కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నశించిపోయేలా మనమెన్నడూ వెనుక తీయకుందాము!
    కావలికోట—1999 | డిసెంబరు 15
    • నశించిపోయేలా మనమెన్నడూ వెనుక తీయకుందాము!

      “మనము నశించుటకు వెనుకతీయువారము కాము.”—హెబ్రీయులు 10:39.

      1. అపొస్తలుడైన పేతురు భయపడిపోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి?

      వారందరూ తనను విడిచిపెట్టి చెదరిపోతారని తమ ప్రియమైన ప్రభువైన యేసు చెప్పినప్పుడు అపొస్తలులు విభ్రాంతి చెంది ఉంటారు. ఆయనకు ఎంతో అవసరమున్న, ఈ గడియలో అదెలా జరుగగలదు? పేతురు ఇలా నొక్కిచెప్పాడు: “అందరు అభ్యంతరపడినను నేను అభ్యంతరపడ[ను].” నిజానికి, పేతురు ధైర్య సాహసాలు కలవాడే. కానీ యేసు అప్పగించబడి బంధించబడినప్పుడు పేతురుతో సహా, అపొస్తలులు చెదరిపోయారు. తర్వాత, ప్రధాన యాజకుడైన కయప ఇంట్లో యేసును ప్రశ్నిస్తున్నప్పుడు పేతురు వ్యాకులతతో అక్కడి ఆవరణలో తచ్చాడుతూ ఉన్నాడు. చల్లని రాత్రి గడిచిపోతుండగా, యేసుగానీ ఆయనతో సహవసించే ఎవరైనాగానీ చంపబడతారని బహుశా పేతురు భయపడి ఉండవచ్చు. యేసు సన్నిహిత సహచరుల్లో ఈయన ఒకడని, అక్కడ నిలబడివున్న కొందరు పేతురును గుర్తించినప్పుడు, ఆయన భయవిహ్వలుడయ్యాడు. మూడుసార్లు ఆయన యేసుతో తనకున్న సంబంధాన్ని కాదన్నాడు. ఆయన తనకు తెలుసన్న విషయాన్ని కూడా పేతురు ఒప్పుకోవడానికి అంగీకరించలేదు.—మార్కు 14:27-31, 66-72.

      2. (ఎ) యేసు నిర్బంధించబడిన నాటి రాత్రి పేతురు భయంతో చేసిన చర్య ఆయనను ‘వెనుక తీసినవానిగా’ ఎందుకు చేయదు? (బి) మన నిశ్చయత ఏమై ఉండాలి?

      2 అది పేతురు జీవితంలో చాలా దుర్భరమైన సమయం, ఆ క్షణాలను తలచుకుని ఆయన తన మిగతా జీవితమంతా అనుతాపం చెందాడు అన్నదానిలో సందేహం లేదు. కానీ ఆ రాత్రి పేతురు చేసిన పని ఆయనను పిరికివాడిని చేస్తుందా? “మనము నశించుటకు వెనుకతీయువారము కాము” అని వ్రాస్తూ అపొస్తలుడైన పౌలు ఆ తర్వాత వివరించినటువంటి ‘వారిలో’ ఆయనను ఒకడిని చేస్తుందా? (హెబ్రీయులు 10:39) పౌలు వ్రాసిన మాటలు పేతురుకు వర్తించవని మనలో చాలామందిమి అంగీకరిస్తుండవచ్చు. ఎందుకు? ఎందుకంటే పేతురు భయం తాత్కాలికమైనది మాత్రమే, అసాధారణమైన ధైర్యానికీ, విశ్వాసానికీ పేరుపొందిన జీవితంలో అది కేవలం క్షణికమైన తడబాటు మాత్రమే. అలాగే, మనం ఒక మోస్తరు సిగ్గుతో జ్ఞాపకం చేసుకునే క్షణాలు, అంటే మనల్ని భయం ఆవహించేసి, మనమనుకున్నంత ధైర్యంగా సత్యం కోసం నిలబడలేకపోయిన క్షణాలు మనలో చాలామంది గత జీవితాల్లోనూ ఉన్నాయి. (పోల్చండి రోమీయులు 7:21-23.) అలా తాత్కాలికంగా క్షణకాలంపాటు భయానికి లోనవ్వడం, మనల్ని నశించిపోయేలా వెనుక తీసేవారిగా చేయదని మనం నిశ్చయత కల్గివుండవచ్చు. అయినప్పటికీ, మనం ఎన్నడూ అలాంటి వారం కాకుండా ఉండటానికి నిశ్చయత చేసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకు? అలాంటి వ్యక్తులం కాకుండా మనమెలా తప్పించుకోవచ్చు?

      నశించిపోయేలా వెనుక తీయడమంటే ఏమిటి?

      3. ప్రవక్తలైన ఏలీయా, యోనాలు ఎలా భయానికి లొంగిపోయారు?

      3 ‘వెనుకతీయువారి’ గురించి వ్రాసినప్పుడు పౌలు ఉద్దేశించినది తాత్కాలికంగా క్షణకాలంపాటు ధైర్యాన్ని కోల్పోయేవారి గురించి కాదు. పేతురు అనుభవం గురించి, అలాంటి ఇతర విషయాల గురించి పౌలుకు కచ్చితంగా తెలుసు. దుష్టురాలైన యెజెబెలు రాణి చంపేస్తానని బెదిరించినప్పుడు, ఎంతో ధైర్యవంతుడూ, నిర్మొహమాటంగా మాట్లాడే ప్రవక్తా అయిన ఏలీయా భయపడిపోయి, తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోయాడు. (1 రాజులు 19:1-4) ప్రవక్తయైన యోనా ఇంకా ఎక్కువగా భయపడ్డాడు. దౌర్జన్యానికీ, దుష్టత్వానికీ పేరుపొందిన నగరమైన నీనెవెకు వెళ్లే పనిని యెహోవా ఆయనకు అప్పగించాడు. యోనా వెంటనే, దానికి వ్యతిరేక దిశలో 3,500 కిలోమీటర్ల దూరంలోవున్న తర్షీషుకు వెళ్లే ఓడ ఎక్కాడు. (యోనా 1:1-3) అయినప్పటికీ, ఈ నమ్మకమైన ప్రవక్తలుగానీ, అపొస్తలుడైన పేతురుగానీ వెనుక తీసేవారని చెప్పడం సబబుకాదు. ఎందుకని?

      4, 5. (ఎ) హెబ్రీయులు 10:39 నందు పౌలు ‘నశించటం’ అన్నప్పుడు ఆయన ఉద్దేశమేమిటో నిశ్చయించుకునేందుకు సందర్భం మనకెలా సహాయం చేస్తుంది? (బి) ‘నశించిపోయేలా వెనుక తీయువారము కాము’ అని చెప్పినప్పుడు పౌలు ఉద్దేశమేమిటి?

      4 పౌలు ఉపయోగించిన మొత్తం వాక్యాన్ని గమనించండి: “మనము నశించుటకు వెనుకతీయువారము కాము.” (ఇటాలిక్కులు మావి.) ‘నశించటం’ అన్నప్పుడు ఆయన ఉద్దేశించినదేమిటి? ఆయన ఉపయోగించిన గ్రీకు పదం కొన్నిసార్లు, నిత్య నాశనాన్ని సూచిస్తుంది. ఈ నిర్వచనం సందర్భంతో పొందిక కల్గివుంది. పౌలు అంతక్రితమే ఇలా హెచ్చరించాడు: “మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలి యికను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును.”—హెబ్రీయులు 10:26, 27.

      5 కాబట్టి పౌలు తన తోటి విశ్వాసులకు, “మనము నశించుటకు వెనుకతీయువారము కాము” అని చెప్పినప్పుడు, తానూ తన నమ్మకమైన క్రైస్తవ పాఠకులూ యెహోవా నుండి ఎన్నడూ మరలిపోకుండా, ఆయన సేవచేయడాన్ని ఎన్నడూ మానుకోకుండా ఉండేందుకు దృఢనిశ్చయం చేసుకున్నామని ఆయన ఉద్దేశించాడు. అలా మరలిపోవడం లేదా మానుకోవడం కేవలం నిత్య నాశనానికే నడిపిస్తుంది. అలా నశించిపోయేలా వెనుక తీసినవారిలో యూదా ఇస్కరియోతు ఒకరు, ఉద్దేశపూర్వకంగానే యెహోవా ఆత్మకు వ్యతిరేకంగా పనిచేసిన ఇతర సత్యశత్రువులు కూడా అలాంటివారే. (యోహాను 17:12; 2 థెస్సలొనీకయులు 2:3) అలాంటి వ్యక్తులు సూచనార్థకమైన అగ్నిగుండంలో నిత్యనాశనాన్ని అనుభవించే ‘పిరికివారిలో’ ఒకరైవుంటారు. (ప్రకటన 21:8) అలాంటి వారమై ఉండాలని మనమెన్నడూ కోరుకోము!

      6. మనం ఏమి చేయాలని అపవాదియైన సాతాను ఇచ్ఛయిస్తాడు?

      6 మనం నశించిపోయేలా వెనుక తీయాలని అపవాది అయిన సాతాను ఇచ్ఛయిస్తాడు. అలాంటి నాశనకరమైన విధానం తరచూ చిన్న చిన్న విషయాలతో ప్రారంభమౌతుందని, ‘తంత్రములలో’ నిపుణుడైన అతడికి తెలుసు. (ఎఫెసీయులు 6:11) సూటిగా హింసించడం ద్వారా తన ఉద్దేశాలను నెరవేర్చుకోలేకపోతే, మోసకరమైన మార్గాల ద్వారా నిజ క్రైస్తవుల విశ్వాసాన్ని హరింపజేయడానికి అతడు ప్రయత్నిస్తాడు. ధైర్యవంతులైన, ఆసక్తిపరులైన యెహోవాసాక్షుల నోళ్లుమూయించాలని అతడు చూస్తాడు. పౌలు ఎవరికైతే వ్రాశాడో ఆ హెబ్రీ క్రైస్తవులకు వ్యతిరేకంగా అతడు ఏ తంత్రములను ఉపయోగించాడో మనం చూద్దాం.

      క్రైస్తవులు వెనుకతీసేలా ఎలా ఒత్తిడి చేయబడ్డారు

      7. (ఎ) యెరూషలేములోని సంఘ చరిత్ర ఏమైవుంది? (బి) పౌలు పాఠకులు కొందరి విషయంలో ఏ ఆధ్యాత్మిక పరిస్థితులు ఉండేవి?

      7 పౌలు సా.శ. 61లో హెబ్రీయులకు తన లేఖను వ్రాశాడని నిదర్శనాలు సూచిస్తున్నాయి. యెరూషలేములోని సంఘానికి సంక్షోభపూరితమైన చరిత్ర ఉంది. యేసు మరణం తర్వాత, హానికరమైన హింసా ఉప్పెన చెలరేగింది, దానితో నగరంలోని చాలామంది క్రైస్తవులు చెల్లాచెదురైపోయారు. అయితే కొంతకాలంపాటు సమాధానం నెలకొనడంతో క్రైస్తవుల సంఖ్య వృద్ధి అయ్యింది. (అపొస్తలుల కార్యములు 8:4; 9:31) సంవత్సరాలు గడుస్తుండగా, ఇతర హింసలూ, కష్టాలూ వచ్చాయి, పోయాయి. పౌలు హెబ్రీయులకు ఈ లేఖ వ్రాసే సమయానికి సంఘం మరోసారి కాస్తంత శాంతిని అనుభవిస్తున్నట్లు కనిపిస్తుంది. అయినప్పటికీ, ఒత్తిళ్లు ఉన్నాయి. యెరూషలేము నాశనమౌతుందని యేసు చెప్పి అప్పటికి దాదాపు మూడు దశాబ్దాలు గడిచిపోయాయి. అంతం మరీ ఆలస్యమైపోయిందనీ, ఇక తమ జీవితకాలంలో రాకపోవచ్చుననీ భావించిన వారు కొందరు ఉండే ఉంటారు. ఇతరులు, ప్రాముఖ్యంగా విశ్వాసంలోకి క్రొత్తగా వచ్చినవారు, ఇంకా తీవ్రమైన హింసతో పరీక్షించబడలేదు, శ్రమలు వచ్చినప్పుడు సహనం కల్గివుండవలసిన అవసరం గురించి వారికి ఎక్కువగా తెలియదు. (హెబ్రీయులు 12:4) అలాంటి పరిస్థితుల నుండి ప్రయోజనం పొందాలని సాతాను తప్పకుండా ప్రయత్నించాడు. అతడు ఏ ‘తంత్రములను’ ఉపయోగించాడు?

      8. వృద్ధి చెందుతున్న క్రైస్తవ సంఘం పట్ల చాలామంది యూదులకు ఏ దృక్పథం ఉండేది?

      8 యూదా యెరూషలేములలో నివసిస్తున్న యూదా జనాంగాలు అప్పుడప్పుడే ఎదుగుతున్న క్రైస్తవ సంఘాన్ని తృణీకారభావంతో చూశారు. పౌలు లేఖలోని అంశాలను బట్టి చూస్తే, అహంకారులైన యూదా మత నాయకులూ, వారి అనుచరులూ క్రైస్తవులను ఎలా ఎత్తిపొడిచేవారో కొంత అవగాహన ఏర్పడుతుంది. వాళ్లు బహుశా ఇలా అనేవారేమో: ‘మాకు యెరూషలేములో, శతాబ్దాల నుంచీవున్న గొప్ప ఆలయం ఉంది! అక్కడ సేవ చేసే ఉన్నతమైన ప్రధాన యాజకుడు, ఆయనతో కలిసి పని చేసే సహ యాజకులు ఉన్నారు. ప్రతి రోజు బలులు అర్పించబడతాయి. సీనాయి పర్వతం మీద గొప్ప సూచనలతో స్థాపించబడిన, దూతల ద్వారా మోషేకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం మాకుంది. మతభ్రష్టులై యూదామతం నుండి విడిపోయిన ఈ నడమంత్రపు మతతెగకు, ఈ క్రైస్తవులకు అవేవీ లేవు!’ అలాంటి తృణీకారం దాని ప్రభావాన్ని చూపిందా? కొందరు హెబ్రీ క్రైస్తవులు ఆ దాడికి కలవరపడ్డారని స్పష్టమౌతుంది. పౌలు వ్రాసిన లేఖ సరిగ్గా సరైన సమయంలో వారికి సహాయపడింది.

      వాళ్లు నశించిపోయేలా ఎన్నడూ ఎందుకు వెనుకతీయకూడదు?

      9. (ఎ) హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ అంతటా ఏ ఇతివృత్తం వ్యాపించి ఉంది? (బి) క్రైస్తవులు ఏ భావంలో, యెరూషలేములోని ఆలయం కంటే శ్రేష్ఠమైన ఆలయంలో సేవ చేస్తున్నారు?

      9 నశించిపోయేలా ఎన్నడూ వెనుకతీయకుండా ఉండేందుకు పౌలు యూదయలోవున్న తన సహోదర సహోదరీలకు ఇచ్చిన రెండు కారణాలను మనం పరిశీలిద్దాము. మొదటిది—క్రైస్తవ ఆరాధనా విధానానికున్న ఔన్నత్యం—హెబ్రీయులకు వ్రాసిన లేఖ అంతటా వ్యాపించి ఉంది. తన లేఖ అంతటిలోనూ పౌలు ఇదే ఇతివృత్తాన్ని వృద్ధి చేశాడు. యెరూషలేములోవున్న ఆలయం, మరెంతో గొప్పదైన ఒక వాస్తవానికి అంటే “హస్తకృతము కాని” కట్టడమైన యెహోవా ఆధ్యాత్మిక ఆలయానికి కేవలం ఒక ప్రతిరూపం మాత్రమే. (హెబ్రీయులు 9:11) స్వచ్ఛారాధన కొరకైన ఆ ఆధ్యాత్మిక ఏర్పాటులో సేవచేసే ఆధిక్యత ఆ క్రైస్తవులకు ఉంది. మరింత శ్రేష్ఠమైన నిబంధన క్రింద, ఎంతోకాలం క్రితం వాగ్దానం చేయబడిన నిబంధన క్రింద, మోషేకంటే ఉన్నతుడైన యేసుక్రీస్తు మధ్యవర్తిగా గల ఆ నిబంధన క్రింద వాళ్లు సేవ చేశారు.—యిర్మీయా 31:31-34.

      10, 11. (ఎ) యేసు వంశావళి ఆయన ఆధ్యాత్మిక ఆలయంలో ప్రధాన యాజకునిగా సేవ చేయడం నుండి ఆయనను ఎందుకు అనర్హుడిని చేయదు? (బి) యెరూషలేములోని ఆలయంలో సేవచేస్తున్న ప్రధాన యాజకుని కంటే యేసు ఏ యే విధాలుగా ఉన్నతమైనవాడు?

      10 ఆ క్రైస్తవులకు అంతకన్నా ఇంకా శ్రేష్ఠమైన ప్రధాన యాజకుడు, యేసుక్రీస్తు ఉన్నాడు. నిజమే, ఆయన అహరోను సంతానం వాడు కాదు. కానీ ఆయన “మెల్కీసెదెకు క్రమము చొప్పున” ప్రధాన యాజకుడు. (కీర్తన 110:4) వంశావళిలేని మెల్కీసెదెకు ప్రాచీన షాలేము రాజు మరియు ప్రధాన యాజకుడు. కాబట్టి, ఆయన యేసుకు తగిన ప్రవచనార్థక సారూప్యంగా ఉన్నాడు, ఆయన యాజకత్వం అపరిపూర్ణ మానవ వంశావళిపై కాదుగానీ అంతకంటే గొప్పదైన యెహోవా దేవుని వాగ్దానంపై ఆధారపడినది. మెల్కీసెదెకులా యేసు ప్రధాన యాజకునిగానే కాదు ఎన్నడూ మరణించని రాజుగా కూడా సేవచేస్తాడు.—హెబ్రీయులు 7:11-21.

      11 అంతేగాక, యెరూషలేము ఆలయములోని ప్రధాన యాజకునిలా కాకుండా, యేసు సంవత్సరం తర్వాత సంవత్సరం బలులు అర్పించవలసిన అవసరం లేదు. ఆయన అర్పించిన బలి ఆయన పరిపూర్ణ జీవమే, ఆయన దాన్ని ఒక్కసారే అర్పించాడు. (హెబ్రీయులు 7:27) ఆలయంలో అర్పించబడే బలులన్నీ కేవలం ఛాయలు మాత్రమే, అంటే యేసు అర్పించేదాన్ని సూచించేవి మాత్రమే. ఆయన అర్పించిన పరిపూర్ణ బలి, విశ్వసించిన వారందరి పాపాలకూ నిజమైన క్షమాపణను అందజేసింది. ఈ ప్రధాన యాజకుడు, యెరూషలేములోని క్రైస్తవులకు తెలిసిన, ఎన్నడూ మారని యేసే అని చూపించే పౌలు వ్యాఖ్యానాలు కూడా హృదయాన్ని ఉత్తేజపరుస్తాయి. ఆయన దీనుడు, దయగలవాడు, “మన బలహీనతలయందు మనతో సహానుభవము” గలవాడు. (హెబ్రీయులు 4:15; 13:8) ఆ అభిషిక్త క్రైస్తవులకు క్రీస్తు ఉపయాజకులుగా సేవచేసే ఉత్తరాపేక్ష ఉంది! భ్రష్ట యూదామతానికి చెందిన “బలహీనమైనవియు నిష్‌ప్రయోజనమైనవియునైన” వాటి కోసం వెనుక తీయడం గురించి వారు కనీసం ఆలోచించడమైనా ఎలా ఆలోచించగలరు?—గలతీయులు 4:9.

      12, 13. (ఎ) వెనుక తీయక ఉండటానికి ఏ రెండవ కారణాన్ని పౌలు అందజేశాడు? (బి) హెబ్రీ క్రైస్తవుల సహనాన్ని గురించిన గత చరిత్ర, తాము నశించిపోయేలా ఎన్నడూ వెనుక తీయక ఉండటానికి వారిని ఎందుకు ప్రోత్సహిస్తుంది?

      12 అది చాలదన్నట్లు, వారు నశించిపోయేలా ఎన్నడూ వెనక తీయకుండా ఉండేందుకు పౌలు హెబ్రీయులకు రెండవ కారణాన్ని కూడా ఇచ్చాడు—సహనాన్ని గూర్చిన వారి స్వంత చరిత్రయే. ఆయనిలా వ్రాశాడు: “మీరు వెలిగింపబడినమీదట, శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపుదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి.” వారు “పదిమందిలో ఆరడిపడి” నిందలకు, శ్రమలకు గురయ్యారని పౌలు వారికి జ్ఞాపకం చేశాడు. కొందరు చెరసాలలో వేయబడ్డారు; ఇతరులు చెరసాలలో ఉన్నవారిపట్ల సానుభూతి చూపించి, వారికి మద్దతునిచ్చారు. అవును, వాళ్లు విశేషమైన విశ్వాసాన్ని, పట్టుదలను చూపించారు. (హెబ్రీయులు 10:32-34) అయినప్పటికీ, అలాంటి వేదనకరమైన అనుభవాలను “జ్ఞాపకము తెచ్చుకొనుడి” అని పౌలు వారికెందుకు చెప్పాడు? అది వారిని నిరుత్సాహపర్చదా?

      13 దానికి భిన్నంగా, ‘పూర్వపు దినములను జ్ఞాపకమునకు తెచ్చుకోవడం,’ శ్రమల సమయంలో యెహోవా తమను ఎలా బలపర్చాడనే విషయాన్ని హెబ్రీయులకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన సహాయంతో, వాళ్లు అప్పటికే సాతాను దాడులనెన్నింటినో ఎదిరించారు. పౌలు ఇలా వ్రాశాడు: “మీరు చేసిన కార్యమును, . . . తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.” (హెబ్రీయులు 6:10) అవును, వాళ్లు చేసిన నమ్మకమైన పనులన్నిటినీ యెహోవా తన అపారమైన స్మృతిలో భద్రపర్చుకుని జ్ఞాపకముంచుకున్నాడు. పరలోకంలో ధనము సమకూర్చుకొమ్మని యేసు చేసిన ఉద్బోధ మనకు గుర్తుచేయబడుతుంది. ఈ ధనాన్ని ఏ దొంగా దోచుకోలేడు; ఏ చిమ్మెట లేక తుప్పు తినివేయలేదు. (మత్తయి 6:19-21) వాస్తవానికి, ఒక క్రైస్తవుడు నశించిపోయేలా వెనుక తీసినప్పుడే ఈ ధనము నాశనం చేయబడగలదు. అలా చేయటం, ఆయన పరలోకంలో సమకూర్చుకున్న ఏ ధనాన్నైనా కొల్లగొట్టగలదు. అలాంటి మార్గాన్ని ఎన్నడూ చేపట్టకుండా ఉండేందుకు పౌలు హెబ్రీ క్రైస్తవులకు ఎంత శక్తివంతమైన కారణాన్ని ఇస్తున్నాడో కదా! అన్ని సంవత్సరాలపాటు నమ్మకంగా చేసిన సేవను ఎందుకు వ్యర్థం చేసుకోవడం? సహనంతో కొనసాగడం సరైనది, ఎంతో శ్రేష్ఠమైనది.

      నశించిపోయేలా మనమెన్నడూ ఎందుకు వెనుకతీయకూడదు?

      14. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎదుర్కున్నలాంటి ఏ సవాళ్లనే మనం కూడా ఎదుర్కుంటున్నాము?

      14 వెనుక తీయకుండా ఉండేందుకు నిజ క్రైస్తవులకు నేడు అంతే శక్తివంతమైన కారణాలున్నాయి. మొదటిగా, యెహోవా మనకిచ్చిన స్వచ్ఛమైన ఆరాధన అనే ఎంతటి ఆశీర్వాదం మనకుందో గుర్తుంచుకుందాము. మొదటి శతాబ్దపు క్రైస్తవులలా, మరింత జనాదరణ పొందిన మతాల సభ్యులు ప్రభావవంతమైన తమ మతభవనాలను, తమ ఆచారాల ప్రాచీనత్వాన్నీ గర్వంగా ఎత్తి చూపిస్తూ మనల్ని అవహేళన చేసే, అవమానపర్చే కాలంలో మనం జీవిస్తున్నాము. అయితే, మన ఆరాధనా విధానాన్ని తాను ఆమోదిస్తున్నానని యెహోవా మనకు హామీ ఇస్తున్నాడు. వాస్తవానికి, మొదటి శతాబ్దపు క్రైస్తవులకు లేని ఆశీర్వాదాలను నేడు మనం అనుభవిస్తున్నాము. ‘అదెలా?’ అని మీరు ఆశ్చర్యపోతుండవచ్చు. ఎంతైనా, వాళ్లు ఆధ్యాత్మిక ఆలయం పనిని కొనసాగిస్తున్న సమయంలో జీవించారు కదా? యేసు సా.శ. 29లో బాప్తిస్మం తీసుకున్న తర్వాత దాని ప్రధాన యాజకుడు అయ్యాడు కదా? కొంతమంది అద్భుతాలు చేసే దేవుని కుమారుడ్ని చూశారు కూడానే? ఆయన మరణం తర్వాత కూడా, అనేక అద్భుతాలు జరుగలేదూ? అయితే ప్రవచించబడినట్లుగా, అలాంటి వరాలు చివరికి నిలిచిపోయాయి.—1 కొరింథీయులు 13:8.

      15. నిజ క్రైస్తవులు నేడు ఏ ప్రవచన నెరవేర్పు సమయంలో జీవిస్తున్నారు, మనకు దాని భావమేమై ఉంది?

      15 అయితే, యెహెజ్కేలు 40-48 అధ్యాయాలలోవున్న విస్తృతమైన ఆలయ ప్రవచనపు విశేషమైన నెరవేర్పు కాలంలో మనం జీవిస్తున్నాము.a అలా, స్వచ్ఛారాధన కోసమైన దేవుని ఏర్పాటు పునరుద్ధరించబడటాన్ని మనం చూశాము. ఆ ఆధ్యాత్మిక ఆలయం అన్ని రకాలైన మత కాలుష్యాల నుండి, విగ్రహారాధన నుండి శుభ్రపర్చబడటాన్ని మనం చూశాము. (యెహెజ్కేలు 43:9; మలాకీ 3:1-5) ఈ శుభ్రపర్చడం మనకు తెచ్చిన ప్రయోజనాల గురించి ఆలోచించండి.

      16. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఏ నిరుత్సాహకరమైన ధోరణిని ఎదుర్కున్నారు?

      16 మొదటి శతాబ్దంలో, సంస్థీకృత క్రైస్తవ సంఘానికి భవితవ్యం అంధకారమయంగా గోచరించింది. క్రొత్తగా నాటిన గోధుమ పైరులో గురుగులు నాటబడి, గోధుమలను గురుగుల నుండి వేరుపర్చడం అసాధ్యమన్నట్లు ఉంటుందని యేసు ముందే చెప్పాడు. (మత్తయి 13:24-30) సరిగ్గా అలాగే జరిగింది. మొదటి శతాబ్దాంతానికల్లా, భ్రష్టత్వాన్ని అడ్డగించడానికి వృద్ధ అపొస్తలుడైన యోహాను చివరి అడ్డంకుగా ఉన్నప్పుడు, మతభ్రష్టత్వం అప్పటికే వేళ్లూని ప్రబలుతోంది. (2 థెస్సలొనీకయులు 2:6; 1 యోహాను 2:18) అపొస్తలులు మరణించి చాలాకాలం గడవకముందే, మందను అణచివేసే, ప్రత్యేకమైన ఒక మతనాయక వర్గం ఉనికిలోకి వచ్చింది, వాళ్లు తమను ప్రత్యేకించి చూపించే వస్త్రాలను ధరించేవారు. మత భ్రష్టత్వం కొరుకుడు పుండులా వ్యాపించింది. నమ్మకమైన క్రైస్తవులకు ఎంత నిరుత్సాహం కల్గివుంటుందో కదా! క్రొత్తగా స్థాపించబడిన స్వచ్ఛారాధన కొరకైన ఏర్పాటును కలుషిత విధానం ముంచెత్తడాన్ని వాళ్లు చూశారు. క్రీస్తు సంఘాన్ని నెలకొల్పి ఇంకా శతాబ్దమైనా గడవక ముందే ఇది వృద్ధి చెందింది.

      17. ఆధునికదిన క్రైస్తవ సంఘం ఏ భావంలో మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంకన్నా ఎక్కువకాలం నిలిచింది?

      17 ఇప్పుడొక వ్యత్యాసాన్ని పరిశీలించండి. అపొస్తలులు మరణించిన ఎంతోకాలం తర్వాత నేటి వరకు స్వచ్ఛారాధన కొనసాగింది. పూర్వం 1879లో ఈ పత్రిక మొదటి సంచిక ప్రచురించబడినప్పటి నుండి, యెహోవా మనల్ని అత్యధికంగా శుభ్రపర్చబడిన ఆరాధనతో ఆశీర్వదించాడు. యెహోవా, క్రీస్తు యేసు ఆధ్యాత్మిక ఆలయాన్ని శుభ్రపరిచేందుకు 1918లో దానిలోకి ప్రవేశించారు. (మలాకీ 3:1-5) 1919 నుండి, యెహోవా దేవుని ఆరాధన కొరకైన ఏర్పాటు క్రమంగా శుద్ధీకరించబడింది. బైబిలు ప్రవచనాలకు, సూత్రాలకు సంబంధించిన మన అవగాహన స్పష్టమైంది. (సామెతలు 4:18) దానికి ఘనత ఎవరికి చెందాలి? అపరిపూర్ణులైన మానవమాత్రులకు కాదు. తన కుమారుడు సంఘ శిరస్సుగా ఉండగా, కేవలం యెహోవా మాత్రమే ఈ భ్రష్ట కాలాల్లో తన ప్రజలను భ్రష్టత్వం నుండి కాపాడగలడు. కాబట్టి నేడు స్వచ్ఛారాధనలో భాగం వహించడానికి మనకు అనుమతి ఇస్తున్నందుకు మనం యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేయడంలో ఎన్నడూ విఫలులం కాకూడదు. నశించిపోయేలా మనమెన్నడూ వెనుక తీయకూడదని దృఢంగా నిశ్చయించుకుందాము!

      18. నశించిపోయేలా వెనుక తీయక ఉండటానికి మనకు ఏ కారణం ఉంది?

      18 ఆ హెబ్రీ క్రైస్తవులలా, పిరికితనంతో కూడిన, వెనుక తీసే విధానాన్ని నిరాకరించేందుకు మనకు రెండో కారణం కూడా ఉంది—అది సహనానికి సంబంధించిన మన స్వంత చరిత్రయే. మనం ఇటీవలి సంవత్సరాల్లోనే యెహోవా సేవ చేయడం ప్రారంభించినా లేక దశాబ్దాలుగా నమ్మకంగా సేవ చేస్తున్నా, మనం క్రైస్తవ చర్యల రికార్డును నిర్మించుకున్నాము. మనలో చాలామందిమి హింసను అనుభవించాము, అది చెరసాలలో ఉండటమైనా, నిషేధమైనా, క్రూరత్వమైనా, లేక ఆస్తి నష్టమైనా. ఇంకా చాలామంది కుటుంబ వ్యతిరేకతను, తిరస్కారాన్ని, హేళనను, ఉదాసీనతను అనుభవించారు. మనమందరం జీవిత సవాళ్లను, పరీక్షలను ఎదుర్కుంటూ కూడా యెహోవాకు నమ్మకంగా సేవ చేయడంలో కొనసాగుతూ సహించాము. అలా చేయడం ద్వారా, మనం నిర్మించుకున్న పట్టుదలతో కూడిన చరిత్రను యెహోవా మరచిపోడు, అది పరలోకంలో భాండాగారం లాంటిది. కాబట్టి కచ్చితంగా, మనం విడిచిపెట్టి వచ్చిన భ్రష్టమైన పాత విధానం కోసం వెనుక తీయడానికి ఇది సమయం కాదు. మన కష్టాన్నంతటినీ నిరర్థకం చేసుకోవడం ఎందుకు? అంతానికి ముందు కేవలం “బహు కొంచెము” కాలము మాత్రమే మిగిలివున్న ఈ సమయంలో ప్రత్యేకించి ఇది నిజం.—హెబ్రీయులు 10:37.

      19. తదుపరి శీర్షికలో ఏమి చర్చించబడుతుంది?

      19 అవును, ‘మనం నశించిపోయేలా వెనుక తీయువారము’ కాకుండేలా నిశ్చయం చేసుకుందాము! బదులుగా మనం “విశ్వాసము కలిగినవారమై” ఉందాము. (హెబ్రీయులు 10:39) మనం ఆ వివరణకు సరిపోతామని మనమెలా నిశ్చయత కల్గివుండవచ్చు, అదే చేయడానికి మనం మన తోటి క్రైస్తవులకు ఎలా సహాయం చేయగలము? మా తదుపరి శీర్షిక ఈ విషయాన్ని పరిశీలిస్తుంది.

  • విశ్వాసము గలవారమై ఉందాము
    కావలికోట—1999 | డిసెంబరు 15
    • విశ్వాసము గలవారమై ఉందాము

      “ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమైయున్నాము.”—హెబ్రీయులు 10:39.

      1. యెహోవా యొక్క ప్రతి యథార్థ సేవకుని విశ్వాసమూ అమూల్యమైనదే అని ఎందుకు చెప్పవచ్చు?

      ఈసారి మీరు యెహోవా ఆరాధకులతో నిండివున్న రాజ్యమందిరానికి వెళ్లినప్పుడు, మీ చుట్టూ ఉన్న వారివైపు ఒకసారి దృష్టిని సారించండి. వాళ్లు విశ్వాసాన్ని చూపించే అనేక మార్గాల గురించి ఆలోచించండి. దశాబ్దాలుగా దేవుని సేవ చేస్తున్న వృద్ధులను, ప్రతిరోజూ తమ తోటివారినుంచి వచ్చే ఒత్తిళ్లను ఎదిరించి నిలబడుతున్న యౌవనస్థులను, తమ పిల్లల్ని దైవభయంగలవారిగా పెంచటానికి ప్రయాస పడుతున్న తల్లిదండ్రులను మీరు చూడవచ్చు. అనేక బాధ్యతలను నిర్వర్తించే సంఘపెద్దలూ, పరిచర్య సేవకులూ ఉన్నారు. అవును, యెహోవా సేవ చేయడానికి అన్ని రకాలైన అవాంతరాలనూ అధిగమిస్తున్న అన్ని వయసులకు చెందిన ఆధ్యాత్మిక సహోదర సహోదరీలను మీరు చూడవచ్చు. ప్రతి ఒక్కరి విశ్వాసం ఎంత అమూల్యమైనదో కదా!—1 పేతురు 1:7.

      2. హెబ్రీయులు 10, 11 అధ్యాయాలలోని పౌలు ఉపదేశం ఈనాడు మనకెందుకు ప్రయోజనకరమైనది?

      2 విశ్వాస ప్రాముఖ్యతను గురించి అపరిపూర్ణ మానవుల్లో అపొస్తలుడైన పౌలుకన్నా మిన్నగా ఎవరూ అర్థం చేసుకోలేదు. వాస్తవానికి, నిజమైన విశ్వాసం ‘ఆత్మను రక్షించటానికి’ నడిపిస్తుందని ఆయన పేర్కొన్నాడు. (హెబ్రీయులు 10:39) అయితే, ఈ అవిశ్వాస లోకంలో విశ్వాసం దాడికి గురౌతుందనీ, హరించి వేయబడుతుందనీ పౌలుకు తెలుసు. తమ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి ప్రయాస పడుతున్న యూదా యెరూషలేములలో ఉన్న హెబ్రీ క్రైస్తవులను గురించి ఆయన ఎంతో చింతించాడు. మనం హెబ్రీయులు 10, 11 అధ్యాయాలలోని భాగాలను చూస్తుండగా, వారి విశ్వాసాన్ని పెంపొందింప జేయటానికి పౌలు ఉపయోగించిన పద్ధతులను మనం గమనిద్దాము. అలా చేసేటప్పుడు, మనలో మనమూ అలాగే మన చుట్టూ ఉన్నవారిలోనూ మనం విశ్వాసాన్ని ఎలా పెంపొందింపజేయవచ్చో చూద్దాము.

      పరస్పరం నమ్మకాన్ని వ్యక్తం చేసుకోండి

      3. విశ్వాసంలో ఉన్న తన సహోదర సహోదరీలపై పౌలుకు నమ్మకం ఉందని హెబ్రీయులు 10:39లోని ఆయన మాటలు ఎలా చూపిస్తున్నాయి?

      3 మనం గమనించగల మొదటి విషయం ఏమిటంటే, తన పాఠకులపట్ల పౌలుకున్న అనుకూల దృక్పథం. ఆయనిలా వ్రాశాడు: “అయతే మనము నశించుటకు వెనుకతీయువారము కాముగాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమైయున్నాము.” (హెబ్రీయులు 10:39) పౌలు నమ్మకమైన తన తోటి క్రైస్తవుల విషయంలో మంచినే తలంచాడు గానీ వారి గురించి చెడుగా తలంచలేదు. ఆయన “మనము” అనే మాటను ఉపయోగించాడని కూడా గమనించండి. పౌలు నీతిమంతుడు. అయినప్పటికీ, ఆయన, తాను వారికంటే ఎంతో పైగా, చాలా నీతి గలవాడిగా ఉన్నట్లు తన పాఠకులను తక్కువ చేసి మాట్లాడలేదు. (పోల్చండి ప్రసంగి 7:16.) బదులుగా, ఆయన వారిలో తననూ చేర్చుకున్నాడు. తానూ తన నమ్మకమైన క్రైస్తవ పాఠకులూ తమ ఎదుట కొండలా నిలుచుని ఉన్న నిరుత్సాహపరచే అవాంతరాలను ఎదుర్కుంటామనీ, నశించిపోయేలా వెనుక తీయడానికి ధైర్యంగా నిరాకరిస్తామనీ, విశ్వాసముగలవారమని నిరూపించుకుంటామనీ ఆయన హృదయపూర్వక నమ్మకాన్ని వ్యక్తపర్చాడు.

      4. ఏ కారణాలను బట్టి పౌలుకు తన తోటి విశ్వాసులలో నమ్మకం ఉంది?

      4 పౌలుకు అలాంటి నమ్మకం ఎలా కలిగింది? హెబ్రీ క్రైస్తవుల తప్పిదాలను ఆయన చూడలేకపోయాడా? అదేమీ కాదు, అందుకు పూర్తి భిన్నంగా వారు తమ ఆధ్యాత్మిక లోపాలను సరిచేసుకునేందుకు సహాయం చేయగల నిర్దిష్టమైన సలహాలను ఆయన వారికిచ్చాడు. (హెబ్రీయులు 3:12; 5:12-14; 6:4-6; 10:26, 27; 12:5) అయినా, తన సహోదరులపై నమ్మకం ఉంచటానికి పౌలుకు కనీసం రెండు మంచి కారణాలున్నాయి. (1) యెహోవాను అనుకరించేవాడిగా పౌలు, దేవుని ప్రజల్ని యెహోవా ఎలా దృష్టిస్తాడో అలాగే దృష్టించడానికి ప్రయత్నించాడు. అది కేవలం వారి తప్పులకు సంబంధించి మాత్రమే కాదుగానీ వాళ్ల మంచి లక్షణాలకు సంబంధించి, భవిష్యత్తులో మంచి చేయడానికి ఎంచుకునేందుకు వారికున్న సామర్థ్యానికి సంబంధించి కూడా. (కీర్తన 130:3; ఎఫెసీయులు 5:1) (2) పౌలుకు పరిశుద్ధాత్మ శక్తిపై గట్టి నమ్మకం ఉంది. నమ్మకంగా తన సేవచేయాలని కృషి చేస్తున్న ఏ క్రైస్తవుడికైనా “బలాధిక్యము” ఇవ్వకుండా యెహోవాను ఏ అవాంతరాలూ, ఏ మానవ బలహీనతలూ ఆపలేవని ఆయనకు తెలుసు. (2 కొరింథీయులు 4:7; ఫిలిప్పీయులు 4:13) కాబట్టి తన సహోదర సహోదరీలపై పౌలు ఉంచిన నమ్మకం ఏదో అనుచితమైనదీ, అవాస్తవికమైనదీ, లేక గుడ్డి ఆశావాదంతో కూడినదీ కాదు. అది దృఢమైన పునాది గలది, లేఖనాధారితమైనది.

      5. పౌలుకున్న నమ్మకాన్ని మనం ఎలా అనుకరించవచ్చు, ఫలితం ఏమై ఉండవచ్చు?

      5 నిశ్చయంగా, పౌలు ప్రదర్శించిన నమ్మకం ఇతరులకు సోకే గుణం గలది. పౌలు తమతో అంత ప్రోత్సాహకరంగా మాట్లాడటం యూదా యెరూషలేములలోని సంఘాలకు ఎంతో పురికొల్పుగా ఉండివుండవచ్చు. యూదా వ్యతిరేకుల చిన్నబుచ్చే తిరస్కారాన్ని, అహంకారపూరితమైన ఉదాసీనతను ఎదుర్కుంటున్న సమయంలో, విశ్వాసం గలవారమై ఉండాలని తమ హృదయాల్లో నిశ్చయం చేసుకోవడానికి అలాంటి వ్యక్తీకరణలు హెబ్రీ క్రైస్తవులకు సహాయం చేశాయి. మరి నేడు మనం ఒకరికొకరం అలాగే చేయగలమా? ఇతరుల్లో ఎన్నో లోపాలు, వ్యక్తిత్వ దుర్లక్షణాలు ఉన్నట్లు చూడటం ఎంతో సులభమే. (మత్తయి 7:1-5) అయితే, మనందరికీ ఉన్న అసమానమైన విశ్వాసపు విలువను గమనించి, దాన్ని అమూల్యంగా ఎంచితే మనమందరం పరస్పరం సహాయం చేసుకోగలం. అలాంటి ప్రోత్సాహంతో విశ్వాసం మరింతగా వర్ధిల్లగలదు.—రోమీయులు 1:11, 12.

      దేవుని వాక్యాన్ని సరిగా ఉపయోగించటం

      6. హెబ్రీయులు 10:38లోని మాటలను పౌలు ఏ మూలం నుండి ఉల్లేఖించాడు?

      6 లేఖనాలను నైపుణ్యంగా ఉపయోగించడం ద్వారా కూడా పౌలు తన తోటి విశ్వాసుల విశ్వాసాన్ని నిర్మించాడు. ఉదాహరణకు ఆయనిలా వ్రాశాడు: “నా యెదుట నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుకతీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు.” (హెబ్రీయులు 10:38) పౌలు ఇక్కడ ప్రవక్తయైన హబక్కూకు వ్రాసినదాన్ని ఉల్లేఖిస్తున్నాడు.a బహుశా ఈ మాటలు పౌలు పాఠకులకు బాగా తెలిసే ఉండవచ్చు, ఎందుకంటే హెబ్రీ క్రైస్తవులైన వీరికి ప్రవక్తల గ్రంథాలు సుపరిచితాలే. సా.శ. 61 దరిదాపుల్లో యెరూషలేములోను దాని సమీపంలోను ఉన్న క్రైస్తవుల విశ్వాసాన్ని బలపర్చాలన్న పౌలు లక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటే, హబక్కూకు మాదిరిని ఆయన ఎంచుకోవటం తగినదే. ఎందుకని?

      7. హబక్కూకు తన ప్రవచనాన్ని ఎప్పుడు నమోదు చేశాడు, అప్పుడు యూదాలో పరిస్థితులెలా ఉన్నాయి?

      7 హబక్కూకు తన పుస్తకాన్ని సా.శ.పూ. 607లో యెరూషలేము నాశనం కావటానికి రెండు దశాబ్దాలముందు వ్రాశాడని స్పష్టమౌతుంది. దర్శనంలో, ‘ఉద్రేకముగల క్రూరులగు’ కల్దీయులు (లేక బబులోనీయులు) యూదామీద హఠాత్తుగా పడి యెరూషలేమును నాశనంచేసి అందులోని ప్రజలను, జనములను మ్రింగివేయటాన్ని ఆ ప్రవక్త చూశాడు. (హబక్కూకు 1:5-11) కానీ అలాంటి విపత్తు గురించి శతాబ్దంకంటే ముందే, యెషయా కాలం నుండే ప్రవచించబడింది. హబక్కూకు కాలంలో మంచిరాజైన యోషీయా తర్వాత వచ్చిన యెహోయాకీము కాలంలో యూదాలో దుష్టత్వం మళ్లీ విస్తరించిపోయింది. యెహోవా పేరిట మాట్లాడేవారిని యెహోయాకీము హింసించాడు, కొందరిని చంపించాడు కూడా. (2 దినవృత్తాంతములు 36:5; యిర్మీయా 22:17; 26:20-24) వ్యథచెందిన ప్రవక్తయైన హబక్కూకు ఇలా ఆక్రోశించాడంటే అందులో ఆశ్చర్యంలేదు, “యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింపకుందువు?”—హబక్కూకు 1:2.

      8. హబక్కూకు మాదిరి మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకూ, నేటి క్రైస్తవులకూ ఎందుకు ప్రయోజనకరమైనదిగా నిరూపించబడుతుంది?

      8 యెరూషలేము నాశనం ఎంత సమీపంలో ఉన్నది హబక్కూకునకు తెలియదు. అలాగే, యూదా విధానం ఎప్పుడు అంతమౌతుందో మొదటి శతాబ్దపు క్రైస్తవులకూ తెలియదు. ఈ దుష్టవిధానంపైకి యెహోవా తీర్పు వచ్చే ‘ఆ దినము, గడియ’ ఎప్పుడు వస్తుందో మనకూ ఈనాడు తెలీదు. (మత్తయి 24:36) అయితే హబక్కూకునకు యెహోవా ఇచ్చిన రెండువిధాలైన సమాధానాన్ని మనం గమనిద్దాము. మొదటిగా, అంతం సరైన సమయానికే వస్తుందని ప్రవక్తకు అభయాన్నిచ్చాడు. మానవ దృష్టికి ఆలస్యమని అనిపించినప్పటికీ అది “జాగుచేయక వచ్చును” అని దేవుడు చెప్పాడు. (హబక్కూకు 2:3) రెండవదిగా, “నీతిమంతుడు విశ్వాసము మూలముగ బ్రదుకును” అని యెహోవా హబక్కూకునకు జ్ఞాపకం చేశాడు. (హబక్కూకు 2:4) ఎంత చక్కని సరళమైన సత్యాలు! అన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, అంతం ఎప్పుడు వస్తుందన్నది కాదు గానీ మనం విశ్వాససహితమైన జీవితాన్ని గడుపుతూ కొనసాగుతామా లేదా అన్నదే.

      9. విధేయులైన యెహోవా సేవకులు తమ విశ్వాసం మూలంగా (ఎ) సా.శ.పూ. 607లోనూ, (బి) సా.శ. 66 తర్వాతనూ, ఎలా బ్రదికారు? (సి) మనం మన విశ్వాసాన్ని బలపరచుకోవటం ఎందుకు ప్రాముఖ్యమైనది?

      9 సా.శ.పూ. 607లో యెరూషలేము దోచుకోబడినప్పుడు, యిర్మీయా, ఆయన కార్యదర్శి బారూకు, ఎబెద్మెలెకు, యథార్థవర్తనులైన రేకాబీయులు యెహోవా హబక్కూకునకు చేసిన వాగ్దానంలోని సత్యాన్ని చూశారు. భయంకరమైన యెరూషలేము నాశనంనుంచి వారు తప్పించుకోవడం ద్వారా ‘బ్రదికి ఉన్నారు.’ ఎందుకు? యెహోవా వారి విశ్వాసానికి ప్రతిఫలాన్ని ఇచ్చాడు. (యిర్మీయా 35:1-19; 39:15-18; 43:4-7; 45:1-5) అలాగే, మొదటి శతాబ్దపు హెబ్రీ క్రైస్తవులు కూడా పౌలు ఇచ్చిన సలహాకు చక్కగానే ప్రతిస్పందించి ఉంటారు, ఇలా ఎందుకు చెప్పగలమంటే, సా.శ. 66లో రోమా సైన్యాలు యెరూషలేమును ముట్టడించి, వివరించశక్యంకాని కారణంతో వెనక్కి వెళ్లిపోయినప్పుడు, పారిపొమ్మని యేసు ఇచ్చిన హెచ్చరికను విశ్వాసులైన ఆ క్రైస్తవులు లక్ష్యపెట్టారు. (లూకా 21:20, 21) వారు తమ విశ్వాస్యత మూలంగా బ్రదికారు. అదే విధంగా, అంతం వచ్చినప్పుడు మనం విశ్వాసం గలవారిగా నిరూపించబడితే మనమూ బ్రదుకుతాము. ఇప్పుడు మన విశ్వాసాన్ని బలపరచుకోవటానికి అది ఎంత ప్రాముఖ్యమైన కారణమో కదా!

      విశ్వాస మాదిరులను కళ్లకు కట్టినట్లు వర్ణించడం

      10. మోషే విశ్వాసాన్ని పౌలు ఎలా వర్ణించాడు, ఈ విషయంలో మోషేను మనం ఎలా అనుకరించవచ్చు?

      10 పౌలు శక్తివంతమైన మాదిరులను ఉపయోగించడం ద్వారా కూడా విశ్వాసాన్ని నిర్మించాడు. మీరు హెబ్రీయులు 11వ అధ్యాయాన్ని చదువుతుండగా పౌలు బైబిలు పాత్రల ఉదాహరణలను ఎలా కళ్లకు కట్టినట్లుగా చెబుతున్నాడో గమనించండి. ఉదాహరణకు మోషే “అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై” ఉన్నాడని ఆయన చెప్తున్నాడు. (ఇటాలిక్కులు మావి.) (హెబ్రీయులు 11:27) మరోమాటలో, మోషేకు యెహోవా ఎంత వాస్తవమైనవాడిగా ఉన్నాడంటే, ఆయన అదృశ్యమైన దేవుణ్ని చూడగల్గుతున్నట్లు భావించాడు. మన గురించి కూడా అలాగే చెప్పవచ్చా? యెహోవాతో సంబంధాన్ని గురించి మాట్లాడటం తేలికే, కానీ దాన్ని ఏర్పరచుకుని బలపర్చుకోవటానికి ఎంతో కృషి అవసరం. అది మనం చేయవలసిన కృషి! అల్పమైనవిగా అనిపించే వాటితో సహా, నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం యెహోవాను పరిగణలోకి తీసుకునేటంతగా ఆయన మనకు వాస్తవమై ఉన్నాడా? అలాంటి విశ్వాసం అత్యంత క్లిష్టమైన వ్యతిరేకతను కూడా మనం సహించుకునేలా సహాయం చేస్తుంది.

      11, 12. (ఎ) ఎలాంటి పరిస్థితుల క్రింద హనోకు విశ్వాసం పరీక్షించబడి ఉండవచ్చు? (బి) ఎలాంటి ప్రోత్సాహకరమైన ప్రతిఫలాన్ని హనోకు పొందాడు?

      11 హనోకు విశ్వాసాన్ని కూడా చూడండి. ఆయన ఎదుర్కొన్న వ్యతిరేకతను ఊహించటం మనకు కష్టమే. హనోకు అప్పట్లో జీవిస్తున్న దుష్ట ప్రజలకు గుచ్చుకున్నట్లుండే తీర్పు సందేశాన్ని ప్రకటించవలసి ఉంది. (యూదా 14, 15) ఈ విశ్వాసంగల వ్యక్తి పైకి వచ్చిన హింస ఎంత హానికరమైనదీ, ఎంత దౌర్జన్యపూరితమైనదీ అంటే, ఆయన శత్రువులు ఆయనను పట్టుకునే లోపలే యెహోవా ఆయనను సజీవ స్థితి నుండి మరణ నిద్రావస్థలోకి ‘కొనిపోయాడు.’ కాబట్టి హనోకు తాను ప్రకటించిన ప్రవచన నెరవేర్పును చూడలేక పోయాడు. అయితే, కొన్ని విధాలుగా చూస్తే ఆయన మరి శ్రేష్ఠమైన ఒక బహుమానాన్ని అందుకున్నాడు.—హెబ్రీయులు 11:5; ఆదికాండము 5:22-24.

      12 పౌలు ఇలా వివరిస్తున్నాడు: “[హనోకు] కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడైయుండెనని సాక్ష్యము పొందెను.” (హెబ్రీయులు 11:5) ఏమిటి దీని భావం? హనోకు తాను మరణమనే నిద్రకు వెళ్లక ముందు, త్వరలో ఒకరోజు తాను తిరిగి లేవబోయే భూ పరదైసును గురించిన ఒక దర్శనాన్ని బహుశ చూసి ఉంటాడు. ఏదేమైనా, తాను హనోకు విశ్వాసాన్ని బట్టి ఎంతో సంతృప్తి చెందానని యెహోవా ఆయనకు తెలియజేశాడు. హనోకు యెహోవా హృదయాన్ని ఆనందపర్చాడు. (పోల్చండి సామెతలు 27:11.) హనోకు జీవితాన్ని గూర్చి ఆలోచించటం స్పందింపజేసేదిగా లేదూ? అలాంటి విశ్వాససహితమైన జీవితాన్ని జీవించటానికి మీరు ఇష్టపడతారా? అయితే అలాంటి మాదిరులను తలపోయండి; వాళ్లు నిజమైన వ్యక్తులన్నట్లు దృష్టించండి. ప్రతిదినమూ విశ్వాసంతో జీవించేందుకు నిశ్చయించుకోండి. జ్ఞాపకముంచుకోండి, విశ్వాసం ఉన్నవారు, దేవుడు తన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చే ఒక తారీఖునో లేక ఒక పరిమిత కాలాన్నో మనస్సులో పెట్టుకుని యెహోవా సేవచేయరు. బదులుగా, మనం నిరంతరం యెహోవా సేవచేయటానికి తీర్మానించుకున్నాము! అలా చేయటమే ఈ విధానంలోనూ, తరువాతి విధానంలోనూ ఎంతో ఉత్తమమైన జీవితమార్గము.

      విశ్వాసంలో బలంగా ఎదగటం ఎలా?

      13, 14. (ఎ) హెబ్రీయులు 10:24, 25లో నమోదు చేయబడిన పౌలు మాటలు మన కూటాలను ఆనందకరమైన సందర్భాలుగా చేసుకోవడానికి మనకెలా సహాయం చేస్తాయి? (బి) క్రైస్తవ కూటాల ప్రాథమిక ఉద్దేశ్యం ఏమిటి?

      13 హెబ్రీ క్రైస్తవులు తమ విశ్వాసాన్ని బలపరచుకోగల అనేక ఆచరణాత్మక మార్గాలను పౌలు వారికి చూపించాడు. మనం అందులో రెండు మాత్రం చూద్దాము. మన క్రైస్తవ కూటాల్లో క్రమంగా కలుసుకోమని ప్రబోధిస్తూ ఆయన ఇచ్చిన హెబ్రీయులు 10:24, 25లోని ఉద్బోధ మనకు బాగా పరిచయం ఉన్నదే. అయితే, అక్కడ పౌలు చెప్పిన ప్రేరేపిత మాటల భావం, అలాంటి కూటాల్లో మనం కేవలం ప్రేక్షకులుగా ఉండటమని కాదని జ్ఞాపకముంచుకోండి. బదులుగా, కూటాలు ఒకరినొకరు తెలుసుకోవటానికి, దేవుని సేవ మరింతగా చేసేలా ఒకరినొకరు పురికొల్పుకోవటానికి, పరస్పరం ప్రోత్సహించుకోవటానికి అవకాశాలని పౌలు వర్ణిస్తున్నాడు. మనం అక్కడ ఉండేది అందివ్వటానికి; కేవలం అందుకోవటానికి మాత్రమే కాదు. అది, మన కూటాలు మనకు మరింత ఆనందకరమైన సందర్భాలుగా మిగిలేలా చేస్తుంది.—అపొస్తలుల కార్యములు 20:35.

      14 అయితే, ప్రాథమికంగా మనం క్రైస్తవ కూటాలకు హాజరయ్యేది యెహోవా దేవుణ్ని ఆరాధించటానికే. ప్రార్థనలో పాటలో పాల్గొనటం ద్వారా, శ్రద్ధగా వినటం ద్వారా, “జిహ్వాఫలము” అర్పించటం ద్వారా, అంటే కూటాల సమయంలో మన వ్యాఖ్యానాల్లో, కార్యక్రమ భాగాల్లో యెహోవాను స్తుతించటం ద్వారా మనం ఆయనను ఆరాధిస్తాము. (హెబ్రీయులు 13:15) ఆ లక్ష్యాలను మనం మనస్సునందుంచుకుని ప్రతి కూటంలోనూ వాటి ప్రకారం చేస్తే, ప్రతిసారీ మన విశ్వాసం నిశ్చయంగా బలపర్చబడుతుంది.

      15. తమ పరిచర్యను గట్టిగా పట్టుకోమని పౌలు హెబ్రీ క్రైస్తవులకు ఎందుకు ఉద్బోధించాడు, నేడు కూడా అదే ఉపదేశం ఎందుకు సముచితమైనది?

      15 విశ్వాసం బలపరచుకునే మరో మార్గం సువార్త ప్రకటనా పని. పౌలు ఇలా వ్రాశాడు: “వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము.” (హెబ్రీయులు 10:23) ఇతరులు ఏదైనా వదులుకునే ప్రమాదంలో ఉన్నట్లు అనిపిస్తే దానిని గట్టిగా పట్టుకోమని మీరు వారికి ఉద్బోధిస్తారు. పరిచర్యను విడిచిపెట్టేలా సాతాను ఆ హెబ్రీ క్రైస్తవుల్ని తప్పకుండా ఒత్తిడి చేసే ఉంటాడు, అలాగే ఈనాడూ దేవుని ప్రజలపై ఒత్తిడి తీసుకువస్తున్నాడు. అలాంటి ఒత్తిడి ఎదుర్కుంటున్నప్పుడు మనం ఏమి చేయాలి? పౌలు ఏమి చేశాడో చూడండి.

      16, 17. (ఎ) పరిచర్య కోసం పౌలు ఎలా ధైర్యం తెచ్చుకున్నాడు? (బి) మన క్రైస్తవ పరిచర్యలోని ఏదైనా అంశంలో మనం భయపడుతున్నట్లు అనిపిస్తే మనం ఏ చర్యలు తీసుకోవాలి?

      16 థెస్సలొనీకలోని క్రైస్తవులకు పౌలు ఇలా వ్రాశాడు: “మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానముపొంది, యెంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవునియందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియును.” (1 థెస్సలొనీకయులు 2:2) ఫిలిప్పీలో పౌలు ఆయన సహచరులు ఎలా ‘అవమానము పొందారు’? కొందరు పండితులు చెబుతున్నట్లుగా, పౌలు ఉపయోగించిన గ్రీకు పదం అవమానకరంగా, సిగ్గుకరమైన విధంగా, లేక దౌర్జన్యపూరితంగా వ్యవహరించటాన్ని సూచిస్తుంది. ఫిలిప్పీలోని అధికారులు వారిని బెత్తములతో కొట్టి, చెరసాలలో వేసి, బొండలతో బంధించారు. (అపొస్తలుల కార్యములు 16:16-24) ఆ బాధాకరమైన అనుభవం పౌలుపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది? ఆయన మిషనరీ యాత్రలోని తర్వాతి పట్టణమైన థెస్సలొనీకలోని నివాసులు ఆయన భయపడి వెనుక తీసినట్లు చూశారా? లేదు, ఆయన ‘ధైర్యాన్ని తెచ్చుకున్నాడు.’ ఆయన భయాన్ని జయించి ధైర్యంగా ప్రకటించడంలో కొనసాగాడు.

      17 పౌలుకు అంత ధైర్యం ఎక్కణ్నుంచి వచ్చింది? తనలో నుండేనా? లేదు, ఆయన “మన దేవునియందు ధైర్యము” తెచ్చుకొంటినని చెప్పాడు. బైబిలు అనువాదకుల కోసమైన ఒక పుస్తకం ఈ వ్యాఖ్యానాన్ని, “దేవుడు మా హృదయాల్లోనుంచి భయాన్ని తీసివేశాడు” అని అనువదించవచ్చునని చెబుతుంది. ప్రత్యేకించి మీ పరిచర్యను గురించి మీరు ధైర్యంగా భావించలేకపోతే, లేక అందులోని ఏదైనా ఒక అంశం మిమ్మల్ని వెనక్కి పట్టివుంచుతుంటే మీకూ అలాగే ధైర్యాన్నివ్వమని యెహోవాను ఎందుకు అడుగకూడదు? మీ హృదయంలోంచి భయాన్ని తీసివేయమని ఆయన్ని అడగండి. ఆ పనిని చేసేలా ధైర్యాన్ని తెచ్చుకోవటానికి సహాయం చేయమని ఆయన్ని అడగండి. అంతేగాక, ఆచరణాత్మకమైన ఇతర చర్యల్ని తీసుకోండి. ఉదాహరణకు, సాక్ష్యమివ్వటంలోని మీకు కష్టంగావున్న అంశంలో సిద్ధహస్తులైన ఒకరితో పనిచేయటానికి ఏర్పాటు చేసుకోండి. అందులో వ్యాపార ప్రాంతాలు, వీధి సాక్ష్యం, అనియత సాక్ష్యం, లేక టెలిఫోన్‌ సాక్ష్యం ఉండవచ్చు. బహుశ మొదట్లో, మీ ప్రక్కన ఉండేవారు ముందు మాట్లాడటానికి ఇష్టపడవచ్చు. అలా మీరు గమనించి నేర్చుకోండి. అయితే అలాగే మీరూ ప్రయత్నించి చూసేందుకు ధైర్యాన్ని కూడగట్టుకోండి.

      18. మనం మన పరిచర్యలో ధైర్యం తెచ్చుకున్నట్లైతే ఎలాంటి ఆశీర్వాదాలను పొందవచ్చు?

      18 మీరు ధైర్యాన్ని కూడగట్టుకుంటే ఫలితం ఏమై ఉంటుందో ఆలోచించండి. మీరు నిరుత్సాహపడకుండా పట్టుదలగా ఉంటే, సత్యాన్ని పంచుకోవటంలో బహుశ మీరు మంచి అనుభవాల్ని, వేరే విధంగా అయితే మీరు కోల్పోయి ఉండే అనుభవాల్ని మీరు పొందవచ్చు. (25వ పేజీ చూడండి.) మీకు కష్టమైనది చేయడం ద్వారా మీరు యెహోవాను ప్రీతిపర్చారన్న సంతృప్తి మీకు ఉంటుంది. మీరు మీ భయాలను పోగొట్టుకోవడంలో ఆయన ఆశీర్వాదాన్నీ, సహాయాన్నీ అనుభవిస్తారు. మీ విశ్వాసం బలపడుతుంది. నిజంగా, మీరు మీ సొంత విశ్వాసాన్ని నిర్మించుకోవడం మానేసి, ఇతరుల విశ్వాసాన్ని నిర్మించలేరు.—యూదా 20, 21.

      19. ‘విశ్వాసము కలిగినవారికి’ ఏ అమూల్యమైన ప్రతిఫలం వేచివుంది?

      19 మీరు మీ విశ్వాసాన్ని, మీ చుట్టూ ఉన్న వారి విశ్వాసాన్ని బలపరచుకుంటూ ఉందురు గాక. దేవుని వాక్యాన్ని నైపుణ్యంగా ఉపయోగించటం ద్వారా, బైబిలులోని విశ్వాసపు మాదిరులను అధ్యయనం చేసి వాటిని సజీవమైనవిగా దృష్టించడం ద్వారా, క్రైస్తవ కూటాలకు సిద్ధమై వాటిలో భాగం వహించటం ద్వారా, అమూల్యమైన ఆధిక్యతయైన బహిరంగ పరిచర్యలో ఆసక్తితో పాల్గొనటం ద్వారా మిమ్మల్ని మీరూ, అలాగే మీ తోటివారినీ నిర్మించటం ద్వారా మీరలా చేయగలరు. మీరు వీటిని చేస్తుండగా, నిజంగా మీరు కూడా అలాంటి ‘విశ్వాసము కలిగిన వారిలో’ ఒకరనే నిశ్చయత కల్గివుండండి. జ్ఞాపకముంచుకోండి, ఇలాంటి వారు అమూల్యమైన ప్రతిఫలాన్ని పొందుతారు. వారు ‘ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారు.’b మీ విశ్వాసం అంతకంతకూ ఎదుగుతుండాలి, యెహోవా దేవుడు మిమ్మల్ని నిరంతరమూ సజీవంగా రక్షించుగాక!

      [అధస్సూచీలు]

      a పౌలు ఉల్లేఖిస్తున్న సెప్టాజింట్‌లోని హబక్కూకు 2:4 ఇలా చెబుతుంది, “ఎవరైనా వెనుకతీసిన యెడల అతనియందు నా ఆత్మకు సంతోషముండదు.” ఈ వ్యాఖ్యానం ఇప్పుడు ఉనికిలో ఉన్న ఏ ఇతర హెబ్రీ వ్రాతప్రతిలోనూ కనిపించదు. ప్రస్తుతం ఉనికిలో లేని తొలి హెబ్రీ వ్రాతప్రతుల ఆధారంగా సెప్టాజింట్‌ అనువాదం జరిగిందని కొందరు సూచించారు. ఏదేమైనప్పటికీ, పౌలు దేవుని పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే దాన్ని ఇక్కడ పొందుపర్చాడు. కాబట్టి దానికి దైవిక ఆమోదం ఉంది.

      b “మనం . . . వెనుకతీయువారము కాముగాని . . . విశ్వాసము కలిగినవారమైయున్నాము” అనేది యెహోవాసాక్షుల 2000వ సంవత్సరపు వార్షిక వచనమై ఉంటుంది.—హెబ్రీ. 10:39.

తెలుగు ప్రచురణలు (1982-2027)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి