యాకోబు
4 మీ మధ్య గొడవలకు, కొట్లాటలకు కారణం ఏమిటి? మీ లోపల* పోరాటం చేస్తున్న శరీర కోరికలు కాదా? 2 మీరు ఆశపడతారు కానీ మీకు దొరకదు. మీరు హత్యలు చేస్తున్నారు, పరాయివాళ్లది ఆశిస్తున్నారు. అయినా, మీరు కోరుకున్నవి పొందలేకపోతున్నారు. మీరు కొట్లాటలకు దిగుతున్నారు, గొడవలు పెట్టుకుంటున్నారు. అయినా మీకు దొరకట్లేదు, ఎందుకంటే మీరు దేవుణ్ణి అడగట్లేదు. 3 ఒకవేళ మీరు అడిగినా, మీరు పొందరు. ఎందుకంటే వాటిని మీ శరీర కోరికలు తీర్చుకోవాలనే దురుద్దేశంతో అడుగుతున్నారు.
4 వ్యభిచారులారా,* ఈ లోకంతో స్నేహమంటే దేవునితో శత్రుత్వమేనని మీకు తెలియదా? ఈ లోకానికి స్నేహితుడిగా ఉండాలనుకునేవాడు తనను తాను దేవునికి శత్రువుగా చేసుకుంటున్నాడు. 5 “మన లోపల గూడు కట్టుకున్న అసూయ ఏవేవో కావాలని ఆరాటపడుతూ ఉంటుంది” అని లేఖనం ఊరికే చెప్తోందనుకుంటున్నారా? 6 అయితే, దేవుడు ప్రసాదించే అపారదయ ఇంకా గొప్పది. అందుకే, “దేవుడు గర్విష్ఠులను వ్యతిరేకిస్తాడు కానీ వినయస్థులకు అపారదయను ప్రసాదిస్తాడు” అని లేఖనం చెప్తోంది.
7 కాబట్టి, మీరు దేవునికి లోబడి ఉండండి; అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గర నుండి పారిపోతాడు. 8 దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు. పాపులారా, మీ చేతులు కడుక్కోండి; నిలకడలేని మనుషులారా, మీ హృదయాల్ని శుద్ధి చేసుకోండి. 9 విచారపడండి, దుఃఖించండి, ఏడ్వండి. నవ్వడం ఆపి దుఃఖించండి, సంతోషించడం ఆపి చింతించండి. 10 యెహోవా* దృష్టిలో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని ఘనపరుస్తాడు.
11 సోదరులారా, మీరు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు మాట్లాడడం మానేయండి. తన సోదరునికి వ్యతిరేకంగా మాట్లాడినవాడు లేదా తీర్పు తీర్చినవాడు శాసనానికి* విరుద్ధంగా మాట్లాడినవాడౌతాడు, దానికి తీర్పు తీర్చినవాడౌతాడు. శాసనానికి తీర్పు తీరిస్తే మీరు దాన్ని పాటించేవాళ్లు అవ్వరు గానీ న్యాయమూర్తులౌతారు. 12 శాసనకర్త, న్యాయమూర్తి అనేవాడు ఒక్కడే ఉన్నాడు. ఆయన రక్షించగలడు, నాశనం కూడా చేయగలడు. అలాంటప్పుడు, సాటి మనిషికి తీర్పుతీర్చడానికి మీరెవరు?
13 “ఇవాళో రేపో ఆ నగరానికి వెళ్లి ఓ సంవత్సరం అక్కడ ఉందాం. అక్కడ వ్యాపారం చేసి డబ్బు సంపాదిద్దాం” అని చెప్పుకునే మనుషులారా, నా మాట వినండి. 14 రేపు మీకు ఏమౌతుందో మీకు తెలియదు. మీరు, కాసేపు కనబడి మాయమైపోయే పొగమంచు లాంటివాళ్లు. 15 కాబట్టి మీరు, “యెహోవా* అనుమతిస్తే ప్రాణాలతో ఉండి ఇది చేస్తాం, అది చేస్తాం” అనుకోవాలి. 16 కానీ మీరు అహంకారంతో గొప్పలు చెప్పుకుంటూ విర్రవీగుతున్నారు. అలా గొప్పలు చెప్పుకోవడం దుష్టత్వం అవుతుంది. 17 కాబట్టి, ఓ వ్యక్తి మంచి చేయడం తెలిసి కూడా చేయకపోతే, అతను పాపం చేస్తున్నట్టే లెక్క.