సూత్రాన్ని గ్రహించడం పరిపక్వతను ప్రతిబింబిస్తుంది
చెడు సహవాసాలు ఉపయోగకరమైన అలవాట్లను పాడు చేస్తాయి. మీరు దేనిని విత్తుతారో దానినే కోస్తారు. (1 కొరింథీయులు 15:33; గలతీయులు 6:7) శారీరకంగానైనా ఆధ్యాత్మికంగానైనా ప్రతి ప్రస్తావనా ఒక ప్రాథమిక సత్యానికి—ఒక సూత్రానికి—ఉదాహరణ. ప్రతి సూత్రమూ చట్టాలకు ఆధారాన్నిస్తుంది. అయితే చట్టాలు రావచ్చు పోవచ్చు. అవి ప్రత్యేక విషయాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. మరోవైపు సూత్రాలు విశాలమైనవి. అవి శాశ్వతంగా నిలువగలుగుతాయి. అందువల్ల సాధ్యమైనంత మేరకు సూత్రాల్లో ఇమిడి ఉన్నవాటిని గురించి ఆలోచించాలని దేవుని వాక్యం ప్రోత్సహిస్తుంది.
“సాధారణ సత్యం లేదా ప్రాథమిక సత్యం: అర్థం చేసుకోగల ప్రాథమిక నియమం, సిద్ధాంతం, లేదా ఊహ. ఇతర విషయాలు దాని మీదే ఆధారపడతాయి లేదా దాని నుండే వస్తాయి” అని వెబ్స్టర్స్ తర్డ్ న్యూ ఇంటర్నేషనల్ డిక్షనరీ సూత్రాన్ని నిర్వచిస్తుంది. ఉదాహరణకు, “నువ్వు స్టవ్ ముట్టుకోవద్దు” అనే చట్టాన్ని ఒకరు బిడ్డ ముందు పెడతారు. కానీ, పెద్దవాళ్ళతో అయితే, “స్టవ్ వేడిగా ఉంది” అని చెబితే సరిపోతుంది. రెండవ ప్రస్తావన మరింత విస్తారమైన భావం గలదని గమనించండి. ఎందుకంటే, ఒకరు ఏమి చేయాలి—బహుశా వంట చేయాలా, చపాతీలు కాల్చాలా లేదా స్టవ్ ఆపుచేయాలా—అనే విషయాన్ని అది నిర్ణయిస్తుంది. అది ఒక విధంగా సూత్రమే అవుతుంది.
జీవితం యొక్క కీలక సూత్రాలు అనేవి తప్పకుండా ఆధ్యాత్మికమైనవే; అవి మనం దేవుడ్ని ఆరాధించడాన్నీ, మన సంతోషాన్నీ నిర్ణయిస్తాయి. అయితే కొందరు సూత్రాలను గూర్చి వివేచించే ప్రయత్నాన్ని విడిచిపెడతారు. ఒక తీర్మానం చేయవలసి వచ్చినప్పుడు నియమంలోని సౌకర్యాలనే వారు ఇష్టపడతారు. ఇది బుద్ధిహీనతే. ఇది బైబిలు కాలాల్లోని నమ్మకస్థులైన ప్రాచీన పురుషులు ఉంచిన మాదిరికి విరుద్ధమైనది.—రోమీయులు 15:4.
దైవిక సూత్రానుసారులైన పురుషులు
అపరిపూర్ణ మానవుల్లో దైవిక సూత్రానుసారియైన మొదటి మానవుడు హేబెలు అని చెప్పవచ్చు. “సంతతి”ని గూర్చిన వాగ్దానాన్ని గురించి ఆయన చాలా ఎక్కువగా ఆలోచించి ఉండవచ్చు. పాప విమోచనలో రక్త బలి ఇమిడి ఉందని గ్రహించి ఉండవచ్చు. (ఆదికాండము 3:15) అందువల్లే ఆయన “తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్వినవాటిని” దేవునికి అర్పించాడు. “క్రొవ్వినవాటిని” అనే పదబంధం హేబెలు తనకున్నదానిలో నుండి శ్రేష్ఠమైనవాటిని యెహోవాకు అర్పించాడు అని చూపిస్తుంది. అయినప్పటికీ, హేబెలు మరణించి రెండు వేలకన్నా ఎక్కువ సంవత్సరాలు గడిచిన తర్వాతే బలులను గూర్చిన విశదమైన వివరణను యెహోవా ఇచ్చాడు. దైవభయమున్న సూత్రానుసారియైన హేబెలుకు భిన్నంగా, ఆయన సహోదరుడైన కయీను ఏదో యాంత్రికంగా యెహోవాకు బలులర్పించాడు. ఆయన దృక్పథం అసంతృప్తికరమైనది. ఆయన అర్పించిన బలిలో సూత్రానుసారమైన హృదయం కొరవడింది.—ఆదికాండము 4:3-5.
నోవహు కూడా దైవిక సూత్రానుసారియైన వ్యక్తి. దేవుడు ఓడను నిర్మించమని నోవహుకు ప్రత్యేకంగా ఆజ్ఞాపించాడని బైబిలు వృత్తాంతం తెలియజేస్తున్నప్పటికీ, ఇతరులకు ప్రకటించమనే ఆజ్ఞ ఏదీ ఆయనకివ్వబడినట్లు మనకు అందులో కనిపించడంలేదు. అయినప్పటికీ, నోవహు “నీతి ప్రచారకుడు” అని పిలువబడుతున్నాడు. (2 పేతురు 2:5, NW) నోవహు ప్రకటించాలని దేవుడు నిర్దేశించి ఉండక పోవచ్చు, అయినప్పటికీ, ఆయన సూత్రానుసారమైన అంతరాత్మ మరియు తన పొరుగువారి ఎడల ఆయనకున్న ప్రేమా ఆయన అలా చేసేందుకు పురికొల్పాయనేందుకు సందేహం లేదు. మనం నోవహు జీవించినటువంటి కాలంలో జీవిస్తున్నాము కనుక, మనమూ ఆయన శ్రేష్ఠమైన దృక్పథాన్నీ మాదిరినీ అనుకరించుదాం.
యేసు తన కాలంనాటి మతనాయకుల్లాగాక, సూత్రానుసారంగా ఆలోచించేందుకు ప్రజలకు నేర్పించాడు. కొండ మీది ఆయన ప్రసంగం దానికి ఒక ఉదాహరణ. సూత్రాల వైపుకు దృష్టి మళ్ళించడమే ఆ ప్రసంగం యొక్క ఆశయం. (మత్తయి 5-7 అధ్యాయాలు) తనకు ముందటి వాళ్ళయిన హేబెలు మరియు నోవహుల్లాగే తనకు కూడా దేవుడ్ని గురించి నిజంగానే తెలుసు గనుకనే యేసు ఆ విధంగా బోధించాడు. యౌవనస్థుడుగా కూడా ఆయన ప్రాథమిక సత్యాన్ని ఘనపరిచాడు: “ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతిమాటవలన నరులు బ్రదుకుదురు.” (ద్వితీయోపదేశకాండము 8:3; లూకా 2:41-47) అవును, దైవిక సూత్రానుసారిగా ఉండేందుకు కీలకం నిజానికి యెహోవాను, ఆయన ఇష్టాయిష్టాలనూ, ఆయన సంకల్పాలను తెలుసుకోవడమే. దేవుని గూర్చిన ఈ ప్రాథమిక విషయాలు మన జీవితాలను శాసిస్తే అవి సజీవ సూత్రాలుగా మారుతాయి.—యిర్మీయా 22:16; హెబ్రీయులు 4:12.
సూత్రాలు మరియు హృదయం
బహుశా, అవిధేయత మూలంగా వచ్చే శిక్షను గూర్చిన భయం మూలంగా మాత్రమే చట్టాలను అయిష్టంగానే అనుసరించడం సాధ్యమే. అయితే సూత్రాలను అన్వర్తించడం అలాంటి దృక్పథాన్ని నివారిస్తుంది. ఎలాగంటే, సూత్రాల స్వాభావికత అనేది హృదయం నుండి ప్రతిస్పందించడం మూలంగానే వాటిచేత శాసించబడడం జరుగుతుందన్నదే. హేబెలు, నోవహుల్లాగే, మోషే ధర్మశాస్త్ర నిబంధన స్థిరపరచక ముందు జీవించిన యోసేపు విషయమే తీసుకోండి. పోతీఫరు భార్య తన చేత తప్పు చేయించేందుకు ప్రయత్నించినప్పుడు, యోసేపు “నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని” ప్రతిస్పందించాడు. అవును, భార్యాభర్తలు “ఏక శరీరము” అనే సూత్రం యోసేపుకు తెలుసు.—ఆదికాండము 2:24; 39:9.
నేటి లోకం నీతియుక్తమైన సూత్రాలను చెల్లనివ్వదు. తిండిబోతులు తిండి మీద పడినట్లు లోకం దౌర్జన్యమూ మరియు అనైతికతల మీద ఉంది. అపాయమేంటంటే, క్రైస్తవులు దొంగచాటుగా, అదే చిరుతిండిని—సినిమాలను, వీడియోలను, లేదా పుస్తకాలను—రుచి చూసేందుకు ప్రలోభపెట్టబడవచ్చు. అయితే, “మహా శ్రమల” నుండి నమ్మకస్థులైనవారిని మాత్రమే దేవుడు కాపాడతాడని జ్ఞాపకముంచుకుని యోసేపులాగే, మనం సూత్రానుసారంగా చెడైన దానిని నిరాకరించడం ఎంతో ప్రశంసనీయంగా ఉంటుంది. (మత్తయి 24:21) అవును, ముఖ్యంగా మనం బాహ్యంగా కాదు గానీ, వ్యక్తిగతంగా ఎవరమై ఉన్నాం అనేది అంతరంగంలో నిజానికి మనమెవరమై ఉన్నాం అనేదాన్ని బయలుపరుస్తుంది.—కీర్తన 11:4; సామెతలు 15:3.
పైన పేర్కొన్న విషయాల దృష్ట్యా, మనం బైబిలు సూత్రాల చేత నడిపించబడుతున్నట్లయితే, దేవుని చట్టాల్లో లొసుగుల కోసం వెదకం; లేదా నిర్దిష్ట చట్టాన్ని నిజానికి ఎంతమేరకు ఉల్లంఘించకుండా ఉండగలమన్నది చూడ్డానికి ప్రయత్నించం. అలాంటి ఆలోచనా సరళి నాశనకరమైనది; అది చివరికి మనల్ని దెబ్బతీస్తుంది.
చట్టం వెనుక ఏముందో చూడండి
తప్పకుండా, చట్టాలు క్రైస్తవుని జీవితంలో ముఖ్యమైన పాత్రను వహిస్తాయి. అవి మనలను కాపాడేందుకు సహాయపడే రక్షకభటులవంటివి. ప్రాముఖ్యమైన సూత్రాలే వాటికి ఆధారం. అలాంటి సూత్రాలను గ్రహించలేకపోవడం అనేది సంబంధిత చట్టాల ఎడల ఉండే ఇష్టాన్ని తగ్గిస్తుంది. ప్రాచీన ఇశ్రాయేలు జనాంగం ఈ విషయాన్ని వెల్లడి చేసింది.
దేవుడు ఇశ్రాయేలుకు పది ఆజ్ఞలనిచ్చాడు. అందులోని మొదటి ఆజ్ఞ యెహోవాను తప్ప మరే దేవుడ్నైనా ఆరాధించడాన్ని నిషేధిస్తుంది. సమస్తాన్నీ యెహోవాయే సృష్టించాడన్నది ఈ చట్టం వెనుకవున్న ప్రాథమిక సత్యం. (నిర్గమకాండము 20:3-5) అయితే ఆ జనాంగం ఈ సూత్రానుసారంగా జీవించిందా? యెహోవాయే జవాబిస్తున్నాడు: “ఇశ్రాయేలు . . . నీవు మా తండ్రివని మ్రానుతోను—నీవే నన్ను పుట్టించితివని రాతితోను చెప్పుచు, . . . వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి.” (యిర్మీయా 2:27) ఎంతటి కఠినులు, నీతిసూత్రాలు లేని మూర్ఖులు! అది యెహోవా హృదయాన్ని ఎంతగా గాయపరిచిందో!—కీర్తన 78:40, 41; యెషయా 63:9, 10.
క్రైస్తవులకు కూడా దేవుడిచ్చిన చట్టాలున్నాయి. ఉదాహరణకు, వాళ్ళు విగ్రహారాధనను, లైంగిక అనైతికతనూ, రక్త దుర్వినియోగమును వర్జించాలి. (అపొస్తలుల కార్యములు 15:28, 29) మీరు వాటిని గురించి ఆలోచించినప్పుడు, మన అనితర భక్తికి దేవుడు అర్హుడు; మనం మన వివాహ జతకు నమ్మకస్థులముగా ఉండాలి; యెహోవాయే మన జీవదాత వంటి వాటిలో దాగివున్న సూత్రాలను గ్రహించగలరు. (ఆదికాండము 2:24; నిర్గమకాండము 20:5; కీర్తన 36:9) ఈ నిర్దేశాల వెనుక దాగివున్న సూత్రాలను మనం గ్రహించి వాటిని హృదయపూర్వకంగా ప్రశంసిస్తున్నట్లయితే, అవి మన మంచి కోసమేనని తెలుసుకోగలుగుతాం. (యెషయా 48:17) మనకు, దేవుని “ఆజ్ఞలు భారమైనవి కావు.”—1 యోహాను 5:3.
గతంలో ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యం చేయగా, యేసు కాలం నాటికి వారి “ధర్మశాస్త్ర పండితులు” అనబడే శాస్త్రులు మరో విధమైన విపరీత ధోరణితో ఉన్నారు. వారు లెక్కలేనన్ని నియమాలను పారంపర్యాలను రూపొందించారు. అవి స్వచ్ఛారాధనకు అవరోధము కలిగించి దైవిక సూత్రాలను మరుగు చేశాయి. (మత్తయి 23:2, NEB) ప్రజలు తమ ఓటమిని, నిస్సహాయతను అంగీకరించారు లేదా వేషధారణకు లోబడ్డారు. (మత్తయి 15:3-9) మానవులు చేసిన మరనేక చట్టాలు క్రూరంగా ఉండేవి. యేసు ఊచచెయ్యిగల వ్యక్తిని స్వస్థపరచబోతూ, “విశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమా” అని అక్కడున్న పరిసయ్యులను ప్రశ్నించాడు. ధర్మం కాదు అని ధ్వనించే వారి మౌనం “వారి హృదయ కాఠిన్యమునకు” యేసు “దుఃఖ”పడేలా చేశాయి. (మార్కు 3:1-6) పరిసయ్యులు విశ్రాంతి దినాన దెబ్బతగిలిన లేదా గాయం తగిలిన పెంపుడు జంతువుకు (అది వాళ్ళ సొత్తు) సహాయం చేస్తారు. కానీ, జీవన్మరణ సమస్య తప్ప మరే సమస్యైనా సరే ఏ స్త్రీకి గానీ పురుషునికి గానీ సహాయం చేయరు. నిజంగా, మొత్తం చిత్రాన్ని చూడక, పెయింటింగ్ మీదుగా పాకుతున్న చీమలనే చూస్తున్నవారిలా వారి మెదడు నిండా మానవ నియమాలూ, శాసన వివరాలు మాత్రమే ఉన్నందువల్ల దైవిక సూత్రాలను గ్రహించడంలో పరాజయం పొందారు.—మత్తయి 23:23, 24.
అయితే, చిన్నవాళ్ళు కూడా తమ హృదయాలను యథార్థంగా ఉంచుకున్నట్లయితే, బైబిలు సూత్రాల ఎడల తమకు గల మెప్పుదలను బట్టి యెహోవాకు మహిమను తేగలరు. పదమూడేండ్ల రిబెకా వాళ్ళ టీచర్ ఎవరెవరు జూదం ఆడుతారు అని క్లాసులో అందరినీ అడిగారు. దాదాపు అందరూ తాము జూదమాడమని చెప్పారు. అయితే జూదమనేది పలు విధాలై ఉండవచ్చన్నది పేర్కొన్నప్పుడు, రిబెకా తప్ప మిగిలిన అందరూ తాము ఏదో ఒక రకంగా జూదమాడుతున్నామని అయిష్టంగానే ఒప్పుకున్నారు. విలువైన దానిని పొందేందుకు చౌకగా ఉండే ఒక రాఫిల్ టికెట్‌ను కొంటావా అని టీచర్ రిబెకాను అడిగారు. తాను కొనదని చెప్పి, అదీ ఒక రకమైన జూదమే అవుతుందనే దానికి లేఖనాధార కారణాలను కూడా రిబెకా చెప్పింది. అప్పుడు ‘నా అభిప్రాయం ప్రకారం, నేను చెప్పే “సూత్రాలు” అనే పదం యొక్క నిజమైన భావంలో సూత్రాలు ఉన్నది రిబెకాకు మాత్రమే’ అని టీచర్ క్లాస్‌లో అందరితో చెప్పారు. అవును రిబెకా “ఇది నా మతానికి విరుద్ధమైనది” అని మాత్రమే చెప్పవచ్చు. కాని ఆమె అంతకన్నా ఎక్కువగానే ఆలోచించింది; జూదం ఏ కారణాన తప్పో, అందులో తాను పాల్గొనడానికి ఎందుకు నిరాకరిస్తుందో చెప్పగలిగింది.
హేబెలు, నోవహు, యోసేపు, మరియు యేసు వంటి మాదిరులు మనం దేవుడ్ని ఆరాధించడంలో “ఆలోచనా శక్తిని,” మన “వివేచనా శక్తిని” ఉపయోగించడం ద్వారా ఎలా ప్రయోజనం పొందవచ్చో చూపిస్తున్నాయి. (సామెతలు 2:11, NW; రోమీయులు 12:1) క్రైస్తవ పెద్దలు “దేవుని మందను పైవిచారణ చేయుచు” యేసును బాగా అనుకరిస్తారు. (1 పేతురు 5:2) యేసు చక్కగా తెలియజేసినట్లు, యెహోవా సర్వాధిపత్యంలో వర్ధిల్లేది దైవిక సూత్రాలను ఇష్టపడేవారే.—యెషయా 65:14.