కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwbr17 జూన్‌ పేజీలు 1-9
  • క్రైస్తవ జీవితం పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రైస్తవ జీవితం పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు
  • క్రైస్తవ జీవితం పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు—2017
  • ఉపశీర్షికలు
  • జూన్‌ 5-11
  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
  • చదవాల్సిన బైబిలు భాగం
  • జూన్‌ 12-18
  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
  • చదవాల్సిన బైబిలు భాగం
  • జూన్‌ 19-25
  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
  • చదవాల్సిన బైబిలు భాగం
  • జూన్‌ 26–జూలై 2
  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
  • చదవాల్సిన బైబిలు భాగం
క్రైస్తవ జీవితం పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు—2017
mwbr17 జూన్‌ పేజీలు 1-9

క్రైస్తవ జీవితం పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు

జూన్‌ 5-11

దేవుని వాక్యంలో ఉన్న సంపద|యిర్మీయా 51-52

“యెహోవా చెప్పిన వాటిలో ప్రతి చిన్న విషయం నెరవేరుతుంది”

1(యిర్మీయా 51:11) బాణములు చికిలిచేయుడి కేడెములు పట్టుకొనుడి బబులోనును నశింపజేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు మాదీయుల రాజుల మనస్సును దానిమీదికి రేపుచున్నాడు అది యెహోవా చేయు ప్రతిదండన తన మందిరమునుగూర్చి ఆయన చేయు ప్రతిదండన.

(యిర్మీయా 51:28) దానిమీదికిపోవుటకై మాదీయుల రాజులను వారి అధిపతులను వారి యేలికలను అతడు ఏలుచుండు సర్వదేశమును జనులనందరిని ప్రతిష్ఠించుడి.

it-2 360 ¶2-3

మాదీయులు, మాదీయ

పారసీకులతో కలిసి బబులోనును ఓడించడం. యెహోవా బబులోను మీద పడుటకు మాదీయులను రేపుతాడని ‘వీళ్లు వెండిని లక్ష్యం చేయరు సువర్ణముకూడ వాళ్లకు రమ్యమైనది కాదు, వాళ్ల విండ్లు యౌవనస్థులను నలుగగొడతాయని’ సా.శ.పూ. 8వ శతాబ్దంలో యెషయా ప్రవక్త ప్రవచించాడు. (యెష 13:17-19; 21:2) ఈ వచనంలోని ‘మాదీయులు’ అనే మాట పారసీకులను కూడా సూచిస్తుంది. ప్రాచీన గ్రీకు చరిత్రకారులు కూడా మాదీయులను, పారసీకులను సూచించడానికి మాదీయులు అనే మాటను ఉపయోగించేవాళ్లు. అయితే ఆ మాదీయులు వెండిని, బంగారాన్ని విలువైనదిగా చూడకపోవడం అనేది, వాళ్లు దోచుకోవడాన్ని కన్నా బబులోనును ఓడించడాన్నే ముఖ్యంగా ఎంచారని తెలుస్తోంది. దానివల్ల లంచం లేదా ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఇచ్చే ఎలాంటి బహుమతినైనా వాళ్లు అంగీకరించలేదు. పారీసీకుల్లాగే మాదీయులు కూడా బాణాల్నే ముఖ్యమైన ఆయుధంగా ఉపయోగించేవాళ్లు. కొన్నిసార్లు చెక్క బాణాలకు రాగి లేదా ఇత్తడి కవచాలను తొడిగేవాళ్లు. (కీర్త 18:34 పోల్చండి) వాళ్లు ప్రతీ బాణాన్ని సానబెట్టి శరీరంలోకి బాగా లోతుగా చొచ్చుకుపోయేలా తయారుచేసేవాళ్లు. బహుశా ఆ బాణాల వర్షం బబులోను ‘యౌవనస్థుల్ని నలుగగొట్టి’ ఉంటుంది.—యిర్మీ 51:11.

గమనించాల్సిన విషయమమేమిటంటే యిర్మీయా (51:11, 28) తన మాటల్లో, “మాదీయుల రాజులు” బబులోనుపై దాడి చేస్తారని చెప్పాడు. అతను ఉపయోగించిన బహువచనం బట్టి కోరేషు కింద ఉపరాజుగా మాదీయుడైన రాజు లేదా రాజులు ఉండేవాళ్లని తెలుస్తోంది. ప్రాచీన కాలంలో కూడా అలాంటి పద్ధతే ఉండేది. (యిర్మీ 25:25 కూడా పోల్చండి.) కాబట్టి మాదీయులు, పారసీకులు, ఏలాములు, పొరుగునున్న ఇతర గోత్రాలవాళ్లు కలిసి బబులోనుపై దాడి చేశారని చెప్పవచ్చు. అయితే పారీసీకుడైన కోరేషు రాజు, మాదీయుడైన దర్యావేషును ‘కల్దీయులపై రాజుగా’ నియమించి ఉంటాడు.—దాని 5:31; 9:1; దర్యావేషు నం. 1 చూడండి.

(యిర్మీయా 51:30) 30 బబులోను పరాక్రమవంతులు యుద్ధముచేయక మానుదురు. వారు తమ కోటలలో నిలుచుచున్నారు వారి పరాక్రమము బలహీనత ఆయెను వారును స్త్రీలవంటివారైరి వారి నివాసస్థలములు కాల్చబడుచున్నవి వారి అడ్డగడియలు విరిగిపోయెను.

it-2 459 ¶4

నెబోనైడస్‌

ఆసక్తికరంగా, బబులోనుపై దాడి జరిగిన రాత్రి గురించి ఓ వృత్తాంతంలో ఇలా ఉంది, “కోరేషు సైన్యం ఎలాంటి యుద్ధం చేయకుండానే బబులోనులోకి ప్రవేశించింది.” అంటే సాధారణంగా ఒక దేశంలోకి ప్రవేశించకముందు జరిగే యుద్ధం గురించి ఇది మాట్లాడుతోంది. “బబులోను పరాక్రమవంతులు యుద్ధముచేయక మానుదురు” అని యిర్మీయ ప్రవక్త ముందుగానే ప్రవచించినట్లు ఆ రోజున జరిగింది.—యిర్మీ 51:30.

(యిర్మీయా 51:37) బబులోను నిర్జనమై కసువు దిబ్బలుగా ఉండును నక్కలకు నివాసస్థలమగును అది పాడై యెగతాళికి కారణముగా ఉండును.

(యిర్మీయా 51:62) ఈలాగున నీవు ప్రకటింపవలెను—యెహోవా, మనుష్యులైనను జంతువులైనను మరి ఏదైనను ఈ స్థలమందు నివసింపక పోవుదురనియు, అది నిత్యము పాడుగా నుండుననియు దానినిగూర్చి నీవు సెలవిచ్చితివి.

it-1 237 ¶1

బబులోను

సా.శ.పూ. 539 అందరికీ గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే ఆ సంవత్సరం మొదలుకొని బబులోను సామ్రాజ్య వైభవం కనుమరుగైపోవడం ప్రారంభమైంది. ఆ సామ్రాజ్యం పారసీక రాజైన దర్యావేషు I (హిస్టాస్పిస్‌) పై రెండుసార్లు యుద్ధం చేసింది. రెండవసారి యుద్ధం చేసినప్పుడు బబులోను పూర్తిగా పతనమైంది. అయితే కొంతకాలానికి ఆ సామ్రాజ్యంలోని కొంతభాగం తిరిగి బలం పుంజుకుంది, అప్పుడు అది రాజైన అహష్వేరోషు I పై యుద్ధానికి వెళ్లింది, అప్పుడు ఆ రాజు సైన్యం బబులోనుపై దండెత్తి దాన్ని దోచుకుంది. అలక్సేండర్‌ ద గ్రేట్‌ బబులోనును తన రాజధానిగా చేసుకోవాలనుకున్నాడు, కానీ అతను సా.శ.పూ. 323⁠లో హఠాత్తుగా చనిపోయాడు. సా.శ.పూ. 312⁠లో నికేటర్‌ బబులోనును స్వాధీనం చేసుకుని, అందులోని సంపదను చాలావరకు సెలూసియాలో అతను కడుతున్న కొత్త రాజధాని నిర్మాణ పనిలో ఉపయోగించడానికి టైగ్రీస్‌ నదీతీరానికి తరలించాడు. కాకపోతే ఆ నగరం అలాగే యూదులు నివాసముంటున్న ప్రాంతం తొలి క్రైస్తవ సంఘం స్థాపించబడిన కాలంవరకు ఉన్నాయి. అందుకే అపొస్తలుడైన పేతురు తన పత్రికలో రాసినట్లు, అతను బబులోనుకు వెళ్లాడు. (1పేతు 5:13) రాతిపై చెక్కబడిన రాతల్ని బట్టి తేలిన విషయమేమిటంటే, బబులోనీయులు ఆరాధించే బేలు దేవాలయం సా.శ. 75 వరకు ఉంది. సా.శ. 4 కల్లా ఆ నగరం శిథిలమైపోయింది. చివరికి ఉనికిలో లేకుండా పోయింది. కేవలం ‘కసువు దిబ్బగా’ మిగిలింది.—యిర్మీ 51:37.

దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం

(యిర్మీయా 51:25) సర్వభూమిని నశింపజేయు నాశనపర్వతమా, నేను నీకు విరోధిని ఇదే యెహోవా వాక్కు. నేను నీమీదికి నా చేయి చాపి శిలలైపనుండి నిన్ను క్రిందికి దొరలించుదును చిచ్చుపెట్టిన కొండవలె ఉండజేయుదును.

it-2 444 ¶9

పర్వతం, కొండ

ప్రభుత్వాల్ని సూచిస్తుంది. బైబిల్లో పర్వతాలు అనే మాట రాజ్యాలను లేదా పరిపాలిస్తున్న ప్రభుత్వాల్ని సూచిస్తుంది. (దాని 2:35, 44, 45; యెష 41:15 పోల్చండి; ప్రక 17:9-11, 18.) బబులోను తన సైనిక బలగాల్ని ఉపయోగించుకుని ఇతర రాజ్యాల్ని నాశనం చేసింది. అందుకే బైబిలు ఆ నగరాన్ని ‘నాశన పర్వతం’ అని పిలుస్తోంది. (యిర్మీ 51:24, 25) యుద్ధం చేసేవాళ్లపై యెహోవా తీసుకునే చర్యల గురించి రాసిన ఓ కీర్తనలో యెహోవాను “దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యముకంటె నీవు అధిక తేజస్సుగలవాడవు” అని వర్ణించడం జరిగింది. (కీర్త 76:4) “దుష్టమృగములుండు పర్వతము” అనే మాట క్రూరమైన రాజ్యాల్ని సూచిస్తుండవచ్చు. (నహూ 2:11-13) యెహోవా గురించి దావీదు ఇలా చెప్పాడు, “నీవే నా పర్వతమును స్థిరపరచితివి.” యెహోవా బహుశా దావీదు రాజ్యాన్ని గొప్పదిగా చేసి దాన్ని స్థిరపర్చివుంటాడు అందుకే దావీదు ఆ మాటల్ని అన్నాడు. (కీర్త 30:7; 2 సమూ 5:12 పోల్చండి.) కాబట్టి పర్వతం లేదా కొండ అనే మాట రాజ్యాల్ని సూచిస్తుండవచ్చు అని మనం తెలుసుకున్నాం. ఈ అవగాహన, ప్రకటన 8:8⁠లో ఉన్న విషయాన్ని అర్థంచేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. ఆ వచనంలో “అగ్ని చేత మండుచున్న పెద్ద కొండవంటిది ఒక్కటి” అనే మాటలు ఉన్నాయి. ఆ కొండ అగ్నితో మండుతున్నట్లు వర్ణించడాన్ని బట్టి, అగ్నిలా నాశనం చేసే స్వభావం ఉన్న ఏదో రాజ్యాన్ని అది సూచిస్తోందని చెప్పవచ్చు.

(యిర్మీయా 51:42) సముద్రము బబులోనుమీదికి వచ్చెను ఆమె దాని తరంగముల ధ్వనితో నిండుకొనెను.

it-2 882 ¶3

సముద్రము

తండోపతండాలుగా వచ్చే సైన్యాలు. బబులోనుపై దాడిచేయడానికి వచ్చే సైన్యాల స్వరం “సముద్రఘోషవలె” ఉంటుందని యిర్మీయా వర్ణించాడు. (యిర్మీ 50:42) కాబట్టి “సముద్రము” బబులోను మీదికి వస్తుందని యిర్మీయా చెప్పినప్పుడు, అతను ఖచ్చితంగా తండోపతండాలుగా వచ్చే మాదీయుల, పారసీకుల సైన్యం గురించే మాట్లాడాడు.—యిర్మీ 51:42; దాని 9:26 పోల్చండి.

చదవాల్సిన బైబిలు భాగం

(యిర్మీయా 51:1-11) యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—ఇదిగో నేను బబులోను మీదికిని దానిలో కాపురముచేసి నాకు విరోధముగలేచిన వారిమీదికిని ప్రచండమైన వాయువును రప్పించెదను. 2 అన్యదేశస్థులను బబులోనునకు పంపుచున్నాను వారు ఆ దేశమును తూర్పారపట్టి దాని వట్టిదిగా చేయుదురు ఆపద్దినమున వారు నలుదిక్కులనుండి దానిమీదికి వచ్చెదరు. 3 విలుకానిమీదికి విలుకాడు విల్లు త్రొక్కవలెను కవచము వేసికొనువాని మీదికిని విల్లు త్రొక్కవలెను కల్దీయుల దేశములో జనులు హతులై పడునట్లును దాని వీధులలో వారు పొడవబడి కూలునట్లును 4 యౌవనులను కొట్టక మానకుడి దాని సర్వైసన్యమును బొత్తిగా నిర్మూలము చేయుడి. 5 తమ దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఇశ్రాయేలువారిని యూదావారిని విసర్జింపలేదు గాని ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో వారి దేశము నిండియున్నది. 6 మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు బబులోనులోనుండి పారిపోవుడి మీ ప్రాణములు రక్షించుకొనుడి ఇది యెహోవాకు ప్రతికారకాలము అది చేసిన క్రియలనుబట్టి ఆయన దానికి ప్రతికారము చేయుచున్నాడు. 7 బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారుపాత్రయై యుండెను. దానిచేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లి యున్నారు. 8 బబులోను నిమిషమాత్రములోనే కూలి తుత్తునియలాయెను దానిని చూచి అంగలార్చుడి అది స్వస్థతనొందునేమో దాని నొప్పికొరకు గుగ్గిలము తీసికొని రండి. 9 మనము బబులోనును స్వస్థపరచగోరితిమి అయితే అది స్వస్థత నొందలేదు దాని విడిచి పెట్టుడి. మన మన దేశములకు వెళ్లుదము రండి దాని శిక్ష ఆకాశమంత యెత్తుగా సాగుచున్నది అది మేఘములంత ఉన్నతముగా ఎక్కుచున్నది 10 యెహోవా మన న్యాయమును రుజువుపరచుచున్నాడు రండి సీయోనులో మన దేవుడైన యెహోవా చేసిన పని మనము వివరించుదము. 11 బాణములు చికిలిచేయుడి కేడెములు పట్టుకొనుడి బబులోనును నశింపజేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు మాదీయుల రాజుల మనస్సును దానిమీదికి రేపుచున్నాడు అది యెహోవా చేయు ప్రతిదండన తన మందిరమునుగూర్చి ఆయన చేయు ప్రతిదండన.

జూన్‌ 12-18

దేవుని వాక్యంలో ఉన్న సంపద|విలాపవాక్యములు 1-5

“ఓపికగా ఎదురుచూసే స్వభావం సహించడానికి సహాయం చేస్తుంది”

(విలాపవాక్యములు 3:20, 21) ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసికొని నాలో క్రుంగియున్నది అది నీకింకను జ్ఞాపకమున్నది గదా. 21 నేను దీని జ్ఞాపకము చేసికొనగా నాకు ఆశ పుట్టుచున్నది.

(విలాపవాక్యములు 3:24) యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను ఆయనయందు నేను నమ్మిక యుంచుకొనుచున్నాను.

w12 6/1 14 ¶3-4

‘నువ్వు తప్పకుండా . . . నాకు సహాయం చేస్తావు’

బాధ ఉన్నప్పటికీ, యిర్మీయా ఆశ కోల్పోలేదు. అతను యెహోవాను ఇలా వేడుకున్నాడు, ‘నువ్వు [యెహోవాయే స్వయంగా] తప్పకుండా గుర్తుపెట్టుకుని నాకు సహాయం చేస్తావు.’ (20వ వచనం, NW) యిర్మీయాకు ఎలాంటి సందేహం లేదు. యెహోవా తననుగానీ, యెహోవా ప్రజల్లో పశ్చాత్తపం చూపించేవాళ్లను గానీ మర్చిపోడని యిర్మీయాకు తెలుసు. మరి సర్వశక్తిమంతుడైన యెహోవా ఏమి చేస్తాడు?—ప్రకటన 15:3.

నిజమైన పశ్చాత్తాపం చూపించేవాళ్లకు యెహోవా ఖచ్చితంగా సహాయం చేస్తాడని యిర్మీయా బలంగా నమ్మాడు. మరో అనువాదం ఇలా చెప్తోంది, “నన్ను గుర్తుచేసుకుని, నా వైపుకు వంగి చూడు.” ఆ వర్ణన ఆప్యాయతతో చేసే ఒక పనిని గుర్తుకు తెస్తోంది కదా! ‘సర్వలోకములో మహోన్నతుడైన’ యెహోవా కృంగిపోయిన తన ఆరాధకులతో మాట్లాడి వాళ్లను ధైర్యపర్చడానికి, మళ్లీ తన అనుగ్రహం పొందేలా సహాయం చేయడానికి పైనుండి వంగి చూస్తాడు. (కీర్తన 83:18) ఈ నిరీక్షణను బట్టే గాయపడిన యిర్మీయా హృదయం ఓదార్పు పొందింది. పశ్చాత్తాపం చూపించిన తన ప్రజల్ని యెహోవా విడిపించే సమయం వచ్చే వరకు ఆ నమ్మకమైన ప్రవక్త ఓపిగ్గా ఎదురుచూశాడు.—21వ వచనం.

w11 9/15 8 ¶8

యెహోవా నా స్వాస్థ్యం

8 ఒక గోత్రంగా లేవీయులు యెహోవాను తమ స్వాస్థ్యంగా చేసుకున్నారు. అయితే, యెహోవాతో తమకున్న స్నేహం గురించి, ఆయనపై తమకున్న నమ్మకం గురించి మాట్లాడుతూ కొంతమంది లేవీయులు వ్యక్తిగతంగా “యెహోవా నా భాగము” అన్నారు. (విలా. 3:24) ఉదాహరణకు, యెహోవా తన స్వాస్థ్యమని చెప్పిన గాయకుడూ సంగీతకారుడూ అయిన ఒక లేవీయుని గురించి బైబిల్లో ఉంది. ఆయన పేరు ఆసాపు అనుకుందాం. బహుశా ఆయన దావీదు రాజు కాలంలో ఉన్న లేవీయుల్లోని ముఖ్య గాయకుడైన ఆసాపు కుటుంబానికి చెందిన వ్యక్తి కూడా అయ్యుండవచ్చు. (1 దిన. 6:31-43) మంచి జీవితాన్ని అనుభవిస్తున్న దుష్టులను చూసి అసూయపడి, వాళ్ళెందుకు అలా ఉన్నారో ఆసాపు (లేదా ఆయన సంతానంలోని ఒకరు) అర్థం చేసుకోలేకపోయాడని 73వ కీర్తనలో ఉంది. ఆయన చివరకు, “నా హృదయమును నేను శుద్ధిచేసికొని యుండుట వ్యర్థమే. నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట వ్యర్థమే” అని అన్నాడు. యెహోవా తనకు ఇచ్చిన పని ఎంతో ప్రత్యేకమైనదనే విషయాన్ని ఆసాపు తాత్కాలికంగా మరచిపోయాడనిపిస్తోంది. యెహోవా తన స్వాస్థ్యమనే విషయాన్ని ఆయన మరచిపోయాడు. ‘దేవుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేంతవరకు’ ఆయనకు మనశ్శాంతి లేకుండా పోయింది.—కీర్త. 73:2, 3, 12, 13, 17.

(విలాపవాక్యములు 3:26, 27) నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణకొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. 27 యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు.

w07 6/1 11 ¶4-5

విలాపవాక్యములు గ్రంథములోని ముఖ్యాంశాలు

3:21-26, 28-33. తీవ్రమైన బాధను కూడా మనమెలా సహించవచ్చు? యిర్మీయా మనకు చెబుతున్నాడు. యెహోవా కృపగలవాడని, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచేదని మనం మరచిపోకూడదు. మనం సజీవంగా ఉండడమే చాలు మనం ఆశవదులుకోకుండా ఉండడానికి తగిన కారణమనీ మనం సహనం వహించి, ఫిర్యాదు చేయకుండా, రక్షణ అనుగ్రహిస్తాడని యెహోవా కోసం మౌనంగా వేచివుండాలనీ కూడా గుర్తుంచుకోవాలి. అంతేగాక, మనం “బూడిదెలో మూతి పెట్టుకొనవలెను,” అంటే ఏది జరగడానికి దేవుడు అనుమతిస్తాడో అది సరైన కారణంతోనే ఆయన అనుమతించి ఉంటాడని గుర్తిస్తూ శ్రమ సమయంలో వినయంగా లోబడివుండాలి.

3:27. యౌవనకాలంలో విశ్వాస పరీక్షలు ఎదుర్కోవడమంటే కష్టాలను, హేళనలను సహించడమే. కానీ “యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు.” ఎందుకు? ఎందుకంటే ఒక వ్యక్తి యౌవనంలో ఉన్నప్పుడే శ్రమలనే కాడి మోయడాన్ని నేర్చుకుంటే, తన జీవితంలో ఆ తర్వాత ఎదురయ్యే సవాళ్ళతో వ్యవహరించడానికి సిద్ధమౌతాడు.

దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం

(విలాపవాక్యములు 2:17) యెహోవా తాను యోచించిన కార్యము ముగించి యున్నాడు పూర్వదినములలో తాను విధించినది ఆయన నెరవేర్చియున్నాడు శేషములేకుండ నిన్ను పాడుచేసియున్నాడు నిన్నుబట్టి శత్రువులు సంతోషించునట్లు చేసియున్నాడు నీ పగవారి శృంగమును హెచ్చించియున్నాడు.

w07 6/1 9 ¶4

విలాపవాక్యములు గ్రంథములోని ముఖ్యాంశాలు

2:17—యెహోవా యెరూషలేము సంబంధంగా తాను యోచించిన ఏ “కార్యము” ముగించియున్నాడు? ఇక్కడ లేవీయకాండము 26:17 గురించి ప్రస్తావించబడుతున్నట్లు తెలుస్తోంది, అక్కడిలా ఉంది: “నేను మీకు పగవాడనవుదును; మీ శత్రువులయెదుట మీరు చంపబడెదరు; మీ విరోధులు మిమ్మును ఏలెదరు; మిమ్మును ఎవరును తరుమకపోయినను మీరు పారిపోయెదరు.”

(విలాపవాక్యములు 5:7) మా తండ్రులు పాపముచేసి గతించిపోయిరి మేము వారి దోషశిక్షను అనుభవించుచున్నాము.

w07 6/1 11 ¶1

విలాపవాక్యములు గ్రంథములోని ముఖ్యాంశాలు

5:7—యెహోవా, తండ్రులు చేసిన పాపాలకు వారి పిల్లలకు దోషశిక్ష విధిస్తాడా? లేదు, యెహోవా, తండ్రులు చేసిన తప్పులకు పిల్లలను శిక్షించడు. ‘మనలో ప్రతి ఒక్కరం తన గురించి తాను దేవునికి లెక్క అప్పగించాలి’ అని బైబిలు చెబుతోంది. (రోమీయులు 14:11) అయితే, తప్పులవల్ల కలిగే పర్యవసానాలు అలాగే కొనసాగుతూ తర్వాతి తరాలవారు వాటిని అనుభవించవలసి రావచ్చు. ఉదాహరణకు, ప్రాచీన ఇశ్రాయేలు విగ్రహారాధన వైపు తిరగడం, తర్వాతి కాలాల నమ్మకమైన ఇశ్రాయేలీయులు నీతిమార్గాన్ని అంటిపెట్టుకుని ఉండడం కష్టమయ్యేలా చేసింది.—నిర్గమకాండము 20:5.

చదవాల్సిన బైబిలు భాగం

(విలాపవాక్యములు 2:20–3:12) నీవు ఎవనియెడల ఈ ప్రకారము చేసితివో యెహోవా, దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తికొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? యాజకుడును ప్రవక్తయు ప్రభువుయొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగునా? 21 యౌవనుడును వృద్ధుడును వీధులలో నేలను పడియున్నారు నా కన్యకలును నా యౌవనులును ఖడ్గముచేత కూలియున్నారు నీ ఉగ్రతదినమున నీవు వారిని హతముచేసితివి దయ తలచక వారినందరిని వధించితివి. 22 ఉత్సవదినమున జనులు వచ్చునట్లుగా నలుదిశలనుండి నీవు నామీదికి భయోత్పాతములను రప్పించితివి. యెహోవా ఉగ్రతదినమున ఎవడును తప్పించుకొనలేక పోయెను శేషమేమియు నిలువకపోయెను నేను చేతులలో ఆడించి సాకినవారిని శత్రువులు హరించివేసియున్నారు.

3 నేను ఆయన ఆగ్రహదండముచేత బాధ ననుభవించిన నరుడను. 2 ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. 3 మాటి మాటికి దినమెల్ల ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు 4 ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణంపజేయుచున్నాడు. నా యెముకలను విరుగగొట్టుచున్నాడు 5 నాకు అడ్డముగా కంచె వేసియున్నాడు విషమును మాచిపత్రిని నా చుట్టు మొలిపించి యున్నాడు 6 పూర్వకాలమున చనిపోయినవారు నివసించునట్లు ఆయన చీకటిగల స్థలములలో నన్ను నివసింపజేసియున్నాడు 7 ఆయన నా చుట్టు కంచె వేసియున్నాడు నేను బయలువెళ్లకుండునట్లు బరువైన సంకెళ్లు నాకు వేసియున్నాడు 8 నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండ తన చెవి మూసికొని యున్నాడు. 9 ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడురాళ్లు కట్టియున్నాడు నేను పోజాలకుండ నా త్రోవలను కట్టివేసి యున్నాడు 10 నా ప్రాణమునకు ఆయన పొంచియున్న ఎలుగుబంటివలె ఉన్నాడు చాటైన చోటులలోనుండు సింహమువలె ఉన్నాడు 11 నాకు త్రోవలేకుండ చేసి నా యవయవములను విడదీసి యున్నాడు నాకు దిక్కులేకుండ చేసియున్నాడు 12 విల్లు ఎక్కు పెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలువబెట్టియున్నాడు.

జూన్‌ 19-25

దేవుని వాక్యంలో ఉన్న సంపద|యెహెజ్కేలు 1-5

“దేవుని సందేశాన్ని ప్రకటించడానికి యెహెజ్కేలు ఎంతో సంతోషించాడు”

(యెహెజ్కేలు 2:9–3:2) నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొనిన యొక చెయ్యి నా యొద్దకు చాపబడెను. 10 ఆయన దాని నాముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై యుండెను; మహా విలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడియుండెను.

3 మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను—నరపుత్రుడా, నీకు కనబడినదానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయులయొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. 2 నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి

w08 7/15 8 ¶6-7

ఇంటింటి పరిచర్యలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం

6 మనం ధైర్యంగా ప్రకటించడానికి సహాయం చేయగల మరో అంశాన్ని యెహెజ్కేలు గ్రంథం తెలియజేస్తుంది. యెహోవా ఒక దర్శనంలో రెండువైపులా “మహా విలాపమును మనోదుఃఖమును రోదనమును” రాయబడిన ఒక గ్రంథపుచుట్టను యెహెజ్కేలుకు ఇచ్చి దాన్ని తినమని ఆదేశించాడు. “నరపుత్రుడా, నేనిచ్చుచున్న యీ గ్రంథమును ఆహారముగా తీసికొని దానితో నీ కడుపు నింపుకొనుము” అని ఆదేశించాడు. ఈ దర్శన భావమేమిటి? యెహెజ్కేలు తాను ప్రకటించనున్న సందేశాన్ని పూర్తిగా అర్థంచేసుకోవాలి. అది ఆయనలో భాగమైపోవాలి, అంటే ఆయన అంతరంగ భావాలను అది ప్రభావితం చేయాలి. ఆ ప్రవక్త ఇలా చెప్పాడు: “నేను దాని భక్షించితిని; అది నానోటికి తేనెవలె మధురముగా నుండెను.” దేవుని సందేశాన్ని ప్రజలకు ప్రకటించడం యెహెజ్కేలుకు తేనె అంత మధురంగా అనిపించింది. తనకు అప్పగించబడిన పనిలో భాగంగా ప్రజలు ఇష్టపడని సందేశాన్ని ప్రకటించాల్సివచ్చినా యెహోవాకు ప్రాతినిధ్యం వహించి ఆయనిచ్చిన పనిని పూర్తిచేయడాన్ని గౌరవప్రదమైన విషయంగా భావించాడు.—యెహెజ్కేలు 2:8–3:4, 7-9 చదవండి.

7 ఇప్పుడున్న దేవుని సేవకులకు ఈ దర్శనంలో ఒక అమూల్యమైన పాఠం ఉంది. ప్రజలు అన్ని సందర్భాల్లో మన పనిని మెచ్చుకోరు. యెహెజ్కేలులా మనం కూడా వారు ఇష్టపడని సందేశాన్ని ప్రకటించాలి. క్రైస్తవ పరిచర్యను దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశంగా ఎల్లప్పుడూ పరిగణించాలంటే మనం ఆధ్యాత్మిక ఆహారాన్ని క్రమంగా తీసుకోవాలి. దేవుని వాక్యాన్ని పైపైన లేక అప్పుడప్పుడు చదివితే దానిని మనం పూర్తిగా అర్థంచేసుకోలేం. మీరు బైబిలును మరింత క్రమంగా మరింత మెరుగ్గా చదివి, అధ్యయనం చేయగలరా? మీరు చదివినదాన్ని మరింత క్రమంగా ధ్యానించగలరా?—కీర్త. 1:2, 3.

it-1 1214

ప్రేగులు

మనం తినే ఆహారం ప్రేగుల్లో జీర్ణమౌతుంది. ఈ వాస్తవాన్ని బట్టే, ఒక దర్శనంలో యెహెజ్కేలును గ్రంథాన్ని తిని, దానితో కడుపు (లేదా ప్రేగులు, హెబ్రీ., మీ·ʽయిమ్‌ʹ) నింపుకొని జీర్ణించుకోమని చెప్పినప్పుడు అది ఆధ్యాత్మిక భావంలో చెప్పబడింది అర్థంచేసుకోవచ్చు. యెహెజ్కేలు ఆ గ్రంథంలో ఉన్న మాటల గురించి లోతుగా ఆలోచించి, వాటిని మనసులో భద్రపర్చుకొని ఆధ్యాత్మికంగా బలం పొందాలి. ఆ విధంగా దేవుడు అతన్ని ఆధ్యాత్మికంగా పోషించి, అతను ఇతరులకు ఏమి మాట్లాడాలో చెప్పాడు.—యెహె 3:1-6; ప్రక 10:8-10 పోల్చండి.

(యెహెజ్కేలు 3:3) నరపుత్రుడా, నేనిచ్చుచున్న యీ గ్రంథమును ఆహారముగా తీసికొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవియ్యగా నేను దాని భక్షించితిని; అది నానోటికి తేనెవలె మధురముగా నుండెను.

w07 7/1 12 ¶3

యెహెజ్కేలు గ్రంథములోని ముఖ్యాంశాలు—I

2:9–3:3—మహా విలాపమును, మనోదుఃఖము కలిగించే విషయాలున్న గ్రంథపుచుట్ట యెహెజ్కేలుకు మధురముగా ఉన్నట్లు ఎందుకనిపించింది? యెహెజ్కేలుకు, తన నియామకంపట్ల ఉన్న దృక్పథం కారణంగా ఆ గ్రంథపుచుట్ట మధురంగా ఉన్నట్లు అనిపించింది. ప్రవక్తగా యెహోవాను సేవించే ఆధిక్యతపట్ల ఆయన కృతజ్ఞత కనబరిచాడు.

దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం

(యెహెజ్కేలు 1:20, 21) ఆత్మ యెక్కడికి పోవునో అక్కడికే, అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను; జీవికున్న ఆత్మ, చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములును లేచుచుండెను. 21 జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక జీవులు జరుగగా చక్రములును జరుగుచుండెను, అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి నేలనుండి లేవగా ఇవియు వాటితోకూడ లేచెను.

(యెహెజ్కేలు 1:26-28) వాటి తలలపైనున్న ఆ మండలముపైన నీలకాంతమయమైన సింహాసనమువంటి దొకటి కనబడెను; మరియు ఆ సింహాసనమువంటి దానిమీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడైయుండెను. 27 చుట్టు దాని లోపట కరుగుచున్న యిత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనబడెను, చుట్టును తేజోమయముగా కనబడెను. 28 వర్ష కాలమున కనబడు ఇంద్ర ధనస్సుయొక్క తేజస్సువలె దాని చుట్టునున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను.

w07 7/1 11 ¶6

యెహెజ్కేలు గ్రంథములోని ముఖ్యాంశాలు—I

1:4-28—పరలోక రథం దేనిని సూచిస్తుంది? ఆ రథం నమ్మకమైన ఆత్మప్రాణులతో కూడిన యెహోవా పరలోక సంస్థను సూచిస్తుంది. ఆ సంస్థకు యెహోవా పరిశుద్ధాత్మ శక్తినిస్తుంది. యెహోవాకు ప్రతీకగావున్న రథ సారథి మహిమ వర్ణనాతీతం. ఆయన ప్రశాంతత అద్భుతమైన ఇంద్రధనుస్సుతో ఉదాహరించబడింది.

(యెహెజ్కేలు 4:1-7) నరపుత్రుడా, పెంకు ఒకటి తీసికొనివచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద వ్రాయుము. 2 మరియు అది ముట్టడి వేయబడినట్లును దానియెదుట బురుజులను కట్టినట్లును దిబ్బ వేసినట్లును దాని చుట్టునున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లును నీవు వ్రాయుము. 3 మరియు ఇనుపరేకొకటి తెచ్చి, నీకును పట్టణమునకును మధ్య ఇనుప గోడగా దానిని నిలువబెట్టి, నీ ముఖ దృష్టిని పట్టణము మీద ఉంచుకొనుము; పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును, నీవు దానిని ముట్టడివేయువాడవుగా ఉందువు; అది ఇశ్రాయేలీయులకు సూచనగా ఉండును. 4 మరియు నీ యెడమ ప్రక్కను పండుకొనియుండి ఇశ్రాయేలువారి దోషమును దానిమీద మోపవలెను; ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. 5 ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించునట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్కచొప్పున నీకు మూడువందల తొంబది దినములు నిర్ణయించియున్నాను. 6 ఆ దినములు గడచిన తరువాత కుడిప్రక్కను పండుకొనియుండి నలువది దినములు యూదావారి దోషమును భరింపవలెను, సంవత్సర మొకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించియున్నాను. 7 ఈలాగు నీవుండగా యెరూషలేము ముట్టడివేయుబడినట్లు తేరిచూచుచు, చొక్కాయిని తీసివేసిన బాహువు చాపి దానినిగూర్చి ప్రకటింపవలెను.

w07 7/1 12 ¶4

యెహెజ్కేలు గ్రంథములోని ముఖ్యాంశాలు—I

4:1-17—యెరూషలేముమీదకు రాబోయే ముట్టడిని వర్ణించే దృశ్యాన్ని యెహెజ్కేలు నిజంగా ప్రదర్శించాడా? యెహెజ్కేలు వంటచెరుకు మార్చమని విన్నవించడం, యెహోవా ఆ విన్నపాన్ని మన్నించడం, ప్రవక్త నిజంగా ఆ దృశ్యాన్ని ప్రదర్శించాడని తెలియజేస్తుంది. పది గోత్రాల రాజ్యపువారి 390 ఏళ్ల దోషాన్ని, అంటే సా.శ.పూ. 997వ సంవత్సరం మొదలుకొని సా.శ.పూ. 607⁠లో యెరూషలేము నాశనమయ్యేంతవరకు చేసిన దోషాన్ని ప్రదర్శించడానికి ఆయన ఎడమవైపు పడుకున్నాడు. యూదావారి 40 ఏళ్ల దోషాన్ని అంటే యిర్మీయా ప్రవక్తగా నియమించబడిన సా.శ.పూ. 647 నుండి సా.శ.పూ. 607వరకు వారు చేసిన దోషాన్ని ప్రదర్శించడానికి కుడివైపు పడుకున్నాడు. ఆ 430 రోజులు యెహెజ్కేలు ఆహారం, నీళ్లు కొద్దిగానే తీసుకున్నాడు, అలా చేయడం ద్వారా యెరూషలేముమీద ముట్టడి జరిగినప్పుడు ఆయన ప్రవచనాత్మకంగా కరువు ఉంటుందని సూచించాడు.

చదవాల్సిన బైబిలు భాగం

(యెహెజ్కేలు 1:1-14) ముప్పదియవ సంవత్సరము నాలుగవ నెల అయిదవ దినమున నేను కెబారు నదీప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని; ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవునిగూర్చిన దర్శనములు నాకు కలిగెను. 2-3 యెహోయాకీను చెరపట్టబడిన అయిదవ సంవత్సరము ఆ నెలలో అయిదవ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నదీప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షముకాగా అక్కడనే యెహోవా హస్తము అతనిమీదికి వచ్చెను. 4 నేను చూడగా ఉత్తర దిక్కునుండి తుపాను వచ్చుచుండెను; మరియు గొప్ప మేఘమును గోళమువలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను, కాంతి దానిచుట్టు ఆవరించియుండెను; ఆ అగ్నిలోనుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న యపరంజివంటి దొకటి కనబడెను. 5 దానిలోనుండి నాలుగు జీవుల రూపములుగల యొకటి కనబడెను, వాటి రూపము మానవ స్వరూపము వంటిది. 6 ఒక్కొక్క దానికి నాలుగు ముఖములును నాలుగు రెక్కలును గలవు. 7 వాటి కాళ్లు చక్కగా నిలువబడినవి, వాటి అరకాళ్లు పెయ్యకాళ్లవలె ఉండెను, అవి తళతళలాడు ఇత్తడివలె ఉండెను. 8 వాటి నాలుగు ప్రక్కలరెక్కల క్రింద మానవహస్తములవంటి హస్తములుండెను, నాలుగింటికిని ముఖములును రెక్కలును ఉండెను. 9 వాటి రెక్కలు ఒకదానినొకటి కలిసికొనెను, ఏ వైపునకైనను తిరుగక అవన్నియు చక్కగా నెదుటికి పోవుచుండెను. 10 ఆ నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖమువంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహముఖము వంటివి. యెడమపార్శ్వపు ముఖములు ఎద్దుముఖము వంటివి. నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖములు కలవు. 11 వాటి ముఖములును రెక్కలును వేరు వేరుగా ఉండెను, ఒక్కొక జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి యుండెను; ఒక్కొక జత రెక్కలు వాటి దేహములను కప్పెను. 12 అవన్నియు చక్కగా ఎదుటికి పోవుచుండెను, అవి వెనుకకు తిరుగక ఆత్మ యే వైపునకు పోవుచుండునో ఆ వైపునకే పోవుచుండెను. 13 ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోను దివిటీలతోను సమానములు; ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను, ఆ అగ్ని అతికాంతిగా ఉండెను, అగ్నిలోనుండి మెరుపు బయలుదేరుచుండెను. 14 మెరుపు తీగెలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను.

జూన్‌ 26–జూలై 2

దేవుని వాక్యంలో ఉన్న సంపద|యెహెజ్కేలు 6-10

“తప్పించుకునే వాళ్లకు వేసే గుర్తు మీకు వేయబడుతుందా?”

(యెహెజ్కేలు 9:1, 2) మరియు నేను చెవులార వినునట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించెను—ఒక్కొకడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొని—పట్టణపు కావలి వారందరును ఇక్కడికి రండి అనెను. 2 అంతలో ఒక్కొకడు తాను హతముచేయు ఆయుధమును చేత పట్టుకొని, ఉత్తర దిక్కుననున్న పై గవిని మార్గముగా ఆరుగురు మనుష్యులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు, అవిసెనారబట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని యుండెను; వారు ఆలయమున ప్రవేశించి యిత్తడి బలిపీఠమునొద్ద నిలిచిరి.

w16.06 16-17

పాఠకుల ప్రశ్న

యెహెజ్కేలు దర్శనంలోని, లేఖకుని సిరాబుడ్డి ఉన్న వ్యక్తి అలాగే హతముచేసే ఆయుధాలను పట్టుకొని ఉన్న ఆరుగురు వ్యక్తులు ఎవర్ని సూచిస్తున్నారు?

▪ వాళ్లు యెరూషలేమును నాశనం చేయడంలో భాగంవహించిన పరలోక సైన్యాలను సూచిస్తున్నారు. ఆ సైన్యాలే హార్‌మెగిద్దోను సమయంలో సాతాను దుష్టలోకాన్ని నాశనం చేయడంలో కూడా భాగం వహిస్తాయి. ఇది మన అవగాహనలో వచ్చిన సవరణ. ఈ సవరణ ఎందుకు అవసరమైంది?

యెరూషలేము నాశనమవ్వడానికి ముందు ఆ పట్టణంలో ఏమి జరుగుతుందో సా.శ.పూ. 607కన్నా ముందే యెహోవా దేవుడు యెహెజ్కేలుకు ఓ దర్శనంలో చూపించాడు. ఆ పట్టణంలో ఎన్నో చెడు పనులు జరగడాన్ని యెహెజ్కేలు ఆ దర్శనంలో చూశాడు. ఆ తర్వాత, “హతముచేయు ఆయుధమును చేత పట్టుకొని” ఉన్న ఆరుగురు వ్యక్తుల్ని అతను చూశాడు. వాళ్లతోపాటు “అవిసెనారబట్ట ధరించుకొని,” “లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని” ఉన్న మరో వ్యక్తి కూడా యెహెజ్కేలుకు కనిపించాడు. (యెహె. 8:6-12; 9:2, 3) పట్టణములో జరుగుతున్న “హేయకృత్యములనుగూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్నవారి లలాటముల గురుతు” వేసే పని ఈ వ్యక్తికి అప్పగించబడింది. ఆ గుర్తు లేనివాళ్లందర్నీ చంపే పని ఆయుధాలు పట్టుకొనివున్న ఆరుగురు వ్యక్తులకు ఇవ్వబడింది. (యెహె. 9:4-7) ఈ దర్శనం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? లేఖకుని సిరాబుడ్డి ఉన్న వ్యక్తి ఎవరు?

యెహెజ్కేలు ఈ దర్శనాన్ని సా.శ.పూ. 612⁠లో చూశాడు. అయితే ఐదు సంవత్సరాల తర్వాత అంటే బబులోను సైన్యాన్ని ఉపయోగించుకుని యెహోవా యెరూషలేమును నాశనం చేసినప్పుడు ఈ ప్రవచనం మొదటి నెరవేర్పు జరిగింది. ఆ విధంగా, బబులోనీయుల్ని ఉపయోగించుకుని అవిధేయులుగా మారిన తన ప్రజల్ని యెహోవా నాశనం చేశాడు. (యిర్మీ. 25:8-9, 15-18) మరి యెరూషలేములో జరుగుతున్న చెడు పనుల్లో పాలుపంచుకోని నీతిమంతులైన యూదుల సంగతేంటి? వాళ్లకు ఏ హానీ కలగకుండా సురక్షితంగా ఉండేలా యెహోవా చూశాడు.

నిజానికి ఆ దర్శనంలో, యెహెజ్కేలు ఎవ్వరి నొసటి మీద గుర్తు వేయలేదు లేదా యెరూషలేమును నాశనం చేయడంలో భాగం వహించలేదు. బదులుగా దేవదూతలు ఆ పనిని నడిపించారు. కాబట్టి పరలోకంలో జరిగే విషయాల్ని తెలుసుకోవడానికి ఈ ప్రవచనం మనకు సహాయం చేస్తుంది. చెడ్డవాళ్లందర్నీ నాశనం చేసి, నీతిమంతుల్ని రక్షించమని యెహోవా తన దూతలకు ఆజ్ఞాపించాడు.

ఆ విధంగా రక్షించబడిన బారూకు (యిర్మీయా కార్యదర్శి), ఐతియోపీయుడైన ఎబెద్మెలెకు, రేకాబీయులు వంటివాళ్ల నొసళ్ల మీద కంటికి కనిపించే ఎలాంటి గుర్తు లేదు. (యిర్మీ. 35:1-19; 39:15-18; 45:1-5) వాళ్లు రక్షించబడడమే ఓ విధంగా గుర్తు లాంటిది.

ఈ ప్రవచనం రెండవ నెరవేర్పు భవిష్యత్తులో జరుగుతుంది. ఒకప్పుడు మనం, లేఖకుని సిరాబుడ్డి ఉన్న వ్యక్తి భూమ్మీద మిగిలివున్న అభిషిక్త క్రైస్తవుల గుంపును సూచిస్తున్నాడని చెప్పేవాళ్లం. అంతేకాదు సువార్త విని దాన్ని అంగీకరించేవాళ్ల నొసళ్ల మీద గుర్తు వేయబడుతుందని కూడా అనుకున్నాం. కానీ ఆ వివరణలో కొంత సవరణ అవసరమని ఈ మధ్యకాలంలో స్పష్టమైంది. ఎందుకంటే మత్తయి 25:31-33 వచనాల్నిబట్టి, ప్రజల్ని గొర్రెలుగా మేకలుగా తీర్పు తీర్చేది యేసు అని తెలుసుకున్నాం. ఆయన ఆ పనిని మహాశ్రమల కాలంలో చేస్తాడు. అప్పుడు గొర్రెలుగా తీర్పు పొందినవాళ్లు రక్షించబడతారు, మేకలుగా తీర్పు పొందినవాళ్లు నాశనం అవుతారు.

కాబట్టి యెహెజ్కేలు దర్శనం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? ఐదు పాఠాల్ని నేర్చుకోవచ్చు, అవేమిటంటే:

(1) యెరూషలేము పట్టణం నాశనం అవ్వకముందే, ఆ పట్టణానికి జరగబోయే దానిగురించి యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు ప్రవక్తలు ప్రజల్ని హెచ్చరించారు. వాళ్లు దేవుని నుండి వచ్చే హెచ్చరికా సందేశాన్ని ప్రకటించారు. నేడు యెహోవా, మహాశ్రమలు మొదలవ్వక ముందే తన ప్రజలకు బోధించడానికి, ఇతరుల్ని హెచ్చరించడానికి అభిషిక్త క్రైస్తవుల చిన్న గుంపును ఉపయోగించుకుంటున్నాడు. నిజానికి ఆ హెచ్చరికా సందేశాన్ని ప్రకటించాల్సిన బాధ్యత దేవుని ప్రజలందరికీ అంటే క్రీస్తు ఇంటివాళ్లందరికీ ఉంది.—మత్త. 24:45-47.

(2) యెహెజ్కేలులాగే, నేడున్న దేవుని ప్రజలు కూడా రక్షించబడేవాళ్లకు ఎలాంటి గుర్తు వేయరు. వాళ్లు కేవలం ప్రకటిస్తూ భవిష్యత్తులో జరగబోయే వాటిగురించి ప్రజల్ని హెచ్చరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ పని దేవదూతల సహాయంతో జరుగుతోంది.—ప్రక. 14:6.

(3) యెహెజ్కేలు కాలంలో రక్షించబడిన ప్రజల నొసళ్లపై ఎలాంటి గుర్తులేనట్లే, భవిష్యత్తులో రక్షించబడే ప్రజల నొసళ్లపై కూడా ఎలాంటి గుర్తు ఉండదు. ఇంతకీ మహాశ్రమల్ని తప్పించుకోవాలంటే ప్రజలు ఏమి చేయాలి? సువార్తకు చక్కగా స్పందించాలి, క్రీస్తును అనుకరించాలి, తమను తాము దేవునికి సమర్పించుకోవాలి, సువార్త ప్రకటిస్తూ క్రీస్తు సహోదరులకు మద్దతివ్వాలి. (మత్త. 25:35-40) అలాంటివాళ్లకు మహాశ్రమల కాలంలో గుర్తు వేయబడుతుంది, అంటే వాళ్లు రక్షించబడతారని దానర్థం.

(4) సిరాబుడ్డి ఉన్న వ్యక్తి యేసును సూచిస్తున్నాడు. ఆయన మహాశ్రమల కాలంలో, గొప్పసమూహంలోని వాళ్లను గొర్రెలుగా తీర్పు తీర్చినప్పుడు వాళ్లకు గుర్తు వేస్తాడు. ఆ తర్వాత వాళ్లకు భూమ్మీద నిత్యం జీవించే అవకాశం ఉంటుంది.—మత్త. 25:34, 46.

నమ్మకమైన అభిషిక్తులు రక్షించబడాలంటే ఈ గుర్తును పొందాల్సిన అవసరంలేదు. బదులుగా వాళ్లు చనిపోవడానికి ముందు లేదా మహాశ్రమలు మొదలవ్వడానికి ముందు తమ చివరి ముద్రను పొందుతారు.—ప్రక. 7:1, 3.

(5) నేడు, హతము చేసే ఆయుధాలున్న ఆరుగురు వ్యక్తులు యేసు నాయకత్వంలో ఉన్న పరలోక సైన్యాల్ని సూచిస్తున్నారు. వాళ్లు త్వరలోనే భూరాజుల్ని నాశనం చేసి దుష్టత్వాన్ని పూర్తిగా లేకుండా చేస్తారు.—యెహె. 10:2, 6, 7; ప్రక. 19:11-21.

ఈ దర్శనం నుండి మనం నేర్చుకున్న పాఠాలు, దేవుడు చెడ్డవాళ్లతోపాటు నీతిమంతుల్ని నాశనం చేయడనే నమ్మకాన్ని కలిగివుండడానికి మనకు సహాయం చేస్తాయి. (2 పేతు. 2:9-10; 3:9) అంతేకాదు మనకాలంలో జరుగుతున్న ప్రకటనాపని చాలా ముఖ్యమైనదనే విషయాన్ని కూడా ఆ పాఠాలు మనకు గుర్తుచేస్తున్నాయి. అంతం రాకముందే అందరూ ఆ హెచ్చరికను తెలుసుకోవడం చాలా ముఖ్యం.—మత్త. 24:14.

(యెహెజ్కేలు 9:3, 4) ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తానున్న కెరూబుపైనుండి దిగి మందిరపు గడప దగ్గరకువచ్చి నిలిచి, అవిసె నారబట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వానిని పిలువగా 4 యెహోవా—యెరూషలేమను ఆ పట్టణములో ప్రవేశించి చుట్టు తిరిగి, దానిలో జరిగిన హేయకృత్యములనుగూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్నవారి లలాటముల గురుతు వేయుమని వారి కాజ్ఞాపించి.

(యెహెజ్కేలు 9:5-7) నేను వినుచుండగా వారికీలాగు సెలవిచ్చెను—మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధస్థలము దగ్గర మొదలుపెట్టి, కటాక్షమైనను కనికరమైనను లేకుండ అందరిని హతము చేయుడి. 6 అందరు నశించునట్లు ఎవరిని విడిచిపెట్టక, పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలెను గాని, ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు, వారు మందిరము ముందరనున్న పెద్దలను హతముచేయ మొదలుపెట్టగా 7 ఆయన—మందిరమును అపవిత్రపరచుడి, ఆవరణములను హతమైనవారితో నింపుడి, మొదలుపెట్టుడి అని సెలవిచ్చెను గనుక వారు బయలుదేరి పట్టణములోని వారిని హతము చేయసాగిరి.

దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం

(యెహెజ్కేలు 7:19) తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని యెంచుదురు, యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించజాలదు, అది వారి దోషక్రియలు విడువకుండ అభ్యంతరమాయెను గనుక దానివలన వారు తమ ఆకలి తీర్చుకొనజాలకపోదురు, తమ ఉదరమును పోషించుకొనజాలకపోదురు.

w09 9/15 23 ¶10

దైవిక విద్యకున్న అతిశ్రేష్ఠమైన విలువ

10 భవిష్యత్తులో ఏమి జరుగుతుందో యెహోవాకు తెలుసు కాబట్టి ఆయన మాత్రమే మనల్ని భవిష్యత్తు కోసం సిద్ధం చేయగలడు. మానవుల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆయన నిర్ణయిస్తాడు. (యెష. 46:9, 10) “యెహోవా మహా దినము సమీపమాయెను” అని బైబిలు ప్రవచనం తెలియజేస్తుంది. (జెఫ. 1:14) ఆ దినం గురించి సామెతలు 11:4⁠లో చెప్పబడిన మాటలు నిజమౌతాయి. అక్కడ ఇలా ఉంది: “ఉగ్రతదినమందు ఆస్తి అక్కరకు రాదు. నీతి మరణము నుండి రక్షించును.” సాతాను లోకానికి యెహోవా తీర్పుతీర్చే సమయం వచ్చినప్పుడు యెహోవాతో మనకున్న సంబంధానికే ఎక్కువ విలువుంటుంది కానీ, డబ్బుకు కాదు. యెహెజ్కేలు 7:19 కూడా ఇలా చెబుతోంది: “తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని యెంచుదురు.” అలా జరుగుతుందని తెలుసుకోవడం వల్ల మనం ఇప్పుడు జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం.

(యెహెజ్కేలు 8:12) అప్పుడాయన నాకు సెలవిచ్చినదేమనగా—నరపుత్రుడా—యెహోవా మమ్మును కానక యుండును, యెహోవా దేశమును విసర్జించెను అని యనుకొని, ఇశ్రాయేలీయుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదానిని నీవు చూచుచున్నావు గదా.

w11 4/15 26 ¶14

దేవుని ఆత్మ నిర్దేశాన్ని అనుసరిస్తున్నారా?

14 మనకు విశ్వాసం ఉంటే యెహోవాను ఒక నిజమైన వ్యక్తిగా ఎంచుతాం. అలా ఎంచకపోతే మనం తప్పు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పూర్వం దేవుని సేవకుల విషయంలో ఏమి జరిగిందో పరిశీలించండి. ఇశ్రాయేలీయులు రహస్యంగా హేయమైన పనులు చేస్తున్నారని యెహోవా యెహెజ్కేలు ప్రవక్తకు చెప్పాడు. యెహోవా ఇలా అన్నాడు: “నరపుత్రుడా, యెహోవా మమ్మును కానక యుండును, యెహోవా దేశమును విసర్జించెను అని యనుకొని, ఇశ్రాయేలీయుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదానిని నీవు చూచుచున్నావు గదా.” (యెహె. 8:12) వారలా ఎందుకు ప్రవర్తించారు? ఎందుకంటే, తాము చేసేవాటిని యెహోవా చూస్తున్నాడని వారు నమ్మలేదు. యెహోవాను వారు నిజమైన వ్యక్తిగా ఎంచలేదు.

చదవాల్సిన బైబిలు భాగం

(యెహెజ్కేలు 8:1-12) ఆరవ సంవత్సరము ఆరవ నెల అయిదవ దినమున నేను నా యింట కూర్చునియుండగాను యూదా పెద్దలు నా యెదుట కూర్చుండియుండగాను ప్రభువైన యెహోవా హస్తము నామీదికి వచ్చెను. 2 అంతట నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను, నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజియైనట్టుగాను ఆయన నాకు కనబడెను. 3 మరియు చెయ్యివంటిది ఒకటి ఆయన చాపి నా తలవెండ్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమ్యాకాశముల మధ్యకు నన్నెత్తి, నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తరపువైపుననున్న ఆవరణ ద్వారముదగ్గర రోషము పుట్టించు విగ్రహస్థానములో నన్ను దించెను. 4 అంతట లోయలో నాకు కనబడిన దర్శనరూపముగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము అచ్చట కనబడెను. 5 —నరపుత్రుడా, ఉత్తరపువైపు తేరి చూడుమని యెహోవా నాకు సెలవియ్యగా, నేను ఉత్తరపువైపు తేరి చూచితిని; ఉత్తరపువైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను. 6 అంతట ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను—నరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూచుచున్నావు గదా; నా పరిశుద్ధస్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా? యీ తట్టు తిరిగినయెడల వీటికంటె మరి యధికమైన హేయక్రియలు చూచెదవు. 7 అప్పుడు ఆవరణద్వారముదగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను. 8 నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వుమని ఆయన నాకు సెలవియ్యగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారమొకటి కనబడెను. 9 —నీవు లోపలికి చొచ్చి యిక్కడ వారెట్టి హేయకృత్యములు చేయుచున్నారో చూడుమని ఆయన నాకు సెలవియ్యగా 10 నేను లోపలికి పోయి చూచితిని; అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములును హేయమైన మృగముల ఆకారములును, అనగా ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహములన్నియు గోడమీద చుట్టును వ్రాయబడియున్నట్టు కనబడెను. 11 మరియు ఒక్కొకడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని ఇశ్రాయేలీయుల పెద్దలు డెబ్బది మందియు, వారిమధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు, ఆ యాకారములకు ఎదురుగా నిలిచి యుండగా, చిక్కని మేఘమువలె ధూపవాసన ఎక్కుచుండెను. 12 అప్పుడాయన నాకు సెలవిచ్చినదేమనగా—నరపుత్రుడా—యెహోవా మమ్మును కానక యుండును, యెహోవా దేశమును విసర్జించెను అని యనుకొని, ఇశ్రాయేలీయుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదానిని నీవు చూచుచున్నావు గదా.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి