క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్ రెఫరెన్సులు
డిసెంబరు 2-8
దేవుని వాక్యంలో ఉన్న సంపద|ప్రకటన 7-9
“ఎవ్వరూ లెక్కపెట్టలేని ఒక గొప్పసమూహం యెహోవా ఆశీర్వాదం పొందింది”
(ప్రకటన 7:9) ఆ తర్వాత నేను చూసినప్పుడు, ఇదిగో! ఏ మనిషీ లెక్కపెట్టలేని ఒక గొప్పసమూహం కనిపించింది. వాళ్లు అన్ని దేశాల నుండి, గోత్రాల నుండి, జాతుల నుండి, భాషల నుండి వచ్చారు. వాళ్లు తెల్లని వస్త్రాలు వేసుకొని ఆ సింహాసనం ముందు, గొర్రెపిల్ల ముందు నిలబడి ఉన్నారు. వాళ్ల చేతుల్లో ఖర్జూర మట్టలు ఉన్నాయి.
it-1-E 997వ పేజీ, 1వ పేరా
గొప్పసమూహం
ఇప్పుడు ప్రశ్న ఏంటంటే: ‘గొప్పసమూహానికి’ చెందినవాళ్లు రక్షించబడి భూమ్మీద శాశ్వతకాలం జీవించే ప్రజలైతే, వాళ్లు దేవుని ‘సింహాసనం ముందు, గొర్రెపిల్ల ముందు నిలబడడం’ ఎలా సాధ్యమౌతుంది? (ప్రక 7:9) కొన్నిసార్లు బైబిలు, ‘నిలబడడం’ అనే మాటను ఒక వ్యక్తి లేదా గుంపు ఎవరి సన్నిధిలో అయితే నిలబడి ఉంటారో అతని అనుగ్రహం లేదా ఆమోదం పొందడాన్ని సూచించడానికి ఉపయోగిస్తుంది. (కీర్త 1:5; 5:5; సామె 22:29; లూకా 1:19) నిజానికి ప్రకటన 6వ అధ్యాయంలో, “భూరాజులు, ఉన్నతాధికారులు, సైనికాధికారులు, ధనవంతులు, బలవంతులు, ప్రతీ దాసుడు, ప్రతీ స్వతంత్రుడు” ‘సింహాసనం మీద కూర్చున్న దేవుని నుండి, గొర్రెపిల్ల ఆగ్రహం నుండి దాక్కుంటున్నట్టు’ వర్ణించబడ్డారు. ‘ఎందుకంటే ఆగ్రహం చూపించే మహారోజు వచ్చేసింది, దాన్ని ఎవరు తట్టుకోగలరు?’ (ప్రక 6:15-17; లూకా 21:36 పోల్చండి.) కాబట్టి, ఆగ్రహం చూపించే రోజున రక్షించబడి, దేవుని అలాగే గొర్రెపిల్ల ముందు ‘నిలబడే,’ అంటే వాళ్ల ఆమోదం పొందే ప్రజలే “గొప్పసమూహం” అని అర్థమౌతుంది.
(ప్రకటన 7:14) వెంటనే నేను అతనితో, “నా ప్రభువా, అది నీకే తెలుసు” అన్నాను. అప్పుడతను నాతో ఇలా అన్నాడు: “వీళ్లు మహాశ్రమను దాటి వచ్చేవాళ్లు. వీళ్లు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కొని వాటిని తెల్లగా చేసుకున్నారు.
it-2-E 1127వ పేజీ, 4వ పేరా
శ్రమ
యెరూషలేము నాశనమైన దాదాపు మూడు దశాబ్దాల తర్వాత, అపొస్తలుడైన యోహాను అన్ని దేశాల నుండి, గోత్రాల నుండి, జాతుల నుండి, భాషల నుండి వచ్చే గొప్పసమూహాన్ని ఉద్దేశించి ఇలా అన్నాడు: “వీళ్లు మహాశ్రమను దాటి వచ్చేవాళ్లు.” (ప్రక 7:13, 14) ఒక గొప్పసమూహం ‘మహాశ్రమను దాటి’ వస్తుంది అనే వాస్తవాన్ని బట్టి, వాళ్లు ఆ శ్రమను తట్టుకుని సజీవంగా బయటికి వస్తారని చెప్పవచ్చు. ఈ విషయానికి మరింత బలం చేకూర్చే మాటలు అపొస్తలుల కార్యాలు 7:9, 10 వచనాల్లో ఉన్నాయి. అక్కడిలా ఉంది: “దేవుడు అతనికి [యోసేపుకు] తోడుగా ఉండి అతనికి వచ్చిన శ్రమలన్నిటిలో నుండి అతన్ని కాపాడాడు.” (అపొ 7:9, 10) యోసేపు శ్రమలన్నిటిలో నుండి కాపాడబడ్డాడంటే, ఆయన శ్రమల్ని తట్టుకోవడానికి కావాల్సిన శక్తి పొందడమే కాదు, వాటిని దాటి బయటికి వచ్చాడని కూడా చెప్పవచ్చు.
(ప్రకటన 7:15-17) అందుకే వీళ్లు దేవుని సింహాసనం ముందు ఉన్నారు, దేవుని ఆలయంలో రాత్రింబగళ్లు ఆయనకు పవిత్రసేవ చేస్తున్నారు. సింహాసనం మీద కూర్చున్న దేవుడు వాళ్లను కాపాడతాడు. 16 ఇప్పటినుండి వాళ్లకు ఆకలి వేయదు, దాహం వేయదు; ఎండదెబ్బ గానీ వడగాలి గానీ వాళ్లకు తగలదు. 17 ఎందుకంటే సింహాసనం పక్కన ఉన్న గొర్రెపిల్ల వాళ్లను కాపరిలా చూసుకుంటూ, జీవజలాల ఊటల దగ్గరకు నడిపిస్తాడు. దేవుడు వాళ్ల కళ్ల నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును తుడిచేస్తాడు.”
it-1-E 996-997
గొప్పసమూహం
వాళ్లను గుర్తించడం. ‘గొప్పసమూహాన్ని’ గుర్తించడానికి, ప్రకటన 7వ అధ్యాయంలో వాళ్ల గురించి ఉన్న వర్ణన అలాగే అలాంటి ఇతర వృత్తాంతాలు సహాయం చేస్తాయి. దేవుడు గొప్పసమూహంలోని ప్రజలను ‘కాపాడుతున్నట్టు,’ ‘వాళ్లను జీవజలాల ఊటల దగ్గరకు నడిపిస్తున్నట్టు,’ ‘వాళ్ల కళ్ల నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును తుడిచేస్తున్నట్టు’ ప్రకటన 7:15-17 వచనాలు వర్ణిస్తున్నాయి. అలాంటి మాటలే ప్రకటన 21:2-4 వచనాల్లో ఉన్నాయి. ‘దేవుని నివాసం మనుషులతో ఉంటుందని,’ ‘వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును తుడిచేస్తాడని,’ ‘మరణం ఇక ఉండదని’ ఆ వచనాల్లో గమనిస్తాం. ఆ దర్శనంలో కనిపించిన విషయాలు భూమ్మీదున్న మనుషులకు సంబంధించినవి. అంతేగానీ, ‘కొత్త యెరూషలేము దిగివచ్చిన’ పరలోకంలో ఉన్నవాళ్లకు సంబంధించినవి కాదు.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
(ప్రకటన 7:1) ఆ తర్వాత, నలుగురు దేవదూతలు భూమి నాలుగు మూలల్లో నిలబడి ఉండడం నేను చూశాను. భూమ్మీద గానీ, సముద్రంమీద గానీ, ఏ చెట్టుమీద గానీ ఏ గాలీ వీచకుండా వాళ్లు భూమి నాలుగు గాలులను గట్టిగా పట్టుకొని ఉన్నారు.
దేవుని ఇశ్రాయేలును ముద్రించుట
4 నిశ్చయంగా, యీ నలుగురు దూతలు, నిర్ణయకాలం వరకు తీర్పు జరగకుండ నిలిపివేయడానికి యెహోవా ఉపయోగించుకునే నాలుగు దూతల గుంపులను సూచిస్తున్నారు. దూతలు దేవుని ఉగ్రతయను వాయువులను తూర్పుపడమర, ఉత్తరదక్షిణాల నుండి ఒక్కసారి విడుదలచేస్తే కలుగబోవు నాశనం ఘోరంగా ఉంటుంది. యెహోవా ప్రాచీన ఏలామును చెదరగొట్టడానికి నలుదిశలనుండి నాలుగు దిక్కుల వాయువులను ఉపయోగించిన దాన్నే యిది విస్తారమైన భావంలో సూచిస్తుంది. (యిర్మీయా 49:36-38) యెహోవా అమ్మోనీయులను నిర్మూలించడానికి ఉపయోగించిన “సుడిగాలి” కంటె వినాశకరమైన ప్రచండ తుఫాను గాలిలా ఉంటుంది. (ఆమోసు 1:13-15) యెహోవా ఉగ్రత దినమున ఆయన తన సర్వాధిపత్యాన్ని శాశ్వతంగా నిరూపించుకున్నప్పుడు భూమ్మీద సాతాను సంస్థలో ఏదియు నిలువజాలదు.—కీర్తన 83:15, 18; యెషయా 29:5, 6.
(ప్రకటన 9:11) అగాధపు దూత వాటికి రాజు. హీబ్రూ భాషలో ఆయన పేరు అబద్దోను. అయితే, గ్రీకు భాషలో ఆయన పేరు అపొల్లుయోను.
it-1-E 12వ పేజీ
అబద్దోను
అగాధపు దూత అయిన అబద్దోను ఎవరు?
‘అగాధపు దూత పేరు అబద్దోను’ అని ప్రకటన 9:11 చెప్తుంది. గ్రీకు భాషలో అతని పేరు అపొల్లుయోను, అంటే “నాశకుడు” అని అర్థం. ఈ వచనంలో ఉన్న విషయాలు రాజైన వెస్పేసియన్, మహమ్మదు, నెపోలియన్ గురించి ప్రవచిస్తున్నాయి అని, అబద్దోను సాతానుకు మద్దతిచ్చే దూత అని రుజువు చేయడానికి 19వ శతాబ్దంలో ప్రయత్నాలు జరిగాయి. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రకటన 20:1-3 వచనాల ప్రకారం అగాధపు తాళంచెవి ఉన్న దూత పరలోకం నుండి దిగివచ్చిన దేవుని ప్రతినిధి. పైగా ఆ దూత సాతానుకు మద్దతివ్వడం లేదుగానీ, సాతానును బంధించి అగాధంలో పడేశాడు. ప్రకటన 9:11వ వచనం గురించి ది ఇంటర్‌ప్రిటర్స్ బైబిల్ ఇలా వ్యాఖ్యానించింది: “అబద్దోను దేవుని ఆజ్ఞ పాటిస్తూ నాశనం చేసే దేవుని దూత, అంతేగానీ సాతాను దూత కాదు.”
ఇప్పుడు పరిశీలించిన హీబ్రూ లేఖనాలు బట్టి, అవద్దోన్ అనేది షియోల్ అలాగే మరణం లాంటిదని స్పష్టమైంది. ప్రకటన 1:18 వచనంలో క్రీస్తు యేసు అన్న ఈ మాటలు గమనిస్తాం: ‘నేను యుగయుగాలు జీవిస్తూనే ఉన్నాను. నా దగ్గర మరణపు తాళంచెవులు, సమాధి తాళంచెవులు ఉన్నాయి.’ యేసుకు అగాధం పై ఎంత శక్తి ఉందో లూకా 8:31 తెలియజేస్తుంది. ఆయనకు నాశనం చేసే శక్తి, ఆఖరికి సాతానును కూడా నాశనం చేసే శక్తి ఉందని హెబ్రీయులు 2:14 స్పష్టం చేస్తుంది. యేసు, “మరణాన్ని కలుగజేసే సామర్థ్యం ఉన్నవాణ్ణి, అంటే అపవాదిని తన మరణం ద్వారా నాశనం చేయడానికి” రక్తమాంసాలుగల మనిషి అయ్యాడని ఆ వచనం చెప్తుంది. ప్రకటన 19:11-16 వచనాల్లో, దేవుడు నియమించిన నాశకుడిగా లేదా తీర్పు అమలుచేసే వ్యక్తిగా యేసు పిలవబడ్డాడు.—అపొల్లుయోను చూడండి.
డిసెంబరు 9-15
దేవుని వాక్యంలో ఉన్న సంపద|ప్రకటన 10-12
“‘ఇద్దరు సాక్షులు’ చంపబడ్డారు, తర్వాత వాళ్లు తిరిగి బ్రతికించబడ్డారు”
(ప్రకటన 11:3) నేను నా ఇద్దరు సాక్షుల్ని పంపిస్తాను, వాళ్లు గోనెపట్ట వేసుకొని 1,260 రోజులు ప్రవచిస్తారు.”
పాఠకుల ప్రశ్నలు
ప్రకటన 11వ అధ్యాయం ప్రస్తావించిన ఇద్దరు సాక్షులు ఎవరు?
ఇద్దరు సాక్షులు 1,260 రోజులపాటు ప్రవచిస్తారని ప్రకటన 11:3 చెబుతుంది. అప్పుడు క్రూరమృగము ‘వారితో యుద్ధం చేసి చంపేస్తుందని’ ఆ వృత్తాంతం తెలియజేస్తుంది. అయితే, చూసేవాళ్లకు ఎంతో ఆశ్చర్యం కలిగేలా, ‘మూడున్నర దినముల’ తర్వాత ఆ ఇద్దరు సాక్షులు మళ్లీ బ్రతుకుతారు.—ప్రక. 11:7, 11.
ఆ ఇద్దరు సాక్షులు ఎవరు? ఆ వృత్తాంతంలోని వివరాలను బట్టి ఆ ఇద్దరు సాక్షులు ఎవరో గుర్తుపట్టవచ్చు. మొదటిగా, వాళ్లు “భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు” అని బైబిలు మనకు చెబుతుంది. (ప్రక. 11:4) ఆ మాటల్ని చూస్తే జెకర్యా ప్రవచనంలోని దీపస్తంభం, రెండు ఒలీవచెట్లు మనకు గుర్తొస్తాయి. ఆ ఒలీవచెట్లు ‘సర్వలోకనాధుడగు యెహోవాయొద్ద నిలువబడిన’ ఇద్దరు అభిషిక్తులను అంటే అధిపతియైన జెరుబ్బాబెలును, ప్రధాన యాజకుడైన యెహోషువను సూచిస్తున్నాయి. (జెక. 4:1-3, 14, అధస్సూచి.) రెండవదిగా, ఒకప్పుడు మోషే, ఏలీయాలు చేసినలాంటి సూచకక్రియలే వాళ్లిద్దరూ చేస్తున్నారని ఆ వృత్తాంతం చెబుతుంది.—ప్రకటన 11:5, 6 వచనాల్ని సంఖ్యాకాండము 16:1-7, 28-35; 1 రాజులు 17:1; 18:41-45 వచనాలతో పోల్చండి.
ఆ రెండు వృత్తాంతాల మధ్య ఎలాంటి పోలిక ఉంది? ప్రతీ వృత్తాంతం, తీవ్రమైన పరీక్షల సమయంలో నాయకత్వం వహించిన దేవుని అభిషిక్తుల గురించి మాట్లాడుతుంది. కాబట్టి, 1914లో దేవుని రాజ్యం పరలోకంలో స్థాపించబడినప్పుడు, నాయకత్వం వహించిన అభిషిక్త సహోదరులు “గోనెపట్ట” ధరించి మూడున్నర సంవత్సరాలపాటు ప్రకటించినప్పుడు ప్రకటన 11వ అధ్యాయంలోని మాటలు నెరవేరాయి.
ఆ ప్రకటనా పని ముగిశాక వాళ్లను కొద్ది కాలంపాటు అంటే సూచనార్థకమైన మూడున్నర రోజుల పాటు జైల్లో ఉంచారు. అలా ఆ అభిషిక్తులు సూచనార్థకంగా చనిపోయారు. దేవుని శత్రువుల దృష్టిలో, వాళ్లు చేస్తున్న పని ఆగిపోయింది. దాంతో ఆ శత్రువులు సంతోషించారు.—ప్రక. 11:8-10.
అయితే ఆ ప్రవచనంలో ఉన్నట్లుగా, మూడున్నర రోజుల తర్వాత ఆ ఇద్దరు సాక్షులు మళ్లీ బ్రతికారు. ఆ అభిషిక్తులు జైలు నుండి విడుదలవ్వడంతోపాటు, వాళ్లలో నమ్మకంగా ఉన్నవాళ్లు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడిచ్చిన ఒక ప్రత్యేకమైన నియామకం పొందారు. అంత్యదినాల్లో దేవుని ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి 1919లో యేసు నియమించిన ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునిలో’ ఆ అభిషిక్తులు ఉన్నారు.—మత్త. 24:45-47; ప్రక. 11:11, 12.
ఆసక్తికరంగా, ప్రకటన 11:1, 2 వచనాలు ఆ సంఘటనలను ఆధ్యాత్మిక ఆలయాన్ని కొలిచే సమయంతో ముడిపెడుతున్నాయి. మలాకీ 3వ అధ్యాయం కూడా ఆధ్యాత్మిక ఆలయ తనిఖీ గురించి, ఆ తర్వాత జరిగే శుద్ధీకరణ సమయం గురించి మాట్లాడుతుంది. (మలా. 3:1-4) ఈ తనిఖీ, అలాగే శుద్ధీకరణ ఎంత కాలం కొనసాగింది? అది 1914 నుండి 1919 తొలి భాగం వరకు కొనసాగింది. ఆ కాలనిడివిలో ప్రకటన 11వ అధ్యాయం ప్రస్తావించిన 1,260 రోజులు (42 నెలలు), అలాగే సూచనార్థకమైన మూడున్నర రోజులు ఉన్నాయి.
యెహోవా ఆ ఆధ్యాత్మిక శుద్ధీకరణను ఏర్పాటు చేసి, సత్క్రియలు చేసేలా ఓ ప్రత్యేకమైన ప్రజల్ని శుద్ధీకరించినందుకు మనమెంత సంతోషిస్తున్నామో! (తీతు 2:14) దానితోపాటు ఆ పరీక్షల సమయంలో నాయకత్వం వహించి, సూచనార్థకమైన ఇద్దరు సాక్షులుగా సేవచేసిన నమ్మకమైన అభిషిక్తులు ఉంచిన ఆదర్శాన్ని విలువైనదిగా ఎంచుతాం.
(ప్రకటన 11:7) ఆ ఇద్దరు సాక్షులు సాక్ష్యమివ్వడం పూర్తయినప్పుడు, అగాధం నుండి పైకి వచ్చిన క్రూరమృగం వాళ్లతో యుద్ధం చేసి వాళ్లను జయిస్తుంది, వాళ్లను చంపుతుంది.
(ప్రకటన 11:11) ఆ మూడున్నర రోజుల తర్వాత, దేవుని దగ్గర నుండి జీవశక్తి వచ్చి ఆ ఇద్దరిలోకి ప్రవేశించింది. దాంతో వాళ్లు లేచి నిలబడ్డారు, వాళ్లను చూసిన ప్రజలు ఎంతో భయపడ్డారు.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
(ప్రకటన 10:9, 10) నేను ఆ దేవదూత దగ్గరకు వెళ్లి, ఆ చిన్న గ్రంథపు చుట్టను నాకు ఇవ్వమని అడిగాను. అప్పుడు ఆ దేవదూత నాతో ఇలా అన్నాడు: “దీన్ని తీసుకొని తిను, అది నీ కడుపుకు చేదుగా ఉంటుంది, కానీ నీ నోటికి మాత్రం తేనెలా తియ్యగా ఉంటుంది.” 10 నేను ఆ దేవదూత చేతిలో నుండి ఆ చిన్న గ్రంథపు చుట్టను తీసుకొని తిన్నాను. అది నా నోటికి తేనెలా తియ్యగా ఉంది, కానీ దాన్ని తిన్నప్పుడు నా కడుపు చేదు అయింది.
it-2-E 880-881
గ్రంథపు చుట్ట, చుట్ట
సూచనార్థకంగా ఉపయోగించడం. బైబిలు చాలా సందర్భాల్లో “గ్రంథపు చుట్ట” అనే పదాన్ని సూచనార్థక భావంలో ఉపయోగించింది. యెహెజ్కేలు ఒక సందర్భంలో, రెండు వైపులా రాసివున్న గ్రంథపు చుట్టను చూశాడు. జెకర్యాకు కూడా అలాంటి సందర్భం ఎదురైంది. సాధారణంగా గ్రంథపు చుట్టకు ఒకవైపున మాత్రమే రాసేవాళ్లు. కానీ చుట్టకు రెండు వైపులా తీర్పులు రాసివుండడం, అవి ప్రాముఖ్యమైనవని, తీవ్రమైనవని, గంభీరమైనవని తెలియజేస్తుంది. (యెహె 2:9–3:3; జెక 5:1-4) ప్రకటన గ్రంథంలో ఉన్న దర్శనంలో, సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి కుడిచేతిలో ఏడు ముద్రలతో ముద్రించబడి ఉన్న ఒక గ్రంథపు చుట్ట ఉంది. గొర్రెపిల్ల ఆ ముద్రల్ని విప్పే వరకు అందులో ఉన్న సందేశం దాచి ఉంచబడింది. (ప్రక 5:1, 12; 6:1, 12-14) ఆ దర్శనంలో కాసేపటి తర్వాత, యోహానుకు ఒక గ్రంథపు చుట్ట ఇవ్వబడింది. దాన్ని తినాలని ఆయన ఆజ్ఞాపించబడ్డాడు. అది ఆయన నోటికి తియ్యగా ఉంది, కానీ కడుపుకు చేదుగా అనిపించింది. అయితే ఆ చుట్ట తెరవబడి ఉండడం, అందులోని సందేశాన్ని అర్థంచేసుకోవాలని సూచిస్తుంది. అది “తియ్యగా ఉంది” అంటే ఏంటి? సందేశం ఉన్న ఒక గ్రంథపు చుట్టను యోహాను పొందడాన్ని అది సూచిస్తుంది. “చేదుగా” ఉండడం అంటే ఏంటి? అందులోని కఠినమైన విషయాల్ని ప్రవచించాలని ఆయన ఆజ్ఞాపించబడ్డాడు, ఆ విధంగా అది ఆయన కడుపుకు “చేదుగా” ఉంది. (ప్రక 10:1-11) ఒక సందర్భంలో యెహెజ్కేలుకు కూడా ఒక గ్రంథపు చుట్ట ఇవ్వబడింది, అందులో “మహా విలాపము,” “మనోదుఃఖము,” “రోదన” ఉన్నాయి.—యెహె 2:10.
(ప్రకటన 12:1-5) ఆ తర్వాత పరలోకంలో ఒక గొప్ప సూచన కనిపించింది. ఒక స్త్రీ సూర్యుణ్ణి ధరించుకొని ఉంది. ఆమె పాదాల కింద చంద్రుడు ఉన్నాడు, ఆమె తల మీద 12 నక్షత్రాల కిరీటం ఉంది. 2 ఆమె గర్భవతి. బిడ్డను కనే సమయం దగ్గరపడడంతో ఆమె పురిటినొప్పుల వల్ల కేకలు పెడుతోంది. 3 పరలోకంలో ఇంకొక సూచన కనిపించింది. ఇదిగో! ఏడు తలలు, పది కొమ్ములు ఉన్న ఎర్రని మహాసర్పం కనిపించింది. దాని తలల మీద ఏడు కిరీటాలు ఉన్నాయి. 4 దాని తోక ఆకాశ నక్షత్రాల్లో మూడో భాగాన్ని ఈడ్చి భూమ్మీద పడేసింది. ఆ స్త్రీ బిడ్డను కనగానే ఆ బిడ్డను మింగేయాలని మహాసర్పం ఆమె ముందు అలాగే నిలబడి ఉంది. 5 ఆమె ఒక మగబిడ్డను కన్నది. ఆయన ఇనుపదండంతో అన్ని దేశాల్ని పరిపాలిస్తాడు. వెంటనే ఆ బిడ్డను సింహాసనం మీద కూర్చొని ఉన్న దేవుని దగ్గరకు తీసుకువెళ్లారు.
it-2-E 187వ పేజీ, 7-9 పేరాలు
పురిటినొప్పులు
అపొస్తలుడైన యోహాను చూసిన దర్శనంలో, ఒక పరలోక స్త్రీ ‘బిడ్డను కనే సమయం దగ్గరపడడంతో ఆమె పురిటినొప్పుల వల్ల’ కేకలు పెట్టడం కనిపించింది. ఆ స్త్రీ “మగబిడ్డను కన్నది, ఆయన ఇనుపదండంతో అన్ని దేశాల్ని పరిపాలిస్తాడు.” ఆ బిడ్డను మింగేయాలని మహాసర్పం ప్రయత్నించింది. కానీ ఆ బిడ్డను “సింహాసనం మీద కూర్చొని ఉన్న దేవుని దగ్గరకు తీసుకువెళ్లారు.” (ప్రక 12:1, 2, 4-6) దేవుడు ఆ బిడ్డను తీసుకోవడం, అతన్ని తన సొంత కుమారునిగా స్వీకరించడానికి సూచనగా ఉంది. ప్రాచీన కాలంలో, అప్పుడే పుట్టిన చంటిబిడ్డను తండ్రి దగ్గరకు తీసుకెళ్లి అతని ముందు ఉంచడం, అతను ఆ బిడ్డను అంగీకరించడం ఆనవాయితీ. (పుట్టుక చూడండి.) దీన్నిబట్టి, ఆ “స్త్రీ” దేవుని భార్యగా పిలవబడిన “పైనున్న యెరూషలేము” అని, ఆమె క్రీస్తుకు, ఆయన ఆధ్యాత్మిక సహోదరులకు “తల్లి” అని అర్థమౌతుంది.
దేవుని పరలోక “స్త్రీ” పరిపూర్ణురాలు. కాబట్టి ఆమె అనుభవించిన పురిటినొప్పులు అక్షరార్థమైనవి కావు. ఆ “స్త్రీ” పురిటినొప్పులు అనుభవించడం, తాను ప్రసవించే సమయం దగ్గరపడిందని, త్వరలో బిడ్డ పుడతాడని ఆమె గ్రహించడానికి సూచనగా ఉంది.—ప్రక 12:2.
ఆ “మగబిడ్డ” ఏం చేస్తాడు? “ఆయన ఇనుపదండంతో అన్ని దేశాల్ని పరిపాలిస్తాడు.” దేవుడు నియమించిన రాజైన మెస్సీయ అలా పరిపాలిస్తాడని కీర్తన 2:6-9 వచనాలు ముందుగానే ప్రవచించాయి. అయితే యోహాను ఈ దర్శనం చూసే సమయానికి క్రీస్తు భూమ్మీద పుట్టి, చనిపోయి, పునరుత్థానం అయ్యి చాలాకాలం గడిచిపోయింది. కాబట్టి ఈ దర్శనం దేవుని కుమారుడు స్థాపించే అంటే, పునరుత్థానమై ‘దేవుని కుడి పక్కన కూర్చుని, తన శత్రువులు తన పాదపీఠంగా చేయబడేంతవరకు ఎదురుచూసిన’ యేసుక్రీస్తు స్థాపించే మెస్సీయ రాజ్యానికి సంబంధించినది. మరో మాటలో చెప్పాలంటే, ఈ దర్శనం మెస్సీయ రాజ్యం పుట్టుకకు సంబంధించినది.—హెబ్రీ 10:12, 13; కీర్త 110:1; ప్రక 12:10.
డిసెంబరు 16-22
దేవుని వాక్యంలో ఉన్న సంపద|ప్రకటన 13-16
“భయంకరమైన క్రూరమృగాలకు భయపడకండి”
(ప్రకటన 13:1, 2) అది సముద్రపు ఇసుక మీద కదలకుండా నిలబడింది. అప్పుడు పది కొమ్ములు, ఏడు తలలు ఉన్న ఒక క్రూరమృగం సముద్రంలో నుండి పైకి రావడం చూశాను. దాని కొమ్ముల మీద పది కిరీటాలు ఉన్నాయి. దాని తలల మీద దేవుణ్ణి దూషించే పేర్లు ఉన్నాయి. 2 నేను చూసిన ఆ క్రూరమృగం చిరుతపులిలా ఉంది. దాని పాదాలు మాత్రం ఎలుగుబంటి పాదాల్లా ఉన్నాయి. దాని నోరు సింహం నోరులా ఉంది. ఆ క్రూరమృగం తన శక్తిని, సింహాసనాన్ని, గొప్ప అధికారాన్ని ఆ మహాసర్పం నుండి పొందింది.
యెహోవా ‘మర్మాలను బయలుపర్చే’ దేవుడు
6 పునరుత్థానం చేయబడిన యేసు సా.శ. మొదటి శతాబ్దం ముగింపులో అపొస్తలుడైన యోహానుకు ఆశ్చర్యం కలిగించే కొన్ని దర్శనాలను ఇచ్చాడు. (ప్రక. 1:1) ఒక దర్శనంలో, ఘటసర్పంగా వర్ణించబడిన అపవాది సముద్ర తీరాన నిలబడి ఉండడాన్ని యోహాను చూశాడు. (ప్రకటన 12:17–13:1, 2 చదవండి.) అంతేకాక, ఆ సముద్రంలో నుండే ఒక విచిత్రమైన మృగం పైకి వచ్చినట్లు, అది అపవాది నుండి గొప్ప అధికారాన్ని పొందినట్లు కూడా యోహాను చూశాడు. ప్రకటన 13:1లో వర్ణించబడిన మృగపు ప్రతిమయైన ఎర్రని క్రూర మృగానికి ఉన్న ఏడు తలలు ‘ఏడుగురు రాజుల్ని’ లేక ఏడు ప్రభుత్వాల్ని సూచిస్తున్నాయని ఒక దేవదూత ఆ తర్వాత యోహానుకు తెలియజేశాడు. (ప్రక. 13:14, 15; 17:3, 9, 10) యోహాను ఆ మాటలు రాసే సమయానికి ఐదుగురు రాజులు కూలిపోయారు, ఒకరు రాజ్యాధికారంలో ఉన్నారు, చివరి రాజు “ఇంకను రాలేదు.” ఆ రాజ్యాల్ని లేక ప్రపంచాధిపత్యాల్ని ఎలా గుర్తించవచ్చు? ఇప్పుడు మనం, ప్రకటన గ్రంథంలో వర్ణించబడిన మృగానికి ఉన్న ఒక్కొక్క తల గురించి పరిశీలిద్దాం. ఆ రాజ్యాల్లో చాలావాటి గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి దానియేలు రాసిన విషయాలు ఎలా సహాయం చేస్తాయో కూడా చూద్దాం. కొన్ని రాజ్యాల గురించైతే అవి ఉనికిలోకి రావడానికి ఎన్నో శతాబ్దాల క్రితమే దానియేలు రాశాడు.
(ప్రకటన 13:11) తర్వాత ఇంకో క్రూరమృగం భూమిలో నుండి పైకి రావడం చూశాను. దానికి గొర్రెపిల్ల కొమ్ముల లాంటి రెండు కొమ్ములు ఉన్నాయి. అయితే అది ఒక మహాసర్పంలా మాట్లాడడం మొదలుపెట్టింది.
(ప్రకటన 13:15) అంతేకాదు, ఆ మొదటి క్రూరమృగపు ప్రతిమకు ఊపిరి పోసేందుకు ఈ రెండో క్రూరమృగానికి అనుమతి ఇవ్వబడింది. ఆ క్రూరమృగపు ప్రతిమ మాట్లాడాలనీ, దాన్ని ఆరాధించని వాళ్లందర్నీ అది చంపించాలనీ అలా అనుమతి ఇవ్వబడింది.
రెండు భయంకరమైన మృగాలతో పోరాడుట
26 అదేమైయుండొచ్చు? అది ఆంగ్లో-అమెరికన్ ప్రపంచాధిపత్యం—మొదటి క్రూరమృగముయొక్క ఏడవతల వంటిదే గాని ఒక ప్రత్యేక పాత్రను నిర్వహిస్తుంది. దర్శనంలో ఒక ప్రత్యేకమైన మృగముగా వేరుచేయడంవల్ల అది ప్రపంచ రాజకీయ రంగంలో ఒంటరిగా ఎలా పనిచేస్తుందో యింకా స్పష్టంగా తెలుసుకోవడానికి సహాయంచేస్తుంది. ఈ సాదృశ్యమైన రెండు కొమ్ములుగల క్రూరమృగము రెండు సమకాలికమైన, ప్రత్యేకమైన, పరస్పరం సహకరించుకొనే రాజకీయ శక్తులతోకూడినది. “గొఱ్ఱెపిల్ల” కొమ్మువంటి దాని రెండు కొమ్ములు సూచించేదేమంటే అది తననుతాను మృదువైనదిగా, సాధువైనదిగా చేసుకొని, ప్రపంచమంతా దానివైపు చూడగలిగేలా బాగా మెరుగైన ప్రభుత్వంగా కనబర్చుకుంటోంది. అయితే దాని పరిపాలనను అంగీకరించనిచోట్ల, వత్తిడిని, బెదరింపులను, అవసరమైతే దౌర్జన్యాన్ని ఉపయోగించి “ఘటసర్పము వలె” మాటలాడుతుంది. దేవుని గొఱ్ఱెపిల్ల పరిపాలనక్రింది దేవుని రాజ్యమునకు లోబడియుండేలా ప్రోత్సహించే బదులు అది ఆ మహా ఘటసర్పమైన సాతాను, క్రియలను ప్రోత్సహిస్తుంది. అది జాతీయతా భావాన్ని, భేదాల్ని ప్రోత్సహిస్తూ మొదటి క్రూరమృగపు ఆరాధనకు వీటిని తోడుచేసింది.
రెండు భయంకరమైన మృగాలతో పోరాడుట
30 చరిత్రను పరిశీలిస్తే, యీ ప్రతిమ బ్రిటన్, అమెరికా దేశాలు ప్రతిపాదించి, పెంచి పోషించిన సంస్థయని గుర్తిస్తుంది. మొదట అది నానాజాతి సమితియని పిలువబడింది. ఆ పిదప, ప్రకటన 17వ అధ్యాయంలో అది మరో గుర్తుతో కనబడుతుంది, అంటే అదొక ప్రత్యేక ఉనికిని కలిగి, జీవించియున్న, ప్రాణంగల ఎఱ్ఱని మృగమైయున్నది. ఈ అంతర్జాతీయ సంస్థ ‘మాటలాడుతుంది,’ అంటే మానవజాతికి శాంతిభద్రతలను తానే తేగలదని ప్రగల్భాలు పలుకుతుందన్నమాట. అయితే నిజానికది సభ్యదేశాలు పరస్పరం దూషించుకోవడానికి, అవమానపరచుకోవడానికి నిలయమైంది. దాని అధికారానికి లోబడని ప్రజలనుగాని దేశాన్నిగాని బహిష్కరిస్తానని లేక సజీవమరణానికి గురిచేస్తానని బెదిరించింది. దాని ఉద్దేశాలను వ్యతిరేకించే దేశాలను బహిష్కరిస్తానని యింకా బెదిరిస్తూనేవుంది. మహాశ్రమలు ప్రారంభమైనప్పుడు క్రూరమృగంయొక్క యీ ప్రతిమకున్న సైన్యాలనే “కొమ్ములు” వినాశకర పాత్రను నిర్వహిస్తాయి.—ప్రకటన 7:14; 17:8, 16.
31 ఇప్పుడు ఐక్యరాజ్యసమితి అనే సంస్థ రూపంలో కనబడుతున్న క్రూరమృగంయొక్క ప్రతిమ, IIవ ప్రపంచ యుద్ధంద్వారా యిప్పటికే అక్షరార్థంగానే చంపింది. ఉదాహరణకు, ఐక్యరాజ్యసమితి సైన్యాలు ఉత్తరదక్షిణ కొరియాలమధ్య 1950లో జరిగిన యుద్ధంలో పాల్గొన్నాయి. ఐక్యరాజ్యసమితి సేనలు, దక్షిణకొరియా సైన్యంతోకలిసి సుమారు 14,20,000 మంది ఉత్తరకొరియా, చైనావారిని చంపాయి. అదేమాదిరి, 1960 నుండి 1964 వరకు ఐక్యరాజ్యసమితి సైన్యాలు కాంగోలో (ఇప్పుడు జైరీ) చురుకుగా పని చేశాయి. అంతేగాక, పాల్ VI జాన్‌పాల్ II వంటి పోప్‌లతోపాటు ప్రపంచ నాయకులు యీ ప్రతిమ శాంతికొరకు మానవునికున్న చివరి, ఏకైక నిరీక్షణయని గట్టిగా చెబుతూనే వున్నారు. వారనేదేమంటే, మానవసమాజం దాన్ని సేవించకపోతే మానవజాతి సర్వనాశనమౌతుంది. అలావారు ఆ మృగమును వెంబడించక, దాన్ని ఆరాధించక తిరస్కరించే మానవులంతా సాదృశ్యంగా చంపబడేలా చేస్తున్నారు.—ద్వితీయోపదేశకాండము 5:8, 9 పోల్చండి.
(ప్రకటన 13:16, 17) సామాన్యులు-గొప్పవాళ్లు, ధనవంతులు-పేదవాళ్లు, స్వతంత్రులు-దాసులు అందరూ తమ కుడిచేతి మీద గానీ నొసటి మీద గానీ గుర్తు వేయించుకోవాలని అది ప్రజలందర్నీ బలవంతం చేస్తోంది. 17 ఎవరికైనా ఆ గుర్తు లేకపోతే, అంటే ఆ క్రూరమృగం పేరుగానీ దాని పేరుకు సంబంధించిన సంఖ్యగానీ లేకపోతే వాళ్లు కొనలేరు, అమ్మలేరు.
ప్రకటన గ్రంథంలోని ముఖ్యాంశాలు—II
13:16, 17. ‘క్రయ విక్రయాల’ వంటి రోజువారీ పనుల్లో మనకు కష్టాలు ఎదురైనా, క్రూరమృగం మన జీవితాలను లోబరుచుకోవడానికి చేసే ఒత్తిడికి తలొగ్గకుండా ఉండేందుకు జాగ్రత్తపడాలి. ‘క్రూరమృగపు ముద్రను చేతిమీదనైనా నొసటిమీదనైనా’ వేయించుకుంటే మనం చేసే పనులను లేదా మన ఆలోచనలను నియంత్రించేందుకు క్రూరమృగాన్ని అనుమతించినట్లౌతుంది.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
(ప్రకటన 16:13, 14) తర్వాత మహాసర్పం నోటి నుండి, క్రూరమృగం నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల లాంటి మూడు అపవిత్రమైన ప్రేరేపిత సందేశాలు రావడం నేను చూశాను. 14 నిజానికి అవి చెడ్డదూతలు ప్రేరేపించిన సందేశాలు. అవి ఆశ్చర్యకార్యాలు చేస్తాయి. అవి సర్వశక్తిమంతుడైన దేవుని మహారోజున జరిగే యుద్ధం కోసం భూమంతటా ఉన్న రాజుల్ని పోగు చేయడానికి వాళ్ల దగ్గరికి వెళ్తాయి.
ప్రకటన గ్రంథంలోని ముఖ్యాంశాలు—II
16:13-16. భూరాజులు దేవుని కోపమనే ఏడు పాత్రల గురించి ఆలోచించే బదులు యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు దయ్యాలు చేసే ప్రచారాన్ని “అపవిత్రాత్మలు [‘అపవిత్రమైన ప్రేరేపిత మాటలు,’ NW]” సూచిస్తున్నాయి.—మత్త. 24:42, 44.
(ప్రకటన 16:21) తర్వాత ఆకాశం నుండి పెద్దపెద్ద వడగండ్లు ప్రజల మీద పడ్డాయి. వాటిలో ఒక్కో దాని బరువు దాదాపు 20 కిలోలు. ఈ తెగులు చాలా తీవ్రంగా ఉండడంతో ప్రజలు దాన్నిబట్టి దేవుణ్ణి దూషించారు.
‘మీ విడుదల సమీపించింది’!
9 మహాశ్రమల కాలం, “రాజ్య సువార్త” ప్రకటించే సమయం కాదు. ఆ సందేశాన్ని ప్రకటించాల్సిన సమయం అయిపోయింది. బదులుగా, అది “అంతము” వచ్చే సమయం. (మత్త. 24:14) అప్పుడు దేవుని ప్రజలు ధైర్యంగా శక్తివంతమైన తీర్పు సందేశాన్ని ప్రకటిస్తారు. సాతాను దుష్టలోకం త్వరలో నాశనం కాబోతుందన్నదే ఆ సందేశం. ఈ సందేశాన్ని బైబిలు వడగండ్లతో పోలుస్తూ ఇలా చెప్తుంది, “అయిదేసి మణుగుల బరువుగల పెద్దవడగండ్లు ఆకాశమునుండి మనుష్యులమీద పడెను; ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బనుబట్టి దేవుని దూషించిరి.”—ప్రక. 16:21.
డిసెంబరు 23-29
దేవుని వాక్యంలో ఉన్న సంపద|ప్రకటన 17-19
“యుద్ధాలన్నిటినీ అంతం చేసే దేవుని యుద్ధం”
(ప్రకటన 19:11) ఆ తర్వాత, పరలోకం తెరవబడి ఉండడం నేను చూశాను. అప్పుడు ఇదిగో! ఒక తెల్లని గుర్రం కనిపించింది. దానిమీద కూర్చొని ఉన్న వ్యక్తికి నమ్మకమైనవాడు-సత్యవంతుడు అనే పేరు ఉంది. దేవుని నీతి ప్రమాణాల ప్రకారం ఆయన తీర్పుతీరుస్తాడు, యుద్ధం చేస్తాడు.
(ప్రకటన 19:14-16) అంతేకాదు, పరలోక సైన్యాలు తెల్లని గుర్రాల మీద ఆయన్ని అనుసరిస్తున్నాయి. వాళ్లు శుభ్రమైన, తెల్లని, సన్నని నారవస్త్రాలు వేసుకొని ఉన్నారు. 15 దేశాల్ని నాశనం చేయడానికి ఆయన నోటినుండి పదునైన, పొడవాటి ఖడ్గం వస్తోంది. ఆయన ఇనుపదండంతో వాళ్లను పరిపాలిస్తాడు. అంతేకాదు, సర్వశక్తిమంతుడైన దేవుని మహా కోపమనే ద్రాక్షతొట్టిని ఆయన తొక్కుతాడు. 16 రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అనే పేరు ఆయన పైవస్త్రం తొడ భాగం మీద రాసివుంది.
w08 4/1-E 8వ పేజీ, 3-4 పేరాలు
హార్‌మెగిద్దోను—యుద్ధాలన్నిటినీ అంతం చేసే దేవుని యుద్ధం
దుష్ట ప్రజలు పరిపాలకులుగా ఉన్నంత కాలం నీతిమంతులు శాంతిని, భద్రతను ఆనందించలేరు. (సామెతలు 29:2; ప్రసంగి 8:9) నిజం చెప్పాలంటే, అవినీతికి, దుష్టత్వానికి అలవాటుపడిన ప్రజలు దాన్ని ఎప్పటికీ మానుకోలేరు. కాబట్టి దుష్టులు నాశనమైనప్పుడు మాత్రమే భూమ్మీద శాంతి, భద్రత నెలకొంటాయి. ‘దుష్టుడు నీతిమంతుడికి విమోచన క్రయధనం అవుతాడు’ అని సొలొమోను రాశాడు.—సామెతలు 21:18, NW.
న్యాయాధిపతి దేవుడు కాబట్టి, ఆయన దుష్టుల విషయంలో ఇచ్చే ప్రతీ తీర్పు న్యాయంగా ఉంటుందనే నమ్మకంతో మనం ఉండవచ్చు. ‘సర్వలోకానికి తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా’ అని అబ్రాహాము అడిగాడు. యెహోవా ఎప్పుడూ సరైనదే చేస్తాడనే విషయాన్ని అబ్రాహాము గ్రహించాడు! (ఆదికాండము 18:25) ఇంకా, దుష్టులు నాశనమవ్వడం యెహోవాకు సంతోషం ఇవ్వదనే అభయాన్ని బైబిలు మనకు ఇస్తుంది. ఎంత చేసినా వాళ్లు మారకపోతేనే ఆయన వాళ్లను నాశనం చేస్తాడు.—యెహెజ్కేలు 18:32; 2 పేతురు 3:9.
it-1-E 1146వ పేజీ, 1వ పేరా
గుర్రం
అపొస్తలుడైన యోహాను చూసిన సూచనార్థకమైన దర్శనంలో, మహిమాన్వితుడైన యేసుక్రీస్తు తెల్లని గుర్రం మీద ఉన్నాడు. క్రీస్తు వెనకున్న సైన్యం కూడా తెల్లని గుర్రాల మీద ఆయన్ని అనుసరిస్తున్నారు. తన దేవుడు, తండ్రి అయిన యెహోవా తరఫున యేసు శత్రువుల మీద చేసే యుద్ధం నీతియుక్తమైనదని, న్యాయమైనదని సూచించడానికి ఆ దర్శనం ఇవ్వబడింది. (ప్రక 19:11, 14) అంతకుముందు, క్రీస్తు రాజుగా తీసుకునే చర్యను, ఆ తర్వాత వరుసగా వచ్చే విపత్తులను తెలియజేయడానికి వేర్వేరు రౌతులు, గుర్రాలు సూచనగా ఉపయోగించబడ్డాయి.—ప్రక 6:2-8.
(ప్రకటన 19:19, 20) ఆ తర్వాత, గుర్రం మీద కూర్చొనివున్న వ్యక్తితో, ఆయన సైన్యంతో యుద్ధం చేయడానికి క్రూరమృగం, భూమ్మీది రాజులు, వాళ్ల సైన్యాలు సమకూడడం నేను చూశాను. 20 గుర్రం మీద కూర్చున్న వ్యక్తి ఆ క్రూరమృగాన్ని, అబద్ధ ప్రవక్తను పట్టుకున్నాడు. క్రూరమృగం ముందు ఆశ్చర్యకార్యాలు చేసి, క్రూరమృగం గుర్తును వేయించుకున్నవాళ్లనూ దాని ప్రతిమను ఆరాధించేవాళ్లనూ మోసం చేసింది ఈ అబద్ధ ప్రవక్తే. ఆ క్రూరమృగం, అబద్ధ ప్రవక్త ఇంకా బ్రతికి ఉండగానే అగ్నిగంధకాలతో మండుతున్న సరస్సులో పడవేయబడ్డారు.
యుద్ధశూరుడగు రాజు అర్మగిద్దోనులో విజయమొందుచున్నాడు
24 సాతాను సంస్థను సూచిస్తూ సముద్రమునుండి వచ్చిన ఏడుతలలు పదికొమ్ములుగల క్రూరమృగము మరువబడుతుంది, దానితోపాటు అబద్ధప్రవక్తయగు ఏడవప్రపంచ ఆధిపత్యానికి అదే గతిపడుతుంది. (ప్రకటన 13:1, 11-13; 16:13) భూమ్మీద దేవుని ప్రజలకు విరోధంగా యింకనూ ఐక్యంగా పనిచేస్తూ లేక “బ్రతికి”వుంటూనే, వారు “అగ్నిగుండములో” పడవేయబడతారు. ఇది నిజమైన అగ్నిగుండమా? కాదు, క్రూరమృగము, అబద్ధప్రవక్త ఎలా నిజమైన జంతువులుకావో ఇదికూడ అంతే. అయితే అది తిరిగి రానటువంటి, చివరి, పూర్తి నాశనాన్ని సూచిస్తుంది. తర్వాత యిక్కడే మరణం, మృతులలోకం, (హేడీస్ NW) అలాగే అపవాదియు త్రోయబడతారు. (ప్రకటన 20:10, 14) అది నిశ్చయంగా దుష్టులను నిత్యం బాధించే నరకలోకంకాదు, ఎందుకంటే అటువంటి స్థలమును గూర్చిన తలంపంటేనే యెహోవాకు అసహ్యము.—యిర్మీయా 19:5; 32:35; 1 యోహాను 4:8, 16.
(ప్రకటన 19:21) అయితే మిగతావాళ్లు మాత్రం, గుర్రం మీద కూర్చున్న వ్యక్తి నోటి నుండి వచ్చిన పొడవాటి ఖడ్గంతో చంపబడ్డారు. వాళ్ల మాంసాన్ని పక్షులన్నీ కడుపునిండా తిన్నాయి.
యుద్ధశూరుడగు రాజు అర్మగిద్దోనులో విజయమొందుచున్నాడు
25 ప్రభుత్వంలో నేరుగా భాగస్థులుకాకుండా, యీ దుష్టమానవ లోకంలో మార్పుచెందని భాగమైన మిగతావారంతా అలాగే “గుఱ్ఱముమీద కూర్చున్నవాని నోటనుండి వచ్చిన వాడిగల ఖడ్గముచేత చంపబడిరి.” వారు మరణానికి అర్హులని యేసు ప్రకటిస్తాడు. వారి విషయంలో అగ్నిగుండంయొక్క ప్రస్తావన రాలేదు గనుక, వారికి పునరుత్థాన ముంటుందని మనమనుకోవాలా? ఆ కాలంలో యెహోవా యొక్క న్యాయాధిపతిచేత హతులైనవారు పునరుత్థానులౌతారని మనకెక్కడా చెప్పబడలేదు. యేసు తెల్పినట్లు, “గొఱ్ఱెలు” కానటువంటి వారంతా “అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి” అనగా “నిత్యనాశనమునకు” పోతారు. (మత్తయి 25:33, 41, 46) “భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము”నకు యిదే ముగింపు.—2 పేతురు 3:7; నహూము 1:2, 7-9; మలాకీ 4:1.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
(ప్రకటన 17:8) నువ్వు చూసిన ఆ క్రూరమృగం అంతకుముందు ఉంది, ఇప్పుడు లేదు, కానీ త్వరలో అది అగాధం నుండి పైకి వస్తుంది. అది నాశనం చేయబడుతుంది. భూమ్మీది ప్రజలు, అంటే ప్రపంచం పుట్టిన దగ్గర నుండి ఎవరి పేర్లయితే జీవగ్రంథంలో రాయబడలేదో వాళ్లు ఆ క్రూరమృగం అంతకుముందు ఉండడం, ఆ తర్వాత లేకపోవడం, అది మళ్లీ రావడం చూసి ఆశ్చర్యపోతారు.
ఆశ్చర్యకరమైన మర్మము బయల్పర్చబడింది
5 “ఆ క్రూరమృగము . . . ఉండెను.” అవును, అది నానాజాతి సమితిగా, మొత్తంమీద ఏదోక సమయంలో 63 దేశాల సభ్యత్వంతో, జనవరి 10, 1920నుండి ఉనికిలో ఉండెను. అయితే, జపాన్, జర్మనీ, ఇటలీ సభ్యత్వంనుండి విరమించుకున్నాయి, సోవియట్ యూనియన్ సమితి సభ్యత్వంనుండి తొలగించబడింది. సెప్టెంబర్ 1939లో జర్మనీ నాజీ నియంత రెండో ప్రపంచయుద్ధాన్ని ప్రారంభించాడు. ప్రపంచశాంతిని తేలేక నానాజాతిసమితి నిష్క్రియయనే అగాధంలోకి పూర్తిగా పడిపోయింది. అది 1942 నాటికి, ఒకప్పుడు ఉండెను అనే స్థాయికి పోయింది. ఈ సంఘటనకు ముందు లేక తర్వాత కాదుగానీ—ఆ క్లిష్ట సమయంలోనే—యెహోవా తన ప్రజలకు ఆ దర్శనం యొక్క పూర్తి భావాన్ని బయల్పర్చాడు. న్యూవరల్డ్ థియోక్రటిక్ అసెంబ్లీలో, అధ్యక్షుడు నార్, ప్రవచనం ప్రకారం, “క్రూరమృగము . . . యిప్పుడు లేదు,” అని ప్రకటించగలిగాడు. తర్వాత ఆయన యీ ప్రశ్న అడిగాడు, “నానాజాతి సమితి అగాధంలోనే ఉండిపోతుందా?” ప్రకటన 17:8, వచనాన్ని ఎత్తిచూపిస్తూ ఆయనిలా సమాధానమిచ్చాడు: “ప్రపంచరాజ్యాల సమాఖ్య మరల పైకివస్తుంది.” యెహోవా ప్రవచనార్థక వాక్యాన్ని రుజువుచేస్తూ అది అలాగే ఖచ్చితంగా జరిగింది!
అగాధమునుండి పైకివచ్చుట
6 ఎఱ్ఱని క్రూరమృగము నిజంగా అగాధంనుండి పైకి వచ్చింది. జూన్ 26, 1945, అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోనందు కరతాళధ్వనులమధ్య 50 దేశాలు ఐక్యరాజ్యసమితి ఒడంబడికను అంగీకరించాయి. ఈ సంస్థ “అంతర్జాతీయ శాంతిభద్రతలను కాపాడవలసి” యుండెను. నానాజాతిసమితికి ఐక్యరాజ్యసమితికి అనేక పోలికలుండెను. ది వరల్డ్ బుక్ ఎన్‌సైక్లొపీడియా యిలా చెబుతోంది: “మొదటి ప్రపంచయుద్ధం తర్వాత స్థాపించబడిన నానాజాతిసమితికి ఐక్యరాజ్యసమితికి కొన్నివిషయాలలో పోలికలున్నాయి . . . ఐక్యరాజ్యసమితిని స్థాపించిన అనేక రాజ్యాలే నానాజాతిసమితిని స్థాపించాయి. రాజ్యాలమధ్య శాంతిని నెలకొల్పడానికి సహాయపడేందుకు నానాజాతిసమితి స్థాపించబడినట్లే ఐక్యరాజ్యసమితి కూడ స్థాపించబడింది. ఐక్యరాజ్యసమితిలోని ముఖ్యసభ్యులు మొత్తంమీద నానాజాతిసమితి సభ్యుల్లాంటివారే.” గనుక, ఐక్యరాజ్యసమితి వాస్తవానికి ఎఱ్ఱని క్రూరమృగము యొక్క పునరుజ్జీవమే. దాని 175 దేశాల సభ్యత్వం, నానాజాతిసమితి యొక్క 63 దేశాల సభ్యత్వంకన్న ఎంతో ఎక్కువే; అది తనకు ముందున్న దానికన్న ఎక్కువ బాధ్యతలను కూడ కల్గివుంది.
(ప్రకటన 17:16, 17) నువ్వు చూసిన ఆ పది కొమ్ములు, అలాగే ఆ క్రూరమృగం ఈ వేశ్యను ద్వేషించి, ఆమెను కొల్లగొట్టి, ఆమె బట్టలు తీసేసి, ఆమె మాంసాన్ని తిని, అగ్నితో ఆమెను పూర్తిగా కాల్చివేస్తాయి. 17 ఎందుకంటే తాను అనుకున్నట్లు జరగాలని దేవుడే వాళ్లలో తన ఆలోచన పెట్టాడు. వాళ్లందరికీ ఒకే ఆలోచన ఉంది. దేవుని మాటలు నెరవేరేవరకు తమ రాజ్యాన్ని క్రూరమృగానికి ఇవ్వాలన్నదే ఆ ఆలోచన.
“త్వరలో సంభవింపనైయున్న” వాటిని యెహోవా బయలుపర్చాడు
17 అయితే అబద్ధమతం నిర్మూలమవడం మెల్లమెల్లగా జరగదు. ఆధిపత్యంలో ఉన్న రాజులకు దేవుడు ఒక ఆలోచనను పుట్టించే వరకు రాజుల్ని తనకిష్టమొచ్చినట్లు మలచుకోవడానికి ప్రయత్నించడం ద్వారా ఆ వేశ్య వాళ్లపై బలమైన ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. (ప్రకటన 17:16, 17 చదవండి.) త్వరలోనే అబద్ధమతంపై దాడిచేసేలా, సాతాను వ్యవస్థలోని రాజకీయ శక్తులకు అంటే వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఐక్యరాజ్యసమితికి యెహోవా బుద్ధి పుట్టిస్తాడు. అవి వేశ్య ప్రభావాన్ని అంతమొందించి, దాని ఐశ్వర్యాన్ని పాడుచేస్తాయి. కొన్ని దశాబ్దాల క్రితమైతే అలా జరగడం అసంభవమని ప్రజలు అనుకొనివుంటారు. కానీ, వేశ్య ఎర్రని క్రూర మృగం మీద నుండి జారిపడే సమయం దగ్గరపడింది. అయితే ఆమె మెల్లగా జారిపడదు, ఒక్కసారే అకస్మాత్తుగా పడిపోయి క్రూరంగా నాశనమౌతుంది.—ప్రక. 18:7, 8, 15-19.
డిసెంబరు 30–జనవరి 5
దేవుని వాక్యంలో ఉన్న సంపద|ప్రకటన 20-22
“ఇదిగో! నేను అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను”
(ప్రకటన 21:1) అప్పుడు నేను కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని చూశాను. ఎందుకంటే ముందున్న ఆకాశం, భూమి గతించిపోయాయి; సముద్రం ఇక లేదు.
క్రొత్త ఆకాశము క్రొత్త భూమి
2 యోహాను కాలానికి వందల సంవత్సరాలముందే, యెహోవా యెషయాకు యిలా చెప్పాడు: “ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు.” (యెషయా 65:17; 66:22) ఈ ప్రవచనం తొలుత నమ్మకమైన యూదులు సా.శ.పూ. 537లో 70సంవత్సరాల బబులోను చెరతర్వాత వారు విడిపించబడి యెరూషలేముకు తిరిగివచ్చినప్పుడు నెరవేరింది. ఆ పునరుద్ధరణలో, వారొక శుభ్రపర్చబడిన సమాజంగా, “క్రొత్త ఆకాశము” అను క్రొత్త ప్రభుత్వపాలన క్రింద “క్రొత్త భూమి”గా ఏర్పడ్డారు. అయిననూ, అపొస్తలుడైన పేతురు ఆ ప్రవచన బావి నెరవేర్పునుగూర్చి సూచిస్తూ యిలా చెబుతున్నాడు: “అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతినివసించును.” (2 పేతురు 3:13) యోహాను యీ వాగ్దానం ప్రభువు దినములో నెరవేరిందని యిప్పుడు చూపిస్తున్నాడు. “మొదటి ఆకాశమును మొదటి భూమియు” అంటే సాతాను అతని దయ్యాల ప్రభావంతో నడిచే ప్రభుత్వ నిర్మాణంతోపాటు సాతాను సంస్థీకరించబడిన విధానం గతించిపోతుంది. తిరుగుబాటుదారులైన, నిమ్మళింపనేరని దుష్ట మానవజాతియనే “సముద్రము” యిక ఉండదు. దాని స్థానంలో “క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు” అంటే దేవుని రాజ్యము అనే ఒక నూతన ప్రభుత్వం క్రింద ఓ భూలోక సమాజముంటుంది.—ప్రకటన 20:11 పోల్చండి.
(ప్రకటన 21:3, 4) అప్పుడు సింహాసనం నుండి వచ్చిన ఒక పెద్ద స్వరం ఇలా చెప్పడం నేను విన్నాను: “ఇదిగో! దేవుని నివాసం మనుషులతో ఉంది. ఆయన వాళ్లతో పాటు నివసిస్తాడు. వాళ్లు ఆయన ప్రజలుగా ఉంటారు. దేవుడే స్వయంగా వాళ్లతోపాటు ఉంటాడు. 4 వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును ఆయన తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు. అంతకుముందున్న విషయాలు గతించిపోయాయి.”
‘ఇదిగో! సమస్తాన్నీ నూతనం చేస్తున్నాను’
“[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును.” (ప్రకటన 21:4) ఆయన ఎలాంటి ‘బాష్పబిందువులను’ లేదా కన్నీళ్లను తుడిచివేస్తాడు? అవి ఆనందబాష్పాలో, సహజంగా మన కంటిని కాపాడే కన్నీళ్లో కాదు. దేవుడు తుడిచివేసేది బాధ, దుఃఖం వల్ల వచ్చే కన్నీళ్లను. ఆయన మన కన్నీళ్లను ఏదో పైపైన తుడిచివేయడు కానీ వాటికి కారణమయ్యే బాధను, దుఃఖాన్ని తీసేసి కన్నీళ్లు రాకుండా చేస్తాడు.
“మరణము ఇక ఉండదు.” (ప్రకటన 21:4) ఇప్పటివరకు చెప్పలేనన్ని కన్నీళ్లకు కారణమైన శత్రువు మరణమే. యెహోవా తనకు లోబడే మనుషులను మరణపు కోరల్లో నుండి విముక్తిచేస్తాడు. ఎలా? మరణానికి అసలు కారణాన్ని అంటే ఆదాము నుండి మనకు వారసత్వంగా వచ్చిన పాపాన్ని దేవుడు కూకటివేళ్లతోసహా పెకిలిస్తాడు. (రోమీయులు 5:12) యేసు విమోచన క్రయధన బలి ఆధారంగా యెహోవా దేవుడు తనకు విధేయులైన వాళ్లను పరిపూర్ణులుగా తీర్చిదిద్దుతాడు. ఆ తర్వాత, చివరి శత్రువైన మరణానికి మనుగడే లేకుండా చేస్తాడు. (1 కొరింథీయులు 15:26) దేవునికి నమ్మకంగా ఉన్న ప్రజలు, ఆయన మొదట ఉద్దేశించినట్లే సంపూర్ణ ఆరోగ్యంతో ఎల్లకాలం జీవిస్తారు.
“వేదన . . . ఇక ఉండదు.” (ప్రకటన 21:4) ఎలాంటి వేదన ఇక ఉండదు? పాపం, అపరిపూర్ణత కోట్లాది ప్రజలకు తీవ్రమైన మానసిక, భావోద్వేగ, శారీరక వేదన కలిగించి వాళ్ల జీవితాలను దుర్భరం చేశాయి. అలాంటి వేదన ఇక ఉండదు.
(ప్రకటన 21:5) అప్పుడు సింహాసనం మీద కూర్చొని ఉన్న దేవుడు ఇలా అన్నాడు: “ఇదిగో! నేను అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను.” ఆయన ఇంకా ఇలా అన్నాడు: “ఈ మాటలు నమ్మదగినవి, సత్యమైనవి కాబట్టి రాయి.”
సత్యదేవుడైన యెహోవా
14 యెహోవా తన వాక్యంలో మనకు చెప్పేవాటిని మనం గంభీరంగా తీసుకోవాలి. తానెవరని ఆయన చెబుతున్నాడో అదే ఆయన, తానేమి చేస్తానని ఆయన చెబుతాడో ఖచ్చితంగా ఆయనది చేస్తాడు. దేవునియందు నమ్మకముంచేందుకు మనకు ప్రతివిధమైన కారణముంది. “దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన” చేస్తానని యెహోవా చెబుతున్నప్పుడు మనమావిషయం నమ్మవచ్చు. (2 థెస్సలొనీకయులు 1:6) నీతిని వెంబడించే ప్రజలను ప్రేమిస్తాననీ విశ్వాసముంచే వారికి నిత్యజీవమిస్తాననీ వేదన, ఏడ్పు, చివరకు మరణం కూడా లేకుండా చేస్తాననీ యెహోవా చెప్పినప్పుడు మనం ఆయన మాటలను నిశ్చయంగా నమ్మవచ్చు. “ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని” అపొస్తలుడైన యోహానుకు ఈ ఆదేశం ఇవ్వడం ద్వారా, యెహోవా ఈ చివరి వాగ్దాన నమ్మకత్వాన్ని నొక్కిపలుకుతున్నాడు.—ప్రకటన 21:4, 5; సామెతలు 15:9; యోహాను 3:36.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
(ప్రకటన 20:5) (చనిపోయిన వాళ్లలో మిగిలినవాళ్లు ఆ 1,000 సంవత్సరాలు పూర్తయ్యేవరకు బ్రతకలేదు.) ఇది మొదటి పునరుత్థానం.
it-2-E 249వ పేజీ, 2వ పేరా
జీవం
దేవుడు ఆదాముకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఆదాము విధేయత చూపిస్తే ఎప్పటికీ మరణించడనే భావం ఆ ఆజ్ఞలో ఉంది. (ఆది 2:17) మనిషికి చివరి శత్రువైన మరణం నాశనమైన తర్వాత, విధేయులైన మనుషులు పాపం నుండి విడుదల పొంది ఉంటారు కాబట్టి వాళ్లు మరణించరు. వాళ్లు శాశ్వతకాలం మరణం లేకుండా జీవించి ఉంటారు. (1 కొరిం 15:26) క్రీస్తు పరిపాలన ముగింపులో మరణం నాశనం చేయబడుతుంది. ఆ పరిపాలన 1,000 సంవత్సరాలు ఉంటుందని ప్రకటన పుస్తకం చెప్తుంది. క్రీస్తుతో కలిసి రాజులుగా, యాజకులుగా పనిచేసే వాళ్ల గురించి ప్రకటనలో ఇలా ఉంది: “వాళ్లు బ్రతికి, క్రీస్తుతోపాటు 1,000 సంవత్సరాలు రాజులుగా పరిపాలించారు.” “చనిపోయిన వాళ్లలో మిగిలినవాళ్లు 1,000 సంవత్సరాలు పూర్తయ్యేవరకు బ్రతకలేదు” అనే మాట క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన ముగింపులో, సాతాను అగాధం నుండి విడుదలై మనుషుల్ని చివరిసారిగా పరీక్షించడానికి ముందటి కాలంలో బ్రతికి ఉన్నవాళ్లను సూచిస్తోంది. వెయ్యేళ్ల ముగింపుకల్లా భూమ్మీద మనుషులందరూ పరిపూర్ణతకు చేరుకుంటారు. వాళ్లు, పాపం చేయకముందు ఆదాముహవ్వలు ఉన్నలాంటి స్థితిలో ఉంటారు. ఇప్పుడు వాళ్లు నిజమైన పరిపూర్ణ జీవితాన్ని అనుభవిస్తారు. సాతాను అగాధం నుండి కొంతకాలం విడుదలైన తర్వాత పెట్టే పరీక్షలో విజయం సాధించినవాళ్లు, ఆ జీవితాన్ని శాశ్వతకాలం ఆనందిస్తారు.—ప్రక 20:4-10.
(ప్రకటన 20:14, 15) మరణం, సమాధి అగ్ని సరస్సులో పడవేయబడ్డాయి. ఈ అగ్ని సరస్సు రెండో మరణాన్ని సూచిస్తుంది. 15 అంతేకాదు, ఎవరి పేర్లయితే జీవగ్రంథంలో లేవో వాళ్లు అగ్ని సరస్సులో పడవేయబడ్డారు.
it-2-E 189-190
అగ్ని సరస్సు
ఈ మాట ప్రకటన పుస్తకంలో మాత్రమే కనిపిస్తుంది, ఆ సరస్సు ఖచ్చితంగా సూచనార్థకమైనది. అగ్ని సరస్సు అంటే ఏంటో, అది దేన్ని సూచిస్తుందో బైబిలు వివరిస్తుంది: “ఈ అగ్ని సరస్సు రెండో మరణాన్ని సూచిస్తుంది.”—ప్రక 20:14; 21:8.
ప్రకటన పుస్తకంలో ఈ మాటను ఉపయోగించిన వేర్వేరు సందర్భాల్ని పరిశీలిస్తే, సూచనార్థక భావం ఉన్న అగ్ని సరస్సు ఎలాంటిదో అర్థమౌతుంది. మరణం అగ్ని సరస్సులో పడేయబడిందని బైబిలు చెప్తుంది. (ప్రక 19:20; 20:14) మరణాన్ని అక్షరార్థంగా అగ్నిలో కాల్చడం వీలుకాదు. పైగా, అదృశ్య ప్రాణి అయిన అపవాది కూడా ఆ సరస్సులో పడవేయబడ్డాడు. అపవాది అదృశ్య ప్రాణి కాబట్టి నిజమైన అగ్ని అతన్ని గాయపర్చలేదు.—ప్రక 20:10; నిర్గ 3:2, న్యాయ 13:20 పోల్చండి.
అగ్ని సరస్సు “రెండో మరణాన్ని” సూచిస్తుంది, ప్రకటన 20:14 ప్రకారం మరణం, హేడిస్ కూడా అగ్ని సరస్సులో పడవేయబడ్డాయి. దీన్నిబట్టి, ఆదాము నుండి మనిషికి వారసత్వంగా వచ్చిన మరణాన్ని గానీ (రోమా 5:12), హేడిస్‌ను (షియోల్) గానీ ఆ సరస్సు సూచించట్లేదని చెప్పవచ్చు. కాబట్టి అది మరో రకమైన మరణాన్ని, అంటే పునరుత్థానం లేని మరణాన్ని సూచిస్తుండవచ్చు. ఆదాము ద్వారా వచ్చిన మరణం, అలాగే హేడిస్ (షియోల్) తనలో ఉన్న మృతుల్ని అప్పగించినట్టు బైబిలు చెప్తుంది. కానీ, “సరస్సు” తనలోని మృతుల్ని అప్పగించినట్టు బైబిల్లో ఎక్కడా లేదు. (ప్రక 20:13) వీటన్నిటి బట్టి, “ఎవరి పేర్లయితే జీవగ్రంథంలో లేవో” అంటే, దేవుని సర్వాధిపత్యాన్ని వ్యతిరేకించి పశ్చాత్తాపం చూపించనివాళ్లు అగ్ని సరస్సులో పడవేయబడతారు. అంటే శాశ్వతంగా నాశనం చేయబడతారు లేదా రెండో మరణం పొందుతారు.—ప్రక 20:15.