రోమీయులు
14 తన విశ్వాసం విషయంలో బలంగా లేని వ్యక్తిని స్వీకరించండి, వ్యక్తిగత అభిప్రాయాల్ని* బట్టి అతనికి తీర్పు తీర్చకండి. 2 ఒక వ్యక్తి తనకున్న విశ్వాసాన్ని బట్టి అన్నీ తింటాడు, కానీ విశ్వాసం విషయంలో బలహీనంగా ఉన్న వ్యక్తి కూరగాయలు మాత్రమే తింటాడు. 3 అన్నీ తినే వ్యక్తి అన్నీ తినని వ్యక్తిని చిన్నచూపు చూడకూడదు. అలాగే అన్నీ తినని వ్యక్తి అన్నీ తినే వ్యక్తికి తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే దేవుడు అతన్ని స్వీకరించాడు. 4 వేరేవాళ్ల సేవకునికి తీర్పుతీర్చడానికి మీరు ఎవరు? అతను నిలుస్తాడో పడిపోతాడో నిర్ణయించేది అతని యజమానే. నిజానికి అతను నిలుస్తాడు, ఎందుకంటే యెహోవా* అతన్ని నిలబెట్టగలడు.
5 ఒక రోజు ఇంకో రోజు కన్నా మంచిదని ఓ వ్యక్తి అనుకుంటాడు; మరో వ్యక్తి అన్ని రోజులూ ఒక్కటే అనుకుంటాడు; తమ నిర్ణయం సరైనదేనన్న పూర్తి నమ్మకం ప్రతీ ఒక్కరికి కలగాలి. 6 ఒక రోజును ఆచరించే వ్యక్తి దాన్ని యెహోవా* కోసం ఆచరిస్తాడు. అలాగే, అన్నీ తినే వ్యక్తి యెహోవా* కోసం తింటాడు, ఎందుకంటే అతను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతాడు; అన్నీ తినని వ్యక్తి యెహోవా* కోసం అన్నీ తినడు, అయినా దేవునికి కృతజ్ఞతలు తెలుపుతాడు. 7 మనం మనకోసమే బ్రతకం, మనకోసమే చనిపోం. 8 ఎందుకంటే మనం బ్రతికితే, యెహోవా* కోసం బ్రతుకుతాం; చనిపోతే యెహోవా* కోసం చనిపోతాం. కాబట్టి మనం బ్రతికినా, చనిపోయినా యెహోవాకు* చెందుతాం. 9 అటు చనిపోయిన వాళ్లమీద, ఇటు బ్రతికివున్న వాళ్లమీద ప్రభువుగా ఉండాలని క్రీస్తు చనిపోయి, తిరిగి బ్రతికాడు.
10 అయితే, మీరు ఎందుకు మీ సోదరునికి తీర్పు తీరుస్తున్నారు? ఎందుకు అతన్ని చిన్నచూపు చూస్తున్నారు? మనమందరం దేవుని న్యాయపీఠం ముందు నిలబడతాం. 11 లేఖనాల్లో ఇలా రాసివుంది: “యెహోవా* ఏమంటున్నాడంటే, ‘నా ప్రాణం తోడు’ ‘ప్రతీ మోకాలు నా ముందు వంగుతుంది, నేను దేవుణ్ణని ప్రతీ నాలుక బహిరంగంగా ఒప్పుకుంటుంది.’” 12 అందుకే, మనలో ప్రతీ ఒక్కరం దేవునికి జవాబుదారులం.
13 కాబట్టి, ఇకమీదట మనం ఒకరికొకరం తీర్పు తీర్చుకోకుండా ఉందాం. బదులుగా, ఓ సోదరుని ముందు అడ్డురాయిని గానీ, అడ్డంకిని గానీ పెట్టకూడదని తీర్మానించుకుందాం. 14 సహజంగా ఏదీ అపవిత్రమైనది కాదని ప్రభువైన యేసు శిష్యునిగా నాకు తెలుసు, ఆ విషయాన్ని బలంగా నమ్ముతున్నాను; ఓ వ్యక్తి దేన్నైనా అపవిత్రమైనదిగా ఎంచినప్పుడే, అది అతని దృష్టిలో అపవిత్రమైనది అవుతుంది. 15 మీరు తినే ఆహారం వల్ల మీ సోదరుడు నొచ్చుకుంటే, మీరు అతనిమీద ప్రేమ చూపించనట్టే. క్రీస్తు అతని కోసం చనిపోయాడు కాబట్టి మీరు తినే ఆహారంతో అతన్ని నాశనం చేయకండి. 16 కాబట్టి, మీరు చేసే మంచి గురించి ఎవ్వరూ చెడుగా మాట్లాడకుండా చూసుకోండి. 17 ఎందుకంటే దేవుని రాజ్యం అంటే తినడం, తాగడం కాదుగానీ నీతి, శాంతి, పవిత్రశక్తి ద్వారా కలిగే సంతోషం. 18 ఈ విధంగా క్రీస్తుకు దాసులుగా ఉండేవాళ్లను దేవుడు, మనుషులు ఇష్టపడతారు.
19 కాబట్టి ఇతరులతో శాంతిగా ఉండడానికి, ఒకరినొకరు బలపర్చుకోవడానికి చేయగలిగినదంతా చేద్దాం. 20 కేవలం ఆహారం కోసం దేవుని పనుల్ని పాడుచేయడం ఆపేయండి. నిజమే, అన్నీ పవిత్రమైనవే; కానీ ఇతరుల్ని విశ్వాసంలో తడబడేలా చేసేదాన్ని తినడం తప్పు.* 21 మాంసం తినడమైనా, ద్రాక్షారసం తాగడమైనా లేదా మీ సోదరుణ్ణి విశ్వాసంలో తడబడేలా చేసే ఏ పనైనా చేయకపోవడమే మంచిది. 22 మీకున్న విశ్వాసాన్ని మీకూ దేవునికీ మధ్యే ఉంచుకోండి. తాను ఆమోదించే దాని ఆధారంగా తనకు తాను తీర్పు తీర్చుకోని వ్యక్తి సంతోషంగా ఉంటాడు. 23 కానీ అతనికి అనుమానాలు ఉండి దేన్నైనా తింటే, తనకు తాను అప్పటికే శిక్ష విధించుకున్నట్టు. ఎందుకంటే అతను విశ్వాసం ఆధారంగా తినట్లేదు. నిజానికి, విశ్వాసం ఆధారంగా లేని ప్రతీది పాపమే.