ఆగస్టు
శనివారం, ఆగస్టు 1
“అప్పుడు మహాశ్రమ వస్తుంది. లోకం పుట్టిన దగ్గర నుండి ఇప్పటివరకు అలాంటి శ్రమ రాలేదు.”—మత్త. 24:21.
నిజమే వీలైనంతమంది మనం చెప్పేది విని, మనతో కలిసి యెహోవాను ఆరాధించాలని మనం కోరుకుంటాం. కానీ మనం చెప్పేది వినని వాళ్లందరి సంగతేంటి? మహాబబులోను నాశనం చూసి మనసు మార్చుకునేవాళ్లను యెహోవా కాపాడే అవకాశం ఉంది. ఒకవేళ అదే నిజమైతే, ఇప్పుడే దానిగురించి ప్రజల చెవుల్లో మారుమ్రోగేలా చెప్పడం చాలా ముఖ్యం! ఇప్పుడు మనం దానిగురించి చెప్తేనే మహాశ్రమ సమయంలో వాళ్లు దాన్ని గుర్తుతెచ్చుకోగలుగుతారు. (యెహెజ్కేలు 33:33 తో పోల్చండి.) బహుశా మనం చెప్పింది గుర్తుతెచ్చుకుని, సమయం మించిపోకముందే వాళ్లు మనతో కలిసి యెహోవాను ఆరాధించే అవకాశం ఉంది. ఒక “పెద్ద భూకంపం” వచ్చిన తర్వాత ఫిలిప్పీలోని చెరసాల అధికారి తన మనసు మార్చుకున్నట్టే, భవిష్యత్తులో మహాబబులోను నాశనాన్ని చూసిన తర్వాత కొంతమంది తమ మనసు మార్చుకునే అవకాశం ఉంది.—అపొ. 16:25-34. w24.05 17 ¶9-10
ఆదివారం, ఆగస్టు 2
“క్రీస్తు ధర్మశాస్త్రానికి ముగింపు.”—రోమా. 10:4, అధస్సూచి.
అపొస్తలుడైన పౌలు హెబ్రీ క్రైస్తవులకు రాసిన ఉత్తరం నుండి మనం ఒక విలువైన పాఠం నేర్చుకోవచ్చు. కొంతమంది ఆధ్యాత్మికంగా ఎదగకుండా అక్కడే ఆగిపోయారు. చెప్పాలంటే వాళ్లు “మళ్లీ పాలు తాగే స్థితికి వచ్చారు, గట్టి [ఆధ్యాత్మిక] ఆహారం తినే స్థితిలో లేరు.” (హెబ్రీ. 5:12) సంఘం ద్వారా యెహోవా నేర్పిస్తున్న కొత్త విషయాల్ని వాళ్లు నేర్చుకోలేదు, అంగీకరించలేదు. (సామె. 4:18) ఉదాహరణకు, క్రీస్తు బలి ద్వారా ధర్మశాస్త్రం రద్దు అయిపోయినా, చాలామంది యూదా క్రైస్తవులు 30 ఏళ్లుగా ఇంకా మోషే ధర్మశాస్త్రాన్నే పట్టుకొని వేలాడుతున్నారు. (తీతు 1:10) పౌలు హెబ్రీయులకు రాసిన ఉత్తరం ఎవరు చదివినా దాంట్లో గట్టి ఆధ్యాత్మిక ఆహారం ఉందని చెప్తారు. కాబట్టి ఆ ఉత్తరం, యెహోవాను కొత్త పద్ధతిలో ఆరాధించడం ధర్మశాస్త్రం కన్నా చాలా మెరుగైంది అనే విశ్వాసం అప్పటి క్రైస్తవుల్లో పెంచి ఉంటుంది. అలాగే, వాళ్లు ఆపకుండా ప్రీచింగ్ చేయడానికి కావాల్సిన ధైర్యం ఇచ్చి ఉంటుంది.—హెబ్రీ. 10:19-23. w24.04 6 ¶15
సోమవారం, ఆగస్టు 3
“నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని దేవుడు తిరిగి బ్రతికిస్తాడు.”—అపొ. 24:15.
ఆదాముహవ్వలు సాతానుతో చేతులు కలిపి యెహోవాకు ఎదురు తిరిగినప్పటి నుండి ఇప్పటివరకు కోట్లమంది చనిపోయారు. వాళ్లందరికీ ఏం జరగబోతుంది? క్రీస్తు నమ్మకమైన అనుచరులుగా ఉన్న 1,44,000 మంది పరలోకంలో అమర్త్యమైన జీవితం కోసం పునరుత్థానం అవుతారు. (ప్రక. 14:1) అలాగే యెహోవాకు నమ్మకంగా ఉన్న లెక్కలేనంతమంది స్త్రీపురుషులు ‘నీతిమంతుల పునరుత్థానంలో’ బ్రతికించబడతారు. వాళ్లు వెయ్యేళ్ల పరిపాలనలో అలాగే చివరి పరీక్షలో నమ్మకంగా ఉంటే ఈ భూమ్మీద శాశ్వత జీవితాన్ని సొంతం చేసుకుంటారు. (దాని. 12:13; హెబ్రీ. 12:1) అంతేకాదు, వెయ్యేళ్ల పరిపాలనలో “అనీతిమంతులు” తమ తప్పుడు పనులు మానేసి, యెహోవాకు నమ్మకమైన సేవకులుగా మారే అవకాశం దొరుకుతుంది. ఆ అనీతిమంతుల్లో అంతకుముందు యెహోవాను ఎప్పుడూ సేవించనివాళ్లు లేదా “అలవాటుగా నీచమైన పనులు చేసినవాళ్లు” కూడా ఉంటారు. (యోహా. 5:29; లూకా 23:42, 43) కానీ గతంలో కొంతమంది ఎంత చెడ్డగా ప్రవర్తించారంటే, వాళ్లను అస్సలు పునరుత్థానం చేయకూడదని యెహోవా నిర్ణయించుకున్నాడు.—లూకా 12:4, 5. w24.05 2 ¶3; 5 ¶15; 6 ¶17
మంగళవారం, ఆగస్టు 4
“ఈ ప్రజలు . . . పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, కానీ వీళ్ల హృదయం నాకు చాలా దూరంగా ఉంది.”—యెష. 29:13.
యెహోవా ఆమోదం పొందాలనుకునే వ్యక్తి, ‘తన హృదయంలో సత్యాన్ని మాట్లాడతాడు.’ (కీర్త. 15:2) అంటే అతను అబద్ధాలు చెప్పకపోవడమే కాదు. అతను చేసే ప్రతీ పనిలో, మాట్లాడే ప్రతీ మాటలో నిజాయితీ ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. (హెబ్రీ. 13:18) ఇది చాలా ప్రాముఖ్యం. “ఎందుకంటే, కపట బుద్ధి గలవాళ్లు యెహోవాకు అసహ్యం, నిజాయితీపరులకు ఆయన దగ్గరి స్నేహితుడు.” (సామె. 3:32) “హృదయంలో సత్యాన్ని మాట్లాడే వ్యక్తి” నలుగురిలో ఉన్నప్పుడు దేవుని నియమాల్ని పాటిస్తూ ఒంటరిగా ఉన్నప్పుడు వాటిని మీరడు. అతను కపట బుద్ధితో పనులు చేయడు. కపట బుద్ధిగల వ్యక్తి యెహోవా నియమాలు అప్పుడప్పుడు తనకు సరిపోవు అనుకోవచ్చు. (యాకో. 1:5-8) చిన్నచిన్న విషయాల్లో వాటిని అతను పాటించకపోవచ్చు. ఆ తర్వాత అతను చేసే తప్పులకు శిక్ష పడకపోవడం వల్ల ఇంకా పెద్దపెద్ద విషయాల్లో దేవుని నియమాల్ని మీరే అవకాశం ఉంది. అప్పుడు అతను దేవుణ్ణి ఆరాధిస్తున్నానని అనుకున్నా యెహోవా మాత్రం అతని ఆరాధనను అంగీకరించడు. (ప్రసం. 8:11) కానీ మనం ప్రతీ విషయంలో నిజాయితీగా ఉండాలనుకుంటాం. w24.06 10 ¶7-8
బుధవారం, ఆగస్టు 5
“మీరు నడుముకు సత్యం అనే దట్టీ కట్టుకుని, . . . స్థిరంగా నిలబడండి.”—ఎఫె. 6:14.
యెహోవా ప్రజలంగా మనం దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని ఇష్టపడతాం. మన విశ్వాసం దానిమీదే ఆధారపడివుంది. (రోమా. 10:17) యెహోవాయే క్రైస్తవ సంఘాన్ని ‘సత్యానికి స్తంభంగా, పునాదిగా’ స్థాపించాడని మనం గట్టిగా నమ్ముతాం. (1 తిమో. 3:15) బైబిలు మీద, దేవుని సంస్థ మీద మనకున్న నమ్మకాన్ని తీసేయాలనేదే సాతాను కోరిక. (ఎఫె. 4:14) త్వరలోనే సాతాను పచ్చి అబద్ధాల్ని వ్యాప్తి చేసి దేశాలన్నీ యెహోవాకు ఎదురుతిరిగేలా చేస్తాడు. (ప్రక. 16:13, 14) అంతేకాదు, యెహోవా సేవకుల్ని తప్పుదారి పట్టించడానికి తన ప్రయత్నాల్ని కూడా ముమ్మరం చేస్తాడని మనకు తెలుసు. (ప్రక. 12:9) అందుకే మనం సత్యానికి లోబడాలంటే, సత్యానికి అలాగే అబద్ధానికి ఉన్న తేడాను గుర్తించడం చాలా ప్రాముఖ్యం. (రోమా. 6:17; 1 పేతు. 1:22) మనం మహాశ్రమను తప్పించుకుంటామా లేదా అనేది దానిమీదే ఆధారపడి ఉంటుంది. w24.07 8 ¶1-3
గురువారం, ఆగస్టు 6
“నేడు నేను నీకు ఇస్తున్న ఈ ఆజ్ఞ నువ్వు పాటించలేనంత కష్టమైనది కాదు, నువ్వు అందుకోలేనంత దూరంలో కూడా లేదు.”—ద్వితీ. 30:11.
యెహోవా ఇశ్రాయేలీయుల్ని తన ప్రజలుగా ఎంచుకున్నప్పుడు వాళ్లతో ఒక ఒప్పందం చేశాడు. వాళ్లు ఆయన ఆజ్ఞల్ని పాటిస్తే ఆయన వాళ్లను కాపాడతాడు, దీవిస్తాడు. కానీ వాళ్లు ఆయనకు ఎదురుతిరిగితే, అంటే వేరే దేవుళ్లను పూజిస్తే మాత్రం వాళ్లను దీవించడం ఆపేస్తాడు, అప్పుడు వాళ్లు కష్టాలపాలౌతారు. అయినాసరే, ఇక వాళ్లను యెహోవా ఏ ఆశా లేకుండా పూర్తిగా వదిలేయలేదు. వాళ్ల కోసం తలుపు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. వాళ్లు ‘యెహోవా దగ్గరికి తిరిగొచ్చి ఆయన మాట వినే’ అవకాశం ఉంది. (ద్వితీ. 30:1-3, 17-20) మరో మాటలో చెప్పాలంటే, వాళ్లు పశ్చాత్తాపం చూపించే అవకాశం ఉంది. అలా చేస్తే యెహోవా వాళ్లను అక్కున చేర్చుకుంటాడు, దీవెనలతో ముంచెత్తుతాడు. యెహోవా ఎంచుకున్న ప్రజలు మాటిమాటికి ఆయనకు ఎదురుతిరిగారు. దానివల్ల వాళ్లకు కష్టాలు తప్పలేదు. కానీ దారితప్పిన ప్రజల మీద యెహోవా ఆశలు వదులుకోలేదు. మళ్లీమళ్లీ ప్రవక్తల్ని పంపించి, పశ్చాత్తాపపడి తన దగ్గరికి తిరిగి రమ్మని వాళ్లను అడిగాడు.—2 రాజు. 17:13, 14. w24.08 9 ¶4-5
శుక్రవారం, ఆగస్టు 7
“యెరూషలేములో ఉన్న సంఘం మీదికి తీవ్రమైన హింస రావడం మొదలైంది.”—అపొ. 8:1.
యేసు చనిపోయిన తర్వాతి సంవత్సరాల్లో యెరూషలేములో, యూదయలో ఉంటున్న హెబ్రీ క్రైస్తవులకు అడుగడుగునా కష్టాలే. క్రైస్తవ సంఘం ఏర్పడిన వెంటనే హింసలు ఉప్పెనలా విరుచుకుపడ్డాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత దేశంలో కరువు రావడంతో క్రీస్తు అనుచరులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. (అపొ. 11:27-30) రాబోయే సంవత్సరాల్లో హింసలు ఇంకాఇంకా పెరిగిపోతాయి. కానీ దాదాపు క్రీ.శ. 61 సమయంలో క్రైస్తవులు కాస్త ప్రశాంతతను ఆనందించారు. ఆ సమయంలో వాళ్లు అపొస్తలుడైన పౌలు నుండి ఒక ఉత్తరాన్ని అందుకున్నారు. చెప్పాలంటే, ఆ ఉత్తరం సరైన సమయానికి వచ్చింది. క్రైస్తవులు ఆనందిస్తున్న ఆ ప్రశాంతత ఎక్కువకాలం ఉండదు కాబట్టి, ఆ ఉత్తరం సరైన సమయానికి వచ్చిందని చెప్పవచ్చు. రాబోయే శ్రమల్ని సహించడానికి సహాయం చేసే మంచి సలహాల్ని పౌలు అక్కడున్న క్రైస్తవులకు ఇచ్చాడు. w24.09 8 ¶1-2
శనివారం, ఆగస్టు 8
“వీళ్లు నాకు ఎంతో ఊరటను ఇచ్చారు.”—కొలొ. 4:11.
మనం బాధలో ఉన్నప్పుడు, యెహోవా ప్రేమకు మన బ్రదర్స్‌సిస్టర్స్ ప్రతిరూపాలని చెప్పాలి. మనం చెప్పేది శ్రద్ధగా వినడం ద్వారా లేదా మన పక్కనే ఉండడం ద్వారా వాళ్లు మనల్ని ఓదారుస్తారు. ఇంకొన్నిసార్లయితే మనకు ధైర్యాన్నిచ్చే బైబిలు లేఖనాన్ని చూపిస్తారు, లేదా మనతో కలిసి ప్రార్థన చేస్తారు. (రోమా. 15:4) యెహోవా ఆలోచన ఏంటో మనకు గుర్తు చేసి ప్రశాంతంగా ఉండేలా సహాయం చేస్తారు. అంతేకాదు అవసరమైతే మనకు భోజనం వండి పెడతారు, ఇంకా వేరే పనులు కూడా చేసి పెడతారు. మనకు వేరేవాళ్ల సహాయం కావాలంటే మనమే అడగాల్సి రావచ్చు. (సామె. 17:17) మనకు ఎలా అనిపిస్తుందో, మనకు ఏం అవసరమో వాళ్లకు తెలీకపోవచ్చు. (సామె. 14:10) మీకు బాగా దగ్గరైన స్నేహితులతో మాట్లాడి మీకెలా అనిపిస్తుందో చెప్పండి. వాళ్లు మీకోసం ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి. మీరు మనసువిప్పి మాట్లాడగలరని అనిపించే ఒకరిద్దరు పెద్దలతో కూడా మాట్లాడండి. కొంతమంది సిస్టర్స్‌కైతే ఇంకొక పరిణతిగల సిస్టర్‌తో మాట్లాడడం ఊరటను ఇచ్చింది. w24.10 10 ¶15-16
ఆదివారం, ఆగస్టు 9
‘కుమారుణ్ణి అంగీకరించి, ఆయనమీద విశ్వాసం చూపించే ప్రతీ ఒక్కరు శాశ్వత జీవితం పొందుతారు.’—యోహా. 6:40.
ఆరోగ్యం కోసం చాలామంది మంచి ఆహారం తీసుకుంటారు, క్రమంగా ఎక్సర్‌సైజ్ చేస్తారు. కానీ ఎంత చేసినా ముసలితనాన్ని, చావును తప్పించుకోలేమని అనుకుంటారు. ఎప్పటికీ జీవించడం అనేది వాళ్లకు ఒక పగటి కలలా అనిపించవచ్చు. అయితే యేసు మాత్రం యోహాను 3:16; 5:24 లో “శాశ్వత జీవితం” సాధ్యమేనని చెప్పాడు. యేసు ఒక అద్భుతం చేసి ఎన్నో వేలమందికి రొట్టెల్ని, చేపల్ని పంచిపెట్టాడు. అదే చాలా గొప్ప విషయమైతే, ఆయన తర్వాతి రోజు అన్న మాటలు ఇంకా అద్భుతంగా ఉన్నాయి. ఆ ఆహారం తిన్న ప్రజలు ఆయన వెంట వెళ్తూ గలిలయ సముద్ర తీరాన ఉన్న కపెర్నహూముకు చేరుకున్నారు. అక్కడ యేసు చనిపోయినవాళ్లు తిరిగి బ్రతికించబడతారని, వాళ్లు శాశ్వత జీవితాన్ని పొందుతారని చెప్పాడు. (యోహా. 6:39, 40) చనిపోయిన చాలామంది తిరిగి బ్రతికించబడతారని, మీతోపాటు మీకు కావాల్సినవాళ్లు శాశ్వత జీవితాన్ని పొందగలరని యేసు మాటలు భరోసాను ఇస్తున్నాయి. w24.12 8 ¶1-2
సోమవారం, ఆగస్టు 10
‘భర్తలారా, స్త్రీలు మీకన్నా బలహీనమైనవాళ్లు, సున్నితమైన పాత్ర లాంటివాళ్లు; వాళ్లకు గౌరవం ఇవ్వండి.’—1 పేతు. 3:7.
చాలామంది భర్తలు తమ భార్యల్ని కొడుతున్నారు, తిడుతున్నారు, మనసుకు మానని గాయాలు చేస్తున్నారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈమధ్య ఇచ్చిన ఒక నివేదికలో చెప్పింది. బహుశా అలాంటి ఒక భర్త నలుగురిలో ఉన్నప్పుడు భార్యను బాగా చూసుకోవచ్చు. కానీ నాలుగు గోడల మధ్య చిత్రహింసలు పెడుతూ ఉండవచ్చు. కొంతమంది భర్తలు ఎందుకంత క్రూరంగా ఉంటారు? ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ల నాన్న వాళ్ల అమ్మను కొట్టడం చూసి వాళ్లు పెరిగి ఉండొచ్చు. కాబట్టి అది మామూలు విషయమే అని వాళ్లు అనుకోవచ్చు. ఇంకొంతమంది చుట్టుపక్కలవాళ్ల ఆలోచనల్ని ఒంటపట్టించుకొని ఉండవచ్చు. భర్తను చూసి భార్య గజగజ వణికిపోతేనే అతను “ఒక మగాడు” అని వాళ్లు అనుకుంటుండవచ్చు. మరికొంతమంది పురుషులకు, కోపాన్ని ఎలా అదుపు చేసుకోవాలో చిన్నప్పుడు నేర్పించి ఉండకపోవచ్చు. ఇంకొంతమంది పురుషులు అశ్లీల చిత్రాల్ని చూసీ-చూసీ ఆడవాళ్లు మగాళ్ల కోరికల్ని తీర్చడానికే ఉన్నారని అనుకుంటుండవచ్చు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఈ సమస్యలన్నీ తారాస్థాయికి చేరుకున్నాయని నివేదికలు చెప్తున్నాయి. నిజానికి భార్యతో క్రూరంగా ఉండడానికి ఇవి సాకులే కాదు. w25.01 8 ¶2-3
మంగళవారం, ఆగస్టు 11
“క్రీస్తు మనిషిగా ఉన్నప్పుడు బాధలు అనుభవించాడు, కాబట్టి మీరు కూడా క్రీస్తులా ఆలోచించడానికి సిద్ధమవ్వండి.”—1 పేతు. 4:1.
ధర్మశాస్త్రంలో అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ ఏంటో యేసు ఇలా వివరించాడు: “నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో, నీ పూర్తి బలంతో, నీ నిండు మనసుతో ప్రేమించాలి.” (లూకా 10:27) కాబట్టి మనలో ఉన్నవాటన్నిటితో, మన దగ్గర ఉన్నవాటన్నిటితో మనం యెహోవాను ప్రేమిస్తాం. వాటిలో మన కోరికలు, ఫీలింగ్స్, మన బలం, శక్తి, మన ఆలోచనా తీరు అన్నీ ఉన్నాయి. నిజం చెప్పాలంటే, యెహోవా ఆలోచనను పూర్తిగా అర్థం చేసుకోవడం మన తరం కాదు. కానీ ‘క్రీస్తు మనసును’ మనం ఎంతబాగా అధ్యయనం చేస్తే యెహోవాలా అంతబాగా ఆలోచించగలుగుతాం. ఎందుకంటే, యేసు అచ్చుగుద్దినట్టు తన తండ్రిలా ఆలోచించాడు.—1 కొరిం. 2:16. w25.03 8 ¶1
బుధవారం, ఆగస్టు 12
“ఆయన ద్వారానే, అంటే ఆ కుమారుడి రక్తం ద్వారానే విమోచన క్రయధనం వల్ల మనకు విడుదల దొరికింది; అవును, మన పాపాలకు క్షమాపణ దొరికింది. నిజంగా దేవుని అపారదయ చాలా గొప్పది!”—ఎఫె. 1:7.
పాపం చేయకముందు ఆదాము ఎలా ఉన్నాడో, యేసు కూడా అలానే పరిపూర్ణ వ్యక్తిగా ఉన్నాడు. (1 కొరిం. 15:45) కాబట్టి యేసు మనకోసం చనిపోవడం ద్వారా ఆదాము చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేయగలిగాడు, అంటే ఆదాము పోగొట్టుకున్నదాన్ని తిరిగి ఇవ్వగలిగాడు. (రోమా. 5:19) అలా యేసు “చివరి ఆదాము” అయ్యాడు. ఆదాము పోగొట్టుకున్నదాన్ని తిరిగి ఇవ్వడానికి మళ్లీ ఇంకొక పరిపూర్ణ వ్యక్తి అవసరంలేదు. ఎందుకంటే, యేసు “అన్నికాలాలకు సరిపోయేలా” ఒక్కసారే చనిపోయాడు. (హెబ్రీ. 7:27; 10:12) మరైతే ప్రాయశ్చిత్త ఏర్పాటుకు, విమోచన క్రయధనానికి తేడా ఏంటి? ప్రాయశ్చిత్త ఏర్పాటు అంటే, మనుషులకు తనకు మధ్య మంచి సంబంధాన్ని తిరిగి నెలకొల్పడానికి దేవుడు తీసుకునే చర్య. విమోచన క్రయధనం అంటే, పాపులైన మనుషులకు ప్రాయశ్చిత్తాన్ని సాధ్యం చేయడానికి చెల్లించిన మూల్యం. ఆ మూల్యమే యేసు మన తరఫున చెల్లించిన అమూల్యమైన రక్తం.—హెబ్రీ. 9:14. w25.02 5 ¶12-13
గురువారం, ఆగస్టు 13
“దేవుడు నమ్మకమైనవాడు, మీరు తట్టుకోగలిగే దానికన్నా ఎక్కువగా మిమ్మల్ని పరీక్షకు గురికానివ్వడు; ఏదైనా పరీక్ష వచ్చినప్పుడు, దాన్నుండి తప్పించుకునే మార్గం కలగజేస్తాడు, సహించడానికి సహాయం చేస్తాడు.”—1 కొరిం. 10:13.
యెహోవాను జీవంగల దేవుడిగా చూస్తే మనకొచ్చే సమస్యల గురించి సరిగ్గా ఆలోచించగలుగుతాం. ఎలా? యెహోవాకు, సాతానుకు జరుగుతున్న పోరాటంలో మనకొచ్చే కష్టాలు ఒక చిన్న భాగమని గుర్తిస్తాం. మనకు కష్టాలొస్తే యెహోవాను వదిలేస్తామని సాతాను నిందిస్తున్నాడు. (యోబు 1:10, 11; సామె. 27:11) కానీ సమస్యల్ని మనం చక్కగా దాటగలిగితే యెహోవాను ప్రేమిస్తున్నామని చూపిస్తాం, సాతాను అబద్ధాలకోరని నిరూపిస్తాం. ప్రభుత్వం నుండి వ్యతిరేకతను, ఆర్థిక ఇబ్బందుల్ని, ప్రీచింగ్‌లో మీరు చెప్పేది ఎవరూ వినకపోవడం లేదా ఇంకేదైనా సమస్యతో మీరు పోరాడుతున్నారా? అలాగైతే, మీ పరిస్థితి యెహోవా హృదయాన్ని సంతోషపెట్టడానికి ఒక అవకాశమని గుర్తుంచుకోండి. అంతేకాదు, మీరు తట్టుకోగలిగే దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని పరీక్షించనివ్వడని గుర్తుంచుకోండి. వాటన్నిటిని ఎదుర్కోవడానికి ఆయన మీకు బలాన్నిస్తాడు. w24.06 22 ¶9
శుక్రవారం, ఆగస్టు 14
“ఒక వ్యక్తి కోరికే అతన్ని లాక్కెళ్లి, వలలో పడేసి అతన్ని పరీక్షకు గురిచేస్తుంది.”—యాకో. 1:14.
మీరు ఏ విషయాల్లో తేలిగ్గా ప్రలోభంలో పడిపోతారో మీకు తెలుసా? మన బలహీనతల్ని పట్టించుకోకపోవడం లేదా అస్సలు తప్పు చెయ్యమని అనుకోవడం ప్రమాదకరం. (1 యోహా. 1:8) ఎందుకంటే జాగ్రత్తగా లేకపోతే, “పరిణతిగల” క్రైస్తవులు కూడా ప్రలోభంలో పడిపోయే అవకాశం ఉందని పౌలు చెప్పాడు. (గల. 6:1) కాబట్టి మన బలహీనతలు ఏంటో నిజాయితీగా గుర్తించాలి. (2 కొరిం. 13:5) మనం ఏ విషయాల్లో త్వరగా ప్రలోభంలో పడిపోతామో గుర్తించిన తర్వాత, ఏం చేయాలి? వాటిని ఎదిరించి నిలబడడానికి గట్టిగా కృషి చేయాలి. దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణ గమనించండి. బైబిలు కాలాల్లో ఒక నగర ప్రాకారంలో బలహీనమైన భాగం వాటి ద్వారాలే. కాబట్టి ఆ ద్వారాల దగ్గరే ఎక్కువమంది కాపలా కాసేవాళ్లు. అదేవిధంగా, మనం ఏ విషయాల్లో త్వరగా ప్రలోభానికి పడిపోతామో వాటిమీదే ఎక్కువ దృష్టిపెట్టాలి.—1 కొరిం. 9:27. w24.07 15 ¶5-7
శనివారం, ఆగస్టు 15
“మీరు ప్రతీ మంచిపని చేస్తూ, దేవుని గురించిన సరైన జ్ఞానం విషయంలో ఎదుగుతూ [ఉండండి.]”—కొలొ. 1:10.
ఈ రోజు దినవచనంలో చెప్పిన మంచి పనిలో మంచివార్త గురించి చెప్పడం కూడా ఉంది. కాబట్టి బైబిల్ని చదివి, ధ్యానించడం వల్ల యెహోవా మీద మన విశ్వాసాన్ని పెంచుకుంటాం. అలాగే, రాజ్యం గురించి ప్రకటించడం చాలా ప్రాముఖ్యమని ఇంకా బాగా అర్థం చేసుకుంటాం. బైబిలు నుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే దాన్ని గబగబ చదివేసి పక్కన పెట్టేయకండి. అధ్యయనం చేయడానికి, ధ్యానించడానికి సమయం తీసుకోండి. మీరు చదువుతున్నప్పుడు ఏదైనా ఒక వచనం అర్థం కాకపోతే, దాన్ని వదిలేసి వేరే దానికి వెళ్లిపోకండి! బదులుగా, యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకం లేదా పరిశోధన చేయడానికి ఉన్న వేరే పనిముట్ల ద్వారా ఆ వచనం గురించి లోతుగా తెలుసుకోండి. మీరు సమయం తీసుకుని అధ్యయనం చేసినప్పుడు బైబిలు చెప్తున్న విషయాలు నిజమనే నమ్మకం మీకు కుదురుతుంది. (1 థెస్స. 5:21) మీరెంత ఎక్కువ నమ్మితే, మీరు నేర్చుకున్నవాటిని వేరేవాళ్లకు అంత సంతోషంగా చెప్పగలుగుతారు. w24.04 15 ¶4-5
ఆదివారం, ఆగస్టు 16
“ఉత్తరం రాయడానికి ఒక కారణం ఏమిటంటే, మీరు అన్ని విషయాల్లో విధేయత చూపిస్తున్నారో లేదో నేను తెలుసుకోవాలనుకున్నాను.”—2 కొరిం. 2:9.
“నువ్వు మంచివాడివి, క్షమించడానికి సిద్ధంగా ఉంటావు” అని దావీదు రాశాడు. (కీర్త. 86:5) మీకా ఇలా రాశాడు: “తప్పుల్ని, అపరాధాల్ని క్షమించే నీలాంటి దేవుడు ఎవరు?” (మీకా 7:18) అలాగే యెషయా ఇలా రాశాడు: “దుష్టుడు తన మార్గాన్ని, చెడ్డవాడు తన ఆలోచనల్ని విడిచిపెట్టాలి; అతను యెహోవా దగ్గరికి తిరిగి రావాలి, ఆయన అతని మీద కరుణ చూపిస్తాడు, మన దేవుని దగ్గరికి తిరిగొస్తే, ఆయన అధికంగా క్షమిస్తాడు.” (యెష. 55:7) యెహోవాను అనుకరించాలంటే కొరింథు సంఘం పశ్చాత్తాపపడిన వ్యక్తిని క్షమించాలి, అతన్ని ప్రేమిస్తున్నట్టు భరోసాను ఇవ్వాలని పౌలు చెప్పాడు. వాళ్లు అలా చేయడం ద్వారా, “అన్ని విషయాల్లో విధేయత” చూపించారు. నిజమే ఆ వ్యక్తిని సంఘం నుండి తొలగించి కొన్ని నెలలే అయ్యింది. కానీ అతనికి ఇచ్చిన క్రమశిక్షణ వల్ల అతను పశ్చాత్తాపపడ్డాడు. కాబట్టి ఇప్పుడు అతన్ని సంఘంలోకి తిరిగి చేర్చుకోవడానికి ఆలస్యం చేయడంలో అర్థం లేదు. w24.08 17-18 ¶12-13
సోమవారం, ఆగస్టు 17
“ఒకరు తీసుకెళ్లబడతారు, ఇంకొకరు వదిలేయబడతారు.”—మత్త. 24:40.
పెను మార్పులు చోటు చేసుకోబోయే సమయంలో మనం జీవిస్తున్నాం. త్వరలో భూమ్మీదున్న ప్రతీఒక్కరికి యేసు తీర్పు తీరుస్తాడు. అయితే తీర్పు తీర్చేముందు పరిస్థితులు ఎలా ఉంటాయో తన శిష్యులకు వివరిస్తూ తన “ప్రత్యక్షతకు, ఈ వ్యవస్థ ముగింపుకు సూచన” ఆయన ఇచ్చాడు. (మత్త. 24:3) దానిగురించి మత్తయి 24-25 అధ్యాయాల్లో, మార్కు 13వ అధ్యాయంలో అలాగే లూకా 21వ అధ్యాయంలో చదవచ్చు. మనం సిద్ధంగా ఉండడానికి సహాయం చేసే మూడు ఉదాహరణల్ని యేసు చెప్పాడు. అవి మనకు హెచ్చరికల్లాంటివి. ఆ ఉదాహరణల్లో మొదటిది గొర్రెలకు, మేకలకు సంబంధించినది; రెండవది బుద్ధిగల కన్యలకు, బుద్ధిలేని కన్యలకు సంబంధించినది; మూడవది తలాంతులకు సంబంధించినది. మన పనుల్ని బట్టి యేసు మనకు తీర్పు తీరుస్తాడని అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణలు సహాయం చేస్తాయి. w24.09 20 ¶1-2
మంగళవారం, ఆగస్టు 18
“మీరు చేసే ప్రతీది ప్రేమతో చేయండి.”—1 కొరిం. 16:14.
యేసు ఉంచిన గొప్ప ఆదర్శం గురించి ఆలోచించండి. ఆయన ఏం చేసినా తండ్రి మీద, ప్రజల మీద ఉన్న ప్రేమతోనే చేశాడు. ఆ ప్రేమవల్లే కష్టపడి పనిచేశాడు, ఇతరులు చిన్నచూపు చూసే పనుల్ని కూడా చేయడానికి ముందుకొచ్చాడు. (మత్త. 20:28; యోహా. 13:5, 14, 15) మీకు కూడా ప్రేమ ఉంటే యెహోవా మిమ్మల్ని దీవిస్తాడు, సంఘ పరిచారకుడిగా అవ్వడం లాంటి ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకునేలా సహాయం చేస్తాడు. (1 పేతు. 5:5) లోకంలోని ప్రజలు తమనుతాము గొప్పగా చూపించుకునే వాళ్లను ఇష్టపడతారు. కానీ యెహోవా ప్రజలు అలా కాదు. యేసులా ఇతరుల్ని ప్రేమించే బ్రదర్స్ అధికారం కోసం ఆరాటపడరు, ఇతరుల మీద పెత్తనం చెలాయించరు, నలుగురిలో ఒక హోదా కావాలని కోరుకోరు. అధికార దాహం ఉన్న వ్యక్తి సంఘంలో బాధ్యతల్ని పొందితే, యెహోవా అమూల్యమైన గొర్రెల్ని చూసుకునే విషయంలో కొన్ని చిన్నచిన్న పనులు చేయకపోవచ్చు. అలాంటివి చేస్తే తన స్థాయి తగ్గిపోతుందని అనుకోవచ్చు.—యోహా. 10:12. w24.11 15 ¶6-7
బుధవారం, ఆగస్టు 19
‘పవిత్రశక్తి మిమ్మల్ని పర్యవేక్షకులుగా నియమించింది.’—అపొ. 20:28.
‘మనుషుల్లో వరాలుగా’ సేవచేయడానికి ప్రపంచవ్యాప్తంగా చాలామంది బ్రదర్స్ మనకు అవసరం. (ఎఫె. 4:8) మీరు బాప్తిస్మం తీసుకున్న బ్రదర్ అయితే, ఈ విధంగా సేవ చేయడానికి ముందుకు రాగలరా? (సామె. 3:27) సంఘ పరిచారకుడిగా సేవచేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోగలరా? మీరు ఇప్పటికే సంఘ పరిచారకులైతే, సంఘపెద్ద అవ్వాలనే లక్ష్యాన్ని పెట్టుకోగలరా? రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు అప్లయి చేయడానికి మీ జీవితంలో సర్దుబాట్లు చేసుకోగలరా? ఆ పాఠశాల వల్ల యేసు మిమ్మల్ని ఇంకా బాగా ఉపయోగించుకునేలా మీరు ట్రైనింగ్ పొందుతారు. ఒకవేళ ఇవేవీ చేయలేరని మీకు అనిపిస్తే యెహోవాకు ప్రార్థన చేయండి. మీకు ఎలాంటి పని అప్పగించినా దాన్ని బాగా చేయడానికి తన పవిత్రశక్తిని ఇవ్వమని అడగండి. (లూకా 11:13) ఈ చివరిరోజుల్లో యేసు మనల్ని నడిపిస్తున్నాడు అనడానికి ‘మనుషుల్లో వరాలుగా’ ఉన్న ఈ బ్రదర్సే రుజువు. (మత్త. 28:20) ప్రేమ చూపిస్తూ, పెద్ద మనసుతో మనల్ని పట్టించుకుంటూ రాజైన యేసు మన అవసరాల్ని తీర్చడానికి ఈ బ్రదర్స్‌ని ఇచ్చినందుకు మనం ఆయనకు ఎంత కృతజ్ఞులమో కదా! w24.10 23 ¶16-17
గురువారం, ఆగస్టు 20
“పాత సంగతులు గుర్తుకురావు.”—యెష. 65:17.
మరి దేవుని ప్రజల బాధకు, వేదనకు కారణమైన వాటి సంగతేంటి? మెల్లమెల్లగా అవి “మరవబడతాయి; అవి [దేవుని] కళ్లకు కనిపించకుండా దాచబడతాయి.” (యెష. 65:16) యెహోవా మన కష్టాలన్నిటినీ తీరుస్తాడు, కాలం గడుస్తుండగా గతం తాలూకు చేదు జ్ఞాపకాలన్నిటినీ తుడిచేస్తాడు. ఇప్పుడు కూడా, మనం మీటింగ్స్‌కి వెళ్లినప్పుడు ప్రశాంతతను, సేదదీర్పును పొందుతాం. ఈ లోకంలో మనకున్న టెన్షన్స్ అన్నీ మర్చిపోతాం. అంతేకాదు మనం ప్రేమ, సంతోషం, శాంతి, దయ, సౌమ్యత లాంటి పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్ని చూపించినప్పుడు, ఆధ్యాత్మిక పరదైసులో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకుంటాం. (గల. 5:22, 23) యెహోవా సంస్థలో ఒకరిగా ఉండడం నిజంగా ఒక గొప్ప దీవెన! ఆధ్యాత్మిక పరదైసులో ఉన్నవాళ్లు “కొత్త ఆకాశం, కొత్త భూమి” గురించి దేవుడిచ్చిన మాట పూర్తిగా నెరవేరడం చూస్తారు. w24.04 22 ¶9-10
శుక్రవారం, ఆగస్టు 21
“ఒక వ్యక్తి తొందరపడి, ‘ప్రతిష్ఠితం’ అని చెప్పి, ఆ తర్వాత తన మొక్కుబడి గురించి మళ్లీ ఆలోచించడం అతనికి ఉరిలా ఉంటుంది.”—సామె. 20:25.
పెళ్లి చేసుకోవాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం కోసం గడిపే సమయం చాలా సంతోషంగా గడిపే సమయమే అయినా, అది ఆషామాషీ విషయం కాదు. ఎందుకంటే అది పెళ్లికి నడిపించవచ్చు. పెళ్లి రోజున వధూవరులు తాము కలిసి జీవించినంతకాలం ఒకరినొకరు ప్రేమిస్తూ, గౌరవిస్తూ ఉంటామని యెహోవా ముందు ప్రమాణం చేస్తారు. మనం దేని గురించైనా ప్రమాణం చేసే ముందు దానిగురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పెళ్లి ప్రమాణాల విషయంలో కూడా అంతే. పెళ్లి చేసుకోవాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం కోసం గడిపే సమయం అమ్మాయి, అబ్బాయి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి, అలాగే మంచి నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో, వాళ్లు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో, వాళ్లు ఆ ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేయాలని నిర్ణయించుకోవచ్చు. ఒకవేళ ఆ ప్రయాణం మధ్యలోనే ఆగిపోతే, వాళ్లు వెచ్చించిన టైమ్ అంతా వేస్ట్ అయినట్టేనా? కాదు. ఎందుకంటే, ఎదుటివ్యక్తిని పెళ్లి చేసుకోవాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి ఆ సమయం ఉపయోగపడింది. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం కోసం గడిపే సమయం విషయంలో సరైన ఆలోచనను కలిగి ఉండడం ఎందుకు ప్రాముఖ్యం? ఎందుకంటే సరైన ఆలోచన ఉన్నప్పుడు వాళ్లు ఏదో సరదా కోసం కాదుగానీ పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశంతో మాత్రమే అలా సమయం గడుపుతారు. w24.05 26-27 ¶3-4
శనివారం, ఆగస్టు 22
“మన ప్రభువు గురించిన సాక్ష్యం విషయంలో . . . సిగ్గుపడకు.”—2 తిమో. 1:8.
తమ నమ్మకాల గురించి వేరేవాళ్లకు చెప్పడానికి పిల్లలు భయపడుతుండవచ్చు. ఉదాహరణకు, పరిణామం లేదా ఎవల్యూషన్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు పిల్లలకు ధైర్యం సరిపోకపోవచ్చు. ఎందుకంటే అది ఒక సిద్ధాంతం మాత్రమే కాదు, అదే కరెక్ట్ అన్నట్టు టీచర్లు బల్లగుద్ది చెప్తుంటారు. తమ నమ్మకాల గురించి చెప్పడానికి తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు? సృష్టికర్త ఉన్నాడని మీ పిల్లలు నమ్ముతున్నందుకు సిగ్గుపడాల్సిన పనేమీ లేదని వాళ్లకు భరోసా ఇవ్వండి. ఎందుకంటే చాలామంది సైంటిస్ట్‌లు మనచుట్టూ ఉన్నవి వాటంతట అవే వచ్చేశాయని నమ్మరు. ఈ అద్భుతమైన సృష్టి వెనక తెలివైనవాళ్లు ఉన్నారని సైంటిస్ట్‌లు కూడా అనుకుంటారు. కాబట్టి ఎవల్యూషన్ కరెక్ట్ అని వాళ్లు అనుకోరు. అంతేకాదు వేరే బ్రదర్స్‌సిస్టర్స్ సృష్టికర్తను ఎందుకు నమ్ముతున్నారో తెలుసుకోవడం వల్ల మీ పిల్లలు విశ్వాసాన్ని, ధైర్యాన్ని పెంచుకోగలుగుతారు. w24.12 18 ¶14-15
ఆదివారం, ఆగస్టు 23
‘యేసు పవిత్రశక్తితో నిండిపోయి ఎంతో సంతోషించాడు.’—లూకా 10:21.
కొంతమందైనా మంచివార్తను వింటారని యేసు నమ్మకంతో ఉన్నాడు. అందుకే ఆయన ఉత్సాహంగా ప్రీచింగ్ చేయగలిగాడు. ఉదాహరణకు క్రీ.శ. 30 చివర్లో తన పరిచర్య పనికి స్పందించేవాళ్లు చాలామంది ఉన్నారని యేసు గమనించాడు. అందుకే పంట కోతకు సిద్ధంగా ఉందని ఆయన చెప్పాడు. (యోహా. 4:35) దాదాపు ఒక సంవత్సరం తర్వాత తన శిష్యులకు ఆయన ఇలా చెప్పాడు: “కోయాల్సిన పంట చాలా ఉంది.” (మత్త. 9:37, 38) ఆ తర్వాత మళ్లీ దానిగురించి చెప్తూ “కోయాల్సిన పంట చాలా ఉంది, . . . కాబట్టి తన పంట కోయడానికి పనివాళ్లను పంపించమని కోత యజమానిని వేడుకోండి” అని అన్నాడు. (లూకా 10:2) మంచివార్తకు స్పందించే ప్రజలు తప్పకుండా ఉంటారనే నమ్మకంతో యేసు ఉన్నాడు, వాళ్లు అలా స్పందించినప్పుడు ఆయన సంతోషించాడు. తాము ప్రకటించే సందేశానికి అద్భుతమైన ఫలితాలు వస్తాయని యేసు గుర్తుచేయడం వల్ల శిష్యులు తమ ఉత్సాహాన్ని కాపాడుకోగలిగారు. w25.03 18-19 ¶15-16
సోమవారం, ఆగస్టు 24
“నా దేవుడే నా ఆశ్రయదుర్గం.”—కీర్త. 94:22.
యెహోవా ఆశ్రయంగా ఉంటాడు. ఒక భయంకరమైన తుఫాను నుండి ఒక వ్యక్తి తననుతాను కాపాడుకోవడానికి ఒక పెద్ద బండరాయి వెనుక దాక్కుంటాడు. అలాగే మన ప్రాణాలు ప్రమాదంలో పడే పరిస్థితులు వచ్చినప్పుడు యెహోవా మనకు ఆశ్రయంగా ఉంటాడు. ఆయనతో మనకున్న బంధాన్ని కాపాడుకోవడానికి ఆయన సహాయం చేస్తాడు. అలాగే మనకున్న కష్టాలు మనకు శాశ్వత హాని చేయకుండా చూస్తాడు. అంతేకాదు, మన శాంతిభద్రతలకు అడ్డొచ్చే దేన్నైనా త్వరలోనే తీసేస్తానని ఆయన మాటిస్తున్నాడు. (యెహె. 34:25, 26) యెహోవాను బండరాయి లాంటి ఆశ్రయంగా చేసుకునే ఒక విధానం ఏంటంటే, ఆయనకు ప్రార్థించడం. మనం ప్రార్థన చేసినప్పుడు మన మనస్సును, హృదయాన్ని కాపాడే ‘దేవుని శాంతిని’ యెహోవా ఇస్తాడు. (ఫిలి. 4:6, 7) యెహోవా మనకోసం ఎప్పుడూ ఉంటాడు. ఆయన ‘నిత్య బండరాయిలా’ ఉంటాడు కాబట్టి ఆయన్ని మనం నమ్మవచ్చు. (యెష. 26:3, 4) తన మాట నిలబెట్టుకోవడానికి, మన ప్రార్థనలు వినడానికి, అవసరమైనప్పుడు మనకు సహాయం చేయడానికి ఆయన ఎప్పుడూ సజీవంగా ఉంటాడు. తనను ఆరాధించేవాళ్లకు ఆయన విశ్వసనీయంగా ఉంటాడు కాబట్టి మనం ఆయనపై ఆధారపడవచ్చు. (2 సమూ. 22:26) అంతేకాదు, మనం చేసే దాన్ని ఆయన ఎన్నడూ మర్చిపోడు. అలాగే ఆయన ఎప్పుడూ ప్రతిఫలం ఇస్తాడు.—హెబ్రీ. 6:10; 11:6. w24.06 27 ¶4-6
మంగళవారం, ఆగస్టు 25
“నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో, ఎందుకంటే దానిలో నుండే జీవపు ఊటలు బయల్దేరతాయి.”—సామె. 4:23.
ఖాళీ సమయంలో మనం ఏం చూస్తున్నామో జాగ్రత్తగా గమనించుకోవాలి. అలాగే మంచి స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి, డబ్బే జీవితం అవ్వకుండా చూసుకోవాలి. యెహోవా మీద మన ప్రేమను ఏదైనా తగ్గిస్తుందని గమనిస్తే, వెంటనే చర్య తీసుకోవాలి. (మత్త. 5:29, 30) నిండు హృదయంతో యెహోవాను సేవించకుండా చేసేవాటి నుండి మనం జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక పనుల్లో బిజీగా ఉన్నాం కాబట్టి చెడ్డ విషయాలు మనమీద ప్రభావం చూపించవు అనుకోవచ్చు. కానీ అది పొరపాటు. ఉదాహరణకు, మండుతున్న ఎండలో నుండి ఇంటికి వచ్చినప్పుడు ఎ.సి. వేశాక తలుపులన్నీ తెరిచే పెడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? వేడి గాలంతా లోపలికి వస్తుంది. అదేవిధంగా, యెహోవాతో ఉన్న బంధాన్ని కాపాడుకోవడానికి మనం ఆధ్యాత్మిక ఆహారం తీసుకుంటే సరిపోదు. వేడి “గాలి” లాంటి ఈ లోక వైఖరి మన లోపలికి వెళ్లి, యెహోవా మీద ఉన్న ప్రేమను తగ్గించకుండా మన హృదయ తలుపును మూసేయాలి.—ఎఫె. 2:2. w24.07 21 ¶6-7
బుధవారం, ఆగస్టు 26
“మీ శత్రువుల్ని ప్రేమిస్తూ ఉండండి, మిమ్మల్ని హింసించేవాళ్ల కోసం ప్రార్థిస్తూ ఉండండి.”—మత్త. 5:44.
యేసు సహించిన అన్యాయాన్ని, అవమానాన్ని, పడ్డ వేదనను మనం పూర్తిగా అర్థం చేసుకోలేం. అయినాసరే, ఆయన చెడును తనపై విజయం సాధించనివ్వలేదు. తనను కొయ్యమీద వేలాడదీసిన సైనికుల్ని శిక్షించమని అడిగే బదులు ఆయన యెహోవాకు ఇలా ప్రార్థించాడు: “తండ్రీ, వీళ్లను క్షమించు. వీళ్లు ఏంచేస్తున్నారో వీళ్లకు తెలీదు.” (లూకా 23:34) మనతో చెడుగా ప్రవర్తించిన వాళ్లకోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్లమీద కోపావేశాలు తగ్గిపోవచ్చు, వాళ్లమీద మనకున్న అభిప్రాయం కూడా మారవచ్చు. ఈ లోకం అంతమయ్యే వరకు మన జీవితంలో ఇంకా ఎన్ని అన్యాయాలు సహించాల్సి రావచ్చో చెప్పలేం. కానీ ఏదేమైనా సహాయం కోసం యెహోవాకు మానకుండా ప్రార్థన చేస్తూ ఉందాం. అన్యాయం జరిగితే యేసులా ఉందాం, బైబిలు సూత్రాల్ని పాటిద్దాం. అప్పుడు మనం ఖచ్చితంగా యెహోవా నుండి దీవెనలు పొందుతాం.—1 పేతు. 3:8, 9. w24.11 6 ¶16; 7 ¶17, 19
గురువారం, ఆగస్టు 27
“నువ్వు దుష్టత్వాన్ని చూసి సంతోషించే దేవుడివి కాదు; చెడ్డవాళ్లెవ్వరికీ నీ దగ్గర చోటులేదు.”—కీర్త. 5:4.
యెహోవా తప్పును చూసీచూడనట్లు వదిలేసే దేవుడు కాదు; ఆయన అన్నిరకాల పాపాల్ని అసహ్యించుకుంటాడు. (కీర్త. 5:4-6) బైబిల్లోని నియమాల్ని మనం పాటించాలని ఆయన కోరుకుంటున్నాడు. నిజమే, ఆయన అపరిపూర్ణ మనుషుల నుండి పరిపూర్ణతను ఆశించడు. (కీర్త. 130:3, 4) అలాగని “దేవుని అపారదయను అలుసుగా తీసుకుని లెక్కలేనట్టు” ప్రవర్తిస్తే సహించడు. (యూదా 4) హార్‌మెగిద్దోన్ యుద్ధంలో ‘భక్తిహీనులు నాశనమౌతారని’ బైబిలు చెప్తుంది. (2 పేతు. 3:7; ప్రక. 16:16) అయితే, యెహోవాకు ఎవ్వరూ నాశనమవ్వడం ఇష్టంలేదు. ఆయన “అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని కోరుకుంటున్నాడు.” (2 పేతు. 3:9) పాపం చేసినవాళ్లు తమ ప్రవర్తనను మార్చుకుని, మళ్లీ దేవునికి దగ్గరవ్వడానికి సంఘపెద్దలు యెహోవాలా ఓర్పుగా సహాయం చేస్తారు. కానీ పాపం చేసిన ప్రతీ వ్యక్తి మారకపోవచ్చు. w24.08 26 ¶1-2
శుక్రవారం, ఆగస్టు 28
“నువ్వు నీ గుప్పిలి విప్పి ప్రతీ జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు.”—కీర్త. 145:16.
మనం కూడా యెహోవాలాగే ఇతరుల మీద ప్రేమతో వాళ్లకు అవసరమైనవి ఇవ్వచ్చు. ఉదాహరణకు బట్టలు, ఆహారం అవసరమైన బ్రదర్స్‌సిస్టర్స్ ఎవరైనా మీకు తెలుసా? వాళ్ల అవసరాలు తీర్చడానికి యెహోవా మిమ్మల్ని ఉపయోగించుకోవచ్చు. విపత్తు వచ్చినప్పుడు వేరేవాళ్లకు సహాయం చేయడంలో యెహోవా ప్రజలు ముందుంటారు. అంతెందుకు కోవిడ్ వచ్చినప్పుడు అవసరంలో ఉన్నవాళ్లకు బట్టల్ని, ఆహారాన్ని, ఇతర వస్తువుల్ని మన బ్రదర్స్‌సిస్టర్స్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్త పనికోసం చాలామంది మనస్ఫూర్తిగా విరాళాలు కూడా ఇచ్చారు. ప్రపంచంలో విపత్తులు ఎక్కడొచ్చినా సహాయక చర్యలకు ఆ విరాళాలు బాగా ఉపయోగపడ్డాయి. అలా సహాయం చేసిన బ్రదర్స్‌సిస్టర్స్ హెబ్రీయులు 13:16 లో ఉన్న ఈ మాటల్ని పాటించారు: “మంచి చేయడం, మీకున్న వాటిని ఇతరులతో పంచుకోవడం మర్చిపోకండి. అలాంటి బలులు దేవునికి చాలా ఇష్టం.” w24.09 27 ¶6-7
శనివారం, ఆగస్టు 29
“మీరు ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకోవాలి.”—ఫిలి. 1:10.
ఈ పరిస్థితి గురించి ఆలోచించండి. మీరు మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక ఉద్యోగం కోసం చూస్తున్నారు. మీకు రెండు ఆఫర్లు వచ్చాయి. అయితే, మీరు వాస్తవాలన్నీ తెలుసుకున్నారు, అంటే ఎలాంటి పనిచేయాలి, ఎప్పటి నుండి ఎప్పటివరకు పనిచేయాలి, ప్రయాణించడానికి ఎంత టైం పడుతుంది, ఇలా చాలా విషయాలు కనుక్కున్నారు. అయితే ఈ రెండిట్లో బైబిలుకు విరుద్ధమైన పనులేవీ చేయాల్సిన అవసరంలేదు. కాబట్టి ఆ రెండిట్లో ఏ ఉద్యోగం మీకు నచ్చుతుందో లేదా ఎందులో ఎక్కువ జీతం వస్తుందో చూసుకొని దాన్నే ఎంచుకోవాలని అనుకోవచ్చు. కానీ ఒక నిర్ణయానికి వచ్చే ముందు మీరు ఆలోచించాల్సిన వేరే విషయాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, ఆ రెండు ఉద్యోగాల్లో ఏదైనా మీటింగ్‌కి అడ్డొస్తుందా? లేదా మీ కుటుంబ సభ్యుల్ని పట్టించుకోవడానికి, వాళ్లు యెహోవాకు దగ్గరయ్యేలా సహాయం చేయడానికి సమయం మిగిలిద్దా? ఇలాంటి ప్రశ్నలు వేసుకోవడం వల్ల మీరు డబ్బు కన్నా “ఎక్కువ ప్రాముఖ్యమైన వాటికి” అంటే మీ ఆరాధనకు, మీ కుటుంబ సభ్యుల అవసరాలకు మొదటిస్థానం ఇవ్వగలుగుతారు. అలా యెహోవా దీవించే నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. w25.01 17 ¶11-13
ఆదివారం, ఆగస్టు 30
“విరిగిన హృదయంగలవాళ్లకు యెహోవా దగ్గరగా ఉంటాడు.”—కీర్త. 34:18.
వేరేవాళ్లు మిమ్మల్ని ఎలా చూసినా, యెహోవా మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని, ఆయనకు మీరు చాలా విలువైనవాళ్లని మీరు పూర్తిగా నమ్మవచ్చు. ఒకవేళ మీరు బాధతో ‘నలిగిపోతుంటే,’ యెహోవా మీలో మంచిని చూసి తనవైపుకు ఆకర్షించుకున్నాడు అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. (యోహా. 6:44) మీకు సహాయం చేయడానికి ఆయన ఎప్పుడూ రెడీగా ఉంటాడు. ఎందుకంటే మీరు ఆయనకు చాలా స్పెషల్. మన గురించి యెహోవా ఎలా ఫీల్ అవుతాడో తెలుసుకోవడానికి యేసు ఉదాహరణ సహాయం చేస్తుంది. సమాజం చిన్నచూపు చూసిన వాళ్లను యేసు పట్టించుకున్నాడు, వాళ్లమీద కనికరం చూపించాడు. (మత్త. 9:9-12) చాలా ఏళ్లుగా పెద్ద జబ్బుతో బాధపడుతున్న ఒకామె బాగవ్వాలనే ఆశతో యేసు బట్టల్ని ముట్టుకుంది. అప్పుడు యేసు ఆమెను ఓదార్చాడు, ఆమె చూపించిన విశ్వాసాన్నిబట్టి మెచ్చుకున్నాడు. (మార్కు 5:25-34) యేసు తన తండ్రి ఎలా ఉంటాడో మనకు చూపించాడు. (యోహా. 14:9) కాబట్టి యెహోవాకు మీరు విలువైనవాళ్లు, అలాగే మీకున్న విశ్వాసం, ప్రేమ లాంటి మంచి లక్షణాల్ని ఆయన తప్పకుండా చూస్తున్నాడు అనే నమ్మకంతో ఉండండి. w24.10 7 ¶4-5
సోమవారం, ఆగస్టు 31
“నా కన్నీళ్లను నీ తోలుసంచిలో ఉంచు.”—కీర్త. 56:8.
కన్నీళ్లను మిగిల్చే ఎన్నో పెద్దపెద్ద కష్టాల్ని దావీదు చూశాడు. చాలామంది ఆయన ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నించారు, తన వెన్నంటే ఉండాల్సినవాళ్లే వెన్నుపోటు పొడిచారు. (1 సమూ. 19:10, 11; 2 సమూ. 15:10-14, 30) ఒకసారి ఆయన ఇలా రాశాడు: “నా మూల్గులతో నేను నీరసించిపోయాను; రాత్రంతా నా పరుపు కన్నీళ్లతో తడిచిపోతోంది; నా మంచం కన్నీళ్లలో మునిగిపోతోంది.” తనను వేధించేవాళ్ల వల్ల ఇలా జరిగిందని ఆయన తర్వాత రాశాడు. (కీర్త. 6:6) ఎన్ని పెద్దపెద్ద కష్టాలు వచ్చినా యెహోవా తనను ప్రేమిస్తున్నాడనే విషయంలో దావీదుకు ఏ సందేహం లేదు. ఆయన ఇలా రాశాడు: “యెహోవా నా రోదనను వింటాడు.” (కీర్త. 6:8) మన దినవచనంలోని మాటలు యెహోవా మనల్ని అపురూపంగా చూసుకుంటున్నాడని స్పష్టం చేస్తున్నాయి. యెహోవా మన కన్నీళ్లను ఒక బాటిల్‌లో పెట్టుకుంటున్నాడని లేదా వాటిగురించి ఒక పుస్తకంలో రాసుకుంటున్నాడని దావీదుకు అనిపించింది. తను అనుభవిస్తున్న నొప్పిని యెహోవా గమనించి, గుర్తుపెట్టుకుంటాడని దావీదు పూర్తిగా నమ్మాడు. అయితే తనకు ఎలాంటి సమస్యలు వచ్చాయనే కాదు, వాటివల్ల తనకు ఎలా అనిపించిందో కూడా తన ప్రేమగల పరలోక తండ్రి గమనిస్తున్నాడని దావీదు గట్టిగా నమ్మాడు. w24.12 22 ¶11-12