మార్కు
13 ఆయన ఆలయం నుండి బయటికి వస్తుండగా, ఆయన శిష్యుల్లో ఒకరు ఆయనతో ఇలా అన్నారు: “బోధకుడా, ఓసారి అటు చూడు! ఆ రాళ్లు, కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా!” 2 అయితే యేసు అతనితో ఇలా అన్నాడు: “ఈ గొప్ప కట్టడాలు నువ్వు చూస్తున్నావు కదా? రాయి మీద రాయి ఒక్కటి కూడా ఉండకుండా ఇవి పడద్రోయబడతాయి.”
3 ఒలీవల కొండ మీద ఆలయం కనిపించే చోట ఆయన కూర్చొని ఉన్నప్పుడు పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ ఆయన దగ్గరికి వెళ్లి ఇలా అడిగారు: 4 “ఇవి ఎప్పుడు జరుగుతాయి? ఇవన్నీ ముగింపుకు రాబోతున్నాయని తెలిపే సూచన ఏమిటి? మాకు చెప్పవా.” 5 అందుకు యేసు వాళ్లకు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు: “ఎవరూ మిమ్మల్ని తప్పుదారి పట్టించకుండా చూసుకోండి. 6 చాలామంది నా పేరుతో వచ్చి, ‘నేనే ఆయన్ని’ అని చెప్తూ ఎంతోమందిని తప్పుదారి పట్టిస్తారు. 7 అంతేకాదు మీరు యుద్ధాల గురించి, యుద్ధ వార్తల గురించి విన్నప్పుడు కంగారుపడకండి; ఇవన్నీ జరగాలి, కానీ అంతం అప్పుడే రాదు.
8 “ఒక దేశం మీద మరో దేశం, ఒక రాజ్యం మీద మరో రాజ్యం దాడిచేస్తాయి; ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో భూకంపాలు వస్తాయి; ఆహారకొరతలు కూడా వస్తాయి. ఇవి పురిటి నొప్పుల లాంటి వేదనలకు ఆరంభం.
9 “మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ప్రజలు మిమ్మల్ని న్యాయస్థానాలకు అప్పగిస్తారు, సభామందిరాల్లో మిమ్మల్ని కొడతారు. నా కారణంగా మిమ్మల్ని అధిపతుల ముందు, రాజుల ముందు నిలబెడతారు. అప్పుడు వాళ్లకు సాక్ష్యం ఇచ్చే అవకాశం మీకు దొరుకుతుంది. 10 అంతేకాదు, ముందు అన్ని దేశాల్లో మంచివార్త ప్రకటించబడాలి. 11 వాళ్లు మిమ్మల్ని అప్పగించడానికి తీసుకువెళ్తున్నప్పుడు, ఏమి మాట్లాడాలా అని ముందే ఆందోళన పడకండి; ఆ సమయంలో పవిత్రశక్తి మీకు ఏమి అనుగ్రహిస్తే అది మాట్లాడండి, ఎందుకంటే మాట్లాడేది మీరు కాదు పవిత్రశక్తే. 12 అంతేకాదు ఓ వ్యక్తి తన సోదరుణ్ణి చంపడానికి అప్పగిస్తాడు, ఓ తండ్రి తన బిడ్డను చంపడానికి అప్పగిస్తాడు, పిల్లలు తమ తల్లిదండ్రుల మీద తిరుగబడి వాళ్లను చంపడానికి అప్పగిస్తారు. 13 మీరు నా శిష్యులైనందుకు ప్రజలందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. కానీ అంతం వరకు సహించినవాళ్లే రక్షించబడతారు.
14 “అయితే, నాశనాన్ని కలుగజేసే అసహ్యమైన వస్తువు ఉండకూడని చోట ఉండడం మీరు చూసినప్పుడు (చదివే వ్యక్తి వివేచన ఉపయోగించాలి), యూదయలో ఉన్నవాళ్లు కొండలకు పారిపోవడం మొదలుపెట్టాలి. 15 డాబా మీదున్న వ్యక్తి ఇంట్లో నుండి ఏదైనా తెచ్చుకోవడానికి కిందికి దిగకూడదు, ఇంట్లోకి వెళ్లకూడదు; 16 పొలంలో ఉన్న వ్యక్తి తన పైవస్త్రం తెచ్చుకోవడానికి వెనక్కి రాకూడదు. 17 ఆ రోజుల్లో గర్భిణులకు, పాలిచ్చే స్త్రీలకు శ్రమ! 18 అది చలికాలంలో రాకూడదని ప్రార్థిస్తూ ఉండండి; 19 ఎందుకంటే అవి శ్రమతో నిండిన రోజులు; దేవుని సృష్టి ఆరంభం నుండి ఇప్పటివరకు అలాంటి శ్రమ రాలేదు, మళ్లీ రాదు కూడా. 20 నిజానికి, యెహోవా* ఆ రోజుల్ని తగ్గించకపోతే, ఒక్కరు కూడా తప్పించుకోలేరు. కానీ, తాను ఎంపిక చేసుకున్న వాళ్లకోసం ఆయన ఆ రోజుల్ని తగ్గిస్తాడు.
21 “ఇంకా, ఎవరైనా మీతో ‘ఇదిగో! క్రీస్తు ఇక్కడ ఉన్నాడు’ అనో, ‘అదిగో! ఆయన అక్కడ ఉన్నాడు’ అనో చెప్తే నమ్మకండి. 22 ఎందుకంటే అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు పుట్టుకొచ్చి సాధ్యమైతే ఎంచుకోబడిన వాళ్లను కూడా తప్పుదారి పట్టించడానికి అద్భుతాలు, ఆశ్చర్యకరమైన పనులు చేస్తారు. 23 కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. నేను అన్ని విషయాలు మీకు ముందే చెప్పేశాను.
24 “కానీ ఆ రోజుల్లో, ఆ శ్రమల తర్వాత, సూర్యుడు చీకటిమయమౌతాడు, చంద్రుడు తన వెలుగు ఇవ్వడు, 25 నక్షత్రాలు ఆకాశం నుండి రాలిపోతాయి; ఆకాశంలోని శక్తులు కదిలించబడతాయి. 26 అప్పుడు మానవ కుమారుడు గొప్ప శక్తితో, మహిమతో మేఘాల్లో రావడం వాళ్లు చూస్తారు. 27 తర్వాత, ఆయన దూతల్ని పంపి ఇటు భూమ్మీద, అటు ఆకాశంలో నలుదిక్కుల నుండి దేవుడు ఎంపిక చేసుకున్నవాళ్లను సమకూరుస్తాడు.
28 “అంజూర చెట్టు ఉదాహరణను గమనించండి: ఆ చెట్టు కొమ్మలు పచ్చగా, మృదువుగా మారి చిగురించిన వెంటనే ఎండాకాలం దగ్గర పడిందని మీకు తెలుస్తుంది. 29 అదే విధంగా, ఈ విషయాలు జరుగుతుండడం మీరు చూసినప్పుడు ఆయన దగ్గర్లోనే అంటే గుమ్మం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. 30 నేను నిజంగా మీతో చెప్తున్నాను, ఇవన్నీ జరిగే వరకు ఈ తరం అస్సలు అంతరించిపోదు. 31 ఆకాశం, భూమి అంతరించిపోతాయి కానీ, నా మాటలు ఎప్పటికీ నిలిచివుంటాయి.
32 “ఆ రోజు గురించి, ఆ గంట గురించి ఎవ్వరికీ తెలియదు. పరలోకంలోని దేవదూతలకు గానీ, కుమారుడికి గానీ తెలియదు; తండ్రికి మాత్రమే తెలుసు. 33 అప్రమత్తంగా, మెలకువగా ఉండండి. ఎందుకంటే దేవుడు ఎంచుకున్న సమయం ఎప్పుడో మీకు తెలియదు. 34 దాన్ని, ఇల్లు వదిలి విదేశానికి వెళ్లిన మనిషితో పోల్చవచ్చు. అతను వెళ్లేముందు తన దాసులకు అధికారం ఇచ్చి, ఎవరెవరు ఏమేమి చేయాలో చెప్పి, కాపలాదారుడికి మెలకువగా ఉండమని ఆజ్ఞాపించాడు. 35 ఇంటి యజమాని ఎప్పుడు వస్తాడో మీకు తెలీదు. అతను సాయంకాలం వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, తెల్లవారుజామున* వస్తాడో, పొద్దున వస్తాడో మీకు తెలియదు. అందుకే అప్రమత్తంగా ఉండండి. 36 లేదంటే, అతను అకస్మాత్తుగా వచ్చినప్పుడు మీరు నిద్రపోతూ దొరికిపోతారు. 37 కానీ, నేను మీకు చెప్తున్న ఈ మాటే అందరికీ చెప్తున్నాను: అప్రమత్తంగా ఉండండి.”