కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwbr18 నవంబరు పేజీలు 1-8
  • క్రైస్తవ జీవితం పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రైస్తవ జీవితం పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు
  • క్రైస్తవ జీవితం పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు—2018
  • ఉపశీర్షికలు
  • నవంబరు 5-11
  • నవంబరు 12-18
  • నవంబరు 19-25
  • నవంబరు 26–డిసెంబరు 2
క్రైస్తవ జీవితం పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు—2018
mwbr18 నవంబరు పేజీలు 1-8

క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు

నవంబరు 5-11

దేవుని వాక్యంలో ఉన్న సంపద|యోహాను 20-21

“నువ్వు వీటికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?”

1(యోహాను 21:1-3) ఆ తర్వాత యేసు, తిబెరియ సముద్రం దగ్గర శిష్యులకు మళ్లీ కనిపించాడు. ఆయన ఈ విధంగా కనిపించాడు: 2 సీమోను పేతురు, తోమా (ఇతనికి దిదుమ అనే పేరు కూడా ఉంది), గలిలయలోని కానాకు చెందిన నతనయేలు, జెబెదయి కొడుకులు, యేసు శిష్యుల్లో ఇంకో ఇద్దరు అంతా ఒక చోట ఉన్నారు. 3 అప్పుడు సీమోను పేతురు వాళ్లతో, “నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను” అన్నాడు. వాళ్లు, “మేము కూడా నీతో వస్తాం” అన్నారు. దాంతో వాళ్లు పడవలో బయల్దేరారు. కానీ ఆ రాత్రి వాళ్లకు అసలు చేపలే దొరకలేదు.

(యోహాను 21:4-14) తెల్లవారుతున్నప్పుడు యేసు సముద్రం ఒడ్డున నిలబడ్డాడు. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. 5 అప్పుడు యేసు వాళ్లతో, “పిల్లలారా, తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా?” అని అడిగాడు. వాళ్లు, “లేదు” అన్నారు. 6 అప్పుడు ఆయన, “పడవ కుడిపక్క వల వేయండి, మీకు కొన్ని చేపలు దొరుకుతాయి” అని వాళ్లకు చెప్పాడు. దాంతో వాళ్లు వల వేశారు, అయితే చాలా చేపలు పడడంతో వాళ్లు వలను లాగలేకపోయారు. 7 అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, “ఆయన ప్రభువే!” అని చెప్పాడు. ఆయన ప్రభువని విన్నప్పుడు, సీమోను పేతురు తన పైవస్త్రం వేసుకుని సముద్రంలోకి దూకాడు. 8 కానీ మిగతా శిష్యులు చేపలతో నిండిన వలను లాక్కుంటూ పడవలో వచ్చారు, ఎందుకంటే వాళ్లు ఒడ్డుకు దాదాపు 90 మీటర్ల దూరంలోనే ఉన్నారు. 9 వాళ్లు ఒడ్డుకు చేరుకున్నప్పుడు, కాలుతున్న బొగ్గుల మీద ఉన్న చేపల్ని, రొట్టెను చూశారు. 10 యేసు వాళ్లతో, “మీరు పట్టిన చేపల్లో కొన్ని తీసుకురండి” అన్నాడు. 11 కాబట్టి సీమోను పేతురు పడవ ఎక్కి, పెద్ద చేపలతో నిండిపోయిన ఆ వలను ఒడ్డుకు లాగాడు. అందులో 153 చేపలు ఉన్నాయి. అన్ని చేపలున్నా ఆ వల పిగిలిపోలేదు. 12 యేసు, “వచ్చి భోంచేయండి” అని వాళ్లతో అన్నాడు. అయితే శిష్యుల్లో ఎవరూ ఆయన్ని, “నువ్వు ఎవరు?” అని అడిగే ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఆయన ప్రభువని వాళ్లకు తెలుసు. 13 యేసు రొట్టెను తీసుకుని వాళ్లకు ఇచ్చాడు, అలాగే చేపల్ని కూడా ఇచ్చాడు. 14 యేసు చనిపోయినవాళ్లలో నుండి లేపబడిన తర్వాత శిష్యులకు కనబడడం ఇది మూడోసారి.

(యోహాను 21:15-19) వాళ్లు భోజనం చేశాక యేసు సీమోను పేతురును, “యోహాను కొడుకువైన సీమోనూ, నువ్వు వీటికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. అందుకు పేతురు, “అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు” అని ఆయనతో అన్నాడు. అప్పుడు యేసు పేతురుతో, “నా గొర్రెపిల్లల్ని మేపు” అని చెప్పాడు. 16 యేసు మళ్లీ రెండోసారి, “యోహాను కొడుకువైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. అందుకు పేతురు, “అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు” అన్నాడు. అప్పుడు యేసు పేతురుతో, “నా చిన్న గొర్రెల్ని కాయి” అన్నాడు. 17 యేసు మూడోసారి పేతురును, “యోహాను కొడుకువైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. యేసు మూడోసారి, “నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగేసరికి పేతురు చాలా బాధపడి, “ప్రభువా, నీకు అన్నీ తెలుసు; నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. అప్పుడు యేసు పేతురుతో ఇలా అన్నాడు: “నా చిన్న గొర్రెల్ని మేపు. 18 నేను నిజంగా నీతో చెప్తున్నాను, నువ్వు యువకుడిగా ఉన్నప్పుడు నీ అంతట నువ్వే బట్టలు వేసుకుని నీకు నచ్చిన చోటికి వెళ్లేవాడివి. కానీ నువ్వు ముసలివాడివి అయినప్పుడు నువ్వు చేతులు చాపుతావు, ఇంకెవరో నీకు బట్టలు వేసి నీకు నచ్చని చోటికి నిన్ను తీసుకెళ్తారు.” 19 పేతురు ఎలాంటి మరణం ద్వారా దేవునికి మహిమ తెస్తాడో సూచించడానికి యేసు ఆ మాట అన్నాడు. ఆ మాట అన్నాక యేసు పేతురుతో, “నన్ను అనుసరిస్తూ ఉండు” అని చెప్పాడు.

యోహా 21:15, 17, nwtsty స్టడీ నోట్స్‌

యేసు సీమోను పేతురును . . . అడిగాడు: యేసు ఎవరో తనకు తెలీదని పేతురు మూడుసార్లు నిరాకరించిన కొంతకాలానికి యేసుకు, పేతురుకు మధ్య ఈ సంభాషణ జరిగింది. పేతురుకు తనపట్ల ఉన్న భావాలను వెలికితీసే మూడు ప్రశ్నలు యేసు పేతురును అడిగాడు. అవి ‘పేతురును చాలా బాధపెట్టాయి’ కూడా. (యోహా 21:17) యోహా 21:15-17⁠లో యోహాను రాసిన వృత్తాంతంలో రెండు వేర్వేరు గ్రీకు పదాలను ఉపయోగించడం జరిగింది. అవేంటంటే ప్రేమ అని అనువదించిన అగాపవొ, ఆప్యాయత కలిగి ఉండడం అని అనువదించిన ఫిలియో. యేసు పేతురును రెండుసార్లు ఇలా అడిగాడు: “నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” రెండుసార్లూ పేతురు వినయంగా తాను యేసును “ప్రేమిస్తున్నానని” అంగీకరించాడు. చివరిగా యేసు ఇలా అడిగాడు: “నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” మళ్లీ పేతురు తాను ప్రేమిస్తున్నానని ఒప్పుకున్నాడు. అలా పేతురు తాను ప్రేమిస్తున్నానని ఒప్పుకున్న ప్రతీసారి, యేసు శిష్యుల్ని ఆధ్యాత్మికంగా పోషించి, వాళ్లకు “కాపరిగా” ఉండేలా ఆ ప్రేమ ఆప్యాయతలు పేతురును పురికొల్పాలని యేసు నొక్కిచెప్పాడు. ఈ వచనాల్లో యేసు తన శిష్యుల్ని గొర్రెపిల్లలు, లేదా ‘చిన్న గొర్రెలు’ అని పిలిచాడు. (యోహా 21:16, 17; 1 పేతు 5:1-3) పేతురు తన ప్రేమను మూడుసార్లు ఒప్పుకునే అవకాశాన్ని ఇచ్చిన తర్వాత యేసు తన గొర్రెల్ని కాయమనే బాధ్యతను పేతురుకు అప్పగించాడు. ఆ విధంగా పేతురు యేసును మూడుసార్లు నిరాకరించి చేసిన తప్పును యేసు క్షమించాడనే విషయంలో పేతురుకున్న సందేహాలన్నిటినీ తీసేశాడు.

నువ్వు వీటికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?: వ్యాకరణపరంగా చూస్తే ‘వీటికన్నా ఎక్కువగా’ అనే పదబంధాన్ని చాలా రకాలుగా అర్థం చేసుకోవచ్చు. కొంతమంది విద్వాంసులు “ఇతర శిష్యుల్ని ప్రేమించినంతకంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని లేదా “ఈ శిష్యులు నన్ను ప్రేమించిన దానికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అనే అర్థంలో చూస్తారు. కానీ “నువ్వు వీటికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అన్నప్పుడు, వాస్తవానికి యేసు వాళ్లు పట్టుకున్న చేపలు లేదా చేపల వ్యాపారానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతున్నాడని అర్థమౌతుంది. కాబట్టి ఈ వచనం మొత్తానికి ఉన్న ఉద్దేశం: ‘నువ్వు వస్తుసంపదలు లేదా వృత్తి కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అలాగైతే నా గొర్రెల్ని మేపు’ అయ్యుంటుంది. పేతురు గతాన్ని బట్టి చూస్తే ఈ ప్రశ్న సరైనదే. పేతురు యేసు మొదటి శిష్యుల్లో ఒకడైనప్పటికీ (యోహా 1:35-42), అతను అన్నీ వదిలేసి వెంటనే యేసును పూర్తికాలం అనుసరించలేదు. బదులుగా ఆయన చేపలు పట్టడానికి తిరిగి వెళ్లిపోయాడు. కొన్ని నెలల తర్వాత, పేతురు తనకున్న ముఖ్యమైన వ్యాపారాన్ని వదిలేసి మనుషులను పట్టే జాలరిగా అవ్వమని యేసు పేతురును పిలిచాడు. (మత్త 4:18-20; లూకా 5:1-11) మళ్లీ, యేసు చనిపోయిన కొంత సమయానికి, పేతురు తాను చేపలు పట్టడానికి వెళ్తున్నానని చెప్పాడు. ఇతర అపొస్తలులు కూడా ఆయనతో కలిశారు. (యోహా 21:2, 3) కాబట్టి బహుశా యేసు ఇక్కడ, పేతురు ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుండవచ్చు: అతని ముందు కుప్పగా ఉన్న చేపలు సూచిస్తున్నట్లు చేపల వ్యాపారానికి తన జీవితంలో మొదటి స్థానం ఇస్తాడా, లేక యేసు గొర్రెల్ని లేదా అనుచరుల్ని ఆధ్యాత్మికంగా పోషించే పనికి ప్రాముఖ్యతనిస్తాడా?—యోహా 21:4-8.

మూడోసారి: పేతురు తన ప్రభువును మూడుసార్లు నిరాకరించాడు; అయితే యేసు ఇప్పుడు పేతురుకున్న భావాలను మూడుసార్లు తెలియజేసే అవకాశాన్ని ఇచ్చాడు. పేతురు అలా చేయగానే, పవిత్ర సేవకు అన్నిటికంటే ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వడం ద్వారా తనకున్న ప్రేమను, ఆప్యాయతను చూపించమని యేసు అతనికి చెప్పాడు. ఇతర బాధ్యతగల సహోదరులతో కలిసి పేతురు క్రీస్తు నమ్మకమైన అనుచరుల మందను పోషించి, బలపర్చి, వాళ్లకు కాపరిగా ఉండాలి. ఈ గొర్రెలు అభిషిక్తులే అయినప్పటికీ వాళ్లను ఆధ్యాత్మికంగా పోషించాల్సిన అవసరం ఉంది.—లూకా 22:32.

దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం

(యోహాను 20:17) యేసు ఆమెతో ఇలా అన్నాడు: “నేనింకా తండ్రి దగ్గరికి వెళ్లలేదు కాబట్టి నన్ను అలాగే పట్టుకుని ఉండవద్దు. అయితే, నా సోదరుల దగ్గరికి వెళ్లి, ‘నా తండ్రీ మీ తండ్రీ, నా దేవుడూ మీ దేవుడూ అయిన ఆయన దగ్గరికి నేను వెళ్తున్నాను’ అని చెప్పు.”

యోహా 20:17, nwtsty స్టడీ నోట్‌

నన్ను అలాగే పట్టుకుని ఉండవద్దు: హప్‌టోమయ్‌ అనే గ్రీకు క్రియాపదానికి “ముట్టుకోవడం” లేదా “అంటిపెట్టుకొని ఉండడం, పట్టుకుని వేలాడడం” అనే అర్థాలు ఉండవచ్చు. కొన్ని అనువాదాలు యేసు మాటల్ని “నన్ను ముట్టుకోవద్దు” అని రాశాయి. కానీ ఇక్కడ యేసు, మగ్దలేనే మరియ తనను ముట్టుకోవడం గురించి అభ్యంతరం చెప్పట్లేదు ఎందుకంటే ఆయన పునరుత్థానం అయిన తర్వాత ఇతర స్త్రీలు ఆయన దగ్గరకు వచ్చి ‘ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు’ ఆయన వాళ్లకు అభ్యంతరం చెప్పలేదు. (మత్త 28:9) బహుశా యేసు పరలోకానికి వెళ్లిపోబోతున్నాడని మరియ అక్కడ భయపడుతున్నట్లు అనిపిస్తుంది. తన ప్రభువుతోనే ఉండాలనే బలమైన కోరిక వల్ల ఆమె యేసును వెళ్లనివ్వకుండా ఆయన్ని అలాగే గట్టిగా పట్టుకొని ఉంది. కాబట్టి, తాను అప్పుడే వెళ్లిపోవట్లేదని ఆమెకు భరోసాని ఇవ్వడానికి, యేసు తనను అలాగే పట్టుకొని ఉండొద్దని, బదులుగా తన శిష్యుల దగ్గరకు వెళ్లి తాను పునరుత్థానం అయిన సంగతి చెప్పమని నిర్దేశించాడు.

(యోహాను 20:28) అప్పుడు తోమా ఆయనతో, “నా ప్రభువా, నా దేవా!” అన్నాడు.

యోహా 20:28, nwtsty స్టడీ నోట్‌

నా ప్రభువా, నా దేవా!: అక్ష., “నాకు ప్రభువు మరియు నాకు దేవుడు [హొ థియోస్‌]!” కొంతమంది విద్వాంసులు ఈ మాటల్ని, నిజానికి యేసు తండ్రి అయిన దేవున్ని ఉద్దేశించి చెప్పబడినట్లుగా అనుకుంటారు. కానీ అవి ఎంతో ఆశ్చర్యంగా యేసుతో అన్నట్లుగా వాళ్లు భావిస్తారు. ఇతరులైతే, అసలు గ్రీకు భాష ప్రకారం ఈ మాటలు యేసును ఉద్దేశించి మాట్లాడినవేనని వాదిస్తారు. ఒకవేళ అదే నిజమైనా కూడా, “నా ప్రభువా, నా దేవా!” అనే మాటల్లోని అసలు భావాన్ని ఆ సందర్భం గురించి మిగతా లేఖనాలు ఏమి చెప్తున్నాయో పరిశీలిస్తే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. యేసు అంతకు ముందే తన శిష్యులకు “నా తండ్రీ మీ తండ్రీ, నా దేవుడూ మీ దేవుడూ అయిన ఆయన దగ్గరికి నేను వెళ్తున్నాను” అని చెప్పినట్లు ఉంది. కాబట్టి తోమా యేసే సర్వశక్తిగల దేవుడు అని భావించాడు అనడానికి ఎలాంటి ఆధారమూ లేదు. (యోహా 20:17, స్టడీ నోట్‌ చూడండి.) యేసు తన ‘తండ్రిని’ ‘ఒకేఒక్క సత్య దేవుడు’ అని సంబోధిస్తూ ప్రార్థించడం తోమా విన్నాడు. (యోహా 17:1-3) కాబట్టి తోమా ఈ కింద ఇవ్వబడిన కారణాలనుబట్టి యేసును “నా దేవా” అని సంబోధించి ఉంటాడు: యేసు సర్వశక్తిగల దేవుడు కాకపోయినా ఆయన ‘ఒక దేవుడిగా’ ఉన్నట్లు తోమా చూసి ఉంటాడు. (యోహా 1:1, స్టడీ నోట్‌ చూడండి.) లేదా హీబ్రూ లేఖనాల్లో నమోదు చేయబడినట్లు, దేవుని సేవకులు యెహోవా సందేశాన్ని తెలియజేసే దేవదూతలను సంబోధించిన విధానంలోనే తోమా కూడా యేసును సంబోధించి ఉండవచ్చు. బైబిల్లో కొంతమంది వ్యక్తులు లేదా కొన్నిసార్లు ఆ వృత్తాంతాన్ని రాసిన బైబిలు రచయిత, తమకు సందేశాన్ని చెప్పే దేవదూతకు సమాధానం ఇస్తున్నప్పుడు లేదా మాట్లాడుతున్నప్పుడు, యెహోవా దేవునితోనే మాట్లాడుతున్నట్లుగా స్పందించారు. అలాంటి వృత్తాంతాల గురించి తోమాకు బాగా తెలిసి ఉండవచ్చు. (ఆది 16:7-11, 13; 18:1-5, 22-33; 32:24-30; న్యాయా 6:11-15; 13:20-22 పోల్చండి.) కాబట్టి తోమా యేసును దేవుని ప్రతినిధిగా ఆయన తరఫున మాట్లాడే వ్యక్తిగా గుర్తిస్తూ, ఆ భావంలోనే యేసును “నా దేవా” అని పిలిచి ఉండవచ్చు.

“ప్రభువు,” “దేవుడు” అనే పదాలకు ముందు గ్రీకు భాషలోని నిర్దిష్ట ఉపపదాన్ని ఉపయోగించారు కాబట్టి, ఈ పదాలు సర్వశక్తిగల దేవుణ్ణి సూచిస్తున్నాయని కొంతమంది వాదిస్తారు. కానీ, ఈ సందర్భంలో మాత్రం ఆ నిర్దిష్ట ఉపపదాన్ని గ్రీకులో వ్యాకరణం కోసం వాడి ఉంటారు. పేరును తెలిపే నామవాచకాన్ని నిర్దిష్ట ఉప పదంతో కలిపి సంబోధనా విభక్తిగా వాడిన సందర్భాలు గ్రీకులో ఉన్నాయి. ఆ విషయాన్ని లూకా 12:32 (అక్ష., “చిన్న మందా”), కొలొ 3:18–4:1 (అక్ష., “భార్యలారా”; “భర్తలారా”; “పిల్లలూ”; “తండ్రులారా”; “దాసులారా”; “యజమానులారా”) లాంటి వచనాలను అక్షరార్థంగా అనువదించడం ద్వారా అర్థం చేసుకోవచ్చు. అలాగే, 1 పేతు 3:7ని అక్షరార్థంగా అనువదిస్తే “భర్తలారా” అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉపయోగించిన ఉపపదాన్ని బట్టి, తోమా ఈ మాటలు అన్నప్పుడు అతని మనసులో ఏముందో తెలుసుకోవడం కష్టం.

చదవాల్సిన బైబిలు భాగం

(యోహాను 20:1-18) వారం మొదటి రోజున ఇంకా తెల్లవారకముందే మగ్దలేనే మరియ సమాధి దగ్గరికి వచ్చింది. అయితే అప్పటికే సమాధికి అడ్డంగా ఉన్న రాయి దొర్లించబడి ఉండడం ఆమె చూసింది. 2 దాంతో ఆమె పరుగెత్తుకుంటూ సీమోను పేతురు దగ్గరికి, యేసు ప్రేమించిన ఇంకో శిష్యుని దగ్గరికి వచ్చి, “వాళ్లు ప్రభువును సమాధిలో నుండి తీసుకెళ్లిపోయారు, ఆయన్ని ఎక్కడ ఉంచారో మాకు తెలీదు” అని చెప్పింది. 3 అప్పుడు పేతురు, ఆ ఇంకో శిష్యుడు సమాధి దగ్గరికి బయల్దేరారు. 4 వాళ్లిద్దరూ కలిసి పరుగెత్తడం మొదలుపెట్టారు. అయితే పేతురుకన్నా ఆ ఇంకో శిష్యుడు వేగంగా పరుగెత్తి, సమాధి దగ్గరికి ముందుగా చేరుకున్నాడు. 5 అతను లోపలికి వంగి చూసినప్పుడు, అక్కడ నారబట్టలు పడివున్నాయి. అయితే అతను లోపలికి వెళ్లలేదు. 6 అతని వెనక సీమోను పేతురు కూడా వచ్చాడు. అతను సమాధిలోకి వెళ్లి, అక్కడ నారబట్టలు పడివుండడం చూశాడు. 7 యేసు తలకు చుట్టబడిన నారబట్ట మిగతా నారబట్టల దగ్గర లేదు. అది చుట్టబడి వేరే చోట ఉంది. 8 అప్పుడు సమాధి దగ్గరికి ముందుగా చేరుకున్న శిష్యుడు కూడా లోపలికి వెళ్లి, చూసి, నమ్మాడు. 9  ఆయన చనిపోయినవాళ్లలో నుండి లేస్తాడనే లేఖనాన్ని వాళ్లు అప్పటికి ఇంకా అర్థంచేసుకోలేదు. 10 కాబట్టి శిష్యులు తమ ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు.

11 అయితే మరియ ఏడుస్తూ సమాధి బయటే నిలబడి ఉంది. ఆమె సమాధిలోకి వంగి చూసినప్పుడు, 12 యేసు శరీరం ఉంచబడిన చోట తెల్లని వస్త్రాలు వేసుకున్న ఇద్దరు దేవదూతలు ఆమెకు కనిపించారు. తలవైపు ఒక దూత, కాళ్లవైపు ఇంకో దూత కూర్చొని ఉన్నారు. 13 వాళ్లు ఆమెను, “నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగారు. అప్పుడామె, “ఎవరో నా ప్రభువును తీసుకెళ్లిపోయారు, ఆయన్ని ఎక్కడ ఉంచారో నాకు తెలీదు” అంది. 14 ఆ మాట అని ఆమె వెనక్కి తిరిగి చూసింది. అక్కడ యేసు నిలబడివున్నాడు, కానీ ఆయన యేసని ఆమె గుర్తుపట్టలేదు. 15 యేసు ఆమెను, “నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరి కోసం వెదుకుతున్నావు?” అని అడిగాడు. ఆమె ఆయన్ని తోటమాలి అనుకొని, “అయ్యా, నువ్వు ఆయన్ని తీసుకెళ్లివుంటే ఆయన్ని ఎక్కడ ఉంచావో చెప్పు. నేను ఆయన్ని తీసుకెళ్తాను” అంది. 16 అప్పుడు యేసు, “మరియా!” అన్నాడు. ఆమె వెనక్కి తిరిగి హీబ్రూ భాషలో “రబ్బూనీ!” (అంటే “బోధకుడా!” అని అర్థం) అని పిలిచింది. 17 యేసు ఆమెతో ఇలా అన్నాడు: “నేనింకా తండ్రి దగ్గరికి వెళ్లలేదు కాబట్టి నన్ను అలాగే పట్టుకుని ఉండవద్దు. అయితే, నా సోదరుల దగ్గరికి వెళ్లి, ‘నా తండ్రీ మీ తండ్రీ, నా దేవుడూ మీ దేవుడూ అయిన ఆయన దగ్గరికి నేను వెళ్తున్నాను’ అని చెప్పు.” 18 మగ్దలేనే మరియ వెళ్లి, “నేను ప్రభువును చూశాను!” అని శిష్యులతో చెప్పింది. అంతేకాదు యేసు తనకు ఏంచెప్పాడో వాళ్లకు తెలియజేసింది.

నవంబరు 12-18

దేవుని వాక్యంలో ఉన్న సంపద|అపొస్తలుల కార్యాలు 1-3

“క్రైస్తవ సంఘం మీద పవిత్రశక్తి కుమ్మరించబడింది”

(అపొస్తలుల కార్యాలు 2:1-8) పెంతెకొస్తు పండుగ రోజున శిష్యులందరూ ఒకే చోట ఉన్నారు. 2 అప్పుడు ఉన్నట్టుండి ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. అది వేగంగా వీచే బలమైన గాలి శబ్దంలా ఉంది. వాళ్లు కూర్చున్న ఇల్లంతా ఆ శబ్దంతో నిండిపోయింది. 3 అప్పుడు అగ్ని లాంటి నాలుకలు వాళ్లకు కనిపించాయి. ఆ నాలుకలు విడిపోయి, వాళ్లలో ఒక్కొక్కరి మీద ఒక్కో నాలుక వాలింది. 4 దాంతో వాళ్లంతా పవిత్రశక్తితో నిండిపోయారు; ఆ పవిత్రశక్తి ఇచ్చిన సామర్థ్యం ప్రకారం వాళ్లు వేర్వేరు భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు. 5 ఆ సమయంలో భూమ్మీదున్న అన్ని దేశాల నుండి వచ్చిన దైవభక్తిగల యూదులు యెరూషలేములో ఉన్నారు. 6 ఆ శబ్దం వచ్చినప్పుడు చాలామంది ప్రజలు అక్కడికి వచ్చారు. శిష్యులు ఆ ప్రజల్లో ప్రతీ ఒక్కరి మాతృభాషలో మాట్లాడడం విని వాళ్లంతా అవాక్కయ్యారు. 7 వాళ్లు ఆశ్చర్యంలో మునిగిపోయి ఇలా అన్నారు: “ఇక్కడ చూడండి, మాట్లాడుతున్న వీళ్లంతా గలిలయ ప్రాంతం వాళ్లే కదా? 8 అయితే మనలో ప్రతీ ఒక్కరం, వీళ్లు మన మాతృభాషల్లో మాట్లాడడం వింటున్నామేంటి?

(అపొస్తలుల కార్యాలు 2:14) అయితే పేతురు పదకొండుమంది అపొస్తలులతో పాటు లేచి నిలబడి బిగ్గరగా ఇలా అన్నాడు: “యూదయ మనుషులారా, యెరూషలేములో నివసిస్తున్న సమస్త ప్రజలారా, మీకు ఈ విషయం తెలియాలి. మీరు నా మాటలు జాగ్రత్తగా వినండి.

(అపొస్తలుల కార్యాలు 2:37, 38) ఈ మాట విన్నప్పుడు వాళ్లకు గుండెల్లో పొడిచినట్లు అనిపించింది. దాంతో వాళ్లు పేతురుతో, మిగతా అపొస్తలులతో “సోదరులారా, మేము ఏంచేయాలి?” అని అడిగారు. 38 అప్పుడు పేతురు వాళ్లకిలా చెప్పాడు: “మీరు పశ్చాత్తాపపడండి. మీ పాపాలు క్షమించబడేలా మీలో ప్రతీ ఒక్కరు యేసుక్రీస్తు పేరున బాప్తిస్మం తీసుకోండి. అప్పుడు మీరు పవిత్రశక్తి అనే ఉచిత బహుమతిని పొందుతారు.

(అపొస్తలుల కార్యాలు 2:41) కాబట్టి అతని మాటను సంతోషంగా అంగీకరించినవాళ్లు బాప్తిస్మం తీసుకున్నారు. ఆ రోజు దాదాపు 3,000 మంది వాళ్లతో చేరారు.

(అపొస్తలుల కార్యాలు 2:42-47) వాళ్లు పట్టుదలతో అపొస్తలుల దగ్గర నేర్చుకుంటూ, తమ దగ్గర ఉన్నవన్నీ ఒకరితో ఒకరు పంచుకుంటూ, కలిసి భోంచేస్తూ, ప్రార్థిస్తూ ఉన్నారు. 43 అపొస్తలులు ఎన్నో అద్భుతాలు, సూచనలు చేయడం మొదలుపెట్టారు. ఇది చూసిన ప్రతీ ఒక్కరిలో భయం మొదలైంది. 44 విశ్వాసులైన వాళ్లందరూ కలిసి ఉన్నారు, తమకు ఉన్నవన్నీ ఒకరితో ఒకరు పంచుకున్నారు. 45 వాళ్లు తమ భూముల్ని, ఆస్తిపాస్తుల్ని అమ్మి, ఆ డబ్బును అందరికీ వాళ్లవాళ్ల అవసరాన్ని బట్టి పంచిపెడుతూ వచ్చారు. 46 వాళ్లు ప్రతీరోజు ఒకే మనసుతో ఆలయంలో కలుసుకుంటూ, వేర్వేరు ఇళ్లలో భోంచేస్తూ, తమ ఆహారాన్ని ఎంతో సంతోషంతో పంచుకుంటూ ఉన్నారు. వాళ్లు ప్రతీది మనస్ఫూర్తిగా చేస్తూ, 47 దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రజలందరి దగ్గర మంచి పేరు సంపాదించుకుంటూ ఉన్నారు. అదే సమయంలో, రక్షణ మార్గంలో ప్రవేశించినవాళ్లను యెహోవా ప్రతీరోజు వాళ్లతో చేరుస్తూ ఉన్నాడు.

w86-E 12/1 29వ పేజీ, 4-5 పేరాలు, 7వ పేరా

హృదయానందాన్ని తెచ్చే విరాళాలు

క్రీ.శ. 33వ సంవత్సరంలో క్రైస్తవ సంఘం పుట్టిన మొదటి రోజు, కొత్తగా మారి బాప్తిస్మం తీసుకున్న 3000 మంది ‘ఒకరితో ఒకరు పంచుకుంటూ, కలిసి భోంచేస్తూ, ప్రార్థిస్తూ ఉన్నారు.’ ఏ మంచి కారణాన్ని బట్టి? ‘పట్టుదలతో అపొస్తలుల దగ్గర నేర్చుకుంటూ’ అప్పుడే కొత్తగా ఉన్న తమ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి వీలుగా వాళ్లు అలా చేశారు.—అపొస్తలుల కార్యాలు 2:41, 42.

పెంతెకొస్తు పండగ సమయంలో కొంత కాలం మాత్రమే యెరూషలేములో ఉండాలనే ఉద్దేశంతో యూదులు, యూదులుగా మారినవాళ్లు అక్కడకు వచ్చారు. అయితే, వాళ్లలో క్రైస్తవులుగా మారినవాళ్లు కొంచెం ఎక్కువ కాలం ఉండి కొత్తగా ఏర్పడిన తమ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి ఇంకా ఎక్కువ విషయాలు నేర్చుకోవాలనుకున్నారు. దానివల్ల వాళ్లకు అత్యవసరంగా ఆహారం, వసతి ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కొంతమంది సందర్శకుల దగ్గర చాలా డబ్బులు ఉంటే, మరికొంతమంది దగ్గర సరిపడా డబ్బులు లేవు. కాబట్టి వాళ్లు తాత్కాలికంగా విరాళాలను సేకరించి, అవసరంలో ఉన్నవాళ్లకు వస్తువులను పంచిపెట్టారు.—అపొస్తలుల కార్యాలు 2:43-47.

భూముల్ని అమ్మడం, తమదగ్గర ఉన్నవాటన్నిటినీ ఇతరులతో పంచుకోవడం లాంటివన్నీ పూర్తి స్వచ్ఛందంగా చేయాల్సినవే. భూముల్ని అమ్మాలని గానీ, విరాళాలు ఇవ్వాలని గానీ ఎవ్వరినీ బలవంతం చేయలేదు. అలాగని పేదవాళ్లుగా ఉండాలని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చేసింది కాదు. ధనవంతులు తమ ఆస్తులన్నిటినీ అమ్మేసి పేదవాళ్లుగా అయిపోయారని ఇక్కడ చెప్పడం లేదు. కాకపోతే, అప్పుడున్న పరిస్థితులనుబట్టి వాళ్లు తోటి విశ్వాసుల మీద కనికరంతో, తమ ఆస్తులను అమ్మి వచ్చిన డబ్బంతా రాజ్య సంబంధమైన విషయాలను ముందుకు తీసుకెళ్లడానికి ఇచ్చేశారు.—2 కొరింథీయులు 8:12-15తో పోల్చండి.

దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం

(అపొస్తలుల కార్యాలు 3:15) జీవాన్ని ఇవ్వడానికి నియమించబడిన ముఖ్య ప్రతినిధిని మీరు చంపారు. అయితే దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాడు, ఈ వాస్తవానికి మేము సాక్షులం.

it-2-E 61వ పేజీ, 1వ పేరా

యేసుక్రీస్తు

‘జీవాన్ని ఇవ్వడానికి నియమించబడిన ముఖ్య ప్రతినిధి.’ తన తండ్రి చూపించే అపారదయకు గుర్తుగా క్రీస్తుయేసు తన పరిపూర్ణ మానవ ప్రాణాన్ని త్యాగం చేశాడు. దీనివల్ల, ఎంపిక చేయబడిన క్రీస్తు అనుచరులు ఆయనతో ఐక్యమై పరలోకంలో ఆయనతోపాటు పరిపాలించడానికి, అంతేకాదు యేసు రాజ్య పరిపాలనలో ప్రజలు భూమ్మీద జీవించడానికి సాధ్యమయ్యింది. (మత్త 6:10; యోహా 3:16; ఎఫె 1:7; హెబ్రీ 2:5; విమోచన చూడండి.) ఆ విధంగా యేసు మనుషులందరికీ ‘జీవాన్ని ఇవ్వడానికి నియమించబడిన ముఖ్య ప్రతినిధి [“రాజకుమారుడు,” KJ; JB]’ అయ్యాడు. (అపొ 3:15) ఇక్కడ ఉపయోగించిన గ్రీకు పదానికి, ప్రాథమికంగా “ముఖ్య నాయకుడు,” అనే అర్థం వస్తుంది. ఇలాంటి ఒక పదాన్నే మోషేకు ఉపయోగిస్తూ ఇశ్రాయేలులో “పరిపాలకుడు” అని అన్నారు. (అపొ 7:27, 35)

(అపొస్తలుల కార్యాలు 3:19) “కాబట్టి మీరు పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగండి. అప్పుడు యెహోవా మీ పాపాల్ని క్షమిస్తాడు, ఆయనే మీకు సేదదీర్పును ఇస్తాడు.

cl 265వ పేజీ, 14వ పేరా

“క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల” దేవుడు

14 యెహోవా చూపే క్షమాగుణం అపొస్తలుల కార్యములు 3:20⁠లో ఇంకా ఇలా వర్ణించబడింది: ‘మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారుమనస్సునొంది తిరుగుడి.’ తుడిచివేయడం అని అనువదించబడిన ఆ గ్రీకు క్రియా పదం “చెరిపివేయు, . . . రద్దుచేయు లేదా నిరుపయోగం చేయు” అనే అర్థం ఇవ్వగలదు. కొందరు విద్వాంసుల అభిప్రాయం ప్రకారం, చేవ్రాతను తుడిచివేయడం అనే భావం దానిలో వ్యక్తం చేయబడింది. ఇదెలా సాధ్యం? ప్రాచీన కాలాల్లో సాధారణంగా ఉపయోగించబడిన సిరా కర్బనం, జిగురు, నీళ్లు కలిపిన మిశ్రమంతో తయారుచేయబడేది. అలాంటి సిరాతో వ్రాసిన తర్వాత, తడి స్పంజితో ఆ రాతను ఒక వ్యక్తి తుడిచివేయడానికి వీలుండేది. యెహోవా కరుణకు చక్కని ఉదాహరణ అందులో ఉంది. ఆయన మన పాపాలను క్షమించినప్పుడు, ఆయన ఒక స్పంజి తీసుకొని వాటిని తుడిచివేసినట్టుగా ఉంటుంది.

చదవాల్సిన బైబిలు భాగం

(అపొస్తలుల కార్యాలు 2:1-21) పెంతెకొస్తు పండుగ రోజున శిష్యులందరూ ఒకే చోట ఉన్నారు. 2 అప్పుడు ఉన్నట్టుండి ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. అది వేగంగా వీచే బలమైన గాలి శబ్దంలా ఉంది. వాళ్లు కూర్చున్న ఇల్లంతా ఆ శబ్దంతో నిండిపోయింది. 3 అప్పుడు అగ్ని లాంటి నాలుకలు వాళ్లకు కనిపించాయి. ఆ నాలుకలు విడిపోయి, వాళ్లలో ఒక్కొక్కరి మీద ఒక్కో నాలుక వాలింది. 4 దాంతో వాళ్లంతా పవిత్రశక్తితో నిండిపోయారు; ఆ పవిత్రశక్తి ఇచ్చిన సామర్థ్యం ప్రకారం వాళ్లు వేర్వేరు భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు. 5 ఆ సమయంలో భూమ్మీదున్న అన్ని దేశాల నుండి వచ్చిన దైవభక్తిగల యూదులు యెరూషలేములో ఉన్నారు. 6 ఆ శబ్దం వచ్చినప్పుడు చాలామంది ప్రజలు అక్కడికి వచ్చారు. శిష్యులు ఆ ప్రజల్లో ప్రతీ ఒక్కరి మాతృభాషలో మాట్లాడడం విని వాళ్లంతా అవాక్కయ్యారు. 7 వాళ్లు ఆశ్చర్యంలో మునిగిపోయి ఇలా అన్నారు: “ఇక్కడ చూడండి, మాట్లాడుతున్న వీళ్లంతా గలిలయ ప్రాంతం వాళ్లే కదా? 8 అయితే మనలో ప్రతీ ఒక్కరం, వీళ్లు మన మాతృభాషల్లో మాట్లాడడం వింటున్నామేంటి? 9 మనలో పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు ఉన్నారు; మెసొపొతమియ, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా ప్రాంతం, 10 ఫ్రుగియ, పంఫూలియ, ఐగుప్తు, కురేనేకు దగ్గర్లో ఉన్న లిబియ ప్రాంతాల నివాసులు ఉన్నారు; రోము నుండి వచ్చి యెరూషలేములో తాత్కాలికంగా నివసిస్తున్న యూదులు, యూదులుగా మారిన అన్యులు ఉన్నారు; 11 క్రేతీయులు, అరబీయులు ఉన్నారు. దేవుని శక్తివంతమైన కార్యాల గురించి వీళ్లు మన భాషల్లో మాట్లాడడం మనమందరం వింటున్నాం.” 12 వాళ్లంతా ఆశ్చర్యపోయి, అయోమయంతో ఒకరితో ఒకరు “అసలు ఇక్కడ ఏం జరుగుతోంది?” అని చెప్పుకున్నారు. 13 అయితే ఇతరులు శిష్యుల్ని ఎగతాళి చేస్తూ, “వీళ్లు తాగిన మత్తులో ఉన్నారు” అని అన్నారు. 14 అయితే పేతురు పదకొండుమంది అపొస్తలులతో పాటు లేచి నిలబడి బిగ్గరగా ఇలా అన్నాడు: “యూదయ మనుషులారా, యెరూషలేములో నివసిస్తున్న సమస్త ప్రజలారా, మీకు ఈ విషయం తెలియాలి. మీరు నా మాటలు జాగ్రత్తగా వినండి. 15 మీరు అనుకుంటున్నట్టు వీళ్లేమీ తాగిన మత్తులో లేరు. ఎందుకంటే ఇప్పుడు ఉదయం 9 గంటలే అయింది. 16 అయితే, యోవేలు ప్రవక్త చెప్పిన మాటలు వీళ్ల విషయంలో నెరవేరుతున్నాయి. ఆ ప్రవక్త ఇలా చెప్పాడు: 17 ‘దేవుడు ఇలా అంటున్నాడు: “చివరి రోజుల్లో అన్నిరకాల ప్రజల మీద నా పవిత్రశక్తిని కుమ్మరిస్తాను. మీ కొడుకులు, మీ కూతుళ్లు ప్రవచిస్తారు. మీ యౌవనులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు. 18 ఆ రోజుల్లో నేను నా దాసుల మీద, దాసీల మీద కూడా నా పవిత్రశక్తిని కుమ్మరిస్తాను; వాళ్లు ప్రవచిస్తారు. 19 అంతేకాదు, నేను పైన ఆకాశంలో అద్భుతాల్ని, కింద భూమ్మీద సూచనల్ని చూపిస్తాను. అంటే రక్తాన్ని, నిప్పును, పొగ మేఘాల్ని చూపిస్తాను. 20 మహిమాన్వితమైన యెహోవా మహారోజు రాకముందు సూర్యుడు చీకటిగా మారతాడు, చంద్రుడు రక్తంగా మారతాడు. 21 అప్పుడు యెహోవా పేరు ఉపయోగించి ప్రార్థించే ప్రతీ ఒక్కరు రక్షించబడతారు.”’

it-1-E 129వ పేజీ, 2-3 పేరాలు

యూదా ఇస్కరియోతు బదులు పన్నెండవ శిష్యుడిగా ఎవరు ఎన్నుకోబడ్డారు?

యూదా ఇస్కరియోతు చెడుగా మారి, నమ్మకద్రోహిగా చనిపోయినప్పుడు, 11 మంది అపొస్తలులు మాత్రమే మిగిలారు. యేసు పునరుత్థానం అయి పరలోకానికి వెళ్లేవరుకున్న 40 రోజుల్లో ఆయన ఎవరినీ నియమించలేదు, లేదా ఆ స్థానంలోకి ఎవర్నీ మార్చలేదు. యేసు పరలోకానికి వెళ్లిపోయినప్పటి నుండి పెంతెకొస్తు పండుగకు మధ్య ఉన్న పది రోజుల్లో యూదా వదులుకున్న స్థానంలో ఇంకొకరిని నియమించడం అవసరమని భావించారు. కేవలం అతని మరణాన్ని బట్టి కాదుగానీ, అతను చెడుగా మారి తప్పిపోవడాన్నిబట్టి అలా చేశారని పేతురు చెప్పిన లేఖనాలను బట్టి తెలుస్తుంది. (అపొ 1:15-22; కీర్త 69:25; 109:8; ప్రక 3:11 పోల్చండి.) కాబట్టి అందుకు భిన్నంగా నమ్మకమైన అపొస్తలుడైన యాకోబుని చంపినప్పుడు, ఆయన స్థానంలో అపొస్తలుడిగా ఇంకెవరినైనా నియమించాలి అనే అవసరం తలెత్తినట్లు ఎక్కడా లేదు.—అపొ 12:2.

యేసుక్రీస్తు అపొస్తలుడి స్థానంలో నియమించబడే ఎవరైనా ఆయనతో వ్యక్తిగతంగా కలిసి ఉండి, ఆయన చేసిన పనులను, అద్భుతాలను, ముఖ్యంగా ఆయన పునరుత్థానాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్లు అయి ఉండాలని పేతురు చేసిన ప్రకటనల నుండి అర్థమౌతుంది. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో ఎవరినైనా అపొస్తలుల స్థానంలోకి నియమించాలనుకుంటే అది దేవుడు కల్పించుకుని వాళ్లకు ఆ అర్హతలు ఇస్తే తప్ప అది సాధ్యం కాదు. కానీ పెంతెకొస్తు ముందు, ఆ సమయంలో ఈ అర్హతలు కలిగిన పురుషులు ఉన్నారు. కాబట్టి ఇద్దరి పేర్లను యూదాకు బదులుగా నియమించడానికి అనువుగా ఉన్నట్లు భావించారు. నిస్సందేహంగా, సామెతలు 16:33ని మనసులో ఉంచుకుని చీట్లు వేశారు, అప్పుడు మత్తీయ ఎన్నుకోబడ్డాడు, “కాబట్టి అతను 12 మంది అపొస్తలుల్లో ఒకడిగా లెక్కించబడ్డాడు.” (అపొ 1:23-26) తర్వాత గ్రీకు భాష మాట్లాడే శిష్యుల విషయంలో తలెత్తిన సమస్యని పరిష్కరించిన పన్నెండుమందిలో అతను కూడా ఉన్నాడు (అపొ 6:1, 2), పౌలు కూడా 1 కొరింథీయులు 15:4-8⁠లో పునరుత్థానమైన తర్వాత యేసు కనపడిన సందర్భాల గురించి చెప్తూ 12 మందిలో మత్తీయను కూడా కలిపి చెప్పాడు. అలా పెంతెకొస్తు వచ్చేటప్పటికి, అప్పుడే ఏర్పడిన ఆధ్యాత్మిక ఇశ్రాయేలు నిలిచి ఉండే 12 అపొస్తలుల పునాదులు ఉన్నాయి.

నవంబరు 19-25

దేవుని వాక్యంలో ఉన్న సంపద|అపొస్తలుల కార్యాలు 4-5

“వాళ్లు దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నారు”

(అపొస్తలుల కార్యాలు 4:5-13) తర్వాతి రోజు యూదుల పాలకులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో సమావేశమయ్యారు. 6 వాళ్లతో పాటు ముఖ్య యాజకుడు అన్న, కయప, యోహాను, అలెక్సంద్రు, అలాగే ముఖ్య యాజకుడి బంధువులందరు కూడా వచ్చారు. 7 వాళ్లు పేతురును, యోహానును తమ మధ్య నిలబెట్టి, “ఏ అధికారంతో, ఎవరి పేరున మీరు దీన్ని చేశారు?” అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. 8 అప్పుడు పేతురు పవిత్రశక్తితో నిండిపోయి, వాళ్లతో ఇలా అన్నాడు: “ప్రజల పాలకులారా, పెద్దలారా, 9 ఈ కుంటివాడి విషయంలో జరిగిన మంచిపని గురించి ఈ రోజు మమ్మల్ని విచారణ చేస్తున్నారా? అతనెలా బాగయ్యాడో మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? 10 అలాగైతే మీరంతా, అలాగే ఇశ్రాయేలు ప్రజలందరూ ఈ విషయం తెలుసుకోవాలి: నజరేయుడైన యేసుక్రీస్తు పేరున, ఆయన ద్వారా ఈ వ్యక్తి మీ ముందు ఆరోగ్యంగా నిలబడ్డాడు. ఆ యేసుక్రీస్తునే మీరు కొయ్యమీద శిక్ష వేసి చంపారు, కానీ దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాడు. 11 ‘కట్టేవాళ్లయిన మీరు వద్దనుకున్న రాయి, ముఖ్యమైన మూలరాయి అయింది,’ ఆ రాయి యేసే. 12 అంతేకాదు, ఇంకెవ్వరి ద్వారా రక్షణ రాదు. ఎందుకంటే, మనల్ని రక్షించడానికి ప్రజల్లో నుండి దేవుడు ఎంచుకున్న వేరే ఏ పేరూ భూమ్మీద లేదు.” 13 వాళ్లు పేతురు, యోహానుల ధైర్యం చూసి, వాళ్లు చదువులేని సామాన్యులని గ్రహించినప్పుడు చాలా ఆశ్చర్యపోయారు. ఆ ఇద్దరు యేసుతోపాటు ఉండేవాళ్లని వాళ్లు గ్రహించడం మొదలుపెట్టారు.

w08-E 9/1 15వ పేజీ, బాక్సు

మాట్లాడిన మాటలు దగ్గర నుండి పవిత్ర వాక్యాలు రాయడం వరకు—మొదటి క్రైస్తవులు

అపొస్తలులు చదువులేనివాళ్లా?

యెరూషలేములో అధికారులు, పెద్దలు “పేతురు, యోహానుల ధైర్యం చూసి, వాళ్లు చదువులేని సామాన్యులని గ్రహించినప్పుడు చాలా ఆశ్చర్యపోయారు.” (అపొస్తలుల కార్యాలు 4:13) అపొస్తలులు నిజంగానే నిరక్షరాస్యులు లేదా చదువులేనివాళ్లా? ఈ ప్రతిపాదనకు సంబంధించి ద న్యూ ఇంటర్‌ప్రిటర్స్‌ బైబిలు ఇలా చెప్తుంది: “పేతురు, [యోహాను] పాఠశాలకు వెళ్లలేదని, వాళ్లకు చదవడం గానీ, రాయడం గానీ రాదని ఈ మాటల్ని అక్షరార్థంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అపొస్తలులకు, న్యాయం తీర్చడానికి కూర్చున్న వాళ్లకు మధ్య ఉన్న ప్రాముఖ్యమైన సామాజిక తేడాని ఆ మాటలు చూపిస్తున్నాయి.”

w08 5/15 30వ పేజీ, 6వ పేరా

అపొస్తలుల కార్యాలు పుస్తకంలోని ముఖ్యాంశాలు

4:13—పేతురు, యోహానులు విద్యలేని పామరులా? కాదు, వారు చదువుకున్నవారు. అయితే వారు మతపరమైన శిక్షణ పొందడానికి రబ్బీల పాఠశాలలకు వెళ్ళలేదు కాబట్టే వారు “విద్యలేని పామరులు” అని పిలువబడ్డారు.

(అపొస్తలుల కార్యాలు 4:18-20) కాబట్టి వాళ్లు ఆ ఇద్దరు శిష్యుల్ని పిలిచి, యేసు పేరున ఏమీ మాట్లాడవద్దని, బోధించవద్దని ఆజ్ఞాపించారు. 19 అందుకు పేతురు, యోహాను వాళ్లతో ఇలా అన్నారు: “దేవుని మాట కాకుండా మీ మాట వినడం దేవుని దృష్టిలో సరైనదేనా? మీరే ఆలోచించండి. 20 మేమైతే చూసినవాటి గురించి, విన్నవాటి గురించి మాట్లాడకుండా ఉండలేం.”

(అపొస్తలుల కార్యాలు 4:23-31) విడుదలైన తర్వాత పేతురు, యోహాను తమ సొంత ప్రజల దగ్గరికి వెళ్లి, ముఖ్య యాజకులు, పెద్దలు తమతో అన్న మాటల్ని వాళ్లకు చెప్పారు. 24 అది విన్నాక, వాళ్లంతా కలిసి దేవునికి ఇలా ప్రార్థించారు: “సర్వోన్నత ప్రభువా, ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉన్న వాటినన్నిటినీ నువ్వే చేశావు. 25 నీ సేవకుడు, మా పూర్వీకుడు అయిన దావీదు నోట పవిత్రశక్తి ద్వారా నువ్వే ఈ మాటలు అన్నావు: ‘దేశాలు ఎందుకు అల్లకల్లోలంగా మారాయి? ప్రజలు ఎందుకు పనికిరాని వాటి గురించి ఆలోచిస్తున్నారు? 26 భూమ్మీదున్న రాజులు యెహోవాకు, ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా నిలబడ్డారు, పరిపాలకులు ఏకమై వాళ్లిద్దరికి వ్యతిరేకంగా గుమికూడారు.’ 27 నిజంగానే హేరోదు, పొంతి పిలాతు అన్యులతో ఇశ్రాయేలీయులతో కలిసి, నువ్వు అభిషేకించిన నీ పవిత్ర సేవకుడైన యేసుకు వ్యతిరేకంగా ఈ నగరంలో గుమికూడారు. 28 నువ్వు ముందే చెప్పినవి జరగాలని వాళ్లు అలా గుమికూడారు. నీ ఇష్టప్రకారం, నీ శక్తితో నువ్వే అలా జరిగేలా చేశావు. 29 అయితే ఇప్పుడు, యెహోవా దయచేసి వాళ్ల బెదిరింపుల్ని విని, నీ దాసులు నీ వాక్యాన్ని పూర్తి ధైర్యంతో ప్రకటిస్తూ ఉండేలా సహాయం చేయి. 30 అదే సమయంలో, నువ్వు నీ శక్తితో రోగుల్ని బాగుచేస్తూ ఉండు. నీ పవిత్ర సేవకుడైన యేసు పేరు ద్వారా సూచనలు, అద్భుతాలు జరుగుతూ ఉండేలా చేయి.” 31 వాళ్లు పట్టుదలగా ప్రార్థన చేసినప్పుడు, వాళ్లు సమావేశమైన స్థలం కంపించింది; వాళ్లలో ప్రతీ ఒక్కరు పవిత్రశక్తితో నిండిపోయి దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నారు.

it-1-E 128వ పేజీ, 3వ పేరా

అపొస్తలుడు

క్రైస్తవ సంఘంలో జరిగిన పని. పెంతెకొస్తు రోజున అపొస్తలుల మీద దేవుని శక్తి కుమ్మరించబడడంతో వాళ్లు చాలా బలపర్చబడ్డారు. అపొస్తలులను జైళ్లలో పెట్టినా, కొట్టినా, చంపేస్తామని అధికారులు బెదిరించినా కూడా వాళ్లు మంచివార్తని, యేసు పునరుత్థానాన్ని ప్రకటించారు. ఆ విషయాలు మరియు వాళ్లు చూపించిన గొప్ప ధైర్యం గురించి, వాళ్లకున్న నిబ్బరం గురించి అపొస్తలుల కార్యాలు మొదటి ఐదు అధ్యాయాలు సాక్ష్యం ఇస్తున్నాయి. పెంతెకొస్తు పండగ అయిపోయిన తొలి రోజుల్లో, పవిత్ర శక్తి సహాయంతో అపొస్తలుల గొప్ప నాయకత్వం క్రైస్తవ సంఘం అద్భుతంగా వ్యాప్తి చెందడానికి దోహదపడింది. (అపొ 2:41; 4:4) వాళ్ల పరిచర్య మొదట్లో యెరూషలేముకే పరిమితమైనా, తర్వాత సమరయకు ఇంకొంత సమయానికి ప్రపంచమంతటా వ్యాపించింది.—అపొ 5:42; 6:7; 8:5-17, 25; 1:8.

దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం

(అపొస్తలుల కార్యాలు 4:11) ‘కట్టేవాళ్లయిన మీరు వద్దనుకున్న రాయి, ముఖ్యమైన మూలరాయి అయింది,’ ఆ రాయి యేసే.

it-1-E 514వ పేజీ, 4వ పేరా

మూలరాయి

ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి “మూలకు తలరాయి” అవుతుందని కీర్తనలు 118:22 వెల్లడి చేస్తుంది (హెబ్రీ., రోష్‌ పిన్నాహ్‌). యేసు ఈ ప్రవచనాన్ని ఉల్లేఖించి, ఆ “మూలకు తలరాయి” తానేనని దాన్ని తనకే అన్వయించుకున్నాడు (గ్రీకు., కెఫాలె గొనియాస్‌, మూలకు తలరాయి). (మత్త 21:42; మార్కు 12:10, 11; లూకా 20:17) ఒక భవనానికి అన్నిటికంటే పైన ఉన్న రాయి ఎలాగైతే అందరికీ స్పష్టంగా కనబడుతుందో, అలాగే యేసుక్రీస్తు కూడా అభిషిక్తుల క్రైస్తవ సంఘానికి కిరీటంలోని రాయిలా ఉన్నాడు. ఈ సంఘాన్ని ఆధ్యాత్మిక ఆలయంతో పోల్చారు. పేతురు కూడా కీర్తన 118:22ని క్రీస్తుకు అన్వయించడం ద్వారా, క్రీస్తే ఆ “రాయి” అని, ఆ రాయిని మనుషులు నిషేధించినా దేవుడు దాన్ని ‘మూలకు తలరాయిగా’ ఎంచుకున్నాడని చూపించాడు.—అపొ 4:8-12; 1పేతు 2:4-7 కూడా చూడండి.

(అపొస్తలుల కార్యాలు 5:1) అయితే అననీయ అనే ఒక వ్యక్తి, తన భార్య సప్పీరాతో కలిసి వాళ్ల ఆస్తిలో కొంత అమ్మాడు.

w13 3/1 15వ పేజీ, 4వ పేరా

పేతురు, అననీయ అబద్ధమాడారు వాళ్ల నుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు?

అననీయ, సప్పీరాలు తమ పొలం అమ్మి, ఆ డబ్బుతో కొత్తగా బాప్తిస్మం తీసుకున్నవాళ్లకు సహాయం చేయాలనుకున్నారు. అననీయ ఆ డబ్బును అపొస్తలుల దగ్గరకు తెచ్చి, పొలం అమ్మితే అంత డబ్బే వచ్చిందన్నాడు. కానీ అది అబద్ధం! ఆయన తన కోసం కొంత డబ్బు దాచుకున్నాడు. దేవుడు ఇదంతా పేతురుకు తెలిసేలా చేశాడు. కాబట్టి పేతురు అననీయతో ఇలా అన్నాడు: ‘నువ్వు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడావు.’ అప్పుడు అననీయ అక్కడికక్కడే చనిపోయాడు! మూడు గంటల తర్వాత, ఆయన భార్య అక్కడకు వచ్చింది. తన భర్తకు ఏమి జరిగిందో తెలియక తను కూడా అబద్ధం చెప్పింది, దాంతో అక్కడికక్కడే చనిపోయింది.

చదవాల్సిన బైబిలు భాగం

(అపొస్తలుల కార్యాలు 5:27-42) కాబట్టి వాళ్లు ఆ అపొస్తలుల్ని తీసుకొచ్చి మహాసభ ముందు నిలబెట్టారు. అప్పుడు ప్రధానయాజకుడు వాళ్లను ప్రశ్నిస్తూ 28 ఇలా అన్నాడు: “ఈ పేరు మీద ఇక బోధించవద్దని మేము మీకు గట్టిగా ఆజ్ఞాపించాం. అయినా సరే, మీరు మీ బోధతో యెరూషలేమును నింపేశారు. ఈ వ్యక్తి చావుకు మమ్మల్ని బాధ్యుల్ని చేయాలని మీరనుకుంటున్నారు.” 29 అప్పుడు పేతురు, మిగతా అపొస్తలులు ఇలా అన్నారు: “మేము లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే కానీ మనుషులు కాదు. 30 మీరు కొయ్యకు వేలాడదీసి చంపిన యేసును మన పూర్వీకుల దేవుడు లేపాడు. 31 తన కుడి పక్కన కూర్చునేలా దేవుడు ఆయన్ని హెచ్చించాడు. ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ పొందేలా దేవుడు ఆయన్ని ముఖ్య ప్రతినిధిగా, రక్షకునిగా నియమించాడు. 32 ఈ విషయాలకు మేము సాక్షులం. తనకు లోబడేవాళ్లకు దేవుడు ఇచ్చిన పవిత్రశక్తి కూడా వీటికి సాక్షిగా ఉంది.” 33 ఆ మాట విన్నప్పుడు వాళ్లకు విపరీతమైన కోపం వచ్చింది. దాంతో వాళ్లు అపొస్తలుల్ని చంపాలనుకున్నారు. 34 అయితే గమలీయేలు అనే ఒక పరిసయ్యుడు ఆ మహాసభలో లేచి నిలబడ్డాడు. అతను ప్రజలందరూ గౌరవించే ధర్మశాస్త్ర బోధకుడు. అతను, అపొస్తలుల్ని కాసేపు బయట ఉంచమని ఆజ్ఞాపించాడు. 35 తర్వాత, అక్కడున్న వాళ్లతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలారా, మీరు వీళ్లకు విధించాలనుకుంటున్న శిక్ష విషయంలో జాగ్రత్తగా ఉండండి. 36 కొంతకాలం క్రితం, థూదా అనే వ్యక్తి తాను ఒక ప్రముఖుణ్ణని చెప్పుకున్నాడు. దాదాపు 400 మంది అతనితో చేరారు. అయితే అతను చంపబడ్డాడు. అప్పుడు అతని గుంపు చెల్లాచెదురైపోయింది, ఎక్కడా లేకుండా పోయింది. 37 ఆ తర్వాత, జనసంఖ్య తీసుకున్న రోజుల్లో గలిలయవాడైన యూదా బయల్దేరాడు. అతను ప్రజలు తనను అనుసరించేలా చేసుకున్నాడు. అతను కూడా లేకుండా పోయాడు, అతన్ని అనుసరించిన వాళ్లందరూ చెల్లాచెదురైపోయారు. 38 కాబట్టి నేను మీకు చెప్పేదేమిటంటే, ఈ మనుషుల జోలికి పోకండి, వాళ్ల దారిన వాళ్లను వదిలేయండి. ఈ ఆలోచన గానీ ఈ పని గానీ మనుషుల నుండి వచ్చినదైతే అది నాశనమైపోతుంది. 39 కానీ అది దేవుని నుండి వచ్చినదైతే, మీరు దాన్ని నాశనం చేయలేరు. చివరికి మీరు దేవునితోనే పోరాడేవాళ్లు అవుతారేమో.” 40 వాళ్లు అతని మాట విని అపొస్తలుల్ని పిలిపించి, వాళ్లను కొట్టించి, ఇక మీదట యేసు పేరున మాట్లాడవద్దని ఆజ్ఞాపించి వాళ్లను వెళ్లనిచ్చారు. 41 యేసు పేరు కోసం అవమానించబడే గొప్ప అవకాశం తమకు దక్కిందని సంతోషిస్తూ వాళ్లు మహాసభ నుండి వెళ్లిపోయారు. 42 వాళ్లు ప్రతీరోజు ఆలయంలో, అలాగే ఇంటింటా మానకుండా బోధిస్తూ, క్రీస్తు గురించిన అంటే యేసు గురించిన మంచివార్తను ప్రకటిస్తూ ఉన్నారు.

నవంబరు 26–డిసెంబరు 2

దేవుని వాక్యంలో ఉన్న సంపద|అపొస్తలుల కార్యాలు 6-8

“కొత్తగా ఏర్పడిన క్రైస్తవ సంఘం పరీక్షించబడింది”

(అపొస్తలుల కార్యాలు 6:1) ఆ రోజుల్లో శిష్యుల సంఖ్య పెరుగుతున్నప్పుడు, గ్రీకు భాష మాట్లాడే యూదులు హీబ్రూ భాష మాట్లాడే యూదుల మీద ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే, ప్రతీరోజు ఆహారం పంచిపెడుతున్నప్పుడు, గ్రీకు భాష మాట్లాడే విధవరాళ్లు నిర్లక్ష్యానికి గురౌతున్నారు.

bt–E 41వ పేజీ, 17వ పేరా

‘మనము లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే’

17 కొత్తగా ఏర్పడిన సంఘానికి ఇప్పుడు పైకి కనబడని ప్రమాదం ఒకటి ఎదురైంది. అది లోలోపల సంఘానికి అపాయకరంగా ఉంది. ఏంటి ఆ ప్రమాదం? బాప్తిస్మం తీసుకున్న శిష్యుల్లో చాలామంది యెరూషలేముకు వచ్చిన సందర్శకులు. వాళ్లు ఇంటికి తిరిగి వెళ్లే ముందు ఇంకా ఎక్కువ నేర్చుకోవాలనుకుంటున్నారు. యెరూషలేములో నివసించే శిష్యులు, వీళ్లకు కావాల్సిన ఆహారం, ఇతర అవసరాల కోసం ఇష్టపూర్వకంగా విరాళాలు ఇచ్చారు. (అపొస్తలుల కార్యాలు 2:44-46; 4:34-37) ఆ సమయంలో ఒక సున్నితమైన సమస్య తలెత్తింది. “ప్రతీరోజు” ఆహారం “పంచిపెడుతున్నప్పుడు,” గ్రీకు భాష మాట్లాడే విధవరాళ్లు “నిర్లక్ష్యానికి గురౌతున్నారు.” (అపొస్తలుల కార్యాలు 6:1) అయితే, హీబ్రూ భాష మాట్లాడే విధవరాళ్లు మాత్రం నిర్లక్ష్యం చేయబడట్లేదు. వివక్ష అక్కడ సమస్యగా ఉన్నట్లు కనపడుతుంది. ఇలాంటి సమస్యలు ఐక్యతను చాలా ఎక్కువగా పాడుచేస్తాయి.

(అపొస్తలుల కార్యాలు 6:2-7) కాబట్టి పన్నెండుమంది అపొస్తలులు శిష్యులందర్నీ పిలిచి ఇలా అన్నారు: “ఆహారం పంచిపెట్టడం కోసం మేము దేవుని వాక్యాన్ని బోధించే పనిని ఆపడం సరైనది కాదు. 3 కాబట్టి సోదరులారా, మీ మధ్య మంచి పేరున్న, పవిత్రశక్తితో తెలివితో నిండిన ఏడుగురు పురుషుల్ని మీరే ఎంచుకోండి. అప్పుడు మేము వాళ్లను ఈ అవసరమైన పని మీద నియమిస్తాం. 4 మేము మాత్రం ప్రార్థించడానికి, వాక్యాన్ని బోధించడానికి మా పూర్తి సమయాన్ని, శక్తిని వెచ్చిస్తాం.” 5  వాళ్లు చెప్పిన మాట శిష్యులందరికీ నచ్చింది. కాబట్టి వాళ్లు విశ్వాసంతో, పవిత్రశక్తితో నిండిన స్తెఫనును, అలాగే ఫిలిప్పును, ప్రొకొరును, నీకానోరును, తీమోనును, పర్మెనాసును, అంతియొకయకు చెందిన నీకొలాసును ఎంచుకున్నారు. ఈ నీకొలాసు యూదుడిగా మారిన అన్యుడు. 6 శిష్యులు వీళ్లను అపొస్తలుల దగ్గరికి తీసుకొచ్చారు. అపొస్తలులు ప్రార్థన చేసి, వాళ్ల మీద చేతులు ఉంచారు. 7 దానివల్ల దేవుని వాక్యం వ్యాప్తిచెందుతూ వచ్చింది. యెరూషలేములో శిష్యుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉంది. యాజకుల్లో కూడా చాలామంది విశ్వాసులయ్యారు.

bt-E 42వ పేజీ, 18వ పేరా

‘మనము లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే’

18 అభివృద్ధి చెందుతున్న సంఘానికి అపొస్తలులు పరిపాలక సభగా వ్యవహరిస్తున్నారు. “ఆహారం పంచిపెట్టడం కోసం . . . దేవుని వాక్యాన్ని బోధించే పనిని ఆపడం” సరైనది కాదు అని వాళ్లు గుర్తించారు. (అపొస్తలుల కార్యాలు 6:2) కాబట్టి విషయాలను చక్కదిద్దడం కోసం, “పవిత్రశక్తితో తెలివితో నిండిన” ఏడుగురు పురుషుల్ని వెతకమని, వాళ్లను ఈ “అవసరమైన పని మీద” నియమించవచ్చని అపొస్తలులు శిష్యుల్ని నిర్దేశించారు. (అపొస్తలుల కార్యాలు 6:3) అందుకు అర్హతగల పురుషులు అవసరం, ఎందుకంటే ఆ పనిలో కేవలం ఆహారాన్ని పంచిపెట్టడం మాత్రమే కాదు, డబ్బును సరిగ్గా ఉపయోగించడం, సరుకుల్ని కొనడం, ఇంకా వాటికి సంబంధించిన వివరాల్ని జాగ్రత్తగా నమోదు చేసుకోవడం కూడా ఇమిడి ఉన్నాయి. అలా ఎంచుకున్న పురుషులందరికీ గ్రీకు పేర్లు ఉన్నాయి కాబట్టి బహుశా బాధపడిన ఆ విధవరాళ్లు వాళ్లను అంగీకరించగలిగి ఉంటారు. ఈ నియామకాల గురించి ప్రార్థనాపూర్వకంగా ఆలోచించాక, అపొస్తలులు ఆ ఏడుగురు పురుషుల్ని ఈ “అవసరమైన పని మీద” నియమించారు.

(అపొస్తలుల కార్యాలు 7:58–8:1) వాళ్లు అతన్ని నగరం బయటికి లాక్కొచ్చి, అతని మీదికి రాళ్లు విసరడం మొదలుపెట్టారు. ఆ సాక్షులు తమ పైవస్త్రాలను సౌలు అనే ఒక యువకుడి పాదాల దగ్గర పెట్టారు. 59 వాళ్లు స్తెఫను మీద రాళ్లు విసురుతున్నప్పుడు, స్తెఫను ఇలా వేడుకున్నాడు: “యేసు ప్రభూ, నా ప్రాణాన్ని నీకు అప్పగిస్తున్నాను.” 60 తర్వాత అతను మోకరించి, గట్టి స్వరంతో “యెహోవా, ఈ పాపానికి వాళ్లను బాధ్యులుగా ఎంచకు” అని అరిచాడు. ఆ మాట అన్నాక, అతను చనిపోయాడు.

8 స్తెఫను హత్యను సౌలు ఆమోదించాడు. ఆ రోజు నుండి యెరూషలేములో ఉన్న సంఘం మీదికి తీవ్రమైన హింస రావడం మొదలైంది. అపొస్తలులు తప్ప మిగతా శిష్యులందరూ యూదయ, సమరయ అంతటా చెదిరిపోయారు.

దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం

(అపొస్తలుల కార్యాలు 6:15) మహాసభలో కూర్చున్న వాళ్లందరూ అతని ముఖాన్ని చూసినప్పుడు, అతని ముఖం వాళ్లకు దేవదూత ముఖంలా కనిపించింది.

bt–E 45వ పేజీ, 2వ పేరా

స్తెఫను—దైవిక కృపతో, శక్తితో నిండి ఉన్నాడు

2 ఇక్కడ స్తెఫను ముఖం గురించి గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. న్యాయాధిపతులు అతనివైపు చూసినప్పుడు అతని ముఖం “దేవదూత ముఖంలా కనిపించింది.” (అపొస్తలుల కార్యాలు 6:15) దేవదూతలు యెహోవా దేవుడు ఇచ్చే సందేశాన్ని తెలియజేస్తారు కాబట్టి వాళ్లు నిర్భయంగా, నిమ్మళంగా, ప్రశాంతంగా కనిపిస్తారు. కాబట్టి స్తెఫను కూడా అలానే ఉన్నాడు. అతనిపైన ద్వేషంతో ఉన్న న్యాయాధిపతులు కూడా దాన్ని చూడగలిగారు. అతను అంత ప్రశాంతంగా ఎలా ఉండగలిగాడు?

(అపొస్తలుల కార్యాలు 8:26-30) అయితే, యెహోవా దూత ఫిలిప్పుతో మాట్లాడుతూ ఇలా చెప్పాడు: “నువ్వు లేచి దక్షిణం వైపు యెరూషలేము నుండి గాజాకు వెళ్లే దారి వెంబడి వెళ్లు.” (ఈ దారి ఎడారిలో ఉంది.) 27 దాంతో అతను లేచి వెళ్లాడు. అప్పుడు ఇదిగో! ఇతియోపీయుడైన ఒక అధికారి అతనికి కనిపించాడు. అతను ఇతియోపీయుల రాణియైన కందాకే కింద పనిచేసేవాడు. అతను రాణి ఖజానా అంతటినీ చూసుకునేవాడు. దేవుణ్ణి ఆరాధించడం కోసం అతను యెరూషలేముకు వెళ్లి 28 తిరిగి వస్తున్నాడు. అతను తన రథంలో కూర్చొని యెషయా ప్రవక్త గ్రంథాన్ని బిగ్గరగా చదువుతున్నాడు. 29 కాబట్టి దేవుడు తన పవిత్రశక్తి ద్వారా ఫిలిప్పుకు ఇలా చెప్పాడు: “ఆ రథం దగ్గరికి వెళ్లు.” 30 అప్పుడు ఫిలిప్పు రథం పక్కనే పరుగెత్తుతూ, అతను యెషయా ప్రవక్త గ్రంథాన్ని బిగ్గరగా చదువుతుండడం విని, “నువ్వు చదువుతున్నదంతా నీకు అర్థమౌతోందా?” అని అడిగాడు.

bt-E 58వ పేజీ, 16వ పేరా

“యేసు గురించి మంచివార్త” ప్రకటించడం

16 ఫిలిప్పు చేసినలాంటి పనిలో పాల్గొనే గొప్ప అవకాశం నేటి క్రైస్తవులకు కూడా దొరికింది. తరచూ ప్రయాణం చేసేటప్పుడు, ఇంకా అలాంటి సందర్భాల్లో వాళ్లు అనుకోకుండా కలిసినవాళ్లకు రాజ్య సందేశాన్ని అందించగలుగుతున్నారు. చాలాసార్లు, వాళ్లు ఒక యథార్థ హృదయం కలిగిన వ్యక్తిని కలవడం అనేది అనుకోకుండా జరిగేది కాదు. దీన్ని మనం అర్థం చేసుకోగలం, ఎందుకంటే “ప్రతీ దేశానికి, తెగకు, భాషకు, జాతికి” ఈ సందేశం అందేలా ప్రకటనాపనిలో దేవదూతలే వాళ్లను నడిపిస్తున్నారని బైబిలు స్పష్టంగా తెలియజేస్తుంది. (ప్రక. 14:6) ప్రకటనా పనిలో దేవదూతల నిర్దేశం ఉంటుందని ముందే యేసు ఖచ్ఛితంగా చెప్పాడు. ఆయన చెప్పిన గోధుమలు, గురుగులు ఉదాహరణలో, కోతకాలంలో అంటే ఈ వ్యవస్థ ముగింపులో “కోత కోసేవాళ్లు దేవదూతలు” అని చెప్పాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు: “ఆ దూతలు ‘ఇతరులు పాపం చేయడానికి కారణమయ్యేవాళ్లను, చెడు పనులు చేసేవాళ్లను ఆయన రాజ్యంలో నుండి ఏరేస్తారు.’” (మత్త. 13:37-41) అదే సమయంలో, ఆ దేవదూతలు రాజ్యానికి అర్హులైన పరలోక వారసుల్ని, ఆ తర్వాత ‘వేరే గొర్రెల్లోని’ ‘గొప్పసమూహాన్ని’ సమకూరుస్తారు. వీళ్లను యెహోవా తన సంస్థలోకి ఆకర్షించాలని అనుకుంటున్నాడు.—ప్రక. 7:9; యోహా 6:44, 65; 10:16.

చదవాల్సిన బైబిలు భాగం

(అపొస్తలుల కార్యాలు 6:1-15) ఆ రోజుల్లో శిష్యుల సంఖ్య పెరుగుతున్నప్పుడు, గ్రీకు భాష మాట్లాడే యూదులు హీబ్రూ భాష మాట్లాడే యూదుల మీద ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే, ప్రతీరోజు ఆహారం పంచిపెడుతున్నప్పుడు, గ్రీకు భాష మాట్లాడే విధవరాళ్లు నిర్లక్ష్యానికి గురౌతున్నారు. 2 కాబట్టి పన్నెండుమంది అపొస్తలులు శిష్యులందర్నీ పిలిచి ఇలా అన్నారు: “ఆహారం పంచిపెట్టడం కోసం మేము దేవుని వాక్యాన్ని బోధించే పనిని ఆపడం సరైనది కాదు. 3 కాబట్టి సోదరులారా, మీ మధ్య మంచి పేరున్న, పవిత్రశక్తితో తెలివితో నిండిన ఏడుగురు పురుషుల్ని మీరే ఎంచుకోండి. అప్పుడు మేము వాళ్లను ఈ అవసరమైన పని మీద నియమిస్తాం. 4 మేము మాత్రం ప్రార్థించడానికి, వాక్యాన్ని బోధించడానికి మా పూర్తి సమయాన్ని, శక్తిని వెచ్చిస్తాం.” 5 వాళ్లు చెప్పిన మాట శిష్యులందరికీ నచ్చింది. కాబట్టి వాళ్లు విశ్వాసంతో, పవిత్రశక్తితో నిండిన స్తెఫనును, అలాగే ఫిలిప్పును, ప్రొకొరును, నీకానోరును, తీమోనును, పర్మెనాసును, అంతియొకయకు చెందిన నీకొలాసును ఎంచుకున్నారు. ఈ నీకొలాసు యూదుడిగా మారిన అన్యుడు. 6  శిష్యులు వీళ్లను అపొస్తలుల దగ్గరికి తీసుకొచ్చారు. అపొస్తలులు ప్రార్థన చేసి, వాళ్ల మీద చేతులు ఉంచారు. 7 దానివల్ల దేవుని వాక్యం వ్యాప్తిచెందుతూ వచ్చింది. యెరూషలేములో శిష్యుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉంది. యాజకుల్లో కూడా చాలామంది విశ్వాసులయ్యారు. 8 స్తెఫను దేవుని అనుగ్రహంతో, శక్తితో నిండిపోయి ప్రజల మధ్య గొప్ప అద్భుతాల్ని, సూచనల్ని చేస్తూ ఉన్నాడు. 9 కానీ స్వతంత్రుల సభామందిరానికి చెందిన కొంతమంది; కురేనీయులు, అలెక్సంద్రియులు కొంతమంది; కిలికియ, ఆసియా నుండి వచ్చిన కొంతమంది ముందుకొచ్చి స్తెఫనుతో వాదనకు దిగారు. 10 అయితే స్తెఫను తెలివితో, పవిత్రశక్తితో మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్లు అతని ముందు నిలవలేకపోయారు. 11 అప్పుడు వాళ్లు, “ఇతను మోషేను, దేవుణ్ణి దూషిస్తూ మాట్లాడడం మేము విన్నాం” అనే మాట ప్రజల్లో వ్యాప్తి చేయమని కొంతమందిని ఉసిగొల్పారు. 12 వాళ్లు ప్రజల్ని, పెద్దల్ని, శాస్త్రుల్ని కూడా రెచ్చగొట్టారు. వాళ్లు హఠాత్తుగా అతని మీదికి వచ్చి, బలవంతంగా అతన్ని పట్టుకొని, మహాసభకు తీసుకెళ్లారు. 13 వాళ్లు అబద్ధ సాక్షుల్ని ముందుకు తీసుకొచ్చారు, ఆ సాక్షులు ఇలా చెప్పారు: “ఇతను దేవుని ఆలయానికి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఆపట్లేదు. 14 ఉదాహరణకు, నజరేయుడైన యేసు ఈ ఆలయాన్ని పడగొడతాడని, మోషే మనకిచ్చిన ఆచారాలను ఆయన మారుస్తాడని ఇతను చెప్పడం మేము విన్నాం.” 15 మహాసభలో కూర్చున్న వాళ్లందరూ అతని ముఖాన్ని చూసినప్పుడు, అతని ముఖం వాళ్లకు దేవదూత ముఖంలా కనిపించింది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి