క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్ రెఫరెన్సులు
© 2023 Watch Tower Bible and Tract Society of Pennsylvania
మార్చి 4-10
దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 16-17
“యెహోవా, నా మంచితనానికి మూలం నువ్వే”
యౌవనులారా, మీరు సంతృప్తికరమైన జీవితాన్ని ఆనందించవచ్చు
నిజమైన స్నేహితుల్ని సంపాదించుకోండి
11 కీర్తన 16:3 చదవండి. మంచి స్నేహితుల్ని ఎలా సంపాదించుకోవాలో దావీదుకు తెలుసు. యెహోవాను ప్రేమించేవాళ్లను తన స్నేహితులుగా దావీదు ఎంచుకున్నాడు, దానివల్ల అతనికి ఎంతో సంతోషం కలిగిందని చెప్పాడు. అతని స్నేహితులు యెహోవా ఉన్నత నైతిక ప్రమాణాలను పాటిస్తారు కాబట్టి వాళ్లను “శ్రేష్టులు” లేదా పవిత్రులు అని వర్ణించాడు. స్నేహితుల్ని ఎంచుకోవడం గురించి మరో కీర్తనకర్త కూడా అలాగే భావించాడు. అతనిలా రాశాడు, ‘నీకు భయపడే వాళ్లందరికీ, నీ ఆదేశాలు పాటించేవాళ్లకు నేను స్నేహితుణ్ణి.’ (కీర్త. 119:63, NW) ముందటి ఆర్టికల్‌లో చర్చించుకున్నట్లు, మీరు కూడా యెహోవాను ప్రేమించే, ఆయన మాట వినే ఎంతోమంది మంచి స్నేహితుల్ని సంపాదించుకోవచ్చు. అంతేకాదు మీ స్నేహితులు మీ వయసువాళ్లే కానవసరం లేదు.
‘యెహోవా ప్రసన్నతను చూడండి’
దావీదు ఇలా పాడాడు: “యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయభాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను.” (కీర్త. 16:5, 6) దావీదుకు తన ‘స్వాస్థ్యం’ పట్ల చాలా కృతజ్ఞత ఉంది, యెహోవాతో అనుబంధం కలిగివుండి, ఆయనను సేవించే అరుదైన అవకాశమే ఆ ‘స్వాస్థ్యం.’ దావీదుకు వచ్చినట్లే మనకు కూడా ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదురుకావచ్చు, కానీ మనకు ఎన్నో ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఉన్నాయి! కాబట్టి మనమందరం సత్యారాధనలో ఆనందిస్తూ ఉందాం, యెహోవా ఆధ్యాత్మిక ఆలయం పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉందాం.
సదాకాలము యెహోవామీద గురి నిలుపుకోండి
2 బైబిల్లో మనకు పరిచయమున్న అబ్రాహాము, శారా, మోషే, రూతు, దావీదు, ఎస్తేరు, అపొస్తలుడైన పౌలు, మరితరుల అనుభవాల నుండి మనమందరం ఎంతో నేర్చుకోవచ్చు. అయితే, అంతగా ప్రఖ్యాతిగాంచనివారి వృత్తాంతాల నుండి కూడా మనం ప్రయోజనం పొందవచ్చు. బైబిలు వృత్తాంతాలను ధ్యానించడంవల్ల మనం కీర్తనకర్త చెప్పిన ఈ మాటలకు అనుగుణంగా ప్రవర్తించగలుగుతాం: “సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను.” (కీర్త. 16:8) మనం ఈ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి?
3 సాధారణంగా ఒక సైనికుని కుడిచేతిలో ఖడ్గం, ఎడమచేతిలో డాలు ఉంటాయి. కాబట్టి ఆయనకు కుడివైపున రక్షణ లభించదు. అయితే, ఆయన స్నేహితుడు కుడివైపున ఉండి పోరులో పాల్గొంటే ఆయనకు రక్షణ లభిస్తుంది. మనం యెహోవాను మనసులో ఉంచుకొని ఆయన చిత్తాన్ని చేస్తే ఆయన మనల్ని రక్షిస్తాడు. మనం బైబిలు వృత్తాంతాలను పరిశీలించడంవల్ల ‘సదాకాలము యెహోవామీద మన గురి నిలుపుకొనేలా’ మన విశ్వాసం ఎలా బలపరచబడుతుందో చూద్దాం.
దేవుని వాక్యంలో రత్నాలు
it-2-E 714వ పేజీ
కనుపాప
హీబ్రూలో ఇషోన్ అనే పదాన్ని అయిన్ (కన్ను) అనే పదంతో కలిపి వాడినప్పుడు, “కంటిలో ఉండే చిట్టిమనిషి” అని అర్థం. (ద్వితీ 32:10; సామె 7:2) అలాగే బాత్ (పాప) అనే పదాన్ని అయిన్ అనే పదంతో కలిపి వాడినప్పుడు, “కనుపాప” అని అర్థం. (విలా 2:18) రెండిటి అర్థం ఒకటే. అయితే దాన్ని నొక్కిచెప్పడానికి, కీర్తన 17:8లో ఇషోన్ బాత్-అయిన్ అని రెండిటిని కలిపి వాడారు. దాన్ని అక్షరార్థంగా అనువదిస్తే, “కంటిలో ఉండే చిట్టిమనిషి, పాప” అని అర్థం. బహుశా ఆ మాటలు, అవతలివాళ్ల కంట్లో కనిపించే మన చిట్టి ప్రతిబింబాన్ని సూచిస్తున్నాయి.
కన్ను చాలా సున్నితమైనది, కోమలమైనది. కంటిరెప్పకు, కనుగుడ్డుకు మధ్య చిన్న వెంట్రుక పడినా, నలుసు పడినా వెంటనే తెలిసిపోతుంది. శుక్లమండలం (cornea) అనేది కనుపాప మీద ఉండే పల్చటి భాగం. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే దానికి దెబ్బ తగిలినా లేక వ్యాధివల్ల మసకబారినా, కంటిచూపు తగ్గిపోవచ్చు లేదా పూర్తిగా పోవచ్చు. బైబిలు “కనుపాప” అని అన్నప్పుడు జాగ్రత్తగా, సున్నితంగా చూసుకోవడాన్ని సూచిస్తుంది. దేవుని ధర్మశాస్త్రాన్ని మనం అలాగే చూసుకోవాలి. (సామె 7:2) ద్వితీయోపదేశకాండం 32:10లో, దేవుడు ఒక తండ్రిలా ఇశ్రాయేలును ఎంత బాగా చూసుకున్నాడో చెప్పడానికి, బైబిలు “కనుపాపలా” అనే పదాన్ని వాడింది. తనను “కనుపాపలా” చూసుకోమని, సంరక్షించమని దావీదు కూడా ప్రార్థించాడు. (కీర్త 17:8) అంటే, శత్రువులు దండెత్తినప్పుడు తక్షణమే తనకు సహాయం చేయమని దావీదు యెహోవాను అడుగుతున్నాడు (జెకర్యా 2:8తో పోల్చండి, అక్కడ “కనుగుడ్డు” అని అర్థం వచ్చే హీబ్రూ పదాన్ని ఉపయోగించారు).
మార్చి 11-17
దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తన 18
“యెహోవా . . . నన్ను రక్షించే దేవుడు”
బైబిల్లోని పదచిత్రాలు మీకు అర్థమవుతున్నాయా?
బైబిలు, యెహోవాను నిర్జీవ వస్తువులతో కూడా పోలుస్తోంది. ఆయన “ఇశ్రాయేలీయులకు ఆశ్రయ దుర్గము,” “శైలము,” “కోట” అని వర్ణించబడ్డాడు. (2 సమూయేలు 23:3; కీర్తన 18:2; ద్వితీయోపదేశకాండము 32:4) వాటిలోవున్న సారూప్యతలు ఏమిటి? ఎలాగైతే ఒక దుర్గము బలంగా పునాదివేయబడి, కదలకుండా ఉంటుందో అలాగే యెహోవా దేవుడు కూడా ఒక దుర్గంలా మీకు భద్రతనిస్తాడు.
5 కీర్తనల గ్రంథం, యెహోవా ఎలాంటి దేవుడు అనేదాని గురించి అనేక వివరాలు తెలియజేసే పదచిత్రాలతో నిండివుంది. ఉదాహరణకు, యెహోవా ‘సూర్యుడు, కేడెము’ అని కీర్తన 84:11 చెప్తోంది. ఎందుకంటే, యెహోవాయే వెలుగుకు, జీవానికి, శక్తికి, భద్రతకు మూలం. దీనికి భిన్నంగా, “నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును” అని కీర్తన 121:5 చెప్తోంది. నీడగల చోటు ఎలాగైతే మిమ్మల్ని ఎండనుండి కాపాడుతుందో, అలాగే యెహోవా కూడా తన సేవకులకు తన “చేతి” కింద లేదా తన “రెక్కల” కింద నీడలాంటి రక్షణనిస్తూ వారిని విపత్తుల వేడినుండి కాపాడతాడు.—యెషయా 51:16; కీర్తన 17:8; 36:7.
it-2-E 1161వ పేజీ, 7వ పేరా
స్వరం
దేవుడు తన సేవకుల స్వరాన్ని వింటాడు. పవిత్రశక్తితో, సత్యంతో దేవుణ్ణి ఆరాధించేవాళ్లు, ఏ భాషలో ప్రార్థించినా దేవుడు తమ ప్రార్థనలు వింటాడనే నమ్మకంతో ఉండవచ్చు. మనసులో ప్రార్థించినా దేవునికి తెలుస్తుంది, ఎందుకంటే ఆయన మనుషుల హృదయాల్ని చదవగలడు. (కీర్త 66:19; 86:6; 116:1; 1స 1:13; నెహె 2:4) కష్టంలో ఏడుస్తూ పెట్టే మొరల్ని దేవుడు వింటాడు. అంతేకాదు తనను వ్యతిరేకిస్తూ, తన సేవకుల మీద కుట్ర పన్నుతున్న వాళ్ల ఉద్దేశాలు కూడా ఆయనకు తెలుసు.—ఆది 21:17; కీర్త 55:18, 19; 69:33; 94:9-11; యిర్మీ 23:25.
ఆందోళనను తట్టుకుని ప్రశాంతతను, సంతోషాన్ని ఎలా పొందవచ్చు?
2. ధ్యానించండి. మీ జీవితంలో కేవలం యెహోవా సహాయం వల్లే కష్టాల్ని తట్టుకుని ముందుకు వెళ్లిన సందర్భాలు ఏమైనా గుర్తొస్తున్నాయా? యెహోవా మనకు, గతంలో తన సేవకులకు ఎలా సహాయం చేశాడో ధ్యానించినప్పుడు ఎక్కువ మనశ్శాంతిని పొందుతాం. అలాగే ఆయనపై మరింత నమ్మకాన్ని పెంచుకుంటాం. (కీర్త. 18:17-19) జాషువ అనే సంఘపెద్ద ఇలా అంటున్నాడు: “యెహోవా నాకు జవాబిచ్చిన ప్రార్థనలన్నిటినీ ఒక లిస్టు రాసుకున్నాను. దాన్ని చూసినప్పుడల్లా నేను సరిగ్గా వేటి గురించైతే ప్రార్థించానో, వాటికి ఆయన జవాబిచ్చిన సందర్భాలన్నీ నాకు గుర్తొస్తాయి.” ఆ సహోదరునిలాగే మనం కూడా యెహోవా ఇప్పటివరకు మనకెలా సహాయం చేశాడో గుర్తుచేసుకుంటే ఆందోళనల నుండి బయటపడడానికి కావాల్సిన బలాన్ని పొందుతాం.
దేవుని వాక్యంలో రత్నాలు
it-1-E 432వ పేజీ, 2వ పేరా
కెరూబు
ఈ కెరూబులు, కొంతమంది చెప్తున్నట్టు, చుట్టుపక్కల అన్యజనులు పూజించే పెద్దపెద్ద రెక్కలున్న విగ్రహాలు కాదు. బైబిలు దాని గురించి చెప్పకపోయినా, ఒక ప్రాచీన యూదుల పుస్తకం, ఆ కెరూబులకు మనుషుల్లాంటి రూపం ఉండేదని చెప్తుంది. అవి అద్భుతంగా, కళాత్మకంగా చెక్కిన అందమైన దేవదూత రూపాలు. వాటిని యెహోవా స్వయంగా మోషేకు ఇచ్చిన “నమూనా ప్రకారం ఉన్నదున్నట్టు” తయారుచేశారు. (నిర్గ 25:9) అపొస్తలుడైన పౌలు కూడా వాటి గురించి చెప్తూ, “మహిమగల కెరూబులు . . . ప్రాయశ్చిత్త మూతను కప్పేవి” అని రాశాడు. (హెబ్రీ 9:5) కెరూబులకు, యెహోవా ప్రత్యక్షతకు లేదా సన్నిధికి సంబంధం ఉంది. మందసం మీదున్న రెండు కెరూబుల మధ్య నుండి ఆయన మాట్లాడాడు. (నిర్గ 25:22; సం 7:89) యెహోవా “కెరూబుల పైన [లేదా, మధ్య]” కూర్చున్నట్టు బైబిలు చెప్తుంది. (1స 4:4; 2స 6:2; 2రా 19:15; 1ది 13:6; కీర్త 80:1; 99:1; యెష 37:16) కెరూబులు, యెహోవా ప్రయాణించే రథానికి ప్రతీకగా ఉన్నాయి. (1ది 28:18) వాటి రెక్కలు కాపుదలను ఇస్తాయి, వేగంగా ప్రయాణించడానికి తోడ్పడతాయి. యెహోవా తనకు సహాయం చేయడానికి ఎంత వేగంగా వచ్చాడో దావీదు కావ్యభాషలో చెప్తూ, “ఆయన కెరూబు మీద . . . దేవదూత రెక్కల మీద” ఎగురుతూ వచ్చాడని వర్ణించాడు.—2స 22:11; కీర్త 18:10.
మార్చి 18-24
దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 19-21
“ఆకాశం దేవుని మహిమను చాటుతోంది”
యెహోవా మహిమను అందరూ ప్రకటించుదురు గాక
యెష్షయి కుమారుడైన దావీదు బేత్లెహేము పరిసరాల్లో పశువుల కాపరిగా పెరిగాడు. జనసంచారం ఉండని పచ్చిక మైదానాల్లో తన తండ్రి పశువులు కాస్తూ, ప్రశాంతమైన రాత్రివేళల్లో నక్షత్రాలు పొదిగినట్లున్న సువిశాల ఆకాశాన్ని ఆయనెంత తరచుగా చూసివుంటాడో గదా! దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి 19వ కీర్తనలోవున్న ఈ మనోహరమైన మాటలను కూర్చి వాటిని పాడినప్పుడు, తన మనస్సుపై చెరగని ముద్రవేసిన అలాంటి సందర్భాలను ఆయన ఖచ్చితంగా గుర్తుచేసుకొనివుంటాడు: “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది. . . . వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించియున్నది లోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లుచున్నవి.”—కీర్తన 19:1, 4.
2 యెహోవా సృష్టించిన అద్భుతమైన ఆకాశములు భాష, మాటలు, స్వరము లేకుండానే పగలనక, రాత్రనక ఆయన మహిమను ప్రకటిస్తున్నాయి. సృష్టి, దేవుని మహిమను ప్రకటించడం ఎన్నడూ మానుకోదు, భూనివాసులందరూ చూసేలా ఈ నిశ్శబ్ద సాక్ష్యం “భూమియందంతట” దానంతటదే వెల్లడికావడం ఆలోచించినప్పుడు దానిముందు మనమెంత అల్పులమో తెలుస్తుంది. అయితే సృష్టియొక్క నిశ్శబ్ద సాక్ష్యం మాత్రమే సరిపోదు. నమ్మకమైన మానవులు కూడా సాక్ష్యమివ్వడంలో తమ స్వరాలను కలపాలని ప్రోత్సహించబడ్డారు. పేరు ప్రస్తావించబడని ఓ కీర్తనకర్త నమ్మకమైన ఆరాధకులను ఈ ప్రేరేపిత మాటలతో సంబోధించాడు: “మహిమబలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి.” (కీర్తన 96:7, 8) యెహోవాతో సన్నిహిత సంబంధం ఉన్నవారు ఆ విన్నపానికి ప్రతిస్పందించేందుకు ఎంతో ఆనందిస్తున్నారు. అయితే దేవునికి మహిమ చెల్లించడంలో ఏమి ఇమిడివుంది?
సృష్టి దేవుని మహిమను వివరిస్తోంది!
8 ఇప్పుడు దావీదు, యెహోవా సృష్టిలోని మరో అద్భుతాన్ని వర్ణిస్తున్నాడు: “వాటిలో [దృశ్య ఆకాశంలో] ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములోనుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు, శూరుడు పరుగెత్త నుల్లసించునట్లు తన పథమునందు పరుగెత్త నుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కునుండి బయలుదేరి ఆ దిక్కువరకు దానిచుట్టు తిరిగి వచ్చుచున్నాడు; అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు.”—కీర్తన 19:4-6.
9 ఇతర నక్షత్రాలతో పోల్చినప్పుడు, సూర్యగ్రహం కేవలం ఒక మోస్తరు పరిమాణంలోనే ఉంటుంది. అయినప్పటికీ అది ఒక అసాధారణ నక్షత్రం, అది తన చుట్టూ పరిభ్రమించే గ్రహాలను మరింత చిన్నగా కనిపించేలా చేస్తుంది. దాని ద్రవ్యరాశి “2 వందలకోట్ల వందకోట్ల వందకోట్ల టన్నులు” అని ఒక గ్రంథం చెబుతోంది, అంటే అది మన యావత్ సౌరకుటుంబపు ద్రవ్యరాశిలో 99.9 శాతం. దాని గురుత్వాకర్షణ శక్తి మన భూమిని అటు దూరంగా కొట్టుకొనిపోకుండా ఇటు దగ్గరకు ఆకర్షించబడకుండా 15 కోట్ల కిలోమీటర్ల పరిధిలోనే పరిభ్రమించేలా చేస్తుంది. సూర్యశక్తిలో 200 కోట్లలో ఒక భాగం మాత్రమే మన భూమికి చేరుతుంది, జీవకోటిని కాపాడేందుకు అది చాలు.
10 సూర్యగ్రహం గురించి కీర్తనకర్త అలంకారార్థ భావంలో మాట్లాడుతూ, దానిని పగటిపూట ఒక క్షితిజం నుండి మరో క్షితిజానికి పరుగెత్తి రాత్రిపూట ‘గుడారములో’ విశ్రమించే ‘శూరునిగా’ వర్ణిస్తున్నాడు. ఆ గొప్ప నక్షత్రం క్షితిజరేఖపై అస్తమిస్తున్నప్పుడు భూమి నుండి చూసేవారికి అది విశ్రాంతి కోసం “గుడారము” లోపలికి ప్రవేశిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఉదయాన్నే అది తన ‘అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారునిలా’ వెలుగు విరజిమ్ముతూ భళ్లున బయటకు వస్తున్నట్లు కనిపిస్తుంది. గొర్రెల కాపరియైన దావీదుకు ఎముకలు కొరికే రాత్రిచలి ఎలా ఉంటుందో తెలుసు. (ఆదికాండము 31:40) సూర్యకిరణాలు తనకు, తనచుట్టూ పరచుకొనివున్న భూతలానికి వేగంగా వెచ్చదనం ఎలా తీసుకొస్తాయో ఆయన గుర్తు చేసుకున్నాడు. నిస్సందేహంగా, తూర్పునుండి పశ్చిమానికి చేసే “ప్రయాణంవల్ల” అది అలసిపోవడంలేదు గానీ, తిరిగి ఆ ప్రయాణం ప్రారంభించడానికి సిద్ధంగావున్న ఒక ‘శూరుని’వలె ఉంది.
మన కాలంలో ఎంతో అనాదరణకు గురైన చిత్రకారుడు
ప్రకృతిలో ఉన్న కళపట్ల మన మెప్పును విశాలం చేసుకోవడం, మనచుట్టూ ఎవరి హస్తకళలు ఉన్నాయో ఆ సృష్టికర్తను మనం ఎక్కువగా తెలుసుకోడానికి మనకు సహాయం చేయగలదు. గలిలయ చుట్టుప్రక్కల పెరుగుతున్న పిచ్చిపూలను నిశితంగా చూడమని యేసు ఒక సందర్భంలో తన శిష్యులకు చెప్పాడు. “అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు” అని ఆయన చెప్పాడు. (మత్తయి 6:28, 29) మానవకుటుంబం యొక్క అవసరతలపట్ల దేవుడు అశ్రద్ధ కలిగి లేడని మనకు జ్ఞాపకం చేయడానికి, ఒక అల్పమైన పిచ్చిపువ్వు యొక్క అందం పనికి వస్తుంది.
దేవుని వాక్యంలో రత్నాలు
it-1-E 1073వ పేజీ
హీబ్రూ, II
ఇక్కడ సమాంతర వాక్య శైలి (synthetic parallelism) కనిపిస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే, ప్రతీ వాక్యంలో రెండో భాగం మొదటి భాగంలోని విషయాన్నే మళ్లీ చెప్పదు, లేదా దానికి విరుద్ధమైన విషయాన్ని పరిచయం చేయదు. బదులుగా, కొత్త వివరాల్ని జోడిస్తూ మొత్తం భావాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది. దీనికి చక్కని ఉదాహరణ, కీర్తన 19:7-9:
యెహోవా ధర్మశాస్త్రం పరిపూర్ణమైనది,
అది సేదదీర్పునిస్తుంది.
యెహోవా జ్ఞాపిక నమ్మదగినది,
అది అనుభవం లేనివాళ్లను తెలివిగలవాళ్లుగా చేస్తుంది.
యెహోవా ఆదేశాలు న్యాయమైనవి,
అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి;
యెహోవా ఆజ్ఞ స్వచ్ఛమైనది,
అది కంటికి వెలుగునిస్తుంది.
యెహోవా గురించిన భయం పవిత్రమైనది,
అది ఎప్పటికీ నిలిచివుంటుంది.
యెహోవా తీర్పులు సత్యమైనవి;
అవి పూర్తిగా నీతిగలవి.
ఇక్కడ “అది సేదదీర్పునిస్తుంది,” “అది అనుభవం లేనివాళ్లను తెలివిగలవాళ్లుగా చేస్తుంది” వంటి మాటలు, ఆ వాక్యాల్లోని మొదటి భాగాన్ని వివరిస్తాయి. ఇలా ప్రతీ వాక్యాన్ని లయబద్ధంగా రెండురెండు భాగాలుగా విడగొట్టడం వల్ల, వాటి నిర్మాణం సమాంతర వాక్య శైలిలో సాగుతుంది.
మార్చి 25-31
దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తన 22
యేసు మరణం గురించి ముందే చెప్పిన కొన్ని విషయాలు
వారు మెస్సీయను కనుగొన్నారు!
16 మెస్సీయను దేవుడు విడిచిపెట్టినట్లుగా అనిపిస్తుంది. (కీర్తన 22:1 చదవండి.) ప్రవచించబడినట్లుగానే, “మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను; ఆ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము.” (మార్కు 15:34) ఆయన దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోయాడని దానర్థం కాదు. ఎందుకంటే, యేసు యథార్థత సంపూర్ణంగా పరీక్షించబడాలనే ఉద్దేశంతో దేవుడే ఆయనను శత్రువుల చేతికి అప్పగించాడు. “నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి” అని అనడం ద్వారా కీర్తన 22:1లోని ప్రవచనాన్ని యేసు నెరవేర్చాడు.
వారు మెస్సీయను కనుగొన్నారు!
13 మెస్సీయను ప్రజలు ఎగతాళి చేస్తారని దావీదు ప్రవచించాడు. (కీర్తన 22:7, 8 చదవండి.) హింసాకొయ్యపై బాధపడుతున్నప్పుడు యేసును ప్రజలు ఎగతాళి చేశారని చెబుతూ మత్తయి ఇలా రాశాడు: “ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు —దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి.” అలాగే శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూడా ఆయనను ఎగతాళి చేస్తూ, “వీడు ఇతరులను రక్షించెను, తన్నుతానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము. వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించును” అని అన్నారు. (మత్త. 27:39-43) వారు అలా బాధపెట్టినా యేసు మౌనంగా ఉన్నాడేగానీ తిరిగి దూషించలేదు. మనందరికీ ఆయన మంచి మాదిరి.
వారు మెస్సీయను కనుగొన్నారు!
14 మెస్సీయ అంగీ కోసం చీట్లు వేస్తారు. “నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు” అని కీర్తనకర్త రాశాడు. (కీర్త. 22:18) సరిగ్గా అలాగే జరిగింది, “[రోమా సైనికులు యేసును] సిలువవేసిన పిమ్మట చీట్లువేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి.”—మత్త. 27:35; యోహాను 19:23, 24 చదవండి.
దేవుని వాక్యంలో రత్నాలు
మన పవిత్ర కూటాలపట్ల గౌరవాన్ని చూపించడం
7 మన సమావేశాలపట్ల గౌరవం చూపించగల స్పష్టమైన మార్గాలు ఉన్నాయి. ఒకటి రాజ్య గీతాలు పాడేందుకు అక్కడ ఉండడం. ఈ గీతాల్లో అనేకం ప్రార్థనల రూపంలో కూర్చబడ్డాయి కాబట్టి, వాటిని పూజ్యభావంతో ఆలపించాలి. అపొస్తలుడైన పౌలు 22వ కీర్తనను ఉల్లేఖిస్తూ యేసు గురించి ఇలా వ్రాశాడు: “నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజముమధ్య నీ కీర్తిని గానము చేతును.” (హెబ్రీయులు 2:11-12) కాబట్టి, ఛైర్మన్ పాట పాడేందుకు ఆహ్వానించకముందే మనం మన సీట్లలోవుండాలి, పాట పాడుతున్నప్పుడు దానిలోని పదాల అర్థంపై దృష్టి నిలుపుతూ ఆలపించాలని తీర్మానించుకోవాలి. మన ఆలాపన కీర్తనకర్త మనోభావాలనే ప్రతిబింబించును గాక, ఆయనిలా వ్రాశాడు: “యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.” (కీర్తన 111:1) అవును, కూటాలకు త్వరగా వచ్చి, అవి ముగిసేవరకు ఉండేందుకు యెహోవాకు స్తుతిగీతాలు పాడడం చక్కని కారణంగా ఉంది.
“సమాజమధ్యమున” యెహోవాను స్తుతించండి
గత కాలాల్లోలాగే నేడు, విశ్వాసులు తమ విశ్వాసాన్ని “సమాజమధ్యమున” వ్యక్తం చేయడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. అలా అందరికీ అందుబాటులో ఉన్న ఒక అవకాశం సంఘ కూటాల్లో ప్రేక్షకులకు వేయబడిన ప్రశ్నలకు జవాబుగా వ్యాఖ్యానాలు చేయడమే. ఇది సాధించగల మంచిని ఎన్నడూ తక్కువ అంచనా వేయకండి. ఉదాహరణకు, సమస్యలను ఎలా అధిగమించాలో లేదా నివారించాలో వివరించే వ్యాఖ్యానాలు, బైబిలు సూత్రాలను అనుసరించాలనే మన సహోదరుల కృతనిశ్చయాన్ని బలపరుస్తాయి. సూచించబడి ఎత్తివ్రాయబడని బైబిలు వచనాలను వివరించే వ్యాఖ్యానాలు లేదా వ్యక్తిగత పరిశోధన నుండి సేకరించిన తలంపులను చేర్చి చెప్పే వ్యాఖ్యానాలు శ్రేష్ఠమైన అధ్యయన అలవాట్లను వృద్ధి చేసుకోవడానికి ఇతరులను ప్రోత్సహించవచ్చు.
ఏప్రిల్ 1-7
దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 23-25
“యెహోవా నా కాపరి”
w11-E 5/1 31వ పేజీ, 3వ పేరా
“యెహోవా నా కాపరి”
యెహోవా తన గొర్రెల్ని నడిపిస్తాడు. కాపరి లేకపోతే గొర్రెలు తప్పిపోతాయి. అదేవిధంగా, మనకు కూడా సరైన దారిలో వెళ్లాలంటే సహాయం అవసరం. (యిర్మీయా 10:23) యెహోవా తన ప్రజల్ని “పచ్చికబయళ్ల” దగ్గరికి, “నీళ్లున్న విశ్రాంతి స్థలాల” దగ్గరికి తీసుకెళ్తాడని, “నీతి మార్గాల్లో” నడిపిస్తాడని దావీదు రాశాడు. (కీర్తన 23:2, 3) మనం దేవుని మీద నమ్మకం పెట్టుకోవచ్చని ఈ పదచిత్రాలు అభయం ఇస్తున్నాయి. బైబిలు ద్వారా పవిత్రశక్తి నడిపించే దారిలో వెళ్తే మన జీవితంలో సంతృప్తి, ప్రశాంతత, భద్రత నెలకొంటాయి.
w11-E 5/1 31వ పేజీ, 4వ పేరా
“యెహోవా నా కాపరి”
యెహోవా తన గొర్రెల్ని కాపాడతాడు. కాపరి లేకపోతే గొర్రెలు భయంతో బిక్కుబిక్కుమంటూ, దిక్కుతోచని స్థితిలో ఉంటాయి. తన ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, “గాఢాంధకార లోయలో నడిచినా,” అంటే జీవితంలో చీకటి కమ్మేసినా అస్సలు భయపడొద్దని యెహోవా చెప్తున్నాడు. (కీర్తన 23:4) యెహోవా వాళ్లను గమనిస్తూ ఉంటాడు, వాళ్లకు చేయి అందించడానికి సిద్ధంగా ఉంటాడు. కష్టాల్ని తట్టుకోవడానికి కావల్సిన తెలివిని, శక్తిని ఆయన వాళ్లకు ఇస్తాడు.—ఫిలిప్పీయులు 4:13; యాకోబు 1:2-5.
w11-E 5/1 31వ పేజీ, 5వ పేరా
“యెహోవా నా కాపరి”
యెహోవా తన గొర్రెల్ని పోషిస్తాడు. గొర్రెలు ఆహారం కోసం కాపరి మీద ఆధారపడతాయి. అదేవిధంగా మన ఆధ్యాత్మిక ఆకలిని తీర్చుకోవడానికి దేవుని మీదే ఆధారపడతాం. (మత్తయి 5:3) యెహోవాది పెద్ద చేయి, ఆయన తన సేవకులకు సమృద్ధిగా ఆహారం పెడుతున్నాడు. (కీర్తన 23:5) బైబిలు ద్వారా, ఇప్పుడు మీరు చదువుతున్న ఈ పత్రిక లాంటి ప్రచురణల ద్వారా ఆయన ఆధ్యాత్మిక ఆహారాన్ని ఇస్తున్నాడు. దానివల్ల మనం జీవితానికి ఉన్న అర్థాన్ని, మన విషయంలో దేవునికున్న ఉద్దేశాన్ని తెలుసుకోగలుగుతున్నాం.
దేవుని వాక్యంలో రత్నాలు
పూర్ణహృదయంతో నీతిని ప్రేమించండి
యెహోవా తన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రజలను “నీతిమార్గములలో” నడిపిస్తున్నాడు. (కీర్త. 23:3) మనం అపరిపూర్ణులం కాబట్టి, ఆ మార్గం నుండి తప్పిపోతుంటాం. మళ్లీ సరైన మార్గంలోకి రావాలంటే స్థిరనిశ్చయంతో కూడిన ప్రయత్నం అవసరం. ఈ విషయంలో మనకు ఏది సహాయం చేస్తుంది? యేసులా, మనం సరైనదాన్ని ప్రేమించాలి.—కీర్తన 45:7 చదవండి.
2 “నీతిమార్గములు” అంటే ఏమిటి? ఇవి యెహోవా నీతి ప్రమాణం ఆధారంగా నిర్ణయించబడే “మార్గములు.” హీబ్రూ, గ్రీకు భాషల్లో “నీతి” అనేది నైతిక ప్రమాణాలకు నిక్కచ్చిగా కట్టుబడి ఉండడాన్ని సూచిస్తుంది. యెహోవా, నీతికి లేదా “న్యాయమునకు నివాసము” కాబట్టి, ఆయన ఆరాధకులు తాము నడవాల్సిన నీతి మార్గాన్ని నిర్ణయించుకోవడానికి ఆయనపై ఆధారపడతారు.—యిర్మీ. 50:7.
3 దేవుని నీతి ప్రమాణాలకు అనుగుణంగా జీవించడానికి మనం హృదయపూర్వకంగా ప్రయత్నిస్తేనే ఆయన ఇష్టపడే ప్రజలముగా ఉంటాం. (ద్వితీ. 32:4) అలా చేయాలంటే మొదటిగా, తన వాక్యమైన బైబిలు నుండి యెహోవా గురించి నేర్చుకోగలిగినదంతా నేర్చుకోవాలి. రోజురోజుకీ మనం ఆయనకు మరింత దగ్గరౌతూ ఆయన గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువగా ఆయన నీతిని ప్రేమిస్తాం. (యాకో. 4:8) అంతేకాకుండా, జీవితంలో ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు దేవుని ప్రేరేపిత వాక్యంలోని నిర్దేశాన్ని మనం అంగీకరించాలి.
ఏప్రిల్ 8-14
దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 26-28
దావీదు ఎలా యథార్థతను కాపాడుకున్నాడు?
యథార్థవంతులుగా నడుచుకోండి
8 దావీదు ఇలా ప్రార్థించాడు: “యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము.” (కీర్తన 26:2) ఈ వచనంలో అంతరింద్రియములు అని అనువదించబడిన హీబ్రూ పదం, ఒక వ్యక్తి లోతైన తలంపులను భావోద్వేగాలను సూచిస్తుంది. హృదయం ఒక వ్యక్తి అంతరంగ స్వభావాన్ని అంటే అతని ప్రేరణలను, భావాలను, అవగాహనను సూచిస్తుంది. దావీదు తనను పరిశీలించమని యెహోవాను అడిగినప్పుడు, తన లోతైన తలంపులను భావాలను వెదకమని వాటిని నిశితంగా పరిశీలించమని కోరాడు.
9 తన అంతరింద్రియములను, హృదయాన్ని పరిశోధించమని కూడా దావీదు వేడుకున్నాడు. మన అంతరంగ స్వభావాన్ని యెహోవా ఎలా పరిశోధిస్తాడు? దావీదు ఇలా పాడాడు: “నాకు ఆలోచనకర్తయైన యెహోవాను స్తుతించెదను. రాత్రిగడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది.” (కీర్తన 16:7) దాని భావమేమిటి? దైవిక ఉపదేశం దావీదు అంతరాళాల్లోకి చొచ్చుకొని వెళ్ళి అక్కడ స్థిరపడిందని, అది ఆయన లోతైన తలంపులను భావోద్వేగాలను సరిదిద్దుతుందని దానర్థం. మనం దేవుని వాక్యంనుండి, ఆయన ప్రతినిధులనుండి, ఆయన సంస్థనుండి వచ్చే ఉపదేశం గురించి కృతజ్ఞతాపూర్వకంగా ఆలోచించినప్పుడు, అది మనలో నాటుకోవడానికి అనుమతించినప్పుడు దైవిక ఉపదేశం మన లోతైన తలంపులను భావోద్వేగాలను సరిదిద్దగలదు. ఆ విధంగా మనల్ని పరిశోధించమని యెహోవాకు క్రమంగా ప్రార్థించడం మనం యథార్థవంతులుగా నడుచుకోవడానికి సహాయం చేస్తుంది.
w04 12/1 15-16 పేజీలు, 12-13 పేరాలు
యథార్థవంతులుగా నడుచుకోండి
12 తన యథార్థతను బలపరచిన మరో అంశాన్ని ప్రస్తావిస్తూ దావీదు ఇలా అన్నాడు: “పనికిమాలినవారితో నేను సాంగత్యము చేయను; వేషధారులతో పొందుచేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను.” (కీర్తన 26:3-5) దావీదు భక్తిహీనులతో కూర్చోవడానికి కూడా ఇష్టపడలేదు. ఆయన చెడు సహవాసాలను అసహ్యించుకున్నాడు.
13 మన విషయమేమిటి? మనం టీవీ కార్యక్రమాలు, వీడియోలు, చలన చిత్రాలు, ఇంటర్నెట్ సైట్లు లేదా ఇతర మాధ్యమాల ద్వారా పనికిమాలిన వారితో సహవసించడానికి నిరాకరిస్తామా? మనం వేషధారులనుండి దూరంగా ఉంటామా? స్కూల్లో లేదా మన ఉద్యోగస్థలంలో కొంతమంది మోసకరమైన ఉద్దేశాలతో మన స్నేహితులుగా నటించవచ్చు. దేవుని సత్యానికి అనుగుణంగా నడుచుకోనివారితో సన్నిహిత సంబంధాలు వృద్ధి చేసుకోవడానికి మనం ఇష్టపడతామా? మతభ్రష్టులు తాము యథార్థమైనవారమని చెప్పుకున్నా, మనల్ని యెహోవా సేవనుండి దూరం చేయాలనే తమ ఉద్దేశాలను మననుండి దాచిపెట్టవచ్చు. క్రైస్తవ సంఘంలో కొందరు ద్వంద్వ జీవితాలు జీవించేవారు ఉంటే ఎలా? వారు కూడా తమ నిజ స్వరూపాలను దాచిపెడతారు. ఇప్పుడు పరిచర్య సేవకుడిగా సేవచేస్తున్న జేసన్ యౌవనస్థుడిగా ఉన్నప్పుడు ఆయనకు అలాంటి స్నేహితులు ఉండేవారు. ఆయన వాళ్ళ గురించి ఇలా చెప్పాడు: “ఒకరోజు వాళ్ళలో ఒకడు నాతో ఇలా అన్నాడు: ‘మనం ఇప్పుడు ఏమి చేసినా ఫర్వాలేదు, ఎందుకంటే నూతనలోకం వచ్చినప్పుడు మనందరం చనిపోతాము. అప్పుడు మనం ఏదో కోల్పోయామని మనకు తెలియనే తెలియదు.’ అలాంటి మాటలు నేను అప్రమత్తంగా ఉండాలని నాకు గుర్తు చేశాయి. నూతనలోకం వచ్చినప్పుడు నేను చనిపోవాలనుకోలేదు.” జేసన్ జ్ఞానయుక్తంగా ప్రవర్తించి అలాంటివారితో స్నేహం చేయడం మానేశాడు. “మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును” అని అపొస్తలుడైన పౌలు హెచ్చరించాడు. (1 కొరింథీయులు 15:33) మనం చెడు సహవాసాలకు దూరంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో కదా!
w04 12/1 16వ పేజీ, 17-18 పేరాలు
యథార్థవంతులుగా నడుచుకోండి
17 బలులు అర్పించడానికి బలిపీఠము ఉన్న మందిర గుడారము ఇశ్రాయేలులో యెహోవా ఆరాధనకు కేంద్రస్థానంగా ఉండేది. ఆ స్థలం తనకు సంతోషాన్ని కలుగజేస్తుందని వ్యక్తం చేస్తూ దావీదు ఇలా ప్రార్థించాడు: “యెహోవా, నీ నివాసమందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను.”—కీర్తన 26:8.
18 మనం యెహోవా గురించి నేర్చుకునే స్థలాల్లో సమకూడడానికి ఇష్టపడతామా? క్రమంగా ఆధ్యాత్మిక ఉపదేశం అందించే కార్యక్రమం ఉన్న ప్రతి రాజ్యమందిరమూ స్థానికంగా సత్యారాధనకు కేంద్రస్థానంగా ఉంటుంది. అంతేకాకుండా మనకు వార్షిక సమావేశాలు, ప్రాంతీయ సమావేశాలు, ప్రత్యేక సమావేశాలు ఉన్నాయి. అలాంటి కూటాల్లోను సమావేశాల్లోను యెహోవా “శాసనములు” చర్చించబడతాయి. మనం వాటిని ‘అతిగా ప్రేమించడం’ నేర్చుకుంటే, కూటాలకు హాజరై పూర్తి అవధానంతో వినడానికి మనం ఆసక్తి చూపిస్తాము. (కీర్తన 119:167) మన సంక్షేమంపట్ల శ్రద్ధ కలిగి, యథార్థతను కాపాడుకోవడానికి మనకు సహాయం చేసే తోటి విశ్వాసులతో సమయం గడపడం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో కదా!—హెబ్రీయులు 10:24, 25.
దేవుని వాక్యంలో రత్నాలు
బాధలు అనుభవించే వారిని యెహోవా విడిపిస్తాడు
15 కీర్తనకర్తయైన దావీదు ఇలా పాడాడు: “నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును.” (కీర్తన 27:10) ఏ మానవ తల్లిదండ్రుల ప్రేమకన్నా యెహోవా ప్రేమ మరెంతో ఉన్నతమైనదని తెలుసుకోవడం ఎంత ఓదార్పుకరమో కదా! తల్లిదండ్రుల తిరస్కారం, క్రూర ప్రవర్తన, విడిచిపెట్టడం ఎంతో బాధ కలిగించినా, అది యెహోవా మీపట్ల చూపించే శ్రద్ధను ఏ మాత్రం తొలగించలేదు. (రోమీయులు 8:38, 39) దేవుడు తాను ప్రేమించేవారిని ఆకర్షిస్తాడనే విషయం మర్చిపోవద్దు. (యోహాను 3:16; 6:44) మనుష్యులు మీతో ఎలా వ్యవహరించినా, మీ పరలోక తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాడు!
ఏప్రిల్ 15-21
దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 29-31
క్రమశిక్షణ—దేవుని ప్రేమకు గుర్తు
it-1-E 802వ పేజీ, 3వ పేరా
ముఖం
‘ముఖం దాచుకోవడం’ అనే మాటకు, సందర్భాన్ని బట్టి వేర్వేరు అర్థాలు ఉన్నాయి. ఒక వ్యక్తి గానీ, గుంపు గానీ అవిధేయత చూపించినప్పుడు యెహోవా తన ముఖాన్ని దాచుకున్నాడంటే, వాళ్లకు తన అనుగ్రహం లేదా మద్దతు ఇకపై ఉండదని దానర్థం అయ్యుండొచ్చు. ఇశ్రాయేలు జనాంగం విషయంలో అదే జరిగింది. (యోబు 34:29; కీర్త 30:5-8; యెష 54:8; 59:2) ఇంకొన్ని సందర్భాల్లో, యెహోవా తన ముఖాన్ని దాచుకున్నాడంటే, ఆయన చర్య తీసుకోకుండా లేదా జవాబివ్వకుండా సరైన సమయం కోసం వేచి చూస్తున్నాడని అర్థం. (కీర్త 13:1-3) “నా పాపాల నుండి నీ ముఖాన్ని పక్కకు తిప్పుకో” అని దావీదు అడిగిన సందర్భంలోనైతే, ఆ పాపాల్ని క్షమించమని అర్థం.—కీర్త 51:9; కీర్త 10:11తో పోల్చండి.
యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండడంలో సంతోషించడం
యెహోవా మనల్ని గద్దించడం వల్ల మనకు ప్రయోజనాలు చేకూరే విధానాన్ని, పండు పరిపక్వమయ్యే విధానంతో పోల్చవచ్చు. దేవుడిచ్చే గద్దింపు గురించి బైబిలు ఇలా చెబుతోంది: “దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.” (హెబ్రీయులు 12:11) పండు పరిపక్వమవడానికి ఎలాగైతే సమయం అవసరమో, అలాగే మనం దేవుడిచ్చే శిక్షణకు అనుగుణంగా మన వైఖరులను మార్చుకోవడానికి కూడా సమయం అవసరం. ఉదాహరణకు, మన చెడు ప్రవర్తనవల్ల ఒకవేళ మనం సంఘంలో ఏదైనా ఆధిక్యతను కోల్పోవాల్సివస్తే దేవుని కోసం కనిపెట్టుకొని ఉండాలనే మన సుముఖత మనం నిరుత్సాహపడి, మంచి చేయడం మానేయకుండా మనకు సహాయం చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దావీదు వ్రాసిన ఈ ప్రేరేపిత మాటలు ప్రోత్సాహకరంగా ఉంటాయి: “[దేవుని] కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును.” (కీర్తన 30:5) మనం కనిపెట్టుకొని ఉండే వైఖరిని అలవర్చుకుని దేవుని వాక్యం నుండి, ఆయన సంస్థ నుండి వచ్చే ఉపదేశాన్ని అన్వయించుకుంటే, మనకు “సంతోషము కలుగు” సమయం తప్పక వస్తుంది.
నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటి?
18 సంఘం నుండి బహిష్కరించబడిన వ్యక్తి తాను నిజంగా పశ్చాత్తాపపడుతున్నాను అని చూపించడానికి క్రమంగా మీటింగ్స్‌కి వెళ్తాడు. సంఘ పెద్దల సలహా పాటిస్తూ క్రమంగా ప్రార్థిస్తాడు, వ్యక్తిగత అధ్యయనం చేస్తాడు. అంతేకాదు అతను జాగ్రత్తగా ఉంటూ, తప్పు చేయాలనిపించే పరిస్థితులకు దూరంగా ఉంటాడు. అతను దేవునితో మళ్లీ మంచి సంబంధం కలిగి ఉండడానికి కృషిచేస్తే యెహోవా తనను పూర్తిగా క్షమిస్తాడనే, తాను సంఘంలోకి తిరిగి చేర్చుకోబడతాననే నమ్మకంతో ఉండవచ్చు. నిజమే, ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. కాబట్టి సంఘ పెద్దలు తప్పు చేసినవాళ్లతో వ్యవహరిస్తున్నప్పుడు, వాళ్లవాళ్ల పరిస్థితుల్ని బట్టి తీర్పు తీరుస్తారే తప్ప కఠినంగా తీర్పు తీర్చరు.
దేవుని వాక్యంలో రత్నాలు
కీర్తనలు ప్రథమ స్కంధములోని ముఖ్యాంశాలు
31:23—గర్వంతో ప్రవర్తించేవారికి “గొప్ప ప్రతికారము” ఎలా లభిస్తుంది? ఇక్కడ ప్రస్తావించబడిన ప్రతికారం వారికి లభించే శిక్ష. నీతిమంతుడు అనుకోకుండా చేసే పొరపాట్లకు యెహోవా నుండి క్రమశిక్షణ రూపంలో అతనికి ప్రతిఫలం లభిస్తుంది. గర్వంతో ప్రవర్తించే వ్యక్తి తప్పు మార్గం నుండి వైదొలగడు కాబట్టి, అతడికి తీవ్రమైన శిక్షే ప్రతిఫలంగా లభిస్తుంది.—సామెతలు 11:31; 1 పేతురు 4:18.
ఏప్రిల్ 22-28
దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 32-33
ఘోరమైన పాపం చేస్తే ఎందుకు ఒప్పుకోవాలి?
యెహోవా కనికరం మనల్ని నిరాశనుండి రక్షిస్తుంది
7 మనం దేవుని శాసనాలను ఘోరంగా అతిక్రమిస్తే, యెహోవా ఎదుట కూడా మన తప్పులు ఒప్పకొనడం కష్టమనిపిస్తుంది. అటువంటి పరిస్థితులలో ఏమి సంభవించవచ్చు? దావీదు 32వ కీర్తనలో ఇలా ఒప్పుకున్నాడు: “నేను [ఒప్పుకొనుటకు బదులు] మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నాయొముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ [యెహోవా] చెయ్యి నామీద బరువుగానుండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను.” (3, 4 వచనాలు) తన తప్పును దాచుకొనడం, దోషం చేశానన్న భావనను అణచుకొనడం దారితప్పిన దావీదును కృంగదీశాయి. క్షోభవల్ల అతని శక్తి ఎంతగా క్షీణించిందంటే జీవనాధారమైన తడిలేక మోడుబారిన వృక్షంలా ఉన్నాడు. వాస్తవానికి, మానసిక, శారీరక చెడు ప్రభావాలను కూడా ఆయన అనుభవించియుండవచ్చు. ఏమైనను, అతను తన సంతోషాన్ని కోల్పోయాడు. మనలో ఎవరమైనా అటువంటి స్థితిలో ఉంటే, మనమేమి చేయాలి?
“క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల” దేవుడు
8 పశ్చాత్తప్తుడైన దావీదు ఇలా అన్నాడు: ‘నా దోషము కప్పుకొనక నీ యెదుట నా పాపము ఒప్పుకొంటిని . . . నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు.’ (కీర్తన 32:5) ‘పరిహరించడం’ అని అనువదించబడిన హీబ్రూ పదానికి ప్రాథమికంగా “ఎత్తివేయు” లేదా “తీసివేయు” అని అర్థం. ఇక్కడ దానిని ఉపయోగించడం “దోషాన్ని, పాపాన్ని, అపరాధాన్ని” తీసివేయడాన్ని సూచిస్తోంది. కాబట్టి, వాస్తవానికి యెహోవా దావీదు పాపాలను ఎత్తివేసి, వాటిని తీసివేశాడు. ఇది నిస్సందేహంగా దావీదు మోస్తున్న దోషభావాలను తుడిచివేసింది. (కీర్తన 32:3) యేసు విమోచన క్రయధన బలియందలి విశ్వాసం ఆధారంగా క్షమాపణ అడిగేవారి పాపాలను తీసివేసే దేవునిపై మనం కూడా పూర్తి నమ్మకంతో ఉండవచ్చు.—మత్తయి 20:28.
పాపాన్ని ఒప్పుకోవడం స్వస్థతకు నడిపిస్తుంది
దావీదు తన పాపాన్ని ఒప్పుకున్న తర్వాత, తానిక దేనికీ పనికిరాడన్న భావానికి లోనుకాలేదు. ఆయన తన పాపాన్ని ఒప్పుకుంటూ వ్రాసిన కీర్తనలోని వ్యక్తీకరణలు, ఆయనకు కలిగిన ఉపశమనాన్నీ, దేవుణ్ణి నమ్మకంగా సేవించాలన్న ఆయన కృతనిశ్చయాన్నీ చూపిస్తున్నాయి. ఉదాహరణకు 32వ కీర్తనను చూడండి. “తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు” అని మొదటి వచనంలో మనం చదువుతాం. ఒక వ్యక్తి చేసినది ఎంత గంభీరమైన పాపమైనప్పటికీ, హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడితే సంతోషకరమైన ఫలితాన్ని పొందడం సాధ్యమే. పాపం చేసిన వ్యక్తి, దావీదు చేసినట్లు తాను చేసిన పాపానికి బాధ్యతనంతటినీ అంగీకరించడం ద్వారా హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడుతున్నానని చూపిస్తాడు. (2 సమూయేలు 12:13) యెహోవా ఎదుట తనను తాను సమర్థించుకోవాలని ప్రయత్నించడం గానీ, తప్పును ఇతరులపై నెట్టడానికి ప్రయత్నించడం గానీ దావీదు చేయలేదు. “నా దోషము కప్పుకొనక నీ యెదుట నా పాపము ఒప్పుకొంటిని—యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు” అని 5వ వచనం చెబుతోంది. ఒక వ్యక్తి తన పాపాన్ని యథార్థంగా ఒప్పుకున్నప్పుడు ఉపశమనం కలుగుతుంది, అలా, తాను గతంలో చేసిన పాపాన్ని గురించి మనస్సాక్షి పెట్టే వేధింపుకు తను ఇక లోనవ్వవలసిన అవసరం లేదు.
దేవుని వాక్యంలో రత్నాలు
కీర్తనలు ప్రథమ స్కంధములోని ముఖ్యాంశాలు
33:6—యెహోవా “వాక్కు” లేక ఆయన “నోటి ఊపిరి” అంటే ఏమిటి? ఇది దేవుని చురుకైన శక్తి లేక పరిశుద్ధాత్మ, దీన్నే ఆయన విశ్వాన్ని సృష్టించడానికి ఉపయోగించాడు. (ఆదికాండము 1:1, 2) అది ఆయన నోటి ఊపిరి అని ఎందుకు పిలువబడుతుందంటే, ఒక శక్తిమంతమైన ఊపిరిలా అది ఎంత దూరంలోవున్న పనులైనా చేయడానికి పంపబడవచ్చు.
ఏప్రిల్ 29–మే 5
దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 34-35
‘ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించండి’
మనం కలిసి యెహోవా నామాన్ని గొప్ప చేద్దాం
11 “నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.” (కీర్తన 34:1) బహిష్కృతునిగా జీవిస్తున్న దావీదుకు భౌతిక విషయాల చింతలు అధికంగా ఉండే ఉండవచ్చు, కానీ ఈ మాటలు చూపిస్తున్నట్లుగా, ఆయన దైనందిన చింతలు యెహోవాను సన్నుతించాలన్న ఆయన నిశ్చయాన్ని మరుగుచేయలేదు. మనం కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు మనకు అదెంత చక్కని మాదిరో కదా! మనం పాఠశాలలోవున్నా, ఉద్యోగస్థలంలోవున్నా, తోటి క్రైస్తవులతోవున్నా, లేక బహిరంగ పరిచర్యలోవున్నా మన ప్రాథమిక కోరిక యెహోవాను సన్నుతించాలన్నదే అయ్యుండాలి. అలా సన్నుతించేందుకు మనకున్న అసంఖ్యాకమైన కారణాల గురించి ఒక్కసారి ఆలోచించండి! ఉదాహరణకు, అద్భుతమైన యెహోవా సృష్టికార్యాల్లో మనం కనిపెట్టి, ఆనందించగల విషయాలకు అంతులేదు. ఆయన తన సంస్థయొక్క భూసంబంధ భాగం ద్వారా నెరవేర్చినవాటిని పరిశీలించండి. నమ్మకమైన మానవులు అపరిపూర్ణులే అయినప్పటికీ, ఈ ఆధునిక కాలాల్లో యెహోవా వారిని మహాశక్తివంతంగా ఉపయోగించుకున్నాడు. దేవుని కార్యములను, ఈ లోకం పూజించే మనుష్యుల పనులతో పోలిస్తే అవెలా ఉంటాయి? “ప్రభువా, దేవతలలో నీవంటివాడు లేడు. నీ కార్యములకు సాటియైన కార్యములు లేవు” అని కూడా వ్రాసిన దావీదుతో మీరు ఏకీభవించరా?—కీర్తన 86:9
మనం కలిసి యెహోవా నామాన్ని గొప్ప చేద్దాం
13 “యెహోవానుబట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు.” (కీర్తన 34:2) దావీదు ఇక్కడ వ్యక్తిగత ఘనకార్యాల గురించి గొప్పలు చెప్పుకోవడం లేదు. ఉదాహరణకు, గాతు రాజును తానెలా బోల్తాకొట్టించాడో ఆయన గొప్పగా చెప్పుకోలేదు. గాతులో ఉన్నప్పుడు యెహోవా తనను కాపాడాడని, యెహోవా సహాయంతో తాను తప్పించుకున్నానని ఆయన గ్రహించాడు. (సామెతలు 21:1) కాబట్టి దావీదు తనను కాదుగానీ, యెహోవానే ఘనపర్చాడు. అలా దావీదు యెహోవాను ఘనపర్చాడు కాబట్టే, దీనులు యెహోవావైపు ఆకర్షించబడ్డారు. అలాగే యేసు కూడా యెహోవా నామాన్ని ఘనపర్చాడు, అది దీనులైన, బోధించదగిన ప్రజలను దేవునివైపు ఆకర్షించింది. నేడు, అన్నిదేశాల్లోని దీనులు యేసు శిరస్సుగావున్న అభిషిక్త క్రైస్తవుల అంతర్జాతీయ సంఘానికి ఆకర్షించబడుతున్నారు. (కొలొస్సయులు 1:18) వినయస్థులైన దేవుని సేవకులు ఆయన నామాన్ని మహిమపర్చడాన్ని విన్నప్పుడు, తామర్థంచేసుకునేలా దేవుని పరిశుద్ధాత్మ సహాయం చేసిన బైబిలు సందేశాన్ని విన్నప్పుడు అలాంటి దీనుల హృదయాలు పురికొల్పబడతాయి.—యోహాను 6:44; అపొస్తలుల కార్యములు 16:14.
మనం కలిసి యెహోవా నామాన్ని గొప్ప చేద్దాం
15 “నేను యెహోవాయొద్ద విచారణచేయగా ఆయన నాకుత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను తప్పించెను.” (కీర్తన 34:4) ఈ అనుభవం దావీదుకు ఎంతో ప్రాముఖ్యం. అందుకే ఆయనింకా ఇలా అన్నాడు: “ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలోనుండి అతని రక్షించెను.” (కీర్తన 34:6) తోటి విశ్వాసులతో సహవసించేటప్పుడు, క్లిష్ట పరిస్థితుల్ని సహించేందుకు యెహోవా మనకు ఎలా సహాయం చేశాడో తెలిపే ప్రోత్సాహకరమైన అనుభవాలు చెప్పగల చాలా అవకాశాలు మనకు లభిస్తాయి. అలా చెప్పడం, దావీదు మాటలు తన మద్దతుదారుల విశ్వాసాన్ని బలపరిచినట్లే, మన తోటివిశ్వాసుల విశ్వాసాన్ని బలపరుస్తుంది. దావీదు విషయంలో, ఆయన సహవాసులు “ఆయన [యెహోవా] తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును.” (కీర్తన 34:5) రాజైన సౌలు నుండి పారిపోతున్నా వారు దానిని అవమానంగా భావించలేదు. దేవుడు దావీదుకు మద్దతిస్తున్నాడని వారు విశ్వసించారు, వారికి వెలుగు కలిగింది. అదే విధంగా, క్రొత్తగా ఆసక్తి చూపిస్తున్నవారేకాక, దీర్ఘకాలంగా నిజ క్రైస్తవులుగా ఉన్నవారు కూడా మద్దతుకోసం యెహోవావైపు చూస్తారు. వారు వ్యక్తిగతంగా ఆయన సహాయం చవిచూశారు కాబట్టి, నమ్మకంగా నిలిచివుండాలనే వారి దృఢసంకల్పం వారి ముఖాల్లో ప్రకాశమానంగా ప్రతిబింబిస్తుంది.
దేవుని వాక్యంలో రత్నాలు
కీర్తనలు ప్రథమ స్కంధములోని ముఖ్యాంశాలు
35:19—తనను ద్వేషించేవారు కన్ను గీటకుండా చేయమని దావీదు చేసిన విన్నపం యొక్క భావమేమిటి? కన్ను గీటడం, దావీదు శత్రువులు ఆయనకు వ్యతిరేకంగా తాము చేస్తున్న ద్వేషపూరిత పథకాల సాఫల్యం నుండి ఆనందాన్ని పొందడాన్ని సూచిస్తుంది. అలా జరగనివ్వవద్దని దావీదు విజ్ఞప్తి చేశాడు.