2 కొరింథీయులు
9 పవిత్రులకు చేసే సహాయం* గురించి నేను మీకు రాయాల్సిన అవసరం అంతగా లేదు. 2 ఎందుకంటే, మీరు ఎంత ఇష్టపూర్వకంగా సహాయం చేస్తారో నాకు తెలుసు. దాని గురించే నేను మాసిదోనియ వాళ్ల దగ్గర గొప్పగా మాట్లాడుతున్నాను. అకయలోని సోదరులు ఒక సంవత్సరం నుండి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని మేము వాళ్లకు చెప్తున్నాం, మీ ఉత్సాహం వాళ్లలో చాలామందిని పురికొల్పింది. 3 అయితే, ఈ విషయంలో మేము మీ గురించి గొప్పగా చెప్పిన మాటలు వట్టిమాటలు కాకూడదని, నేను వాళ్లకు చెప్పినట్టే మీరు నిజంగా సిద్ధంగా ఉండాలని నేను సోదరుల్ని మీ దగ్గరికి పంపిస్తున్నాను. 4 ఒకవేళ మాసిదోనియ సోదరులు నాతో కలిసి అక్కడికి వచ్చి మీరు సిద్ధంగా లేకపోవడం చూస్తే మీమీద నమ్మకం పెట్టుకున్నందుకు మేము సిగ్గుపడాల్సి వస్తుంది, మీరు కూడా సిగ్గుపడాల్సి వస్తుందని వేరే చెప్పనవసరం లేదు. 5 కాబట్టి సోదరులు కాస్త ముందుగానే మీ దగ్గరికి వచ్చి, మీరు ఇస్తానని మాటిచ్చిన ఉదారమైన బహుమానాన్ని ముందే సిద్ధం చేసేలా వాళ్లను ప్రోత్సహించడం అవసరమనిపించింది. అప్పుడు మీరు ఇచ్చే బహుమానం ఉదారంగా ఇచ్చినట్టు అవుతుంది కానీ ఎవరి బలవంతం మీదో ఇచ్చినట్టు కాదు.
6 అయితే ఈ విషయంలో తక్కువ విత్తేవాళ్లు, తక్కువ పంటనే కోస్తారు; కానీ ఎక్కువ విత్తేవాళ్లు ఎక్కువ పంటను కోస్తారు. 7 ప్రతీ ఒక్కరు అయిష్టంగానో బలవంతంగానో కాకుండా తమ మనసులో ఎంత ఇవ్వాలని తీర్మానించుకుంటారో అంత ఇవ్వాలి. ఎందుకంటే సంతోషంగా ఇచ్చేవాళ్లంటే దేవునికి ఇష్టం.
8 పైగా, దేవుడు మీమీద తన అపారదయను చూపించగలడు. దానివల్ల, మీకు కావాల్సినవన్నీ ఎప్పుడూ ఉంటాయి, అలాగే ప్రతీ మంచిపనికి అవసరమైనవన్నీ మీ దగ్గర పుష్కలంగా ఉంటాయి. 9 (లేఖనాల్లో రాసివున్నట్టుగానే, “ఆయన ధారాళంగా ఇచ్చాడు, పేదవాళ్లకు ఇచ్చాడు. ఆయన నీతి శాశ్వతంగా ఉంటుంది.” 10 విత్తేవాళ్లకు విత్తనాల్ని, తినడానికి ఆహారాన్ని పుష్కలంగా ఇచ్చే దేవుడే విత్తడానికి మీకు విత్తనాల్ని ఇస్తాడు, అది కూడా పుష్కలంగా ఇస్తాడు; అలాగే మీరు ఎక్కువ నీతి ఫలాలు ఫలించడానికి సహాయం చేస్తాడు.) 11 మీరు అన్నిరకాల పద్ధతుల్లో ఉదారంగా ఇవ్వగలిగేలా దేవుడు ప్రతీ విషయంలో మిమ్మల్ని దీవిస్తున్నాడు, మేము మీరిచ్చే బహుమానాన్ని ఇతరులకు పంచడం వల్ల ప్రజలు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తారు; 12 ఎందుకంటే ఈ సేవ వల్ల పవిత్రుల అవసరాలు చక్కగా తీరడమే కాదు, చాలామంది ప్రజలు దేవునికి ఎన్నో కృతజ్ఞతలు కూడా తెలుపుతారు. 13 మీరు ఎలాంటివాళ్లో ఈ సేవ రుజువుచేస్తుంది కాబట్టి వాళ్లు దేవుణ్ణి మహిమపరుస్తారు. ఎందుకంటే క్రీస్తు గురించిన మంచివార్తకు సంబంధించి మీరు బహిరంగంగా ప్రకటించే సందేశానికి మీరు లోబడి ఉంటున్నారు; అంతేకాదు మీరు వాళ్లకు, అలాగే అందరికీ ఉదారంగా విరాళాలు ఇస్తున్నారు. 14 మీమీద ఉన్న దేవుని సాటిలేని అపారదయను చూసి వాళ్లు మీ కోసం దేవుణ్ణి వేడుకుంటున్నారు, మీమీద తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.
15 వర్ణించలేని దేవుని బహుమానాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు.