మీరు దేవుని చిత్తాన్ని చేస్తున్నారా?
ఇద్దరు యెహోవాసాక్షులు తమ ఇంటింటి పరిచర్యలో ఎపిస్కోపల్ చర్చి ప్రీస్టును కలిశారు. అతడు గడ్డంతో, దాదాపు 60 సంవత్సరాల వయస్సు కలిగి, తన చర్చి పేరుతో అలంకరింపబడిన టి-షర్టు ధరించి, మంచి వ్యక్తిలా కనిపించాడు. గుక్క త్రిప్పుకోకుండా ఆయనిలా అన్నాడు: “వాక్యాన్ని వ్యాప్తి చేయడంలో మా చర్చి సభ్యులు మీకున్నంత ఆసక్తి కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను, కాని మీరు మళ్లీ ఎప్పుడు నా ఇంటికి రావద్దని మిమ్మల్ని అడగవలసివస్తున్నది.”
అవును, అనేకమంది ప్రజలు యెహోవాసాక్షులను వారి పని గురించి మెచ్చుకొని, వారి పట్టుదల, ఉత్సాహాన్ని గురించి అభినందిస్తారు. అయినా, సాక్షులు ఏం చేస్తున్నారనేదాని గురించి వారికి ఆసక్తిలేదు, తాము ఆ పని చేయాలని కూడా వారు అనుకోరు. అయినా, పూర్తిగా పరస్పర విరుద్ధమైన ఈ పరిస్థితి క్రొత్తదేమి కాదు. యేసు తన కాలంలో దీన్ని గమనించాడు. దాన్ని ఆయన ఆలోచన రేకెత్తించే ఒక ఉపమానం ద్వారా నొక్కి చెప్పాడు.
“మీకేమి తోచును? ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులున్నారు. అతడు మొదటివాని యొద్దకు వచ్చి, ‘కుమారుడా, నేడు పోయి ద్రాక్షతోటలో పని చేయుము’ అని చెప్పగా అతడు, ‘అయ్యా, పోదును’ అనెను గాని పోలేదు. రెండవవానిని సమీపించి ఆ ప్రకారమే చెప్పగా అతడు ‘పోను’ అని జవాబిచ్చెను గాని ఆ తరువాత తన మనస్సులో నొచ్చుకొని పోయెను. ఈ యిద్దరిలో ఎవరు తండ్రి చిత్తం చేశారు?”—మత్తయి 21:28-31, NW.
జవాబు సుస్పష్టం. యేసు మాటలు వినిన జనసమూహంవలెనే మనం కూడా “రెండవవాడు” అని జవాబిస్తాము. కాని దాని కంటే ఎక్కువగా, ఆ ఉపమానం ద్వారా, తండ్రి ఏది చేయాలని కోరాడో అది చేయడం మాత్రమే లెక్కింపబడుతుందన్న విషయాన్ని యేసు మన దృష్టికి తెస్తున్నాడు. రెండవ కుమారుడు వెళ్లాలని లేదని చెప్పినప్పటికీ, వెళ్లిచేసి, దాని కొరకు మెచ్చుకొనబడ్డాడు. సరైన విధమైన పని చేయడం కూడా అంతే ప్రాముఖ్యమైనది. రెండవ కుమారుడు తన తండ్రి ద్రాక్షాతోటలో పనిచేయడం ద్వారా చర్య గైకొన్నాడు; అతడు వెళ్లి తన స్వంత ద్రాక్షాతోటలో పనిచేయలేదు.
మనకు దీనంతటి భావం ఏమిటి? దేవుడు ఆరాధికుల నుండి నేడు ఏమి కోరుతున్నాడు? తండ్రి చిత్తం చేయటానికి మనకు సహాయం చేసే దేన్ని మనం యేసు జీవితం నుండి నేర్చుకోవచ్చు? ఇవి ప్రాముఖ్యమైన ప్రశ్నలు, సరైన జవాబులు కనుగొనటం మన నిరంతర క్షేమమని భావము ఎందుకంటే, “దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.”—1 యోహాను 2:17; ఎఫెసీయులు 5:17.
“దేవుని చిత్తం” ఏమిటి?
“చిత్తం” అనే నామవాచకం కాంప్రెహెన్సివ్ కాంకార్డెన్స్ ఆఫ్ ది న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ది హోలీ స్క్రిప్చర్స్‌లో 80 కంటె ఎక్కువసార్లు ఉంది. వీటిలో 60 సార్లు (లేక 75 శాతం సార్లు) దేవుని చిత్తం గురించే ఉదహరించబడింది. “దేవుని చిత్తం,” “నా తండ్రి చిత్తం,” “దేవుని యొక్క చిత్తం” వంటి మాటలు 20 కంటె ఎక్కువసార్లు కనిపిస్తాయి. దీన్నిబట్టి దైవ చిత్తం మనకు అతి ప్రాముఖ్యమైనదై ఉండాలన్నది మనం తెలుసుకోవచ్చు. దేవుని చిత్తాన్ని చేయడం మన జీవితాల్లో అత్యంత ప్రధానమైనదై ఉండాలి.
ఆంగ్లంలో “చిత్తం” అనే నామవాచకానికి ‘కోరిక, ఇచ్ఛ, నిర్ణయము, కోరుకున్నది, ప్రాముఖ్యంగా ఒకరికున్న అధికారం లేక శక్తి యొక్క ఎంపిక లేక నిర్ణయము’ అని అర్థం. కాబట్టి సర్వోన్నత అధికారియైన యెహోవాకు, ఒక చిత్తం, కోరిక లేక నిర్ణయం ఉంది. అదేమిటి? దాన్ని గురించి కొంత మనకు లేఖనాలు చెబుతున్నాయి: “[దేవుడు] మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు.” (1 తిమోతి 2:4) ఇతరులకు ఈ అనుభవజ్ఞానాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు, తొలి క్రైస్తవులు పూర్ణాత్మతో పనిచేశారు.—మత్తయి 9:35; అపొస్తలుల కార్యములు 5:42; ఫిలిప్పీయులు 2:19, 22.
నేడు ఎవరు దేవుని చిత్తాన్ని చేస్తున్నారు? యేసుక్రీస్తు అనుచరులమని చెప్పుకుంటున్న దాదాపు 200 కోట్ల మందిలో ఎంతమంది, యేసు ఉపమానంలోని తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన చిన్న కుమారునిలా ఉన్నారు? జవాబు తెలుసుకోవటం కష్టమేమికాదు. వారు చేస్తారని యేసుక్రీస్తు చెప్పిన ఈ పనిని ఆయన నిజ అనుచరులు చేస్తుంటారు: “సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను.” (మార్కు 13:10) ప్రపంచవ్యాప్తంగా 45 లక్షలకంటె ఎక్కువమందివున్న యెహోవాసాక్షులు, ఇతరులకు దేవుని రాజ్య సువార్తను చురుకుగా ప్రకటిస్తూ, శాంతి భద్రతల కొరకు మానవజాతి యొక్క ఏకైక నిరీక్షణ ఆ రాజ్యమేనని బోధిస్తున్నారు. దేవుని చిత్తాన్ని చేయడంలో మీరు పూర్తిగా భాగం వహిస్తున్నారా? యేసు చేసినట్లు మీరు రాజ్య సువార్తను ప్రకటిస్తున్నారా?—అపొస్తలుల కార్యములు 10:42; హెబ్రీయులు 10:7.
దేవుని చిత్తాన్ని చేయడంలో ఆనందాన్ని కనుగొనుట
దేవుని చిత్తమేమిటో తెలుసుకోవటంలో ఆనందమున్నట్లే, దేవుని చిత్తాన్ని ఇతరులకు బోధించడంలో గొప్ప ఆనందముంది. తన తండ్రి గురించి ప్రజలకు బోధించడంలో యేసు ఆనందాన్ని పొందాడు. అది ఆయనకు ఆహారం వంటిది. (యోహాను 4:34) యేసు చేసినట్లే మనం చేయటం ద్వారా, అంటే ఆయన తన తండ్రి నుండి పొంది మనకు నేర్పినవాటిని ప్రకటించి, బోధించడం ద్వారా మనం కూడా నిజమైన సంతోషాన్ని పొందవచ్చు. (మత్తయి 28:19, 20) యేసు వాగ్దానం చేసినట్లు, “ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగుదురు.”—యోహాను 13:17.
ఉదహరించుటకు: ఇటీవల పూర్తికాల పయినీరు సేవలో మరలా ప్రవేశించిన ఒక తల్లి ఇలా చెప్పింది: “ఒక బైబిలు విద్యార్థి హృదయాన్ని అనేక బైబిలు సత్యాలు తాకినప్పుడు వారి ముఖం వికసించడం చూడటానికి ఎంతో ఉత్తేజకరంగా ఉంటుంది! ఒక విద్యార్థి పఠనానికి ముందు లేఖనాలన్ని వ్రాసిపెట్టుకుని, తరువాత పునఃసమీక్షప్పుడు ప్రశ్నలకు జవాబివ్వటానికని పఠన సమయంలో నోట్సు వ్రాసుకోవటం చూడటం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.” ఆమె బైబిలు విద్యార్థుల్లో మరొకామె తన తొలి యౌవన దశలో సత్యం గురించి కొంత పరిచయం కలిగివుంది. ఇప్పుడు, వివాహమై కొన్ని వ్యక్తిగత సమస్యలుంటే, సాక్షుల కొరకు ఆమె వెదుకుతున్నది. ఈ పయినీరు సహోదరి ఆమెను కనుగొన్నప్పుడు ఆమె ఎంత సంతోషించింది! తన బైబిలు పఠనాన్ని పునఃప్రారంభించటానికి ఆ యౌవన స్త్రీ ఉప్పొంగిపోయింది.
దేవుని చిత్తాన్ని చేయడంలోని ఆనందాన్ని కాపాడుకొనుట
ప్రాచీన ఇశ్రాయేలులోని రాజైన దావీదు తన జీవితమంతటిలో దేవుని చిత్తాన్ని చేయటానికి ప్రయత్నించాడు. ఆయనకు వ్యతిరేకంగా అనేక కష్టాలు, వత్తిడులు వచ్చినప్పటికీ, ఆయనిలా చెప్పేందుకు ప్రేరేపించబడ్డాడు: “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.” (కీర్తన 40:8) యెహోవా చిత్తం నెరవేర్చాలన్నది దావీదు ఆత్మలోనే, ఆయనలోనే ఉంది. యెహోవాను సేవించడంలో ఆయనకున్న నిత్యనూతనానంద రహస్యం అదే. దేవుని చిత్తం చేయడం దావీదుకు కష్టమనిపించలేదు. బదులుగా అది, ఆయన హృదయం నుండి వచ్చిన ఒక ఉత్సాహం. ఆయన కొన్నిసార్లు పాపం చేసి పడిపోయినప్పటికీ, తన దేవుడైన యెహోవాను సేవించటానికి తాను చేయగలిగిన శ్రేష్ఠమైనది చేయటానికి ఆయన తన జీవితమంతా పోరాడాడు.
కొన్ని సందర్భాల్లో, మన ఆనందం క్షీణించిపోవచ్చు. మనం అలసిపోవచ్చు లేక కృంగిపోవచ్చు. మన గతం మనల్ని వెంటాడుతుండవచ్చు, గతంలో ఎప్పుడో మనం చేసిన తప్పుపని వల్ల మన మనస్సాక్షి మనల్ని బాధిస్తుండవచ్చు. దేవుని వాక్యాన్ని సమగ్రంగా పఠించడం ద్వారా తరచూ మనం ఈ భావాలను జయించవచ్చు. దావీదు చేసినట్లు, దేవుని ధర్మశాస్త్రాన్ని మన “ఆంతర్యముపై” వ్రాసుకోవాలనే గురి పెట్టుకోవచ్చు. మనం దేవుని చిత్తాన్ని పూర్ణాత్మతో అంటే, మనకు సాధ్యమైనంత శ్రేష్ఠంగా చేయటానికి ప్రయత్నిస్తే, ఆయన నమ్మకస్థుడు గనుక ఆయన మనకు తగిన విధంగా ప్రతిఫలమిస్తాడు.—ఎఫెసీయులు 6:6; హెబ్రీయులు 6:10-12; 1 పేతురు 4:19.
ఆసక్తికరంగా, అపొస్తలుడైన పౌలు హెబ్రీయులు 10:5-7 నందు కీర్తన 40:6-8 నందలి దావీదు మాటలను ఉదహరించి, వాటిని యేసుక్రీస్తుకు అన్వయించాడు. అలా చేస్తూ పౌలు, యేసు తన తండ్రికెంత సన్నిహితంగా ఉండేవాడో సూచించాడు. “చిత్తం” అనే హెబ్రీ పదానికి ‘ఆనందం, కోరిక, అనుగ్రహం, లేక సంతోషం’ అనే అర్థాలున్నాయి. కాబట్టి, క్రీస్తు గురించి కీర్తన 40:8లో ఇలా చదువవచ్చు: “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము.”a అలాగే యేసు, తన తండ్రిని ఏది ప్రీతి పరుస్తుందో అదే చేయటానికి ఇష్టపడ్డాడు. తనకు ఏమి చేయమని చెప్పబడిందో యేసు దానికంటే ఎక్కువే చేశాడు. తన తండ్రి హృదయానికి ఏది సన్నిహితమైందో ఆయన అదే చేశాడు, దాన్ని చేయడానికి ఆయన ఆనందించాడు.
దేవుని చిత్తం ఏమైయుంది, దేవుని ఆశీర్వాదం పొందటానికి వారేమి చేయాలి అని ఇతరులకు బోధించుటయందే యేసు జీవితమంతా పరిభ్రమించింది. ఆయన పూర్తికాల ప్రచారకుడు, బోధకుడు, ఆ పని చేయడంలో ఆయన గొప్ప ఆనందాన్ని పొందాడు. కాబట్టి, మనం యెహోవాపని ఎంత ఎక్కువగా చేస్తే, అంత ఎక్కువ ఆనందాన్ని పొందుతామన్నది కారణసహితము. మీ ఆనందం కూడా పొంగిపొర్లేలా, మీరు కూడా ప్రకటించే పనిలో పూర్తికాలం సేవ చేయగలరా?
దేవుని చిత్తాన్ని చేయడంలోని ఆనందాన్ని కాపాడుకొనటంలో మరో సహాయకం ఏమిటంటే, భవిష్యత్తును సరిగ్గా దృష్టిలో ఉంచుకోవడం. యేసు అదే చేశాడు. “ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించాడు.” చివరి వరకు దేవునికి తన విశ్వాసాన్ని నిరూపించుకొని, తరువాత తన తండ్రి కుడిపార్శ్వాన రాజరిక ప్రతిఫలాన్ని పొందడంలోనే ఆయనకు ఆనందముంది.—హెబ్రీయులు 12:2.
దేవుని చిత్తాన్ని చేయడంలో కొనసాగే వారికి రాబోయే భవిష్యత్ ఆనందాన్ని గురించి ఊహించండి. దేవుని చిత్తాన్ని చేయటానికి పాటుపడేవారికి బాధ కలిగిస్తూ కూడా తమ స్వంత స్వార్థపూరిత చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి పట్టుబట్టేవారి నాశనాన్ని వారు చూస్తారు. (2 థెస్సలొనీకయులు 1:7, 8) పునరుత్థానం చేయబడిన మన ప్రియమైన వారు దేవుని చిత్తాన్ని తెలుసుకుని, దాన్ని చేసే అవకాశాన్ని పొందడంలోని ఆనందాన్ని గురించి ఆలోచించండి. లేదా, భూమిని పరదైసుగా మార్చాలనే దేవుని చిత్తాన్ని గురించి పరిశీలించండి. చివరికి, యెహోవా చిత్తానికి వ్యతిరేకియైన సాతాను పూర్తిగా నాశనం చేయబడటంతో లభించే స్వాతంత్ర్యాన్ని గురించి ఊహించండి.
అవును, ఈనాడు దేవుని చిత్తాన్ని చేయడం, ఇప్పుడు ఎంతో ఆనందాన్ని, భవిష్యత్తులో అనంతమైన సంతోషాన్ని కలుగజేస్తుంది. ప్రకటనా పనిలో మనం ఎలాంటి ప్రతిస్పందనను ఎదుర్కొన్నప్పటికీ, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో ఆనందం పొందే విషయంలో మనం యేసు మాదిరిని అనుకరిద్దాము.
[అధస్సూచీలు]
a కీర్తన 40:8 కొరకు ఇవ్వబడిన అధఃస్సూచిని చూడండి.