అధ్యాయం 12
కుటుంబానికి హాని కలిగించే సమస్యలను మీరు అధిగమించగలరు
1. కొన్ని కుటుంబాలలో ఏ నిగూఢ సమస్యలు ఉనికిలో ఉన్నాయి?
పాత కారును ఇంతక్రితమే కడిగి, దానికి మైనం పూశారు. అటు ప్రక్కగా నడిచి వెళ్లే వారికి అది మెరుస్తూ చాలా క్రొత్తదానిలా కనిపిస్తుంది. అయితే ఉపరితలం క్రింద, ఆ వాహనం భాగాన్ని క్షీణింపజేసే చిలుము నశింపజేస్తుంది. కొన్ని కుటుంబాల విషయం కూడా అంతే. బయటి నుండి చూసే వారికి అంతా చక్కగా కనిపించినప్పటికీ, చిరునవ్వులు చిందించే మొహాలు భయాన్ని, బాధను కప్పిపుచ్చుతాయి. మూసిన తలుపుల వెనుక క్షీణింపజేసే సంగతులు కుటుంబ శాంతిని హరిస్తున్నాయి. ఈ ప్రభావాన్ని చూపగల రెండు సమస్యలు త్రాగుబోతుతనం మరియు దౌర్జన్యం.
త్రాగుబోతుతనం వలన కలిగే హాని
2. (ఎ) మత్తు పానీయాల ఉపయోగం విషయంలో బైబిలు దృక్కోణం ఏమిటి? (బి) త్రాగుబోతుతనం అంటే ఏమిటి?
2 మత్తు పానీయాలను తగు మాత్రంగా సేవించడాన్ని బైబిలు ఖండించడం లేదు, అయితే త్రాగుబోతుతనాన్ని మాత్రం అది ఖండిస్తుంది. (సామెతలు 23:20, 21; 1 కొరింథీయులు 6:9, 10; 1 తిమోతి 5:23; తీతు 2:2, 3) అయితే త్రాగుబోతుతనం మద్యపానాసక్తి కంటే ఎక్కువే; అదీ మత్తు పానీయాలను మరీ ఎక్కువగా ఎప్పుడూ త్రాగడం, ఎంత త్రాగుతున్నాం అనే దానిపై అదుపు లేకపోవడం. త్రాగుబోతులు పెద్దవయస్సుగల వారు కావచ్చు. దుఃఖకరంగా, వారు యౌవనస్థులు కూడా కావచ్చు.
3, 4. త్రాగుబోతుతనం యొక్క ప్రభావం త్రాగుబోతు యొక్క భార్యాపిల్లలపై ఎలా ఉంటుంది?
3 మత్తు పానీయాల దుర్వినియోగం కుటుంబ శాంతిని నాశనం చేయగలదని బైబిలు ఎంతో పూర్వమే చెప్పింది. (ద్వితీయోపదేశకాండము 21:18-21) త్రాగుబోతుతనం యొక్క క్షీణింపజేసే ప్రభావాన్ని మొత్తం కుటుంబం చవిచూస్తుంది. భర్త యొక్క త్రాగే అలవాటును మానిపించేందుకు ప్రయత్నించడంలో లేక అతని ఊహించలేని ప్రవర్తనతో వ్యవహరించడంలో భార్య నిమగ్నమై ఉండవచ్చు.a ఆమె మద్యాన్ని దాచి, దాన్ని పడేసి, అతని డబ్బును దాచేసి, కుటుంబం ఎడల, జీవితం ఎడల చివరికి దేవుని ఎడల అతనికి గల ప్రేమను యాచిస్తుంది, ఇలా అనేక మార్గాలు ప్రయత్నిస్తుంది—అయితే మద్యపాని ఇంకా త్రాగుతూనే ఉంటాడు. అతని త్రాగే అలవాటును అదుపు చేసేందుకు ఆమె పదే పదే చేసిన ప్రయత్నాలు విఫలమౌతుండగా, ఆమె నిరాశ చెంది తాను అది సాధించలేనని భావిస్తుంది. ఆమె భయం, కోపం, దోషినన్న భావన, ఇబ్బంది, చింత మరియు స్వగౌరవం లేకపోవడం వంటి వాటితో బాధపడుతుండవచ్చు.
4 తలిదండ్రులలో ఒకరి త్రాగుబోతుతనం యొక్క ప్రభావాలనుండి పిల్లలు తప్పించుకోలేరు. కొందరిపై శారీరకంగా దాడి చేయబడుతుంది. కొందరు లైంగిక దురాచారానికి గురౌతారు. తలిదండ్రులలో ఒకరి త్రాగుబోతుతనానికి తాము కారకులమని వారు తమను తాము నిందించుకోవచ్చు. ఇతరులను విశ్వసించే వారి సామర్థ్యం, త్రాగుబోతు యొక్క అసమమైన ప్రవర్తన ద్వారా నలుగగొట్టబడుతుంది. ఇంట్లో ఏమి జరుగుతుందో దాని గురించి వారు హాయిగా మాట్లాడలేరు గనుక, పిల్లలు తమ భావాలను అణుచుకోవడాన్ని నేర్చుకోవచ్చు, తరచూ అది హానికరమైన శారీరక పర్యవసానాలను కలిగివుండవచ్చు. (సామెతలు 17:22) అలాంటి పిల్లలు, స్వయం నమ్మకం లేక స్వగౌరవం లోపించడంతోనే పెరిగి పెద్దవారు కావచ్చు.
కుటుంబం ఏమి చేయవచ్చు?
5. త్రాగుబోతుతనంతో ఎలా వ్యవహరించాలి, అది ఎందుకు కష్టం?
5 త్రాగుబోతుతనాన్ని నివారించలేమని అనేకమంది అధికారులు చెబుతున్నప్పటికీ, పూర్తిగా మానుకోవడం అనే కార్యక్రమం ద్వారా కొంత నయం చేయవచ్చని అనేకులు అంగీకరిస్తారు. (మత్తయి 5:29 పోల్చండి.) అయితే, తనకు ఒక సమస్య ఉందని త్రాగుబోతు సాధారణంగా ఒప్పుకోడు గనుక అతను సహాయాన్ని అంగీకరించేలా చేయడం చెప్పడంకంటే చాలా కష్టం. అయినప్పటికీ, త్రాగుబోతుతనం తమను ఏ విధంగా ప్రభావితం చేసిందో దానికి అనుగుణంగా కుటుంబ సభ్యులు చర్యలు తీసుకుంటే, తనకు సమస్య ఉందని త్రాగుబోతు గుర్తించడం ప్రారంభిస్తాడు. త్రాగుబోతులకు, వారి కుటుంబాలకు సహాయం చేయడంలో అనుభవమున్న ఒక వైద్యుడు ఇలా చెప్పాడు: “అత్యంత ముఖ్యమైన విషయం అని నేను భావించేది ఏమంటే, కుటుంబసభ్యులు తమ అనుదిన పనుల్లో తమకు వీలైనంత ప్రయోజనకరమైన రీతిలో తాము కొనసాగడమే. తనకు, కుటుంబంలోని మిగిలిన వారికీ మధ్యగల అతి గొప్ప తేడాను త్రాగుబోతు అంతకంతకు ఎక్కువగా ఎదుర్కోవలసి వస్తుంది.”
6. త్రాగుబోతు సభ్యుడున్న కుటుంబాలకు సలహా ఇచ్చేందుకు ఏది శ్రేష్ఠమైన మూలం?
6 మీ కుటుంబంలో త్రాగుబోతు గనుక ఉంటే, మీకు వీలైనంత యోగ్యంగా మీరు మీ జీవితాన్ని కొనసాగించేందుకు బైబిలు యొక్క ప్రేరేపిత సలహా మీకు సహాయం చేస్తుంది. (యెషయా 48:17; 2 తిమోతి 3:16, 17) త్రాగుబోతు తనంతో విజయవంతంగా వ్యవహరించేందుకు కుటుంబాలకు సహాయపడిన కొన్ని సూత్రాలను పరిశీలించండి.
7. కుటుంబ సభ్యులలో ఒకరు త్రాగుబోతు అయితే దానికి బాధ్యులు ఎవరు?
7 నిందంతా మీపైనే వేసుకోడాన్ని మానుకోండి. బైబిలు ఇలా చెబుతుంది: “ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను” మరియు “మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.” (గలతీయులు 6:5; రోమీయులు 14:12) కుటుంబ సభ్యులే బాధ్యులని సూచించేందుకు త్రాగుబోతు ప్రయత్నించవచ్చు. ఉదాహరణకు, అతను ఇలా అనవచ్చు: “మీరు నన్ను సరిగ్గా చూసుకుని ఉంటే, నేను త్రాగేవాన్ని కాదు.” ఇతరులు అతనితో ఏకీభవిస్తే, అతను త్రాగడాన్ని కొనసాగించేందుకు వారు అతన్ని ప్రోత్సహిస్తున్నారు. అయితే, పరిస్థితుల లేక ఇతర ప్రజల వలన మనం బాధింపబడినప్పటికీ, త్రాగుబోతులతో పాటు మనమందరం మనం చేసే వాటికి బాధ్యులం.—ఫిలిప్పీయులు 2:12 పోల్చండి.
8. తన సమస్య యొక్క పర్యవసానాలను ఎదుర్కోడానికి త్రాగుబోతుకు సహాయం చేయగల కొన్ని మార్గాలు ఏవి?
8 త్రాగుబోతు త్రాగడం వలన కలిగే పర్యవసానాల నుండి అతన్ని మీరు ఎల్లప్పుడూ కాపాడాలని భావించకండి. కోపంగా ఉన్న వారి గురించి చెప్పబడిన ఒక బైబిలు సామెత త్రాగుబోతులకు కూడా అన్వయిస్తుంది: “వాని తప్పించినను వాడు మరల కోపించుచునే [త్రాగుతూనే] యుండును.” (సామెతలు 19:19) త్రాగుబోతు తన త్రాగుడు యొక్క ప్రభావాలను అనుభవించనివ్వండి. త్రాగుడు గొడవ తర్వాత అతనే దాన్ని శుభ్రం చేయనివ్వండి లేక త్రాగిన మరుసటి ఉదయం అతని యజమానికి అతనినే ఫోను చేయనివ్వండి.
కుటుంబ సమస్యలను తీర్చడంలో క్రైస్తవ పెద్దలు సహాయానికి ఎంతో గొప్ప మూలంగా ఉండగలరు
9, 10. త్రాగుబోతుల కుటుంబాలు ఎందుకు సహాయాన్ని అంగీకరించాలి, ప్రాముఖ్యంగా వారు ఎవరి సహాయాన్ని వెదకాలి?
9 ఇతరుల నుండి సహాయాన్ని అంగీకరించండి. సామెతలు 17:17 ఇలా చెబుతుంది: “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.” మీ కుటుంబంలో త్రాగుబోతు ఉన్నప్పుడు, పరిస్థితి చిరాకు కలిగించేదిగా ఉంటుంది. మీకు సహాయం అవసరం. మద్దతు కొరకు ‘నిజమైన స్నేహితులపై’ ఆధారపడడాన్ని నిరాకరించకండి. (సామెతలు 18:24) అర్థం చేసుకోగల ఇతరులతో లేక మీ వంటి పరిస్థితినే ఎదుర్కొన్న వారితో మాట్లాడటం, ఏమి చేయాలి మరియు ఏమి చేయకూడదు అనే విషయాలపై ఆచరణాత్మకమైన సలహాలను అందించవచ్చు. అయితే సమతూకం కలిగి ఉండండి. మీరు నమ్మే వారితో, మీ ‘ఆంతరంగిక విషయాలను’ కాపాడే వారితో మాట్లాడండి.—సామెతలు 11:13.
10 క్రైస్తవ పెద్దలను నమ్మడం నేర్చుకోండి. క్రైస్తవ సంఘంలోని పెద్దలు సహాయానికి గొప్ప మూలంవలె ఉండగలరు. పరిపక్వత చెందిన ఈ పురుషులు, దేవుని వాక్యంలో విద్యావంతులు మరియు దాని సూత్రాలను అన్వయించుకోవడంలో అనుభవజ్ఞులైయున్నారు. “గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను” వారు ఉండగలరు. (యెషయా 32:2) క్రైస్తవ పెద్దలు సంఘం మొత్తాన్ని హానికరమైన ప్రభావాలనుండి కాపాడటమే కాక వారు సమస్యలు గల వ్యక్తులకు ఆదరణను, విశ్రాంతిని ఇచ్చి వారి ఎడల వ్యక్తిగత ఆసక్తిని కనపరుస్తారు. వారి సహాయం నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందండి.
11, 12. త్రాగుబోతుల కుటుంబాలకు అతి గొప్ప సహాయాన్ని ఎవరు అందిస్తారు, ఆ మద్దతు ఎలా ఇవ్వబడుతుంది?
11 అన్నిటికంటే మిన్నగా, యెహోవా నుండి బలాన్ని పొందండి. బైబిలు ఆప్యాయంగా మనకిలా నిశ్చయతనిస్తుంది: “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.” (కీర్తన 34:18) త్రాగుబోతైన కుటుంబ సభ్యునితో జీవించడం ద్వారా వచ్చే ఒత్తిడి వలన మీ హృదయం విరిగినట్లు లేక మీ మనస్సు నలిగినట్లు మీరు భావిస్తే, ‘యెహోవా మీకు ఆసన్నుడు’ అని తెలుసుకోండి. మీ కుటుంబ పరిస్థితి ఎంత కష్టంగా ఉందో ఆయన అర్థం చేసుకోగలడు.—1 పేతురు 5:6, 7.
12 యెహోవా తన వాక్యంలో ఏమి చెబుతున్నాడో దాన్ని విశ్వసించడం, మీరు చింతతో వ్యవహరించేందుకు మీకు సహాయం చేయగలదు. (కీర్తన 130:3, 4; మత్తయి 6:25-34; 1 యోహాను 3:19, 20) దేవుని వాక్యాన్ని చదవడం, దానిలోని సూత్రాల ప్రకారం జీవించడం, మీరు దేవుని పరిశుద్ధాత్మను పొందేలా సహాయం చేస్తుంది, ఆ పరిశుద్ధాత్మ దినదినం తాళుకోడానికి “బలాధిక్యము”ను మీకు అనుగ్రహించగలదు.—2 కొరింథీయులు 4:7.b
13. అనేక కుటుంబాలకు హాని కలిగించే రెండవ సమస్య ఏమిటి?
13 మద్యాన్ని అధికంగా సేవించడం, కుటుంబాలకు హాని కలిగించే మరొక సమస్యకు దారి తీయవచ్చు, అదే గృహ దౌర్జన్యం.
గృహ దౌర్జన్యం కలిగించే హాని
14. గృహ దౌర్జన్యం ఎప్పుడు ప్రారంభమైంది, నేడు పరిస్థితి ఎలా ఉంది?
14 మానవ చరిత్రలోని మొదటి దౌర్జన్య సంఘటన, కయీను మరియు హేబెలను ఇద్దరు సహోదరులు ఇమిడివున్న గృహ దౌర్జన్య క్రియయైయున్నది. (ఆదికాండము 4:8) అప్పటినుండి, మానవజాతి అన్ని రకాలైన గృహ దౌర్జన్యాలతో పీడింపబడింది. భార్యలను కొట్టే భర్తలు, భర్తలపై దాడి చేసే భార్యలు, తమ చిన్న పిల్లలను క్రూరంగా కొట్టే తలిదండ్రులు మరియు తమ వృద్ధ తలిదండ్రులను అనాదరించే పెరిగిన పిల్లలు ఉన్నారు.
15. గృహ దౌర్జన్యం ద్వారా కుటుంబ సభ్యులు భావోద్రేకంగా ఎలా ప్రభావితం చెందుతారు?
15 గృహ దౌర్జన్యం వలన కలిగే హానిలో కేవలం శారీరక గాట్లు మాత్రమే ఇమిడిలేవు. కొట్టబడిన ఒక భార్య ఇలా చెప్పింది: “మీరు దోషినన్న భావాన్ని మరియు అవమానాన్ని ఎంతగానో ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనేక ఉదయాలు, అదంతా ఒక పీడ కల అని అనుకుంటూ పడక మీదే ఉండాలనిపిస్తుంది.” గృహ దౌర్జన్యాన్ని చూసే, అనుభవించే పిల్లలు, తాము పెరిగి పెద్దవారై తమ స్వంత కుటుంబాలను కలిగివున్నప్పుడు వారు కూడా దౌర్జన్యపూరితంగానే ఉండవచ్చు.
16, 17. భావోద్రేక దురాచారం అంటే ఏమిటి, కుటుంబ సభ్యులు దాని చేత ఎలా ప్రభావితం చెందుతారు?
16 గృహ దౌర్జన్యం కేవలం శారీరక దురాచారానికి మాత్రమే పరిమితం కాలేదు. తరచూ ఆ దాడి మౌఖికమైనది. సామెతలు 12:18 ఇలా చెబుతుంది: “కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు.” గృహ దౌర్జన్యంలో ఇమిడివున్న ‘కత్తిపోట్లలో’ బూతులు తిట్టడం, అరవడం, దానికితోడు తదేకంగా విమర్శించడం, నీచంగా అవమానించడం మరియు శారీరక దౌర్జన్యం చేస్తానన్న బెదిరింపులు కూడా ఉన్నాయి. భావోద్రేక దౌర్జన్యం యొక్క గాయాలు అదృశ్యమైనవి, తరచూ ఇతరులు వాటిని గమనించలేరు.
17 పిల్లలను భావోద్రేకంగా కొట్టడం ప్రాముఖ్యంగా బాధాకరంగా ఉంటుంది, అందులో పిల్లవాని సామర్థ్యాలను, కౌశలాలను లేక వ్యక్తిగా వారి విలువలను తగ్గించడం మరియు విమర్శించడం ఇమిడివున్నాయి. అలాంటి మౌఖిక దురాచారం పిల్లవాని నమ్మకాన్ని నాశనం చేస్తుంది. పిల్లలందరికీ క్రమశిక్షణ అవసరం అన్నది వాస్తవమే. అయితే తండ్రులకు బైబిలు ఇలా ఉపదేశిస్తుంది: “మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.”—కొలొస్సయులు 3:21.
గృహ దౌర్జన్యాన్ని ఎలా నివారించాలి
పరస్పరం ప్రేమించుకుని, గౌరవించుకునే క్రైస్తవ దంపతులు సమస్యలను పరిష్కరించుకోడానికి వెంటనే చర్య గైకొంటారు
18. గృహ దౌర్జన్యం ఎక్కడ ప్రారంభమౌతుంది, దాన్ని ఆపేందుకు బైబిలు చూపే మార్గం ఏమిటి?
18 గృహ దౌర్జన్యం హృదయంలో మరియు మనస్సులో ప్రారంభమౌతుంది; మనం ఎలా ప్రవర్తిస్తామన్నది మనం ఎలా ఆలోచిస్తామో దానినుండే ప్రారంభమౌతుంది. (యాకోబు 1:14, 15) దౌర్జన్యాన్ని ఆపేందుకు, దౌర్జన్యం చేసే వ్యక్తి తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవలసి ఉంటుంది. (రోమీయులు 12:2) అది సాధ్యమేనా? అవును. ప్రజలను మార్చగల శక్తి దేవుని వాక్యానికి ఉంది. అది ‘బలంగా నాటుకుని’ ఉన్న వినాశకర దృక్పథాలను కూడా తీసేయగలదు. (2 కొరింథీయులు 10:4; హెబ్రీయులు 4:12) బైబిలును గూర్చిన కచ్చితమైన జ్ఞానం ఎంత సంపూర్ణంగా మార్పు తెచ్చేందుకు సహాయపడగలదంటే, ప్రజలు ఓ నవీన స్వభావాన్ని ధరించుకున్నారని వారిని గూర్చి చెప్పబడుతుంది.—ఎఫెసీయులు 4:22-24; కొలొస్సయులు 3:8-10.
19. ఒక క్రైస్తవుడు వివాహ జతను ఎలా దృష్టించాలి, వారితో ఎలా వ్యవహరించాలి?
19 వివాహ జత యొక్క దృక్కోణం. దేవుని వాక్యం ఇలా చెబుతుంది: “పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.” (ఎఫెసీయులు 5:28) భర్తలు తమ భార్యలను ‘ఎక్కువ బలహీనమైన ఘటమని ఎంచి సన్మానించాలని’ కూడా బైబిలు చెబుతుంది. (1 పేతురు 3:7) భార్యలు తమ ‘భర్తలను ప్రేమించాలని’ మరియు వారి ఎడల ‘మిక్కుటమైన గౌరవాన్ని’ కలిగి ఉండాలని బోధింపబడుతున్నారు. (తీతు 2:4; ఎఫెసీయులు 5:33) దేవునికి భయపడే ఏ భర్తా తన భార్యపై శారీరకంగా లేక మౌఖికంగా దాడి చేస్తుంటే ఆయన ఆమెను వాస్తవంగా ప్రేమించి, సన్మానిస్తున్నానని సత్యవంతంగా ఎంతమాత్రం చెప్పలేడు. తన భర్తపై అరిచే, ఆయనను వ్యంగ్యంగా పిలిచే లేక ఆయనను ఎడతెగక తిట్టే ఏ భార్యా తాను తన భర్తను నిజంగా ప్రేమించి, గౌరవిస్తున్నానని చెప్పలేదు.
20. తమ పిల్లల విషయమై తలిదండ్రులు ఎవరి ఎదుట బాధ్యులు, తలిదండ్రులు తమ పిల్లలనుండి నిర్హేతుకమైన వాటిని ఎందుకు అపేక్షించకూడదు?
20 పిల్లల ఎడల ఉండవలసిన సరైన దృక్కోణం. పిల్లలు తమ తలిదండ్రుల ప్రేమ మరియు అవధానం పొందడానికి అర్హులు, అది వారికి అవసరం. పిల్లలు “యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము” మరియు ‘బహుమానమని’ దేవుని వాక్యం చెబుతోంది. (కీర్తన 127:3) ఆ స్వాస్థ్యం ఎడల శ్రద్ధ తీసుకోవలసిన బాధ్యత తలిదండ్రులకు యెహోవా ఎదుటవుంది. “పిల్లవాని చేష్టలు” మరియు చిన్నతనంలోని “మూఢత్వము”ను గురించి బైబిలు మాట్లాడుతుంది. (1 కొరింథీయులు 13:11; సామెతలు 22:15) తలిదండ్రులు తమ పిల్లల్లో మూఢత్వాన్ని చూస్తే వారు ఆశ్చర్యపడకూడదు. పిల్లలు పెద్దవాళ్లు కాదు. తలిదండ్రులు పిల్లవాని వయస్సు, కుటుంబ పూర్వరంగం మరియు వాని సామర్థ్యాలను మించి పిల్లవాని నుండి ఎక్కువ కోరకూడదు.—ఆదికాండము 33:12-14 చూడండి.
21. వృద్ధ తలిదండ్రులను దృష్టించాల్సిన మరియు వారితో వ్యవహరించాల్సిన దైవిక మార్గం ఏమిటి?
21 వృద్ధ తలిదండ్రుల ఎడల దృక్కోణం. లేవీయకాండము 19:32 ఇలా చెబుతుంది: ‘తల నెరసినవానియెదుట లేచి ముసలివాని ముఖమును ఘనపర్చాలి.’ అలా దేవుని వాక్యం వృద్ధుల ఎడల గౌరవాన్ని మరియు ఉన్నత భావాన్ని పురికొల్పుతుంది. వృద్ధ తల్లి/తండ్రి అతిగా కోరుతుంటే లేక అస్వస్థతతో ఉండి బహుశా కదలలేక లేదా త్వరగా ఆలోచించలేక పోతుంటే అలా చేయడం ఒక సవాలు వలెనే ఉండవచ్చు. అయినప్పటికీ, “తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము” చేయాలని పిల్లలకు జ్ఞాపకం చేయబడుతుంది. (1 తిమోతి 5:4) వారిని సన్మానించి గౌరవించాలని బహుశా వారికి ఆర్థికంగా కూడా అందించాలని దీని అర్థం. వృద్ధ తలిదండ్రుల ఎడల దురాచారపూరితంగా ప్రవర్తించడం లేక ఇతరత్రా చేయడం మనం ప్రవర్తించాలని బైబిలు చెబుతున్న మార్గానికి విరుద్ధం.
22. గృహ దౌర్జన్యాన్ని అధిగమించేందుకుగల ముఖ్య లక్షణం ఏమిటి, దాన్ని ఎలా ప్రదర్శించవచ్చు?
22 ఆశానిగ్రహాన్ని వృద్ధిపర్చుకోండి. సామెతలు 29:11 ఇలా చెబుతుంది: “బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును జ్ఞానముగలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును.” మిమ్మల్ని మీరు ఎలా అదుపులో పెట్టుకుంటారు? విసుగును మీలో పేరుకుపోనిచ్చే బదులు, తలెత్తే విభేదాలను త్వరగా తీర్చుకోడానికి సిద్ధంగా ఉండండి. (ఎఫెసీయులు 4:26, 27) మీరు అదుపు తప్పుతున్నారని మీరు భావిస్తే అక్కడినుండి వెళ్లిపోండి. దేవుని పరిశుద్థాత్మ మీలో ఆశానిగ్రహాన్ని ఉత్పన్నం చేసేందుకు ప్రార్థించండి. (గలతీయులు 5:22, 23) అలా నడచి వెళ్లడం లేక శారీరక వ్యాయామాన్ని చేయడం మీ భావోద్రేకాలను మీరు అదుపు చేసుకునేందుకు మీకు సహాయం చేయగలదు. (సామెతలు 17:14, 27) ‘దీర్ఘశాంతం కల్గి’ ఉండేందుకు కృషి చేయండి.—సామెతలు 14:29.
విడిపోవాలా లేక కలిసివుండాలా?
23. క్రైస్తవ సంఘంలోని ఒక సభ్యుడు తదేకంగా మరియు పశ్చాత్తాపం చెందకుండా కోపోద్రేకి అయి బహుశా తన భార్య లేక పిల్లలపై శారీరక దాడి చేస్తుంటే ఏమి సంభవించగలదు?
23 దేవునిచేత ఖండించబడిన పనుల్లో “ద్వేషములు, కలహము . . . క్రోధములు” ఉన్నాయని కూడా బైబిలు సూచిస్తూ, ‘వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు’ అని పేర్కొంటుంది. (గలతీయులు 5:19-21) కాబట్టి, క్రైస్తవున్నని చెప్పుకునే ఎవరైనా తదేకంగా మరియు పశ్చాత్తాపం చెందకుండా కోపోద్రేకి అయి బహుశా తన భార్య లేక పిల్లలపై శారీరక దాడి చేస్తుంటే అతన్ని క్రైస్తవ సంఘం నుండి బహిష్కరించవచ్చు. (2 యోహాను 9, 10 పోల్చండి.) ఈ విధంగా దురాచారం చేసే వారు లేకుండా సంఘం శుభ్రంగా ఉంచబడుతుంది.—1 కొరింథీయులు 5:6, 7; గలతీయులు 5:9.
24. (ఎ) దురాచారానికి గురయ్యే భార్య/భర్త ఎలా ప్రతిస్పందించాలని తీర్మానించుకోవచ్చు? (బి) శ్రద్ధగల స్నేహితులు మరియు పెద్దలు దురాచారానికి గురైన భార్య/భర్తకు ఎలా మద్దతును ఇవ్వవచ్చు, అయితే వారు ఏది చేయకూడదు?
24 క్రైస్తవులు ఎవరైనా, ప్రస్తుతం ఎలాంటి మార్పు చూపని భర్త/భార్య ద్వారా కొట్టబడుతుంటే అప్పుడేమిటి? కొందరు ఏదో ఒక కారణం చేత, దురాచారం చేసే భర్తతోనే జీవించాలని నిర్ణయించుకున్నారు. తమ శారీరక, మానసిక మరియు ఆత్మీయ ఆరోగ్యానికి—బహుశా తమ జీవితానికి కూడా—ముప్పు వాటిల్లుతుందని భావించి మరి కొందరు వారిని వదిలేయాలని నిర్ణయించుకున్నారు. గృహ దౌర్జన్యానికి గురౌతున్న బాధపడే వ్యక్తి, ఈ పరిస్థితుల్లో ఏమి తీర్మానించుకున్నా అది యెహోవా ఎదుట ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత నిర్ణయం అవుతుంది. (1 కొరింథీయులు 7:10, 11) మంచి కోరే స్నేహితులు, బంధువులు లేక క్రైస్తవ పెద్దలు సహాయాన్ని మరియు సలహాను అందించాలని కోరుకోవచ్చు, అయితే ఫలానా ప్రత్యేక చర్యనే తీసుకోమని వారు బాధింపబడే వ్యక్తిని ఒత్తిడి చేయకూడదు. అలా చేయడం అతని లేక ఆమె స్వంత నిర్ణయం.—రోమీయులు 14:4; గలతీయులు 6:5.
హాని కలిగించే సమస్యలకు అంతం
25. కుటుంబం ఎడల యెహోవాకుగల సంకల్పం ఏమిటి?
25 యెహోవా ఆదాము హవ్వలను వివాహ బంధంలో ఐక్యపరచినప్పుడు, త్రాగుబోతుతనం లేక దౌర్జన్యం వంటి హానికరమైన సమస్యలతో కుటుంబాలు పీడింపబడాలని ఆయన ఎన్నడూ సంకల్పించలేదు. (ఎఫెసీయులు 3:14, 15) ప్రేమ మరియు శాంతికి స్థానంగా మరియు కుటుంబంలోని ప్రతి వ్యక్తి యొక్క మానసిక, భావోద్రేక మరియు ఆత్మీయ అవసరతల ఎడల శ్రద్ధ వహించబడే స్థలంగా కుటుంబం ఉండవలసింది. అయితే పాపం ప్రవేశించడంతో కుటుంబ జీవితం త్వరగా క్షీణించడం ప్రారంభించింది.—ప్రసంగి 8:9 పోల్చండి.
26. యెహోవా అపేక్షిస్తున్న వాటికి అనుగుణ్యంగా జీవించాలని ప్రయత్నించే వారికి ఏ భవిష్యత్తు వేచివుంది?
26 సంతోషకరంగా, కుటుంబం ఎడల తనకుగల సంకల్పాన్ని యెహోవా దేవుడు విడనాడలేదు. ప్రజలకు ‘ఎవరివలనను భయము లేకుండ వారు సురక్షితముగా నివసించే’ శాంతియుత నూతన లోకాన్ని తీసుకువస్తానన్నది ఆయన వాగ్దానం. (యెహెజ్కేలు 34:28) ఆ సమయంలో, నేడు కుటుంబానికి హాని కలిగించే త్రాగుబోతుతనం, గృహ దౌర్జన్యం లేక ఇతర సమస్యలు గతించిన సంగతులై ఉంటాయి. ప్రజలు తమ భయాన్ని బాధను దాచుకోడానికి కాక వారు ‘బహు క్షేమము కలిగి సుఖిస్తుంటారు’ గనుక చిరునవ్వులు చిందిస్తారు.—కీర్తన 37:11.
a త్రాగుబోతులను మగ వారిగా మేము సంభోదించినప్పటికీ, త్రాగుబోతు ఆడ వ్యక్తి అయినప్పుడు కూడా ఈ సూత్రాలు అదే రీతిలో అన్వయిస్తాయి.
b కొన్ని దేశాల్లో, త్రాగుబోతులకు వారి కుటుంబాలకు సహాయపడేందుకు ప్రత్యేకింపబడిన చికిత్సా కేంద్రాలు, ఆసుపత్రులు మరియు నయం చేసే కార్యక్రమాలు ఉన్నాయి. అలాంటి సహాయాన్ని తీసుకోవాలా వద్దా అన్నది వ్యక్తిగత నిర్ణయం. వాచ్ టవర్ సొసైటీ ఏ ప్రత్యేక చికిత్సనూ ప్రమాణీకరించదు. అయితే, సహాయాన్ని పొందేటప్పుడు లేఖన సూత్రాలకు విరుద్ధమైన కార్యకలాపాలలో ఇమిడిపోకుండా ఒకరు జాగ్రత్తవహించాల్సి ఉంటుంది.