క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్ రెఫరెన్సులు
మే 6-12
దేవుని వాక్యంలో ఉన్న సంపద|2 కొరింథీయులు 4-6
“మనం అధైర్యపడం”
(2 కొరింథీయులు 4:16) అందుకే, మనం అధైర్యపడం. మన శరీరాలు కృశించిపోతున్నా మన హృదయాలు, మన మనస్సులు రోజురోజుకీ నూతనమౌతున్నాయి.
w04 8/15 25వ పేజీ, 16-17 పేరాలు
అలసిపోతారు గానీ సొమ్మసిల్లరు
16 మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపట్ల శ్రద్ధ చూపడం ఎంతో ప్రాముఖ్యం. మనకు యెహోవా దేవునితో సన్నిహిత సంబంధమున్నప్పుడు, మనం శారీరకంగా అలసిపోయినా, మనమెప్పటికీ ఆయనను ఆరాధించడంలో సొమ్మసిల్లము. యెహోవాయే “సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు.” (యెషయా 40:28, 29) ఈ మాటల సత్యసంధతను వ్యక్తిగతంగా చవిచూసిన అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు.”—2 కొరింథీయులు 4:16.
17 “దినదినము” అనే మాటను గమనించండి. ఇది ప్రతీ దినం యెహోవా చేసిన ఏర్పాట్ల నుండి వ్యక్తిగతంగా ప్రయోజనం పొందడాన్ని సూచిస్తుంది. 43 సంవత్సరాలు నమ్మకంగా సేవచేసిన ఒక మిషనరీ సహోదరి శారీరక అలసటను, నిరుత్సాహాన్ని ఎదుర్కొంది. అయితే ఆమె సొమ్మసిల్లలేదు. ఆమె ఇలా చెబుతోంది: “నా పని ఆరంభించడానికి ముందు యెహోవాకు ప్రార్థించి, ఆయన వాక్యాన్ని చదవడానికి సమయం దొరికేలా ఉదయమే లేవడాన్ని అలవాటు చేసుకున్నాను. నేను ఇప్పటివరకు సహించడానికి ఈ దైనందిన వాడుకే నాకు సహాయం చేసింది.” అవును మనం “దినదినము” క్రమంగా యెహోవాకు ప్రార్థించి ఆయన ఉన్నత లక్షణాలను, వాగ్దానాలను ధ్యానిస్తే మనకు నిజంగా ఆయన బలవర్థకమైన శక్తి లభిస్తుందని నమ్మవచ్చు.
(2 కొరింథీయులు 4:17) మనకు వచ్చే శ్రమలు కొంతకాలమే ఉంటాయి, అవి చాలా చిన్నవి. కానీ వాటివల్ల మనం పొందే బహుమానం ఎంతో గొప్పది, శాశ్వతమైనది.
it-1 724-725 పేజీలు
సహనం
పాపం లేకుండా శాశ్వతంగా జీవించే క్రైస్తవ నిరీక్షణ మీద ఆశ వదులుకోకుండా ఉండడం చాలా ప్రాముఖ్యం. ఆఖరికి వ్యతిరేకులు మనల్ని చంపినా కూడా ఈ నిరీక్షణను మనకు దూరం చేయలేరు. (రోమా 5:4, 5; 1 థెస్స 1:3; ప్రక 2:10) ఆ గొప్ప నిరీక్షణ నెరవేర్పుతో పోలిస్తే, ఇప్పుడు అనుభవిస్తున్న బాధలు చాలా చిన్నవి. (రోమా 8:18-25) శాశ్వత జీవితంతో పోలిస్తే, మనం ఇప్పుడు అనుభవిస్తున్న తీవ్రమైన సమస్యలు కూడా “కొంతకాలమే ఉంటాయి, అవి చాలా చిన్నవి.” (2 కొరిం 4:16-18) ఈ కష్టాలు తాత్కాలికమని గుర్తుపెట్టుకుంటూ క్రైస్తవ నిరీక్షణను అంటిపెట్టుకుని ఉంటే నిరాశ, నిస్పృహల్లోకి కూరుకుపోయి దేవునికి అవిధేయత చూపించే పరిస్థితి తెచ్చుకోము.
(2 కొరింథీయులు 4:18) మనం కనిపించేవాటి గురించే ఆలోచిస్తూ ఉండం కానీ కనిపించనివాటి గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే కనిపించేవి తాత్కాలికం, కనిపించనివి శాశ్వతం.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
(2 కొరింథీయులు 4:7) అయితే, మాకున్న అసాధారణ శక్తి దేవుడు ఇచ్చిందే కానీ మా సొంతది కాదనే విషయం స్పష్టమవ్వడానికి మట్టి పాత్రల్లో మాకు ఈ సంపద ఉంది.
w12 2/1 28-29 పేజీలు
“యెహోవా ముఖం మీదికి చిరునవ్వు తీసుకురండి”
పరిపాలక సభ సభ్యుడైన సహోదరుడు డేవిడ్ స్ప్లేన్ లేఖనాధారితమైన ఆ అంశాన్ని వివరించాడు. (2 కొరింథీయులు 4:7) ఆ సంపద ఏమిటి? అది జ్ఞానమా? లేదా తెలివా? “కాదు,” అని ప్రసంగీకుడు జవాబిచ్చాడు. “అపొస్తలుడైన పౌలు చెప్పిన సంపద ‘సత్యాన్ని ప్రకటించే’ ‘ఈ పరిచర్య.’” (2 కొరింథీయులు 4:1, 2, 5) ఐదు నెలలపాటు వాళ్లు చదివిన విషయాలు పరిచర్యలో ఒక ప్రత్యేకమైన నియామకం కోసం వాళ్లను సిద్ధపరిచాయని సహోదరుడు స్ప్లేన్ ఆ విద్యార్థులకు గుర్తుచేశాడు. ఆ నియామకాన్ని నిజంగా చాలా విలువైనదిగా ఎంచాలి.
“మట్టి పాత్రలు” మన శరీరాలను సూచిస్తున్నాయని ప్రసంగీకుడు వివరించాడు. ఆయన మట్టితో చేసిన పాత్రకు, బంగారంతో చేసిన పాత్రకు మధ్య తేడా గురించి చెప్పాడు. బంగారంతో చేసిన పాత్రల్ని తరచూ ఉపయోగించరు. మట్టితో చేసిన పాత్రల్ని మాత్రం ఎక్కువగా ఉపయోగిస్తారు. బంగారపు పాత్రలో మనం సంపద ఉంచినప్పుడు, మన దృష్టి ఆ సంపద మీద మాత్రమే కాకుండా ఆ బంగారపు పాత్ర మీద కూడా ఉంటుంది. “కాబట్టి విద్యార్థులారా ప్రజలు మిమ్మల్ని చూడకుండా జాగ్రత్తపడండి” అని సహోదరుడు స్ప్లేన్ చెప్పాడు. “మిషనరీలుగా మీరు ప్రజల్ని యెహోవా వైపు మళ్లిస్తారు. మీరు అణకువగల మట్టిపాత్రలు.”
(2 కొరింథీయులు 6:13) అందుకే, మీరు నా పిల్లలు అనుకొని చెప్తున్నాను, మీరు కూడా మీ హృదయాలను విశాలంగా తెరచుకోండి.
సహోదర ప్రేమను అధికం చేసుకుంటూ ఉండండి
7 మరి మన విషయమేమిటి? సహోదర ప్రేమను కనబర్చడంలో మనమెలా మన ‘హృదయాలను విశాలపర్చుకోవచ్చు’? ఒకే వయసులో ఉన్నవారు లేదా ఒకే జాతి నుండి వచ్చినవారు సహజంగానే పరస్పరం సహోదర ప్రేమతో మెలిగే అవకాశముంది. వినోదం విషయంలో ఒకే అభిరుచిగలవారు తరచూ కలిసి ఎక్కువ సమయం గడుపుతారు. అయితే మనలాంటి ఇష్టాయిష్టాలు కొందరు క్రైస్తవులకు ఉండకపోవచ్చు. అలాంటివారితో సన్నిహితంగా మెలగలేకపోతుంటే, మనం మన ‘హృదయాలను విశాలపర్చుకోవాలి.’ మనమిలా ప్రశ్నించుకోవాలి: ‘నేను, పరిచర్యలో లేదా ఇతర కార్యక్రమాల్లో నా సన్నిహిత స్నేహితులు కాని సహోదర సహోదరీలతో అరుదుగా పాల్గొంటున్నానా? సమయం గడిచేకొద్దీ వారే వచ్చి నా స్నేహాన్ని సంపాదించుకోవాలని అనుకుంటూ రాజ్య మందిరానికి వస్తున్న కొత్తవారితో అంటీముట్టనట్టుగా ఉంటున్నానా? చిన్నాపెద్దా అనే తేడా లేకుండా సంఘంలో అందరినీ పలకరిస్తున్నానా?’
చదవాల్సిన బైబిలు భాగం
(2 కొరింథీయులు 4:1-15) దేవుడు మమ్మల్ని కరుణించి మాకు ఈ పరిచర్య ఇచ్చాడు కాబట్టి మేము అధైర్యపడం. 2 అయితే, సిగ్గుపడాల్సి వచ్చే మోసకరమైనవాటిని వదిలేశాం; మేము కుయుక్తితో నడుచుకోవట్లేదు, దేవుని వాక్యాన్ని కలుషితం చేయట్లేదు. ప్రజలకు సత్యాన్ని ప్రకటిస్తూ దేవుని ముందు ప్రతీ వ్యక్తికి మమ్మల్ని మేము సిఫారసు చేసుకుంటున్నాం. 3 ఒకవేళ, మేము ప్రకటించే మంచివార్తకు ముసుగు వేయబడి ఉందంటే, అది నాశనం కాబోయేవాళ్లకే. 4 ఈ లోక దేవుడు ఆ అవిశ్వాసుల మనసులకు గుడ్డితనం కలుగజేశాడు. దేవుని ప్రతిబింబమైన క్రీస్తు గురించిన మహిమగల మంచివార్త వెలుగు వాళ్లమీద ప్రకాశించకూడదని అతను అలా చేశాడు. 5 మేము మా గురించి ప్రకటించుకోవట్లేదు గానీ యేసుక్రీస్తు ప్రభువని, యేసు కోసం మేము మీ దాసులమని ప్రకటిస్తున్నాం. 6 “చీకట్లో నుండి వెలుగు ప్రకాశించాలి” అని చెప్పిన దేవుడే క్రీస్తు ముఖం ద్వారా మా హృదయాల మీద వెలుగు ప్రసరింపజేశాడు. దేవుని మహిమగల జ్ఞానాన్ని ఇచ్చేది ఆ వెలుగే. 7 అయితే, మాకున్న అసాధారణ శక్తి దేవుడు ఇచ్చిందే కానీ మా సొంతది కాదనే విషయం స్పష్టమవ్వడానికి మట్టి పాత్రల్లో మాకు ఈ సంపద ఉంది. 8 కష్టాలు మమ్మల్ని అన్నివైపుల నుండి చుట్టుముట్టాయి, అలాగని మేము పూర్తిగా కదల్లేని స్థితిలో లేము; అయోమయ పరిస్థితిలో ఉన్నాం, అలాగని దారులన్నీ మూసుకుపోలేదు; 9 మేము హింసలు పడుతున్నాం కానీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు; బాధలవల్ల కృంగిపోయాం కానీ మేము నాశనం కాలేదు. 10 మేము ఎక్కడికి వెళ్లినా యేసులాగే మాకు ప్రాణాపాయ పరిస్థితి ఎదురౌతోంది. మేము యేసులాంటి జీవితాన్ని గడుపుతున్నామని ప్రజలు తెలుసుకునేందుకు అలా జరుగుతోంది. 11 బ్రతికివున్న మేము యేసు కోసం ఎప్పుడూ మరణాన్ని ముఖాముఖిగా చూస్తున్నాం. యేసులా మేము కష్టాలు పడుతున్నామని ప్రజలు తెలుసుకోవడానికి అలా జరుగుతోంది. 12 మేము మరణాన్ని ముఖాముఖిగా చూస్తున్నా, అది మీకు జీవాన్ని ఇస్తుంది. 13 “నేను నమ్మాను కాబట్టే మాట్లాడాను” అని లేఖనాల్లో ఉంది. మాకూ అలాంటి నమ్మకమే ఉంది కాబట్టి, మేము మాట్లాడుతున్నాం. 14 ఎందుకంటే, యేసును బ్రతికించిన దేవుడు మమ్మల్ని కూడా యేసులాగే బ్రతికించి మీతోపాటు యేసు ముందుకు తీసుకువస్తాడని మాకు తెలుసు. 15 ఇదంతా మీ కోసమే. దీనివల్ల చాలామంది దేవుని అపారదయను పొందగలుగుతున్నారు. ఎందుకంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన్ని స్తుతించేవాళ్లు అంతకంతకూ ఎక్కువౌతున్నారు.
మే 13-19
దేవుని వాక్యంలో ఉన్న సంపద|2 కొరింథీయులు 7-10
“సహాయం చేసే పరిచర్య”
(2 కొరింథీయులు 8:1-3) సోదరులారా, దేవుని అపారదయవల్ల మాసిదోనియలోని సంఘాల్లో ఏమి జరిగిందో మేము మీకు చెప్పాలనుకుంటున్నాం. 2 ఒక పెద్ద పరీక్షవల్ల వాళ్లకు కష్టాలు ఎదురైనా వాళ్లు ఎంతో ఆనందంగా ఉన్నారు, ఎంతో ఉదారత చూపించారు; వాళ్లు ఎంతో పేదరికంలో ఉన్నా అలా చేశారు. 3 వాళ్లు ఇవ్వగలిగింది ఇచ్చారు, నిజానికి ఇవ్వగలిగిన దానికన్నా ఎక్కువే ఇచ్చారని నేను సాక్ష్యమిస్తున్నాను.
“దేవుడు ఉల్లాసంతో ఇచ్చేవాణ్ణి ప్రేమిస్తాడు”
మొదటిగా, పౌలు సహాయ కార్యక్రమాలకు ప్రతిస్పందించడంలో మాదిరిగా ఉన్న మాసిడోనియా వారిని గురించి కొరింథీయులకు చెప్పాడు. “వారిని తీవ్రంగా పరీక్షించే కష్టాలలో కూడా వారి ఆనంద సమృద్ధినుంచీ వారి అతి దారిద్ర్యంలోనుంచి అధికమైన ఔదార్యం వెల్లువగా ప్రవహించింది” అని పౌలు వ్రాశాడు. దాతృత్వం విషయంలో మాసిడోనియా వారిని మరొకరు ప్రోత్సహించనవసరం లేదు. “ఈ ఉపకార క్రియలో—ఈ సేవలో తమను పాల్గొననివ్వండని” వారు “మనసారా మమ్ములను వేడుకొన్నారు” అని పౌలు చెప్పాడు. మాసిడోనియా వారు అప్పట్లో “అతి దారిద్ర్యంలో” ఉన్నారు అన్న విషయం ఉల్లాసంతో కూడిన వారి ఔదార్యాన్ని మరింత గమనార్హమైనదిగా చేస్తుంది.—2 కొరింథీయులు 8:2-4, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం.
సహాయక చర్యలు చేపట్టడం పవిత్రసేవలో ఒక భాగం
అది దాదాపు సా.శ. 46. యూదయ ప్రాంతం కరువు కోరల్లో చిక్కుకుంది. ధాన్యం సమృద్ధిగా లేకపోవడం వల్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అక్కడున్న యూదా క్రైస్తవులు (క్రైస్తవులుగా మారిన యూదులు), తినడానికి ఏమీ లేక ఆకలితో అలమటిస్తున్నారు. కానీ వాళ్లు ముందెన్నడూ చూడనంతగా యెహోవా కాపుదలను రుచి చూడబోతున్నారు. ఏ విధంగా?
(2 కొరింథీయులు 8:4) వాళ్లంతటవాళ్లే ముందుకువచ్చి, విరాళం ఇచ్చే గొప్ప అవకాశాన్ని, ఇతరులతోపాటు పవిత్రులకు సహాయం చేసే గొప్ప అవకాశాన్ని తమకూ ఇవ్వమని మమ్మల్ని ఎంతో బ్రతిమాలారు.
సహాయక చర్యలు చేపట్టడం పవిత్రసేవలో ఒక భాగం
4 పౌలు కొరింథీయులకు రాసిన రెండో ఉత్తరంలో, రెండు రకాల పరిచర్యల గురించి ప్రస్తావించాడు. ఆయన అభిషిక్తులను ఉద్దేశించి ఆ మాటలు రాసినప్పటికీ, అవి నేడున్న ‘వేరే గొర్రెలకు’ కూడా వర్తిస్తాయి. (యోహా. 10:16) ఒకటి, “శాంతిని తిరిగి నెలకొల్పే పరిచర్య.” దానిలో ప్రకటనా పని, బోధనా పని ఇమిడివున్నాయి. (2 కొరిం. 5:18-20; 1 తిమో. 2:3-6) మరొకటి, కష్టాలు లేదా విపత్తులు ఎదుర్కొంటున్న తోటి విశ్వాసుల కోసం చేసేది. దాన్నే పౌలు ‘పరిచారం చేయడం’ అని అన్నాడు. (2 కొరిం. 8:4, అధస్సూచి) ఆ రెండిటికీ, “పరిచర్య” అని అర్థమిచ్చే డీయాకోనీయ అనే గ్రీకు పదాన్ని పౌలు ఉపయోగించాడు.
5 ఆ రెండు పనులకు పౌలు ఒకే గ్రీకు పదాన్ని ఉపయోగించడాన్ని బట్టి, కష్టాలు లేదా విపత్తులు ఎదుర్కొంటున్న తోటి విశ్వాసులకు సహాయం చేయడం కూడా ఒక రకమైన పరిచర్యేనని, సంఘంలో జరిగే వివిధ రకాల పరిచర్యల్లో అది కూడా ఒకటని అర్థమౌతుంది. పౌలు అంతకుముందు ఇలా రాశాడు: “పరిచర్యలు వివిధ రకాలు, కానీ ప్రభువు ఒక్కడే; కార్యకలాపాలు వివిధ రకాలు, . . . పవిత్రశక్తే అవన్నీ చేస్తోంది.” (1 కొరిం. 12:4-6, 11) సంఘంలో జరిగే వివిధ రకాల పరిచర్యలను పౌలు “పవిత్రసేవ” అని పిలిచాడు. (రోమా. 12:1, 6-8) అందుకే, ఆయన “పవిత్రులకు సహాయం [పరిచారం, అధస్సూచి] చేయడానికి” సమయం వెచ్చించాడు.—రోమా. 15:25, 26.
6 విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయడం ఒక రకమైన పరిచర్య అని, యెహోవాకు చేసే ఆరాధనలో అదొక భాగమని పౌలు కొరింథీయులకు చెప్పాలనుకున్నాడు. ఆయన ఎలా తర్కించాడో గమనించండి: క్రైస్తవులు ‘క్రీస్తు గురించిన మంచివార్తకు లోబడి ఉంటున్నారు’ కాబట్టే విపత్తు సహాయక చర్యల్లో భాగం వహిస్తున్నారని పౌలు అన్నాడు. (2 కొరిం. 9:13) అంటే, వాళ్లు క్రీస్తు బోధల్ని పాటిస్తూ తోటి విశ్వాసులకు సహాయం చేస్తున్నారు. అంతేకాదు వాళ్లు దయతో చేసే అలాంటి పనులు, “దేవుడు చూపించే అపారదయకు” నిదర్శనాలని పౌలు చెప్పాడు. (2 కొరిం. 9:14; 1 పేతు. 4:10) కావలికోట డిసెంబరు 1, 1975 సంచిక, అవసరంలో ఉన్న సహోదరులకు సహాయం చేయడం గురించి సరిగ్గానే ఇలా చెప్పింది: “యెహోవా దేవుడు, ఆయన కొడుకైన యేసుక్రీస్తు ఇలాంటి సేవలకు ప్రాముఖ్యత ఇస్తారా ఇవ్వరా అనే సందేహం మనకు ఎప్పుడూ రాకూడదు.” అవును, విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయడం పవిత్రసేవలో ఒక భాగం.—రోమా. 12:1, 7; 2 కొరిం. 8:7; హెబ్రీ. 13:16.
(2 కొరింథీయులు 9:7) ప్రతీ ఒక్కరు అయిష్టంగానో బలవంతంగానో కాకుండా తమ మనసులో ఎంత ఇవ్వాలని తీర్మానించుకుంటారో అంత ఇవ్వాలి. ఎందుకంటే సంతోషంగా ఇచ్చేవాళ్లంటే దేవునికి ఇష్టం.
రాజ్య పనులకు డబ్బు ఎక్కడినుండి వస్తుంది?
10 మొదటిగా, మనం యెహోవాను ప్రేమిస్తూ “ఆయనకు నచ్చే పనులు” చేయాలనుకుంటాం కాబట్టే స్వచ్ఛందంగా విరాళమిస్తాం. (1 యోహా. 3:22) తన ఆరాధకులు మనస్ఫూర్తిగా ఇచ్చినప్పుడు యెహోవా సంతోషిస్తాడు. ఈ విషయంలో అపొస్తలుడైన పౌలు ఏమన్నాడో గమనించండి. (2 కొరింథీయులు 9:7 చదవండి.) నిజ క్రైస్తవుడు బలవంతంగానో, అయిష్టంగానో కాకుండా తన ‘మనసులో తీర్మానించుకుని’ ఇస్తాడు. అంటే సంఘంలో ఏ అవసరాలు ఉన్నాయో, వాటికోసం తాను ఎంత ఇవ్వగలడో ఆలోచించి, తర్వాత విరాళం ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు యెహోవా సంతోషిస్తాడు. ఎందుకంటే “సంతోషంగా ఇచ్చేవాళ్లంటే దేవునికి ఇష్టం” అని బైబిలు చెప్తుంది.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
(2 కొరింథీయులు 9:15) వర్ణించలేని దేవుని బహుమానాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు.
w16.01 12వ పేజీ, 2వ పేరా
దేవుడిచ్చిన వెలకట్టలేని బహుమతికి కృతజ్ఞత చూపించండి
2 యేసు బలి ఆధారంగా దేవుని అద్భుతమైన వాగ్దానాలన్నీ నిజమౌతాయని పౌలుకు తెలుసు. (2 కొరింథీయులు 1:20 చదవండి.) అంటే ‘వివరించడానికి సాధ్యం కాని ఉచిత వరం’ కేవలం యేసు బలి మాత్రమే కాదు. దేవుడు భవిష్యత్తులో మనకోసం చేయబోయే మంచి వాటన్నిటితోపాటు ఆయన మనపై చూపించే యథార్థ ప్రేమ కూడా ఆ వరంలో భాగమే. కాబట్టి అంత విలువైన బహుమానాన్ని మనకు పూర్తిగా అర్థమయ్యేలా వివరించడం అసాధ్యం. అయితే ఆ ప్రత్యేకమైన బహుమానం మనపై ఎలాంటి ప్రభావం చూపించాలి? 2016, మార్చి 23 బుధవారం రోజున జరిగే క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు సిద్ధపడుతుండగా ఏమి చేసేలా ఆ బహుమానం మనల్ని ప్రోత్సహించాలి?
(2 కొరింథీయులు 10:17) “అయితే గొప్పలు చెప్పుకునేవాడు యెహోవాను బట్టి గొప్పలు చెప్పుకోవాలి” అని లేఖనాల్లో రాసివుంది.
g9 9 8/8 20-21 పేజీలు
గర్విష్టిగా ఉండటం తప్పా?
క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో కావ్కావోమ్ అనే క్రియాపదం “గర్వించడం, ఉప్పొంగడం, గొప్పలు చెప్పుకోవడం” అని అనువదించబడింది. ఈ క్రియా పదాన్ని అనుకూల భావంలోనూ, వ్యతిరేక భావంలోనూ ఉపయోగిస్తారు. ఉదాహరణకు, “దేవుని మహిమను గూర్చిన నిరీక్షణబట్టి అతిశయపడుచున్నాము” అని పౌలు అంటున్నాడు. “అతిశయంచువాడు ప్రభువునందే అతిశయంపవలెను” అని కూడా ఆయన సిఫారసు చేస్తున్నాడు. (రోమీయులు 5:2; 2 కొరింథీయులు 10:17) మన దేవుడు యెహోవా అని గర్వించడమని దీనర్థం, ఈ భావోద్వేగం ఆయన మంచి పేరును, ఖ్యాతిని బట్టి ఆనందించడానికి నడిపించగలదు.
చదవాల్సిన బైబిలు భాగం
(2 కొరింథీయులు 7:1-12) ప్రియ సోదరులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి మన శరీరానికి, మనసుకు ఏ కళంకం లేకుండా మనల్ని మనం శుభ్రపర్చుకుందాం; దైవభయంతో ఇంకా ఎక్కువ పవిత్రులమౌదాం. 2 మీ హృదయాల్లో మాకు చోటివ్వండి. మేము ఎవ్వరికీ అన్యాయం చేయలేదు, ఎవ్వరినీ తప్పుదారి పట్టించలేదు, ఎవ్వరినీ మా స్వార్థానికి వాడుకోలేదు. 3 మీమీద నేరం మోపాలని నేనలా అనట్లేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు మీతో అన్నట్టు మేము చనిపోయినా, బ్రతికున్నా మీరు మా హృదయాల్లోనే ఉంటారు. 4 నేను మీతో ఎంతో ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. మీ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. నాకు ఎంతో ఊరట కలిగింది; మా బాధలన్నిట్లో నేను ఎంతో సంతోషిస్తున్నాను. 5 నిజానికి మేము మాసిదోనియకు వచ్చినప్పుడు మేము ఏ రకంగానూ ఉపశమనం పొందలేదు. బయట చాలా వ్యతిరేకత, లోపల భయం, ఇలా అన్నివైపుల నుండి కష్టాలు మమ్మల్ని చుట్టుముడుతూనే ఉన్నాయి. 6 కానీ, కృంగిపోయిన వాళ్లకు ఊరటనిచ్చే దేవుడు తీతు సందర్శనం ద్వారా మాకు ఊరటనిచ్చాడు; 7 అతను మాతో ఉన్నందుకే కాదు, మీ వల్ల అతను పొందిన ఊరటను బట్టి కూడా మేము ఊరట పొందాం. మీరు నన్ను చూడాలని ఎంతో కోరుకుంటున్నారని, మీరు చాలా దుఃఖపడుతున్నారని, మీకు నా మీద నిజమైన శ్రద్ధ ఉందని అతను తిరిగి వచ్చినప్పుడు మాకు చెప్పాడు; అది విని నేను ఇంకా ఎక్కువ సంతోషించాను. 8 ఒకవేళ నా ఉత్తరం మిమ్మల్ని దుఃఖపెట్టినా, దాని గురించి నేను బాధపడను. (నా ఉత్తరం వల్ల మీకు కొంతకాలంపాటు దుఃఖం కలిగిందని తెలిసి) నేను మొదట్లో కాస్త బాధపడినా, 9 ఇప్పుడైతే సంతోషిస్తున్నాను. మీకు దుఃఖం కలిగినందుకే కాదు, ఆ దుఃఖం మీలో పశ్చాత్తాపం కలిగించినందుకు సంతోషిస్తున్నాను. మీకు కలిగిన దుఃఖం దేవుని ఇష్టానికి తగ్గట్టు ఉంది. కాబట్టి, మా వల్ల మీకు ఏ నష్టం జరగలేదు. 10 దేవుని ఇష్టానికి తగ్గట్టుగా ఉన్న దుఃఖం పశ్చాత్తాపాన్ని కలిగించి రక్షణకు నడిపిస్తుంది, ఇక బాధపడాల్సిన అవసరమేమీ ఉండదు; కానీ లోక సంబంధమైన దుఃఖం మరణానికి నడిపిస్తుంది. 11 దేవుని ఇష్టానికి తగ్గట్టుగా ఉన్న దుఃఖం మీలో ఎంత పట్టుదలను కలిగించిందో చూడండి. ఆ దుఃఖం మీ మీద పడిన నిందను తీసేసుకోవడానికి మీకు సహాయం చేసింది; తప్పు విషయంలో ఆగ్రహాన్ని, దైవభయాన్ని, పశ్చాత్తాపపడాలనే బలమైన కోరికను కలిగించింది; తప్పు దిద్దే విషయంలో ఉత్సాహాన్ని నింపింది. ఈ విషయంలో మీరు అన్నివిధాలా స్వచ్ఛంగా ఉన్నట్టు చూపించుకున్నారు. 12 నేను మీకు ఉత్తరం రాసిన మాట నిజమే. అయితే దాన్ని తప్పు చేసిన వ్యక్తి కోసమో, ఆ తప్పు వల్ల గాయపడిన వ్యక్తి కోసమో రాయలేదు. కానీ మా మాట వినడానికి మీరు ఎంత పట్టుదలగా ప్రయత్నిస్తున్నారో దేవుని ముందు స్పష్టమవ్వాలని రాశాను.
మే 20-26
దేవుని వాక్యంలో ఉన్న సంపద|2 కొరింథీయులు 11-13
“పౌలు ‘శరీరంలో ముల్లు’”
(2 కొరింథీయులు 12:7) కేవలం అలాంటి అసాధారణమైన దర్శనాలు నాకు కలిగాయనే ఉద్దేశంతో ఎవ్వరూ నాకు ఎక్కువ ఘనత ఇవ్వకూడదు. నేను గర్వంతో ఉప్పొంగిపోకుండా ఉండేందుకు నా శరీరంలో ఓ ముల్లు ఉంది. అది సాతాను దూతలా పనిచేస్తూ, నేను ఉప్పొంగిపోకుండా అదేపనిగా నన్ను బాధిస్తోంది.
బలహీనతలున్నా బలవంతులమే
మరో నమ్మకమైన సేవకుడైన అపొస్తలుడైన పౌలు, తన ‘శరీరములో ఉన్న ఒక ముల్లును’ అంటే తనను ఎంతోకాలంగా పట్టిపీడిస్తున్న ఒక సమస్యను తొలగించమని యెహోవాను కోరాడు. ఆయన దానికోసం దేవుణ్ణి మూడుసార్లు వేడుకున్నాడు. ఆ సమస్య ఏదైనప్పటికీ, అది ఇబ్బంది కలిగించే ముల్లులా యెహోవా సేవలో పౌలుకు ఆనందం లేకుండా చేసి ఉంటుంది. పౌలు దాన్ని, విడువక నలుగగొట్టబడడంతో పోల్చాడు. దానికి యెహోవా ఇలా సమాధానమిచ్చాడు: “నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది.” యెహోవా ఆ ముల్లును తీసివేయలేదు. పౌలు దానితో పోరాడాల్సి వచ్చినా ఇలా అన్నాడు: “నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను.” (2 కొరిం. 12:7-10) ఆయన ఎందుకలా అన్నాడు?
(2 కొరింథీయులు 12:8, 9) దాన్ని నాలో నుండి తీసేయమని ప్రభువును మూడుసార్లు బ్రతిమాలాను. 9 కానీ ఆయన నాతో ఇలా అన్నాడు: “నేను ఇప్పటివరకు నీ మీద చూపించిన అపార దయ నీకు చాలు. ఎందుకంటే నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నా శక్తి నీలో పూర్తిస్థాయిలో పనిచేస్తుంది.” కాబట్టి, క్రీస్తు శక్తి నా మీద ఓ డేరాలా నిలిచివుండేందుకు నా బలహీనతల గురించి నేను ఇంకా సంతోషంగా గొప్పలు చెప్పుకుంటాను.
w06 12/15 24వ పేజీ, 17-18 పేరాలు
యెహోవా ‘తనను అడిగేవారికి పరిశుద్ధాత్మను’ అనుగ్రహిస్తాడు
17 పౌలు ప్రార్థనలకు స్పందనగా దేవుడాయనకు ఇలా చెప్పాడు: “నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది.” అందుకు పౌలు, “క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, లేక నన్ను కప్పు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును” అని అన్నాడు. (2 కొరింథీయులు 12:9, అధస్సూచి; కీర్తన 147:5) అలా పౌలు, క్రీస్తు ద్వారా లభించే దేవుని శక్తివంతమైన కాపుదల గుడారంలా తనపై కప్పబడి ఉండడాన్ని ఆస్వాదించాడు. నేడు యెహోవా మన ప్రార్థనలకూ అదే విధంగా జవాబిస్తున్నాడు. ఆయన తన సేవకుల మీద తన కాపుదలను గుడారంలా కప్పుతున్నాడు.
18 గుడారం వర్షం పడకుండా, గాలి వీయకుండా ఆపుజేయదు గానీ మనం వాటి తాకిడికి గురవకుండా మనకు కొంతవరకు కాపుదలనిస్తుంది. అదే విధంగా, “క్రీస్తు శక్తి” మనకు పరీక్షలు రాకుండా లేదా మనపై కష్టాలు విరుచుకుపడకుండా ఆపుజేయదు. అయితే అది ఈ లోకపు హానికరమైన శక్తులకు, దాని పరిపాలకుడైన సాతాను ముట్టడులకు వ్యతిరేకంగా మనకు ఆధ్యాత్మిక కాపుదలనిస్తుంది. (ప్రకటన 7:9, 15, 16) కాబట్టి, ‘మీ యొద్దనుండి తొలగిపోని’ పరీక్షను మీరు ఎదుర్కొంటున్నా, యెహోవాకు మీ సంఘర్షణ తెలుసనీ, ‘మీ మొరకు’ ఆయన ప్రత్యుత్తరమిస్తాడనీ మీరు నమ్మకంతో ఉండవచ్చు. (యెషయా 30:19; 2 కొరింథీయులు 1:3, 4) పౌలు ఇలా వ్రాశాడు: “దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.”—1 కొరింథీయులు 10:13; ఫిలిప్పీయులు 4:6, 7.
(2 కొరింథీయులు 12:10) అందుకే క్రీస్తు కోసం నా బలహీనతల విషయంలో నేను సంతోషిస్తాను; ఇతరులు నన్ను ఎగతాళి చేసినప్పుడు, నేను అవసరంలో ఉన్నప్పుడు, హింసలూ కష్టాలూ ఎదురైనప్పుడు సంతోషిస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుణ్ణి.
w18.01 9వ పేజీ, 8-9 పేరాలు
‘సొమ్మసిల్లినవాళ్లకు బలమిచ్చువాడు ఆయనే’
8 యెషయా 40:30 చదవండి. మనకు చాలా నైపుణ్యాలు ఉండవచ్చు, కానీ సొంత బలంతో కొన్ని పనులు మాత్రమే చేయగలుగుతాం అనేది మనందరం నేర్చుకోవాల్సిన పాఠం. అపొస్తలుడైన పౌలుకు ఎన్నో పనులు చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ, ఆయన అనుకున్నవన్నీ చేయలేకపోయాడు. తన ఆందోళనను యెహోవాకు చెప్పినప్పుడు, యెహోవా ఇలా జవాబిచ్చాడు: “నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నా శక్తి నీలో పూర్తిస్థాయిలో పనిచేస్తుంది.” యెహోవా ఏమన్నాడో పౌలు అర్థంచేసుకున్నాడు. అందుకే పౌలు ఇలా అన్నాడు, “నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుణ్ణి.” (2 కొరిం. 12:7-10) పౌలు మాటలకు అర్థమేమిటి?
9 తన సొంత బలంతో అన్నీ చేయలేనని, తనకన్నా శక్తిమంతుని సహాయం అవసరమని పౌలు గుర్తించాడు. బలహీనంగా ఉన్నప్పుడు దేవుని పవిత్రశక్తి ఆయనకు బలాన్ని ఇవ్వగలదు. అంతేకాదు, సొంత బలంతో ఎన్నడూ చేయలేని పనుల్ని కూడా పవిత్రశక్తి సహాయంతో పౌలు చేయగలడు. మనకు కూడా పవిత్రశక్తి బలాన్ని ఇవ్వగలదు. యెహోవా ఇచ్చే పవిత్రశక్తి మనల్ని బలవంతుల్ని చేస్తుంది.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
(2 కొరింథీయులు 12:2-4) క్రీస్తు శిష్యుడైన ఓ వ్యక్తి నాకు తెలుసు. 14 ఏళ్ల క్రితం, ప్రభువు అతన్ని అకస్మాత్తుగా మూడో పరలోకానికి తీసుకువెళ్లాడు. అతను శరీరంతో వెళ్లాడో, శరీరం లేకుండా వెళ్లాడో నాకు తెలీదు, దేవునికి తెలుసు. 3 అవును, అలాంటి వ్యక్తి నాకు తెలుసు. అతను శరీరంతో వెళ్లాడో, శరీరం లేకుండా వెళ్లాడో నాకు తెలీదు, దేవునికి తెలుసు. 4 ప్రభువు అతన్ని అకస్మాత్తుగా పరదైసుకు తీసుకువెళ్లాడు. అక్కడ అతను మనుషులు పలకకూడని, మాట్లాడకూడని మాటలు విన్నాడు.
w18.12 8వ పేజీ, 10-12 పేరాలు
పాఠకుల ప్రశ్న
2 కొరింథీయులు 12:2లో ప్రస్తావించిన “మూడో పరలోకం” యేసుక్రీస్తు అలాగే 1,44,000 మంది పరిపాలించే మెస్సీయ రాజ్యం అంటే “కొత్త ఆకాశం” అయ్యుంటుంది.—2 పేతు. 3:13.
ఆ రాజ్యం అత్యున్నత పరిపాలన చేస్తుంది కాబట్టి దాన్ని “మూడో పరలోకం” అని పిలుస్తాం.
దర్శనంలో పౌలు తీసుకెళ్లబడిన “పరదైసు”: (1) భూమ్మీదకు రాబోయే అక్షరార్థమైన పరదైసును, (2) ఇప్పుడున్న ఆధ్యాత్మిక పరదైసు కన్నా ఇంకా విస్తృతస్థాయిలో ఉండబోయే ఆధ్యాత్మిక పరదైసును, (3) కొత్త లోకంలో భాగంగా ఉండే పరలోకంలోని ‘దేవుని పరదైసును’ సూచించవచ్చు.
(2 కొరింథీయులు 13:7) మీరు ఏ తప్పూ చేయకూడదని మేము దేవునికి ప్రార్థిస్తున్నాం. మేము దేవుడు ఆమోదించిన వ్యక్తులుగా కనిపించాలన్నది మా ఉద్దేశం కాదు. ఒకవేళ మాకు దేవుని ఆమోదం లేనట్టు కనిపించినా, మీరు సరైనది చేయాలన్నదే మా ఉద్దేశం.
“ఒకరికొరకు ఒకరు ప్రార్థనచేయుడి”
తోటి విశ్వాసిని గూర్చి ఏ అంశమునైనను మన ప్రార్థనలలో చేర్చవచ్చును. ఉదాహరణకు పౌలు తనకు సువార్తను మాట్లాడుటకు తగిన శక్తినిచ్చునట్లు ప్రార్థించమని ఇతరులను అడిగాడు. (ఎఫెసీయులు 6:17-20) ఒకరు శోధించబడుచున్నారని నీకు తెలిసిన దాని విషయమేమి? ‘తాను తప్పిదము చేయకుండవలెననియు’ దేవుడు తనను శోధనలో వదిలివేయక దుష్టుడైన అపవాదియగు సాతానునుండి తప్పించవలెనని ప్రార్థించవచ్చును. (2 కొరింథీయులు 13:7; మత్తయి 6:13) ఒకరు భౌతికంగా వ్యాధిగ్రస్థులైనప్పుడు, తన వ్యాధిని సహించగల మనోధైర్యము (బలము) నివ్వమని యెహోవాను మనము అడుగవచ్చును.—కీర్తన 41:1-3.
హింసించబడుచున్న తోటి ఆరాధికులనుగూర్చి ప్రార్థించుట ఎల్లప్పుడు యుక్తమైనది. పౌలు మరియు తన సహవాసులు తీవ్రమైన హింసననుభవించారు. కొరింథులోని క్రైస్తవులకు ఆయన ఇలా చెప్పాడు: “మా కొరకు ప్రార్థనచేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా. . .అనేకుల ప్రార్థనద్వారా మాకు కలిగిన కృపావరముకొరకు అనేకులచేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.” (2 కొరింథీయులు 1:8-11; 11:23-27) మనము జైలులో ఉన్నను, “నీతిమంతుల ప్రార్థనను” యెహోవా వినునని గుర్తించుకొని, హింసంచబడుచున్న ఇతర సహోదరులకొరకు ప్రార్థించవలెను.—సామెతలు 15:29.
ప్రత్యేకముగా యెహోవా సంస్థలో గొప్ప బాధ్యతలను నిర్వహిస్తున్న మన సహోదరులకొరకు మనము ప్రార్థించవలెను. అనగా సంస్థను నడిపిస్తూ, “నమ్మకమును బుద్ధిమంతుడైన దాసుని” ద్వారా అందించబడు ఆత్మీయాహారమును తయారుచేయు వారినికూడ ఇందులో చేర్చవలెను. (మత్తయి 24:45-47) ఉదాహరణకు యెహోవాసాక్షుల గవర్నింగ్ బాడి సభ్యులను గూర్చి, దేవుడు వారికి “జ్ఞానముగల మనస్సును” దయచేయునట్లు ప్రార్థించవచ్చును.—ఎఫెసీయులు 1:16, 17.
చదవాల్సిన బైబిలు భాగం
(2 కొరింథీయులు 11:1-15) నేను ఒకవేళ కాస్త అవివేకిలా కనిపించినా, మీరు నన్ను సహించాలని కోరుకుంటున్నాను. నిజానికి ఇప్పటికే మీరు అలా చేస్తున్నారు! 2 దేవునికి ఉన్నట్టే మీమీద నాకు చాలా శ్రద్ధ ఉంది. ఎందుకంటే, పెళ్లి ద్వారా మిమ్మల్ని పవిత్రమైన కన్యగా ఒకే భర్తకు అంటే, క్రీస్తుకు అప్పగిస్తానని మాటిచ్చాను. 3 కానీ, పాము కుయుక్తిగా హవ్వను మోసం చేసినట్టే, ఎవరైనా మీ మనసుల్ని కూడా ఏదోవిధంగా కలుషితం చేసి క్రీస్తుపట్ల మీరు చూపించాల్సిన నిజాయితీని, పవిత్రతను పాడుచేస్తారేమోనని నాకు భయంగా ఉంది. 4 ఎందుకంటే ఎవరైనా వచ్చి మేము ప్రకటించిన యేసును కాకుండా ఇంకో యేసును ప్రకటించినా, మీరు పొందిన దేవుని శక్తిని కాకుండా ఇంకో ఆలోచనా విధానాన్ని ప్రవేశపెట్టినా, మీరు స్వీకరించిన మంచివార్తను కాకుండా ఇంకో మంచివార్తను ప్రకటించినా మీరు అతన్ని సులభంగా సహిస్తారు. 5 అతిశ్రేష్ఠులైన మీ అపొస్తలుల కన్నా నేను ఏ విషయంలోనూ తక్కువవాణ్ణి కానని అనుకుంటున్నాను. 6 నాకు మాట్లాడే సామర్థ్యం పెద్దగా లేకపోయినా, జ్ఞానం విషయంలో మాత్రం నేను తక్కువవాణ్ణేమీ కాదు; నిజానికి మేము ఆ జ్ఞానాన్ని ప్రతీ విషయంలో, ప్రతీ విధంగా మీకు స్పష్టం చేశాం. 7 మీకు ఘనత రావడం కోసం నన్ను నేను తగ్గించుకొని పాపం చేశానా? దేవుని మంచివార్తను మీకు ఉచితంగా ప్రకటించి నేను తప్పు చేశానా? 8 మీకు పరిచారం చేయడానికి నేను వేరే సంఘాల దగ్గర సహాయం తీసుకొని ఒకవిధంగా వాళ్లను దోచుకున్నాను. 9 నేను మీ దగ్గర ఉన్నప్పుడు నాకు కొన్ని అవసరాలు ఏర్పడ్డాయి, అయినా నేను ఎవ్వరికీ భారంగా లేను. ఎందుకంటే మాసిదోనియ నుండి వచ్చిన సోదరులు నాకు కావాల్సినవి పుష్కలంగా ఇచ్చారు. అవును, నేను మీకు ఏ విధంగానూ భారంగా ఉండకుండా జాగ్రత్తపడ్డాను, ముందుముందు కూడా అలాగే ఉంటాను. 10 నేను క్రీస్తు శిష్యునిగా ఉన్నంతకాలం అకయ ప్రాంతాల్లో ఇలా గొప్పలు చెప్పుకోవడం ఆపను. 11 నేను మీకు భారంగా లేనిది ఎందుకు? మీమీద ప్రేమ లేకనా? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని దేవుడికి తెలుసు. 12 నేను ఇప్పుడు చేస్తున్నది ఇకముందు కూడా చేస్తాను. అప్పుడు, తమ హోదా గురించి గొప్పలు చెప్పుకుంటూ మాతో సమానంగా ఉండాలని ప్రయత్నించేవాళ్లకు గొప్పలు చెప్పుకునే అవకాశమే లేకుండా చేయగలుగుతాను. 13 ఎందుకంటే అలాంటివాళ్లు దొంగ అపొస్తలులు, మోసగాళ్లు; వాళ్లు క్రీస్తు అపొస్తలుల్లా వేషం వేసుకుంటున్నారు. 14 అందులో ఆశ్చర్యం లేదు, ఎందుకంటే సాతానే స్వయంగా వెలుగు దూత వేషం వేసుకుంటున్నాడు. 15 కాబట్టి సాతాను పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషం వేసుకోవడం వింతేమీ కాదు. అయితే వాళ్ల అంతం వాళ్ల పనులకు తగ్గట్టే ఉంటుంది.
మే 27–జూన్ 2
దేవుని వాక్యంలో ఉన్న సంపద|గలతీయులు 1-3
“అతని ముఖం మీదే అనేశాను”
(గలతీయులు 2:11-13) అయితే, కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతను చేసినదానిలో తప్పు ఉండడంతో నేను దాని గురించి అతని ముఖం మీదే అనేశాను. 12 అసలు ఏమి జరిగిందంటే, యాకోబు దగ్గర నుండి కొంతమంది వచ్చారు. వాళ్లు రాకముందు, పేతురు అన్యులతో కలిసి తినేవాడు; కానీ వాళ్లు వచ్చిన తర్వాత, సున్నతి పొందినవాళ్లకు భయపడి అతను అన్యులతో కలిసి తినడం మానేసి, అన్యులకు దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. 13 మిగిలిన యూదులు కూడా అతనిలాగే నటించడం మొదలుపెట్టారు. చివరికి బర్నబా కూడా వాళ్లలాగే నటించడం మొదలుపెట్టాడు.
w17.04 27వ పేజీ, 16వ పేరా
యెహోవా న్యాయ ప్రమాణాల్ని మీరు పాటిస్తారా?
16 గలతీయులు 2:11-14 చదవండి. పేతురు మనుషులకు భయపడ్డాడు. (సామె. 29:25) అన్యులను యెహోవా ఎలా చూస్తున్నాడో అపొస్తలుడైన పేతురుకు తెలుసు. అయినాసరే, క్రైస్తవులుగా మారిన అన్యులతో కలిసివుంటే, యెరూషలేము నుండి వస్తున్న క్రైస్తవులు తనను చిన్నచూపు చూస్తారేమోనని పేతురు భయపడ్డాడు. అపొస్తలుడైన పౌలు పేతురుతో వేషధారణ చూపించవద్దని చెప్పాడు. ఎందుకు? ఎందుకంటే, సా.శ. 49లో యెరూషలేములో కలుసుకున్నప్పుడు పేతురు అన్యులకు మద్దతిస్తూ మాట్లాడడం పౌలు చూశాడు. (అపొ. 15:12; గల. 2:13, అధస్సూచి) పేతురు ప్రవర్తన వల్ల బాధపడిన ఆ క్రైస్తవులు ఏమి చేశారు? నొచ్చుకుని యెహోవాను ఆరాధించడం మానేశారా? తన ప్రవర్తననుబట్టి పేతురు సంఘ బాధ్యతలు కోల్పోయాడా?
(గలతీయులు 2:14) కానీ వాళ్లు మంచివార్తకు సంబంధించిన సత్యానికి తగ్గట్టు నడుచుకోవట్లేదని నేను గమనించినప్పుడు, వాళ్లందరి ముందు కేఫాతో ఇలా అన్నాను: “యూదుడివైన నువ్వు, యూదుల్లా కాకుండా అన్యుల్లా ప్రవర్తిస్తున్నావు. మరి అన్యుల్ని యూదుల ఆచారం ప్రకారం జీవించమని ఎందుకు బలవంతం చేస్తున్నావు?”
యెహోవాను ప్రేమించేవాళ్లు “తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు”
12 ఇక పేతురు విషయానికొస్తే, ఆయన మనుష్యుల భయానికి లొంగిపోయి కొన్నిసార్లు దారుణంగా తడబడ్డాడు. అయినా యెహోవాకు, యేసుకు నమ్మకంగా ఉన్నాడు. ఉదాహరణకు, ఆయన పదిమంది ముందూ తన బోధకుడైన యేసు ఎవరో తెలియదన్నాడు, అలా ఒక్కసారి కాదు అక్షరాలా మూడుసార్లు! (లూకా 22:54-62) మరో సందర్భంలో పేతురు ఓ క్రైస్తవునిలా ప్రవర్తించలేదు. విశ్వాసులైన అన్యజనులు, సున్నతి పొందిన యూదా క్రైస్తవులతో సమానులు కారన్నట్లు ఆయన వ్యవహరించాడు. అయితే, సంఘంలో అలాంటి తారతమ్యాలకు చోటు లేదని అపొస్తలుడైన పౌలుకు స్పష్టంగా తెలుసు. అంటే పేతురు ఆలోచన తప్పే. పేతురు ప్రవర్తన వల్ల సహోదరుల ఐక్యత దెబ్బతినకముందే పౌలు ఆయనను ముఖాముఖిగా గద్దించాడు. (గల. 2:11-14) అప్పుడు పేతురు అహం దెబ్బతిని జీవపు పరుగుపందెం నుండి వైదొలిగాడా? లేదు. పౌలు ఇచ్చిన గద్దింపును మనస్ఫూర్తిగా స్వీకరించాడు, పాటించాడు, తన పరుగును కొనసాగించాడు.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
(గలతీయులు 2:20) నేను క్రీస్తుతోపాటు మేకులతో కొయ్యకు దిగగొట్టబడ్డాను. ఇకనుండి బ్రతికేది నేను కాదు, నాలో జీవిస్తున్న క్రీస్తే. నిజానికి, నన్ను ప్రేమించి నాకోసం తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని మీద విశ్వాసంతోనే నేనిప్పుడు జీవిస్తున్నాను.
w14 9/15 16వ పేజీ, 20-21 పేరాలు
‘ఎన్ని శ్రమలు’ వచ్చినా దేవుణ్ణి యథార్థంగా సేవించండి
20 సాతాను దొంగచాటుగా చేసే దాడుల సంగతేంటి? వాటిలో ఒకటైన నిరుత్సాహాన్ని ఎలా తీసేసుకోవచ్చు? అందుకు ఒక శక్తిమంతమైన మార్గం ఏమిటంటే, విమోచన క్రయధనం గురించి ధ్యానించడం. అపొస్తలుడైన పౌలు అదే చేశాడు. తాను పనికిరానివాణ్ణని ఆయన కొన్నిసార్లు అనుకున్నాడు. అయితే, క్రీస్తు పరిపూర్ణుల కోసం కాదుగానీ, పాపుల కోసమే చనిపోయాడన్న విషయం ఆయనకు తెలుసు. ఆ పాపులలో పౌలు కూడా ఉన్నాడు. నిజానికి ఆయనిలా రాశాడు, “నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసమువలన జీవించుచున్నాను.” (గల. 2:20) అవును, పౌలు విమోచన క్రయధన ఏర్పాటును ఒప్పుకొని, అది తనకు వ్యక్తిగతంగా వర్తించిందని నమ్మాడు.
21 మీరు కూడా విమోచన క్రయధనాన్ని యెహోవా మీకు ఇచ్చిన వ్యక్తిగత బహుమానంగా భావిస్తే, ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. అంటే నిరుత్సాహం వెంటనే పోతుందని కాదు. మనలో కొంతమంది కొత్తలోకం వచ్చేంతవరకు ఈ దొంగచాటు దాడులతో పోరాడాల్సిరావచ్చు. కానీ గుర్తుంచుకోండి, పట్టుదలగా కొనసాగేవాళ్లకే బహుమతి దక్కుతుంది. దేవుని రాజ్యం శాంతిసమాధానాల్ని నెలకొల్పి, నమ్మకమైన మనుషులను పరిపూర్ణతకు తీసుకొచ్చే ఆ మహిమానిత్వ రోజుకు మనం చాలా దగ్గర్లో ఉన్నాం. కాబట్టి ఏదేమైనా, చివరికి ఎన్ని శ్రమలు అనుభవించైనా ఆ రాజ్యంలోకి ప్రవేశించాలని నిశ్చయించుకోండి.
(గలతీయులు 3:1) ఓ తెలివితక్కువ గలతీయులారా! యేసుక్రీస్తు మేకులతో కొయ్యకు దిగగొట్టబడిన సంఘటన మీకు స్పష్టంగా వర్ణించబడింది కదా, అయినా మిమ్మల్ని ఎవరు మోసం చేశారు?
it-1 880వ పేజీ
గలతీయులకు రాసిన ఉత్తరం
గలతీయలోని ఉత్తర ప్రాంతంలో నుండి వచ్చిన గాల్లిక్ అనే జాతి ప్రజల్ని మనసులో పెట్టుకునే పౌలు, “తెలివితక్కువ గలతీయులారా!” అని అన్నాడని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు. (గల 3:1) నిజానికి పౌలు గలతీయ సంఘాల్లోని కొందర్ని యూదా మతం చేత ప్రభావితులౌతున్నందుకు గద్దించాడు. ఎందుకంటే వాళ్లు కొత్త ఒప్పందం ద్వారా వచ్చే ‘విశ్వాసం వల్ల నీతిమంతులయ్యే’ బదులు, మోషే ధర్మశాస్త్రం పాటించడం ద్వారా తమను తాము నీతిమంతులుగా చూపించుకోవాలనుకున్నారు. (2:15–3:14; 4:9, 10) పౌలు ఎవరికైతే ఉత్తరం రాశాడో, ఆ ‘గలతీయ సంఘాల్లో’ (1:2) యూదులు, అన్యులు ఉన్నారు. ఈ అన్యుల్లో రెండు రకాల ప్రజలు, అంటే సున్నతి పొంది యూదులుగా మారిన వాళ్లు, సున్నతి పొందని అన్యులు ఉన్నారు; అంతేకాదు వాళ్లలో సెల్టిక్ జాతికి చెందినవాళ్లు కూడా ఉన్నారు. (అపొ 13:14, 43; 16:1; గల 5:2) వాళ్లందర్ని కలిపి గలతీ క్రైస్తవులు అని పిలిచారు, ఎందుకంటే వాళ్లు నివసించే ప్రాంతం పేరు గలతీయ. ఈ గలతీయ ప్రాంతంలోని దక్షిణ భాగానికి చెందిన వాళ్లు పౌలుకు బాగా సుపరిచితులు. వాళ్లను ఉద్దేశించే పౌలు ఆ ఉత్తరం రాసివుంటాడని అర్థమౌతుంది. అంతేకాని తాను ఎప్పుడూ సందర్శించని ఉత్తర ప్రాంతంలోని అపరిచితులను ఉద్దేశించి పౌలు రాసుండకపోవచ్చు.
చదవాల్సిన బైబిలు భాగం
(గలతీయులు 2:11-21) అయితే, కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతను చేసినదానిలో తప్పు ఉండడంతో నేను దాని గురించి అతని ముఖం మీదే అనేశాను. 12 అసలు ఏమి జరిగిందంటే, యాకోబు దగ్గర నుండి కొంతమంది వచ్చారు. వాళ్లు రాకముందు, పేతురు అన్యులతో కలిసి తినేవాడు; కానీ వాళ్లు వచ్చిన తర్వాత, సున్నతి పొందినవాళ్లకు భయపడి అతను అన్యులతో కలిసి తినడం మానేసి, అన్యులకు దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. 13 మిగిలిన యూదులు కూడా అతనిలాగే నటించడం మొదలుపెట్టారు. చివరికి బర్నబా కూడా వాళ్లలాగే నటించడం మొదలుపెట్టాడు. 14 కానీ వాళ్లు మంచివార్తకు సంబంధించిన సత్యానికి తగ్గట్టు నడుచుకోవట్లేదని నేను గమనించినప్పుడు, వాళ్లందరి ముందు కేఫాతో ఇలా అన్నాను: “యూదుడివైన నువ్వు, యూదుల్లా కాకుండా అన్యుల్లా ప్రవర్తిస్తున్నావు. మరి అన్యుల్ని యూదుల ఆచారం ప్రకారం జీవించమని ఎందుకు బలవంతం చేస్తున్నావు?” 15 మనం పుట్టుకతో యూదులం; అన్యుల్లో నుండి వచ్చిన పాపులం కాదు. 16 ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల కాదుగానీ యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం వల్లే దేవుడు ఒక మనిషిని నీతిమంతునిగా తీర్పు తీరుస్తాడని మనకు తెలుసు. కాబట్టి మనం ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల కాదుగానీ క్రీస్తు మీద విశ్వాసం ఉంచడం వల్లే నీతిమంతులుగా తీర్పు పొందాలని క్రీస్తుయేసు మీద విశ్వాసం ఉంచాం. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల ఏ ఒక్కరూ నీతిమంతులని తీర్పు పొందరు. 17 క్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్పు పొందాలని ప్రయత్నిస్తున్న మనం పాపులుగా కూడా కనిపిస్తే, క్రీస్తు మనతో పాపం చేయిస్తున్నట్టా? కానేకాదు! 18 నేను ఒకప్పుడు పడగొట్టిన వాటినే మళ్లీ కడితే నేను దోషినైనట్టే. 19 ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్లే నేను ధర్మశాస్త్రం విషయంలో చనిపోయాను. కానీ అలా చనిపోవడం వల్ల నేను దేవుని విషయంలో బ్రతికాను. 20 నేను క్రీస్తుతోపాటు మేకులతో కొయ్యకు దిగగొట్టబడ్డాను. ఇకనుండి బ్రతికేది నేను కాదు, నాలో జీవిస్తున్న క్రీస్తే. నిజానికి, నన్ను ప్రేమించి నాకోసం తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని మీద విశ్వాసంతోనే నేనిప్పుడు జీవిస్తున్నాను. 21 నేను దేవుని అపారదయను తిరస్కరించను. ఎందుకంటే ధర్మశాస్త్రం వల్లే ఒక మనిషి నీతిమంతుడైపోతే, క్రీస్తు చనిపోవడం అసలు అనవసరం.