కుటుంబమంతా కలిసి దేవుని వాక్యాన్ని క్రమంగా చదవండి
“మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును.”—మత్తయి 4:4.
1. కుటుంబ శిరస్సులు తమ పిల్లలకు యెహోవా మార్గాల్ని బోధించాలన్న తమ బాధ్యతను గురించి బైబిలు ఏమి చెబుతుంది?
కుటుంబ శిరస్సులు తమ పిల్లలకు బోధించాల్సిన బాధ్యత ఉందని యెహోవా దేవుడు వారికి తరచుగా జ్ఞాపికలను ఇచ్చాడు. అటువంటి ఉపదేశము పిల్లల్ని ప్రస్తుత జీవితానికి సంసిద్ధుల్ని చేస్తుంది; అంతేగాక భావి జీవితానికి సిద్ధమవ్వడానికి కూడా వారికి సహాయం చేయగలదు. తన ఇంటివారు “యెహోవా మార్గమును గైకొను”నట్లు వారికి బోధించే బాధ్యత అబ్రాహాముకు ఉందని దేవునికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక దేవదూత ఆయనకు ఎత్తిచూపాడు. (ఆదికాండము 18:19) దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి ఎలా విమోచించాడో, వారికి హోరేబులో సీనాయి పర్వతం మీద తన ధర్మశాస్త్రాన్ని ఎలా ఇచ్చాడో తమ పిల్లలకు వివరించాలని ఇశ్రాయేలీయుల్లోని తల్లిదండ్రులకు చెప్పబడింది. (నిర్గమకాండము 13:8, 9; ద్వితీయోపదేశకాండము 4:9, 10; 11:18-21) క్రైస్తవ కుటుంబ శిరస్సులు తమ పిల్లల్ని “ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను” పెంచాలని ఉద్బోధించబడ్డారు. (ఎఫెసీయులు 6:4) తల్లిదండ్రుల్లో ఒక్కరు మాత్రమే యెహోవాను సేవిస్తున్నప్పటికీ ఆ ఒక్కరే పిల్లలకు యెహోవా మార్గాలను బోధించడానికి కృషి చేయాలి.—2 తిమోతి 1:5; 3:14, 15.
2. పిల్లలు లేకపోయినప్పుడు కుటుంబ పఠనం అవసరమా? వివరించండి.
2 దీనర్థం దేవుని వాక్యాన్ని గూర్చిన కుటుంబ పఠనం, పిల్లలు ఉన్న గృహాలకు మాత్రమేనని కాదు. పిల్లలు లేకపోయినప్పటికీ భార్యాభర్తలు కలిసి కుటుంబ పఠనం చేసుకున్నప్పుడు ఆధ్యాత్మిక విషయాలపట్ల ఇది చక్కని మెప్పుదలను కనపరుస్తుంది.—ఎఫెసీయులు 5:25, 26.
3. కుటుంబ పఠనం క్రమంగా చేయడం ఎందుకు ప్రాముఖ్యం?
3 అత్యధిక ప్రయోజనాన్ని పొందేందుకు ఉపదేశాన్ని క్రమంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇది అరణ్యంలో యెహోవా ఇశ్రాయేలీయులకు నేర్పించిన ఈ పాఠానికి అనుగుణ్యంగా ఉంది: “ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రదుకుదు[రు].” (ద్వితీయోపదేశకాండము 8:3) కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని కుటుంబాలు వారపు పఠనాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు; ఇతర కుటుంబాలు అనుదిన ప్రాతిపదికన కాస్త తక్కువ నిడివిగల పఠనాలను ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు చేసుకున్న ఏర్పాటు ఏదైనప్పటికీ పఠనాన్ని వీలైతే చేయడం లేకపోతే మానేయడంగా ఉంచకండి. దానికోసం ‘సమయాన్ని కొనండి.’ అటువంటి సమయం కోసం ఎంత మూల్యాన్ని చెల్లించాల్సివచ్చినప్పటికీ అది స్వస్థబుద్ధితో పెట్టుబడిపెట్టడం వంటిదే. ఎందుకంటే మీ కుటుంబ సభ్యుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి.—ఎఫెసీయులు 5:15-17, NW; ఫిలిప్పీయులు 3:16.
మనస్సులో ఉంచుకోవల్సిన లక్ష్యాలు
4, 5. (ఎ) తమ పిల్లలకు బోధించడం విషయంలో, యెహోవా మోషే ద్వారా, తల్లిదండ్రుల ఎదుట ఏ ప్రాముఖ్యమైన లక్ష్యాన్ని ఉంచాడు? (బి) నేడు అందులో ఏమి ఇమిడివుంది?
4 మీరు కుటుంబ పఠనాన్ని నిర్వహిస్తున్నప్పుడు, దాని లక్ష్యాలను మీ మనస్సులో స్పష్టంగా ఉంచుకున్నప్పుడు అత్యధికమైన ప్రయోజనాల్ని సాధించగలరు. లక్ష్యాలుగా ఉండదగ్గ కొన్నింటిని పరిశీలించండి.
5 ప్రతి పఠనంలోను, యెహోవా దేవునిపట్ల ప్రేమను పెంపొందించడానికి ప్రయత్నించండి. ఇశ్రాయేలీయులు వాగ్దత్త దేశంలోకి ప్రవేశించడానికి ముందు వారు మోయాబు మైదానాల్లో సమావేశమైనప్పుడు, అటుతర్వాత యేసుక్రీస్తు “ముఖ్యమైన ఆజ్ఞ”గా గుర్తించిన దానివైపు మోషే వారి అవధానాన్ని మళ్లించాడు. ఏమిటది? “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.” (మత్తయి 22:36, 37; ద్వితీయోపదేశకాండము 6:5) దీన్ని తమ సొంత హృదయాలపై నాటుకునేలా చేసుకోమనీ, తమ పిల్లలకు నేర్పించమనీ ఇశ్రాయేలీయులకు మోషే ఉద్బోధించాడు. ఇందుకు పునరుక్తి అవసరమౌతుంది, ఇందుకు యెహోవాను ప్రేమించడానికిగల కారణాలవైపు అవధానాన్ని ఆకర్షించడమూ, అటువంటి ప్రేమను వ్యక్తపర్చడాన్ని ఆటంకపర్చే వైఖరులనూ ప్రవర్తననూ ఎదుర్కోవడమూ, తమ సొంత జీవితాల్లో యెహోవాపట్ల ప్రేమను ప్రదర్శించడమూ అవసరమౌతుంది. మన పిల్లలకు అటువంటి ఉపదేశమే అవసరమా? అవును, అవసరమే! ‘తమ హృదయములకు ఛేదనసంస్కారము’ చేసుకోవడానికి అంటే దేవునిపట్ల తమకుగల ప్రేమను ఆటంకపర్చే దేన్నైనా తీసివేసుకోవడానికి వారికి కూడా సహాయం అవసరం. (ద్వితీయోపదేశకాండము 10:12, 16; యిర్మీయా 4:4, అధఃసూచి.) లోకంలో ఉన్నవాటిపట్ల ఆశ, దాని కార్యకలాపాల్లో మునిగిపోయేందుకు ఎదురయ్యే అవకాశాలపట్ల ఆశ అనేవి అటువంటి ఆటంకాల్లో కొన్ని. (1 యోహాను 2:15, 16) యెహోవాపట్ల ప్రేమ క్రియాశీలంగా ఉండాలి, అభివ్యక్తమయ్యేదిగా ఉండాలి, మన పరలోకపు తండ్రిని ప్రీతిపర్చే పనుల్ని చేసేందుకు మనల్ని కదిలించేదిగా ఉండాలి. (1 యోహాను 5:3) మీ కుటుంబ పఠనం దీర్ఘకాలిక ప్రయోజనాల్ని తీసుకురావాలంటే ప్రతి పఠనమూ ఈ ప్రేమను బలపర్చే విధంగా నిర్వహించబడాలి.
6. (ఎ) కచ్చితమైన జ్ఞానాన్ని అందించడానికి ఏమి అవసరం? (బి) కచ్చితమైన జ్ఞానం ప్రాముఖ్యతను లేఖనాలు ఎలా నొక్కిచెబుతున్నాయి?
6 దేవుడు కోరేవాటిని గురించి కచ్చితమైన జ్ఞానాన్ని అందజేయండి. ఇందులో ఏమి ఇమిడివుంది? ఇందులో ఒక పత్రిక నుండో లేదా ఒక పుస్తకం నుండో జవాబును చదివేయగల్గడం కన్నా ఎక్కువ ఇమిడివుంది. సాధారణంగా ఇందుకు, కీలకమైన పదాలు, ప్రధానమైన తలంపులు స్పష్టంగా అర్థమయ్యాయో లేదో నిశ్చయపర్చుకోవడానికి చేసే చర్చ అవసరమౌతుంది. నూతన వ్యక్తిత్వాన్ని ధరించుకోవడానికీ, జీవితంలోని సమస్యలతో వ్యవహరించేటప్పుడు మరిప్రాముఖ్యమైన అంశములపై అవధానం కేంద్రీకరించడానికీ, తద్వారా నిజంగా దేవునికి ప్రీతికరమైనది చేయడానికీ కచ్చితమైన జ్ఞానము ఒక కీలకమైన అంశం.—ఫిలిప్పీయులు 1:9-11; కొలొస్సయులు 1:9, 10; 3:10.
7. (ఎ) ఎటువంటి ప్రశ్నల్ని ఉపయోగించడం పఠిస్తున్న సమాచారానికి ఆచరణాత్మకమైన అన్వయింపును చేయడానికి కుటుంబానికి సహాయం చేస్తుంది? (బి) అటువంటి లక్ష్యంలో ఉన్న విలువను లేఖనాలు ఎలా నొక్కిచెబుతున్నాయి?
7 నేర్చుకున్నవాటిని ఆచరణయోగ్యంగా అన్వయించుకోవడానికి సహాయం చేయండి. ఈ లక్ష్యాన్ని మనస్సులో ఉంచుకుని ప్రతి కుటుంబ పఠనంలోను ఇలా ప్రశ్నించండి: ‘ఈ సమాచారం మన జీవితాల్ని ఎలా ప్రభావితం చేయాలి? మనం ప్రస్తుతం చేస్తున్న దేనిలోనైనా మార్పుచేసుకోవాలని ఈ సమాచారం చెబుతుందా? మనం సర్దుబాట్లు చేసుకోవాలని ఎందుకు కోరుకోవాలి?’ (సామెతలు 2:10-15; 9:10; యెషయా 48:17, 18) నేర్చుకున్నవాటి ఆచరణయోగ్యమైన అన్వయింపుకు సరిపడినంత అవధానాన్నివ్వడం కుటుంబ సభ్యుల ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రాముఖ్యమైన కారకం కాగలదు.
బోధనా ఉపకరణాల్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించండి
8. బైబిలు పఠనం కోసం ఎటువంటి ఉపకరణాలను దాసుని తరగతి అందించింది?
8 ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ పఠనం కోసం ఉపయోగించదగ్గ ఉపకరణాల్ని మెండుగా దయచేశాడు. బైబిలుతోపాటు ఉపయోగించడానికి రూపొందించబడ్డ కావలికోట పత్రిక 131 భాషల్లో అందుబాటులో ఉంది. బైబిలు పఠనం కోసం 153 భాషల్లో పుస్తకాలున్నాయి, 284 భాషల్లో బ్రోషూర్లున్నాయి, 61 భాషల్లో ఆడియో క్యాసెట్లున్నాయి, 41 భాషల్లో వీడియో క్యాసెట్లున్నాయి, చివరికి 9 భాషల్లో బైబిలు పరిశోధన కోసం కంప్యూటర్ ప్రోగ్రాములున్నాయి!—మత్తయి 24:45-47.
9. కుటుంబ కావలికోట పఠనాన్ని జరుపుకునేటప్పుడు ఈ పేరాలో ఇవ్వబడిన ఎత్తివ్రాయబడని లేఖనాల్లోని సలహాను మనం ఎలా అన్వయించుకోవచ్చు?
9 అనేక కుటుంబాలు, కుటుంబ పఠన సమయాన్ని సంఘంలో నిర్వహించబడే కావలికోట పఠనంకోసం సిద్ధపడటానికి ఉపయోగిస్తారు. అదెంత సహాయకరంగా ఉండగలదో కదా! ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవా ప్రజలకు క్షేమాభివృద్ధి కలుగజేయడానికి కావలికోటలో ప్రధానమైన ఆధ్యాత్మిక ఆహారం ఉంటుంది. మీరు కుటుంబంగా కావలికోటను పఠించేటప్పుడు కేవలం పేరాలను చదవడం, క్రిందనున్న ప్రశ్నలకు జవాబులివ్వడంతో సరిపెట్టుకోకండి. హృదయపూర్వకంగా వివేచన కోసం వెదకండి. అక్కడ ఉన్న ఎత్తివ్రాయబడని లేఖనాలను బైబిలులో తీసి చదవడానికి సమయం వెచ్చించండి. ఈ లేఖనాలు చర్చించబడుతున్న పేరాకు ఎలా సంబంధం కల్గివున్నాయో వ్యాఖ్యానించమని కుటుంబ సభ్యుల్ని కోరండి. హృదయాల్ని అందులో ఇమడ్చండి.—సామెతలు 4:7, 23; అపొస్తలుల కార్యములు 17:11.
10. పఠనంలో పిల్లల్ని ఇమడ్చి, దాన్ని వారు కూడా ఆనందించదగ్గ సమయంగా చేయడానికి ఏమి చేయవచ్చు?
10 మీ కుటుంబంలో పిల్లలు ఉన్నట్లైతే, మీ పఠనాన్ని ఏదో కుటుంబం పాటించే మతాచారంలా మాత్రమే కాకుండా, క్షేమాభివృద్ధిని కలుగజేసే, ఆసక్తిని రేకెత్తించే, ఆనందాన్ని తీసుకువచ్చే సమయంగా చేయడానికి మీరు ఏమి చేయగలరు? పఠిస్తున్న సమాచారంపైనే అవధానం కేంద్రీకృతమై ఉండేలా ప్రతి ఒక్కర్నీ యుక్తమైన రీతిలో చర్చలో చేర్చుకునేందుకు కృషిచేయండి. సాధ్యమైన చోట్ల ప్రతి పిల్లవానికి సొంత బైబిలు, పఠిస్తున్న పత్రిక ఉండేలా ఏర్పాటు చేయండి. యేసు ప్రదర్శించిన హృదయపూర్వకమైన వాత్సల్యాన్ని అనుకరిస్తూ తల్లిగానీ తండ్రిగానీ బహుశ బిడ్డచుట్టూ చేయివేసి దగ్గరగా కూర్చోబెట్టుకోవచ్చు. (పోల్చండి మార్కు 10:13-16.) పఠిస్తున్న ప్రచురణలోని చిత్రాన్ని వివరించమని చిన్న పాపను గానీ బాబును గానీ కుటుంబ శిరస్సు అడుగవచ్చు. ఫలాని లేఖనం చదవమని ముందే ఒక పిల్లవానికి చెప్పవచ్చు. పఠన సమాచారంలో ఆచరణయోగ్యమైన అన్వయింపు కోసమైన అవకాశాలను ఎత్తిచూపుమని కాస్త పెద్ద వయస్సున్న పిల్లవానికి ముందే చెప్పవచ్చు.
11. మరితర ఏ బోధనా ఉపకరణాలు అందించబడ్డాయి, ఇవి ఎక్కడ అందుబాటులో ఉంటాయి, కుటుంబ పఠనంలో వాటిని ప్రయోజనకరంగా ఎలా ఉపయోగించవచ్చు?
11 మీ చర్చకు మీరు కావలికోటనే ఆధారంగా ఉపయోగిస్తున్నప్పటికీ అనేక భాషల్లో అందుబాటులో ఉన్న ఇతర పఠన ఉపకరణాల్ని మరువకండి. ఫలాని విషయానికి నేపథ్య సమాచారం అవసరమైతే లేదా ఏదైనా బైబిలు వ్యక్తీకరణకు వివరణ అవసరం అయితే లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) దాన్ని అందజేయగలదు. మరితర ప్రశ్నలకు జవాబులు కనుక్కోవడానికి వాచ్ టవర్ ప్రచురణల ఇండెక్స్‌ను (ఆంగ్లం) సంప్రదించవచ్చు లేదా సొసైటీ అందించిన కంప్యూటర్ రీసెర్చ్ ప్రోగ్రామును ఉపయోగించవచ్చు. మీకు అందుబాటులో ఉన్నట్లైతే ఈ ఉపకరణాలను ఉపయోగించడం నేర్చుకున్నప్పుడు అవి మీ కుటుంబ పఠనంలో ఒక అమూల్యమైన భాగంగా ఉండగలవు. యౌవనుల ఆసక్తిని రేకెత్తించడానికిగాను మీరు, సొసైటీ ఉత్పత్తి చేసిన ఉపదేశాత్మకమైన వీడియో క్యాసెట్లను చూడటానికీ లేదా ఆడియో క్యాసెట్లలోని నాటకాల్లో కొంతభాగాన్ని విని దాని గురించి చర్చించటానికీ మీ పఠన సమయంలోని కొంత భాగాన్ని వెచ్చించవచ్చు. ఈ పఠన ఉపకరణాలను చక్కగా ఉపయోగించటం మీ కుటుంబ పఠనాన్ని పూర్తి కుటుంబానికి ఆసక్తికరంగాను ప్రయోజనకరంగాను ఉండేలా చేయగలదు.
మీ కుటుంబ అవసరాలకు అనుగుణంగా మార్చుకోండి
12. చాలా అత్యవసర అవధానం ఇవ్వవలసిన విషయాలతో వ్యవహరించేటప్పుడు కుటుంబ పఠనం ఎలా ఒక పాత్రను నిర్వహించగలదు?
12 మీ కుటుంబం సాధారణంగా ప్రతి వారం ఆ వారానికైన కావలికోట శీర్షికను పఠనం చేస్తుండవచ్చు. కానీ మీ కుటుంబ నాడిని గ్రహించండి. తల్లి ఉద్యోగం చేయనవసరం లేనప్పుడు ప్రతి రోజు పిల్లలు స్కూలునుండి ఇంటికి వచ్చిన తర్వాత వారితో సమయం గడపడం ద్వారా ఇలా చేయడంలో ఆమె సహాయపడగలదు. కొన్ని సమస్యల్ని అప్పుడే పరిష్కరించవచ్చు; మరి కొన్నింటికి మరింత అవధానం అవసరం అవుతుండవచ్చు. కుటుంబంలో చాలా అత్యవసర అవధానం ఇవ్వవలసిన అవసరాలు ఉన్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకండి. (సామెతలు 27:12) ఇందులో స్కూల్లో ఎదురయ్యే సమస్యలే కాక ఇతర పరిస్థితులు కూడా ఉండవచ్చు. సముచితమైన ప్రచురణను ఎంపిక చేసుకుని, ఏమి పఠించబడుతుందో కుటుంబానికి ముందే తెలపండి.
13. బీదరికాన్ని ఎలా ఎదుర్కోవాలన్నది కుటుంబంలో చర్చించడం ఎందుకు ప్రయోజనకరంగా ఉంటుంది?
13 ఒక ఉదాహరణగా చెప్పాలంటే, భూమ్మీద అత్యధిక ప్రాంతాలు బీదరికం గుప్పిట్లో నలుగుతున్నాయి; అందుకని చాలా స్థలాల్లో దీన్ని ఎలా ఎదుర్కోవాలో చర్చించాల్సిన అవసరం రావచ్చు. నిజజీవిత పరిస్థితులపై, బైబిలు సిద్ధాంతాలపై కేంద్రీకరించబడిన కుటుంబ పఠనం మీ కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండగలదా?—సామెతలు 21:5; ప్రసంగి 9:11; హెబ్రీయులు 13:5, 6, 18.
14. ఎటువంటి పరిస్థితులు హింస, యుద్ధం, క్రైస్తవ తటస్థత విషయాల్లో యెహోవా దృక్కోణాన్ని గురించి కుటుంబం చర్చించడాన్ని సమయానికి తగినదిగా చేస్తుంది?
14 చర్చించాల్సిన మరో విషయం హింసను గూర్చినది. మనమందరం యెహోవా దృక్కోణాన్ని మన మనస్సుల్లోను మన హృదయాల్లోను దృఢంగా నాటుకోవల్సిన అవసరం ఉంది. (ఆదికాండము 6:13; కీర్తన 11:5) ఈ విషయంపై కుటుంబ పఠనం, స్కూల్లో రౌడీ పిల్లలతో ఎలా వ్యవహరించాలి, కరాటేలాంటి విద్యలు నేర్చుకోవాలా, సరియైన వినోదాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలి అనేవి చర్చించడానికి చక్కని స్థలంగా ఉంటుంది. హింసాత్మక పోరాటాలు సర్వసాధారణమైపోయాయి; దాదాపు ప్రతి దేశమూ అంతర్యుద్ధం, రాజకీయ లేదా జాతిపరమైన కలహాలు, లేదా గ్యాంగ్ వార్లతో అతలాకుతలం అవుతోంది. తత్ఫలితంగా, తలపడుతున్న గుంపుల మధ్య ఉన్నప్పుడు క్రైస్తవ ప్రవర్తనను కాపాడుకోవడం గురించి చర్చించాల్సిన అవసరం మీ కుటుంబానికి ఉండవచ్చు.—యెషయా 2:2-4; యోహాను 17:16.
15. సెక్స్, వివాహం విషయాల్లో పిల్లలకు ఉపదేశాన్ని ఎలా ఇవ్వాలి?
15 పిల్లలు ఎదుగుతుండగా వారికి సెక్స్, వివాహం వంటి విషయాల్లో వారి వయస్సుకు తగ్గట్లుగా ఉపదేశం అవసరం అవుతుంది. కొన్ని సంస్కృతుల్లో తల్లిదండ్రుల్లో అత్యధికులు తమ పిల్లల్తో సెక్స్ విషయాల గురించి అసలు ఏమాత్రం చర్చించరు. సరైన పరిజ్ఞానం లేని పిల్లలు మరితర యౌవనుల నుండి వక్రమైన దృక్కోణాలను వినవచ్చు, మరి దాని ఫలితాలు వినాశకరంగా ఉండగలవు. ఈ విషయంపై బైబిల్లో సూటియైన అదే సమయంలో రుచించే విధంగా సలహాను ఇచ్చిన యెహోవాను అనుకరించడం శ్రేష్ఠం కాదూ? ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికీ, ఆడువారు మగవారితోను మగవారు ఆడువారితోను హుందాగా ప్రవర్తించడానికి మన పిల్లలకు దైవిక సలహా సహాయం చేస్తుంది. (సామెతలు 5:18-20; కొలొస్సయులు 3:5; 1 థెస్సలొనీకయులు 4:3-8) మీరీ విషయాలు ఈపాటికే చర్చించినప్పటికీ మళ్లీ చేయడానికి సంకోచించకండి. క్రొత్త పరిస్థితులు ఎదురౌతుండగా పునరుక్తి అత్యావశ్యకం.
16. (ఎ) వేర్వేరు గృహాల్లో కుటుంబ పఠనం ఎప్పుడెప్పుడు నిర్వహించబడుతుంది? (బి) కుటుంబ పఠనాన్ని క్రమంగా నిర్వహించేందుకు మీరు ఆటంకాలతో ఎలా వ్యవహరించారు?
16 కుటుంబ పఠనం ఏ సమయంలో చేయవచ్చు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న బేతేలు కుటుంబాలను అనుకరిస్తూ అనేక గృహాల్లో కుటుంబ పఠనాలు సోమవారం సాయంత్రాలు జరుగుతాయి. ఇతరులు వేరేగా ఏర్పాటు చేసుకుంటారు. అర్జెంటీనాలో 9 మంది పిల్లలతోసహా 11 మంది సభ్యులుగల ఒక కుటుంబం తమ కుటుంబ పఠనం కోసం క్రమంగా ఉదయం ఐదు గంటలకు నిద్రలేచేది. వేర్వేరు పని గంటలు ఉండటం మూలాన వేరే ఏ సమయమూ వీలయ్యేది కాదు. అలా చేయడం సులభంగా ఏమీ ఉండేది కాదు, కానీ అది కుటుంబ పఠనం ఎంత ప్రాముఖ్యమనే విషయాన్ని పిల్లల మనస్సుల్లోనూ హృదయాల్లోనూ గాఢంగా ముద్రించింది. ఫిలిప్పీన్స్‌లో ఒక పెద్ద తన భార్యతోను పెరుగుతున్న ముగ్గురు పిల్లలతోను క్రమమైన కుటుంబ పఠనం నిర్వహించేవాడు. వారం అంతటిలో తల్లిదండ్రులు ఒక్కొక్క బిడ్డతో వ్యక్తిగత పఠనాలు చేసేవారు, తద్వారా ఆ పిల్లలు సత్యాన్ని తమ స్వంతం చేసుకున్నారు. అమెరికాలో, సాక్షికాని భర్తగల ఒక భార్య తన పిల్లలతో ప్రతి ఉదయం స్కూలు బస్సు వరకు నడిచివెళ్తుంది. బస్సుకోసం వేచివుండగా వారు దాదాపు పది నిముషాలపాటు సముచితమైన లేఖనాధార పఠన సమాచారాన్ని కలిసి చదివి చర్చిస్తారు, ఆ తల్లి క్లుప్తమైన ప్రార్థన చేసిన తర్వాత పిల్లలు బస్సెక్కుతారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో, అవిశ్వాసియైన ఒక భర్త తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు, ఆ భార్య అంతగా చదువుకోకపోవడం చేత పఠనంలో చాలా కష్టపడాల్సివచ్చేది. పెద్దవాడైన ఆమె కుమారుడు, తన తల్లీ తమ్ముళ్ళతో కలిసిచేసే కుటుంబ పఠనంలో నాయకత్వం వహించేందుకు ప్రతివారం ఆ కుటుంబాన్ని సందర్శిస్తూ సహాయం చేసేవాడు. ఎంతో శ్రద్ధతో సిద్ధపడి ఉండటం ద్వారా ఆ తల్లి చక్కని మాదిరిని ఉంచుతుంది. మీ కుటుంబంలో క్రమమైన కుటుంబ పఠనం నిర్వహించడాన్ని కష్టతరం చేసే పరిస్థితి ఏదైనా ఉందా? నిరాశ చెందకండి. బైబిలు పఠనం క్రమంగా జరగడానికి మీరు చేసే ప్రయత్నాలపై యెహోవా ఆశీర్వాదాల కోసం ప్రాధేయపూర్వకంగా కోరండి.—మార్కు 11:23, 24.
పట్టుదల మూలంగా వచ్చే ఫలితాలు
17. (ఎ) క్రమమైన కుటుంబ పఠనం కోసం ఏమి అవసరం? (బి) యెహోవా మార్గాల్లో క్రమమైన కుటుంబ ఉపదేశం విలువను ఏ అనుభవం దృష్టాంతపరుస్తుంది?
17 ఇందుకు మంచి ప్రణాళిక అవసరం. గట్టి పట్టుదల కావాలి. కానీ క్రమమైన కుటుంబ పఠనం నుండి వచ్చే ప్రయోజనాలు నిజంగా గొప్పవి. (సామెతలు 22:6; 3 యోహాను 4) జర్మనీలో ఫ్రాంజ్ మరియు హిల్డాలు 11 మంది పిల్లలుగల కుటుంబాన్ని పెంచిపోషించారు. ఎన్నో ఏండ్ల తర్వాత, వారి కుమార్తె మాగ్డలేనా ఇలా అంటుంది: “నేడు నేను అత్యంత ప్రాముఖ్యమైనదని దేన్ని పరిగణిస్తానంటే, మేము ఆధ్యాత్మిక ఉపదేశాన్ని పొందకుండా ఒక్క రోజు కూడా సూర్యుడు అస్తమించలేదు.” అడాల్ఫ్ హిట్లర్ క్రింద జాతీయతావాదం గాలుల ఉధృతి పెరిగినప్పుడు మాగ్డలేనా తండ్రి, రాబోతున్నాయని తాను గ్రహించిన పరీక్షలకు తన కుటుంబాన్ని సిద్ధం చేయడానికి బైబిలును ఉపయోగించాడు. కొంతకాలానికి, యౌవనులైన కుటుంబ సభ్యుల్ని బలవంతంగా బాలల సంస్కరణా స్కూలుకు తీసుకెళ్లారు; కుటుంబంలోని ఇతరుల్ని అరెస్టు చేసి కారాగారాల్లో బంధించారు, కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో వేశారు. కొందర్ని చంపివేయడం జరిగింది. వారందరి విశ్వాసం దృఢంగా నిలిచింది—అంతటి క్రూరమైన హింసల కాలంలోనే కాదు, దాన్నుండి బయటపడిన వారు అటుతర్వాతి కాలాల్లో కూడా దృఢ విశ్వాసంతో నిలిచారు.
18. తల్లి లేక తండ్రి మాత్రమే ఉన్న కుటుంబాల్లోనివారి ప్రయత్నాలకు ఎలాంటి ప్రతిఫలాలు లభించాయి?
18 తల్లి లేక తండ్రి మాత్రమే ఉన్న కుటుంబాల్లోనివారు, తమ విశ్వాసాన్ని పంచుకోని వివాహభాగస్వాములు ఉన్న కుటుంబాల్లోనివారు అదేవిధంగా తమ పిల్లలకు క్రమమైన బైబిలు ఉపదేశాన్ని అందించారు. ఇండియాలో, భర్త చనిపోయిన ఒక స్త్రీ తన ఇద్దరు పిల్లల హృదయాల్లో యెహోవాపట్ల ప్రేమను నాటడానికి చాలా కష్టపడి పనిచేసింది. అయితే, ఆమె కుమారుడు యెహోవా ప్రజలతో సహవసించడం మానుకున్నప్పుడు ఆమె హృదయం బ్రద్దలయ్యింది. తాను తన కుమారునికి ఇచ్చిన శిక్షణలో ఏమైనా లోటు ఉన్నట్లైతే తన్ను క్షమించమని ఆమె యెహోవాను అర్థించింది. కానీ ఆమె కుమారుడు తాను నేర్చుకున్నవి నిజానికి మర్చిపోలేదు. దాదాపు దశాబ్దానికి పైగా కాలం గడిచిన తర్వాత ఆయన మరలివచ్చాడు, చక్కని ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించాడు, ఒక సంఘ పెద్ద అయ్యాడు. ఇప్పుడు ఆయనా ఆయన భార్యా పూర్తికాల పయినీర్లుగా సేవచేస్తున్నారు. కుటుంబంలోనే క్రమమైన బైబిలు ఉపదేశాన్ని ఇవ్వమని యెహోవా నుండీ ఆయన సంస్థ నుండీ వచ్చిన సలహాను హృదయంలోనికి తీసుకున్న తల్లిదండ్రులు ఎంత కృతజ్ఞతా భావం కలిగివున్నారో కదా! ఆ సలహాను మీరు మీ కుటుంబంలో అన్వయించుకుంటున్నారా?
మీరు వివరించగలరా?
◻ క్రమమైన కుటుంబ పఠనం ఎందుకు ప్రాముఖ్యం?
◻ ప్రతి కుటుంబ పఠనంలో మన లక్ష్యాలు ఏమైవుండాలి?
◻ బోధన కోసం ఏ ఉపకరణాలు మనకు అందించబడ్డాయి?
◻ పఠనాన్ని కుటుంబ అవసరాలకు తగినట్లుగా ఎలా మార్చుకోవచ్చు?
[15వ పేజీలోని చిత్రం]
కచ్చితమైన లక్ష్యాలు మీ కుటుంబ పఠనాన్ని మరింత మెరుగుపరుస్తాయి