యౌవనస్థులు ఇట్లడుగుదురు
జూదం నిజంగా అంత చెడ్డదా?
పండ్రెండు సంవత్సరాల ఆండ్రూ పది సంవత్సరాల జూలియన్ చివరకు తమ తలిదండ్రులకు కనుమరుగయ్యారు. వారి కుటుంబమంతా బోటు విహారానికి వచ్చారు, దానిలో ఉన్న వివిధ జూదపు యంత్రాలనుచూచి ఈ బాలురు ఆకర్షితులయ్యారు. వారి జిజ్ఞాసను గుర్తించి, ఆ యంత్రాలలో వేసి తమంతట తామే ప్రయత్నించులాగున ఒక ఆటగాడు వారికి చెరో నాణెం యిచ్చాడు. సమస్యేమిటి? ఆ యంత్రాల దరికే వెళ్ళొద్దని తలిదండ్రులు వారిని హెచ్చరించారు.
అయినను, తలిదండ్రులు పట్టుకుంటే పట్టుకున్నారులే అని ఆండ్రూ, జూలియన్ నిర్ణయించుకున్నారు. తమ తలిదండ్రుల హెచ్చరికలు తమ చెవులలో మ్రోగుచున్నను వారు ఆడి తమ డబ్బును రెట్టింపు చేసుకున్నారు! వారు మరలా ఆడారు. ఈ సారి తాము గెలుచుకున్న సొమ్ము చూసి వారు దిగ్భ్రాంతి చెందారు! ‘ఇది అంత ప్రమాదకరమెలా అవుతుంది?’ అని వారు తలంచారు. ‘డబ్బు సంపాదించడం ఎంతో సులభం! మరి జూదం నిజంగా అంత చెడ్డదా?’
జూదం సర్వ సాధారణమైన దేశాల్లోని అనేక యౌవనులవలే ఆండ్రూ, జూలియన్ కూడా దానిలో ఏ హాని లేదని తలంచారు. ఈ విషయంలో కొందరు పెద్దవారి మాదిరిని నీవు పరిశీలించినప్పుడు దీనిని గ్రహించుట సులభము. అనేకులు జూదమాడుటయే గాక, తమ అలవాటును సమర్థించుకొనుటకు సమంజసమనిపించే కారణాలను వల్లిస్తారు. ఉదాహరణకు, జూదం ఎంతో మేలు చేస్తుందని, లాటరీలు అందజేయు ఆర్థిక సహాయము ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవని వారు చెప్పవచ్చును. (ఇది మాదక ద్రవ్యాల వ్యాపారి మంచి కార్యక్రమాలకు చందాలు ఇస్తాడు గనుక మాదక ద్రవ్యాల వ్యాపారము మంచిదే అని తర్కించడం వలెనున్నది.) అయినను జూదమనేది హానిలేని వేడుక, వినోదమని, జీవితానికి అవసరమైన కొంత ఉల్లాసమును చేకూర్చునని కొందరనవచ్చును.
ఏదిఏమైతేనేమి, యితర ప్రాంతములలోవలే బ్రిటన్, ఐర్లాండ్‌లలో కూడా వేలాదిమంది యౌవనులు జూదగాళ్ళయినారు. కొద్దిపాటి ప్రయత్నంతో ఎంతో డబ్బును సంపాదించవచ్చుననే భావన నీకు మంచిదిగా తోచవచ్చును.
జూదం—దాగియున్న అపాయములు
అయినప్పటికిని, జూదం యౌవనులకు కొన్ని వాస్తవమైన ప్రమాదములను కల్గియున్నది. “జూదపు బానిసలను” గూర్చి మరియు “హానికరము కాని ఆట బలాత్కారముగా మారి ఒక వ్యక్తిని మంత్రముగ్ధున్ని చేసినపుడు జూదము తెచ్చే భయాందోళనలను” గూర్చి నివేదికలు తెల్పుచున్నవి. ది బజ్ (ఒక బ్రిటీషు టెలివిజన్ డాక్యుమెంటరీ) తెల్పుదానినిబట్టి, పిల్లల మధ్య జూదం “స్కూలునందు తరగతులను ఎగవేయడం, దౌర్జన్యం, బలవంతంగా దోచుకొనడం, దొంగిలించడం, నిర్భందపు జూదం, వేశ్యావృత్తిని చేపట్టడం, మితిమీరిన చోట ఆత్మహత్య చేసుకొనడం లేదా ఆత్మహత్యకు పాల్పడడానికి నడుపవచ్చును.” అంతటి విపత్కర అవకాశాలు జూదమునకున్నవని నిజజీవిత అనుభవాలు నిరూపిస్తున్నాయి.
“నేను 11 సంవత్సరముల ప్రాయంలో ఉండగా జూదమాడుట ప్రారంభించాను,” అని ఏడ్రిన్ చెప్తున్నాడు. “నేను నా పెదనాన్న, ఆయన కుమారునితోపాటు వేట కుక్కల పందెములకు వెళ్లాను. మొట్టమొదట అదృష్టవశాత్తు నేను తరచు నెగ్గేవాడిని.” ఏడ్రిన్‌పై ఎట్టి ప్రభావం కలిగింది? “డబ్బును సంపాదించడానికి మా నాన్నతో నేను కథలు అల్లడానికి—అబద్ధమాడడానికి—వెనుకాడేవాడిని కాదు, నాకు ఇరవై సంవత్సరములు రాకముందే జూదమాడే అలవాటుకు తగిన డబ్బు కోసం నా తండ్రి దుకాణములోనున్న డబ్బుపెట్టెనుండి దొంగిలించడానికి నాకు మొగమాటముండేది కాదు,” అని వివరించాడు.
మరొక విచారకరమైన ప్రభావాన్ని గూర్చి ఏడ్రిన్ తెలియజేస్తున్నాడు. “నీవు సులభంగా సోమరి వాడవైపోతావు, ఎందుకంటే జూదంలో నీవు గెలుపొందగలవని తలంచే దానితో నీవు నమ్మకంగా కష్టించి సంపాదించేదానిని పోల్చితే అది చాలా తక్కువగా కన్పించవచ్చును.”—పోల్చుము సామెతలు 13:4; ప్రసంగి 2:24.
రాబర్ట్ (అతని అసలు పేరుకాదు) 12 సంవత్సరముల ప్రాయంలో జూదమాడుట మొదలు పెట్టాడు. మరొక అపాయాన్ని గూర్చి అతడు సూచిస్తున్నాడు: “నీవు చాలా మూఢనమ్మకస్థుడవుతావు.” అతడిలా వివరిస్తున్నాడు: “మాతండ్రి మా దుకాణంలో జూదపు యంత్రాలను పెట్టుకున్నాడు. అవి ఎలా పనిచేస్తాయో నాకు బాగా తెలుసు. అయినను ఫలితాన్ని ప్రభావితం చేయడానికి స్విచ్ఛ్‌ను ఒక ప్రత్యేక విధంగా నొక్కడం లేదా గెల్చుకున్న డబ్బును కాసేపు ఆ యంత్రంలోనే ఉంచడం వంటి మూఢనమ్మకపు పనులు చేసేవాడిని. కొంతమందైతే ఆ యంత్రాలతోనే మాట్లాడేవారు.” నిజమే, అనేకమంది జూదగాళ్ళు అవివేకముతో అదృష్ట దేవతకు మూఢనమ్మకపు ఆరాధికులగుచున్నారు.—అది దేవునిచే ఖండించబడింది.—యెషయా 65:11.
నిర్భందపు జూదం
జూదమాడుటకున్న అంతర్గత అపాయమేమంటే అదే ధ్యాసలో పడిపోవడము. “ప్రతి సంవత్సరము 16 సం.ల క్రిందున్న 2,000 మంది పిల్లలు, జూదగాళ్ళ పునరుద్ధరణ సంఘానికు తమ తలిదండ్రులచే కొనిపోబడుతున్నారు, మరియు అలా చేయువారి పెరుగుదల గతిని బట్టి . . . బ్రిటన్‌లో ఆ సమస్య యొక్క అసలు పరిమాణము మరుగైయునదని భావిస్తున్నారు.” (ది బజ్) వాళ్ళు దానికి ఎంతగా బానిసలౌతారు? ఒక నివేదిక యిలా అన్నది: “ఒక్కసారి దానికి బానిసయైతే, వారు గెలిచినా లేక ఓడినా వారు జూదమాడవలసిందే.”
ఒక స్త్రీ ప్రతిరోజు 90 పౌండ్లు (140 అమెరికా డాలర్లు) జూదమాడి పోగొట్టుకొనుటను చూచానని రాబర్ట్ జ్ఞాపకం చేసుకొంటున్నాడు. తాను దాసుడైన దానికి నాణెములతో జూదమాడుటకు డబ్బు సంపాదించడానికి ఒక యౌవనుడు ఎంత తెగించాడంటే తన తల్లిని కూడా హత్యచేయడానికి అతడు ప్రయత్నించాడు. యౌవన వయస్సులోనే జూదమాడుట ప్రారంభించిన పాడీకు కూడా జూదమాడే అలవాటును ఆపుచేసుకొనడానికి అలాంటి అసమర్థతే ఉన్నది. అతడిలా జ్ఞాపకము చేసుకొంటున్నాడు. “జూదమాడే కుటుంబములో నేను పెరిగాను. నేను దేనినైనా సరే జూదములో పెట్టేవాడిని. నేను పెరిగి పెద్దవాడనై పెండ్లిచేసుకున్న తరువాత, నా భార్యా పిల్లల తిండికి పెట్టాల్సిన డబ్బును జూదములో పెట్టేవాడిని, చివరకు నేను ఆత్మహత్య చేసుకునే స్థాయికి అది నన్ను తెచ్చింది.”
నాణెములతో జూదమాడు యంత్రాల ఎర
ఎటువంటి జూదమైనా విపత్కర ఫలితాలను తెస్తుంది, కాని నేడు యౌవనులకు అతి ప్రమాదకరమైన దేమంటే నాణెములతో జూదమాడు యంత్రమే. ఇది “యౌవన జూదగాళ్ల విషయములో యిటీవల అత్యంత పెద్ద సమస్యగా పరిగణించబడింది” అని జర్నల్ ఆఫ్ గేంబ్లింగ్ బిహేవియర్, స్ప్రింగ్ 1989 చెప్పుచున్నది. ఈ యంత్రాలు ఒకే చేయి ఉన్న బందిపోటు దొంగలుగా వర్ణించబడ్డాయి, అవి “కపటమైన మరియు మరులుగొల్పు యంత్రాలు” అని ది బజ్ చెప్పింది. “నీవు ఎంత ఎక్కువగా ఆడతావో అంత ఎక్కువగా ఆడాలని అన్పిస్తుంది.”
ఒక ఆటను ఆడేటప్పుడు, అది ఎంత మరులుగొల్పునదైనను, నీవు గెలుచుకునే దానికన్నా ఎల్లవేళల నీవు ఎక్కువ పొగొట్టుకుంటావనేది నిశ్చయమైనప్పుడు దానిని ఆడుటలో అసలు ఏమైనా అర్థముందా? యంగ్ పీపుల్ నౌ మీ విజయావకాశాలను యిలా వర్ణిస్తున్నది: “చాతుర్యములేని వ్యక్తికి గెలుచుకొనే అవకాశమియ్యవద్దు. నాణాలతో జూదమాడే యంత్రం అట్టి అవకాశ మివ్వదు . . . ఒకవేళ నీవు సగటున 10 పౌండ్లు ఆ యంత్రంలో వేస్తే 7 పౌండ్లను అది ఉంచుకొని 3 పౌండ్లను నీకు తిరిగియిస్తుంది.”
యౌవనస్థులపై జూదం యొక్క ప్రభావాలనుగూర్చి పరిశోధించిన మార్క్ గ్రిఫిత్స్ యిలా పేర్కొన్నాడంటే ఆశ్చర్యంలేదు: “నాణాలతో జూదమాడే యంత్రంతో డబ్బు సంపాదించే ఏకైక మార్గం ఒక యంత్రాన్ని స్వయంగా కల్గియుండడమే.” అట్టి నిష్ఫలమైన కార్యములలో పాల్గొనుట నీకు సహేతుకమనిపిస్తుందా?
అయినప్పటికిని నీవు మరింత ఎక్కువగా ఆడేటట్లు నిన్ను మోసగించే విధంగా, తెలివిగా ఈ యంత్రాలు తయారుచేయబడ్డాయి. ఎలా? కేవలం ఒక్క గెలిచే వరుసనే కాకుండా విజయ సూచనలున్న మూడు వరుసలను చూపిస్తుంది. యంగ్ పీపుల్ నౌ యిలా వివరిస్తుంది: “విజయం సాధించినదానికి పైన, క్రిందనున్న వరుసలు ఆటగాళ్లకు, ‘తృటిలో తప్పిపోయాం’ అనే భ్రమను కల్గించి మరోసారి ప్రయత్నించుమని ప్రోత్సహిస్తాయి.” తృటిలో తప్పిపోయింది అనేది, రెండు విజయ సూచనలు, మూడవది ఓడిపోయేది, ఇవన్నీ, “విజయానికి, సమీప” సూచనలని తరచు జూదగానిచే పరిగణించబడును, గనుక అతడు పదేపదే ప్రయత్నించులాగున ప్రోత్సహించబడతాడు.
అయితే జూదం వ్యాపారములో యిది సర్వ సామాన్యం. పోగొట్టుకున్నామని తలంచే బదులు తృటిలో తప్పిపోయామనే భ్రమను కల్గించే విధంగా ఈ యంత్రాలను, జూదం ఆటల ఉత్పాదకులు తయారుచేస్తారు. నీవు దాదాపు నెగ్గావు! “విజయానికి” బహు దగ్గరగా వచ్చినందున కలిగే ఉత్సాహం ఆడుతూ ఉండేటట్లు చేస్తుంది. దానికి తోడు ప్రకాశమానమైన లైట్లు, సమ్మోహితున్నిచేసే ధ్వని, నీవు ఆడుటకు—ఆడుతూ ఉండేందుకు—పోగొట్టుకొంటూ ఉండేందుకు నీవు వంచించబడే విధంగా ఉండే శక్తివంతమైన మానసిక ప్రభావమును గూర్చి నీవు అర్థం చేసుకోవచ్చును.
సరియైన నిర్ణయము చేసికొనుట
నిర్భందపు జూదగాడివి కాకుండా ఉండటానికి, అసలు మొదట్లో జూదమాడ కుండా ఉండటమే శ్రేష్ఠమైన మార్గం. దానికున్న వివిధ ఆకృతులన్ని విడనాడండి, డబ్బుతో చిన్న చిన్న పందాలు కాయడం కూడా మానండి. జీవితాంతం జూద మాడే అలవాటును కల్గియున్న అనేకులు మొదట్లో పైసలతోనే జూదమాడుట ప్రారంభించారు. జూదమాడే అవకాశము దానంతటదే తారసపడితే, మత్తయి 7:17 నందు యేసుక్రీస్తు పేర్కొనిన సూత్రాన్ని పరిగణలోనికి తీసుకొనండి: “ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును.”
దీనినిగూర్చి యోచించండి: ప్రజల జీవితాల్లో జూదం నిజంగా ఏమి తెచ్చిపెట్టింది? దేవుని ఆత్మ ఫలములైన ప్రేమ, సమాధానము, ఆశానిగ్రహమువంటి వాటిని వృద్ధిచేసికొనుటకు అది దోహదపడిందా లేక కలహం, కోపం, దురాశను అది ఉత్పన్నము చేసిందా? (గలతీయులు 5:19-23) దురాశను దేవుడు ఖండించెనని జ్ఞాపకముంచుకొనండి. కేవలం ఒక్క దురాశతో కూడిన చర్యే ఆయన దృష్టికి మిమ్మును నిందా భరితున్ని చేయగలదు. క్రైస్తవ యౌవనులకు జూదగాళ్లు తగిన సహవాసమేనా అని మిమ్మును మీరు ప్రశ్నించుకొనండి. (1 కొరింథీయులు 15:33) “లోక మంతయు దుష్టునియందున్నదని” గుర్తుంచుకొనండి. (1 యోహాను 5:19) జూదం అపవాదియైన సాతాను యొక్క సంకల్పాన్ని తేటగా నెరవేర్చుటలేదా? కావున దానిలో పాల్గొనులాగున ఎందుకు మరులుగొల్పబడాలి?
ఐర్లాండులో జాతీయ లాటరీ మొదటిసారిగా ప్రవేశ పెట్టబడినప్పుడు. బుద్ధిహీనులమీద పన్ను అని పేరు పెట్టారు. అది జూదమును చక్కగా వివరిస్తుంది. తెలివి తక్కువవాడని ఎంచబడి జూదగాని స్వప్న లోకమునకు వంచించబడి అవసరమైన వనరులు దోచుకొనబడుటకు ఎవరు కోరుకుంటారు? అదృష్టవశాత్తు, ఆండ్రూ, జూలియన్‌లు, (మొదట్లో పేర్కొన్నవారు) జూదం ఒక బుద్ధిహీనుని ఆట అని వెంటనే గ్రహించారు. దాని అపాయములను వారు తేటగా గ్రహించి దానిని విడనాడారు. వారిలా అన్నారు, “ఏది ఏమైనను, జూదంలో మీ డబ్బును వృధాచేసుకొనేకంటే చేయదగిన విలువైన పనులు ఎన్నో ఉన్నవి.” (g91 11/8)
[37వ పేజీలోని చిత్రం]
ఒకడు చిన్న మొత్తంతో జూదమాడినను, దానిలో చిక్కుకు పోతాడు