-
చనిపోయిన వారికిగల నిశ్చయమైన నిరీక్షణమీ ప్రియమైన వారెవరైనా చనిపోతే
-
-
లాజరు మరణానికి యేసు స్పందించిన విధం దేవుని కుమారుని సున్నితమైన భావాలను బయలుపరుస్తోంది. ఆ సందర్భంలో ఆయనలో కలిగిన లోతైన భావాలు మరణించిన వారిని పునరుత్థానం చేయాలని ఆయనకున్న ప్రగాఢమైన కోరికను స్పష్టంగా సూచిస్తున్నాయి. మనమిలా చదువుతాం: “మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూచి, ఆయన పాదములమీద పడి—ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండు ననెను. ఆమె ఏడ్చుటయు, ఆమెతోకూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు—అతని నెక్కడ నుంచితిరని అడుగగా, వారు—ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు—అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి.”—యోహాను 11:32-36.
యేసు చూపించిన హృదయపూర్వక కనికరం, “మూలుగుచు,” “కలవరపడి,” “కన్నీళ్లు విడిచెను” అనే మూడు శబ్దాలతో ఇక్కడ సూచించబడింది. హృదయాన్ని స్పృశించే ఆ దృశ్యాన్ని వ్రాయడానికి మూలభాషలో ఉపయోగించబడిన పదాలు, యేసు తన ప్రియ స్నేహితుడైన లాజరు మరణాన్ని, లాజరు సహోదరి ఏడవడాన్ని చూసినప్పుడు ఎంతో చలించిపోయి కన్నీటితో ఆయన కళ్ళు నిండిపోయాయని సూచిస్తున్నాయి.a
గమనించదగిన విషయమేమిటంటే యేసు అంతకు ముందు మరో ఇద్దరిని బ్రతికించాడు. లాజరును కూడా సరిగ్గా అలాగే బ్రతికించాలని ఆయన ఉద్దేశించాడు. (యోహాను 11:11, 23, 25) అయినా, ఆయన ‘కన్నీళ్లు విడిచాడు.’ కాబట్టి మానవులను పునరుత్థానం చేయడమనేది యేసుకు కేవలం ఒక పనిలాంటిది కాదు. ఎందుకంటే ఆ సందర్భంలో ఆయన కనబరచిన కనికరమూ లోతైన భావాలూ మరణం వల్ల కలిగే దుష్పరిణామాలను తొలగించాలన్న ఆయన ప్రగాఢమైన కోరికను స్పష్టంగా సూచిస్తున్నాయి.
లాజరును పునరుత్థానం చేసేటప్పుడు యేసు కనబరచిన సున్నితమైన భావాలు మరణం వల్ల కలిగే దుష్పరిణామాలను తొలగించాలనే ఆయన ప్రగాఢ కోరికను ప్రతిబింబించాయి
-
-
చనిపోయిన వారికిగల నిశ్చయమైన నిరీక్షణమీ ప్రియమైన వారెవరైనా చనిపోతే
-
-
a “మూలుగుచు” అని అనువదించబడిన గ్రీకు పదం, బాధతో ఉండడాన్ని లేదా తీవ్రంగా చలించిపోవడాన్ని సూచించే క్రియాపదం (ఎమ్బ్రిమేయొమాయ్) నుండి వచ్చింది. ఒక బైబిలు విద్వాంసుడు ఇలా వ్రాస్తున్నాడు: “ఇక్కడ దీని భావమేమిటంటే యేసులో అలాంటి లోతైన భావోద్రేకం కలిగింది గనుకనే ఆయన హృదయంలో నుండి అప్రయత్నంగా ఒక మూలుగు ఉబికి వచ్చింది.” “కలవరపడి” అని అనువదించబడిన పదం, ఆందోళనను సూచించే గ్రీకు పదం (టెరాస్సో) నుండి వచ్చింది. ఒక నిఘంటుకారుని ప్రకారం, దాని భావం “ఒకరి అంతరంగంలో కలవరం సృష్టించడం, . . . గొప్ప దుఃఖముతో లేదా బాధతో ప్రభావితం చేయడం.” “కన్నీళ్లు విడిచెను,” అని అనువదించబడిన మాట గ్రీకు క్రియాపదం (డెక్రాయో) నుండి వచ్చింది, దానికి “కన్నీరు కార్చడం, నిశ్శబ్దంగా ఏడవడం” అని అర్థం.
-