మార్కు
15 తెల్లవారగానే ముఖ్య యాజకులు పెద్దలతో, శాస్త్రులతో, నిజానికి మహాసభ వాళ్లందరితో చర్చలు జరిపి, యేసు చేతులు కట్టేసి ఆయన్ని తీసుకువెళ్లి పిలాతుకు అప్పగించారు. 2 అప్పుడు పిలాతు, “నువ్వు యూదుల రాజువా?” అని యేసును అడిగాడు. అందుకు ఆయన, “నువ్వే స్వయంగా ఆ మాట అంటున్నావు కదా” అన్నాడు. 3 కానీ ముఖ్య యాజకులు ఆయన మీద ఎన్నో తప్పులు ఆరోపించారు. 4 పిలాతు మళ్లీ ఆయన్ని ప్రశ్నిస్తూ, “నువ్వేమీ మాట్లాడవా? వాళ్లు నీ మీద ఎన్ని నేరాలు మోపుతున్నారో చూడు” అన్నాడు. 5 కానీ యేసు మాత్రం ఇంకేమీ మాట్లాడలేదు, పిలాతుకు చాలా ఆశ్చర్యమేసింది.
6 పిలాతు ప్రతీ పస్కా పండుగకు ప్రజలు కోరుకున్న ఓ ఖైదీని విడుదల చేయడం వాడుక. 7 ఆ సమయానికి చెరసాలలో, రాజద్రోహానికి పాల్పడి హత్య చేసిన నేరగాళ్లు ఉన్నారు. వాళ్లలో బరబ్బ ఒకడు. 8 వాడుక ప్రకారం, జనం తమ కోరికను తెలపడానికి పిలాతు దగ్గరికి వచ్చారు. 9 అప్పుడు పిలాతు, “మీ కోసం యూదుల రాజును విడుదల చేయమంటారా?” అని వాళ్లను అడిగాడు. 10 ఎందుకంటే, ముఖ్య యాజకులు అసూయతోనే యేసును తనకు అప్పగించారని పిలాతుకు తెలుసు. 11 కానీ యేసుకు బదులు బరబ్బను విడుదల చేయమని కోరుకునేలా ముఖ్య యాజకులు జనాన్ని ఉసిగొల్పారు. 12 పిలాతు మళ్లీ జనాన్ని ఇలా అడిగాడు: “మీరు ఇతన్ని యూదుల రాజు అంటారు కదా, మరి ఇతన్ని ఏమి చేయాలి?” 13 వాళ్లు మళ్లీ గట్టిగా ఇలా అరిచారు: “అతనికి కొయ్యపై శిక్ష వేయండి!”* 14 కానీ పిలాతు వాళ్లతో, “ఎందుకు? ఇతను ఏం తప్పు చేశాడు?” అని అన్నాడు. అయినా వాళ్లు ఇంకా గట్టిగా అరుస్తూ ఇలా అన్నారు: “అతనికి కొయ్యపై శిక్ష వేయండి!”* 15 అప్పుడు పిలాతు జనాన్ని తృప్తిపర్చడానికి బరబ్బను విడుదల చేశాడు; యేసునేమో కొరడాలతో కొట్టించి, కొయ్య మీద మరణశిక్ష వేయడానికి సైనికులకు అప్పగించాడు.
16 సైనికులు ఆయన్ని పిలాతు ఇంటి ప్రాంగణంలోకి తీసుకొచ్చారు, తర్వాత మొత్తం సైనికులందర్నీ పోగుచేశారు. 17 వాళ్లు ఆయనకు ఊదారంగు వస్త్రం తొడిగారు, ముళ్లతో కిరీటం అల్లి ఆయన తలకు పెట్టారు; 18 ఆ తర్వాత వాళ్లు, “యూదుల రాజా, నమస్కారం!”* అనడం మొదలుపెట్టారు. 19 అంతేకాదు, కర్రతో ఆయన తల మీద కొట్టారు, ఆయన మీద ఉమ్మేశారు, మోకాళ్లూని ఆయనకు వంగి నమస్కారం చేశారు. 20 చివరకు ఆయన్ని ఎగతాళి చేశాక, ఆయన ఒంటిమీదున్న ఊదారంగు వస్త్రాన్ని తీసేసి, ఆయన పైవస్త్రాలు ఆయనకు వేశారు. ఆ తర్వాత మేకులతో కొయ్యకు దిగగొట్టడానికి ఆయన్ని బయటికి తీసుకువెళ్లారు. 21 దారిలో, ఓ పల్లెటూరి నుండి వస్తున్న కురేనేవాడైన సీమోను వాళ్లకు ఎదురయ్యాడు. అతను అలెక్సంద్రు, రూఫువాళ్ల నాన్న. సైనికులు ఆ హింసాకొయ్యను* మోయమని అతన్ని బలవంతపెట్టారు.
22 సైనికులు యేసును గొల్గొతా అనే చోటుకు తీసుకొచ్చారు. గొల్గొతా అంటే “కపాల స్థలం” అని అర్థం. 23 అక్కడ బోళం* కలిపిన ద్రాక్షారసాన్ని వాళ్లు ఆయనతో తాగించాలని చూశారు, కానీ ఆయన తాగలేదు. 24 తర్వాత వాళ్లు ఆయనను మేకులతో కొయ్యకు దిగగొట్టారు. ఆయన పైవస్త్రాలు పంచుకోవడానికి చీట్లు* వేసి ఎవరికి వచ్చింది వాళ్లు తీసుకున్నారు. 25 ఉదయం దాదాపు 9 గంటలకు* ఆయన్ని మేకులతో కొయ్యకు దిగగొట్టారు. 26 “యూదుల రాజు” అని ఆయన మీద మోపిన నేరాన్ని చెక్కించి పెట్టారు. 27 అంతేకాదు ఆయన పక్కన ఇద్దరు బందిపోటు దొంగల్ని కూడా కొయ్యలకు వేలాడదీశారు. ఒకతన్ని ఆయన కుడివైపున, ఇంకొకతన్ని ఆయన ఎడమవైపున వేలాడదీశారు. 28 *—— 29 ఆ దారిలో వెళ్తున్నవాళ్లు తలలాడిస్తూ, ఆయన్ని దూషిస్తూ ఇలా అన్నారు: “అబ్బో, నువ్వు దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో కడతావా? 30 నిన్ను నువ్వు రక్షించుకో, హింసాకొయ్య* మీద నుండి దిగిరా!” 31 శాస్త్రులతో కలిసి ముఖ్య యాజకులు కూడా ఆయన్ని ఎగతాళి చేస్తూ ఇలా మాట్లాడుకున్నారు: “ఇతను వేరేవాళ్లను రక్షించాడు; కానీ తనను తాను రక్షించుకోలేడు! 32 ఈ క్రీస్తును, ఈ ఇశ్రాయేలు రాజును హింసాకొయ్య* మీద నుండి దిగి రమ్మనండి చూద్దాం, అప్పుడు నమ్మవచ్చు.” ఆయన పక్కన కొయ్యల మీద వేలాడుతున్న దొంగలు కూడా ఆయన్ని నిందిస్తూ ఉన్నారు.
33 మధ్యాహ్నం దాదాపు 12 గంటల* నుండి దాదాపు మూడింటి* వరకు ఆ దేశమంతటా చీకటి కమ్ముకుంది. 34 దాదాపు మూడింటికి యేసు బిగ్గరగా ఇలా అన్నాడు: “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ?” ఆ మాటలకు, “నా దేవా, నా దేవా, నన్నెందుకు వదిలేశావు?” అని అర్థం. 35 అక్కడ దగ్గర్లో నిలబడి ఉన్నవాళ్లలో కొందరు అది విని, “చూడండి! అతను ఏలీయాను పిలుస్తున్నాడు” అని అన్నారు. 36 అంతలో ఒకతను పరుగెత్తుకు వెళ్లి ఓ స్పాంజీని పుల్లటి ద్రాక్షారసంలో ముంచి, ఓ కర్రకు తగిలించి, తాగడానికి ఆయనకు ఇస్తూ ఇలా అన్నాడు: “ఉండండి! అతన్ని కిందికి దించడానికి ఏలీయా వస్తాడేమో చూద్దాం.” 37 కానీ, యేసు గట్టిగా అరిచి చనిపోయాడు.* 38 అప్పుడు దేవాలయంలోని తెర* పైనుండి కింది వరకు రెండుగా చిరిగిపోయింది. 39 యేసుకు ఎదురుగా నిలబడివున్న సైనికాధికారి ఆయన చనిపోయే సమయంలో జరిగిన సంఘటనలు చూసి, “ఖచ్చితంగా ఈయన దేవుని కుమారుడే” అని అన్నాడు.
40 కొంతమంది స్త్రీలు కాస్త దూరంలో నిలబడి చూస్తున్నారు. వాళ్లలో మగ్దలేనే మరియ; చిన్న యాకోబు, యోసేవాళ్ల అమ్మ మరియ; సలోమే ఉన్నారు. 41 వీళ్లు యేసు గలిలయలో ఉన్నప్పుడు ఆయన వెంటే ఉంటూ ఆయనకు సేవలు చేసేవాళ్లు. ఇక్కడ వీళ్లతోపాటు, యేసుతో కలిసి యెరూషలేముకు వచ్చిన చాలామంది వేరే స్త్రీలు కూడా ఉన్నారు.
42 అప్పటికే సాయంకాలం కావస్తోంది, పైగా అది సిద్ధపడే రోజు, అంటే విశ్రాంతి రోజుకు ముందురోజు. 43 కాబట్టి అరిమతయియ యోసేపు పిలాతు దగ్గరికి వెళ్లాడు. ఈ యోసేపు మహాసభలో మంచి పేరున్న సభ్యుడు, ఇతను కూడా దేవుని రాజ్యం కోసం ఎదురుచూస్తూ ఉండేవాడు. ఇతను ధైర్యం తెచ్చుకొని పిలాతు దగ్గరికి వెళ్లి యేసును సమాధి చేయడానికి అనుమతి ఇవ్వమని అడిగాడు. 44 కానీ, యేసు చనిపోయాడో లేదో పిలాతు తెలుసుకోవాలనుకున్నాడు, కాబట్టి సైనికాధికారిని ఆ విషయం అడిగాడు. 45 యేసు చనిపోయాడని పిలాతు నిర్ధారించుకున్నాక, ఆయన శరీరాన్ని తీసుకెళ్లడానికి యోసేపుకు అనుమతి ఇచ్చాడు. 46 యోసేపు ఓ నాణ్యమైన నారవస్త్రం కొనుక్కొచ్చాడు; తర్వాత యేసును కిందికి దించి, ఆ గుడ్డను ఆయనకు చుట్టి, తొలిచిన ఓ రాతి సమాధిలో* ఆయన్ని పెట్టాడు; ఆ తర్వాత ఓ రాయిని దొర్లించి ఆ సమాధి ద్వారానికి అడ్డంగా పెట్టాడు. 47 కానీ మగ్దలేనే మరియ, యోసేవాళ్ల అమ్మ మరియ ఆ సమాధినే చూస్తూ ఉండిపోయారు.