దుర్గుణంతో నిండిపోయిన లోకంలో సద్గుణవంతులుగా ఉండడం
“మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి.”—ఫిలిప్పీయులు 2:14, 15.
1, 2. దేవుడు కనానీయులను పూర్తిగా తుడిచిపెట్టమని ఎందుకు ఆజ్ఞాపించాడు?
యెహోవా ఆజ్ఞ రాజీపడడానికి ఏ విధమైన తావీయడంలేదు. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించబోతుండగా, ప్రవక్తయైన మోషే వాళ్లతో ఇలా చెప్పాడు: “వీరు, అనగా హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులనువా[రిని] . . . నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించిన ప్రకారముగా . . . నిర్మూలము చేయవలెను.”—ద్వితీయోపదేశకాండము 7:2; 20:15.
2 యెహోవా కనికరంగల దేవుడు కదా, మరి ఆయన కనాను నివాసుల్ని పూర్తిగా తుడిచిపెట్టమని ఎందుకు ఆజ్ఞాపించాడు? (నిర్గమకాండము 34:6) ‘తమ తమ దేవతల విషయమై కనానీయులు చేసిన సమస్త హేయకృత్యములరీతిగా ఇశ్రాయేలీయులు చేసి, తమ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు తమకు నేర్పకుండునట్లు’ చేయడమనేది ఒక కారణం. (ద్వితీయోపదేశకాండము 20:15) మోషే ఇలా కూడా తెలియజేశాడు: “ఈ జనముల చెడుతనమునుబట్టియే యెహోవా నీ యెదుట నుండి వారిని వెళ్లగొట్టుచున్నాడు.” (ద్వితీయోపదేశకాండము 9:4) కనానీయులు దుర్గుణానికి మారుపేరుగా ఉన్నారు. లైంగిక దుర్నీతీ, విగ్రహారాధనలు వాళ్ల ఆరాధనకు ప్రతీకలు. (నిర్గమకాండము 23:24; 34:12, 13; సంఖ్యాకాండము 33:52; ద్వితీయోపదేశకాండము 7:5) వావివరుసల్లేని లైంగిక సంబంధాలూ, పురుషసంయోగాలూ, మృగసంయోగాలూ ‘కనాను దేశాచారాలై’ ఉన్నాయి. (లేవీయకాండము 18:3-25) అమాయకులైన పసిపిల్లలు అబద్ధదేవుళ్లకు క్రూరంగా బలియర్పించబడేవారు. (ద్వితీయోపదేశకాండము 18:9-12) ఈ జనాంగాల ఉనికి సహితం, తన ప్రజల భౌతిక నైతిక ఆత్మీయ క్షేమాలకు ముప్పు అని యెహోవా తలంచడంలో ఆశ్చర్యమేమీలేదు!—నిర్గమకాండము 34:14-16.
3. కనాను నివాసుల విషయంలో ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలను అమలుచేయకపోవడం మూలంగా వచ్చిన ఫలితం ఏమిటి?
3 దేవుని ఆజ్ఞలు పూర్తిగా అమలుచేయబడనందున, వాగ్దాన దేశాన్ని ఇశ్రాయేలీయులు జయించిన తర్వాత కూడా కనాను నివాసుల్లో అనేకమంది జీవించివున్నారు. (న్యాయాధిపతులు 1:19-21) కాలక్రమేణా, కనానీయుల మోసపూరితమైన ప్రభావం స్పష్టమవ్వసాగింది. మరి దానినిలా చెప్పవచ్చు: “వారు [ఇశ్రాయేలీయులు, యెహోవా] కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైనదాని అనుసరించుచు, వ్యర్థులై—వారి వాడుకలచొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టునున్న ఆ జనుల మర్యాదల ననుసరించి వారివంటివారైరి.” (2 రాజులు 17:15) అవును, కనానీయుల్ని నాశనం చేయమని దేవుడు ఆజ్ఞాపించడానికి కారణమైన విగ్రహారాధన, లైంగిక దురాగతాలు, పిల్లల్ని బలి అర్పించడం వంటి దుర్గుణాల్ని అనేకమంది ఇశ్రాయేలీయులు సంవత్సరాలుగా ఆచరించారు!—న్యాయాధిపతులు 10:6; 2 రాజులు 17:17; యిర్మీయా 13:27.
4, 5. (ఎ) అవిశ్వాసియైన ఇశ్రాయేలు, యూదా దేశాలకు ఏమి సంభవించింది? (బి) ఫిలిప్పీయులు 2:14, 15 వచనాల్లో ఏ ఉద్బోధ ఇవ్వబడింది, మరి ఏ ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి?
4 కాబట్టి ప్రవక్తయైన హోషేయా ఇలా ప్రకటించాడు: “ఇశ్రాయేలువారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవునిగూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశనివాసులతో వ్యాజ్యెమాడుచున్నాడు. అబద్ధసాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు హత్యచేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యెను; జనులు కన్నము వేసెదరు, మానక నరహత్యచేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులును ఆకాశ పక్షులును కాపురస్థులందరును క్షీణించుచున్నారు, సముద్ర మత్స్యములుకూడ గతించిపోవుచున్నవి.” (హోషేయ 4:1-3) సా.శ.పూ. 740లో భ్రష్టత్వానికి గురైన ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలును అష్షూరీయులు జయించారు. ఇంచుమించు ఓ శతాబ్దంపైగా గడిచిపోయిన తర్వాత అవిశ్వాస దక్షిణ రాజ్యమైన యూదాను బబులోనీయులు జయించారు.
5 దుర్గుణం మనపై ఆధిపత్యాన్ని సాధించేందుకు అనుమతించడం ఎంత అపాయకరంకాగలదో ఈ సంఘటనలు చూపిస్తున్నాయి. దేవుడు అవినీతిని ఈసడించుకుంటున్నాడు. మరి తన ప్రజలలో అవినీతిని ఆయన సహించడు. (1 పేతురు 1:14-16) నిజమే, మనం “ప్రస్తుతపు దుష్టకాలములో” అంటే అంతకంతకు అవినీతి పెరిగిపోతున్న లోకంలో జీవిస్తున్నాం. (గలతీయులు 1:4; 2 తిమోతి 3:13) అయినప్పటికీ, “మూర్ఖమైన వక్రజనము మధ్య” క్రైస్తవులందరూ తాము “నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు . . . అట్టి జనము మధ్యను [వారు] . . . లోకమందు జ్యోతులవలె” ప్రకాశించు రీతిలో ప్రవర్తిస్తూవుండాలని దేవుని వాక్యం వారికి ఉద్బోధిస్తోంది. (ఫిలిప్పీయులు 2:14, 15, 16) కానీ దుర్గుణంతో నిండిపోయిన లోకంలో మనం సద్గుణవంతులుగా ఎలా ఉండగలం? అలా ఉండడం నిజంగా సాధ్యమేనా?
దుర్గుణంతో నిండిపోయిన రోమా ప్రపంచం
6. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు సద్గుణవంతులుగా ఉండడం విషయంలో ఎందుకు సవాలును ఎదుర్కొన్నారు?
6 దుర్గుణం రోమా సమాజపు ప్రతీ కోణంలోకీ చొచ్చుకుపోయినందున మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు సద్గుణవంతులుగా ఉండే సవాల్‌ని ఎదుర్కోవాల్సి వచ్చింది. రోమా తత్వవేత్తయైన సెనికా తన సమకాలీకుల్ని గురించి ఇలా చెప్పాడు: “మనుష్యులు మరింత దుష్టులుగా అయ్యేందుకు ఒకరితో మరొకరు పోటీపడతారు. చెడును చేయాలనే తపన నానాటికీ పెరిగిపోతోంది. దాన్ని చేయకూడదనే భయం తగ్గిపోతోంది.” ఆయన రోమా సమాజాన్ని “క్రూరమృగాల సంఘం”తో పోల్చాడు. వినోదం కొరకు రోమన్లు హింసాప్రవృత్తిగల మల్లయుద్ధ పోటీలలోనూ, అశ్లీల నృత్య ప్రదర్శనలలోనూ వెదికేవారు గనుక అందులో ఆశ్చర్యమేమీలేదు.
7. సా.శ. మొదటి శతాబ్దంలోని అనేకమంది వ్యక్తులలో సాధారణంగావున్న దుర్గుణాల్ని పౌలు ఎలా వర్ణించాడు?
7 “దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి” అని అపొస్తలుడైన పౌలు రాసినప్పుడు, ఆయన మనస్సులో బహుశా మొదటి శతాబ్దంలోని ప్రజల పతనమౌతున్న ప్రవర్తన ఉండివుండవచ్చు. (రోమీయులు 1:26, 27) అపవిత్రమైన శారీరక ఆశల్ని వెంబడించేందుకు కృతనిశ్చయం చేసుకున్న రోమా సమాజం దుర్గుణంతో ముంచెత్తబడింది.
8. గ్రీకు రోమన్ సమాజాల్లో పిల్లలు తరచుగా ఎలా దోపిడీకి గురయ్యేవారు?
8 రోమన్లలో సలింగసంయోగం ఎంత ప్రబలంగావుండేదనే విషయాన్ని చరిత్ర స్పష్టం చేయడంలేదు. అయితే, వీళ్లు తమ పూర్వగాములైన గ్రీకులచే అంటే ఎవరి మధ్య ఇది విచ్చలవిడిగా ఉండేదో ఆ గ్రీకులచే ప్రభావితం చేయబడ్డారనడంలో సందేహమేమీ లేదు. పెద్దవాళ్లు యౌవన బాలురను, విద్యార్థీ బోధకుని సంబంధంలో తమ సంరక్షణక్రిందకు తీసుకొని వారిని పాడుచేయడం వాడుకగా ఉండేది. మరి అది తరచూ యౌవనస్థులను దిగజారిపోయిన లైంగిక ప్రవర్తనకు నడిపించేది. నిస్సందేహాంగా, అలాంటి దుర్గుణం వెనుకా, పిల్లల్ని అలా దురుపయోగం చేయడం వెనుకా సాతానూ అతని దయ్యాలూ ఉన్నారు.—యోవేలు 3:3; యూదా 6, 7.
9, 10. (ఎ) మొదటి కొరింథీయులు 6:9, 10 వచనాలు వివిధ రకాలైన దుర్గుణాల్ని ఎలా ఖండించాయి? (బి) కొరింథు సంఘంలోవున్న కొంతమంది పూర్వచరిత్ర ఏమిటి, మరి వాళ్ల విషయంలో ఏ మార్పు జరిగింది?
9 దైవ ప్రేరేపణతో రాస్తూ, పౌలు కొరింథులోని క్రైస్తవులకు ఇలా తెలియజేశాడు: “అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుషసంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి.”—1 కొరింథీయులు 6:9-11.
10 ఆ విధంగా, పౌలు ప్రేరేపిత పత్రిక ‘వ్యభిచారులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరని’ చెబుతూ లైంగిక దుర్నీతిని ఖండించింది. అయితే, అనేక దుర్గుణాల్ని ప్రస్తావించిన తర్వాత పౌలు ఇలా తెలియజేశాడు: “మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, . . . మీరు కడుగబడి[తిరి.]” తప్పిదస్థులు దేవుని దృష్టిలో పరిశుభ్రంగా ఉండడం, ఆయన సహాయం మూలంగానే సాధ్యమైంది.
11. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు తమ కాలంలోవున్న దుష్ట వాతారవరణంలో ఎలా నెట్టుకు రాగల్గారు?
11 అవును, దుర్గుణంతో నిండిన మొదటి శతాబ్దంనాటి లోకంలో సహితం క్రైస్తవ సద్గుణం వృద్ధిచెందింది. విశ్వాసులు “మనస్సు మారి . . . రూపాంతరము” చెందారు. (రోమీయులు 12:2) వాళ్లు తమ “మునుపటి ప్రవర్తన”ను విడిచిపెట్టి ‘తమ చిత్తవృత్తియందు నూతనపరచబడ్డారు.’ ఆ విధంగా వాళ్లు ఆ లోకపు దుర్గుణాలనుండి పారిపోయి, “నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించు”కున్నారు.—ఎఫెసీయులు 4:22-24.
దుర్గుణంతో నిండిపోయిన నేటి లోకం
12. లోకంలో 1914 నుండీ ఏ మార్పు వచ్చింది?
12 మన కాలం సంగతేమిటి? మనం జీవిస్తున్న ఈ లోకం మునుపెన్నటికన్నా ఎక్కువగా దుర్గుణంతో నిండిపోయింది. విశేషంగా 1914 నుండీ లోకం భౌగోళిక నైతిక పతనాన్ని చూస్తోంది. (2 తిమోతి 3:1-5) సద్గుణాన్ని గూర్చిన, నైతికతను గూర్చిన, పేరుప్రతిష్ఠల్ని గూర్చిన, నీతి నియమాల్ని గూర్చిన సాంప్రదాయక అభిప్రాయాల్ని తిరస్కరిస్తూ అనేకమంది తమ ఆలోచనల్లో స్వార్థపరాయణత్వాన్ని కల్గివున్నారు. అలాగే “నైతిక బుద్ధినంతటిని కోల్పోతున్నారు.” (ఎఫెసీయులు 4:19, NW) న్యూస్‌వీక్ పత్రిక ఇలా తెలియజేసింది: “మనం నైతిక సాపేక్షవాద యుగంలో జీవిస్తున్నాం.” అంతేగాక, ప్రబలమవుతున్న నైతిక వాతావరణం “తప్పొప్పులను గూర్చిన అభిప్రాయాలన్నీ వ్యక్తిగతాభిరుచికీ, భావోద్రేక ప్రాధాన్యతకూ లేక సాంస్కృతిక ఎంపికకూ సంబంధించిన విషయాలైపోయేలా చేసింది” అని కూడా తెలియజేసింది.
13. (ఎ) ఈనాటి వినోదాల్లో అనేకం, దుర్గుణాన్ని ఎలా పెంపొందిస్తున్నాయి? (బి) అయుక్తమైన వినోదం వ్యక్తులపై ఏ చెడు ప్రభావాన్ని చూపించగలదు?
13 మొదటి శతాబ్దంలో వలెనే, నేడు పతనమైన వినోదం సర్వసాధారణమై పోయింది. టెలివిజన్, రేడియో, చలనచిత్రాలూ, వీడియోలూ లైంగిక ప్రాధాన్యతగల సమాచార ప్రవాహాన్ని ఎడతెగకుండా అందిస్తున్నాయి. దుర్గుణం కంప్యూటర్ నెట్‌వర్క్‌లలోకి సహితం చొరబడింది. కంప్యూటర్ అశ్లీల వినోదమనేది ప్రస్తుత-దిన కంప్యూటర్ నెట్‌వర్క్‌లలో అంతకంతకూ అధికంగా లభ్యమౌతోంది, అది వివిధ వయస్సులకు చెందిన వ్యక్తులకు అందుబాటులోవుంది. దీనియంతటి ప్రభావం ఏమైవుంది? ఓ వార్తాపత్రిక శీర్షికా రచయిత ఇలా చెబుతున్నాడు: “రక్తాన్ని చిందించడం, అంగవిచ్ఛేధనం, చౌకబారు లైంగికత్వం మన ప్రఖ్యాతిగాంచిన సంస్కృతిని నింపివేసినప్పుడు మనం రక్తాన్ని చిందించడం, అంగవిచ్చేదనం, చౌకబారు లైంగికత్వంలకు అలవాటుపడిపోతాం. మనం మొండికెత్తి పోతాం. దుర్నీతి మనల్ని అంతగా బాధించనందున అది అంతకంతకు సహించదగినదిగా తయారవుతోంది.”—1 తిమోతి 4:1, 2 పోల్చండి.
14, 15. ప్రపంచవ్యాప్తంగా లైంగిక నైతికత పతనమవుతోందని అనడానికి ఏ రుజువుంది?
14 ది న్యూయార్క్ టైమ్స్‌లోని ఈ రిపోర్టును పరిశీలించండి: “ఏది 25 ఏళ్ల క్రిందట నైతికతకు భంగం కల్గించేదిగా తలంచబడేదో ఇప్పుడది అంగీకృతమైన జీవిత విధానం అయిపోయింది. 1980 నుండి 1991 మధ్యకాలంలో [అమెరికాలో] వివాహం చేసుకోకుండా కలిసి జీవించడాన్ని ఎంపిక చేసుకుంటున్న దంపతుల సంఖ్య 80 శాతం పెరిగింది.” ఇది ఉత్తర అమెరికాలో కన్పించే విషయం మాత్రమే కాదు. ఏసియావీక్ పత్రిక ఇలా నివేదిస్తోంది: “[ఆసియా] దేశాల్లో సాంస్కృతిక చర్చ విజృంభిస్తోంది. విషయాంశం—సాంప్రదాయిక విలువలకు వ్యతిరేకంగా లైంగిక స్వేచ్ఛ, మార్పుకోసం ఒత్తిళ్లు క్రమంగా పెరిగిపోతున్నాయి.” అనేక దేశాల్లో వ్యభిచారాన్నీ, వివాహానికి ముందు లైంగిక సంబంధాన్నీ అంగీకరించడం ఎక్కువవుతోందని గణాంకాలు చూపిస్తున్నాయి.
15 మనకాలంలో సాతాను చర్యలు ఉద్ధృతమౌతాయని బైబిలు ప్రవచించింది. (ప్రకటన 12:12) కాబట్టి, దుర్గుణం ప్రమాదభరితమైన రీతిలో ప్రబలమవ్వడం మనల్ని ఆశ్చర్యపర్చదు. ఉదాహరణకు, పిల్లల్ని లైంగికంగా దోచుకోవడం సాంక్రమిక అనుపాతాలకు చేరుకుంది.a “వాణిజ్యపరమైన లైంగిక దోపిడి, ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోని పిల్లల్నీ పాడుచేస్తోంది” అని ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి నివేదిస్తోంది. ప్రతీ సంవత్సరం, “ప్రపంచవ్యాప్తంగా పది లక్షలకన్నా ఎక్కువమంది పిల్లలు, పిల్లల-వ్యభిచారంలోనికి బలవంతంగా నెట్టబడుతున్నారనీ, లైంగికపరమైన ఉద్దేశాల కొరకు వినిమయం చేయబడ్డారనీ, అమ్మబడ్డారనీ, పిల్లల-అశ్లీల ఉత్పాదనల్లో ఉపయోగించబడ్డారనీ నివేదించబడింది.” సలింగసంయోగం కూడా అతి సామాన్యమైపోయింది. కొంతమంది రాజకీయ నాయకులూ, మత నాయకులూ దానిని ఓ “ప్రత్యామ్నాయ జీవన పద్ధతి”గా పెంపొందించడంలో నాయకత్వం వహిస్తున్నారు.”
లోక దుర్గుణాల్ని తిరస్కరించడం
16. లైంగిక నైతికతకు సంబంధించి యెహోవాసాక్షులు ఏ స్థానాన్ని వహించారు?
16 లైంగిక నైతికత విషయంలో అదుపులేని ప్రమాణాల్ని అంగీకరించే వాళ్లతో యెహోవాసాక్షులు ఏకీభవించరు. తీతు 2:11-13 వచనాలు ఇలా చెబుతున్నాయి: “సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, . . . ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.” అవును, వివాహానికి మునుపు లైంగిక సంబంధమూ, వ్యభిచారమూ, సలింగసంయోగ క్రియలూ వంటి దుర్గుణాల ఎడల మనం నిజమైన ద్వేషాన్నీ, ఏవగింపునూ అలవర్చుకోవాలి.b (రోమీయులు 12:9; ఎఫెసీయులు 5:3-5) పౌలు ఇలా ఉద్బోధించాడు: “ప్రభువు [“యెహోవా,” NW] నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతినుండి తొలగిపోవలెను.”—2 తిమోతి 2:19.
17. మద్యపానీయాల ఉపయోగాన్ని నిజ క్రైస్తవులు ఎలా దృష్టిస్తారు?
17 లోకం కొన్ని దుర్గుణాల్ని చిన్నచిన్న దుర్గుణాలుగా దృష్టిస్తుంది, నిజ క్రైస్తవులు అలాంటి దృక్కోణాల్ని తిరస్కరించాలి. ఉదాహరణకు, నేడు అనేకమంది ప్రజలు మద్యపాన దుర్వినియోగాన్ని వినోద కాలక్షేపంగా దృష్టిస్తారు. కానీ ఎఫెసీయులు 5:18వ వచనంలోవున్న ఈ సలహాను యెహోవా ప్రజలు లక్ష్యపెడతారు: “మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులైయుండుడి.” ఒక క్రైస్తవుడు త్రాగాలని ఎంపికచేసుకున్నట్లైతే, అతడు మితంగా త్రాగాలి.—సామెతలు 23:29-32.
18. యెహోవా సేవకులు తమ కుటుంబ సభ్యులతో వ్యవహరించడంలో బైబిలు సూత్రాలు వారికెలా నడిపింపునిస్తాయి?
18 ఒకరు తన వివాహ జతపైనా, పిల్లలపైనా గావుకేకలు వేయడమూ పరిహాసించడమూ లేక వారిని గాయపర్చే మాటలతో నొప్పించడమూ అనేది అంగీకృతమైన ప్రవర్తన అని లోకంలోని కొందరు దృష్టిస్తారు. యెహోవా సేవకులుగా మనం అలాంటి దృక్పథాన్ని కూడా తిరస్కరిస్తాం. సద్గుణవంతమైన నడవడిని వెంబడించాలనే దృఢనిశ్చయంతో, క్రైస్తవ భర్తలూ, భార్యలూ పౌలు ఇచ్చిన ఈ సలహాను అన్వయించుకునేందుకు కలిసి పనిచేస్తారు: “సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించినప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.”—ఎఫెసీయులు 4:31, 32.
19. వ్యాపార ప్రపంచంలో దుర్గుణం ఎంత ప్రబలంగావుంది?
19 నిజాయితీ లేకపోవడమూ, మోసమూ, అబద్ధాలాడడమూ, భయంకరమైన వ్యాపార తంత్రాలూ, దొంగతనమూ నేడు సామాన్యమైపోయాయి. సిఎఫ్ఒ వ్యాపార పత్రికలోని ఓ శీర్షిక ఇలా నివేదిస్తోంది: “4,000 మంది పనివారిపై జరిపిన ఓ సర్వేలో . . . సర్వే చేయబడిన వారిలో 31 శాతంమంది గత సంవత్సర కాలంలో జరిగిన ‘తీవ్రమైన దుష్ప్రవర్తనకు’ సాక్షులుగా ఉన్నారు.” అటువంటి దుష్ప్రవర్తనలో అబద్ధాలాడడమూ, తప్పుడు రికార్డులను చూపించడమూ, లైంగిక వేధింపూ, దొంగతనమూ చేరివున్నాయి. మనం యెహోవా దృష్టిలో నైతికంగా పరిశుభ్రంగా ఉండాలంటే, మనం అలాంటి ప్రవర్తనను విడనాడి, మన ఆర్థిక వ్యవహారాల్లో నిజాయితీగా ఉండాలి.—మీకా 6:10, 11.
20. క్రైస్తవులు ఎందుకు “ధనాపేక్ష” నుండి విడుదల పొందాల్సివుంది?
20 తాను ఓ వ్యాపార సాహసాన్ని చేసి అధిక లాభాల్ని గనుక సంపాదిస్తే దేవుని సేవచేయడానికి తనకు మరింత సమయం దొరుకుతుందని తలంచిన ఓ వ్యక్తికి ఏమి సంభవించిందో పరిశీలించండి. అతడు, భవిష్య లాభాలు ఎంతో విపరీతంగా వస్తాయని ఇతరులకు ఆశచూపి వారిని ఓ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లోనికి లాగాడు. ఈ లాభాలు వాస్తవరూపం దాల్చనప్పుడు, పెద్ద మొత్తంలో వచ్చిన నష్టాల్ని భర్తీచేసేందుకు అతడు చింతాక్రాంతుడై, తనకు అప్పగించబడిన ధనాన్ని దొంగిలించాడు. తన క్రియల్నిబట్టీ, పశ్చాత్తాపం చూపని వైఖరినిబట్టీ అతడు క్రైస్తవ సంఘంనుండి వెలివేయబడ్డాడు. “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి” అనే బైబిలు హెచ్చరిక నిశ్చయంగా వాస్తవమైంది.—1 తిమోతి 6:9, 10.
21. లోకమందు అధికారాన్ని కల్గివున్న వ్యక్తుల్లో ఏ ప్రవర్తన సర్వ సామాన్యమైవుంది, కానీ క్రైస్తవ సంఘమందు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వాళ్లు ఎలా ప్రవర్తించాలి?
21 అధికారమూ, పలుకుబడీవున్న లౌకిక వ్యక్తుల్లో తరచూ సద్గుణం కొరవడుతుంది, మరి వాళ్లు ‘అధికారం భ్రష్టత్వాన్ని కలుగజేస్తుంది’ అనే సూక్తిలో ఉన్న సత్యసంధతను కనుపరుస్తారు. (ప్రసంగి 8:9) కొన్ని దేశాల్లో లంచగొండితనమూ, మరితర రకాలైన అవినీతీ జడ్జీల పోలీసుల రాజకీయ నాయకుల జీవిత విధానాల్లో భాగమై పోయాయి. అయితే, క్రైస్తవ సంఘంలో నాయకత్వం వహిస్తున్న వారు సద్గుణవంతులై ఉండాలి. వాళ్లు ఇతరులపై ప్రభువులుగా ఉండకూడదు. (లూకా 22:25, 26) పెద్దలూ అలాగే పరిచర్య సేవకులూ “దుర్లాభాపేక్షతో” సేవ చేయకూడదు. వ్యక్తిగత లాభాపేక్షతో, తమ తీర్పును పెడద్రోవపట్టించేలా లేక ప్రభావితం చేసేలా చేసే ఏ విధమైన ప్రయత్నాలకూ లొంగిపోకూడదు.—1 పేతురు 5:2; నిర్గమకాండము 23:8; సామెతలు 17:23; 1 తిమోతి 5:21.
22 మొత్తం మీద, దుర్గుణంతో నిండిపోయిన మన లోకంలో సద్గుణవంతులుగా ఉండే ప్రస్తుతదిన సవాలును క్రైస్తవులు విజయవంతంగా ఎదుర్కొంటున్నారు. కానీ, సద్గుణంలో కేవలం దుష్టత్వాన్ని విడనాడడంకన్నా ఇంకా ఎక్కువే చేరివుంది. సద్గుణాన్ని అలవర్చుకోవడానికి నిజంగా కావల్సిందేమిటో తర్వాతి శీర్షిక చర్చిస్తుంది.
[అధస్సూచీలు]
a తేజరిల్లు! (ఆంగ్లం) అక్టోబరు 8, 1993లో ఉన్న “మీ పిల్లల్ని కాపాడండి!” అనే శీర్షికల పరంపరను చూడండి.
b మొదటి శతాబ్దంలోని కొంతమంది తమ ప్రవర్తనలో మార్పులు చేసుకున్నట్లుగానే మునుపు సలింగసంయోగ క్రియల్లో పాల్గొన్న వాళ్లు మార్పులు చేసుకొనగలరు. (1 కొరింథీయులు 6:11) సహాయకరమైన సమాచారం తేజరిల్లు! ఏప్రిల్ 8, 1995 పేజీలు 23-25లలో ఇవ్వబడింది.
పునఃసమీక్షించాల్సిన విషయాలు
◻ కనానీయులను పూర్తిగా తుడిచిపెట్టమని యెహోవా ఎందుకు ఆజ్ఞాపించాడు?
◻ మొదటి శతాబ్దంలో సర్వ సామాన్యమైవున్న దుర్గుణాలు ఏవి, మరి క్రైస్తవులు అలాంటి వాతావరంలో ఎలా నెట్టుకురాగల్గారు?
◻ లోకం 1914 నుండీ భౌగోళిక నైతిక పతనాన్ని చూస్తుందనడానికి ఏ రుజువుంది?
◻ యెహోవా ప్రజలు తిరస్కరించాల్సిన సామాన్యమైన దుర్గుణాలు ఏవి?
22. తర్వాతి శీర్షిక ఏమి చర్చిస్తుంది?
[9వ పేజీలోని చిత్రం]
మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు దుర్గుణంతో నిండిపోయిన లోకంలో జీవించినప్పటికీ, సద్గుణవంతులుగా ఉన్నారు
[10వ పేజీలోని చిత్రం]
అనేకమంది యౌవనస్థులూ, మరితరులూ అశ్లీల దృశ్యాల్ని సులభంగా చూడడానికి వీలుకల్పిస్తూ దుర్గుణం కంప్యూటర్ నెట్వర్క్స్లోనికి చొరబడింది
[12వ పేజీలోని చిత్రం]
క్రైస్తవులు ఇతరుల నిజాయితీలేని కుతంత్రాల్ని అనుసరించక సద్గుణవంతులుగా ఉండాలి