కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwbr22 మార్చి పేజీలు 1-7
  • క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు
  • క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2022)
  • ఉపశీర్షికలు
  • మార్చి 7-13
  • మార్చి 14-20
  • మార్చి 21-27
  • మార్చి 28–ఏప్రిల్‌ 3
  • ఏప్రిల్‌ 4-10
  • ఏప్రిల్‌ 18-24
  • ఏప్రిల్‌ 25–మే 1
క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2022)
mwbr22 మార్చి పేజీలు 1-7

క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు

మార్చి 7-13

దేవుని వాక్యంలో ఉన్న సంపద | 1 సమూయేలు 12-13

“అహంకారం అవమానానికి నడిపిస్తుంది”

w00 8/1 13వ పేజీ, 17వ పేరా

అహంకారము అవమానానికి నడిపిస్తుంది

మొదటిసారి చూసినప్పుడు, సౌలు చేసిన పని సరైనదిగానే అనిపిస్తుంది. ఎంతైనా దేవుని ప్రజలు “దిగులుపడు”తున్నారు, వారు “ఇరుకులో” ఉన్నారు, తామున్న దుర్భరమైన స్థితిని బట్టి వారు భయపడిపోతున్నారు. (1 సమూయేలు 13:6, 7) అలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు చొరవ తీసుకోవడం కచ్చితంగా తప్పేమీ కాదు. అయితే యెహోవా హృదయాలను చదువగలడనీ మన అంతరంగంలోని దృక్పథాలను సహితం గ్రహించగలడనీ గుర్తుంచుకోండి. (1 సమూయేలు 16:7) కాబట్టి, బైబిలు వృత్తాంతంలో సూటిగా చెప్పబడని సౌలులోని కొన్ని అంశాలను ఆయన చూసివుంటాడు. ఉదాహరణకు, సౌలు అసహనం, గర్వం నుండి తలెత్తిందని యెహోవా చూసి ఉంటాడు. ఇశ్రాయేలీయులందరికీ రాజైన తాను, వృద్ధుడూ ఆలస్యం చేస్తున్న ప్రవక్తా అని తాను భావిస్తున్న వ్యక్తి కోసం వేచి ఉండవలసి రావడాన్ని బట్టి సౌలు ఎంతో చికాకుపడి ఉండవచ్చు! ఏదేమైనా, సమూయేలు ఆలస్యం చేయడంతో, విషయాల్ని తన చేతుల్లోకి తీసుకోవడానికీ, తనకివ్వబడిన స్పష్టమైన నిర్దేశాల్ని గాలికొదిలేయడానికీ తనకు అధికారం లభించిందనీ సౌలు భావించాడు. ఫలితం? సౌలు తీసుకున్న చొరవను సమూయేలు మెచ్చుకోలేదు. బదులుగా అతడు, ‘యెహోవా నీకు ఆజ్ఞాపించినదాని నీవు గైకొనకపోతివి గనుక నీ రాజ్యము నిలువదు’ అంటూ సౌలును తీవ్రంగా మందలించాడు. (1 సమూయేలు 13:13, 14) మరొకసారి, అహంకారం అవమానానికి నడిపింది.

w07 6/15 27వ పేజీ, 8వ పేరా

మీ విధేయతను యెహోవా అమూల్యమైనదిగా పరిగణిస్తాడు

రాజైన సౌలును గురించిన బైబిలు వృత్తాంతం విధేయత అత్యంత ప్రాముఖ్యమనే విషయాన్ని నొక్కిచెబుతోంది. సౌలు తన పరిపాలనను, వినయస్థునిగా, ‘తన దృష్టికి తానే అల్పునిగావున్న’ నమ్రతగల పాలకునిగా ప్రారంభించాడు. కానీ ఆ తర్వాత, అహంకారం, అబద్ధ తర్కం ఆయన నిర్ణయాలను నిర్దేశించడం ఆరంభించాయి. (1 సమూయేలు 10:21, 22; 15:17) ఒకసారి సౌలు యుద్ధంలో ఫిలిష్తీయులను ఎదుర్కోవలసి వచ్చింది. తానొచ్చి యెహోవాకు బలులు అర్పించి అదనపు నిర్దేశమిచ్చేవరకు వేచివుండమని రాజుతో సమూయేలు చెప్పాడు. అయితే సమూయేలు వస్తాడని ఎదురుచూసినంత త్వరగా ఆయన రాలేదు, దానితో ప్రజలు అక్కడనుండి చెదిరిపోవడం ఆరంభించారు. అదిచూసి సౌలు “దహనబలి అర్పిం[చాడు].” అది యెహోవాను నొప్పించింది. చివరకు సమూయేలు వచ్చినప్పుడు, ఆయన రాక ఆలస్యమవడంతో యెహోవాను శాంతిపర్చేందుకు తానే ‘సాహసించి’ దహనబలిని అర్పించానని రాజు తన అవిధేయతకు సాకు చెప్పాడు. సమూయేలు వచ్చి ఆ బలి అర్పించేవరకు వేచివుండాలని తానుపొందిన నిర్దేశానికి విధేయుడవడంకన్నా బలి అర్పించడమే రాజైన సౌలుకు మరింత ప్రాముఖ్యమైంది. సమూయేలు ఆయనకిలా చెప్పాడు: “నీ దేవుడైన యెహోవా నీ కిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి.” యెహోవాకు అవిధేయత చూపించడంవల్ల సౌలు తన రాజరికాన్ని పోగొట్టుకున్నాడు.—1 సమూయేలు 10:8; 13:5-13.

దేవుని వాక్యంలో రత్నాలు

w11 7/15 14వ పేజీ, 15వ పేరా

యెహోవా ప్రేమతో ఇస్తున్న నడిపింపును మీరు అనుసరిస్తారా?

యెహోవా కన్నా మానవ రాజుపై ఎక్కువ నమ్మకం ఉంచగలుగుతామని ఇశ్రాయేలీయులు అనుకొని ఉండవచ్చు. ఒకవేళ వారి ఆలోచన అదే అయితే మాత్రం వారు ‘ప్రయోజనంలేనివాటిని’ అనుసరిస్తున్నట్లే. ఎందుకంటే వారు ప్రయోజనంలేని ఒకదాన్ని నమ్మారు కాబట్టి సాతాను ఎరగా చూపించే ప్రయోజనంలేని ఇతర విషయాలను ఇట్టే నమ్మే ప్రమాదం ఉంది. ఉదాహరణకు మానవ రాజు, విగ్రహారాధన చేసేలా వారిని ప్రేరేపించే ప్రమాదం ఉంది. విగ్రహాలను ఆరాధించేవారు వాటిని చూడగలుగుతారు, ముట్టుకోగలుగుతారు కాబట్టి చెక్కతో లేక రాయితో చేయబడిన దేవుళ్ళను తాము నమ్మవచ్చని అనుకుంటారు. వారు సమస్తాన్ని సృష్టించిన అదృశ్య దేవుడైన యెహోవాను నమ్మరు. విగ్రహాలు ‘వట్టివని’ అపొస్తలుడైన పౌలు అన్నాడు. (1 కొరిం. 8:4) అవి చూడలేవు, వినలేవు, మాట్లాడలేవు, ఏమీ చేయలేవు. కేవలం వాటిని చూడవచ్చు, ముట్టుకోవచ్చు అనే ఒక్క కారణాన్ని బట్టి వాటిని ఆరాధించడం అవివేకం. అవి ఎవ్వరికీ సహాయం చేయలేవు. అవి ‘ప్రయోజనంలేనివి.’ వాటిపై నమ్మకముంచేవారు ‘వాటివంటివారే.’—కీర్త. 115:4-8.

మార్చి 14-20

దేవుని వాక్యంలో ఉన్న సంపద | 1 సమూయేలు 14-15

“బలి అర్పించడం కన్నా లోబడడం మంచిది”

w07 6/15 26వ పేజీ, 4వ పేరా

మీ విధేయతను యెహోవా అమూల్యమైనదిగా పరిగణిస్తాడు

యెహోవా సృష్టికర్త కాబట్టి వస్తుపరంగా మనకున్నవన్నీ నిజానికి ఆయనకు చెందినవే. కాబట్టి, మనమాయనకు ఇవ్వగలిగింది ఏమైనావుందా? ఉంది, ఆయనకు మనం అత్యంత విలువైనదే ఇవ్వగలం. ఏమిటది? అదేమిటో ఈ క్రింది ఉపదేశంలో మనం చూడవచ్చు: “నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.” (సామెతలు 27:11) మనం దేవునికి విధేయతను చూపించవచ్చు. మానవులు పరీక్షలు ఎదుర్కొంటున్నప్పుడు వారు దేవునిపట్ల విశ్వసనీయంగా ఉండరని అపవాదియగు సాతాను దురుద్దేశపూరితంగా ఆరోపించాడు కాబట్టి, మన పరిస్థితులు, నేపథ్యాలు విభిన్నంగావున్నా, మనలో ప్రతీ ఒక్కరం దేవునికి విధేయులుగా ఉండడం ద్వారా సాతాను చేసిన ఆరోపణకు ప్రత్యుత్తరమివ్వవచ్చు. అదెంతటి ఆధిక్యతో కదా!

it-2-E 521వ పేజీ, 2వ పేరా

లోబడడం

దేవునికి అవిధేయత చూపించి, ఆ తర్వాత దానికి ప్రాయశ్చిత్తంగా ఏదైనా మంచిపని చేస్తే దేవుడు అంగీకరిస్తాడని అనుకోవడం చాలా తప్పు. అలాంటివాళ్లను దేవుడు ఇష్టపడడు. రాజైన సౌలుకు సమూయేలు ఇలా చెప్పాడు: “యెహోవాను ఏది ఎక్కువ సంతోషపెడుతుంది? జంతువుల్ని దహనబలులుగా అర్పించడమా లేక యెహోవా మాటకు లోబడడమా? చూడు! బలి అర్పించడం కన్నా లోబడడం మంచిది, పొట్టేళ్ల కొవ్వును అర్పించడం కన్నా మాట వినడం మంచిది.” (1స 15:22) మనం యెహోవాకు లోబడకపోతే మనకు ఆయన మాట మీదే కాదు, ఆయన మీద కూడా నమ్మకం లేనట్లే. అందుకే దేవునికి లోబడని వ్యక్తి సోదె చెప్పే వ్యక్తితో, విగ్రహాల్ని పూజించే వ్యక్తితో సమానమని బైబిలు చెప్తోంది. (1స 15:23; రోమా 6:16 పోల్చండి.) ఫలానా పని చేస్తామని ఒప్పుకుంటే సరిపోదు, ఆ పనిని చేయాలి. ఒకవేళ మనకు చెప్పిన పనిని చేయకపోతే, ఆ పని అప్పగించిన వ్యక్తి మీద మనకు పూర్తి నమ్మకం గానీ, గౌరవం గానీ లేవని అర్థం. (మత్త 21:28-32)

దేవుని వాక్యంలో రత్నాలు

it-1-E 493

కనికరం

ఒకవేళ మనం ఒత్తిడికి లొంగిపోయి, దేవుడు కనికరం చూపించవద్దని చెప్తున్న వాళ్లమీద కనికరం చూపిస్తే, తీవ్రమైన పర్యవసానాలను అనుభవించాల్సి రావచ్చు. రాజైన సౌలు అనుభవం మనకు ఆ విషయాన్నే స్పష్టం చేస్తుంది. అమాలేకీయుల మీద కనికరం చూపించవద్దని యెహోవా సౌలుకు ఆజ్ఞాపించాడు. ఎందుకు? ఎందుకంటే ఐగుప్తు నుండి విడుదలైన ఇశ్రాయేలీయుల మీద, ఏ కారణం లేకుండా దాడిచేసిన మొదటివాళ్లు అమాలేకీయులే. కాబట్టి అమాలేకీయుల్ని నాశనం చేస్తానని యెహోవా అప్పుడే నిర్ణయించాడు. ఆ నిర్ణయాన్ని అమలుచేసే సమయం వచ్చినప్పుడు, సౌలు తన ప్రజల ఒత్తిడికి లొంగిపోయి అమాలేకీయులందర్నీ తుడిచిపెట్టేయమని యెహోవా ఇచ్చిన ఆజ్ఞకు పూర్తిగా లోబడలేదు. అందుకే యెహోవా సౌలును రాజుగా తిరస్కరించాడు. (1స 15:2-24) సౌలులా ప్రవర్తించకూడదని, దేవుని ఆమోదం పోగొట్టుకోకూడదని అనుకునేవాళ్లు రెండు పనులు చేయాలి. మొదటిది, యెహోవా చెప్పినట్లు చేయడమే సరైనదని నమ్మాలి. రెండోది, యెహోవాకు విశ్వసనీయంగా ఉండడాన్ని జీవితంలో అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఎంచాలి.

మార్చి 21-27

దేవుని వాక్యంలో ఉన్న సంపద | 1 సమూయేలు 16-17

“యుద్ధం యెహోవాది”

wp16.4 11వ పేజీ, 2-3 పేరాలు

“యుద్ధం యెహోవాది”

సింహంతో, ఎలుగుబంటితో పోరాడిన సంగతి గుర్తుచేసి దావీదు సౌలుకు భరోసా ఇస్తాడు. దావీదు గొప్పలు చెప్పుకుంటున్నాడా? లేదు. ఆ పోరాటాలు ఎలా గెల్చాడో దావీదుకు తెలుసు, అతను ఇలా అన్నాడు, “సింహముయొక్క బలమునుండియు, ఎలుగుబంటియొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించును.” సౌలుకు నమ్మకం కలిగి, “పొమ్ము; యెహోవా నీకు తోడుగానుండును గాక” అని అంటాడు.—1 సమూయేలు 17:37.

దావీదు లాంటి విశ్వాసం మీరూ చూపించాలని అనుకుంటున్నారా? అయితే గమనించండి, దావీదుకు విశ్వాసం ఒక ఊహ లేదా గుడ్డి నమ్మకాన్ని బట్టి రాలేదు. ఆ విశ్వాసం ఆయనకున్న జ్ఞానం, అనుభవం బట్టి వచ్చింది. యెహోవా ప్రేమతో రక్షిస్తాడని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని దావీదుకు తెలుసు. మనం కూడా అలాంటి విశ్వాసాన్ని పెంచుకోవాలంటే బైబిల్లో ఉన్న దేవుని గురించి నేర్చుకుంటూ ఉండాలి. మనం నేర్చుకున్నవాటి ప్రకారం జీవిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అవి మన విశ్వాసాన్ని బలపరుస్తాయి.—హెబ్రీయులు 11:1.

wp16.4 11-12 పేజీలు

“యుద్ధం యెహోవాది”

దానికి దావీదు ఇచ్చిన జవాబు ఈ రోజు వరకు విశ్వాసానికి గొప్ప నిదర్శనంగా ఉంది. ఆ కుర్రవాడు గొల్యాతుతో, “నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను” అనడం ఊహించుకోండి. మనుషుల శక్తి, వాళ్ల ఆయుధ బలం కొంతవరకే అని దావీదుకు తెలుసు. గొల్యాతు యెహోవా దేవునికి గౌరవం చూపించలేదు కాబట్టి యెహోవాయే అతనికి బదులిస్తాడు. అందుకే దావీదు ఇలా అన్నాడు, “యుద్ధము యెహోవాదే.”—1 సమూయేలు 17:45-47.

గొల్యాతు భారీ శరీరం, అతని ఆయుధాలు దావీదు కళ్లకు కనిపించక కాదు కానీ, వాటికి అతను భయపడలేదు. సౌలు, అతని సైన్యం చేసిన తప్పును దావీదు చేయలేదు. దావీదు తనని గొల్యాతుతో పోల్చుకోలేదు. కానీ గొల్యాతును యెహోవా దేవునితో పోల్చి చూశాడు. తొమ్మిదిన్నర అడుగులు (2.9 మీటర్ల) ఎత్తున్న గొల్యాతు అందరికన్నా ఎత్తుగా ఉన్నా, విశ్వానికి అధిపతియైన యెహోవాతో పోలిస్తే ఎంతమాత్రపువాడు? ఎంత ఎత్తున్నా ఒక చిన్న పురుగుతో సమానం, అదే గాక యెహోవా ఇతనిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు.

wp16.4 12వ పేజీ, 4వ పేరా

“యుద్ధం యెహోవాది”

నేడు దేవుని సేవకులు ఆయుధాలతో యుద్ధం చేయరు. ఆ కాలం దాటిపోయింది. (మత్తయి 26:52) కానీ మనం దావీదు విశ్వాసాన్ని అనుసరించాల్సిన అవసరం ఇంకా ఉంది. ఆయనలానే మనం యెహోవా నిజంగా ఉన్నాడని, ఎంతో గౌరవంతో ఆరాధించాల్సిన ఏకైక దేవుడని గుర్తించాలి. కొన్నిసార్లు మన సమస్యల ముందు మనం చిన్నవాళ్లగా కనబడతాము, కానీ అపారమైన యెహోవా శక్తితో పోలిస్తే మన సమస్యలు చాలా చిన్నవి. యెహోవాను మన దేవునిగా చేసుకుంటే, దావీదులా ఆయన మీద విశ్వాసం ఉంచితే ఏ పరీక్ష ఏ సమస్య మనల్ని భయపెట్టలేదు. యెహోవా జయించలేనిదంటూ ఏదీ లేదు.

దేవుని వాక్యంలో రత్నాలు

it-2-E 871-872

సౌలు

యెహోవా సౌలు నుండి తన పవిత్రశక్తిని తీసేశాడు. దాంతో ప్రతికూల ఆలోచనలు సౌలు మనశ్శాంతిని దూరం చేశాయి. అతను తప్పుగా ఆలోచిస్తూ, లేనిపోనివి ఊహించుకుంటూ ఉన్నాడు. సౌలు యెహోవా మాటకు లోబడనప్పుడు, అతని మనసులో అలాగే హృదయంలో ఉన్న చెడుతనం బయటపడింది. అప్పటినుండి, సౌలును అతని తప్పుడు ఆలోచనల నుండి, భావాల నుండి కాపాడడానికి, వాటితో పోరాడడానికి యెహోవా తన పవిత్రశక్తి సహాయాన్ని ఇవ్వలేదు.—1స 16:14,15.

మార్చి 28–ఏప్రిల్‌ 3

దేవుని వాక్యంలో ఉన్న సంపద | 1 సమూయేలు 18-19

“విజయం సాధించినా వినయంగా ఉండండి”

w04 4/1 15వ పేజీ, 4వ పేరా

మారుతున్న జీవన పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు దేవుని ఆత్మపై ఆధారపడండి

గొర్రెలు కాసుకునే ఆ బాలుడు త్వరలోనే జనాంగంలో గొప్ప పేరుప్రతిష్ఠలు పొందాడు. రాజు దగ్గర సేవకునిగా ఉంటూ ఆయనకోసం సంగీతం వాయించడానికి పిలువబడ్డాడు. కాకలుతీరిన ఇశ్రాయేలు సైనికులు సైతం ఎదుర్కోవడానికి భయపడిన భారీశరీరంగల యోధుడైన గొల్యాతును ఆయన హతమార్చాడు. సైనికులపై నాయకునిగా నియమించబడిన దావీదు ఫిలిష్తీయులపై విజయవంతంగా యుద్ధాలుచేశాడు. ప్రజలు ఆయనను ప్రేమించారు. ఆయనను పొగుడుతూ ప్రజలు పాటలుకట్టారు. అంతకుముందు, రాజు సలహాదారుడు ఒకరు యువ దావీదును సితారా “చమత్కారముగా వాయింపగలడు” అనే కాకుండా, “బహు శూరుడును, యుద్ధశాలియు మాటనేర్పరియు రూపసియునైయున్నాడు” అని కూడా వర్ణించాడు.—1 సమూయేలు 16:18; 17:23, 24, 45-51; 18:5-7.

w18.01 28వ పేజీ, 6-7 పేరాలు

మనుషుల్లో ఉన్న తేడా చూడండి

కొంతమంది తమ అందాన్ని బట్టి, పేరు-ప్రఖ్యాతల్ని బట్టి, సంగీతంలో తమకున్న ప్రావీణ్యాన్ని బట్టి, తమ బలాన్ని బట్టి, లేదా ఇతరులు తమకిచ్చే గౌరవాన్ని బట్టి గర్వం చూపిస్తారు. దావీదుకు అవన్నీ ఉన్నప్పటికీ తన జీవితమంతా వినయంగా ఉన్నాడు. ఉదాహరణకు, దావీదు గొల్యాతును చంపిన తర్వాత, రాజైన సౌలు తన కూతుర్ని పెళ్లి చేసుకోమని దావీదును అడిగాడు. కానీ, “రాజునకు అల్లుడనగుటకు నేనెంతటివాడను? నా స్థితియైనను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివి” అని దావీదు అన్నాడు. (1 సమూ. 18:18) అలా వినయంగా ఉండడానికి దావీదుకు ఏది సహాయం చేసింది? తనకున్న లక్షణాలు, సామర్థ్యాలు, సేవావకాశాలు అన్నీ దేవుడు వినయంగా తన మీద దృష్టి పెట్టడం వల్లే వచ్చాయని దావీదుకు తెలుసు. (కీర్త. 113:5-8) తన దగ్గరున్న మంచివన్నీ యెహోవాయే ఇచ్చాడని ఆయన గుర్తించాడు.—1 కొరిం. 4:7 పోల్చండి.

7 నేడున్న యెహోవా సేవకులు దావీదులాగే వినయంగా ఉండడానికి కృషిచేస్తారు. విశ్వంలో అందరికన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్న యెహోవాయే వినయాన్ని చూపిస్తున్నాడని తెలుసుకోవడం ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో కదా! (కీర్త. 18:35) మనం ఈ మాటల్ని పాటిస్తాం, “వాత్సల్యంతో కూడిన ప్రేమను, కనికరాన్ని, దయను, వినయాన్ని, సౌమ్యతను, ఓర్పును అలవర్చుకోండి.” (కొలొ. 3:12) అంతేకాదు ప్రేమ “గొప్పలు చెప్పుకోదు, గర్వంతో ఉబ్బిపోదు” అని మనకు తెలుసు. (1 కొరిం. 13:4) మనం వినయంగా ఉండడం ఇతరులు చూసినప్పుడు, వాళ్లు కూడా యెహోవాను తెలుసుకోవడానికి ఇష్టపడవచ్చు. క్రైస్తవ భార్య మంచి ప్రవర్తన చూసి యెహోవాసాక్షికాని భర్త ఎలాగైతే సత్యంలోకి వచ్చే అవకాశం ఉందో, అలాగే దేవుని సేవకుల వినయాన్ని చూసి ఇతరులు దేవుని గురించి తెలుసుకునే అవకాశం ఉంది.—1 పేతు. 3:1.

దేవుని వాక్యంలో రత్నాలు

it-2 695-696

ప్రవక్త

ప్రవక్తలు దేవుని పవిత్రశక్తి వాళ్లమీదికి వచ్చినప్పుడు మాత్రమే ప్రవచించారు. (యెహె 11:4,5; మీకా 3:8) ఆ శక్తే వాళ్లను అసాధారణమైన పనులు చేసేలా, కొన్ని సందర్భాల్లో వింతగా ప్రవర్తించేలా ప్రేరేపించింది. అందుకే కొన్నిసార్లు, బైబిలు కొంతమందిని ఉద్దేశించి, వాళ్లు ‘ప్రవక్తల్లా ప్రవర్తించడం మొదలుపెట్టారని’ చెప్తుంది. (1స 10:6-11; 19:20-24; యిర్మీ 29:24-32; అపొస్తలుల కార్యాలు 2:4, 12-17; 6:15; 7:55 పోల్చండి.) ఒక సందర్భంలో సౌలు తన “బట్టలు తీసేసి,” “అతను ఆ రోజు పగలంతా, రాత్రంతా బట్టలు లేకుండా పడివున్నాడు.” దానిగురించి ప్రస్తావిస్తూ సౌలు “ప్రవక్తలా ప్రవర్తించాడు” అని బైబిలు చెప్తుంది. (1స 19:18–20:1) దానర్థం ప్రవక్తలు ఎప్పుడూ బట్టలు లేకుండా ఉంటారని కాదు. ప్రవక్తల గురించి బైబిలు మాట్లాడుతున్న చాలా సందర్భాల్లో వాళ్లు బట్టలు వేసుకునే ఉన్నారు. మరి సౌలు బట్టలు లేకుండా ఉండడానికి కారణం ఏంటి? అది బైబిల్లో లేదు. కాకపోతే అతను అలా ఉండడానికి గల కొన్ని కారణాల్ని మనం ఊహించవచ్చు. మొదటిది, రాజవస్త్రాలు తీసేస్తే అతను కూడా అందరిలాంటి వ్యక్తేనని, అతనేమీ ప్రత్యేకమైన వ్యక్తి కాదని చూపించడానికి కావచ్చు. రెండోది, యెహోవాకున్న అధికారం, శక్తి ముందు సౌలు ఎంత నిస్సహాయుడో నిరూపించడానికి, యెహోవా సౌలును ఏమైనా చేయగలడని రుజువు చేయడానికి కావచ్చు.

ఏప్రిల్‌ 4-10

దేవుని వాక్యంలో ఉన్న సంపద | 1 సమూయేలు 20-22

“మంచి స్నేహితునిగా ఎలా ఉండవచ్చు?”

w19.11 7వ పేజీ, 18వ పేరా

అంతం రాకముందే బలమైన స్నేహాన్ని వృద్ధిచేసుకోండి

నేడు, మన సహోదరసహోదరీలు ఎన్నో రకాల కష్టాల్ని ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు ప్రకృతి విపత్తుల ద్వారా లేదా యుద్ధాలు, కాలుష్యం, తీవ్రవాదం లాంటి మనుషులు తీసుకొచ్చే విపత్తుల ద్వారా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివి జరిగినప్పుడు మనలో కొంతమందిమి, సహోదరసహోదరీలను మన ఇళ్లలో ఉండడానికి ఆహ్వానిస్తాం. ఇంకొంతమందిమి వాళ్లకు ఆర్థికంగా సహాయం చేయగలుగుతాం. అయితే, మనందరం వాళ్లకోసం యెహోవాకు ప్రార్థించవచ్చు. ఒక సహోదరుడు లేదా సహోదరి నిరుత్సాహంలో ఉన్నారని తెలిస్తే, వాళ్లతో ఏం మాట్లాడాలో లేదా వాళ్లకోసం ఏం చేయాలో మనకు తెలియకపోవచ్చు. కానీ మనందరం ఏదోక సహాయం చేయగలం. ఉదాహరణకు, మనం వాళ్లతో సమయం గడపవచ్చు; వాళ్లు మాట్లాడుతున్నప్పుడు దయగా వినవచ్చు; మనకు నచ్చిన ఓదార్పుకరమైన లేఖనం చూపించవచ్చు. (యెష. 50:4) అన్నిటినీ మించి, మీ స్నేహితులు అవసరంలో ఉన్నప్పుడు వాళ్లకు సహాయం చేయడానికి మీరు అందుబాటులో ఉండడం చాలా ప్రాముఖ్యం.—సామెతలు 17:17 చదవండి.

w08 2/15 8వ పేజీ, 7వ పేరా

యెహోవా త్రోవల్లో నడవండి

మనం నమ్మదగిన స్నేహితులుగా ఉండాలని యెహోవా ఆశిస్తున్నాడు. (సామె. 17:17) సౌలు రాజు కుమారుడైన యోనాతాను దావీదుకు స్నేహితుడయ్యాడు. దావీదు గొల్యాతును చంపాడని యోనాతాను తెలుసుకున్నప్పుడు “యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను; యోనాతాను దావీదును తన ప్రాణస్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను.” (1 సమూ. 18:1, 3) సౌలు దావీదును చంపాలనుకున్నప్పుడు దాని గురించి దావీదును ఆయన హెచ్చరించాడు కూడా. దావీదు పారిపోయిన తర్వాత, యోనాతాను ఆయనను కలుసుకొని ఆయనతో ఒక నిబంధన చేసుకున్నాడు. దావీదు గురించి సౌలుతో మాట్లాడడంవల్ల యోనాతానుకు దాదాపు ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది, అయినా ఆ ఇద్దరు స్నేహితులు మళ్లీ కలుసుకొని తమ స్నేహబంధాన్ని కొనసాగించారు. (1 సమూ. 20:24-41) వారు చివరిసారిగా కలుసుకున్నప్పుడు యోనాతాను “దేవునిబట్టి” దావీదును బలపర్చాడు.—1 సమూ. 23:16-18.

w09 10/15 19వ పేజీ, 11వ పేరా

ప్రేమలేని లోకంలో స్నేహాలను ఎలా కాపాడుకోవాలి?

నమ్మకంగా ఉండండి. “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును” అని సొలొమోను రాశాడు. (సామె. 17:17) తన తండ్రియైన దావీదు, యోనాతానుల మధ్యవున్న స్నేహాన్ని మనసులో ఉంచుకొని సొలొమోను ఈ సామెతను కూర్చివుంటాడు. (1 సమూ. 18:1) తన తర్వాత యోనాతాను రాజవ్వాలని సౌలు కోరుకున్నాడు. కానీ యెహోవా దావీదును రాజుగా ఎన్నుకున్నాడన్న వాస్తవాన్ని యోనాతాను అంగీకరించాడు. సౌలులా యోనాతాను దావీదును చూసి ఈర్ష్యపడలేదు. దావీదుకు వచ్చిన కీర్తిని చూసి కోపగించుకోలేదు. దావీదు మీద సౌలు వేసిన నిందలను నమ్మలేదు. (1 సమూ. 20:24-34) మనం యోనాతానులా ఉన్నామా? మన స్నేహితులకు సంఘంలో ఏమైనా బాధ్యతలు అప్పగించబడితే సంతోషిస్తున్నామా? కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఓదారుస్తూ, అండగా నిలుస్తున్నామా? మనం వారి గురించి ఏదైనా చెడు విన్నప్పుడు దాన్ని వెంటనే నమ్ముతున్నామా? లేక యోనాతానులా మన స్నేహితునికి అండగా నిలుస్తున్నామా?

దేవుని వాక్యంలో రత్నాలు

w05 3/15 24వ పేజీ, 4వ పేరా

సమూయేలు మొదటి గ్రంథములోని ముఖ్యాంశాలు

21:12, 13. జీవితంలోని కష్ట పరిస్థితులతో వ్యవహరించడానికి మనం మన మానసిక శక్తిసామర్థ్యాలను ఉపయోగించాలని యెహోవా భావిస్తాడు. ఆయన మనకు తన ప్రేరేపిత వాక్యాన్నిచ్చాడు, అది మనకు బుద్ధి, తెలివి, వివేచన ఇస్తుంది. (సామెతలు 1:4) మనకు నియమిత క్రైస్తవ పెద్దల సహాయం కూడా ఉంది.

ఏప్రిల్‌ 18-24

దేవుని వాక్యంలో ఉన్న సంపద | 1 సమూయేలు 23-24

“యెహోవా చర్య తీసుకునేంత వరకు ఓర్పుగా ఉండండి”

w04 4/1 16వ పేజీ, 8వ పేరా

మారుతున్న జీవన పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు దేవుని ఆత్మపై ఆధారపడండి

సౌలుకు హాని కలిగించేందుకు దావీదు నిరాకరించాడు. విశ్వాసం, సహనం ప్రదర్శిస్తూ ఆయన విషయాలను యెహోవాకే విడిచిపెట్టాడు. రాజు ఆ గుహనుండి బయటకు వెళ్లిపోయిన తర్వాత, దావీదు కేకవేసి అతనితో ఇలా అన్నాడు: “నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగతీర్చును గాని నేను నిన్ను చంపను.” (1 సమూయేలు 24:12) దావీదుకు సౌలు తప్పుచేస్తున్నాడని తెలిసినప్పటికీ, ఆయన తానుగా పగతీర్చుకోలేదు; అలాగే ఆయన సౌలును దూషించలేదు లేదా అతని గురించి చెడ్డగా మాట్లాడలేదు. అనేక ఇతర సందర్భాల్లో దావీదు తానుగా పగతీర్చుకోకుండా నిగ్రహించుకున్నాడు. బదులుగా ఆయన పరిస్థితులను చక్కదిద్దేందుకు యెహోవాపై ఆధారపడ్డాడు.—1 సమూయేలు 25:32-34; 26:10, 11.

w04 6/1 22-23 పేజీలు

మీ పరిస్థితులు మీ జీవితాన్ని అదుపు చేస్తున్నాయా?

మూడవ పాఠమేమిటంటే, మన పరిస్థితులను మార్చుకోవడానికి లేఖనరహిత మార్గాలు అన్వేషించడానికి బదులు మనం యెహోవాపై ఆధారపడాలి. శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “ఏ విషయములోనైనను కొదువలేనివారునైయుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.” (యాకోబు 1:4) ఒకానొక పరీక్షను తప్పించుకోవడానికి లేఖనరహిత విధానాలను ఆశ్రయించకుండా చివరివరకు ఆ పరీక్షను తాళుకోవడం ద్వారా ఓర్పు ‘దాని క్రియను కొనసాగించడానికి’ మనం అనుమతించాలి. అప్పుడే మన విశ్వాసం పరీక్షించబడి శుద్ధి చేయబడుతుంది, దాని బలవర్ధక శక్తి తేటపడుతుంది. యోసేపు దావీదులకు ఇలాంటి ఓర్పే ఉంది. యెహోవా కోపానికి గురిచేయగల పరిష్కారం కనిపెట్టడానికి వారు ప్రయత్నించలేదు. బదులుగా, వారు తమ పరిస్థితిని ప్రయోజనకరంగా మలుచుకొనేందుకు కృషిచేశారు. వారు యెహోవాపై ఆధారపడ్డారు, అలా చేసినందుకు వారెంతగా ఆశీర్వదించబడ్డారో! యెహోవా తన ప్రజలను విడిపించేందుకు, నడిపించేందుకు వారిద్దరినీ ఉపయోగించుకున్నాడు.​—ఆదికాండము 41:39-41; 45:5; 2 సమూయేలు 5:4, 5.

లేఖనరహిత పరిష్కారాలు వెదకేలా శోధించబడే పరిస్థితులను మనమూ ఎదుర్కోవచ్చు. ఉదాహరణకు, ఇంకా తగిన వివాహ జత లభించనందువల్ల మీరు నిరాశ చెందుతున్నారా? అదే నిజమైతే, “ప్రభువునందు మాత్రమే” పెళ్ళి చేసుకోవాలనే యెహోవా ఆజ్ఞను పెడచెవినబెట్టే ఎలాంటి శోధననైనా తప్పించుకోండి. (1 కొరింథీయులు 7:​39) మీ వైవాహిక జీవితంలో సమస్యలున్నాయా? వేరుపడడాన్ని, విడాకులను ప్రోత్సహించే లోక స్వభావానికి లొంగిపోవడానికి బదులుగా ఆ సమస్యల్ని అధిగమించడానికి కలిసి కృషిచేయండి. (మలాకీ 2:16; ఎఫెసీయులు 5:​21-33) మీ ఆర్థిక పరిస్థితినిబట్టి కుటుంబాన్ని పోషించడం మీకు కష్టంగా ఉందా? యెహోవాపై ఆధారపడడంలో, డబ్బు సంపాదించేందుకు అనుమానాస్పదమైన లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను విసర్జించడం కూడా ఒక భాగమే. (కీర్తన 37:25; హెబ్రీయులు 13:​18) అవును, మన పరిస్థితులను ప్రయోజనకరంగా మలుచుకోవడానికి కృషి చేస్తూ మన ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదించేలా మనమందరం కష్టపడి పనిచెయ్యాలి. అలాచేస్తూ సంపూర్ణ పరిష్కారం కోసం యెహోవాపై ఆధారపడి ఉండడానికి మనం తీర్మానించుకుందాం.—మీకా 7:​7.

దేవుని వాక్యంలో రత్నాలు

w17.11 27వ పేజీ, 11వ పేరా

మీ బహుమానం పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోకండి

నిజమైన ప్రేమ, దయను అలవర్చుకోవడానికి మనం కృషి చేసినప్పుడు ఇతరులపట్ల ఈర్ష్యపడం. బైబిలు ఇలా చెప్తుంది, “ప్రేమ ఓర్పు కనబరుస్తుంది, దయ చూపిస్తుంది. ప్రేమ ఈర్ష్యపడదు.” (1 కొరిం. 13:4) మన వ్యక్తిత్వంలో ఈర్ష్య ఒక భాగం కాకూడదంటే, విషయాల్ని యెహోవా చూసినట్టు చూడాలి. తోటి సహోదరసహోదరీల్ని ఒకే శరీరంలోని అవయవాల్లా చూడాలి. ఆ శరీరమే సంఘం. బైబిలు ఇలా చెప్తుంది, “ఒక అవయవం ఘనత పొందితే, మిగతా అవయవాలన్నీ దానితో కలిసి సంతోషిస్తాయి.” (1 కొరిం. 12:16-18, 26) మన సహోదరుల్లో ఎవరికైనా మంచి జరిగితే వాళ్లతోపాటు మనమూ సంతోషిస్తాం గానీ ఈర్ష్యపడం. సౌలు కొడుకైన యోనాతాను ఉంచిన మంచి ఆదర్శం గురించి ఆలోచించండి. దేవుడు దావీదును రాజుగా ఎంపిక చేసుకున్నప్పుడు యోనాతాను ఈర్ష్యపడలేదు. పైగా ఆయన దావీదును ప్రోత్సహించి, మద్దతిచ్చాడు. (1 సమూ. 23:16-18) మనం కూడా యోనాతానులా దయను, ప్రేమను చూపించగలమా?

ఏప్రిల్‌ 25–మే 1

దేవుని వాక్యంలో ఉన్న సంపద | 1 సమూయేలు 25-26

“మీరు ముందూ-వెనుకా ఆలోచించకుండా ప్రవర్తిస్తారా?”

ia 89వ పేజీ, 10-12 పేరాలు

ఆమె సుబుద్ధితో వ్యవహరించింది

ఎంతో కష్టపడి పనిచేసే ఆ సైనికులు గొర్రెల కాపరులతో ఎలా ఉండేవాళ్లు? వాళ్ల మందల్లో నుండి అప్పుడప్పుడు ఒక గొర్రెను సునాయాసంగా ఎత్తుకెళ్లిపోయి ఉండగలిగేవాళ్లే. కానీ వాళ్లు అలా చేయకుండా నాబాలు మందలకు, పనివాళ్లకు ఎలాంటి ఆపదా రాకుండా చూసుకున్నారు. (1 సమూయేలు 25:15, 16 చదవండి.) సాధారణంగా గొర్రెలకు, గొర్రెల కాపరులకు ఎన్నో ప్రమాదాలు పొంచి ఉండేవి, క్రూర జంతువులు తరచూ దాడి చేసేవి. ఇశ్రాయేలు దక్షిణ సరిహద్దు చాలా దగ్గర్లో ఉండేది కాబట్టి, వేరే ప్రాంతాల నుండి వచ్చే గజదొంగలు తరచూ దాడిచేసేవాళ్లు.

11 ఆ అరణ్యంలో వాళ్లందరికీ ఆహారం సమకూర్చడం పెద్ద పనే. అందుకే దావీదు ఒకరోజు, సహాయం కోసం పదిమంది మనుషులను నాబాలు దగ్గరికి పంపించాడు. దావీదు బాగా ఆలోచించాకే అలా చేశాడు. అది గొర్రెల బొచ్చు కత్తిరించే సమయం, ఆ సమయంలో సాధారణంగా అందరూ ధారాళంగా ఇస్తూ పండుగ జరుపుకుంటారు. వాళ్లు నాబాలుతో చెప్పాల్సిన మాటల్ని కూడా దావీదే జాగ్రత్తగా ఎంపిక చేశాడు. నాబాలు మీద గౌరవంతో, దావీదు మర్యాదపూర్వకంగా ఉండే పదాలను ఎంచుకున్నాడు. నాబాలు వయసును గౌరవిస్తూ ఆయన తనను తాను “నీ కుమారుడైన దావీదు” అని కూడా చెప్పుకున్నాడు. మరి నాబాలు ఎలా స్పందించాడు?—1 సమూ. 25:5-8.

12 అతడు కోపంతో ఊగిపోయాడు. మొదటి పేరాలో మనం చూసిన యువకుడు అబీగయీలుతో చెప్పినట్లుగా ‘అతడు వాళ్లతో కఠినంగా మాట్లాడాడు.’ పిసినిగొట్టు నాబాలు తన రొట్టెలు, నీళ్లు, మాంసం చాలా విలువైనవని వాళ్ల మీద గట్టిగా అరిచాడు. దావీదును పనికిరాని వాడని అవమానిస్తూ, యజమానిని విడిచి పారిపోయిన దాసునితో ఆయనను పోల్చాడు. నాబాలు కూడా, దావీదును ద్వేషించిన సౌలులాగే ఆలోచించివుంటాడు. ఆ ఇద్దరూ దావీదును యెహోవా చూసినట్లు చూడలేదు. దేవుడు దావీదును ప్రేమించాడు. యెహోవా దావీదును తిరుగుబాటు చేసిన దాసునిగా చూడలేదు కానీ, ఇశ్రాయేలీయులను ఏలబోయే రాజుగా చూశాడు.—1 సమూ. 25:10, 11, 14.

ia 92వ పేజీ, 18వ పేరా

ఆమె సుబుద్ధితో వ్యవహరించింది

తప్పును తన మీద వేసుకుని, జరిగినదానికి దావీదును క్షమాపణ కోరింది. తన భర్త, పేరుకు తగ్గట్టే మోటువాడని, మూర్ఖుడని అంటూ అలాంటివాణ్ణి శిక్షించడం దావీదుకే అవమానకరం అన్నట్లు మాట్లాడింది. దావీదు “యెహోవా యుద్ధములను” చేస్తున్నాడని, ఆయనను దేవుడే నియమించాడని తాను నమ్ముతున్నట్లు చెప్పింది. ‘యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులమీద అధిపతిగా నిర్ణయించాడు’ అని చెబుతూ దావీదుకు రాజ్యాధికారం ఇస్తానని యెహోవా ఆయనకు చేసిన ప్రమాణం గురించి తనకు తెలుసని కూడా అంది. అంతేకాకుండా, ఆయన మీదకు రక్తాపరాధం తీసుకొచ్చే లేదా తర్వాతి కాలంలో ఆయనకు “మనోవిచారం” కలిగించే, అంటే తప్పు చేశాననే బాధను మిగిల్చే పనేదీ చేయవద్దని దావీదును బ్రతిమాలుకుంది. (1 సమూయేలు 25:24-31 చదవండి.) ఆమె దయగా, మనసును హత్తుకునేలా మాట్లాడింది.

దేవుని వాక్యంలో రత్నాలు

ia 92వ పేజీ, 16వ పేరా

ఆమె సుబుద్ధితో వ్యవహరించింది

అంటే అబీగయీలు, కుటుంబ శిరస్సుగా తన భర్తకున్న అధికారాన్ని ధిక్కరించిందని అర్థమా? కాదు. యెహోవా అభిషేకించిన సేవకుణ్ణి నాబాలు అవమానించాడని గమనించండి. నాబాలు చేసిన పని వల్ల, కల్లాకపటం ఎరుగని అతని ఇంట్లోవాళ్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. ఒకవేళ అబీగయీలు వెంటనే చేయాల్సింది చేసివుండకపోతే తన భర్తతో పాటు తానూ తప్పు చేసినట్లయ్యేది. ఈ విషయంలో, ఆమె తన భర్తకన్నా దేవునికే ఎక్కువగా లోబడాలి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి