-
మీకిది తెలుసా?కావలికోట—2009 | అక్టోబరు 1
-
-
మీకిది తెలుసా?
ప్రార్థన ముగింపులో “ఆమేన్” అని ఎందుకంటారు?
“ఆమేన్” అనేది హెబ్రీ భాషా పదం. దాన్ని గ్రీకు, తెలుగు భాషల్లో కూడా అలాగే ఉపయోగిస్తారు. సాధారణంగా ప్రార్థనను, ప్రమాణాన్ని, ఆశీర్వాదాన్ని లేదా శాపాన్ని విన్నవాళ్లంతా ఒకేసారి ఆమేన్ అంటారు. ప్రాథమికంగా దానికి “అవును గాక” లేదా “ఖచ్చితంగా” అనే అర్థాలున్నాయి. అలా అన్నప్పుడు, ప్రార్థిస్తున్న వ్యక్తి అడిగినవాటితో శ్రోతలు ఏకీభవిస్తున్నారని చూపిస్తుంది. ఒక రెఫరెన్సు గ్రంథం ప్రకారం, “ఆమేన్ అనే పదం, ఖచ్చితత్వాన్ని, సత్యసంధతను, విశ్వసనీయతను, సంపూర్ణ నమ్మకాన్ని సూచిస్తుంది.” ధర్మశాస్త్రం ప్రకారం, బైబిలు కాలాల్లో ఒక వ్యక్తి ప్రమాణం లేదా నిబంధన చేసిన తర్వాత ఆమేన్ అన్నాడంటే ఆ వ్యక్తి తాను చేసిన ప్రమాణానికి లేదా నిబంధనకు కట్టుబడివుండాలి, దాని పర్యవసానాలకు బాధ్యత వహించాలి.—ద్వితీయోపదేశకాండము 27:15-26.
యేసు ప్రకటిస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు కొన్ని విషయాలను చెప్పిన తర్వాత ముగింపులో “ఆమేన్” అనే పదాన్ని ఉపయోగించాడు. ఆయన తాను చెప్పినవి ఎంత ఖచ్చితమైనవో చూపించడానికి ఆ పదాన్ని వాడాడు. ఆయన అలా చెప్పినప్పుడు ఉపయోగించిన గ్రీకు భాషాపదం తెలుగు బైబిల్లో “నిశ్చయముగా” అని అనువదించబడింది. (మత్తయి 5:18; 6:2, 5) యోహాను సువార్త అంతటిలో, యేసు “ఆమేన్” అనే గ్రీకు పదాన్ని వెంటవెంటనే రెండుసార్లు ఉపయోగించి తాను చెప్పినవాటి సత్యసంధతను, నమ్మకత్వాన్ని మరింత నొక్కి చెప్పాడు. యేసు ఆమేన్ అనే పదాన్ని ఈ విధంగా వెంటవెంటనే రెండుసార్లు ఉపయోగించడం, పరిశుద్ధ లేఖనాల్లో మాత్రమే కనిపిస్తుందని చెప్పబడుతోంది.
క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, యేసు సాక్ష్యం ‘నమ్మకమైనది, సత్యమైనది’ అని చెప్పడానికి ఆయన “ఆమేన్” అని పిలువబడ్డాడు.—ప్రకటన 3:14. (w09 6/1)
-
-
మీకిది తెలుసా?కావలికోట—2009 | అక్టోబరు 1
-
-
మీకిది తెలుసా?
యేసు ప్రార్థనలో యెహోవాను “నాయనా, తండ్రీ” అని ఎందుకు పిలిచాడు?
నాయనా అని అనువదించబడిన అబ్బా అనే అరామిక్ పదానికి “తండ్రి” లేదా “ఓ తండ్రీ” అని అర్థం. లేఖనాల్లో కనిపించే మూడు సందర్భాల్లోనూ అది ప్రార్థనలో పరలోక తండ్రియైన యెహోవాను సంబోధిస్తూ ఉపయోగించబడింది. యేసు భూమ్మీద జీవించిన కాలంలో, ఆ పదానికి ఎలాంటి ప్రత్యేకత ఉండేది?
ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బైబిల్ ఎన్‌సైక్లోపీడియా ఇలా తెలియజేస్తుంది: “యేసు జీవించిన కాలంలో తండ్రితో సన్నిహితంగావుండే, తండ్రిని గౌరవించే పిల్లలు సాధారణంగా తమ తండ్రిని అలా పిలిచేవాళ్ళు.” తండ్రిమీదున్న ఆప్యాయతతో పిల్లలు అలా పిలిచేవాళ్ళు. అంతేకాదు, వాళ్ళు నేర్చుకునే మొదటి మాటల్లో అదొకటి. ప్రాముఖ్యంగా యేసు తీవ్రంగా ప్రార్థిస్తున్నప్పుడు తన తండ్రిని అలా సంబోధించేవాడు. యేసు ఇంకా కొన్ని గంటల్లో మరణిస్తాడనగా గెత్సెమనే తోటలో యెహోవాకు ప్రార్థిస్తూ ఆయనను “నాయనా, తండ్రీ” అని పిలిచాడు.—మార్కు 14:36.
“గ్రీకు-రోమన్ కాలానికి చెందిన యూదుల సాహిత్యంలో దేవుణ్ణి నాయనా అని సంబోధించడం చాలా అరుదు. దేవునితో అంత సన్నిహితత్వం ఉన్నట్లు ఆయనను అలా పిలవడం ఎంతో తప్పుగా పరిగణించబడడమే అందుకు కారణం కావచ్చు,” అయితే “దేవునితో తనకు సన్నిహితత్వం ఉందని తాను అంతకు ముందు చెప్పిన అసాధారణమైన విషయాన్ని మళ్ళీ పరోక్షంగా ధృవీకరించడానికే యేసు ప్రార్థనలో ఆ పదాన్ని ఉపయోగించాడు” అని కూడా ఆ రెఫరెన్సు గ్రంథం చెప్తోంది. లేఖనాల్లో ఈ పదం అపొస్తలుడైన పౌలు రాసిన పత్రికల్లో మరో రెండుచోట్ల కనిపిస్తుంది. ఒకచోట “నాయనా” అనీ, మరోచోట “అబ్బా” అనీ ఆ పత్రికల్లో ఉంది. దీన్నిబట్టి మొదటి శతాబ్దపు క్రైస్తవులు కూడా తమ ప్రార్థనల్లో ఈ పదాన్ని ఉపయోగించేవారని తెలుస్తోంది.—రోమీయులు 8:15; గలతీయులు 4:6. (w09 4/1)
-