హెబ్రీయులు
2 అందుకే, మనం విన్నవాటి మీద ఇంకా ఎక్కువ ధ్యాస పెట్టడం అవసరం. అలా చేస్తే మనం ఎప్పుడూ విశ్వాసం నుండి దూరంగా కొట్టుకుపోము. 2 దేవదూతల ద్వారా చెప్పబడిన సందేశం స్థిరమైనదని రుజువైంది; అలాగే ప్రతీ పాపానికి, అవిధేయతతో చేసిన ప్రతీ పనికి న్యాయం ప్రకారం శిక్షపడింది. 3 అలాంటప్పుడు, ఎంతో గొప్ప రక్షణను అశ్రద్ధ చేస్తే మనం శిక్షను తప్పించుకోగలమా? ఎందుకంటే ఆ రక్షణ గురించి మొట్టమొదట మన ప్రభువు ప్రకటించాడు, ఆయన దగ్గర విన్నవాళ్లు దాని గురించి మనకు చెప్పారు. 4 అంతేకాదు దేవుడు కూడా ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు, మరితర శక్తివంతమైన పనులు చేయడం ద్వారా, తన ఇష్టప్రకారం పవిత్రశక్తి వరాల్ని ఇవ్వడం ద్వారా ఆ రక్షణ గురించి సాక్ష్యమిచ్చాడు.
5 మేము దేని గురించి మాట్లాడుతున్నామో, ఆ రానున్న భూమిని పరిపాలించే అధికారాన్ని దేవుడు దూతలకు ఇవ్వలేదు. 6 కానీ, ఒకచోట ఓ సాక్షి ఇలా రాశాడు: “నువ్వు గుర్తుంచుకోవడానికి మనిషి ఎంతటివాడు? నువ్వు శ్రద్ధ చూపించడానికి మనిషికి పుట్టినవాడు ఎంతటివాడు? 7 నువ్వు అతన్ని దేవదూతల కన్నా కాస్త తక్కువ స్థానంలో పెట్టావు; మహిమను, ఘనతను అతనికి కిరీటంగా ఇచ్చావు, నీ చేతులతో చేసినవాటి మీద అతన్ని అధికారిగా నియమించావు. 8 అన్నిటినీ అతని పాదాల కింద ఉంచావు.” దేవుడు దేన్నీ వదిలిపెట్టకుండా అన్నిటినీ ఆయన అధికారం కిందకు తెచ్చాడు. ప్రస్తుతానికైతే, అన్నీ ఆయన అధికారం కింద ఉన్నట్టు ఇంకా మనం చూడట్లేదు. 9 కానీ, దేవదూతల కన్నా కాస్త తక్కువ స్థానానికి తీసుకురాబడిన యేసు, మరణాన్ని చవిచూసినందుకు ఇప్పుడు మహిమను, ఘనతను కిరీటంగా పొందినట్టు మాత్రం మనం చూస్తున్నాం. దేవుని అపారదయ వల్ల ప్రతీ మనిషి కోసం యేసు మరణాన్ని రుచి చూశాడు.
10 దేవుని మహిమ కోసమే అన్నీ ఉనికిలో ఉన్నాయి, అన్నీ ఆయన ద్వారానే ఉనికిలో ఉన్నాయి. కాబట్టి, అనేకమంది కుమారుల్ని మహిమపర్చాలని రక్షణనిచ్చే ముఖ్య ప్రతినిధి బాధలు పడేందుకు దేవుడు అనుమతించాడు; అలా ఆయన్ని పరిపూర్ణుడిని చేశాడు, అది సరైన పని. దేవుడు ఆ ముఖ్య ప్రతినిధి ద్వారానే వాళ్లను రక్షిస్తాడు. 11 అటు పవిత్రపర్చే వ్యక్తికి, ఇటు పవిత్రపర్చబడేవాళ్లకు తండ్రి ఒక్కడే కాబట్టి వాళ్లను సోదరులని పిలవడానికి ఆయన సిగ్గుపడడు. 12 ఎందుకంటే ఆయన ఇలా అన్నాడు: “నేను నీ పేరును నా సోదరులకు తెలియజేస్తాను; సంఘంలో అందరి మధ్య పాటలతో నిన్ను స్తుతిస్తాను.” 13 ఆయన ఇంకా ఇలా అన్నాడు: “నేను ఆయన మీద నమ్మకం ఉంచుతాను.” అంతేకాదు ఆయన ఇలా కూడా అన్నాడు: “ఇదిగో! నేనూ, యెహోవా* నాకు ఇచ్చిన పిల్లలు.”
14 ఆ “పిల్లలు” రక్తమాంసాలు ఉన్నవాళ్లు కాబట్టి ఆయన కూడా రక్తమాంసాలుగల మనిషి అయ్యాడు. మరణాన్ని కలుగజేసే సామర్థ్యం ఉన్నవాణ్ణి, అంటే అపవాదిని తన మరణం ద్వారా నాశనం చేయడానికి, 15 మరణ భయం వల్ల జీవితాంతం బానిసత్వంలో గడిపిన వాళ్లందర్నీ విడుదల చేయడానికి ఆయన అలా అయ్యాడు. 16 ఎందుకంటే ఆయన వచ్చింది దేవదూతలకు సహాయం చేయడానికి కాదు, అబ్రాహాము వంశస్థులకు* సహాయం చేయడానికి. 17 కాబట్టి ఆయన అన్నిరకాలుగా తన “సోదరుల్లా” అవ్వాల్సి వచ్చింది. ప్రజల పాపాల కోసం ప్రాయశ్చిత్త బలిని* అర్పించేందుకు వీలుగా దేవుని పనిని కరుణతో, విధేయతతో చేసే ప్రధానయాజకుడు కావడానికి ఆయన అలా అవ్వాల్సి వచ్చింది. 18 పరీక్షలు ఎదురైనప్పుడు ఆయన స్వయంగా బాధ అనుభవించాడు కాబట్టి పరీక్షలు ఎదుర్కొంటున్నవాళ్లకు ఆయన సహాయం చేయగలడు.