-
బబులోను అంతాన్నిగూర్చి ప్రలాపించుట, ఆనందించుటప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
-
-
భయంకరమైన రక్తాపరాధము
14. యెహోవా యిచ్చే కఠిన తీర్పుకుగల కారణమేమని బలిష్టుడైన దూత చెబుతున్నాడు, యేసు భూమ్మీద ఉన్నప్పుడు ఆయన అలాగే ఏమని తెల్పాడు?
14 ముగింపుగా ఆ బలిష్టుడైన దూత, మహాబబులోనుకు యెహోవా ఎందుకంత కఠినంగా తీర్పుతీరుస్తున్నాడో చెబుతున్నాడు: ఆ దూత యిలా చెబుతున్నాడు, “మరియు ప్రవక్తలయొక్కయు, పరిశుద్ధులయొక్కయు, భూమిమీద వధింపబడినవారందరియొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెను.” (ప్రకటన 18:24) యేసు భూమ్మీద ఉన్నప్పుడు యెరూషలేములోని పెద్దలతో వారు “నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని . . . భూమిమీద చిందింపబడిన నీతిమంతుల రక్తము” విషయంలో అపరాధులని చెప్పాడు. ఆ ప్రకారమే, ఆ వక్రజనం సా.శ. 70 లో నాశనమైంది. (మత్తయి 23:35-38) ఈనాడు, మరో మతపరమైన తరము దేవుని సేవకులను హింసిస్తున్నందుకు రక్తాపరాధియౌతుంది.
15. నాజీ జర్మనీలోని కాథోలిక్ చర్చి రెండు కారణాలనుబట్టి ఎలా రక్తాపరాధియైంది?
15 ది కాథోలిక్ చర్చి అండ్ నాజీ జర్మనీ, అనే తన పుస్తకంలో గెంటర్ లూయి యిలా రాస్తున్నాడు: “యెహోవాసాక్షులు [1933] ఏప్రిల్ 13న బెవేరియాలో అణచివేయబడినప్పుడు, నిషేధింపబడిన మతాన్ని యింకా అనుసరించే సభ్యులెవరైనా ఉన్నారేమో రిపోర్టు చేయవలసిందని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రిలిజియన్ అను శాఖ యిచ్చిన పనిని సహితం చర్చి స్వీకరించింది.” అలా కాథోలిక్ చర్చి, వేలాదిమంది సాక్షులు కాన్‌సన్‌ట్రేషన్ క్యాంపులకు పంపబడినదానిలో భాగం కల్గివుంది; చంపబడిన వందలాదిమంది సాక్షుల రక్తంతో దాని చేతులు మలినమైయున్నవి. వెల్‌హెల్మ్ కుసెరో వంటి యౌవనస్థులు కాల్చి చంపే స్క్వాడ్ చేతిలో వారు ధైర్యంగా చనిపోగలరని నిరూపించినప్పుడు, యిలా మనస్సాక్షినిబట్టి ఎదిరించే వారికి కాల్చిచంపే స్క్వాడ్ ఎంతో మంచిదని హిట్లర్ తీర్మానించాడు; అందుకే వెల్‌హెల్మ్ సోదరుడు వోల్ఫ్‌గాంగ్ తన 20వ ఏట శిరచ్ఛేదనం గావించబడ్డాడు. అదే సమయంలో, కాథోలిక్ చర్చి జర్మన్ కాథోలిక్ యౌవనస్థులు స్వదేశంకొరకు సైన్యంలో చనిపోవాలని వారిని ప్రోత్సహిస్తున్నారు. చర్చి రక్తాపరాధం స్పష్టంగా కనబడుతోంది!
16, 17. (ఎ) మహాబబులోనుపై ఏ రక్తాపరాధం మోపాలి, నాజీ మారణహోమంలో చనిపోయిన యూదుల విషయంలో వాటికన్ ఎలా రక్తాపరాధియైంది? (బి) ఈ శతాబ్దంలోనే వందలాది యుద్ధాల్లో లక్షలాదిగా హతులైనవారి విషయంలో అబద్ధమతం నిందింపబడే ఒక విధానమేది?
16 అయిననూ, “భూమిమీద వధింపబడిన వారందరి రక్తము”నకు మహాబబులోనును బాధ్యురాలిగా చేయాలని ప్రవచనం తెల్పుతుంది. ఈ ఆధునిక కాలంలో అది నిశ్చయంగా వాస్తవమే. ఉదాహరణకు, జర్మనీలో హిట్లర్ అధికారం చేపట్టడానికి కాథోలిక్కులు పన్నిన పన్నాగం సహాయపడినప్పుడు, నాజీ ప్రభుత్వం అరవైలక్షల యూదులను అమానుషంగా ఊచకోత కోసినప్పటి భయంకర రక్తాపరాధంలో వాటికన్ పాలుపంచుకుంది. ఇంకనూ, యీ 20వ శతాబ్దంలోనే వందలాది యుద్ధాల్లో, పదికోట్లకంటె ఎక్కువమందే చంపబడ్డారు. అబద్ధమతం యీ విషయంలో నిందింప తగిందేనా? అవును, రెండు విధాలుగా నిందింపదగిందే.
17 ఒక కారణమేమంటే, అనేకయుద్ధాలు మత విభేదాలకు సంబంధించినవే. ఉదాహరణకు, ఇండియాలో 1946-48 సంవత్సరాల్లో హిందూ-ముస్లింలమధ్య చెలరేగిన కలహం మతసంబంధమైనదే. అప్పుడు లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ ఇరాక్ మధ్య 1980వ దశాబ్దంలో జరిగిన పోరాటం మతకక్షలకు సంబంధించిందే, అందులో వేలాదిమంది హతులయ్యారు. ఉత్తర ఐర్లాండులో కాథోలిక్కులు ప్రొటెస్టెంట్ల మధ్య ప్రజ్వరిల్లిన హింస వేలాదిమందిని బలిగొన్నది. లెబానోనులో కొనసాగే దౌర్జన్యకాండ మతంపై ఆధారపడిందే. ఈ విషయంపై సర్వేచేస్తూ, రచయిత సి. యల్. సుల్జ్‌బెర్గర్ 1976 లో యిలా అన్నాడు: “ప్రపంచవ్యాప్తంగా యిప్పుడు జరుగుతున్న యుద్ధాలలో సగం లేక అంతకంటె ఎక్కువవాటిల్లో మతమే స్వయంగా జోక్యం చేసుకొని ఉండొచ్చు లేక మతకలహాలవల్ల జరుగుతుండ వచ్చుననేది తిరుగులేని వాస్తవం.” నిజానికి, మహాబబులోనుయొక్క భయంకర చరిత్రంతటిలోనూ యిదే జరుగుతూవస్తుంది.
18. ప్రపంచ మతాలు రక్తాపరాధులయ్యే రెండో విధానమేది?
18 మరి రెండో కారణమేమిటి? యెహోవా దృష్టిలో, ప్రపంచమతాలు రక్తాపరాధులే, ఎందుకంటే యెహోవా సేవకులకు ఆయనిచ్చే నియమాలను వారు తమ అనుచరులకు కచ్చితంగా బోధించలేదు. దేవుని సత్యారాధికులు యేసుక్రీస్తును అనుకరించాలని, ఏ జాతివారినైనా ఇతరులను ప్రేమించాలని వారికి కచ్చితంగా బోధించలేదు. (మీకా 4:3, 5; యోహాను 13:34, 35; అపొస్తలుల కార్యములు 10:34, 35; 1 యోహాను 3:10-12) మహాబబులోనుగా తయారైన మతాలు యీ విషయాలను ప్రజలకు ఉపదేశించనందున వాటి అనుచరులు అంతర్జాతీయ యుద్ధాల సుడిగుండం వైపు ఈడ్వబడుతున్నారు. ఈ శతాబ్దపు తొలిభాగంలో జరిగిన రెండు ప్రపంచయుద్ధాల్లో యిదెంత స్పష్టంగా కన్పడింది! ఆ రెండూ క్రైస్తవమత సామ్రాజ్యంలోనే ప్రారంభమయ్యాయి, మరి తోటిమతస్థులు ఒకరినొకరు చంపుకున్నారు. క్రైస్తవులని చెప్పుకున్న వారంతా బైబిలు సూత్రాలను పాటిస్తే, అసలా యుద్ధాలే జరిగుండేవికావు.
19. మహాబబులోను ఏ భయంకరమైన రక్తాపరాధాన్ని మోస్తుంది?
19 యెహోవా యీ రక్తాపరాధాన్నంతటిని మహాబబులోను మీద వేస్తున్నాడు. మతనాయకులు, ముఖ్యంగా క్రైస్తవమతసామ్రాజ్యం, వారి ప్రజలకు బైబిలు సత్యాలను బోధించివుంటే, అంత రక్తం చిందివుండేది కాదు. గనుక, మహావేశ్యయగు అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోను, తాను హింసించి చంపిన “ప్రవక్తలయొక్కయు పరిశుద్ధులయొక్కయు రక్తము” విషయంలోనేగాక, “భూమిమీద వధింపబడిన వారందరి” విషయంలోనూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో యెహోవాకు నిజంగా జవాబుదారియై వుంది. మహాబబులోను భయంకరమైన రక్తాపరాధియైంది. దాని అంతిమ నాశనం వచ్చినప్పుడు అదెంత మంచి నివారణోగదా!
-
-
బబులోను అంతాన్నిగూర్చి ప్రలాపించుట, ఆనందించుటప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
-
-
[270వ పేజీలోని బాక్సు]
రాజీవల్ల కలిగే ఫలితం
గెంటర్ లూయి ది కాథోలిక్ చర్చి అండ్ నాజీ జర్మనీ అనే తన పుస్తకంలో యిలా రాస్తున్నాడు: “జర్మన్ కాథోలిసిసమ్ మొదటినుండే నాజీపాలనను వ్యతిరేకించే నియమాన్ని పాటిస్తే, ప్రపంచ చరిత్రే మరో పంథాలో ఉండేది. ఈ పోరాటం చివరకు హిట్లర్‌ను ఓడించడంలోను, అతని అనేక దురాగతాలకు కళ్లెం వేయడంలో విఫలమైననూ, చర్చికున్న నైతిక గౌరవం ఎంతో ఉన్నతస్థాయికి పెరిగుండేది. అలా ఎదిరించే మానవ త్యాగనిరతి తిరుగులేనిరీతిగా మహాగొప్పదై యుండేది, అయితే యీ త్యాగాలన్నీ అన్నింటికన్న అత్యంత గొప్పకారణం నిమిత్తం చేయబడియుండేవి. స్వంతవారు నమ్మకస్థులు కానందువల్ల హిట్లర్ యుద్ధంలో దిగడానికి ధైర్యం చేసివుండేవాడు కాదు, మరి అక్షరార్థంగా లక్షలాది ప్రజల ప్రాణాలు రక్షింపబడియుండేవి. . . . హిట్లర్‌యొక్క కాన్‌సన్‌ట్రేషన్ క్యాంపుల్లో జర్మన్ నాజీపాలనను వ్యతిరేకించిన వేలాదిమంది చిత్రహింసకు గురై హతులైనప్పుడు, పోలిష్ మేధావివర్గాన్ని హతమార్చినప్పుడు, వేలాదిమంది రష్యన్‌లు బానిసలుగా [అథోస్థాయి మానవులుగా] పరిగణింపబడి చంపబడినప్పుడు, మరియు ‘ఆర్యులు కాదని’ 60,00,000 మందిని ఊచకోతకోసినప్పుడు, జర్మనీలోని కాథోలిక్ చర్చి అధికారులు జర్మనీలో యీ నేరాలన్నీ చేస్తూనే తమ మద్దతును విస్తరింపజేసుకుంది. రోమన్ కాథోలిక్ చర్చి సర్వోన్నత నీతి ఉపదేశకుడును ఆత్మీయ శిరస్సయిన, రోమ్‌లోని పోప్ మౌనముద్ర వహించాడు.”—320, 341 పుటలు.
-