-
క్రీస్తు తన సంఘాన్ని నడిపిస్తున్నాడుకావలికోట—2002 | మార్చి 15
-
-
5, 6. (ఎ) అపొస్తలుడైన యోహానుకు లభించిన దర్శనంలో “యేడు నక్షత్రములు,” ‘యేడు సువర్ణ దీపస్తంభములు’ వేటిని సూచిస్తున్నాయి? (బి) “యేడు నక్షత్రములు” యేసు కుడిచేతిలో ఉండడం దేన్ని సూచిస్తుంది?
5 నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు సూటిగా యేసుక్రీస్తు ఆధీనంలో ఉన్నాడని బైబిలు పుస్తకమైన ప్రకటన చూపిస్తోంది. ‘ప్రభువు దినముకు’ సంబంధించిన ఒక దర్శనంలో అపొస్తలుడైన యోహాను, ‘ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభములమధ్యను మనుష్యకుమారునిపోలిన యొకనిని” చూశాడు, “ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొనియుండెను.” యోహానుకు ఈ దర్శనాన్ని వివరిస్తూ యేసు, “నా కుడిచేతిలో నీవు చూచిన యేడు నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ యేడు సువర్ణ దీప స్తంభముల సంగతియు” ఏమిటంటే, “ఆ యేడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు. ఆ యేడు దీపస్తంభములు ఏడు సంఘములు” అని చెప్పాడు.—ప్రకటన 1:1, 10-20.
6 ‘యేడు సువర్ణ దీపస్తంభములు,’ 1914 లో ప్రారంభమైన ‘ప్రభువు దినము’లోని నిజ క్రైస్తవ సంఘాలన్నిటినీ సూచిస్తున్నాయి. కానీ “యేడు నక్షత్రముల” సంగతేమిటి? తొలుత అవి, మొదటి శతాబ్దంలోని సంఘాల గురించి శ్రద్ధ వహిస్తున్న ఆత్మజనిత, అభిషిక్త పైవిచారణకర్తలను సూచించాయి.a పైవిచారణకర్తలు యేసు కుడిచేతిలో—ఆయన ఆధీనంలోను నిర్దేశం క్రిందను ఉన్నారు. అవును, యేసు ఆ సామూహిక దాసుడి తరగతిని నడిపించాడు. అయితే, నేడు అభిషిక్త పైవిచారణకర్తలు సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నారు. భూవ్యాప్తంగా 93,000కు పైగా ఉన్న యెహోవాసాక్షుల సంఘాలకు క్రీస్తు నాయకత్వం ఎలా వ్యాపిస్తుంది?
7. (ఎ) భూమియందంతటా ఉన్న సంఘాల్లో నాయకత్వాన్ని అందించడానికి పరిపాలక సభను యేసు ఎలా ఉపయోగించుకుంటున్నాడు? (బి) క్రైస్తవ పైవిచారణకర్తలు పరిశుద్ధాత్మచే నియమించబడుతున్నారని ఎందుకు చెప్పవచ్చు?
7 మొదటి శతాబ్దంలోలాగే నేడు కూడా, అభిషిక్త పైవిచారణకర్తల్లో అర్హులైన పురుషుల చిన్న గుంపు పరిపాలక సభగా సేవచేస్తూ, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన సామూహిక దాసుడికి ప్రాతినిధ్యం వహిస్తోంది. మన నాయకుడు, అర్హులైన పురుషులను—ఆత్మాభిషిక్తులైనా కాకపోయినా—స్థానిక సంఘాల్లో పెద్దలుగా నియమించడానికి ఈ పరిపాలక సభను ఉపయోగించుకుంటాడు. ఈ విషయంలో, పరిశుద్ధాత్మ చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది, దాన్ని ఉపయోగించుకోవడానికి యెహోవా యేసుకు అధికారం ఇచ్చాడు. (అపొస్తలుల కార్యములు 2:32, 33) మొదటిగా, ఈ పైవిచారణకర్తలు పరిశుద్ధాత్మచే ప్రేరేపితమైన దేవుని వాక్యంలోని ఆవశ్యకతలను చేరుకోవాలి. (1 తిమోతి 3:1-7; తీతు 1:5-9; 2 పేతురు 1:20, 21) ప్రార్థన చేసిన తర్వాత, పరిశుద్ధాత్మ నడిపింపు క్రింద సిఫార్సులు నియామకాలు జరుగుతాయి. దానికి తోడు, నియమించబడిన వ్యక్తులు ఆ ఆత్మ ఫలాన్ని ఫలిస్తున్నట్లు సాక్ష్యాధారాన్ని చూపిస్తారు. (గలతీయులు 5:22, 23) కాబట్టి పౌలు ఇచ్చిన సలహా, అభిషిక్తులైనా కాకపోయినా, పెద్దలందరికీ ఒకే విధంగా వర్తిస్తుంది: “పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.” (అపొస్తలుల కార్యములు 20:28) ఈ నియుక్త పురుషులు పరిపాలక సభ నుండి నిర్దేశాలను పొందుతారు, సంఘాన్ని ఇష్టపూర్వకంగా కాస్తారు. ఈ విధంగా నేడు క్రీస్తు మనతో కూడ ఉన్నాడు, అలాగే సంఘాన్ని క్రియాశీలంగా నడిపిస్తున్నాడు.
-
-
క్రీస్తు తన సంఘాన్ని నడిపిస్తున్నాడుకావలికోట—2002 | మార్చి 15
-
-
a ఇక్కడ “నక్షత్రములు” అక్షరార్థ దేవదూతలను సూచించడం లేదు. అదృశ్య ఆత్మ ప్రాణుల కోసమైన సమాచారాన్ని నమోదు చేయడానికి యేసు ఒక మానవుణ్ణి ఎంతమాత్రము ఉపయోగించడు. కాబట్టి, “నక్షత్రములు” సంఘాల్లోని మానవ పైవిచారణకర్తలను, అంటే పెద్దలను సూచించాలి; వారు యేసు సందేశకులుగా దృష్టించబడుతున్నారు. వారి సంఖ్య ఏడు అన్నది దైవికంగా నిర్ధారించబడిన సంపూర్ణత్వాన్ని సూచిస్తుంది.
-