యూదా
1 మన తండ్రైన దేవుడు ఆహ్వానించి, ప్రేమించి, యేసుక్రీస్తు కోసం కాపాడుతున్న వాళ్లకు యేసుక్రీస్తు దాసుడూ యాకోబు తమ్ముడూ అయిన యూదా రాస్తున్న ఉత్తరం.
2 దేవుడు మీ పట్ల ఇంకా ఎక్కువ కరుణను, శాంతిని, ప్రేమను చూపించాలని కోరుకుంటున్నాను.
3 ప్రియ సోదరులారా, మనమందరం ఎదురుచూస్తున్న రక్షణ గురించి మీకు ఉత్తరం రాయాలని నేను ఎంతో ప్రయత్నించాను. కానీ దేవుడు పవిత్రులకు శాశ్వతంగా అనుగ్రహించిన విశ్వాసం కోసం గట్టిగా పోరాడమని మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఉత్తరం రాయడం అవసరమని నాకు అనిపించింది. 4 ఎందుకంటే, కొందరు రహస్యంగా మనలో చేరారు. ఎంతోకాలం క్రితమే లేఖనాలు వీళ్లకు తీర్పు విధించాయి; దైవభక్తి లేని ఈ మనుషులు దేవుని అపారదయను అలుసుగా తీసుకుని లెక్కలేనట్టు* ప్రవర్తిస్తున్నారు. వీళ్లు తమ ప్రవర్తనతో మన ఒక్కగానొక్క యజమాని, ప్రభువు అయిన యేసుక్రీస్తును తిరస్కరిస్తున్నారు.
5 ఈ విషయాలు మీకు బాగా తెలిసినా మళ్లీ గుర్తుచేయాలని అనుకుంటున్నాను. ఐగుప్తు దేశం నుండి తన ప్రజలను కాపాడి తీసుకొచ్చిన యెహోవా,* ఆ తర్వాత విశ్వాసం చూపించని వాళ్లను నాశనం చేశాడు. 6 అలాగే, తమ అసలు స్థానాన్ని కాపాడుకోకుండా, తాము ఉండాల్సిన చోటును వదిలేసిన దేవదూతలను మహారోజున జరిగే తీర్పు కోసం ఆయన కారుచీకట్లో సంకెళ్లతో శాశ్వతంగా బంధించివుంచాడు. 7 అదేవిధంగా సొదొమ, గొమొర్రా, వాటి చుట్టుపక్కల నగరాలు కూడా విపరీతంగా లైంగిక పాపాలకు* పాల్పడ్డాయి, అసహజమైన శరీర కోరికలు తీర్చుకోవడంలో మునిగిపోయాయి; అవి అగ్నితో శాశ్వత శిక్షకు గురై మనకు ఓ హెచ్చరికగా ఉన్నాయి.
8 ఇన్ని హెచ్చరికలు ఉన్నా, రహస్యంగా మనలో చేరిన మనుషులు కూడా ఊహాలోకాల్లో విహరిస్తున్నారు, శరీరాన్ని అపవిత్రం చేసుకుంటున్నారు, అధికారాన్ని ధిక్కరిస్తున్నారు, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవాళ్ల గురించి అమర్యాదగా మాట్లాడుతున్నారు. 9 కానీ ప్రధానదూత మిఖాయేలు, మోషే శరీరం గురించి అపవాదితో వాదిస్తున్నప్పుడు అతనికి తీర్పు తీర్చడానికి, అమర్యాదకరమైన మాటలు అనడానికి సాహసించలేదు గానీ “యెహోవాయే* నిన్ను గద్దించాలి” అన్నాడు. 10 అయితే ఈ మనుషులు తమకు అస్సలు అర్థంకాని విషయాలన్నిటి గురించి అమర్యాదగా మాట్లాడుతున్నారు. విచక్షణలేని జంతువులకు ఉన్నట్టే వీళ్లకూ సహజ జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానంతో గ్రహించగలిగే విషయాలన్నిటిలో వీళ్లు తమను తాము పాడుచేసుకుంటున్నారు.
11 వీళ్లకు నాశనం తప్పదు. ఎందుకంటే వీళ్లు కయీను బాటపట్టారు, ప్రతిఫలం కోసం బిలాము వెళ్లిన తప్పుడు దారిని ఎంచుకున్నారు, కోరహులా ఎదిరించి మాట్లాడుతూ నాశనం కొనితెచ్చుకున్నారు! 12 మీరు సోదరులతో కలిసి సంతోషంగా చేసుకునే విందుల్లో వీళ్లు పైకి కనిపించకుండా నీటిలో ఉండే ప్రమాదకరమైన రాళ్లు;* తమ కడుపు నిండితే చాలనుకునే సిగ్గులేని కాపరులు; గాలికి అటూఇటూ కొట్టుకుపోయే నీళ్లులేని మేఘాలు; కాపు కాయాల్సిన కాలంలో* కాయకుండా పూర్తిగా* చచ్చిపోయి వేళ్లతోసహా పెకిలించబడిన చెట్లు; 13 అవమానమనే నురుగును ఎగజిమ్మే ప్రచండమైన అలలు; శాశ్వతంగా కటిక చీకట్లో కలిసిపోయే దారితప్పిన నక్షత్రాలు.
14 ఆదాము నుండి ఏడో తరంవాడైన హనోకు, వాళ్ల గురించి ఇలా ప్రవచించాడు: “ఇదిగో! యెహోవా* తన లక్షలాది పవిత్ర దూతలతో వచ్చాడు. 15 అందరికీ తీర్పు తీర్చడానికి వచ్చాడు. దుష్టులు భయభక్తులు లేకుండా పాపాలు చేసినందుకు, దేవుని గురించి నీచంగా మాట్లాడినందుకు వాళ్లను శిక్షించడానికి ఆయన వచ్చాడు.”
16 వీళ్లు తమ చెడు కోరికల ప్రకారం ప్రవర్తిస్తూ సణుగుతారు, తమ పరిస్థితి పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తారు, తమ గురించి గొప్పలు చెప్పుకుంటారు, తమ స్వార్థం కోసం ఇతరులను పొగుడుతారు.*
17 ప్రియ సోదరులారా, మీరైతే మన ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులు గతంలో చెప్పిన* విషయాలను గుర్తుచేసుకోండి. 18 వాళ్లు మీతో ఇలా చెప్పేవాళ్లు: “చివరి రోజుల్లో తమ చెడు కోరికల ప్రకారం ప్రవర్తిస్తూ ఎగతాళి చేసే మనుషులు ఉంటారు.” 19 సంఘాన్ని ముక్కలు చేసేది ఈ మనుషులే, వీళ్లు జంతువుల లాంటివాళ్లు,* వీళ్లలో దేవుని పవిత్రశక్తి లేదు. 20 కానీ ప్రియ సోదరులారా, మీరైతే అత్యంత పవిత్రమైన మీ విశ్వాసాన్ని బలపర్చుకోండి. దేవుని పవిత్రశక్తి నిర్దేశంతో ప్రార్థించండి. 21 అలాచేస్తే, శాశ్వత జీవితానికి నడిపించే మన ప్రభువైన యేసుక్రీస్తు కరుణ కోసం ఎదురుచూస్తున్న మీరు, ఎప్పుడూ దేవుడు ప్రేమించే ప్రజలుగా ఉంటారు. 22 అంతేకాదు సందేహాలు ఉన్నవాళ్ల మీద కరుణ చూపిస్తూ ఉండండి; 23 మంటల్లో నుండి లాగినట్టు వాళ్లను కాపాడండి. చెడు పనులతో తమ బట్టల్ని మురికి చేసుకున్నవాళ్ల మీద కరుణ చూపించండి. కానీ జాగ్రత్త, వాళ్ల మురికి మీకు అంటుకోకుండా చూసుకోండి.
24 మీరు పడిపోకుండా మిమ్మల్ని కాపాడుతూ, మీలో గొప్ప సంతోషాన్ని నింపి కళంకం లేనివారిగా మిమ్మల్ని తన దివ్యతేజస్సు ముందు* నిలబెడుతున్న 25 మన రక్షణకర్తయిన ఏకైక దేవునికి గడిచిన కాలాల్లో, ఈ కాలంలో, రాబోయే కాలాల్లో ఎల్లప్పుడూ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమ, వైభవం, బలం, అధికారం చెందాలి. ఆమేన్.