. వాళ్లలో ఔగుస్తు, తిబెరి, క్లౌదియ వంటి కొంతమంది పేర్లను బైబిలు ప్రస్తావిస్తోంది; నీరో చక్రవర్తి పేరు ప్రస్తావించబడకపోయినా, కైసరు అనే బిరుదు అతనికి కూడా వర్తిస్తుంది. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, పౌరసంబంధ అధికారాన్ని, లేదా ప్రభుత్వాన్ని సూచించడానికి కూడా “కైసరు” అనే పదం వాడారు.—మార్కు 12:17; అపొ 25:12.
కొమ్ము.
ఇది జంతువుల కొమ్ముల్ని సూచిస్తుంది. వీటిని తాగే పాత్రలుగా, నూనె పాత్రలుగా, సిరా పాత్రలుగా, అలంకార ద్రవ్యాల పాత్రలుగా, సంగీత వాయిద్యాలుగా, సంకేతాల్నిచ్చే పరికరాలుగా వాడేవాళ్లు. (1 సమూ 16:1, 13; 1 రాజు 1:39) బలాన్ని, గెలుపును, విజయాన్ని సూచించడానికి “కొమ్ము” అనే పదాన్ని తరచూ అలంకారికంగా ఉపయోగించారు.—ద్వితీ 33:17; మీకా 4:13; లూకా 1:69, పాదసూచిక.
కొయ్య.
బాధితుడిని వేలాడదీసే ఒక నిలువుపాటి కొయ్య. దీన్ని కొన్నిదేశాల్లో మరణశిక్ష వేయడానికి, అలాగే ఇతరులకు హెచ్చరికగా ఉండడం కోసం లేదా అందరిముందు అవమానించడం కోసం మృతదేహాన్ని వేలాడదీయడానికి ఉపయోగించేవాళ్లు. కొన్నిసార్లు వాటిలో ఏదో ఒకదానికి ఉపయోగించేవాళ్లు. పాశవిక యుద్ధాలకు పేరుగాంచిన అష్షూరీయులు, బందీలను పదునైన కొయ్యల మొన మీద వేలాడదీసేవాళ్లు. ఆ కొయ్య బాధితుడి కడుపు గుండా ఛాతీ భాగంలోకి దూసుకెళ్లేది. అయితే యూదుల ధర్మశాస్త్రం ప్రకారం, దైవదూషణ లేదా విగ్రహపూజ వంటి నీచమైన నేరాలు చేసేవాళ్లను ముందు రాళ్లతో కొట్టి చంపేవాళ్లు లేదా వేరే పద్ధతిలో చంపేవాళ్లు. తర్వాత, ఇతరులకు హెచ్చరికగా ఉండడం కోసం ఆ శవాలను కొయ్యలకు లేదా చెట్లకు వేలాడదీసేవాళ్లు. (ద్వితీ 21:22, 23; 2 సమూ 21:6, 9) రోమీయులు కొన్నిసార్లు బాధితుల్ని కొయ్యకు కట్టి అలా వదిలేసేవాళ్లు; దాంతో వాళ్లు నొప్పి, ఆకలి, దప్పిక, ఎండదెబ్బ వల్ల బాధపడి కొన్ని రోజులకు చనిపోయేవాళ్లు. ఇంకొన్నిసార్లు వాళ్లు నిందితుడి చేతుల్ని, పాదాల్ని మేకులతో కొయ్యకు దిగగొట్టేవాళ్లు. యేసుకు మరణశిక్ష విధించినప్పుడు వాళ్లు అలాగే చేశారు. (లూకా 24:20; యోహా 19:14-16; 20:25; అపొ 2:23, 36)—హింసాకొయ్య చూడండి.
కొరడా.
యేసు కాలంలో కొరడాలకు ఇనుప గుండ్లు లేదా పదునైన ఎముక ముక్కలు ఉండేవి. ఈ కొరడాలను శిక్షించడానికి ఉపయోగించేవాళ్లు.—యోహా 19:1.
కోర్.
దీన్ని ద్రవ కొలతల్లో, ఘనపదార్థాల కొలతల్లో రెండిట్లో ఉపయోగించేవాళ్లు. బాత్ కొలత పరిమాణం అంచనా ఆధారంగా చూస్తే కోర్ అనేది 220 లీటర్లతో (58.1 గ్యాలన్లతో/ఘనపదార్థాల కొలతలో 200 క్వార్ట్‌లతో) సమానం.—1 రాజు 5:11; లూకా 16:7, పాదసూచిక.
క్రీస్తు.
యేసుకు ఉన్న ఈ బిరుదు క్రిస్టోస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. ఆ పదం “మెస్సీయ” లేదా “అభిషిక్తుడు” అని అనువదించబడిన హీబ్రూ పదానికి సరిసమానమైన పదం.—మత్త 1:16; యోహా 1:41.
క్రీస్తువిరోధి.
గ్రీకు భాషలో ఉపయోగించిన పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఇది క్రీస్తుకు విరోధంగా లేదా వ్యతిరేకంగా ఉన్నదాన్ని సూచిస్తుంది. ఇది క్రీస్తు స్థానంలో వచ్చే దొంగ క్రీస్తును కూడా సూచించవచ్చు. క్రీస్తు ప్రతినిధులు కాకపోయినా క్రీస్తు ప్రతినిధులమని చెప్పుకునే ప్రజల్ని, సంస్థల్ని, గుంపుల్ని, ‘నేనే మెస్సీయను’ అని చెప్పుకునేవాళ్లను లేదా క్రీస్తునూ, ఆయన శిష్యుల్నీ వ్యతిరేకించేవాళ్లను క్రీస్తువిరోధులు అనొచ్చు.—1 యోహా 2:22.
క్రైస్తవులు.
యేసుక్రీస్తు అనుచరులకు దేవుడు ఇచ్చిన పేరు.—అపొ 11:26; 26:28.
గ
గుడారాల పండుగ.
దీన్ని పర్ణశాలల పండుగ లేదా పంట కూర్చే పండుగ అని కూడా పిలుస్తారు. హీబ్రూ క్యాలెండర్ ప్రకారం ఏతనీము నెల 15-21 తేదీల్లో దీన్ని చేసుకునేవాళ్లు. ఇది ఇశ్రాయేలీయుల వ్యవసాయ సంవత్సరం చివర్లో పంట చేతికి వచ్చినందుకు చేసుకునే పండుగ. ఇది సంతోషించే సమయం, తమ పంటల్ని దీవించినందుకు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించే సమయం. ఐగుప్తు నుండి కలిగిన విడుదలను గుర్తుచేసుకోవడానికి పండుగ రోజుల్లో ప్రజలు పర్ణశాలల్లో లేదా పందిరిలాంటి వాటిలో నివసించేవాళ్లు. పురుషులు యెరూషలేముకు వెళ్లాల్సిన మూడు పండుగల్లో ఇదొకటి.—లేవీ 23:34; ఎజ్రా 3:4; యోహా 7:2.
గెహెన్నా.
హిన్నోము లోయకు ఉన్న గ్రీకు పేరు. అది ప్రాచీన యెరూషలేముకు నైరుతి వైపున ఉంది. (యిర్మీ 7:31) అది శవాల్ని చెల్లాచెదురుగా పారేసే చోటు అని ప్రవచనాత్మకంగా చెప్పబడింది. (యిర్మీ 7:32; 19:6) జంతువుల్ని, మనుషుల్ని కాల్చడానికి లేదా బాధించడానికి సజీవంగా అందులో పారేసేవాళ్లు అని చెప్పడానికి ఎలాంటి రుజువులూ లేవు. కాబట్టి గెహెన్నా, అక్షరార్థమైన మంటల్లో మనుషుల ఆత్మల్ని శాశ్వతంగా బాధించే అదృశ్యమైన చోటును సూచించదు. బదులుగా, శాశ్వత శిక్ష అయిన “రెండో మరణాన్ని” అంటే నిత్యనాశనాన్ని సూచించడానికి యేసు, ఆయన శిష్యులు గెహెన్నా అనే పదాన్ని ఉపయోగించారు.—ప్రక 20:14; మత్త 5:22; 10:28.
గోనెపట్ట.
ధాన్యం నిల్వచేయడానికి ఉపయోగించే సంచుల లాంటివి తయారుచేసేందుకు వాడే దట్టమైన బట్ట. అప్పట్లో దీన్ని సాధారణంగా మేక వెంట్రుకలతో నేసేవాళ్లు. దీన్ని దుఃఖానికి సూచనగా వేసుకోవడం సంప్రదాయంగా ఉండేది.—ఆది 37:34; లూకా 10:13.
గ్రంథపు చుట్ట.
పొడవాటి తోలు కాగితం లేదా పపైరస్. దీనిమీద ఒకవైపే రాసేవాళ్లు. సాధారణంగా దీన్ని ఒక కర్రకు చుట్టి ఉంచేవాళ్లు. లేఖనాల్ని రాసింది, వాటిని నకలు చేసింది ఇలాంటి గ్రంథపు చుట్టల్లోనే. బైబిలు రాసిన కాలాల్లో ఇలాంటి పుస్తక రూపమే వాడుకలో ఉంది.—లూకా 4:17-20; 2 తిమో 4:13.
గ్రీకు.
గ్రీసు ప్రజలు మాట్లాడే భాష.
గ్రీకువాళ్లు.
గ్రీసు దేశస్థులు లేదా గ్రీసు సంతతివాళ్లు. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఈ మాటను విస్తృత అర్థంలో కూడా వాడారు; యూదులుకాని ప్రజలందర్నీ సూచించడానికి లేదా గ్రీకు భాషతో, సంస్కృతితో ప్రభావితులైన ప్రజల్ని సూచించడానికి ఉపయోగించారు.—యోవే 3:6; యోహా 12:20.
చ
చివరి రోజులు.
చారిత్రక సంఘటనలు చివరి దశకు చేరుకునే సమయాన్ని సూచించడానికి ఈ పదాన్ని, అలాగే ‘దినముల అంతం’ లాంటి ఇతర పదాల్ని బైబిలు ప్రవచనాల్లో ఉపయోగించారు. (యెహె 38:16; దాని 10:14; అపొ 2:17) ప్రవచన స్వభావాన్ని బట్టి, ఇది కేవలం కొన్ని సంవత్సరాల కాలాన్ని సూచించవచ్చు లేదా ఎన్నో సంవత్సరాల కాలాన్ని సూచించవచ్చు. ఆసక్తికరంగా, యేసు అదృశ్య ప్రత్యక్షత సమయంలో ప్రస్తుత వ్యవస్థ ‘చివరి రోజుల’ గురించి చెప్పడానికి బైబిలు ఈ పదాన్ని ఉపయోగిస్తుంది.—2 తిమో 3:1; యాకో 5:3; 2 పేతు 3:3.
చీట్లు.
నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగించిన గులకరాళ్లు లేదా చిన్నచిన్న చెక్కముక్కలు లేదా చిన్నరాళ్లు. వాటిని ఒక బట్ట మడతలో వేసి లేదా గిన్నెలో వేసి ఊపేవాళ్లు, బయట పడిన దాన్ని లేదా బయటికి తీసిన దాన్ని ఎంచుకునేవాళ్లు. సాధారణంగా, ప్రార్థన చేసి వీటిని వేసేవాళ్లు.—మత్త 27:35; అపొ 1:26.
చెడ్డదూతలు.
వీళ్లు కంటికి కనిపించరు. ఈ దుష్టులు మానవాతీత శక్తులున్న పరలోక ప్రాణులు. ఆదికాండము 6:2 లో నిజమైన “దేవుని కుమారులు” అనీ, యూదా 6 లో “దేవదూతలు” అనీ పిలువబడిన వీళ్లను దేవుడు దుష్టులుగా సృష్టించలేదు. కానీ, నోవహు కాలంలో వాళ్లు దేవునికి అవిధేయత చూపించి, యెహోవాకు వ్యతిరేకంగా సాతాను రేపిన తిరుగుబాటులో అతనితో చేతులు కలిపి తమంతట తామే దేవునికి శత్రువులయ్యారు. వీళ్లు అపవిత్ర దూతలు అని కూడా పిలవబడ్డారు.—లూకా 8:30; అపొ 16:16; యాకో 2:19.
చేతులు ఉంచడం.
ఒక ప్రత్యేకమైన పని కోసం నియమించడానికి లేదా దీవించడానికి, బాగుచేయడానికి, పవిత్రశక్తికి సంబంధించిన ఒక వరాన్ని ఇవ్వడానికి ఒక వ్యక్తి మీద చేతులు ఉంచేవాళ్లు.—సంఖ్యాకాండం 27:18; అపొ 19:6; 1 తిమో 5:22.
జ
జటామాంసి.
లేత ఎరుపు రంగులో ఉండే ఖరీదైన సుగంధ తైలం. దీన్ని జటామాంసి మొక్క (నార్డోస్టకిస్ జటామాంసి) నుండి సేకరిస్తారు. ఇది ఎంతో ఖరీదైనది కాబట్టి, దీన్ని తరచూ మామూలు నూనెలతో కలిపేవాళ్లు. కొన్నిసార్లు నకిలీవి కూడా తయారుచేసేవాళ్లు. ఆసక్తికరంగా, యేసు మీద పోసింది “అసలుసిసలు జటామాంసి” అని మార్కు, యోహాను ఇద్దరూ చెప్పారు.—మార్కు 14:3; యోహా 12:3.
జీవవృక్షం.
ఏదెను తోటలో ఉన్న ఒక చెట్టు. జీవాన్నిచ్చే లక్షణాలు ఉన్న పండ్లు దానికి ఉండేవని బైబిలు సూచించడం లేదు. బదులుగా, దేవుడు ఎవరినైతే దాని పండ్లు తిననిస్తాడో వాళ్లు శాశ్వత జీవితం పొందుతారనే దేవుడి హామీని అది సూచించింది. ప్రకటన గ్రంథంలో, జీవిస్తూ ఉండడానికి దేవుడు చేసిన ఏర్పాటుకు అది గుర్తుగా ఉంది.—ఆది 2:9; 3:22; ప్రక 2:7; 22:19.
జేన.
ఇది రేఖీయ కొలత. ఇది దాదాపు, చేతివేళ్లను చాచినప్పుడు బొటనవేలి చివరి నుండి చిటికెనవేలి చివరివరకు ఉండే దూరమంత ఉంటుంది. మూర 44.5 సెంటీమీటర్లు (17.5 అంగుళాలు) అయితే, జేన 22.2 సెంటీమీటర్లు (8.75 అంగుళాలు) ఉంటుంది.—నిర్గ 28:16; 1 సమూ 17:4.
జ్యేష్ఠుడు.
ఒక తండ్రి పెద్ద కొడుకును సాధారణంగా జ్యేష్ఠుడు అంటారు. బైబిలు కాలాల్లో, జ్యేష్ఠ కుమారుడికి కుటుంబంలో గౌరవప్రదమైన స్థానం ఉండేది; తండ్రి చనిపోతే ఇంటిపెద్ద స్థానం అతనికే ఇవ్వబడేది. యేసు యెహోవాకు జ్యేష్ఠ కుమారుడు. అంతేకాదు మొత్తం సృష్టిలో కూడా మొట్టమొదటి వ్యక్తి; మృతుల్లో నుండి మొదట బ్రతికినవాడు కూడా.—ఆది 25:33; నిర్గ 11:5; కొలొ 1:15, పాదసూచిక; ప్రక 1:5, పాదసూచిక.
జ్యోతిష్యుడు.
భవిష్యత్తు సంఘటనల్ని అంచనా వేయడానికి సూర్యచంద్ర నక్షత్రాల కదలికల్ని పరిశీలించే వ్యక్తి.—మత్త 2:1.
ట
టార్టరస్.
క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఈ పదాన్ని నోవహు కాలంలో తిరుగుబాటు చేసిన దేవదూతల్ని పడేసిన జైలు లాంటి హీనమైన స్థితిని సూచించడానికి ఉపయోగించారు. 2 పేతురు 2:4 లో ఉపయోగించిన టార్టరూ (‘టార్టరస్‌లో పడేయడం’) అనే క్రియాపదం, “పాపం చేసిన దేవదూతల్ని” అన్యమత పురాణాల్లో ఉన్న టార్టరస్‌లో (అంటే, తక్కువ స్థాయి దేవుళ్లు ఉండే భూగర్భంలోని జైలు, చీకటి స్థలం) పడేశారని సూచించట్లేదు. బదులుగా ఆ క్రియాపదం దేవుడు ఆ దేవదూతల్ని పరలోకంలో వాళ్లకున్న స్థానం నుండి, సేవావకాశాల నుండి తొలగించి, ఉజ్వలమైన తన సంకల్పాల విషయంలో వాళ్లను మానసికంగా కటికచీకటి స్థితిలో ఉంచాడని సూచిస్తుంది. అంతేకాదు ఆ చీకటి వాళ్లకు చివరికి పట్టే గతికి సూచనగా ఉంది; వాళ్లు తమ పరిపాలకుడితో పాటు అంటే అపవాదియైన సాతానుతో పాటు నిత్యనాశనం పొందుతారని లేఖనాలు చూపిస్తున్నాయి. కాబట్టి టార్టరస్ అనే పదం తిరుగుబాటు చేసిన ఆ దేవదూతల అత్యంత హీనస్థితిని సూచిస్తుంది. టార్టరస్, ప్రకటన 20:1-3 లో ఉన్న “అగాధం” ఒకటి కాదు.
డ
డ్రక్మా.
క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, ఈ పదం గ్రీకుల వెండి నాణేన్ని సూచిస్తోంది. ఆ కాలంలో దాని బరువు 3.4 గ్రాములు.—మత్త 17:24, పాదసూచిక.
త
తలాంతు.
బరువును, డబ్బును కొలవడానికి ఉపయోగించే అతి పెద్ద హీబ్రూ కొలమానం. ఒక తలాంతు 34.2 కిలోలు ఉంటుంది. గ్రీకు తలాంతు కాస్త తక్కువ, అంటే 20.4 కిలోలు ఉంటుంది.—1 దిన 22:14; మత్త 18:24.
తిరుగలి రాయి.
ఒక గుండ్రటి రాయి మీద మరో గుండ్రటి రాయి ఉంటుంది, పై రాయిని తిప్పుతూ ధాన్యాన్ని పిండి చేసేవాళ్లు. బైబిలు కాలాల్లో, చాలా ఇళ్లల్లో స్త్రీలు దీన్ని ఉపయోగించేవాళ్లు. ప్రతీరోజు భోజనం తయారుచేయడానికి తిరుగలి రాయి అవసరం కాబట్టి, దాన్ని లాక్కోవడాన్ని లేదా పై రాయిని తాకట్టుగా తీసుకోవడాన్ని ధర్మశాస్త్రం నిషేధించింది. ఇలానే ఉండే పెద్ద తిరుగలి రాయిని జంతువులతో తిప్పించేవాళ్లు.—ద్వితీ 24:6; మార్కు 9:42.
తీర్పు రోజు.
తనకు లెక్క చెప్పమని కొన్ని గుంపుల్ని, దేశాల్ని లేదా మనుషులందర్నీ దేవుడు అడిగే ఒక నిర్దిష్ట రోజు లేదా కాలం. ఇది మరణశిక్షకు తగినవాళ్లు అని తీర్పు పొందినవాళ్లు చంపబడే సమయం అయ్యుండవచ్చు లేదా ఆ తీర్పువల్ల కొంతమందికి రక్షించబడి, శాశ్వత జీవితం పొందే అవకాశం దొరకవచ్చు. భవిష్యత్తులో రాబోయే “తీర్పు రోజు” గురించి యేసుక్రీస్తు, ఆయన అపొస్తలులు మాట్లాడారు. బ్రతికి ఉన్నవాళ్లకే కాక గతంలో చనిపోయినవాళ్లకు కూడా అప్పుడు తీర్పు జరుగుతుంది.—మత్త 12:36.
తెగ.
ఒక సిద్ధాంతాన్ని లేదా నాయకుణ్ణి అంటిపెట్టుకొని సొంత నమ్మకాల్ని అనుసరించే ప్రజల గుంపు. యూదా మతంలోని రెండు ప్రముఖ శాఖలను అంటే, పరిసయ్యులను, సద్దూకయ్యులను సూచించడానికి ఈ పదాన్ని ఉపయోగించారు. క్రైస్తవులుకాని వాళ్లు కూడా క్రైస్తవత్వాన్ని “తెగ” అని లేదా “నజరేయులు అనే తెగ” అని పిలిచారు. క్రైస్తవులను యూదా మతం నుండి విడిపోయిన గుంపుగా భావించి వాళ్లు అలా పిలిచివుంటారు. ఆ తర్వాత మెల్లమెల్లగా క్రైస్తవ సంఘంలో కూడా తెగలు పుట్టుకొచ్చాయి; ప్రకటన గ్రంథంలో “నీకొలాయితు తెగ” గురించి ప్రత్యేకంగా ప్రస్తావించబడింది.—అపొ 5:17; 15:5; 24:5; 28:22; ప్రక 2:6; 2 పేతు 2:1.
తెర.
ఇది గుడారంలో, ఆ తర్వాత ఆలయంలో పవిత్ర స్థలాన్ని, అతి పవిత్ర స్థలాన్ని వేరు చేసింది. ఇది అందంగా నేసిన వస్త్రం. దీనిమీద కుట్టుపనితో చేసిన కెరూబుల రూపాలు ఉండేవి.—నిర్గ 26:31; 2 దిన 3:14; మత్త 27:51; హెబ్రీ 9:3.
తోలు కాగితం.
రాయడానికి ఉపయోగించేలా సిద్ధం చేసిన గొర్రె, మేక లేదా దూడ చర్మం. ఇది పపైరస్ కన్నా ఎంతో మన్నికైనది; బైబిలు గ్రంథపు చుట్టల కోసం దీన్ని ఉపయోగించారు. పౌలు తిమోతిని తీసుకురమ్మని చెప్పిన తోలు కాగితాలు బహుశా హీబ్రూ లేఖనాల కొన్ని భాగాలు అయ్యుండవచ్చు. కొన్ని మృతసముద్ర గ్రంథపు చుట్టలు తోలు కాగితంపై రాశారు.—2 తిమో 4:13.
తోలుసంచి.
మేక లేదా గొర్రె లాంటి జంతువు పూర్తి తోలుతో తయారుచేసే తోలు తిత్తి లేదా సిద్దె. దీన్ని ద్రాక్షారసం ఉంచడానికి ఉపయోగిస్తారు. ద్రాక్షారసం పులిసిపోయే కొద్దీ కార్బన్ డై ఆక్సైడ్ (CO2) వాయువును ఉత్పత్తి చేసి తోలుసంచుల మీద ఒత్తిడి కలుగజేస్తుంది కాబట్టి ద్రాక్షారసాన్ని కొత్త తోలుసంచుల్లో పోసేవాళ్లు. కొత్త తోలుసంచులు వ్యాకోచిస్తాయి; పాతవి అంతగా వ్యాకోచించవు కాబట్టి ఆ ఒత్తిడికి పిగిలిపోతాయి.—యెహో 9:4; మత్త 9:17.
ద
దహనబలి.
బలి ఇచ్చే పశువును బలిపీఠం మీద దహించి, సంపూర్ణంగా దేవునికి అర్పించే బలి; దానిలో (ఎద్దు, పొట్టేలు, మేక, గువ్వ లేదా పావురం పిల్ల) ఏ భాగాన్నీ ఆరాధకుడు ఉంచుకోకూడదు.—నిర్గ 29:18; లేవీ 6:9; మార్కు 12:33; హెబ్రీ 10:6.
దానధర్మాలు.
అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయడానికి ఇచ్చే బహుమతులు. హీబ్రూ లేఖనాలు వీటి గురించి నేరుగా ప్రస్తావించట్లేదు కానీ పేదవాళ్ల విషయంలో ఇశ్రాయేలీయులు తప్పనిసరిగా చేయాల్సిన పనుల గురించి ధర్మశాస్త్రం కొన్ని నిర్దేశాలు ఇచ్చింది.—మత్త 6:2.
దావీదు కుమారుడు.
ఈ మాటను తరచూ యేసును సూచించడానికి ఉపయోగించారు. దావీదు వంశస్థుల్లో ఒకరు నెరవేర్చాల్సిన రాజ్య ఒప్పందానికి యేసే వారసుడని ఈ మాట నొక్కిచెప్తుంది.—మత్త 12:23; 21:9.
దుష్టుడు.
దేవున్ని, ఆయన నీతియుక్తమైన ప్రమాణాల్ని వ్యతిరేకించే అపవాదియైన సాతానుకు ఉన్న ఒక బిరుదు.—మత్త 6:13; 1 యోహా 5:19.
దుఃఖం.
ఎవరైనా చనిపోతే లేదా ఏదైనా విపత్తు జరిగితే బయటికి వ్యక్తం చేసే బాధ. బైబిలు కాలాల్లో, అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కొంతకాలంపాటు దుఃఖపడడం ఆచారం. అలా దుఃఖపడేవాళ్లు పెద్దగా ఏడ్వడంతోపాటు ప్రత్యేకమైన బట్టలు వేసుకునేవాళ్లు, తలమీద బూడిద పోసుకునేవాళ్లు, బట్టల్ని చింపుకునేవాళ్లు, గుండెలు బాదుకునేవాళ్లు. ఏడ్వడమే వృత్తిగా చేసుకున్నవాళ్లను కొన్నిసార్లు అంత్యక్రియలకు పిలిచేవాళ్లు.—ఎస్తే 4:3; మత్త 11:17; మార్కు 5:38; యోహా 11:33; ప్రక 21:4.
దెకపొలి.
కొన్ని గ్రీకు నగరాలను కలిపి అలా అంటారు. మొదట్లో, దీనిలో పది నగరాలు (గ్రీకులో డెక అంటే “పది,” పొలిస్ అంటే “నగరం.”) ఉండేవి. వీటిలో ఎక్కువ నగరాలున్న ప్రాంతానికి అంటే గలిలయ సముద్రానికి, యొర్దాను నదికి తూర్పున ఉన్న ప్రాంతానికి కూడా ఆ పేరే ఉండేది. గ్రీకుల (హెల్లెనిస్టిక్) సంస్కృతికి, వ్యాపారానికి ఆ నగరాలు కేంద్రంగా ఉండేవి. యేసు ఈ ప్రాంతాన్ని దాటుకుంటూ వెళ్లాడు, కానీ ఆయన ఈ నగరాల్లో ఏదైనా ఒకదాన్ని సందర్శించిన దాఖలాలు లేవు.—మత్త 4:25; మార్కు 5:20.
దేనారం.
ఇది 3.85 గ్రాములు ఉండే రోమన్ల వెండి నాణెం. దీనికి ఒకవైపు కైసరు బొమ్మ ఉండేది. ఇది ఒక కూలివాడికి ఇచ్చే రోజువారీ కూలీ; అలాగే రోమన్లు యూదుల దగ్గర నుండి పన్నుగా వసూలు చేసే నాణెం కూడా.—మత్త 22:17; లూకా 20:24.
దేవదూతలు.
మలఖ్ అనే హీబ్రూ పదం నుండి, ఎజ్జిలొస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. ఈ రెండు పదాలకు అక్షరార్థంగా “సందేశకుడు” అనే అర్థం ఉంది, కానీ పరలోక సందేశకుల గురించి చెప్తున్నప్పుడు దేవదూతలు అని అనువదించారు. (ఆది 16:7; 32:3; యాకో 2:25; ప్రక 22:8) దేవదూతలు శక్తివంతమైన పరలోక ప్రాణులు. దేవుడు మనుషుల్ని సృష్టించడానికి ఎంతోకాలం ముందే దేవదూతల్ని సృష్టించాడు. వాళ్లను బైబిలు “వేవేల పరిశుద్ధ సమూహములు,” “దైవకుమారులు,” “ఉదయనక్షత్రములు” అని కూడా పిలుస్తోంది. (ద్వితీ 33:2; యోబు 1:6, పాదసూచిక; 38:7) వాళ్లు తమలాంటి ప్రాణుల్ని కనే సామర్థ్యంతో సృష్టించబడలేదు, బదులుగా దేవుడు వాళ్లలో ప్రతీ ఒక్కర్ని విడిగా సృష్టించాడు. వాళ్ల సంఖ్య కోట్లలో ఉంటుంది. (ప్రక 5:11) వాళ్లలో ప్రతీ ఒక్కరికి ఒక్కో పేరు, ఒక్కో వ్యక్తిత్వం ఉన్నాయని బైబిలు చెప్తోంది. అయితే వాళ్లు వినయంగా ఉంటారు, ఆరాధనను స్వీకరించడానికి ఒప్పుకోరు; చాలామంది దేవదూతలు తమ పేర్లు కూడా చెప్పరు. (ఆది 32:29; లూకా 1:26; ప్రక 22:8, 9) దేవదూతల్లో వేర్వేరు శ్రేణులు ఉన్నాయి. యెహోవా సింహాసనం ముందు సేవ చేయడం, ఆయన సందేశాల్ని తెలియజేయడం, భూమ్మీద యెహోవా సేవకుల తరఫున చర్య తీసుకోవడం, దేవుని తీర్పుల్ని అమలుచేయడం, మంచివార్తను ప్రకటించే పనికి మద్దతివ్వడం లాంటి ఎన్నో రకాల పనులు ఆయన వాళ్లకు అప్పగిస్తాడు. (2 రాజు 19:35; కీర్త 34:7; మత్త 4:11; లూకా 1:30, 31; ప్రక 5:11; 14:6) భవిష్యత్తులో హార్‌మెగిద్దోన్ యుద్ధమప్పుడు వాళ్లు యేసుకు మద్దతిస్తారు.—ప్రక 19:14, 15.
దేవుని రాజ్యం.
దేవుని సర్వాధిపత్యానికి ప్రాతినిధ్యం వహించే ఆయన కొడుకు ప్రభుత్వాన్ని, అంటే క్రీస్తుయేసు ప్రభుత్వాన్ని సూచించడానికి ఈ మాటను ముఖ్యంగా ఉపయోగించారు.—మత్త 12:28; లూకా 4:43; 1 కొరిం 15:50.
దైవభక్తి.
యెహోవా దేవుని సర్వాధిపత్యానికి నమ్మకంగా ఉంటూ ఆయన పట్ల చూపించే పూజ్యభావాన్ని, ఆయనకు చేసే ఆరాధనను, సేవను సూచిస్తుంది.—1 తిమో 4:8; 2 తిమో 3:12.
ద్యుపతి.
రకరకాల దేవతలను పూజించే గ్రీకుల ప్రధాన దేవుడు. లుస్త్రలో ప్రజలు బర్నబాను పొరపాటున ద్యుపతి అనుకున్నారు. లుస్త్రకు దగ్గర్లో దొరికిన ప్రాచీన చెక్కడాల్లో “ద్యుపతి యాజకులు,” “సూర్యదేవుడు ద్యుపతి” అనే మాటలు ఉన్నాయి. మెలితే అనే ద్వీపం నుండి పౌలు ప్రయాణించిన ఓడ మీద “ద్యుపతి కుమారులు” అనే చిహ్నం ఉంది; వీళ్లు కాస్టర్, పోలక్స్ అనే కవలలు.—అపొ 14:12; 28:11.
ద్రాక్షతొట్టి.
సహజ సున్నపురాయిలో రెండు తొట్లు (గుంతలు) తొలిచి వాటి మధ్య చిన్న దారి చేస్తారు. వాటిలో ఒకటి ఇంకోదాని కన్నా ఎత్తుగా ఉంటుంది. ఎత్తుగా ఉన్న తొట్టిలో ద్రాక్షల్ని తొక్కినప్పుడు ఆ రసం కింద ఉన్న తొట్టిలోకి వెళ్లేది. ఈ పదాన్ని దేవుని తీర్పును సూచించడానికి అలంకారార్థంగా ఉపయోగించారు.—ప్రక 19:15.
ధ
ధర్మశాస్త్రం.
సా.శ.పూ. 1513 లో సీనాయి అరణ్యంలో యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన మోషే ధర్మశాస్త్రాన్ని ఇది సూచిస్తుండవచ్చు. బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాల్ని తరచూ ధర్మశాస్త్రం అని పిలుస్తారు. (యెహో 23:6; లూకా 24:44; మత్త 7:12; గల 3:24) ధర్మశాస్త్రంలోని ఆయా నియమాల్ని లేదా ఒక నియమం వెనకున్న సూత్రాన్ని కూడా ఇది సూచించవచ్చు.—నిర్గ 18:20; ద్వితీ 4:8.
ధూపం.
సువాసన వెదజల్లే జిగురుల, తైలాల మిశ్రమం. ఇది మెల్లగా మండుతూ మంచి సువాసన వెదజల్లుతుంది. గుడారంలో, ఆ తర్వాత ఆలయంలో ఉపయోగించడం కోసం నాలుగు పదార్థాలున్న ఒక ప్రత్యేక ధూపాన్ని తయారుచేసేవాళ్లు. ప్రతీ ఉదయం, ప్రతీ రాత్రి పవిత్ర స్థలంలోని ధూపవేదిక మీద దీన్ని కాల్చేవాళ్లు; ప్రాయశ్చిత్త రోజున అతి పవిత్ర స్థలం లోపల దీన్ని కాల్చేవాళ్లు. దేవుడు అంగీకరించే నమ్మకమైన సేవకుల ప్రార్థనల్ని ఇది సూచిస్తుంది. క్రైస్తవులు ధూపం వేయాల్సిన అవసరం లేదు.—నిర్గ 30:34, 35; లేవీ 16:13; ప్రక 5:8.
ధూపపు పాత్రలు.
బంగారం, వెండి, లేదా రాగితో తయారుచేసిన పాత్రలు. వీటిని గుడారంలో, ఆలయంలో ధూపం వేయడానికి వాడేవాళ్లు. అలాగే బలిపీఠం మీద నుండి బొగ్గుల్ని, బంగారు దీపస్తంభం మీద నుండి కాలిపోయిన వత్తుల్ని తీసేయడానికి ఉపయోగించేవాళ్లు.—నిర్గ 37:23; 2 దిన 26:19; హెబ్రీ 9:4.
న
నగర పాలకులు.
రోమన్ల కాలనీల్లో, నగర పాలకులు ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాలు చూసుకునేవాళ్లు. శాంతిభద్రతలు కాపాడడం, ఆర్థిక వ్యవస్థను నియంత్రించడం, చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్లకు తీర్పు తీర్చడం, శిక్ష అమలు చేయమని ఆజ్ఞాపించడం వంటి పనులు వీళ్లు చేసేవాళ్లు.—అపొ 16:20.
నజరేయుడు.
యేసుకున్న ఓ పేరు. ఆయన నజరేతు పట్టణం నుండి వచ్చాడు కాబట్టి ఆ పేరు వచ్చింది. యెషయా 11:1 లోని “అంకురము” లేదా మొలక అనే పదాన్ని సూచించడానికి ఉపయోగించిన హీబ్రూ పదంతో దీనికి సంబంధం ఉండివుండవచ్చు. ఆ తర్వాత, యేసు అనుచరుల విషయంలో కూడా ఈ పదాన్ని ఉపయోగించారు.—మత్త 2:23; అపొ 24:5.
నపుంసకుడు.
అక్షరార్థంగా వృషణాలు తొలగించబడిన పురుషుడు అని అర్థం. సాధారణంగా అలాంటి పురుషులు రాజగృహాల్లో రాణులకు-ఉపపత్నులకు సేవకులుగా, సంరక్షకులుగా నియమించబడేవాళ్లు. అయితే ఈ పదం, అక్షరార్థమైన నపుంసకులనే (షండులనే) కాకుండా, రాజదర్బారులో విధులు నిర్వహించడానికి నియమించబడిన అధికారిని కూడా సూచిస్తుంది. బైబిల్లో ‘రాజ్యం కోసం నపుంసకుడు’ అనే మాట కూడా ఉంది. దేవుని సేవకు తనను తాను పూర్తిగా అంకితం చేసుకునేలా ఆత్మనిగ్రహం చూపించే వ్యక్తిని సూచించడానికి అలంకారికంగా దాన్ని వాడారు.—మత్త 19:12; ఎస్తే 2:15; అపొ 8:27, పాదసూచిక.
నీతి.
లేఖనాల్లో ఈ పదం, తప్పొప్పుల విషయంలో దేవుడు ఏర్పర్చిన ప్రమాణం ప్రకారం ఏది సరైనదో దాన్ని సూచిస్తోంది.—ఆది 15:6; ద్వితీ 6:25; జెఫ 2:3; మత్త 6:33.
నీసాను.
యూదుల పవిత్ర క్యాలెండర్‌లోని మొదటి నెల అయిన అబీబుకు ఇశ్రాయేలీయులు బబులోను చెర నుండి విడుదలైన తర్వాత వచ్చిన కొత్త పేరు. సాధారణ క్యాలెండర్‌లో అది ఏడో నెల. అది మార్చి నెల మధ్య నుండి ఏప్రిల్ నెల మధ్య వరకు ఉంటుంది. (నెహె 2:1) నీసాను 14న యూదులు పస్కా పండుగ చేసుకునేవాళ్లు, ఆ రోజే యేసుక్రీస్తు ప్రభువు రాత్రి భోజనాన్ని ప్రవేశపెట్టాడు. (లూకా 22:15, 19, 20) అదే రోజున, ఆయన హింసాకొయ్య మీద చంపబడ్డాడు.—లూకా 23:44-46.
నూర్చడం; కళ్లం.
ధాన్యపు గింజల్ని కాండం నుండి, పొట్టు నుండి వేరు చేయడాన్ని నూర్చడం అంటారు; అలా చేసే స్థలాన్ని కళ్లం అంటారు. ధాన్యాన్ని నూర్చడం కోసం కర్రతో కొట్టేవాళ్లు. ఒకవేళ ధాన్యం ఎక్కువగా ఉంటే జంతువులు లాగే కొయ్య మొద్దులు లేదా రోలర్ల లాంటి ప్రత్యేకమైన పరికరాలు ఉపయోగించేవాళ్లు. కళ్లంలో పరిచి ఉన్న ధాన్యం మీద ఆ పరికరాలను తిప్పేవాళ్లు. కళ్లం అనేది చదునుగా, వృత్తాకారంలో ఉంటుంది; అది సాధారణంగా గాలి బాగా వీచే ఎత్తైన స్థలంలో ఉంటుంది.—లేవీ 26:5; యెష 41:15; మత్త 3:12.
న్యాయపీఠం.
సాధారణంగా ఆరుబయట ఎత్తుగా ఉండే ఒక వేదిక. అక్కడికి మెట్లు ఎక్కి చేరుకోవాల్సి ఉంటుంది. దాని మీద కూర్చొని అధికారులు ప్రజల గుంపును ఉద్దేశించి మాట్లాడతారు లేదా తమ నిర్ణయాలను ప్రకటిస్తారు. “దేవుని న్యాయపీఠం,” “క్రీస్తు న్యాయపీఠం” అనే పదాలు మనుష్యులకు తీర్పుతీర్చడానికి యెహోవా చేసిన ఏర్పాటును సూచిస్తున్నాయి.—రోమా 14:10; 2 కొరిం 5:10; యోహా 19:13.
న్యూమా.
ఇది గ్రీకు పదం. హీబ్రూలో రూ-ఆహ్. చాలా తెలుగు బైబిళ్లలో ఈ పదాలు ఆత్మ అని అనువదించబడ్డాయి. కానీ అలా అనువదించడం సరైనది కాదు. ఎందుకంటే అది అమర్త్యమైన ఆత్మ అనే తప్పుడు సిద్ధాంతానికి మద్దతిస్తుంది. (కీర్త 146:4) రూ-ఆహ్, న్యూమా అనే పదాల ప్రాథమిక అర్థం, “ఊపిరి.” ఆ పదాలకు (1) గాలి, (2) భూమ్మీది ప్రాణుల్లో చురుగ్గా ఉండే జీవశక్తి, (3) ఒక వ్యక్తి అలంకారార్థ హృదయంలో పుట్టి ఫలానా విధంగా మాట్లాడేలా లేదా పనిచేసేలా ప్రేరేపించే శక్తి, (4) అదృశ్య మూలం నుండి వచ్చే ప్రేరేపిత సందేశాలు, (5) పరలోక ప్రాణులు, (6) దేవుని చురుకైన శక్తి లేదా పవిత్రశక్తి అనే అర్థాలు కూడా ఉన్నాయి. (నిర్గ 35:21; కీర్త 104:29; మత్త 12:43; లూకా 11:13) కాబట్టి ఈ అనువాదంలో ఆ పదాలు సందర్భానికి తగినట్టు అనువదించబడ్డాయి.
ప
పదోవంతు.
ముఖ్యంగా మతసంబంధ పనుల కోసం కప్పంలా చెల్లించే పదోభాగం లేదా 10 శాతం. (మలా 3:10; ద్వితీ 26:12; మత్త 23:23; హెబ్రీ 7:5) మోషే ధర్మశాస్త్రం ప్రకారం, ఇశ్రాయేలీయులు ప్రతీ సంవత్సరం తమ పంటలో పదోవంతును, అలాగే పశువుల, గొర్రెల, మేకల మందలు వృద్ధి చెందినప్పుడు వాటిలో పదోవంతును లేవీయులకు సహాయంగా ఇచ్చేవాళ్లు. లేవీయులు ఆ పదోవంతులో పదోవంతును అహరోను వంశంలోని యాజక బృందానికి సహాయంగా ఉండడం కోసం వాళ్లకు ఇచ్చేవాళ్లు. ఇవే కాకుండా వేరే పదోవంతులు కూడా ఉండేవి. అయితే క్రైస్తవులు పదోవంతు చెల్లించాల్సిన అవసరం లేదు.
పరదైసు.
అందమైన ఉద్యానవనం, లేదా ఉద్యానవనం లాంటి తోట. అలాంటిది మొదట ఏదెనులో ఉండేది. యెహోవా దాన్ని మొదటి మానవ జంట కోసం చేశాడు. యేసు హింసాకొయ్యపై ఉన్నప్పుడు, తన పక్కనున్న ఒక నేరస్తునితో మాట్లాడుతూ భూమి పరదైసుగా మారుతుందని సూచించాడు. 2 కొరింథీయులు 12:4 లో ఉన్న “పరదైసు” భవిష్యత్తు పరదైసును, ప్రకటన 2:7 లో ఉన్న “పరదైసు” పరలోక పరదైసును సూచిస్తుందని స్పష్టమౌతుంది.—లూకా 23:43.
పరిసయ్యులు.
సా.శ. మొదటి శతాబ్దంలో యూదామతానికి చెందిన ఓ ప్రముఖ తెగ. యాజక వంశస్థులు కాకపోయినా, చిన్న పొల్లు కూడా పోకుండా ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా పాటించేవాళ్లు. మౌఖిక ఆచారాలకు కూడా వాళ్లు అంతే ప్రాముఖ్యతను ఇచ్చేవాళ్లు. (మత్త 23:23) గ్రీకు సంస్కృతి ప్రభావాన్ని వాళ్లు వ్యతిరేకించేవాళ్లు. ధర్మశాస్త్ర పండితులుగా, సంప్రదాయాల విద్వాంసులుగా వాళ్లకు ప్రజలమీద ఎంతో అధికారం ఉండేది. (మత్త 23:2-6) వాళ్లలో కొంతమంది మహాసభలో సభ్యులుగా కూడా ఉండేవాళ్లు. విశ్రాంతి రోజును ఆచరించడం, సంప్రదాయాలు పాటించడం, పాపులతో-సుంకరులతో సహవసించడం వంటి విషయాల్లో వాళ్లు యేసును తరచూ వ్యతిరేకించారు. వాళ్లలో కొంతమంది క్రైస్తవులయ్యారు, అందులో తార్సుకు చెందిన సౌలు కూడా ఉన్నాడు.—మత్త 9:11; 12:14; మార్కు 7:5; లూకా 6:2; అపొ 26:5.
పర్యవేక్షకుడు.
సంఘాన్ని చూసుకుంటూ, దాన్ని కాసే ముఖ్యమైన బాధ్యత ఉన్న ఒక పురుషుడు. ఎపిస్కోపొస్ అనే గ్రీకు పదంలో సంరక్షణతో కూడిన పర్యవేక్షణ అనే ప్రాథమిక అర్థం ఉంది. “పర్యవేక్షకుడు,” “పెద్ద” (ప్రెస్బైటిరోస్) అనే పదాలు క్రైస్తవ సంఘంలో ఒకే స్థానాన్ని సూచిస్తున్నాయి. “పెద్ద” అనే పదం నియమితుడైన వ్యక్తిలోని పరిణతితో కూడిన లక్షణాల్ని సూచిస్తుంది. “పర్యవేక్షకుడు” అనే పదం ఆ నియామకంలో ఉన్న విధుల్ని నొక్కి చెప్తుంది.—అపొ 20:28; 1 తిమో 3:2-7; 1 పేతు 5:2.
పవిత్ర రహస్యం.
దేవుని సంకల్పంలో ఒక అంశం. దీనికి దేవుడే మూలం. ఆయన అనుకున్న సమయం వచ్చేంత వరకు దాన్ని తన దగ్గరే ఉంచుకుంటాడు. ఆయన ఎవరికి తెలియజేయాలని అనుకుంటాడో వాళ్లకు మాత్రమే దాన్ని తెలియజేస్తాడు.—మార్కు 4:11; కొలొ 1:26.
పవిత్ర స్థలం.
గుడారంలో, ఆ తర్వాత ఆలయంలో మొట్టమొదటి పెద్ద గది; చాలా లోపలి భాగమైన అతి పవిత్ర స్థలానికి వేరుగా ఉండే భాగం. గుడారంలోని పవిత్ర స్థలంలో బంగారు దీపస్తంభం, బంగారు ధూపవేదిక, సముఖపు రొట్టెల బల్ల, బంగారు పాత్రలు ఉండేవి; ఆ తర్వాతి ఆలయంలో అయితే బంగారు బలిపీఠం, పది బంగారు దీపస్తంభాలు, సముఖపు రొట్టెలున్న పది బల్లలు ఉండేవి.—నిర్గ 26:33; హెబ్రీ 9:2.
పవిత్రమైన; పవిత్రత.
యెహోవాకు స్వతహాగా ఉన్న లక్షణం; పూర్తిస్థాయిలో నైతిక స్వచ్ఛతను, పరిశుద్ధతను కలిగివుండే స్థితి. (నిర్గ 28:36; 1 సమూ 2:2; యోహా 17:11) మనుషులకు (మార్కు 6:20; అపొ 3:21), వస్తువులకు (రోమా 7:12; 11:16; 2 తిమో 3:15), స్థలాలకు (మత్త 4:5; అపొ 7:33; హెబ్రీ 9:1), పనులకు (నిర్గ 36:4) సంబంధించి ఉపయోగించినప్పుడు హీబ్రూ, గ్రీకు భాషల్లోని పదాలు పవిత్రుడైన దేవుని కోసం వేరుగా ఉండడాన్ని లేదా శుద్ధీకరించబడడాన్ని సూచిస్తాయి; అంటే యెహోవా సేవ కోసం ప్రత్యేకించబడిన స్థితిని సూచిస్తాయి. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, “పవిత్రమైన,” “పవిత్రత” అని అనువదించబడిన పదాల్ని, ఒక వ్యక్తి ప్రవర్తనలో స్వచ్ఛతను సూచించడానికి కూడా ఉపయోగించారు.—2 కొరిం 7:1; 1 పేతు 1:15, 16.
పవిత్రశక్తి.
దేవుడు తన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఉపయోగించే శక్తి. ఇది బలాన్నిచ్చే అదృశ్యమైన శక్తి. అత్యున్నత స్థాయిలో పవిత్రుడు, నీతిమంతుడు అయిన యెహోవా నుండి వస్తుంది కాబట్టి, పవిత్రమైన దాన్ని నెరవేర్చడానికి దేవుడు దాన్ని ఉపయోగిస్తాడు కాబట్టి అది పవిత్రమైనది.—లూకా 1:35; అపొ 1:8.
పశ్చాత్తాపం.
బైబిలు వాడుకలో ఈ పదం, గత జీవిత విధానం విషయంలో, తప్పుల విషయంలో, చేయలేకపోయిన వాటి విషయంలో హృదయపూర్వకంగా బాధపడుతూ మనసు మార్చుకోవడాన్ని సూచిస్తుంది. నిజమైన పశ్చాత్తాపం ఒక వ్యక్తి పనుల్లో కనిపిస్తుంది, అది అతను తన ప్రవర్తనా తీరును మార్చుకునేలా చేస్తుంది.—మత్త 3:8; అపొ 3:19; 2 పేతు 3:9.
పస్కా.
ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు పొందిన విడుదలకు గుర్తుగా ప్రతీ సంవత్సరం అబీబు నెల (ఆ తర్వాత నీసాను నెల అని పిలిచారు) 14వ రోజున చేసుకునే పండుగ. ఆ పండుగలో గొర్రెపిల్లను (లేదా మేకను) వధించి, కాల్చేవాళ్లు. తర్వాత దాన్ని చేదు ఆకుకూరలతో, పులవని రొట్టెతో తినేవాళ్లు.—నిర్గ 12:27; యోహా 6:4; 1 కొరిం 5:7.
పానీయ అర్పణ.
ద్రాక్షారసాన్ని బలిపీఠం మీద పోసి అర్పించడం; దీన్ని ఇతర అనేక బలులతో పాటు అర్పించేవాళ్లు. తోటి క్రైస్తవుల కోసం తన శక్తినంతా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేందుకు పౌలు ఈ పదాన్ని అలంకారిక భావంలో వాడాడు.—సంఖ్యా 15:5, 7; ఫిలి 2:17.
పాపపరిహారార్థ బలి.
ఉద్దేశపూర్వకంగా కాకుండా అపరిపూర్ణ శరీర బలహీనత వల్ల చేసిన పాపం విషయంలో అర్పించే బలి. పాపం చేసిన వ్యక్తి స్థాయిని బట్టి, పరిస్థితులను బట్టి ఎద్దు నుండి పావురం వరకు ఆయా జంతువుల్ని ప్రాయశ్చిత్తంగా అర్పించేవాళ్లు.—లేవీ 4:27, 29; హెబ్రీ 10:8.
పునరుత్థానం.
చనిపోయిన స్థితి నుండి లేవడం, తిరిగి బ్రతకడం. గ్రీకులో దీనికి వాడిన అనేస్టసిస్ అనే పదానికి అక్షరార్థంగా “లేపడం; నిలబడడం” అని అర్థం. యెహోవా దేవుడు చేసిన యేసు పునరుత్థానంతో కలుపుకొని బైబిల్లో తొమ్మిది పునరుత్థానాల ప్రస్తావన ఉంది. అయితే ఏలీయా, ఎలీషా, యేసు, పేతురు, పౌలు పునరుత్థానాలు చేసినప్పటికీ, వాళ్లు ఆ అద్భుతాలన్నీ దేవుని శక్తితోనే చేసినట్టు స్పష్టంగా చెప్పబడింది. భూమ్మీద జరిగే ‘నీతిమంతుల, అనీతిమంతుల’ పునరుత్థానానికి దేవుని సంకల్పంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. (అపొ 24:15) బైబిల్లో పరలోక పునరుత్థానం గురించి కూడా ఉంది. బైబిలు దాన్ని “మొదటి పునరుత్థానం” అని అంటుంది. ఆ పునరుత్థానం, పవిత్రశక్తితో అభిషేకించబడిన యేసు సోదరులకు సంబంధించినది.—ఫిలి 3:11; ప్రక 20:5, 6; యోహా 5:28, 29; 11:25.
పులవని రొట్టెల పండుగ.
ప్రతీ సంవత్సరం ఇశ్రాయేలీయులు చేసుకునే మూడు పెద్ద పండుగల్లో ఇది మొదటిది. ఇది పస్కా పండుగ తర్వాతి రోజున అంటే నీసాను 15న మొదలై ఏడు రోజులపాటు కొనసాగేది. ఐగుప్తు నుండి కలిగిన విడుదలకు గుర్తుగా, ఈ పండుగలో కేవలం పులవని రొట్టెలు మాత్రమే తినాలి.—నిర్గ 23:15; మార్కు 14:1.
పులిసిన పిండి.
పిండిముద్ద లేదా పానీయాలు పులవడానికి కలిపే పదార్థం; ముఖ్యంగా అంతకుముందు ఉపయోగించిన పులిసిన ముద్దలో నుండి పక్కకు పెట్టిన కొంత భాగం. ఈ పదాన్ని బైబిల్లో ఎక్కువగా పాపాన్ని, అవినీతిని సూచించడానికి ఉపయోగించారు. అయితే, బయటికి కనిపించకుండా లోలోపల పెరుగుతూ వ్యాప్తిచెందడాన్ని సూచించడానికి కూడా ఈ పదాన్ని ఉపయోగించారు.—నిర్గ 12:20; మత్త 13:33; గల 5:9.
పెంతెకొస్తు.
యూదా పురుషులందరూ తప్పనిసరిగా యెరూషలేములో జరుపుకోవాల్సిన మూడు పెద్ద పండుగల్లో ఇది రెండవది. పెంతెకొస్తు అంటే “యాభైయవ (రోజు)” అని అర్థం; హీబ్రూ లేఖనాల్లో కోత పండుగ లేదా వారముల పండుగ అనే పేర్లతో ఉన్న పండుగను క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో పెంతెకొస్తు పండుగ అని ప్రస్తావించారు. నీసాను 16 నుండి లెక్కించి 50వ రోజున దీన్ని చేసుకునేవాళ్లు.—నిర్గ 23:16; 34:22; అపొ 2:1.
పెద్ద; వృద్ధుడు.
ఇది వయసు పైబడిన వాళ్లను సూచించే పదమే అయినా, లేఖనాల్లో ప్రాథమికంగా ఈ పదాన్ని సమాజంలో గానీ దేశంలో గానీ అధికార స్థానంలో, బాధ్యతాయుత స్థానంలో ఉన్నవాళ్లను సూచించడానికి ఉపయోగించారు. ప్రకటన గ్రంథంలో పరలోక ప్రాణుల్ని సూచించడానికి కూడా ఈ పదాన్ని వాడారు. ప్రెస్బైటిరోస్ అనే గ్రీకు పదాన్ని సంఘంలో నాయకత్వం వహించే బాధ్యత ఉన్నవాళ్లను సూచించడానికి ఉపయోగించినప్పుడు దాన్ని “పెద్ద” అని అనువదించారు.—నిర్గ 4:29; సామె 31:23; 1 తిమో 5:17; ప్రక 4:4.
పొట్టు.
నూర్చేటప్పుడు, తూర్పారబట్టేటప్పుడు ధాన్యం నుండి వేరైపోయే ఊక లేదా పైపొర. పనికిరాని దాన్ని, అవసరంలేని దాన్ని సూచించడానికి వాడిన ఒక పదచిత్రం ఇది.—కీర్త 1:4; మత్త 3:12.
పోర్నియా.
—లైంగిక పాపాలు చూడండి.
ప్రత్యక్షత.
క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఈ పదం కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు రాజరిక ప్రత్యక్షతను సూచిస్తుంది. ఆ ప్రత్యక్షత ఈ వ్యవస్థ చివరి రోజుల్లో మెస్సీయ రాజ్యానికి రాజుగా యేసుక్రీస్తు అదృశ్యంగా సింహాసనాన్ని అధిష్ఠించినప్పటి నుండి మొదలైంది. క్రీస్తు ప్రత్యక్షత అనేది ఇలా వచ్చి అలా వెళ్లిపోయేది కాదు; బదులుగా అది ఒక ప్రత్యేకమైన కాలమంతటినీ సూచిస్తుంది.—మత్త 24:3.
ప్రథమఫలం.
కోతకాలంలో మొట్టమొదట వచ్చే పంట; దేనికైనా వచ్చే మొదటి ఫలితం లేదా ఉత్పత్తి. మనుషుల్లోనే గానీ, జంతువుల్లోనే గానీ, లేదా పంటల్లోనే గానీ ప్రథమఫలాన్ని తనకు అర్పించాలని యెహోవా ఇశ్రాయేలీయుల్ని ఆజ్ఞాపించాడు. పులవని రొట్టెల పండుగ రోజున, పెంతెకొస్తు పండుగ రోజున ఇశ్రాయేలీయులందరూ తమ ప్రథమఫలాన్ని దేవునికి అర్పించేవాళ్లు. క్రీస్తు, ఆయన అభిషిక్త అనుచరుల విషయంలో కూడా “ప్రథమఫలం” అనే మాటను అలంకారికంగా ఉపయోగించారు.—1 కొరిం 15:23; సంఖ్యాకాండం 15:21; సామె 3:9; ప్రక 14:4.
ప్రధానదూత.
ఈ పదానికి, “దేవదూతల్లో ముఖ్యుడు” అని అర్థం. ఈ అర్థాన్నీ, అలాగే “ప్రధానదూత” అనే మాటను బైబిల్లో ఏకవచనంలో మాత్రమే ఉపయోగించారనే వాస్తవాన్నీ గమనిస్తే కేవలం ఒకేఒక్క ప్రధానదూత ఉన్నాడని అర్థమౌతుంది. ఆ ప్రధానదూత పేరు మిఖాయేలు అని బైబిలు చెప్తోంది.—దాని 12:1; యూదా 9; ప్రక 12:7.
ప్రధానయాజకుడు.
మోషే ధర్మశాస్త్రం ప్రకారం, దేవుని ముందు ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ముఖ్యమైన యాజకుడు. ఇతను వేరే యాజకుల్ని పర్యవేక్షించేవాడు కూడా. గుడారంలో, ఆ తర్వాత ఆలయంలో చాలా లోపలికి ఉన్న భాగమైన అతి పవిత్ర స్థలంలోకి ప్రవేశించడానికి ఇతనికి మాత్రమే అనుమతి ఉండేది. ఇతను సంవత్సరానికి ఒకసారి వచ్చే ప్రాయశ్చిత్త రోజున మాత్రమే అందులోకి వెళ్లేవాడు. “ప్రధానయాజకుడు” అనే మాటను యేసుక్రీస్తుకు కూడా అన్వయించారు.—లేవీ 16:2, 17; 21:10; మత్త 26:3; హెబ్రీ 4:14.
ప్రభువు రాత్రి భోజనం.
క్రీస్తు శరీరానికి, రక్తానికి సూచనలుగా ఉన్న పులవని రొట్టె, ద్రాక్షారసం ఉన్న ఒక అక్షరార్థ భోజనం; యేసు మరణానికి జ్ఞాపకార్థంగా దీన్ని చేస్తారు. లేఖనాల ప్రకారం క్రైస్తవులు దీన్ని తప్పనిసరిగా ఆచరించాలి కాబట్టి, “జ్ఞాపకార్థ ఆచరణ” అనే పేరు కూడా దీనికి సరిగ్గా సరిపోతుంది.—1 కొరిం 11:20, 23-26.
ప్రవచనం.
ఓ ప్రేరేపిత సందేశం. ఇది దేవుని ఇష్టాన్ని వెల్లడిచేయడం కావచ్చు లేదా ప్రకటించడం కావచ్చు. ప్రవచనం అనేది ప్రేరేపిత నైతిక బోధ కావచ్చు, దేవుని ఆజ్ఞను లేదా తీర్పును తెలిపే మాటలు కావచ్చు, లేదా రాబోయే దాని గురించిన ప్రకటన కావచ్చు.—మత్త 13:14; 2 పేతు 1:20, 21.
ప్రాంగణం.
గుడారం చుట్టూ కంచె లోపల ఉన్న ఖాళీ స్థలం; ఆ తర్వాతి కాలంలో, ఆలయ ముఖ్య భవనం చుట్టూ ప్రహరి గోడ లోపల ఉన్న ఖాళీ స్థలం. దహన బలులు అర్పించే బలిపీఠం గుడారపు ప్రాంగణంలో లేదా ఆవరణంలో ఉండేది; ఆలయంలో అయితే అది లోపలి ప్రాంగణంలో ఉండేది. కొన్ని ఇళ్ల గురించి, రాజభవనాల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా బైబిలు ప్రాంగణాల గురించి ప్రస్తావిస్తుంది.—నిర్గ 8:13; 27:9; 1 రాజు 7:12; మత్త 26:3; మార్కు 15:16; ప్రక 11:2.
ప్రాణం.
మూలభాషలోని చాలా పదాలు “ప్రాణం” అని అనువదించబడ్డాయి. వాటిలో నెఫెష్ అనే హీబ్రూ పదం, సైఖే అనే గ్రీకు పదం కూడా ఉన్నాయి. ఈ అనువాదంలో ఈ పదాలు ఎక్కువగా “ప్రాణం” అని అనువదించబడ్డాయి. బైబిల్లో ఈ పదాల్ని ఉపయోగించిన తీరును పరిశీలిస్తే, ఇవి ప్రాథమికంగా (1) మనుషుల్ని, (2) జంతువుల్ని లేదా (3) ఒక వ్యక్తికి లేదా జంతువుకు ఉన్న ప్రాణాన్ని సూచిస్తున్నాయని అర్థమౌతుంది. (ఆది 1:20; 2:7; సంఖ్యాకాండం 31:28; 1 పేతు 3:20) ఈ అనువాదంలో, ఆ మూలభాష పదాల్ని ఎక్కువగా ఆయా సందర్భాల్లో వాటికున్న అర్థానికి తగినట్లు “ప్రాణం,” “ప్రాణి,” “వ్యక్తి,” “పూర్తి వ్యక్తి” అని గానీ లేదా సర్వనామంగా (ఉదాహరణకు, “నేను”) అని గానీ అనువదించారు. కొన్ని లేఖనాల్లో నెఫెష్, సైఖే అనే పదాలు “నీ నిండు ప్రాణంతో” అని అనువదించబడ్డాయి; అంటే దేన్నైనా నిండు హృదయంతో చేయడమని అర్థం. (ద్వితీ 6:5; మత్త 22:37) కొన్ని సందర్భాల్లో, ఈ మూలభాష పదాల్ని ఒక జీవి కోరికను లేదా ఆకలిని సూచించడానికి ఉపయోగించవచ్చు. ఈ పదాలు చనిపోయిన వ్యక్తిని లేదా శవాన్ని కూడా సూచించవచ్చు.—సంఖ్యా 6:6; సామె 23:2; యెష 56:11; హగ్గ 2:13.
ప్రాయశ్చిత్త రోజు.
ఇది ఇశ్రాయేలీయుల పవిత్రమైన రోజుల్లో అత్యంత ప్రాముఖ్యమైనది. దీన్ని యోమ్ కిప్పూర్ (“కప్పేసే రోజు” అనే అర్థం ఉన్న యోమ్ హక్కిప్పురిమ్ అనే హీబ్రూ పదం నుండి వచ్చింది) అని కూడా పిలిచేవాళ్లు. ఇది ఏతనీము నెలలో 10వ తారీఖున వచ్చేది. హీబ్రూ లేఖనాల్లో, ఇది ప్రాయశ్చిత్తార్థ దినము అని పిలవబడింది. సంవత్సరంలో కేవలం ఈ రోజున మాత్రమే ప్రధానయాజకుడు తన పాపాల కోసం, ఇతర లేవీయుల పాపాల కోసం, ప్రజల పాపాల కోసం బలుల రక్తాన్ని అర్పించడానికి గుడారంలోని అతి పవిత్ర స్థలంలోకి ప్రవేశించేవాడు. ఆ బలులు యేసు బలిని సూచించాయి. యేసు అర్పించిన బలి అన్నికాలాలకు సరిపోయేలా ఒక్కసారే మనుషుల పాపాలకు పూర్తిగా ప్రాయశ్చిత్తం చేసింది. అలా అది యెహోవాతో మళ్లీ శాంతియుత సంబంధం నెలకొల్పుకొనే అవకాశాన్ని ప్రజలకు ఇచ్చింది. అది పవిత్ర సమావేశం జరిగే సమయం, ప్రజలు ఉపవాసం ఉండే సమయం. అంతేకాదు అది, సాధారణంగా రోజూ చేసే పనికి దూరంగా ఉండాల్సిన విశ్రాంతి రోజు కూడా.—లేవీ 23:27, 28; అపొ 27:9; కొలొ 1:20; హెబ్రీ 9:12.
ప్రేతోర్య సైనికులు.
రోమా చక్రవర్తికి అంగరక్షకులుగా ఉండడానికి నియమితులైన రోమా సైనికుల గుంపు. తర్వాత్తర్వాత ఈ సైనికులు చక్రవర్తికి మద్దతివ్వగల లేదా అతన్ని ఆ స్థానం నుండి తీసేయగల బలమైన రాజకీయ శక్తిగా మారారు.—ఫిలి 1:13.
ఫ
ఫరో.
ఐగుప్తు రాజులకు ఇవ్వబడిన బిరుదు. బైబిల్లో ఐదుగురు ఫరోల పేర్లు ఉన్నాయి (షీషకు, సో, తిర్హాకా, నెకో, హొఫ్ర). కానీ మిగతా ఫరోల పేర్లు బైబిల్లో లేవు. వాళ్లలో అబ్రాహాము, మోషే, యోసేపులతో అనేకసార్లు వ్యవహరించిన ఫరోలు కూడా ఉన్నారు.—నిర్గ 15:4; రోమా 9:17.
బ
బయలు.
కనానీయుల దేవత. బయలును ఆకాశానికి యజమానిగా, వర్షాలు ఇచ్చే, సంతాన సాఫల్యాన్ని కలుగజేసే దేవతగా కొలిచేవాళ్లు. స్థానికంగా కొలిచే చిన్న దేవతలకు కూడా “బయలు” అనే పేరు వాడేవాళ్లు. దీనికి ఉపయోగించిన హీబ్రూ పదానికి “యజమాని” అని అర్థం.—1 రాజు 18:21; రోమా 11:4.
బయెల్జెబూలు.
ఇది చెడ్డదూతల రాజైన లేదా పరిపాలకుడైన సాతానుకు ఉపయోగించిన ఒక బిరుదు. ఎక్రోనులో ఫిలిష్తీయులు పూజించిన బయలు-జెబూబు అనే బయలు దేవత పేరే బహుశా ఇలా మారివుంటుంది.—2 రాజు 1:3; మత్త 12:24.
బలి.
దేవుని పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేయడానికి, తప్పును ఒప్పుకోవడానికి, ఆయనతో మంచి సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకోవడానికి గుర్తుగా ఆయనకు సమర్పించే అర్పణ. మోషే ధర్మశాస్త్ర ఒప్పందం దీన్ని ఆజ్ఞగా చేసేంతవరకు, హేబెలు మొదలుకొని మనుషులు రకరకాల బలుల్ని ఇష్టపూర్వకంగా అర్పించారు. వాటిలో జంతు బలులు కూడా ఉండేవి. యేసు తన ప్రాణాన్ని ఓ పరిపూర్ణ బలిగా అర్పించిన తర్వాత, ఇక జంతు బలులు అర్పించాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే క్రైస్తవులు దేవునికి ఆధ్యాత్మిక బలుల్ని అర్పిస్తూనే ఉంటారు.—ఆది 4:4; హెబ్రీ 13:15, 16; 1 యోహా 4:10.
బలిపీఠం.
మట్టితో, రాళ్లతో, బండరాయితో లేదా చెక్కతో తయారుచేసిన ఓ నిర్మాణం లేదా వేదిక. దానికి లోహపు తొడుగు ఉండేది, అది నేలకు కాస్త ఎత్తులో ఉండేది. ఆరాధనలో భాగంగా, దానిమీద బలుల్ని, ధూపాన్ని అర్పించేవాళ్లు. గుడారంలోని, ఆలయంలోని మొదటి గదిలో ధూపం వేయడానికి ఓ చిన్న బంగారు బలిపీఠం లేదా వేదిక ఉండేది. దీన్ని చెక్కతో తయారుచేసేవాళ్లు, పైన బంగారు తొడుగు ఉండేది. దీనికన్నా పెద్దగా ఉండే రాగి బలిపీఠం బయటి ప్రాంగణంలో ఉండేది. దీనిమీద దహన బలులు అర్పించేవాళ్లు. అయితే అబద్ధ ఆరాధనలో కూడా బలిపీఠాలు ఉపయోగించేవాళ్లు.—నిర్గ 39:38, 39; 1 రాజు 6:20; మత్త 5:23, 24; లూకా 1:11; అపొ 17:23.
బలిపీఠపు కొమ్ములు.
కొన్ని బలిపీఠాలకు వాటి నాలుగు మూలల్లో బయటికి పొడుచుకొచ్చినట్టుగా ఉండే కొమ్ములాంటి ఆకారాలు.—లేవీ 8:15; 1 రాజు 2:28; ప్రక 9:13.
బాకా.
లోహంతో చేసిన ఊదే పరికరం. దీన్ని సంకేతాలు ఇవ్వడం కోసం, సంగీతం కోసం ఉపయోగిస్తారు. తరచూ బాకాల శబ్దంతో పాటు అలంకారార్థంగా యెహోవా తీర్పుల ప్రకటన లేదా దేవుడు జరిగించే ఇతర ముఖ్యమైన సంఘటనలు ఉంటాయి.—1 కొరిం 15:52; ప్రక 8:7–11:15.
బాప్తిస్మం; బాప్తిస్మం ఇవ్వడం.
దీని క్రియాపదానికి “ముంచడం” అని, అంటే నీళ్లలో ముంచడం అని అర్థం. తన అనుచరులు బాప్తిస్మం తీసుకోవడం తప్పనిసరి అని యేసు చెప్పాడు. లేఖనాల్లో యోహాను బాప్తిస్మం, పవిత్రశక్తితో బాప్తిస్మం, అగ్నితో బాప్తిస్మం గురించిన ప్రస్తావన, అలాగే ఇతర బాప్తిస్మాల గురించిన ప్రస్తావన కూడా ఉంది.—మత్త 3:11, 16; 28:19; యోహా 3:23; 1 పేతు 3:21.
బొండ.
శిక్షించడం కోసం నిర్బంధించడానికి ఉపయోగించే పరికరం. కొన్ని పరికరాలు పాదాలను మాత్రమే నిర్బంధించేవి. ఇంకొన్ని బహుశా పాదాల్ని, చేతుల్ని, మెడని నిర్బంధించి శరీరాన్ని వంకరగా పట్టి ఉంచేవి.—యిర్మీ 20:2; అపొ 16:24.
బోళం.
దీన్ని ఒక రకమైన ముళ్లపొద నుండి లేదా కామ్మీఫోరా జాతికి చెందిన చిన్న చెట్ల నుండి సేకరిస్తారు. ఇది సువాసనను ఇచ్చే జిగురు పదార్థం. ప్రతిష్ఠాభిషేక తైలం తయారుచేస్తున్నప్పుడు ఈ బోళాన్ని (గోపరసాన్ని) కూడా కలిపేవాళ్లు. బట్టలు లేదా పరుపుల వంటివాటికి సువాసన తెప్పించడానికి దీన్ని వాడేవాళ్లు; మర్దన (మసాజ్) కోసం వాడే నూనెలో, శరీరానికి పూసేవాటిలో దీన్ని కలిపేవాళ్లు. విపరీతమైన మత్తు కలిగించే పానీయం తయారుచేయడానికి దీన్ని ద్రాక్షారసంలో కలిపేవాళ్లు. సమాధి చేసేందుకు శరీరాల్ని సిద్ధం చేయడానికి కూడా బోళం వాడేవాళ్లు.—నిర్గ 30:23; సామె 7:17; మార్కు 15:23; యోహా 19:39.
మ
మంచివార్త.
దేవుని రాజ్యం గురించిన మంచివార్తను, యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం వల్ల కలిగే రక్షణ గురించిన మంచివార్తను సూచించడానికి వాడిన పదం.—లూకా 4:18, 43; అపొ 5:42; ప్రక 14:6.
మంత్రగాడు.
చెడ్డదూతల నుండి వచ్చే శక్తిని ఉపయోగించేవాడు. ఆ శక్తి చెడ్డదూతల నుండి వస్తుందని ప్రజలు సాధారణంగా అంగీకరిస్తారు.—అపొ 13:6.
మంత్రవిద్య.
భౌతిక శరీరం చనిపోయినప్పుడు ఆత్మలు బ్రతికే ఉంటాయనే, అవి బ్రతికివున్న వాళ్లతో మాట్లాడగలవనే, మాట్లాడతాయనే నమ్మకం; ముఖ్యంగా వాటి ప్రభావానికి తేలిగ్గా లొంగిపోయే వ్యక్తి (మాధ్యమం) ద్వారా అలా మాట్లాడతాయని నమ్ముతుంటారు. “మంత్రతంత్రాలు చేయడం” అనేదానికి ఉపయోగించిన గ్రీకు పదం ఫార్మాకియా. దానికి అక్షరార్థంగా “మాదకద్రవ్యాలు ఉపయోగించడం” అని అర్థం. పూర్వకాలంలో క్షుద్రపూజలు చేసేటప్పుడు చెడ్డదూతల శక్తిని ఆహ్వానించడానికి మాదకద్రవ్యాలు ఉపయోగించేవాళ్లు కాబట్టి ఈ పదాన్ని మంత్రవిద్యతో ముడిపెట్టడం మొదలైంది.—గల 5:20; ప్రక 21:8.
మతభ్రష్టత్వం.
గ్రీకు భాషలో ఉపయోగించిన పదం (అపొస్టసైయా) అక్షరార్థంగా “దూరంగా నిలబడు” అనే అర్థం ఉన్న క్రియాపదం నుండి వచ్చింది. దాని నామవాచక పదానికి “వదిలేయడం, విడిచిపెట్టడం, లేదా తిరుగుబాటు” అనే అర్థాలు ఉన్నాయి. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, “మతభ్రష్టత్వం” అనే పదాన్ని ముఖ్యంగా సత్యారాధనను వదిలేసినవాళ్లను సూచించడానికి వాడారు.—అపొ 21:21, పాదసూచిక; 2 థెస్స 2:3.
మధ్యవర్తి.
రెండు పక్షాల మధ్య రాజీ కుదిర్చేందుకు మధ్యవర్తిత్వం వహించే వ్యక్తి. లేఖనాల్లో ధర్మశాస్త్ర ఒప్పందానికి మోషే, కొత్త ఒప్పందానికి యేసు మధ్యవర్తులుగా ఉన్నారు.—గల 3:19; 1 తిమో 2:5; హెబ్రీ 12:24.
మన్నా.
ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నప్పుడు తిన్న ముఖ్య ఆహారం. యెహోవాయే దాన్ని వాళ్లకు ఇచ్చాడు. అది విశ్రాంతి రోజున తప్ప ప్రతీరోజు అద్భుతరీతిలో నేలమీద కనిపించేది. దానిమీద మంచు పొర కప్పబడి ఉండేది. ఇశ్రాయేలీయులు మొదటిసారి దాన్ని చూసినప్పుడు, “ఇదేమి?” లేదా హీబ్రూలో “మ్యాన్ హు?” అని అడిగారు. (నిర్గ 16:13-15, 35) యేసు కూడా మన్నాను అలంకారికంగా ప్రస్తావించాడు.—యోహా 6:49, 50.
మహాశ్రమ.
“శ్రమ” అనే పదానికి గ్రీకులో వాడిన పదం, పరిస్థితులు సృష్టించే ఒత్తిళ్ల వల్ల కలిగే వేదన లేదా బాధ అనే అర్థాన్నిస్తుంది. ముందెప్పుడూ రాని “మహాశ్రమ” గురించి యేసు మాట్లాడాడు. అంటే యెరూషలేము మీదికి, మరిముఖ్యంగా భవిష్యత్తులో తాను ‘మహిమతో’ వచ్చే సమయంలో మనుషులందరి మీదికి రాబోయే “మహాశ్రమ” గురించి యేసు మాట్లాడాడు. (మత్త 24:21, 29-31) పౌలు ఈ శ్రమను, “దేవుడు తెలియనివాళ్ల మీద,” యేసుక్రీస్తు గురించిన “మంచివార్తకు లోబడనివాళ్ల మీద” దేవుడు తీసుకోబోయే నీతియుక్త చర్య అని వర్ణించాడు. ‘క్రూరమృగానికి, భూమ్మీది రాజులకు, వాళ్ల సైన్యాలకు’ వ్యతిరేకంగా పరలోక సైన్యాల్ని నడిపిస్తున్న వ్యక్తిగా యేసును ప్రకటన 19వ అధ్యాయం వర్ణిస్తోంది. (2 థెస్స 1:6-8; ప్రక 19:11-21) “ఒక గొప్పసమూహం” ఆ శ్రమ నుండి తప్పించుకున్నట్టు బైబిలు చూపిస్తోంది. (ప్రక 7:9, 14)—హార్‌మెగిద్దోన్ చూడండి.
మహాసభ.
యెరూషలేములో ఉన్న యూదుల ఉన్నత న్యాయస్థానం. యేసు కాలంలోని మహాసభలో ప్రధానయాజకుడు, గతంలో ప్రధానయాజకులుగా సేవచేసినవాళ్లు, ప్రధానయాజకుల కుటుంబ సభ్యులు, పెద్దలు, గోత్రాల పెద్దలు, కుటుంబ పెద్దలు, శాస్త్రులతో కలుపుకొని మొత్తం 71 మంది సభ్యులు ఉండేవాళ్లు.—మార్కు 15:1; అపొ 5:34; 23:1, 6.
మాచిపత్రి.
చాలా చేదైన రుచి, ఘాటైన వాసన ఉండే రకరకాల అడవి మొక్కలు. ప్రకటన 8:11 లో “మాచిపత్రి” అనే పదం చేదైన, విషపూరితమైన పదార్థాన్ని సూచిస్తుంది.
మాదీయులు.
యాపెతు కొడుకు మాదయి నుండి వచ్చిన ప్రజలు; వాళ్లు పర్వత ప్రాంతమైన ఇరాన్ పీఠభూమిలో స్థిరపడ్డారు. తర్వాత ఆ ప్రాంతానికి మాదీయ దేశమనే పేరు వచ్చింది. సా.శ. 33 పెంతెకొస్తు రోజున యెరూషలేముకు వచ్చినవాళ్లలో మాదీయులు కూడా ఉన్నారు.—అపొ 2:9.
మానవ కుమారుడు.
సువార్త పుస్తకాల్లో ఈ మాట దాదాపు 80 సార్లు కనిపిస్తుంది. ఇది యేసుక్రీస్తుకు వర్తిస్తుంది. ఆయన కేవలం శరీరం ధరించిన పరలోక ప్రాణి కాదుగానీ, భౌతిక శరీరంతో పుట్టడం వల్ల మానవుడు అయ్యాడని ఆ మాట చూపిస్తుంది. దానియేలు 7:13, 14 లో ఉన్న ప్రవచనాన్ని యేసు నెరవేరుస్తాడని కూడా ఈ మాట సూచిస్తుంది.—మత్త 19:28; 20:28.
మార్గం.
యెహోవాకు అంగీకారమైన లేదా అంగీకారంకాని పనితీరును, ప్రవర్తనా తీరును సూచించడానికి లేఖనాల్లో ఈ పదం సూచనార్థకంగా ఉపయోగించబడింది. యేసుక్రీస్తు అనుచరులుగా మారిన వాళ్లు ‘ప్రభువు మార్గానికి’ చెందినవాళ్లు అని పిలువబడ్డారు. అంటే, వాళ్లు యేసుక్రీస్తు మీది విశ్వాసమే కేంద్రంగా ఉన్న జీవన విధానాన్ని అనుసరించారని, ఆయన ఆదర్శాన్ని పాటించారని అర్థం.—అపొ 19:9.
మాసిదోనియ.
గ్రీసుకు ఉత్తరాన ఉన్న ప్రాంతం. అలెగ్జాండర్ ద గ్రేట్ పరిపాలనలో ఇది ప్రాముఖ్యతను సంతరించుకొని, రోమన్లు జయించే వరకు స్వతంత్ర ప్రాంతంగా ఉంది. అపొస్తలుడైన పౌలు మొదటిసారి యూరప్‌కు వెళ్లినప్పుడు అది రోమా ప్రాంతంగా ఉంది. పౌలు ఈ ప్రాంతానికి మూడుసార్లు వెళ్లాడు.—అపొ 16:9.
మిడతలు.
పెద్ద దండుగా వలస వెళ్లే ఒక రకమైన గొల్లభామ జాతి పురుగులు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం వీటిని పవిత్రమైనవిగా పరిగణించి తినవచ్చు. తమ దారిలో ఉండే ప్రతీదాన్ని తినేసి, భారీ ఎత్తున నాశనాన్ని కలుగజేసే మిడతల పెద్ద దండును ఒక తెగులుగా పరిగణించేవాళ్లు.—నిర్గ 10:14; మత్త 3:4.
మినా.
క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, ఒక మినా 100 డ్రక్మాలతో సమానం. దాని బరువు 340 గ్రాములు ఉండేది.—లూకా 19:13.
ముఖ్య ప్రతినిధి.
గ్రీకులో వాడిన పదానికి “ముఖ్య నాయకుడు” అని అర్థం. పాపం వల్ల వచ్చిన ప్రాణాంతక ఫలితాల నుండి నమ్మకమైన మనుషుల్ని విడిపించేందుకు, వాళ్లను శాశ్వత జీవితానికి నడిపించేందుకు యేసుక్రీస్తు పోషించిన అతి ముఖ్యమైన పాత్రను అది సూచిస్తోంది.—అపొ 3:15; 5:31; హెబ్రీ 2:10; 12:2.
ముఖ్య యాజకుడు.
హీబ్రూ లేఖనాల్లో వాడిన “ప్రధానయాజకుడు” అనే పదానికి ఇది ప్రత్యామ్నాయ పదం. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, “ముఖ్య యాజకులు” అనే మాట యాజకుల్లోని ముఖ్యుల్ని సూచించడానికి వాడివుంటారని స్పష్టమౌతుంది. బహుశా వాళ్లలో ప్రధానయాజకుడి హోదా నుండి తొలగించబడినవాళ్లు, అలాగే 24 యాజకత్వ గుంపుల పెద్దలు కూడా ఉండివుంటారు.—2 దిన 26:20; ఎజ్రా 7:5; మత్త 2:4; మార్కు 8:31.
ముద్ర.
ఇది యాజమాన్యపు హక్కును, అధికారికతను లేదా ఒప్పందాన్ని చూపించే గుర్తును (సాధారణంగా బంకమన్ను మీద లేదా మైనం మీద) వేయడానికి ఉపయోగించే పరికరం. మూసేసిన దస్తావేజుల్ని, లేదా ఇతర వస్తువుల్ని మార్చకుండా ఉంచడానికి ఇది ఉపయోగపడేది. తలుపులకు, సమాధులకు కూడా ముద్ర వేసేవాళ్లు. ప్రాచీన ముద్రల్లో గట్టి పదార్థాల (రాయి, దంతం, లేదా చెక్క) మీద అక్షరాలు గానీ ఆకారాలు గానీ వ్యతిరేక దిశలో చెక్కబడి ఉండేవి. అయితే, అధికారికమైనదని చూపించడానికి గానీ, ఫలానా వాళ్ల సొత్తు అనడానికి గుర్తుగా గానీ, దాచబడిన దాన్ని లేదా రహస్యంగా ఉన్నదాన్ని సూచించడానికి గానీ ముద్ర అనే పదాన్ని అలంకారికంగా ఉపయోగించారు.—మత్త 27:66, పాదసూచిక; యోహా 6:27; ఎఫె 1:13; ప్రక 5:1; 9:4.
ముల్లుకర్ర.
పదునైన లోహపు మొన ఉండే ఒక పొడవాటి కర్ర. జంతువుల్ని తోలడానికి రైతులు దీన్ని వాడేవాళ్లు. తెలివిగలవాళ్ల మాటల్ని ముల్లుకర్రతో లేదా మునుకోల కర్రతో పోల్చారు. తెలివైన సలహాను పాటించేలా అవతలి వ్యక్తిని ఆ మాటలు కదిలిస్తాయి. రైతు తోలడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ముల్లుకర్రకు ఎదురుతన్నుతూ ఎదురుతిరిగే మొండి ఎద్దు దానికదే హాని చేసుకుంటుంది. “ముల్లుకర్రకు ఎదురుతన్నడం” అనే మాట దాని నుండే వచ్చింది.—అపొ 26:14; న్యాయా 3:30.
మూర.
ఇది రేఖీయ కొలత. సుమారు మోచేతి నుండి మధ్య వేలి కొన వరకు ఉన్న దూరాన్ని మూర అంటారు. ఇశ్రాయేలీయులు సామాన్యంగా 44.5 సెంటిమీటర్ల (17.5 అంగుళాలు) పొడవు ఉండే మూరను ఉపయోగించేవాళ్లు. వాళ్లు దానికన్నా పెద్ద మూరను కూడా ఉపయోగించేవాళ్లు. అది ఓ బెత్తెడు ఎక్కువ అంటే దాదాపు 51.8 సెంటిమీటర్లు (20.4 అంగుళాలు) ఉండేది.—ఆది 6:15; మత్త 6:27, పాదసూచిక; లూకా 12:25, పాదసూచిక; ప్రక 21:17.
మూలరాయి.
భవనంలో రెండు గోడలు కలిసే చోట లేదా మూలన పెట్టే రాయి. ఇది ఆ రెండు గోడల్ని కలిపివుంచడానికి చాలా ప్రాముఖ్యం. పునాది మూలరాయే ముఖ్యమైన మూలరాయి; సాధారణంగా ప్రభుత్వ భవనాలకు, నగర గోడలకు చాలా బలమైన మూలరాళ్లు వాడేవాళ్లు. ఈ పదాన్ని భూమికి పునాది వేయడం గురించి ప్రస్తావిస్తున్నప్పుడు అలంకారికంగా వాడారు. ఆధ్యాత్మిక ఇల్లుతో పోల్చబడిన క్రైస్తవ సంఘానికి యేసు ‘పునాది మూలరాయి’ అని బైబిలు చెప్తుంది.—ఎఫె 2:20; యోబు 38:7.
మెస్సీయ.
“అభిషేకించబడిన” లేదా “అభిషేకించబడినవాడు” అనే అర్థమున్న హీబ్రూ పదం నుండి వచ్చింది. దానికి సరిసమానమైన గ్రీకు భాషా పదం నుండి “క్రీస్తు” అనే పదం వచ్చింది.—దాని 9:25; యోహా 1:41.
మైలు.
దూరాన్ని కొలవడానికి వాడే కొలత. క్రైస్తవ గ్రీకు లేఖనాల మూలప్రతుల్లో మత్తయి 5:41 లో మాత్రమే ఈ పదం కనిపిస్తుంది. అది బహుశా రోమన్ మైలును సూచిస్తుండవచ్చు. ఆ మైలు 1,479.5 మీటర్లతో (4,854 అడుగులతో) సమానం. అయితే, “మైలు” అనే పదం మరో మూడు చోట్ల అంటే లూకా 24:13, యోహాను 6:19, యోహాను 11:18 లో కూడా కనిపిస్తుంది. ఈ మూడు చోట్ల కనిపించే “మైలు” ప్రభుత్వం నిర్ణయించిన మైలు కొలతను సూచిస్తుంది; మూలప్రతుల్లో ఉన్న ప్రాచీన స్టేడియా అనే కొలతను ఆ మైలు కొలతగా మార్చారు.
మొలొకు.
అమ్మోనీయుల దేవుడు; మల్కోము, మిల్కోము, మోలెకు అనే పేర్లు కూడా అతనివే అయ్యుండవచ్చు.—అపొ 7:43.
య
యాకోబు.
ఇస్సాకు, రిబ్కాల కొడుకు. తర్వాతి కాలంలో దేవుడు ఇతనికి ఇశ్రాయేలు అనే పేరు పెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలకు (ఇశ్రాయేలీయులు అని కూడా పిలుస్తారు, ఆ తర్వాతి కాలంలో యూదులు అనే పేరు వచ్చింది) ఇతను పూర్వీకుడయ్యాడు. ఇతనికి 12 మంది కొడుకులు. వాళ్ల నుండి, వాళ్ల వంశస్థుల నుండి ఇశ్రాయేలీయుల 12 గోత్రాలు వచ్చాయి. ఆ తర్వాత కూడా యాకోబు అనే పేరును ఇశ్రాయేలు ప్రజలకు ఉపయోగిస్తూ వచ్చారు.—ఆది 32:28; మత్త 22:32.
యాజకుడు.
ఇతను తాను సేవచేస్తున్న ప్రజలకు దేవుని అధికారిక ప్రతినిధిగా ఉండేవాడు. ఇతను దేవుని గురించి, ఆయన నియమాల గురించి వాళ్లకు ఉపదేశించేవాడు. అంతేకాదు యాజకులు బలులు అర్పిస్తూ, ప్రజలకూ దేవునికీ మధ్యవర్తులుగా ఉంటూ, ప్రజల తరఫున వేడుకుంటూ, దేవుని ముందు ప్రజల ప్రతినిధులుగా కూడా ఉండేవాళ్లు. మోషే ధర్మశాస్త్రం స్థాపించబడక ముందు, కుటుంబపెద్దే తన కుటుంబానికి యాజకుడిగా సేవచేసేవాడు. మోషే ధర్మశాస్త్రం కింద, లేవి గోత్రంవాడైన అహరోను వంశంలోని పురుషులతో యాజకత్వం రూపొందింది. లేవి గోత్రంలోని మిగతా పురుషులందరూ వాళ్లకు సహాయకులుగా ఉండేవాళ్లు. కొత్త ఒప్పందం ప్రారంభమవడంతో, ఆధ్యాత్మిక ఇశ్రాయేలు యాజక సమూహంగా తయారైంది, వాళ్ల ప్రధానయాజకుడు యేసుక్రీస్తు.—నిర్గ 28:41; హెబ్రీ 9:24; ప్రక 5:10.
యుద్ధ కవచం.
రక్షణ కోసం సైనికులు ధరించే వాటన్నిటినీ కలిపి యుద్ధ కవచం అంటారు. ఇందులో శిరస్త్రాణం, రొమ్ము-కవచం, నడికట్టు, కాళ్ల-కవచాలు, డాలు ఉండేవి.—ఎఫె 6:13-17.
యూదా.
యాకోబు నాలుగో కొడుకు. ఇతని తల్లి లేయా. చనిపోయే ముందు తాను చెప్పిన ప్రవచనంలో, యూదా వంశం నుండి శాశ్వత కాలం పరిపాలించే ఒక గొప్ప రాజు వస్తాడని యాకోబు చెప్పాడు. యేసు మనిషిగా వచ్చినప్పుడు యూదా వంశంలోనే పుట్టాడు. యూదా అనే పేరు ఒక గోత్రాన్ని, ఆ తర్వాత యూదా అనే పేరుపెట్టబడిన ఒక రాజ్యాన్ని కూడా సూచిస్తుంది.—ఆది 29:35; 49:10; హెబ్రీ 7:14.
యూదుడు.
పదిగోత్రాల ఇశ్రాయేలు రాజ్యం పతనమైన తర్వాతి నుండి యూదా గోత్రానికి చెందిన వ్యక్తిని సూచించడానికి ఈ పదం వాడేవాళ్లు. (2 రాజు 16:6) బబులోను చెర నుండి విడుదలైన తర్వాత ఇశ్రాయేలు దేశానికి తిరిగి వచ్చిన ఆయా గోత్రాల ఇశ్రాయేలీయుల్ని సూచించడానికి ఈ పదాన్ని వాడారు. (ఎజ్రా 4:12) ఆ తర్వాత ఇశ్రాయేలీయుల్ని, అన్య దేశాల వాళ్ల నుండి వేరు చేసి చెప్పడానికి ప్రపంచమంతటా ఆ పదాన్ని వాడారు. (ఎస్తే 3:6) అంతేకాదు, క్రైస్తవ సంఘంలో ఎవరు ఏ జాతికి చెందినవాళ్లనేది ప్రాముఖ్యంకాదని వివరించడానికి అపొస్తలుడైన పౌలు ఈ పదాన్ని అలంకారికంగా వాడాడు.—రోమా 2:28, 29; గల 3:28.
యూఫ్రటీసు.
ఆసియాకు నైరుతి వైపున ఉన్న పొడవైన, అత్యంత ప్రాముఖ్యమైన నది. అంతేకాదు, మెసొపొతమియలో ఉన్న రెండు ప్రధాన నదుల్లో ఇదొకటి. యూఫ్రటీసు అనే పదం మొట్టమొదటిసారిగా ఆదికాండము 2:14లో ఉపయోగించబడింది; అక్కడ ఏదెనుకు సంబంధించిన నాలుగు నదుల్లో ఒకదానిగా ఇది ప్రస్తావించబడింది. దీన్ని తరచూ “నది” అని మాత్రమే పిలిచేవాళ్లు. (ఆది 31:21) ఇశ్రాయేలీయులకు నియమించబడిన ప్రాంతానికి ఇది ఉత్తర సరిహద్దు.—ఆది 15:18; ప్రక 9:14; 16:12.
యెహోవా.
పవిత్ర లేఖనాల కొత్త లోక అనువాదంలోని క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో “యెహోవా” అనే పేరును మొత్తం 237 సార్లు ఉపయోగించారు. దేవుని పేరును ఉపయోగించాలనే నిర్ణయాన్ని ఈ కింది రుజువుల్ని బట్టి తీసుకున్నారు:
1. యేసు కాలంలో, ఆయన అపొస్తలుల కాలంలో ఉపయోగించిన హీబ్రూ లేఖనాల ప్రతుల్లో అన్నిచోట్ల టెట్రగ్రామటన్ (అంటే, దేవుని పేరును సూచించే నాలుగు హీబ్రూ హల్లులు יהוה) ఉండేది.
2. యేసు, ఆయన అపొస్తలులు జీవించిన కాలంలో ఉన్న హీబ్రూ లేఖనాల గ్రీకు అనువాదాల్లో కూడా టెట్రగ్రామటన్ ఉండేది.
3. యేసు తరచూ దేవుని పేరును ప్రస్తావించాడని, వేరేవాళ్లకు ఆ పేరు తెలియజేశాడని స్వయంగా క్రైస్తవ గ్రీకు లేఖనాలే చెప్తున్నాయి.—యోహా 17:6, 11, 12, 26.
4. పవిత్ర హీబ్రూ లేఖనాల్లాగే క్రైస్తవ గ్రీకు లేఖనాలు కూడా ప్రేరేపిత లేఖనాలే కాబట్టి, ఆ లేఖనాల్లో యెహోవా పేరు ఉన్నట్టుండి ఒక్కసారిగా మాయమైపోవడం పొంతనలేని విషయం.
5. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో దేవుని పేరు సంక్షిప్త రూపంలో కనిపిస్తుంది.—ప్రక 19:1, 3, 4, 6.
6. మొదట్లో యూదులు రాసిన పుస్తకాలు చూస్తే, క్రైస్తవులుగా మారిన యూదులు తాము రాసిన పుస్తకాల్లో దేవుని పేరును ఉపయోగించారని అర్థమౌతుంది.
7. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఉల్లేఖించిన హీబ్రూ లేఖనాల్లో దేవుని పేరు ఉండేవుంటుందని కొంతమంది బైబిలు విద్వాంసులు ఒప్పుకుంటున్నారు.
8. వందకు పైగా బైబిలు అనువాదాల్లో దేవుని పేరు క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో కనిపిస్తుంది.
క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, దేవుని పేరైన యెహోవాను తిరిగిపెట్టడానికి బలమైన ఆధారాలు ఉన్నాయనడంలో సందేహమే లేదు. అందుకే కొత్త లోక అనువాదం బైబిల్ని అనువదించినవాళ్లు దేవుని పేరును అది ఉండాల్సిన చోట తిరిగిపెట్టారు. వాళ్లకు దేవుని పేరుమీద ఎంతో గౌరవముంది. అసలు ప్రతుల్లో ఉన్న దేన్నీ తమ అనువాదంలో తీసేయకూడదనే సరైన భయం కూడా వాళ్లకు ఉంది.—ప్రక 22:18, 19.
ర
రథం.
రవాణా కోసం, యుద్ధాల కోసం ఉపయోగించే రెండు చక్రాల గుర్రపు బండి.—నిర్గ 14:23; న్యాయా 4:12; అపొ 8:28; ప్రక 9:9.
ల
లెక్కలేనితనం.
ఇది అసెల్జీయ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. దేవుని నియమాలను తీవ్రంగా ఉల్లంఘించే పనులకు, లెక్కలేని స్వభావానికి లేదా తెగింపుతో కూడిన ధిక్కార వైఖరికి సంబంధించిన మాట; అంతేకాదు అధికారం పట్ల, నియమాల పట్ల, ప్రమాణాల పట్ల అగౌరవాన్ని లేదా ఆఖరికి ధిక్కారాన్ని చూపించే స్వభావం. ఇది చిన్నచిన్న తప్పుల్ని సూచించే మాట కాదు.—గల 5:19; 2 పేతు 2:7.
లెప్టాన్.
క్రైస్తవ గ్రీకు లేఖనాల కాలంలో, యూదులు వాడిన అతిచిన్న రాగి లేదా కంచు నాణెం.—మార్కు 12:42; లూకా 21:2; పాదసూచికలు.
లేఖనం, లేఖనాలు.
దేవుని వాక్యంలో ఉన్న పవిత్ర రాతలు. ఈ పదాలు క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో మాత్రమే కనిపిస్తాయి.—లూకా 24:27; 2 తిమో 3:16.
లేవి; లేవీయుడు.
యాకోబు మూడో కొడుకు. ఇతని తల్లి లేయా. అంతేకాదు, ఒక గోత్రానికి కూడా లేవి అనే పేరు పెట్టారు. అతని ముగ్గురు కొడుకులు లేవీయుల యాజకత్వం అని పిలవబడే మూడు ప్రధాన విభాగాలకు మూలపురుషులు అయ్యారు. కొన్నిసార్లు, “లేవీయులు” అనే పదం లేవి గోత్రం మొత్తానికి వర్తిస్తుంది కానీ సాధారణంగా, అహరోను యాజక వంశం ఇందులోకి రాదు. వాగ్దాన దేశంలో లేవి గోత్రానికి ప్రత్యేకంగా ఒక భూభాగాన్ని ఇవ్వలేదు కానీ వేరే గోత్రాలకు ఇచ్చిన భూభాగంలోనే 48 నగరాల్ని కేటాయించారు.—ద్వితీ 10:8; 1 దిన 6:1; హెబ్రీ 7:11.
లైంగిక పాపాలు.
ఇది పోర్నియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది. దేవుని నియమాలకు విరుద్ధమైన లైంగిక సంబంధాలన్నిటి గురించి చెప్పడానికి ఉపయోగించే పదం. వ్యభిచారం, వేశ్యావృత్తి, పెళ్లికానివాళ్ల మధ్య లైంగిక సంబంధాలు, స్వలింగ సంపర్కం, జంతువులతో సంపర్కం వంటివన్నీ దీని కిందికి వస్తాయి. “మహాబబులోను” అనే పేరున్న మతసంబంధమైన వేశ్య అధికారం కోసం, ఆర్థిక లాభాల కోసం ఈ లోక పరిపాలకులతో సంబంధం పెట్టుకోవడాన్ని వర్ణించడానికి ప్రకటన గ్రంథంలో ఈ పదం సూచనార్థకంగా ఉపయోగించబడింది. (ప్రక 14:8; 17:2; 18:3; మత్త 5:32; అపొ 15:29; గల 5:19)—వేశ్య చూడండి.
వ
విగ్రహం; విగ్రహపూజ.
నిజమైన లేదా ఊహించుకున్న దేన్నైనా ఒకదాన్ని పూజించడానికి ప్రజలు ఉపయోగించే ఒక ప్రతిమ లేదా రూపమే విగ్రహం. విగ్రహం మీద భక్తి, ప్రేమ చూపించడం, దాన్ని పూజించడం లేదా దానిమీద ఎంతో గౌరవం, అభిమానం కలిగివుండడమే విగ్రహపూజ.—కీర్త 115:4; అపొ 17:16; 1 కొరిం 10:14.
విమోచన క్రయధనం.
చెర నుండి, శిక్ష నుండి, బాధ నుండి, పాపం నుండి లేదా బాధ్యత నుండి విడిపించడానికి కట్టే మూల్యం. ఇది అన్నివేళలా డబ్బే కానవసరం లేదు. (యెష 43:3) రకరకాల పరిస్థితుల్లో విమోచన క్రయధనం చెల్లించాల్సి వచ్చేది. ఉదాహరణకు, మొదట పుట్టిన మగపిల్లలు గానీ మొదట పుట్టిన మగ జంతువులు గానీ యెహోవాకు చెందినవి. యెహోవా సేవలో మాత్రమే ఉపయోగించాల్సిన ఆ వ్యక్తుల్ని లేదా ఆ జంతువుల్ని విడిపించడానికి విమోచన క్రయధనం లేదా విడిపించే మూల్యం చెల్లించాల్సి ఉండేది. (సంఖ్యాకాండం 3:45, 46; 18:15, 16) ఒకవేళ కట్టేయని ప్రమాదకరమైన ఎద్దు ఎవరినైనా చంపితే, మోషే ధర్మశాస్త్రం విధించిన మరణశిక్ష నుండి ఆ ఎద్దు యజమాని తనను తాను విడిపించుకోవడానికి విమోచన క్రయధనం చెల్లించాల్సి ఉండేది. (నిర్గ 21:29, 30) అయితే కావాలని హత్య చేసిన వ్యక్తి నుండి ఎలాంటి విమోచన క్రయధనం అంగీకరించబడేది కాదు. (సంఖ్యాకాండం 35:31) అన్నిటికన్నా ప్రాముఖ్యంగా, విధేయులైన మనుషుల్ని పాపం నుండి, మరణం నుండి విడిపించడానికి త్యాగపూరితంగా మరణించి క్రీస్తు చెల్లించిన విమోచన క్రయధనం గురించి బైబిలు నొక్కిచెప్తుంది.—కీర్త 49:7, 8; మత్త 20:28; ఎఫె 1:7.
విశ్రాంతి రోజు.
“విశ్రమించడం; పని ఆపేయడం” అనే అర్థమున్న హీబ్రూ పదం నుండి వచ్చింది. ఇది యూదుల వారంలో ఏడో రోజు (శుక్రవారం సూర్యాస్తమయం నుండి శనివారం సూర్యాస్తమయం వరకు). సంవత్సరంలో జరుపుకునే కొన్ని పండుగ రోజుల్ని కూడా విశ్రాంతి రోజులని అనేవాళ్లు; అలాగే 7వ, 50వ సంవత్సరాల్ని విశ్రాంతి సంవత్సరాలు అని అనేవాళ్లు. ఆలయంలో చేసే యాజక సేవ తప్ప విశ్రాంతి రోజున ఇంకే పనీ చేయడానికి అనుమతి లేదు. విశ్రాంతి సంవత్సరాల్లో, నేలను సేద్యం చేయకుండా వదిలేయాలి. ఆ సంవత్సరంలో అప్పులు తీర్చమని తోటి హెబ్రీయుల్ని ఒత్తిడి చేసేవాళ్లు కాదు. మోషే ధర్మశాస్త్రంలో, విశ్రాంతి రోజుకు సంబంధించిన నియమాలు ప్రజలు పాటించలేనంత కష్టంగా ఏమీ ఉండేవి కాదు. కానీ మతనాయకులు మెల్లమెల్లగా కొత్తకొత్త నియమాలు చేర్చుకుంటూ వెళ్లడం వల్ల, యేసు కాలానికల్లా అవి ప్రజలు పాటించలేనంత కష్టంగా తయారయ్యాయి.—నిర్గ 20:8; లేవీ 25:4; లూకా 13:14-16; కొలొ 2:16.
వేకువ చుక్క.
సూర్యుడు కనిపించే ముందు ఆకాశంలో (భూమ్యాకాశాలు కలిసినట్టుండే చోట) తూర్పు దిక్కున ఉదయించే చివరి నక్షత్రం. అలా అది ఓ కొత్త రోజు ప్రారంభాన్ని చాటుతుంది.—ప్రక 22:16; 2 పేతు 1:19.
వేశ్య.
వివాహ బంధం అనేది లేకుండా, ముఖ్యంగా డబ్బు కోసం లైంగిక సంబంధాలు పెట్టుకునే వ్యక్తి. (“వేశ్య” అని అనువదించబడిన గ్రీకు పదం పోర్ని, “అమ్మడానికి” అనే మూలార్థం నుండి వచ్చింది.) బైబిల్లో మగవేశ్యల లేదా పురుషగాముల గురించిన ప్రస్తావన కూడా ఉన్నప్పటికీ, ఈ పదం సాధారణంగా స్త్రీలను సూచిస్తుంది. మోషే ధర్మశాస్త్రం వేశ్యావృత్తిని ఖండించింది. అంతేకాదు, రాబడి కోసం ఆలయ వేశ్యల్ని ఉపయోగించే అన్యుల ఆచారానికి భిన్నంగా, పడుపుసొమ్మును యెహోవా ఆలయంలో చందా వేయడం అనుమతించబడలేదు. (ద్వితీ 23:17, 18; 1 రాజు 14:24) దేవుని ఆరాధకులమని చెప్పుకుంటూ ఏదో ఒక విధమైన విగ్రహపూజలో భాగం వహించే ప్రజల్ని, దేశాల్ని లేదా సంస్థల్ని సూచించడానికి బైబిలు ఈ పదాన్ని అలంకారికంగా కూడా వాడుతుంది. ఉదాహరణకు, “మహాబబులోను” అని పిలవబడే మత వ్యవస్థను ప్రకటన గ్రంథం వేశ్య అని వర్ణిస్తోంది. ఎందుకంటే ఆమె అధికారం కోసం, డబ్బు కోసం ఈ ప్రపంచ పరిపాలకులతో సంబంధం పెట్టుకుంది.—ప్రక 17:1-5; 18:3; 1 దిన 5:25.
వ్యభిచారం.
పెళ్లయిన పురుషుడు లేదా స్త్రీ తన వివాహ భాగస్వామి కాని వ్యక్తితో ఇష్టపూర్వకంగా పెట్టుకునే లైంగిక సంబంధం.—నిర్గ 20:14; మత్త 5:27; 19:9.
వ్యవస్థ(లు).
ఎయాన్ అనే గ్రీకు పదం ఒకానొక కాలాన్ని, శకాన్ని లేదా యుగాన్ని ప్రత్యేకంగా గుర్తుపట్టేలా చేసే అప్పటి వ్యవహారాల స్థితిని లేదా అంశాలను సూచిస్తున్నప్పుడు దాన్ని వ్యవస్థ అని అనువదించారు. బైబిలు “ఈ వ్యవస్థ” అనే మాటను ఉపయోగించినప్పుడు, అది సాధారణంగా లోకంలో ఉన్న వ్యవహారాల స్థితిని, లోకసంబంధమైన జీవన విధానాన్ని సూచిస్తుంది. (2 తిమో 4:10) ధర్మశాస్త్ర ఒప్పందం ద్వారా దేవుడు ఒక వ్యవస్థను ప్రారంభించాడు. కొంతమంది దాన్ని ఇశ్రాయేలీయుల లేదా యూదుల శకం అని అంటారు. విమోచన క్రయధనం ద్వారా, యేసుక్రీస్తును ఉపయోగించుకొని దేవుడు ఇంకో వ్యవస్థను ప్రారంభించాడు. అందులో ముఖ్యంగా అభిషిక్త క్రైస్తవుల సంఘం ఉంది. దాంతో ఒక కొత్త శకం, అంటే ధర్మశాస్త్ర ఒప్పందంలో ముందుగా ఏవైతే సూచించబడ్డాయో వాటి నెరవేర్పులతో గుర్తించబడిన శకం ఆరంభమైంది. వ్యవస్థ అనే పదాన్ని బహువచనంలో ఉపయోగించినప్పుడు, అది అంతకుముందున్న లేదా భవిష్యత్తులో ఉండబోయే వేర్వేరు వ్యవస్థల్ని లేదా అప్పటి వ్యవహారాల స్థితుల్ని సూచిస్తుంది.—మత్త 24:3; మార్కు 4:19; రోమా 12:2; 1 కొరిం 10:11.
శ
శపించడం.
ఎవరికైనా, దేనికైనా కీడు జరుగుతుందని బెదిరించడం లేదా ప్రకటించడం. బూతులు లేదా విపరీతమైన కోపం దీని కిందకు రావు. తరచూ, శపించడం అంటే ఒక తీర్పును అధికారికంగా ప్రకటించడం లేదా కీడు జరుగుతుందని ప్రవచించడం. అయితే దేవుడు, లేదా అధికారం ఇవ్వబడిన ఓ వ్యక్తి శపించినప్పుడు ఆ శాపానికి ప్రవచనాత్మక విలువ ఉంటుంది, ఆ శాపం శక్తివంతంగా ఉంటుంది.—ఆది 12:3; సంఖ్యాకాండం 22:12; మార్కు 11:21; అపొ 23:12; రోమా 12:14; గల 3:10.
శాస్త్రి.
హీబ్రూ లేఖనాల్ని నకలు రాసే వ్యక్తి. యేసు భూమ్మీదికి వచ్చే సమయానికి, ధర్మశాస్త్రంలో ఆరితేరిన పురుషుల వర్గానికి ఈ పేరు వచ్చింది. వీళ్లు యేసును వ్యతిరేకించారు.—ఎజ్రా 7:6; మార్కు 12:38, 39; 14:1.
శుభ్రం/పవిత్రం.
బైబిలు వాడుకలో, ఈ పదాలు భౌతిక పరిశుభ్రతను మాత్రమే సూచించట్లేదు; అవి కళంకంలేని వాళ్లుగా, మచ్చలేని వాళ్లుగా ఉండడాన్ని లేదా ఆ స్థితికి తిరిగి రావడాన్ని కూడా సూచిస్తున్నాయి. అంతేకాదు, నైతికంగా లేదా ఆధ్యాత్మికంగా మలినపర్చే, పాడుచేసే లేదా కళంకపర్చే దేనికైనా దూరంగా ఉండడాన్ని కూడా అవి సూచిస్తున్నాయి. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈ పదాల్ని ఆచారబద్ధంగా శుద్ధి చేసుకోవడానికి సంబంధించి ఉపయోగించారు.—లేవీ 10:10; కీర్త 51:7; మత్త 8:2; 1 కొరిం 6:11.
స
సంఘం.
సంఘ పరిచారకుడు.
గ్రీకు పదమైన డయాకొనొస్ నుండి వచ్చింది. ఇది తరచూ “పరిచారకుడు” లేదా “సేవకుడు” అని అనువదించబడింది. సంఘంలో పెద్దల సభకు సహాయకునిగా పనిచేసే వ్యక్తిని “సంఘ పరిచారకుడు” అంటారు. ఒక వ్యక్తి ఈ సేవావకాశానికి అర్హుడవ్వాలంటే అతను బైబిల్లో ఉన్న ప్రమాణాల్ని చేరుకోవాలి.—1 తిమో 3:8-10, 12.
సద్దూకయ్యులు.
యూదా మతానికి చెందిన ఒక ప్రముఖ తెగ. సమాజంలో పలుకుబడి, హోదా ఉన్న ధనికులు, యాజకులు ఈ తెగలో ఉండేవాళ్లు. ఆలయంలో జరిగే కార్యకలాపాల మీద వీళ్లు చాలా అధికారం చెలాయించేవాళ్లు. పరిసయ్యులు ఆచరించే అనేక మౌఖిక సంప్రదాయాల్ని, పరిసయ్యుల నమ్మకాల్ని వీళ్లు తిరస్కరించారు. పునరుత్థానాన్ని గానీ దేవదూతలు ఉన్నారని గానీ వీళ్లు నమ్మేవాళ్లు కాదు. వీళ్లు యేసును వ్యతిరేకించారు.—మత్త 16:1; అపొ 23:8.
సభామందిరం.
ఈ మాటకు మూల భాషలో ఉపయోగించిన పదానికి “సమకూర్చడం, సమావేశం” అని అర్థం. కానీ చాలా లేఖనాల్లో, యూదులు లేఖనాలు చదవడానికి, ఉపదేశం పొందడానికి, ప్రకటించడానికి, ప్రార్థించడానికి సమావేశమైన కట్టడాన్ని లేదా స్థలాన్ని సూచించేందుకు ఈ పదాన్ని వాడారు. యేసు రోజుల్లో, కాస్త పెద్దగా ఉన్న ప్రతీ ఇశ్రాయేలు పట్టణంలో ఒక సభామందిరం ఉండేది. అదే పెద్దపెద్ద నగరాల్లో అయితే ఒకటి కన్నా ఎక్కువ సభామందిరాలు ఉండేవి.—లూకా 4:16; అపొ 13:14, 15.
సమరయ.
పదిగోత్రాల ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలుకు దాదాపు 200 సంవత్సరాల పాటు రాజధానిగా ఉంది; అలాగే, ఆ రాజ్యం మొత్తానికి కూడా అదే పేరు ఉంది. సమరయ అనే పేరున్న కొండ మీదే ఆ నగరం కట్టబడింది. యేసు కాలంలో, సమరయ అనేది ఒక రోమా జిల్లా. దీనికి ఉత్తరాన గలిలయ, దక్షిణాన యూదయ ఉండేది. సాధారణంగా యేసు ప్రకటించడానికి ఈ ప్రాంతానికి వెళ్లలేదు కానీ, కొన్నిసార్లు ఆ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్నప్పుడు అక్కడి వాళ్లతో మాట్లాడాడు. సమరయులు పవిత్రశక్తిని పొందిన సందర్భంలో రాజ్యానికి సంబంధించిన రెండో అలంకారిక తాళపుచెవిని పేతురు ఉపయోగించాడు.—1 రాజు 16:24, పాదసూచిక; యోహా 4:7; అపొ 8:14.
సమరయులు.
మొదట్లో, ఈ పదాన్ని పదిగోత్రాల ఉత్తర రాజ్యంలోని ఇశ్రాయేలీయుల్ని సూచించడానికి ఉపయోగించేవాళ్లు. కానీ సా.శ.పూ. 740లో అష్షూరీయులు సమరయను జయించిన తర్వాత ఈ ప్రాంతంలోకి పరదేశుల్ని తీసుకొచ్చారు. దానివల్ల, కేవలం ఇశ్రాయేలీయుల్నే కాకుండా ఇశ్రాయేలీయుల్నీ, ఈ పరదేశుల్నీ కలిపి సమరయులు అని పిలవడం మొదలైంది. అయితే యేసు కాలంలో, జాతిపరమైన, రాజకీయపరమైన విషయాల్ని బట్టి కాకుండా ప్రాచీన షెకెము, సమరయ పరిసర ప్రాంతాల్లో ఉన్న మత తెగలోని సభ్యుల్ని సూచించడానికే తరచూ ఈ పదాన్ని వాడేవాళ్లు. యూదా మత నమ్మకాలకు పూర్తి భిన్నమైన కొన్ని నమ్మకాలు వాళ్లకు ఉండేవి.—యోహా 8:48.
సమర్పణ పండుగ.
ఆంటియోకస్ ఎపిఫనెస్ అనే అతను ఆలయాన్ని మలినం చేసిన తర్వాత ఆలయ శుద్ధీకరణ చేశారు. దీన్ని గుర్తుచేసుకోవడానికి ప్రతీ సంవత్సరం పండుగ జరుపుకునేవాళ్లు. ఈ పండుగ కిస్లేవు నెల 25న మొదలై ఎనిమిది రోజుల పాటు జరిగేది.—యోహా 10:22.
సమాధి.
ఇది ఒక వ్యక్తి సమాధిని గానీ, మానవజాతి సాధారణ సమాధిని గానీ సూచించడానికి ఉపయోగించిన పదం. దీనికి హీబ్రూ భాషలో “షియోల్” అనే పదాన్ని, గ్రీకు భాషలో “హేడిస్” అనే పదాన్ని ఉపయోగించారు. అన్ని పనులు, స్పృహ ఆగిపోయే సూచనార్థక చోటు లేదా స్థితి అని బైబిలు దీన్ని వర్ణిస్తోంది.—ఆది 47:30; మత్త 27:61; అపొ 2:31.
సముఖపు రొట్టెలు.
గుడారంలోని, ఆ తర్వాత ఆలయంలోని పవిత్ర స్థలంలో ఉన్న బల్ల మీద ఒక్కొక్క వరుసలో ఆరు చొప్పున రెండు వరుసల్లో పెట్టే పన్నెండు రొట్టెలు. వీటిని “సన్నిధి రొట్టెలు” అని కూడా అంటారు. దేవునికి అర్పించే ఈ రొట్టెలను ప్రతీ విశ్రాంతి రోజున తీసేసి కొత్త రొట్టెలు పెట్టేవాళ్లు. తీసేసిన రొట్టెల్ని సాధారణంగా యాజకులు మాత్రమే తినేవాళ్లు.—2 దిన 2:4; నిర్గ 25:30; లేవీ 24:5-9; మత్త 12:4; హెబ్రీ 9:2.
సాంబ్రాణి.
బోస్వెల్లియ జాతికి చెందిన కొన్ని రకాల చెట్ల నుండి, పొదల నుండి సేకరించే ఎండు జిగురు. దాన్ని కాల్చినప్పుడు సుగంధ పరిమళాలు వెదజల్లేది. గుడారంలో, ఆ తర్వాత ఆలయంలో వేసే పవిత్రమైన ధూపంలో అది కూడా ఉండేది. నైవేద్యాల్లో లేదా ధాన్యం అర్పణల్లో అది ఉండేది; అలాగే పవిత్ర స్థలం లోపలున్న సముఖపు రొట్టెల ప్రతీ వరుస మీద కూడా దాన్ని ఉంచేవాళ్లు.—నిర్గ 30:34-36; లేవీ 2:1; 24:7; మత్త 2:11.
సాతాను.
ఈ పదం “ఎదిరించేవాడు లేదా వ్యతిరేకించేవాడు” అనే అర్థం ఉన్న హీబ్రూ పదం నుండి వచ్చింది. ఇతను దేవుని ముఖ్య వ్యతిరేకి. ఇతనికి అపవాది అనే పేరు కూడా ఉంది.—యోబు 1:6; మత్త 4:10; ప్రక 12:9.
సామెత.
కేవలం కొన్ని మాటల్లో ఓ పాఠాన్ని నేర్పించే లేదా లోతైన సత్యాన్ని తెలియజేసే జ్ఞానవాక్కు లేదా చిన్న కథ. కొన్నిసార్లు బైబిలు సామెతలు చిక్కు ప్రశ్నల రూపంలోనో, పొడుపు కథల రూపంలోనో ఉండవచ్చు. సామెత ఒక సత్యాన్ని వర్ణనాత్మక శైలిలో వివరిస్తుంది, తరచూ అలంకారిక భాషలో వివరిస్తుంది. కొంతమందిని ఎగతాళి చేయడానికి లేదా వాళ్లపట్ల తిరస్కారాన్ని వ్యక్తం చేయడానికి సాధారణంగా కొన్ని సామెతల్ని వాడుతుంటారు.—ప్రసం 12:9; 2 పేతు 2:22.
సిద్ధపడే రోజు.
విశ్రాంతి రోజుకు ముందురోజు. ఆ రోజున యూదులు విశ్రాంతి రోజు కోసం కావాల్సిన ఏర్పాట్లు చేసుకునేవాళ్లు. ఇప్పటి లెక్కలో చెప్పాలంటే, సిద్ధపడే రోజు శుక్రవారం సూర్యాస్తమయంతో ముగుస్తుంది, ఆ తర్వాత విశ్రాంతి రోజు మొదలౌతుంది. యూదులు ఒక సాయంత్రం నుండి మరుసటి సాయంత్రం వరకు ఒక రోజుగా పరిగణించేవాళ్లు.—మార్కు 15:42; లూకా 23:54.
సిరియా, సిరియన్లు.
క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో సిరియా అనేది ఒక రోమా ప్రాంతం, దాని రాజధాని అంతియొకయ. హీబ్రూ లేఖనాల్లో ప్రస్తావించబడిన సిరియాలోని (దీన్నే అరాము అని కూడా పిలిచేవాళ్లు) చాలా భాగం ఈ సిరియాలో ఉండేది. సిరియా అధిపతికి మొత్తం పాలస్తీనాను పర్యవేక్షించే అధికారం కూడా ఉండేది.—లూకా 2:2; అపొ 18:18; గల 1:21.
సీయోను; సీయోను పర్వతం.
ఇది యెబూసీయులకు చెందిన యెబూసు అనే కోటగల నగరం పేరు. అది యెరూషలేముకు ఆగ్నేయ దిశలో ఉన్న కొండ పైన ఉండేది. దావీదు దాన్ని ఆక్రమించుకున్నాక, తన రాజ నివాసాన్ని అక్కడ కట్టుకున్నాడు. దాంతో ఆ నగరాన్ని “దావీదు పురము” అని పిలవడం మొదలుపెట్టారు. (2 సమూ 5:6, 7, 9) దావీదు యెహోవా మందసాన్ని అక్కడికి మార్చినప్పుడు సీయోను యెహోవాకు ఎంతో పవిత్రమైన పర్వతం అయింది. తర్వాత, మోరీయా పర్వతం మీదున్న ఆలయ ప్రాంతాన్ని, అలాగే కొన్నిసార్లు మొత్తం యెరూషలేము నగరాన్ని ఆ పేరుతో పిలిచేవాళ్లు. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో దీన్ని తరచూ అలంకారార్థ భావంలో ఉపయోగించారు.—కీర్త 2:6; 1 పేతు 2:6; ప్రక 14:1.
సున్నతి.
పురుషాంగానికి ముందు ఉండే తోలును తీసేయడం. అబ్రాహాము, అతని వంశస్థులు ఖచ్చితంగా సున్నతి చేసుకోవాలని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే, క్రైస్తవులు సున్నతి చేసుకోవాల్సిన అవసరం లేదు. వేర్వేరు సందర్భాల్లో ఆ పదం అలంకారికంగా కూడా ఉపయోగించబడింది.—ఆది 17:10; 1 కొరిం 7:19; ఫిలి 3:3.
సూచన.
ప్రస్తుతం లేదా భవిష్యత్తులో జరిగే ఒకదాన్ని సూచించగల వస్తువు, పని, పరిస్థితి లేదా అసాధారణ ప్రదర్శన.—మత్త 24:3; ప్రక 1:1.
సూర్తిసు.
ఉత్తర ఆఫ్రికాలోని లిబియా తీరంలో లోతు తక్కువగా ఉండే రెండు పెద్ద సింధుశాఖలు. అలల ఆటుపోట్ల వల్ల అక్కడున్న ఇసుక తీరాలు తరచూ స్థానం మారుతూ ప్రమాదకరంగా ఉండేవి కాబట్టి ప్రాచీన నావికులు వాటికి భయపడేవాళ్లు.—అపొ 27:17.
సొలొమోను మంటపం.
యేసు కాలంలోని ఆలయంలో బయటి ప్రాంగణానికి తూర్పున, పైకప్పు ఉన్న దారి. ఇది సొలొమోను కట్టించిన ఆలయంలోని అవశేషమని చాలామంది నమ్మేవాళ్లు. ‘చలికాలంలో’ యేసు అక్కడ నడిచాడు. తొలి క్రైస్తవులు ఆరాధన కోసం అక్కడ కలుసుకునేవాళ్లు.—యోహా 10:22, 23; అపొ 5:12.
సోదెగాళ్లు.
భవిష్యత్తు చెప్పే సామర్థ్యం తమకుందని చెప్పుకునేవాళ్లు. ఇంద్రజాలం చేసే పూజారుల్ని, చెడ్డదూతల సంబంధమైన మంత్రతంత్ర శక్తులతో భవిష్యత్తు చెప్పేవాళ్లను, జ్యోతిష్యుల్ని, మరితరుల్ని సోదె చెప్పేవాళ్లు అని బైబిలు పిలుస్తుంది.—లేవీ 19:31; ద్వితీ 18:10; అపొ 16:16, పాదసూచిక.
స్తంభం.
సొలొమోను కట్టిన దేవాలయంలో, రాజ భవనాల్లో స్తంభాలు వాడారు. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఈ పదాన్ని మద్దతుకు సూచనగా (1 తిమో 3:15) లేదా స్థానం శాశ్వతంగా ఉంటుందని చెప్పడానికి సూచనగా వాడారు.—న్యాయా 16:29; 1 రాజు 7:21.
స్తోయికుల తత్త్వవేత్తలు.
తర్కానికి, ప్రకృతికి అనుగుణంగా జీవించడమే సంతోషం అని నమ్మే ఒకానొక గ్రీకు పాఠశాల తత్త్వవేత్తలు. వాళ్ల అంచనా ప్రకారం నిజంగా తెలివైన వ్యక్తి అంటే నొప్పికి, సుఖానికి స్పందించనివాడే.—అపొ 17:18.
స్థానిక అధిపతి.
స్మారక సమాధి.
చనిపోయిన వ్యక్తి శవాన్ని పెట్టే చోటు. మ్నెమీయోన్ అనే గ్రీకు పదాన్ని అలా అనువదించారు. ఆ గ్రీకు పదం “గుర్తుచేయడానికి” అనే అర్థమున్న క్రియాపదం నుండి వచ్చింది. చనిపోయిన వ్యక్తి గుర్తుచేసుకోబడుతున్నాడని ఆ క్రియాపదం సూచిస్తుంది.—యోహా 5:28, 29, పాదసూచిక.
స్వతంత్రులు; స్వతంత్రులు అయినవాళ్లు.
రోమా పరిపాలనలో స్వతంత్రులుగా పుట్టి, పౌరసత్వ హక్కులన్నీ కలిగివుండే వాళ్లే “స్వతంత్రులు.” అయితే, బానిసత్వం నుండి విడుదలైన వాళ్లను ‘స్వతంత్రులు అయినవాళ్లు’ అంటారు. అధికారికంగా విడుదలవ్వడం వల్ల స్వతంత్రులు అయినవాళ్లకు రోమా పౌరసత్వం దొరికేది, కానీ వాళ్లు అక్కడి రాజకీయ పదవికి అర్హులు అవ్వరు. అలా కాకుండా మామూలుగా విడుదలయ్యే వాళ్లకు బానిసత్వం నుండి స్వేచ్ఛ దొరికేది కానీ వాళ్లకు పూర్తిస్థాయిలో పౌర హక్కులు లభించేవి కాదు.—1 కొరిం 7:22.
హ
హార్‌మెగిద్దోన్.
ఈ హీబ్రూ పదానికి “మెగిద్దో పర్వతం” అని అర్థం. ఇది, ‘సర్వశక్తిమంతుడైన దేవుని మహారోజున జరిగే యుద్ధానికి’ సంబంధించిన పదం. ఆ రోజున యెహోవాతో యుద్ధం చేయడానికి “భూమంతటా ఉన్న రాజులు” పోగౌతారు. (ప్రక 16:14, 16; 19:11-21)—మహాశ్రమ చూడండి.
హింసాకొయ్య.
నిలువుగా ఉండే కొయ్య లేదా గుంజ అనే అర్థమున్న స్టౌరస్ అనే గ్రీకు పదాన్ని ఇలా అనువదించారు. యేసుకు మరణశిక్ష వేసింది అలాంటి దానిమీదే. స్టౌరస్ అనే గ్రీకు పదం, క్రీస్తు రాకముందు చాలా శతాబ్దాల పాటు అన్యమతాల ప్రజలు మత చిహ్నంగా ఉపయోగించిన సిలువను సూచిస్తుందని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు. “హింసా కొయ్య” అనే మాట మూలభాష పదంలో ఉన్న పూర్తి అర్థాన్ని వివరిస్తుంది. ఎందుకంటే తన అనుచరులకు ఎదురయ్యే హింసను, బాధను, అవమానాన్ని సూచించడానికి కూడా యేసు స్టౌరస్ అనే పదాన్ని ఉపయోగించాడు. (మత్త 16:24; హెబ్రీ 12:2)—కొయ్య చూడండి.
హిస్సోపు.
సన్నని రెమ్మలు, ఆకులు ఉండే మొక్క. దీన్ని శుద్ధీకరణ ఆచారాల్లో రక్తాన్ని లేదా నీళ్లను చిలకరించడానికి వాడేవాళ్లు. బహుశా ఇది సువాసన గల మొక్క అయ్యుంటుంది (ఓరిగ్యానమ్ మరు; ఓరిగ్యానమ్ సిరియాకమ్). యోహాను 19:29 లో హిస్సోపు అనే మాటను ఉపయోగించిన తీరును బట్టి చూస్తే, సువాసన గల మొక్కను ఒక కొమ్మకు తగిలించి ఉపయోగించి ఉంటారు లేదా ఒక రకమైన జొన్న కాడను (సోర్గమ్ వల్గేర్) ఉపయోగించి ఉంటారు. జొన్న కాడ యేసు నోటికి పుల్లటి ద్రాక్షారసాన్ని అందించడానికి కావాల్సినంత పొడవు ఉండివుంటుంది కాబట్టి వాళ్లు దాన్నే వాడివుంటారు.—హెబ్రీ 9:19.
హీబ్రూ.
హెబ్రీయులు మాట్లాడే భాష. యేసు కాలానికల్లా, హీబ్రూ భాషలో చాలా అరామిక్ పదాలు వచ్చి చేరాయి. క్రీస్తు, ఆయన శిష్యులు కూడా ఆ హీబ్రూనే మాట్లాడారు.—అపొ 26:14.
హెబ్రీయుడు.
ఇది మొట్టమొదట అబ్రాముకు (అబ్రాహాముకు) ఉపయోగించబడిన బిరుదు. ఈ పదం, చుట్టుపక్కల ఉన్న అమోరీయుల నుండి అతన్ని వేరు చేసింది. ఆ తర్వాత ఈ పదం, అబ్రాహాము మనుమడైన యాకోబు ద్వారా వచ్చిన అబ్రాహాము వంశస్థుల్ని సూచించడానికి కూడా ఉపయోగించబడింది.—ఆది 14:13; నిర్గ 5:3.
హెర్మే.
ఇతను గ్రీకు దేవుడు, ద్యుపతి కొడుకు. ఇతన్ని దేవతల సందేశకుడని, వాక్చాతుర్యం ఉన్న దేవుడని ప్రజలు అనుకునేవాళ్లు. అందుకే లుస్త్రలో ప్రజలు పౌలును “హెర్మే” అని తప్పుగా పిలిచారు.—అపొ 14:12.
హేడిస్.
ఇది “షియోల్” అనే హీబ్రూ పదానికి సమాన అర్థం ఉన్న గ్రీకు పదం. దీన్ని “సమాధి” అని అనువదించారు. అన్ని పనులు, స్పృహ ఆగిపోయే సూచనార్థక చోటును లేదా స్థితిని ఇది సూచిస్తుంది.—అపొ 2:31.
హేరోదు.
యూదుల్ని పరిపాలించిన రాజ వంశస్థుల ఇంటి పేరు. వీళ్లను రోము నియమించేది. వీళ్లలో మొదటి వ్యక్తి హేరోద్ ద గ్రేట్. ఇతను యెరూషలేము ఆలయాన్ని తిరిగి కట్టించి పేరుగాంచాడు; అలాగే, యేసును నాశనం చేసే ప్రయత్నంలో పిల్లల్ని చంపమనే ఆజ్ఞ ఇచ్చింది కూడా ఇతనే. (మత్త 2:16; లూకా 1:5) హేరోద్ ద గ్రేట్ కొడుకులైన హేరోదు అర్కెలాయు, హేరోదు అంతిప తమ తండ్రి సంస్థానంలో ఉన్న కొన్ని భాగాల మీద నియమించబడ్డారు. (మత్త 2:22) అంతిప చతుర్థాధిపతిగా ఉండేవాడు. కానీ అందరూ అతన్ని “రాజు” అనే పిలిచేవాళ్లు. ఇతను క్రీస్తు మూడున్నర సంవత్సరాల పరిచర్య కాలంలో, అలాగే అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలోని సంఘటనలు జరిగిన కాలం వరకు పరిపాలించాడు. (మార్కు 6:14-17; లూకా 3:1, 19, 20; 13:31, 32; 23:6-15; అపొ 4:27; 13:1) ఆ తర్వాత, హేరోద్ ద గ్రేట్ మనుమడైన హేరోదు అగ్రిప్ప I కొంతకాలం పరిపాలించాక, దేవదూత చేత చంపబడ్డాడు. (అపొ 12:1-6, 18-23) తర్వాత అతని కొడుకు అగ్రిప్ప II పరిపాలన మొదలుపెట్టి, యూదులు రోము మీద తిరుగుబాటు చేసిన కాలం వరకు ఏలాడు.—అపొ 23:35; 25:13, 22-27; 26:1, 2, 19-32.
హేరోదు అనుచరులు.
వీళ్లకు హేరోదీయులు అనే పేరు కూడా ఉంది. వీళ్లు రోమీయుల కింద పరిపాలించిన హేరోదుల రాజకీయ లక్ష్యాలకు మద్దతిచ్చిన జాతీయవాదుల గుంపు. కొంతమంది సద్దూకయ్యులు బహుశా ఈ గుంపుకు చెందినవాళ్లు అయ్యుంటారు. యేసును వ్యతిరేకించడానికి హేరోదీయులు పరిసయ్యులతో చేతులు కలిపారు.—మార్కు 3:6.