కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 11/8 పేజీలు 20-23
  • మీ బిడ్డను ప్రమాదాల నుండి కాపాడుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ బిడ్డను ప్రమాదాల నుండి కాపాడుకోండి
  • తేజరిల్లు!—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఇంటిలోపల
  • బయట
  • రోడ్డుమీద
  • పిల్లలకు బాల్యంనుండే శిక్షణనిచ్చుట
    నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము
  • తల్లిగా లేక తండ్రిగా మీ పాత్ర
    తేజరిల్లు!—2005
  • పసితనంనుండే మీ పిల్లవానికి తర్ఫీదునివ్వండి
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • ప్రేమతో శిక్షించడంవలన కలిగే ప్రయోజనం
    నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము
మరిన్ని
తేజరిల్లు!—1999
g99 11/8 పేజీలు 20-23

మీ బిడ్డను ప్రమాదాల నుండి కాపాడుకోండి

స్వీడన్‌లోని తేజరిల్లు! విలేఖరి

హానాకు దాదాపు మూడేళ్ళు. తండ్రి కార్లేరిక్‌, తల్లి బర్‌గిటా. వాళ్ళు, చనిపోయిన తమ పొరుగాయన ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు ఆ పాప వాళ్ళతోనే ఉంది. కొంచెం సేపైన తర్వాత హానా ఒక గదిలో నుండి బయటికి వచ్చింది, ఆమె చేతిలో మాత్రలున్న ఒక సీసా ఉంది. ఆమె ఆ సీసాలోని కొన్ని మాత్రలను తిన్నది. ఆ బాటిల్‌ పరీక్షించి చూసిన బర్‌గిటాకు మతిపోయినట్లయ్యింది. పొరుగింటాయన హృద్రోగం కోసం తీసుకునే మందుల సీసా అది.

హానాను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఆమెను ఆ రాత్రంతా ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉంచారు. తన ఆరోగ్యాన్ని పాడుచేయగలిగేంత మోతాదులో ఆ మాత్రలను హానా తిన్నప్పటికీ, ఏమీ కాలేదు. ఎందుకని? ఆమె ఆ మాత్రలను తినడానికి కొంచెం ముందు, కొంచెం జావ తాగింది. ఆ మందులోని కొంత విషాంశాన్ని ఆ జావ పీల్చుకుంది, ఆమె వాంతి చేసుకోవడంతో అది బయటికి వచ్చేసింది.

హానా అనుభవం అరుదైనదేమీ కాదు. ప్రతిరోజూ, ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది పిల్లలు ప్రమాదానికి గురవ్వడమూ, వాళ్లను డాక్టర్‌ దగ్గరికి లేదా ఆసుపత్రికి తీసుకువెళ్ళాల్సిరావడమూ జరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం, స్వీడన్‌లో, ప్రతి 8 మంది పిల్లల్లో ఒకరికి ప్రమాదం జరిగి డాక్టర్‌ దగ్గరికి పరుగెత్తుకు వెళ్ళవలసి వస్తుంది. కనుక, మీరు తల్లి/తండ్రి అయితే, మీ బిడ్డకు కూడా అలాంటి ప్రమాదం రాగల అవకాశం చాలా ఎక్కువగానే ఉందని గ్రహించండి.

సుపరిచిత స్థలాల్లో, అంటే, ఇంట్లో, ఇంటి పరిసరాల్లో పిల్లలు తరచూ దెబ్బలు తగిలించుకోవడం వింతేమీ కాదు. పిల్లలు ఎదుగుతున్న కొలది, వాళ్లు తగిలించుకునే దెబ్బలు వేరుగా ఉంటాయి. బిడ్డకు నాప్కిన్‌లను మారుస్తున్నప్పుడు మంచం మీద నుండి బిడ్డ సులభంగా పడిపోవచ్చు లేదా ఏదైనా ఆహారపదార్థం లేదా, ఒక చిన్న వస్తువు గొంతులో అడ్డుపడి బిడ్డకు ఊపిరి ఆడకుండా అయిపోవచ్చు. తరచూ చిన్న పిల్లలు పైకి ఎక్కుతున్నప్పుడు క్రిందపడుతూ ఉంటారు, లేదా తమ చేతికి అందేంత దూరంలో ఉన్న వేడి వస్తువులను ముట్టుకున్నప్పుడు కాల్చుకుంటారు, లేదా విషపూరిత పదార్థాలను నోట్లో పెట్టుకున్నప్పుడు వారికి విషం ఎక్కుతుంది. బడికి వెళ్ళే వయస్సున్న పిల్లలు తరచూ రోడ్డు ప్రమాదాల్లో లేదా, ఇంటి బయట ఆడుకుంటున్నప్పుడు దెబ్బ తగిలించుకుంటుంటారు.

ఈ ప్రమాదాల్లో చాలా మటుకు నివారించగలిగేవే. కొంచెం ముందుచూపూ, మీ పిల్లలు ఎంత మేరకు ఎదిగారు అన్న స్పృహా మీకు ఉంటే పిల్లలు దెబ్బలు తగిలించుకోవడాన్నీ నివారించేందుకూ ప్రాణాంతకమైన ప్రమాదాలు సంభవించకుండా నివారించుకునేందుకు మీరు సహాయపడగలరు. 1954 మొదలుకొని స్వీడన్‌లో నడిపించబడుతున్న సంస్థీకృత పిల్లల సురక్షా కార్యక్రమంలో ఇది నిరూపించబడింది. అంతకు ముందు, ప్రతి సంవత్సరం ప్రమాదాల్లో 450 కన్నా ఎక్కువ మంది పిల్లలు చనిపోయేవారు. నేడు, సాంవత్సరిక మరణ రేటు దాదాపు 70కి తగ్గిపోయింది.

ఇంటిలోపల

“ప్రమాదాలు జరుగకుండా చూసుకోవాలని, ఒక ఏడో, రెండేళ్ళో, మూడేళ్ళో ఉన్న బిడ్డకు నేర్పించలేము, తర్వాత వాళ్ళు దాన్ని గుర్తుంచుకోవాలనీ నిరీక్షించలేము” అని పిల్లల మనశ్శాస్త్రవేత్త అయిన కెస్టిన్‌ బాక్‌స్ట్రామ్‌ అంటున్నారు. కనుక, ప్రమాదాలను నివారించుకునేందుకు మీ బిడ్డకి సహాయపడే బాధ్యత తల్లిదండ్రులుగా మీమీదా, బిడ్డ అప్పుడప్పుడు ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ మీదా ఉంటుంది.

మొదటిగా, మీ ఇల్లంతా పరిశీలించండి. ప్రక్క పేజీలోని బాక్సులో ఇవ్వబడిన పట్టికను ఉపయోగించుకోండి. బహుశా, కొన్ని సురక్షా ఉపకరణాలు అన్ని దేశాల్లో లభ్యం కాకపోవచ్చు. లేదా సరసమైన ధరల్లో లభ్యం కాకపోవచ్చు. అయినప్పటికీ, కొంత కల్పనాశక్తితోనూ ఊహాశక్తితోనూ, మీ నిర్దిష్ట పరిస్థితుల్లో ఉపయోగపడగల కొన్ని పరిష్కార మార్గాలను గురించి బహుశా మీరు ఆలోచించవచ్చు.

ఉదాహరణకు, మీ వంటగదిలోని సొరుగుల హ్యాండిల్స్‌ వలయాకారంలో ఉన్నట్లయితే, వాటి గుండా కర్రను పెడితే, వాటికి తాళం వేసినట్లవుతుంది. ఒవన్‌ డోర్‌కు కూడా అలా చేయవచ్చు. ప్లాస్టిక్‌ బ్యాగ్‌లను తీసి పెడుతున్నట్లయితే, వాటి వల్ల ప్రమాదం రాకుండా ఉండేందుకు వాటిని ముడివేసి కట్టి పెట్టవచ్చు.

బహుశా మీరు ఇంటా బయటా ప్రమాదాలను నివారించే ఇతర సరళమైన మార్గాలను గురించి ఆలోచించి, వాటిని చిన్న పిల్లలున్న మీ స్నేహితులతోనూ, పరిచయస్థులతోనూ పంచుకోవచ్చు.

బయట

మీ బిడ్డ ఆడుకునే ప్రాంతాలను పరిశీలించండి. నాలుగేళ్ళ కన్నా ఎక్కువ వయసున్న పిల్లలకు తగిలే దెబ్బల్లో ఎక్కువ శాతం, వాళ్లు బయట ఆడుకుంటున్నప్పుడే తగులుతుంటాయి. వాళ్లు క్రింద పడి దెబ్బలు తగిలించుకుంటుంటారు, లేదా, తమ సైకిలు మీద నుండి పడి దెబ్బలు తగిలించుకుంటుంటారు. రోడ్డు ప్రమాదాలూ నీటిలో మునిగిపోయే ప్రమాదాలే, మూడేళ్ళ నుండి ఏడేళ్ళ లోపు పిల్లలకు సాధారణంగా బయట జరిగే ప్రాణాంతకమైన ప్రమాదాలు.

మీరు పిల్లల ఆటస్థలాలను పరిశీలించేటప్పుడు, పిల్లలు ఆడుకునే పరికరాలు వాళ్లకు గాయం కల్గించని విధంగా మంచిస్థితిలో ఉన్నాయా అన్నది చూడండి. బిడ్డ క్రింద పడినా దెబ్బలు తగలని విధంగా, ఉయ్యాలల క్రిందా, క్లైంబింగ్‌ ఫ్రేమ్స్‌ (పిల్లలు ఎక్కేందుకు నిర్మించబడిన చట్రాల) క్రిందా, అలాగే పిల్లలు ఆడుకునే మరితర వాటి క్రిందా మెత్తని ఇసుక ఉందా?

మీ ఇంటి దగ్గర నీటి మడుగులు గానీ, చిన్న వాగులు గానీ ఉన్నాయా? ఒకటి లేదా రెండు ఏళ్ళ పిల్లలు మునిగిపోవడానికి కేవలం కొన్ని అంగుళాల నీళ్ళు చాలు. “ఒక చిన్నబిడ్డ నీటిమడుగులో బోర్లా పడ్డాడంటే, క్రింద ఏముంది, పైన ఏముందన్న స్పృహ వాడికుండదు. వాడు తిరిగి పైకి లేవలేడు” అని పిల్లల మనశ్శాస్త్రవేత్తయైన బాక్‌స్ట్రామ్‌ అంటున్నారు.

కనుక, ప్రాథమికమైన ఒక సూత్రమేమిటంటే: ఒకటి నుండి మూడేళ్ళ లోపు పిల్లలను పెద్దవాళ్ళ పర్యవేక్షణ లేకుండా బయట ఆడుకోనివ్వకూడదు. ఇంటి పరిసరప్రాంతాల్లో నీళ్ళు ఉన్నట్లయితే, తగినంత వయస్సు వచ్చేవరకు, పెద్దవాళ్ళ పర్యవేక్షణ లేకుండా బయట ఆడుకోవడానికి బిడ్డను అనుమతించకూడదు.

రోడ్డుమీద

మీ ఇంటి చుట్టుప్రక్కల రోడ్లున్నట్లయితే, అప్పుడు కూడా అలాగే చేయాలి. “స్కూల్‌కు వెళ్ళే వయస్సులేని పిల్లలు స్పష్టమైన సందేశాలు మాత్రమే గ్రహించ గల్గుతారు, ఒక సమయంలో ఒక విషయం మీద మాత్రమే అవధానాన్ని నిలపగల్గుతారు. వాహనాల రాకపోకలతో రోడ్డంతా గందరగోళంగా గజిబిజిగా ఉంటుంది” అని బాక్‌స్ట్రామ్‌ అంటున్నారు. మీ బిడ్డకు స్కూల్‌కు వెళ్ళే వయసు రాక ముందు, తనంతట తాను వీథి దాటేందుకు అనుమతించకండి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పిల్లలకు కనీసం 12 ఏళ్ళు కూడా లేకపోతే, రద్దీగా ఉన్న ట్రాఫిక్‌లో ఒంటరిగా సైకిల్‌ తొక్కేంత వయసున్నట్లు పరిగణించబడరు.

సైకిల్‌ తొక్కేటప్పుడూ, స్వారీ చేసేటప్పుడూ, రోలర్‌ స్కేటింగ్‌ చేసేటప్పుడూ, టోబోగ్యానింగ్‌ చేసేటప్పుడూ హెల్మెట్‌ ఉపయోగించాలన్న విషయం మీ బిడ్డకు నేర్పించండి. తలకు గాయాలైతే వాటికి చికిత్స చేయడం చాలా కష్టం, దానివల్ల శాశ్వతమైన హాని కలుగవచ్చు—ప్రాణాంతకం కూడా కావచ్చు! ఒక పిల్లల క్లినిక్‌లో, సైకిల్‌ ప్రమాదం తర్వాత చికిత్స చేయబడినవారిలో 60 శాతం మందికి తలకూ, ముఖానికి బాగా దెబ్బలు తగిలాయి. కానీ, హెల్మెట్‌లు ఉపయోగించినవారి తలకు అంత తీవ్రమైన దెబ్బలు తగలలేదు.

అలాగే, కారులో ప్రయాణం చేసేటప్పుడు మీ బిడ్డ సురక్షితంగా ఉండేలా చూసుకోండి. అనేక దేశాల్లో, చిన్న పిల్లలను, ప్రత్యేకంగా రూపకల్పన చేయబడిన సురక్షిత సీట్లలో కూర్చోబెట్టి వాళ్లకు సురక్షిత బెల్ట్‌లను తగిలించాలన్న చట్టాలున్నాయి. ఇలాంటి చట్టం ఉండడం వల్ల, రోడ్డు ప్రమాదాల్లో పిల్లలకు గాయాలవ్వడమూ, మరణించడమూ చాలా తగ్గాయి. మీరు నివసించే ప్రాంతంలో, సురక్షిత సీట్లు లభ్యమైతే, వాటిని ఉపయోగించడం చక్కని జీవిత భీమాలాంటిది. కానీ మీరు ఎంపిక చేసుకున్న సురక్షిత సీట్‌ అంగీకరించబడిన మోడలే అయ్యుండేలా చూసుకోండి. పసిపిల్లల కొరకైన సీట్లకూ, దాదాపు మూడేళ్ళు, అంతకన్నా ఎక్కువ వయసున్న పిల్లల కొరకైన సీట్లకూ తేడా ఉందని గమనించండి.

పిల్లలు యెహోవా ఇచ్చిన ప్రశస్తమైన వరాలు, మనం వాళ్ళను అన్ని విధాలుగానూ కంటికి రెప్పలా కాపాడుకోవాలని కోరుకుంటాం. (కీర్తన 127:4) హానా ఆ ప్రమాదాన్ని తెచ్చుకోవడానికి ముందూ, ఆ తర్వాత కూడా తమ పిల్లలను కాపాడుకునే విషయంలో బర్‌గిటా, కార్లేరిక్‌లు, మంచి తల్లిదండ్రులుగా చాలా శ్రద్ధ చూపించారు. “నిజమే, ఆ ప్రమాదం తర్వాత, మేము మరింత జాగ్రత్త వహించాం” అని కార్లేరిక్‌ ఒప్పుకుంటున్నారు. “మాకు ఇప్పుడు మనవళ్ళు మనవరాళ్ళు కూడా ఉన్నారు. మేము మా మందులను ఎల్లప్పుడూ తప్పకుండా తాళం వేసి ఉంచుతాము” అని బర్‌గిటా అంటున్నారు.

[22వ పేజీలోని బాక్సు]

మీ ఇంట్లో సురక్షితత్వం

• మందులు: మందులు పిల్లలకు అందకుండా అల్మారాలో పెట్టి తాళం వేయండి. ప్రిస్క్రైబ్‌ చేయని మందులనూ, ఆయుర్వేద మందులనూ తాళం వేసి పెట్టండి. అతిథులు రాత్రిపూట మనింట్లో బస చేస్తున్నట్లయితే, వాళ్ళ మందులను భద్రంగా పెట్టుకోమని చెప్పండి.

• ఇళ్ళలో ఉండే రసాయనాలు: వాటిని పిల్లలకు అందకుండా తాళం వేసి ఉంచగల అల్మారాలో భద్రపర్చండి. వాటిని వాటి డబ్బాల్లోనే ఉంచండి, అలాగైతే వాటిని స్పష్టంగా గుర్తుపట్టవచ్చు. మీరు వాటిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, మీరు ఆ గదిలో నుండి బయటికి వెళ్లి, తిరిగి ఒక్క క్షణంలో వచ్చేలాగయినా సరే, వాటిని పిల్లలకు అందకుండా పెట్టండి. మీరు గిన్నెలు తోమే డిష్‌వాషర్‌లో డిటర్జెంట్‌ ఏమీ మిగలకుండా చూసుకోండి.

• స్టవ్‌: స్టవ్‌ మీదున్న పెనం హ్యాండిల్‌ని అవతలివైపుకు పెట్టండి. స్టవ్‌ మీద నుండి గిన్నె పడిపోకుండా ఉంచే సాస్‌ప్యాన్‌ గార్డ్‌ లాంటి పరికరాలు లభ్యమయ్యేటట్లయితే వాటిని కొని ఉపయోగించండి. బిడ్డ ఒవన్‌ తలుపును తెరిస్తే స్టవ్‌ ప్రక్కకి ఒరుగకుండా ఉండేలా చేసే టిల్ట్‌ గార్డును స్టవ్‌కి అటాచ్‌ చేయండి. ఒవన్‌ డోర్‌కి తాళం వేసే ఏర్పాటు ఉండాలి. బిడ్డ, ఒవన్‌ తలుపును ముట్టుకుని చేయి కాల్చుకునే ప్రమాదముందా? వాడు వేడిగా ఉండే ఒవన్‌ డోర్‌ను ముట్టుకోలేని విధంగా చేసే ఒక చట్రాన్ని లేదా కొయ్య పలకను అటాచ్‌ చేయండి.

• ప్రమాదకరమైన గృహోపకరణాలు: చాకులను, కత్తెరలను, ప్రమాదకరమైన విద్యుత్‌ ఉపకరణాలను అల్మారాలో లేదా, సొరుగుల్లో పెట్టి తాళం వేయాలి లేదా గడి పెట్టాలి, లేదా మరెక్కడైనా బిడ్డ చేతికి అందకుండా పెట్టాలి. మీరు అలాంటి ఉపకరణాలను ఉపయోగిస్తూ తాత్కాలికంగా ప్రక్కన పెడుతున్నట్లయితే, పిల్లలకు అందేలా బల్ల చివరనగానీ అరుగు చివరనగానీ ఉంచకండి. అగ్గిపుల్లలూ, ప్లాస్టిక్‌ బ్యాగ్‌లూ కూడా పిల్లలకు ప్రమాదం కలిగించగల వస్తువులే.

• మెట్లు: మెట్ల మొదట్లోనూ, చివరిలోనూ కనీసం 30 అంగుళాల ఎత్తున్న గేట్లను పెట్టించండి.

• కిటికీలూ, బాల్కనీ తలుపులూ: గాలి రావడం కోసం వాటిని కొంచెం తెరిచి ఉంచినప్పుడు, బిడ్డవాటిని పూర్తిగా తెరవకుండా ఉండేలా, లేదా వాటి గుండా బయటికి పోకుండా ఉండేలా పిల్లల సురక్షా కొండులు లేదా గొలుసులు ఎత్తున ఉండేలా చేయించండి, లేదా మరే ఇతర సురక్షా పద్ధతినైనా ఉపయోగించండి.

• బుక్‌షెల్ఫులు: బిడ్డ, పైకి ఎక్కి వస్తువులను పట్టుకుని వ్రేలాడడానికి ఇష్టపడేవాడైతే, బుక్‌షెల్ఫులనైనా, ఎత్తైన మరే ఇతర ఫర్నిచర్‌నైనా గోడకు బిగించి పెట్టండి, ఆ విధంగా అవి వాడి మీద పడకుండా ఉంటాయి.

• విద్యుత్‌ సోకెట్‌లూ, ఎలక్ట్రిక్‌ వయర్లూ: ఉపయోగించని సోకెట్‌లు ఏమైన ఉంటే వాటిని మూసి తాళం వేయాలి. టేబుల్‌ ల్యాంపులు మొదలైనవాటి కొరకైన వయర్లను గోడకుగానీ, ఫర్నిచర్‌కుగానీ బిగించి పెట్టాలి. అలా చేస్తే బిడ్డ ఆ వయర్లను క్రిందికి లాగి, ల్యాంప్‌ను తనమీదకి వేసుకోడు. లేకపోతే, అలాంటి ల్యాంపులను తీసి ప్రక్కన పెట్టండి. కరెంట్‌ ఇస్త్రీపెట్టెను, ఇస్త్రీ చేసే బల్ల మీద పెట్టి, దాని వయరు క్రిందికి వ్రేలాడేలా ఉంచకండి.

• వేడి నీళ్ళు: మీరు వేడినీళ్ళ ఉష్ణోగ్రతను మార్చగల్గేటట్లయితే, మీరు దాన్ని 120 డిగ్రీల ఫారన్‌హీట్‌కు తగ్గించాలి. అలాగైతే, బిడ్డ టాప్‌ తెరిస్తే, చేతులు కాలవు.

• ఆటవస్తువులు: మొనదేలిన అంచులూ మూలలూ ఉన్న ఆటవస్తువులను పారవేయండి. చిన్న ఆటవస్తువులను లేదా చిన్న ముక్కలుగా చేయగల ఆటవస్తువులను పారవేయండి. బిడ్డ వాటిని నోట్లోపెట్టుకుంటే గొంతుకకు అడ్డం పడగలవు. పిల్లలు ఆడుకునే టెడ్డీబేర్ల కళ్ళూ, ముక్కూ ఊడిరాకుండా గట్టిగా ఉండేలా చూడండి. బిడ్డ నేల మీద ఉన్నప్పుడు, తమ చిన్న ఆటవస్తువులను అక్కడి నుండి తీసేయాలని వాడి అన్నలకూ, అక్కలకూ నేర్పించండి.

• కలకండా, చిరుతిండీ: కలకండనూ, వేరుశనగ లాంటి చిరుతిండినీ, పటిక బెల్లాన్ని బిడ్డ చేతికి అందేలా ఉంచకూడదు. అవి బిడ్డ గొంతుకకు అడ్డం పడగలవు.

[క్రెడిట్‌ లైను]

Source: The Office of the Children’s Ombudsman

[22వ పేజీలోని బాక్సు]

ప్రమాదం జరిగినప్పుడు

• విషంకావడం: బిడ్డ విషపూరితమైన ఏదైనా ద్రవాన్ని త్రాగినట్లైతే, వాడి నోటిలో నీళ్ళు పోసి శుభ్రంగా కడగండి, ఒకటో రెండో గ్లాసుల నీళ్ళు లేదా పాలు త్రాగించండి. ఆ తర్వాత, ఒక డాక్టర్‌ని పిలవండి, లేదా సలహా కోసం, ఆ ద్రవపు ఉత్పత్తిదారులను సంప్రదించండి. బిడ్డ కంటిలో హానికరమైనది ఏమైనా పడినట్లైతే, మరిన్ని నీళ్ళు పోసి బాగా కడగండి, కనీసం పది నిమిషాలైనా కడగండి.

• కాలిన గాయాలు: చిన్నగా కాలినట్లయితే, చల్లని నీళ్ళను (మరీ చల్లనీళ్ళు కాదు) ఆ గాయంపై ఉంచండి, కనీసం 20 నిమిషాలు అలా చేయండి. ఆ గాయం బిడ్డ అరచేతికన్నా పెద్దదైతే, లేదా అది ముఖం మీదగానీ, కీలు మీదగానీ లేదా పొత్తికడుపు క్రింద భాగంలోగానీ లేదా జననాంగాల మీదగానీ తగిలితే మీరు బిడ్డను ఎమర్జెన్సీ రూమ్‌కు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. చర్మం లోపలికి అయిన గాయాలకు, ఎల్లవేళలా డాక్టర్‌ చేత చికిత్స చేయించడం తప్పనిసరి.

• గొంతుకకు అడ్డుపడడం: బిడ్డ శ్వాసనాళంలో ఏమైన అడ్డుపడితే, దాన్ని వెంటనే బయటికి తీయడం అత్యవసరం. కడుపు పై భాగాన నొక్కి కక్కించడం కూడా మీరు ఉపయోగించగల ఒక ఫలప్రదమైన పద్ధతి. మీకు ఆ పద్ధతి అంతగా తెలియనట్లైతే, ఈ పద్ధతి గురించి మరెక్కువగా తెలుసుకోవడానికి డాక్టర్‌ను సంప్రదించండి. లేదా ఒక పిల్లవాడికి ప్రమాదం జరిగితే ఏమి చేయాలి అన్నది నేర్పించే చోటికి లేదా ఫస్ట్‌-ఎయిడ్‌ కోర్సుకి వెళ్ళండి.

[క్రెడిట్‌ లైను]

Source: The Swedish Red Cross

[23వ పేజీలోని చిత్రం]

భద్రతనిచ్చే సైకిల్‌ హెల్మెట్‌ను ధరించడం

[23వ పేజీలోని చిత్రం]

కారు సీట్లో సురక్షితంగా

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి