క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్ రెఫరెన్సులు
జూలై 1-7
దేవుని వాక్యంలో ఉన్న సంపద|కొలొస్సయులు 1-4
“మీ పాత వ్యక్తిత్వాన్ని తీసిపారేయండి, కొత్త వ్యక్తిత్వాన్ని ధరించండి”
(కొలొస్సయులు 3:5-9) కాబట్టి, భూమ్మీద ఉన్న మీ శరీర అవయవాల్ని చంపేసుకోండి. లైంగిక పాపాలు, అపవిత్రత, అదుపులేని లైంగిక వాంఛ, చెడు కోరిక, విగ్రహపూజతో సమానమైన అత్యాశ వంటివి వాటిలో నుండే పుడతాయి. 6 అలాంటివి చేసేవాళ్ల మీదికి దేవుని ఆగ్రహం రాబోతోంది. 7 ఒకప్పుడు మీరు కూడా అలాంటివే చేసేవాళ్లు. 8 కానీ ఇప్పుడు మీరు వాటన్నిటినీ వదిలేయాలి. అలాగే ఆగ్రహం, కోపం, చెడుతనం, తిట్టడం మానేయాలి. అసభ్యకరమైన మాటలు మీ నోటి నుండి రానివ్వకూడదు. 9 ఒకరితో ఒకరు అబద్ధమాడకండి. మీ పాత వ్యక్తిత్వాన్ని, దాని అలవాట్లతో సహా వదిలేయండి.
w11 3/15 10వ పేజీ, 12-13 పేరాలు
లౌకికాత్మను కాక దేవుని ఆత్మను పొందండి
12 నేను ఏ ఆత్మ నిర్దేశానికి లోబడుతున్నానని నా వ్యక్తిత్వం చూపిస్తోంది? (కొలొస్సయులు 3:8-10, 13 చదవండి.) లౌకికాత్మ శరీర కార్యాలను వృద్ధి చేస్తుంది. (గల. 5:19-21) పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కాదుగానీ అనుకూలంగా లేనప్పుడు అంటే, ఓ సహోదరుడు/సహోదరి మనల్ని పట్టించుకోనప్పుడు, మనల్ని బాధపెట్టినప్పుడు లేదా మనపట్ల పాపం చేసినప్పుడు మనం ఏ ఆత్మ నిర్దేశానికి లోబడుతున్నామో తెలుస్తుంది. అలాగే, ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మనం చేసే పనులను బట్టి పరిశుద్ధాత్మ నిర్దేశానికి లోబడుతున్నామా లేదా అనేది స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి, మనల్ని మనం పరిశీలించుకోవడం అవసరం. ఈ ప్రశ్నలు వేసుకోండి: ‘గత ఆరు నెలల్లో నా వ్యక్తిత్వం మరింతగా క్రీస్తులా మారిందా? లేక నా మాటలు, చేతలు చెడుగా మారాయా?’
13 “ప్రాచీనస్వభావమును దాని క్రియలతో” సహా తీసేసుకొని, “నవీనస్వభావమును” ధరించుకోవడానికి దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తుంది. అలా మనం మరింత ప్రేమ, దయ గలవారిగా తయారౌతాం. కాబట్టి, ఇతరులు మనకు నిజంగా హాని చేశారని అనిపించినా వారిని మనస్ఫూర్తిగా క్షమించగలుగుతాం. అంతేకాక మనకు అన్యాయం జరిగిందని అనిపించినప్పుడు ‘ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణలతో’ ప్రతిస్పందించము కానీ, ‘కరుణాహృదయులుగా’ ఉండడానికి కృషిచేస్తాం.—ఎఫె. 4:31, 32.
(కొలొస్సయులు 3:10-14) దేవుడు ఇచ్చే కొత్త వ్యక్తిత్వాన్ని అలవర్చుకోండి. అంటే, దేవుణ్ణి ప్రతిబింబించేలా సరైన జ్ఞానంతో మీ వ్యక్తిత్వాన్ని కొత్తది చేసుకోండి. 11 ఇందులో గ్రీకువాళ్లూ యూదులూ, సున్నతి చేయించుకున్నవాళ్లూ సున్నతి చేయించుకోనివాళ్లూ, విదేశీయులు, సిథియనులు, దాసులు, స్వతంత్రులు అనే తేడా ఏమీ లేదు. క్రీస్తే అన్నీ, ఆయనే అందరిలో ఉన్నాడు. 12 మీరు దేవుడు ఎంచుకున్న వ్యక్తులు, పవిత్రులు, ఆయన ప్రేమించేవాళ్లు కాబట్టి వాత్సల్యంతో కూడిన ప్రేమను, కనికరాన్ని, దయను, వినయాన్ని, సౌమ్యతను, ఓర్పును అలవర్చుకోండి. 13 ఒకరి విషయంలో ఒకరు సహనం చూపిస్తూ, మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండండి. ఇతరులు మిమ్మల్ని నొప్పించినా సరే అలా చేయండి. యెహోవా మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించినట్టే మీరూ క్షమించాలి. 14 అయితే, వీటన్నిటికన్నా ముఖ్యంగా, ప్రేమను అలవర్చుకోండి. ఎందుకంటే ప్రేమ ప్రజల్ని పూర్తిస్థాయిలో ఒకటి చేస్తుంది.
w13 9/15 21వ పేజీ, 18-19 పేరాలు
మీరు రూపాంతరం పొందారా?
18 దేవుని వాక్యం వల్ల రూపాంతరం పొందాలంటే, మనం క్రమంగా బైబిలు చదవడం, అందులోని విషయాలు నేర్చుకోవడం తొలి మెట్టు మాత్రమే. చాలామంది ప్రజలు అప్పుడప్పుడూ బైబిలు చదివి దానిలోని విషయాలతో సుపరిచితులయ్యారు. బహుశా, మీరు పరిచర్యలో అలాంటి ప్రజల్ని కలిసే ఉంటారు. కొందరైతే బైబిల్లోని ఆయా వృత్తాంతాలను కంఠతా చెప్పగలుగుతారు. అయితే, దానివల్ల వాళ్ల ఆలోచనా తీరులో గానీ, జీవన విధానంలో గానీ పెద్దగా మార్పేమీ కనిపించదు. కారణం? దేవుని వాక్యం ఓ వ్యక్తిపై ప్రభావం చూపించి, ఆయన రూపాంతరం పొందేలా చేయాలంటే, అది ఆయన హృదయంలోకి చొచ్చుకెళ్లాలి. కాబట్టి, బైబిలు నుండి మనం నేర్చుకుంటున్న విషయాల గురించి సమయం తీసుకొని ఆలోచించాలి. మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవడం మంచిది: ‘ఇది కేవలం ఓ మతబోధ మాత్రమే కాదని నేను బలంగా నమ్ముతున్నానా? ఇదే సత్యమని నేను అర్థంచేసుకోలేదా? నేను నేర్చుకుంటున్న ఫలాని విషయం కేవలం ఇతరులకు బోధించడానికి మాత్రమే ఉపయోగపడుతుందని అనుకోకుండా, దాన్ని నా జీవితంలో అన్వయించుకోగల రంగాల గురించి ఆలోచిస్తానా? యెహోవా నాతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నట్లు నేను భావిస్తానా?’ అలాంటి ప్రశ్నల గురించి ఆలోచించి, ధ్యానిస్తే మనం యెహోవాకు దగ్గరౌతాం. ఆయన పట్ల మనకున్న ప్రేమ అధికమౌతుంది. ఆ ప్రేరణ వల్ల, మనం సానుకూలమైన మార్పులు చేసుకుంటాం.—సామె. 4:23; లూకా 6:45.
19 దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతూ ధ్యానించడం వల్ల మనం పౌలు ఇచ్చిన ఈ సలహాను మున్ముందు కూడా పాటిస్తాం: “ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడ మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొనియున్నారు.” (కొలొ. 3:9, 10) మనం బైబిలు చెబుతున్న దాన్ని నిజంగా అర్థం చేసుకొని, నేర్చుకున్నవాటిని పాటిస్తే, అది సాతాను ఉరుల నుండి కాపాడగల నవీన స్వభావాన్ని ధరించుకునేందుకు మనకు ప్రేరణ ఇస్తుంది.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
(కొలొస్సయులు 1:13, 14) దేవుడు మనల్ని చీకటి అధికారం నుండి విడిపించి, తన ప్రియ కుమారుని రాజ్యంలోకి తీసుకెళ్లాడు. 14 ఆ కుమారుని విమోచన క్రయధనం వల్లే మనం విడుదలయ్యాం, అంటే మన పాపాలు క్షమించబడ్డాయి.
it-2-E 169వ పేజీ, 3-5 పేరాలు
దేవుని రాజ్యం
“తన ప్రియ కుమారుని రాజ్యం.” యేసు పరలోకానికి వెళ్లిన పది రోజుల తర్వాత, క్రీ.శ. 33 పెంతెకొస్తు రోజున, యేసు తన శిష్యుల మీదికి పవిత్రశక్తి కుమ్మరించినప్పుడు, ఆయన “హెచ్చించబడి దేవుని కుడివైపు కూర్చున్నాడు” అనడానికి వాళ్లు రుజువును చూశారు. (అపొ 1:8, 9; 2:1-4, 29-33) అప్పటి నుండి వాళ్ల విషయంలో “కొత్త ఒప్పందం” అమలులోకి వచ్చింది, వాళ్లు దేవుని ఇశ్రాయేలు అనే కొత్త ‘పవిత్ర జనంలో’ ముఖ్యభాగం అయ్యారు.—హెబ్రీ 12:22-24; 1 పేతు 2:9, 10; గల 6:16.
క్రీస్తు ఇప్పుడు దేవుని కుడివైపు కూర్చొనివున్నాడు, ఆయన దేవుని సంఘానికి శిరస్సు. (ఎఫె 5:23; హెబ్రీ 1:3; ఫిలి 2:9-11) క్రీ.శ. 33 నుండి క్రీస్తు శిష్యులపై ఒక ఆధ్యాత్మిక రాజ్యం స్థాపించబడిందని లేఖనాలు చెప్తున్నాయి. అపొస్తలుడైన పౌలు మొదటి శతాబ్దంలో ఉన్న కొలొస్సయి సంఘానికి రాస్తూ, యేసుకు అప్పటికే ఒక రాజ్యం ఉందని వివరించాడు. పౌలు ఇలా రాశాడు: “దేవుడు మనల్ని చీకటి అధికారం నుండి విడిపించి, తన ప్రియ కుమారుని రాజ్యంలోకి తీసుకెళ్లాడు.”—కొలొ 1:13; అపొ 17:6, 7 కూడా చూడండి.
క్రీ.శ. 33 నుండి క్రీస్తు కలిగివున్న రాజ్యం ఆధ్యాత్మిక రాజ్యం, ఆయన ఆధ్యాత్మిక ఇశ్రాయేలును ఏలుతూ ఉన్నాడు. దేవుని పవిత్రశక్తి ద్వారా దేవుని ఆధ్యాత్మిక పిల్లలుగా దత్తత తీసుకోబడిన క్రైస్తవులే ఆ ఆధ్యాత్మిక ఇశ్రాయేలు. (యోహా 3:3, 5, 6) ఒకసారి తమ పరలోక బహుమానం అందుకున్నాక, వాళ్లు ఇక ఆ క్రీస్తు ఆధ్యాత్మిక రాజ్యంలో భూమ్మీది పౌరులుగా ఉండరు కానీ క్రీస్తుతోపాటు పరలోకంలో రాజులుగా ఉంటారు.—ప్రక 5:9, 10.
(కొలొస్సయులు 2:8) క్రీస్తు బోధల ప్రకారం కాకుండా మనుషుల సంప్రదాయాల ప్రకారం, ఈ లోకంలోని ప్రాథమిక విషయాల ప్రకారం ఉన్న తత్త్వజ్ఞానంతో, మోసపూరితమైన వట్టి మాటలతో ఎవ్వరూ మిమ్మల్ని బానిసలుగా చేసుకోకుండా జాగ్రత్తపడండి;
గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలొస్సయులకు రాసిన పత్రికల్లోని ముఖ్యాంశాలు
2:8—ఏ “లోకసంబంధమైన మూలపాఠములు”కు దూరంగా ఉండాలని పౌలు హెచ్చరించాడు? ఇవి సాతాను లోకంలోని అంశాలు అంటే లోకంలో ఉన్న అన్నింటినీ నడిపించే, ప్రేరేపించే మూలసూత్రాలు. (1 యోహాను 2:16) దీనిలో తత్వజ్ఞానం, ధనాపేక్ష, అబద్ధమతాలు కూడా ఉన్నాయి.
చదవాల్సిన బైబిలు భాగం
(కొలొస్సయులు 1:1-20) దేవుని ఇష్టప్రకారం క్రీస్తుయేసుకు అపొస్తలుడైన పౌలు, అలాగే సోదరుడైన తిమోతి 2 కొలొస్సయిలో క్రీస్తు శిష్యులుగా ఉన్న పవిత్రులకు, నమ్మకమైన సోదరులకు రాస్తున్న ఉత్తరం. మన తండ్రైన దేవుడు మీకు అపారదయను, శాంతిని ప్రసాదించాలి. 3 మేము మీ గురించి ప్రార్థించినప్పుడల్లా మన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. 4 ఎందుకంటే, క్రీస్తుయేసు మీద మీకున్న విశ్వాసం గురించి, పవిత్రులందరి మీద మీకున్న ప్రేమ గురించి మేము విన్నాం. 5 పరలోకంలో మీకోసం సిద్ధంగా ఉన్న వాటి మీద మీకున్న నిరీక్షణ వల్లే మీరు ఆ లక్షణాల్ని చూపిస్తున్నారు. మంచివార్త గురించిన సత్యాన్ని మీరు విన్నప్పుడు ఆ నిరీక్షణ గురించి తెలుసుకున్నారు. 6 మంచివార్త ఫలించి ప్రపంచమంతటా వ్యాపిస్తున్నట్టే, మీలో కూడా ఫలించి వ్యాపిస్తోంది. మీరు దేవుని అపారదయ గురించిన సత్యాన్ని విని, దాన్ని సరిగ్గా అర్థంచేసుకున్న రోజు నుండి అలా జరుగుతోంది. 7 ప్రియమైన మా తోటి దాసుడు, క్రీస్తుకు నమ్మకమైన పరిచారకుడు అయిన ఎపఫ్రా దగ్గర మీరు నేర్చుకున్నది ఆ సత్యాన్నే. 8 దేవుని పవిత్రశక్తి సహాయంతో మీరు అలవర్చుకున్న ప్రేమ గురించి కూడా అతను మాకు చెప్పాడు. 9 అందుకే, మేము అది విన్న రోజు నుండి మీ గురించి ప్రార్థిస్తూనే ఉన్నాం. మీరు అసలైన తెలివిని, పవిత్రశక్తి ఇచ్చే అవగాహనను పొంది దేవుని ఇష్టం గురించిన సరైన జ్ఞానంతో నిండి ఉండాలని ప్రార్థిస్తున్నాం. 10 మీరు ప్రతీ మంచి పని చేస్తూ, దేవుని గురించిన సరైన జ్ఞానం విషయంలో ఎదుగుతూ యెహోవాను సంతోషపెట్టేలా ఆయన కోరేవాటి ప్రకారం జీవించాలని మేము ప్రార్థిస్తున్నాం; 11 ఓర్పుతో, సంతోషంతో అన్నిటినీ సహించేలా దేవుని గొప్ప శక్తి మీకు కావాల్సిన బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. 12 వెలుగులో నడుస్తున్న పవిత్రులకు తాను వారసత్వంగా ఇచ్చే దానిలో ఓ భాగం పొందేలా మిమ్మల్ని అర్హులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలని ప్రార్థిస్తున్నాం. 13 దేవుడు మనల్ని చీకటి అధికారం నుండి విడిపించి, తన ప్రియ కుమారుని రాజ్యంలోకి తీసుకెళ్లాడు. 14 ఆ కుమారుని విమోచన క్రయధనం వల్లే మనం విడుదలయ్యాం, అంటే మన పాపాలు క్షమించబడ్డాయి. 15 ఆయన, కనిపించని దేవుని ప్రతిబింబం. మొత్తం సృష్టిలో మొట్టమొదటి వ్యక్తి ఆయనే; 16 ఎందుకంటే అటు పరలోకంలో ఇటు భూమ్మీద, కనిపించేవీ కనిపించనివీ అవి సింహాసనాలే కావచ్చు, పరిపాలనలే కావచ్చు, ప్రభుత్వాలే కావచ్చు, అధికారాలే కావచ్చు, దేవుడు ఆయన్ని ఉపయోగించుకొనే అన్నిటినీ సృష్టించాడు. దేవుడు అన్నిటినీ ఆయన ద్వారా సృష్టించాడు, ఆయన కోసం సృష్టించాడు. 17 ఆ కుమారుడు వాటన్నిటికన్నా ముందే ఉన్నాడు, అవన్నీ ఆయన ద్వారానే ఉనికిలోకి వచ్చాయి. 18 సంఘమనే శరీరానికి ఆయనే శిరస్సు. ఆయనే అన్నిటికీ ఆరంభం. చనిపోయినవాళ్లలో మొదట బ్రతికింపబడింది కూడా ఆయనే; ఆ రకంగా కూడా ఆయనే అన్నిట్లో మొదటి వ్యక్తి అయ్యాడు; 19 ఎందుకంటే, అన్నిటినీ ఆయనలో సంపూర్ణం చేయడం దేవునికి నచ్చింది. 20 ఇటు భూమ్మీదివి గానీ, అటు పరలోకంలోవి గానీ అన్నీ ఆ కుమారుని ద్వారా తనతో మళ్లీ శాంతియుత సంబంధం కలిగివుండేలా చేయడం దేవునికి నచ్చింది. ఆ కుమారుడు హింసాకొయ్య మీద చిందించిన రక్తం వల్లే ఆ శాంతి సాధ్యమైంది.
జూలై 8-14
దేవుని వాక్యంలో ఉన్న సంపద|1 థెస్సలొనీకయులు 1-5
“ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు బలపర్చుకుంటూ ఉండండి”
(1 థెస్సలొనీకయులు 5:11-13) కాబట్టి, మీరు ఇప్పుడు చేస్తున్నట్టే, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు బలపర్చుకుంటూ ఉండండి. 12 సోదరులారా, మీ మధ్య కష్టపడి పనిచేస్తూ, ప్రభువు సేవలో మీకు నాయకత్వం వహిస్తూ, మీకు సలహాలు ఇస్తూ ఉన్నవాళ్లను గౌరవించమని మిమ్మల్ని కోరుతున్నాం; 13 అంతేకాదు, వాళ్లు చేసే పనిని బట్టి వాళ్లమీద విశేషమైన ప్రేమ చూపించమని, వాళ్లను గొప్పగా ఎంచమని మా మనవి. మీరు ఒకరితో ఒకరు శాంతియుతంగా మెలగండి.
‘మీ మధ్య ప్రయాసపడుతున్నవారిని’ గౌరవించండి
12 సంఘంలో ‘పైనుండడం’ లేదా నాయకత్వం వహించడం అంటే కేవలం బోధించడం మాత్రమే కాదు. మూలభాషలో ఆ పదాన్నే 1 తిమోతి 3:4లో ఉపయోగించారు. పర్యవేక్షకుడు “సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు, తన యింటివారిని బాగుగా ఏలువాడునై యుండవలెను” అని పౌలు చెప్పాడు. పర్యవేక్షకుడు ‘ఏలువాడై’ ఉండాలంటే కేవలం బోధిస్తే సరిపోదు కానీ కుటుంబంలో నాయకత్వం వహించి, ‘పిల్లలను స్వాధీనంలో ఉంచుకోవాలి.’ అలాగే సంఘంలోని వారందరూ యెహోవాకు లోబడివుండేందుకు సహాయం చేస్తూ పెద్దలు సంఘంలో నాయకత్వం వహిస్తారు.—1 తిమో. 3:5.
‘మీ మధ్య ప్రయాసపడుతున్నవారిని’ గౌరవించండి
19 ప్రత్యేకంగా మీ కోసమే తయారుచేసిన ఓ బహుమతిని ఎవరైనా ఇస్తే మీరేమి చేస్తారు? దాన్ని ఉపయోగించడం ద్వారా మీరు దాన్ని విలువైనదిగా ఎంచుతున్నారని చూపిస్తారు కదా? యేసుక్రీస్తు ద్వారా యెహోవా మీకోసం ‘మనుష్యుల్లో ఈవులను’ లేక బహుమతులను అనుగ్రహించాడు. వారిచ్చే ప్రసంగాలను శ్రద్ధగా విని వారు చెప్పేవాటిని పాటించడానికి ప్రయత్నించడం ద్వారా మీరు ఆ ఈవుల పట్ల కృతజ్ఞతను చూపించవచ్చు. కూటాల్లో అర్థవంతమైన వ్యాఖ్యానాలను ఇవ్వడం ద్వారా కూడా మీ కృతజ్ఞతను తెలియజేయవచ్చు. క్షేత్రసేవ వంటివాటిలో పెద్దల నాయకత్వానికి సహకరించండి. ఒకానొక పెద్ద ఇచ్చిన ఉపదేశం వల్ల మీరు ప్రయోజనం పొందితే, ఆ విషయం ఆయనతో ఎప్పుడైనా చెప్పారా? చెప్పి చూడండి. అంతేకాక, పెద్దల కుటుంబాలను ఎప్పుడైనా మెచ్చుకున్నారా? ఎందుకంటే, సంఘంలో ఒక పెద్ద కష్టపడి పని చేయాలంటే ఆయన కుటుంబ సభ్యులు ఆయనతో గడిపే అవకాశమున్న సమయాన్ని త్యాగం చేస్తున్నారని గుర్తుంచుకోండి.
(1 థెస్సలొనీకయులు 5:14) సోదరులారా, పద్ధతిగా నడుచుకోనివాళ్లను హెచ్చరించమని, కృంగినవాళ్లతో ప్రోత్సాహకరంగా మాట్లాడమని, బలహీనులకు మద్దతివ్వమని, అందరితో ఓర్పుగా వ్యవహరించమని మిమ్మల్ని అర్థిస్తున్నాం.
w17.10 10వ పేజీ, 13వ పేరా
‘ప్రేమను చేతల్లో చూపించాలి, ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి’
13 బలహీనులకు సహాయం చేయండి. “బలహీనులకు మద్దతివ్వమని, అందరితో ఓర్పుగా వ్యవహరించమని” బైబిలు ఇస్తున్న ఆజ్ఞ మన ప్రేమలో ఉన్న నిజాయితీని పరీక్షిస్తుంది. (1 థెస్స. 5:14) ఒకప్పుడు విశ్వాసంలో బలహీనంగా ఉన్న చాలామంది కొంతకాలం తర్వాత బలపడ్డారు. కానీ ఇంకొందరికి మనం ఓర్పుతో, ప్రేమతో సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎలా? బైబిల్ని ఉపయోగిస్తూ వాళ్లను ప్రోత్సహించవచ్చు, మనతో ప్రీచింగ్‌కు రమ్మని పిలవవచ్చు లేదా వాళ్లు మనసువిప్పి మాట్లాడుతున్నప్పుడు వినవచ్చు. ఒక సహోదరుడు లేదా సహోదరి ‘బలవంతులా’ లేదా ‘బలహీనులా’ అని ఆలోచించే బదులు మనందరికీ బలాలు, బలహీనతలు రెండూ ఉంటాయని అర్థంచేసుకోవాలి. పౌలు కూడా తనలో బలహీనతలు ఉన్నాయని ఒప్పుకున్నాడు. (2 కొరిం. 12:9, 10) మనందరం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ప్రోత్సహించుకోవాలి.
యేసులా వినయం, కనికరం చూపించండి
16 మన మాటలు. ‘ధైర్యం చెడినవాళ్లను ధైర్యపర్చేలా’ కనికరం మనల్ని కదిలిస్తుంది. (1 థెస్స. 5:14) అలాంటివాళ్లను ఎలా ప్రోత్సహించవచ్చు? వాళ్లమీద మీకెంత శ్రద్ధ ఉందో చెప్పండి. వాళ్లను మెచ్చుకోండి, తమలోని మంచి లక్షణాలను, సామర్థ్యాలను గుర్తించేందుకు వాళ్లకు సహాయం చేయండి. సత్యం తెలుసుకునేలా యెహోవా వాళ్లకు సహాయం చేశాడంటే వాళ్లు ఆయనకు చాలా విలువైనవాళ్లని గుర్తుచేయండి. (యోహాను 6:44) “విరిగిన హృదయం,” “నలిగిన మనస్సు” ఉన్న తన సేవకుల మీద యెహోవాకు ఎంతో శ్రద్ధ ఉందని భరోసా ఇవ్వండి. (కీర్త. 34:18) మనం కనికరంతో మాట్లాడే మాటలు, బాధల్లో ఉన్నవాళ్లకు నిజంగా ఎంతో ఊరటనిస్తాయి.—సామె. 16:24.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
(1 థెస్సలొనీకయులు 4:3-6) మీరు పవిత్రులుగా ఉంటూ లైంగిక పాపాలకు దూరంగా ఉండాలన్నదే దేవుని కోరిక. 4 మీరు పవిత్రంగా, గౌరవప్రదంగా ఉండాలంటే మీలో ప్రతీ ఒక్కరికి మీ శరీరాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలిసివుండాలి. 5 మీరు దేవుడు తెలియని ప్రజల్లా అత్యాశతో కూడిన లైంగిక వాంఛతో రగిలిపోకూడదు. 6 ఎవ్వరూ హద్దులు దాటి ప్రవర్తించకూడదు, పవిత్రత విషయంలో తోటి సోదరుని హక్కులకు భంగం కలిగించకూడదు. ఎందుకంటే వీటన్నిటి విషయంలో యెహోవా తగిన శిక్ష విధిస్తాడు. దీని గురించి మేము ఇంతకుముందు కూడా చెప్పాం, గట్టిగా హెచ్చరించాం.
it-1-E 863-864 పేజీలు
లైంగిక పాపం
లైంగిక పాపం కారణంగా ఒక వ్యక్తిని క్రైస్తవ సంఘం నుండి బహిష్కరించవచ్చు. (1 కొరిం 5:9-13; హెబ్రీ 12:15, 16) లైంగిక పాపం చేసే వ్యక్తి తన ప్రత్యుత్పత్తి అవయవాల్ని నీచమైన వాటికోసం ఉపయోగిస్తూ సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడని పౌలు వివరించాడు. అది యెహోవాతో అతనికున్న సంబంధాన్ని ఘోరంగా దెబ్బతీస్తుంది, క్రైస్తవ సంఘాన్ని అపవిత్రం చేస్తుంది, ప్రమాదకరమైన సుఖవ్యాధులకు కారణమౌతుంది. (1 కొరిం 6:18, 19) అతను ఈ కింద పనుల ద్వారా సహోదరుల హక్కులకు భంగం కలిగిస్తాడు: (1 థెస్స 4:3-7) (1) సంఘంలోకి అపవిత్రతను, అవమానకరమైన తెలివితక్కువతనాన్ని తీసుకొచ్చి సంఘానికి చెడ్డపేరు తెస్తాడు. (హెబ్రీ 12:15, 16) (2) ఎవరితోనైతే ఆ పాపం చేశాడో ఆ వ్యక్తి నైతిక పవిత్రతను చెడగొడతాడు; ఒకవేళ ఆ ఎదుటివ్యక్తికి పెళ్లి కానట్లయితే, ఆమె/అతను పవిత్రంగా వివాహజీవితంలోకి అడుగుపెట్టే అవకాశాన్ని లేకుండా చేస్తాడు. (3) తన కుటుంబ నైతిక పవిత్రతను చెడగొడతాడు, అలాగే (4) తాను ఎవరితోనైతే లైంగిక పాపం చేశాడో, ఆ వ్యక్తి తల్లిదండ్రులకు, భర్తకు/భార్యకు, లేదా కాబోయే వివాహజతకు అన్యాయం చేసినవాడౌతాడు. అలాంటి వ్యక్తి మనుషుల్ని కాదుగానీ దేవుణ్ణే అగౌరవపరుస్తున్నాడు, మనుషుల చట్టాలు దాన్ని తప్పని చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు; కానీ దేవుడు మాత్రం ఆ పాపాన్ని బట్టి అతన్ని శిక్షిస్తాడు.—1 థెస్స 4:8.
(1 థెస్సలొనీకయులు 4:15-17) యెహోవా వాక్యం ఆధారంగా మేము మీకు చెప్పేదేమిటంటే, మనలో ఎవరైతే ప్రభువు ప్రత్యక్షత కాలంలో ఇంకా బ్రతికివుంటారో వాళ్లు ఏ విధంగానూ ఇప్పటికే చనిపోయినవాళ్ల కన్నా ముందు బ్రతికించబడరు; 16 ఎందుకంటే, ప్రభువు తానే స్వయంగా అధికారం ఉట్టిపడే స్వరంతో, ప్రధానదూత స్వరంతో, దేవుని బాకా శబ్దంతో పరలోకం నుండి దిగివస్తాడు. ముందు, క్రీస్తు శిష్యులుగా చనిపోయినవాళ్లు బ్రతికించబడతారు. 17 ఆ తర్వాత, బ్రతికివున్న మనం వాళ్లతో కలిసి ఉండడానికి, ప్రభువును కలవడానికి గాలిలో మేఘాల మీద వెళ్తాం; అలా మనం ఎప్పుడూ ప్రభువుతోనే ఉంటాం.
w15 7/15 18-19 పేజీలు, 14-15 పేరాలు
‘మీ విడుదల సమీపించింది’!
14 మాగోగువాడగు గోగు దేవుని ప్రజలమీద దాడి చేయడం మొదలుపెట్టిన తర్వాత ఏమి జరుగుతుంది? అప్పుడు మనుష్యకుమారుడు ‘దూతలను పంపించి భూలోకం మొదలుకొని ఆకాశం వరకు నలుదిశల నుండి తాను ఎన్నుకొన్నవాళ్లను పోగుచేయించును’ అని బైబిలు చెప్తుంది. (మార్కు 13:27; మత్త. 24:31) ఈ ‘పోగుచేయడం’ అభిషిక్తులను ఎంపిక చేయడాన్నిగానీ, భూమ్మీద మిగిలివున్న అభిషిక్తులు చివరి ముద్ర పొందడాన్నిగానీ సూచించట్లేదు. (మత్త. 13:37, 38) వాళ్లు మహాశ్రమలు మొదలవ్వడానికి కొంచెం ముందే చివరి ముద్రను పొందివుంటారు. (ప్రక. 7:1-4) మరి ఆ పోగుచేయడం దేన్ని సూచిస్తుంది? భూమ్మీద మిగిలివున్న అభిషిక్తులు పరలోక బహుమానం పొందడాన్ని అది సూచిస్తుంది. (1 థెస్స. 4:15-17; ప్రక. 14:1) గోగు దాడి మొదలైన తర్వాత ఏదో ఒక సమయంలో వాళ్లు ఆ బహుమానాన్ని పొందుతారు. (యెహె. 38:11) అప్పుడు యేసు చెప్పినట్లు, “నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు.”—మత్త. 13:43.
15 తాము మానవ శరీరాలతోనే పరలోకానికి ఎత్తబడతామని క్రైస్తవమత సామ్రాజ్యంలోని చాలామంది అనుకుంటారు. అంతేకాదు, యేసు భూమిని పరిపాలించడానికి వచ్చినప్పుడు ఆయన్ను చూస్తామని కూడా వాళ్లు అనుకుంటారు. అయితే, యేసు రాకడ అదృశ్యంగా ఉంటుందని బైబిలు స్పష్టంగా చెప్తుంది. “మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును” అని, యేసు ‘మేఘారూఢుడై వస్తాడు’ అని బైబిలు చెప్తుంది. (మత్త. 24:30) “రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు” అని కూడా చెప్తుంది. కాబట్టి వాళ్లు ‘ఒక రెప్పపాటున, కడబూర మ్రోగగానే మార్పు పొంది’ పరలోకానికి వెళ్తారు. (1 కొరింథీయులు 15:50-53 చదవండి.) అవును, భూమ్మీద మిగిలివున్న నమ్మకమైన అభిషిక్తులందరూ రెప్పపాటున పోగుచేయబడతారు.
చదవాల్సిన బైబిలు భాగం
(1 థెస్సలొనీకయులు 3:1-13) కాబట్టి మేము మీకు దూరంగా ఉన్నామనే విషయాన్ని తట్టుకోలేకపోయినప్పుడు, ఒంటరిగా ఏథెన్సులోనే ఉండిపోవడం మంచిదనుకొని, 2 మన సోదరుడు, క్రీస్తు గురించిన మంచివార్త విషయంలో దేవుని పరిచారకుడు అయిన తిమోతిని మీ దగ్గరికి పంపించాం. మీ విశ్వాసం విషయంలో మిమ్మల్ని బలపర్చడానికి, ప్రోత్సహించడానికి అతన్ని పంపించాం. 3 ఈ శ్రమల వల్ల ఎవ్వరూ విశ్వాసం నుండి పక్కకు మళ్లకూడదనే ఉద్దేశంతో అలా చేశాం. ఇలాంటి శ్రమలు మనం అనుభవించక తప్పదని స్వయంగా మీకే తెలుసు. 4 ఎందుకంటే, మేము మీ దగ్గర ఉన్నప్పుడు, ముందుముందు మనకు శ్రమలు వస్తాయని మీతో అంటుండేవాళ్లం. ఇప్పుడు జరిగింది అదేనని మీకు తెలుసు. 5 అందుకే, మీకు దూరంగా ఉన్నామనే విషయాన్ని ఇక తట్టుకోలేక, మీ విశ్వసనీయత గురించి తెలుసుకోవడానికి తిమోతిని పంపించాను. అపవాది మిమ్మల్ని ఏ రకంగానైనా ప్రలోభపెట్టాడేమో, మేము పడ్డ కష్టం వృథా అయ్యిందేమో అన్న ఆందోళనతో అతన్ని పంపించాను. 6 అయితే తిమోతి మీ దగ్గర నుండి ఇప్పుడే వచ్చాడు. అతను మీ విశ్వసనీయత గురించి, మీ ప్రేమ గురించి తీపి కబురు తీసుకొచ్చాడు. మేము మీతో కలిసి గడిపిన సంతోషకరమైన సందర్భాల్ని మీరు ఎప్పుడూ గుర్తుచేసుకుంటున్నారని, మేము మిమ్మల్ని చూడాలని తపిస్తున్నట్టే మీరూ మమ్మల్ని చూడాలని తపిస్తున్నారని అతను చెప్పాడు. 7 సోదరులారా, అందుకే మాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు ఎదురైనా మీ వల్ల, మీరు చూపించే విశ్వసనీయత వల్ల మాకు ఊరట కలిగింది. 8 ప్రభువు శిష్యులుగా మీరు స్థిరంగా నిలబడితే మాకు కొత్త బలం వస్తుంది. 9 మీ విషయంలో దేవుని ముందు మాకు కలుగుతున్న గొప్ప సంతోషాన్ని బట్టి మీ గురించి ఆయనకు మా కృతజ్ఞతను ఎలా వ్యక్తం చేయగలం? 10 మిమ్మల్ని చూడాలని, మీ విశ్వాసం బలపడడానికి కావాల్సిన సహాయం చేయాలని కోరుకుంటున్న మేము దాని గురించి రాత్రనకా పగలనకా పట్టుదలతో దేవుణ్ణి వేడుకుంటున్నాం. 11 మేము మీ దగ్గరికి రావడానికి స్వయంగా మన తండ్రైన దేవుడు, మన ప్రభువైన యేసు మాకు మార్గం తెరవాలని కోరుకుంటున్నాం. 12 అంతేకాదు, మీ మీద మాకున్న ప్రేమ ఎక్కువౌతున్నట్టే, మీకు మీ తోటి విశ్వాసుల మీద, అలాగే అందరి మీద ఉన్న ప్రేమ ఇంకా ఎక్కువయ్యేలా ప్రభువు మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. 13 అలా, ప్రభువైన యేసు తన పవిత్రులందరితో కలిసి ప్రత్యక్షమైనప్పుడు ఆయన మీ హృదయాల్ని స్థిరపర్చాలని, మన తండ్రైన దేవుని ఎదుట మిమ్మల్ని నిందలేనివాళ్లుగా, పవిత్రులుగా నిలబెట్టాలని కోరుకుంటున్నాం.
జూలై 15-21
దేవుని వాక్యంలో ఉన్న సంపద|2 థెస్సలొనీకయులు 1-3
“పాపపురుషుడు వెల్లడి అవ్వడం”
(2 థెస్సలొనీకయులు 2:6-8) ఆ పాపపురుషుడు వెల్లడవ్వాల్సిన సమయం కన్నా ముందే వెల్లడవ్వకుండా ఇప్పుడు అతన్ని ఎవరు అడ్డుకుంటున్నారో మీకు తెలుసు. 7 నిజమే, ఎవ్వరికీ అంతుచిక్కని అతని దుష్టత్వం ఇప్పటికే పనిచేస్తోంది, అయితే అతన్ని అడ్డుకుంటున్న వ్యక్తి వెళ్లిపోయేవరకే అతని దుష్టత్వం అలా అంతుచిక్కకుండా ఉంటుంది. 8 ఆ తర్వాత, పాపపురుషుడు వెల్లడి చేయబడతాడు. యేసు ప్రభువు తన ప్రత్యక్షత సమయంలో తన నోటి ఊపిరితో అతన్ని నాశనం చేస్తాడు.
it-1-E 972-973 పేజీలు
దైవ భక్తి
ఇక్కడ మరో రహస్యం ఉంది, అది పవిత్ర రహస్యానికి పూర్తిగా వ్యతిరేకమైనది. అది ‘పాపపురుషుడి దుష్టత్వ రహస్యం’. అది ఒకప్పుడు నిజక్రైస్తవులకు రహస్యంగా ఉండేది, ఎందుకంటే అపొస్తలుడైన పౌలు కాలంలో, “పాపపురుషుడు” అంత స్పష్టంగా రూపు సంతరించుకోలేదు. ఆ తర్వాత కూడా అతను ఎవరు అనేది చాలామందికి రహస్యంగానే ఉంది, ఎందుకంటే అతను దైవభక్తి అనే ముసుగులో తన దుష్టపనులు చేస్తూ ఉంటాడు. నిజానికి అది భ్రష్టత్వం, అంటే నిజమైన దైవభక్తి నుండి పూర్తిగా పక్కకివెళ్లడం. పాపపురుషుడి దుష్టత్వం ఇప్పటికే రహస్యంగా పనిచేస్తోంది అని పౌలు తాను ఉన్న కాలం గురించి చెప్పాడు, ఎందుకంటే పాపపు ప్రభావం అప్పట్లో క్రైస్తవ సంఘం మీద ఉంది, అది ఆ తర్వాత భ్రష్టుడైన పాపపురుషుడి పుట్టుకకు దారితీసింది. చివరికి, యేసు ఆ పాపపురుషుణ్ణి తన ప్రత్యక్షత వెల్లడైనప్పుడు నాశనం చేస్తాడు. సాతాను అధీనం కిందున్న ఈ భ్రష్ట పాపపురుషుడు “దేవుడని పిలవబడే ప్రతీదాని మీద, పూజించబడే ప్రతీ వస్తువు మీద అతను తనను తాను హెచ్చించుకుంటాడు.” అలా, దేవుణ్ణి వ్యతిరేకించే ఇతను సాతాను చేతిలో పనిముట్టులా చాలా మోసాలు చేస్తాడు, అతని మార్గాల్లో నడిచేవాళ్లకు నాశనం తీసుకొస్తాడు. ఈ “పాపపురుషుడి” పనులు ఎందుకంత ప్రభావవంతంగా ఉంటాయంటే, అతను తన దుష్టత్వాన్ని వేషధారణతో కూడిన దైవభక్తి అనే ముసుగులో కప్పేస్తాడు.—2 థెస్స 2:3-12; మత్త 7:15, 21-23 కూడా చూడండి.
(2 థెస్సలొనీకయులు 2:9-12) కానీ, పాపపురుషుని ప్రత్యక్షత సాతాను వల్ల జరుగుతుంది. శక్తివంతమైన పనులు, బూటకపు అద్భుతాలు, అబ్బురపర్చే కార్యాలు చేయడానికి అతనికి శక్తిని ఇచ్చేది సాతానే. 10 రక్షణనిచ్చే సత్యం పట్ల బలమైన కోరికను చూపించనందువల్ల నాశనమౌతున్నవాళ్లను మోసం చేసేందుకు అతనికి శక్తినిచ్చేది కూడా సాతానే. 11 వాళ్లు సత్యం పట్ల ఆసక్తి చూపించలేదు కాబట్టి, వాళ్లు అబద్ధాన్ని నమ్మేలా మోసపోవడానికి దేవుడు అనుమతిస్తాడు. 12 సత్యాన్ని నమ్మకుండా అవినీతిని ప్రేమించినందుకు వాళ్లందరూ తగిన తీర్పు పొందాలని దేవుడు అలా అనుమతిస్తాడు.
it-2-E 245వ పేజీ, 7వ పేరా
అబద్ధం
అబద్ధాన్ని ఇష్టపడేవాళ్లు యేసుక్రీస్తు గురించి సువార్తను కాకుండా, “అబద్ధాన్ని నమ్మేలా మోసపోవడానికి” యెహోవా దేవుడు అనుమతిస్తాడు. (2 థెస్స 2:9-12) కొన్ని శతాబ్దాల క్రితం ఇశ్రాయేలు రాజైన అహాబుకు జరిగిన ఒక సంఘటనలో దాన్ని గమనించవచ్చు. రామోత్గిలాదు మీద యుద్ధంలో అహాబు విజయం సాధిస్తాడని అబద్ధ ప్రవక్తలు నమ్మబలికారు, కానీ యెహోవా ప్రవక్త మీకాయా మాత్రం విపత్తు వస్తుందని ప్రవచించాడు. మీకాయాకు వచ్చిన దర్శనం తెలియజేస్తున్నట్లు, ఒక దేవదూత అహాబు ప్రవక్తల్ని వెర్రివాళ్లను చేసేలా యెహోవా అనుమతించాడు. అంటే ఆ దేవదూత తన శక్తిని ఉపయోగించి ఆ ప్రవక్తలు నిజం కాకుండా, వాళ్లు కోరుకున్నదాన్ని అహాబు వినాలనుకున్నదాన్ని చెప్పేలా చేశాడు. మీకాయా హెచ్చరించినా, అహాబు మాత్రం వాళ్ల అబద్ధాల్ని వినడానికి ఇష్టపడ్డాడు, చివరికి, తన ప్రాణాల్ని కోల్పోయాడు.—1 రాజు 22:1-38; 2 దిన 18.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
(2 థెస్సలొనీకయులు 1:7, 8) పరలోకం నుండి మండుతున్న అగ్నిలో యేసు ప్రభువు శక్తిమంతులైన తన దేవదూతలతో కలిసి ప్రత్యక్షమైనప్పుడు, ప్రస్తుతం శ్రమలు అనుభవిస్తున్న మీరు మాతోపాటు విడుదల పొందుతారు. 8 అప్పుడు, దేవుడు తెలియనివాళ్ల మీద, మన ప్రభువైన యేసు గురించిన మంచివార్తకు లోబడనివాళ్ల మీద ఆయన పగ తీర్చుకుంటాడు.
it-1-E 834వ పేజీ, 5వ పేరా
అగ్ని
“ఇప్పుడున్న ఆకాశం, భూమి . . . అగ్నిలో నాశనం కావడానికి సిద్ధంగా ఉంచబడ్డాయి” అని పేతురు రాశాడు. ఆ సందర్భాన్ని, వేరే లేఖనాల్ని గమనిస్తే, అది నిజమైన అగ్నిని కాదుగానీ శాశ్వత నాశనాన్ని సూచిస్తోందని అర్థమౌతుంది. నోవహు కాలంలో జలప్రళయం వల్ల భూమ్యాకాశాలు కాదుగానీ దైవభక్తి లేనివాళ్లు నాశనం అయ్యారు; అలాగే, యేసు తన శక్తివంతమైన దూతలతో మండుతున్న అగ్నిలో బయల్పర్చబడినప్పుడు, దైవభక్తి లేనివాళ్లు అలాగే వాళ్లు భాగంగా ఉన్న దుష్ట వ్యవస్థ మాత్రమే శాశ్వతంగా నాశనం అవుతాయి.—2 పేతు 3:5-7, 10-13; 2 థెస్స 1:6-10; యెష 66:15, 16, 22, 24.
(2 థెస్సలొనీకయులు 2:2) యెహోవా రోజు వచ్చేసిందని ఎవరైనా చెప్తే వెంటనే అయోమయంలో పడిపోకండి, భయాందోళనలకు గురికాకండి. ప్రవచనం రూపంలో కావచ్చు, మాటల రూపంలో కావచ్చు, మా నుండి వచ్చిందనిపించే ఉత్తరం రూపంలో కావచ్చు, ఎలా తెలిసినా సరే ఆ విషయాన్ని నమ్మకండి.
it-1-E 1206వ పేజీ, 4వ పేరా
ప్రేరేపితం
“ప్రవచనం రూపంలో”—నిజమైనవి, అబద్ధమైనవి. అపొస్తలులు రాసిన కొన్ని పుస్తకాల్లో, న్యూమా (ఆత్మ) అనే గ్రీకు పదాన్ని ఒక ప్రత్యేక విధానంలో ఉపయోగించారు. ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు 2 థెస్సలొనీకయులు 2:2లో, “యెహోవా రోజు వచ్చేసిందని ఎవరైనా చెప్తే వెంటనే అయోమయంలో పడిపోకండి, భయాందోళనలకు గురికాకండి. ప్రవచనం [అక్షరార్థంగా, “ఆత్మ”] రూపంలో కావచ్చు, మాటల రూపంలో కావచ్చు, మా నుండి వచ్చిందనిపించే ఉత్తరం రూపంలో కావచ్చు, ఎలా తెలిసినా సరే ఆ విషయాన్ని నమ్మకండి” అని థెస్సలొనీకయలో ఉన్న సహోదరులకు రాశాడు. ఇక్కడ పౌలు న్యూమా (ఆత్మ) అనే పదాన్ని, సందేశాన్ని చేరవేసేవాటిని అంటే “నోటి మాటల్ని” లేదా “ఉత్తరాన్ని” సూచిస్తూ ఉపయోగించాడు. అందుకే ఈ వచనం గురించి లాంజెస్ కామెంటరీ ఆన్ ద హోలీ స్క్రిప్చర్స్ (126వ పేజీ) ఇలా చెప్తోంది: “ఇక్కడ అపొస్తలుడు ఆధ్యాత్మిక నిర్దేశాన్ని, జరగబోయేది ముందే చెప్పడాన్ని, ప్రవక్త మాటల్ని సూచిస్తున్నాడు.” (పీ. షాఫ్, 1976లో అనువదించి, కూర్చినవి) విన్సెంట్స్ వర్డ్ స్టడీస్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ ఇలా చెప్తోంది: “ఆత్మ ప్రేరేపితం ద్వారా. అంటే, దేవుడే వెల్లడిచేస్తున్నాడని చెప్తూ, క్రైస్తవ సమాజాల్లో చెప్పే ప్రవచనాత్మక మాటలు ద్వారా.” (1957, 4వ సంపుటి, 63వ పేజీ) కాబట్టి కొన్ని అనువాదాలు ఇక్కడ, అలాగే ఇలాంటి మరికొన్ని చోట్ల న్యూమా అనే పదాన్ని కేవలం “ఆత్మ” అని అనువదిస్తుండగా, వేరే అనువాదాలు “ఆత్మ సందేశం” (AT), “జరగబోయేది ముందే చెప్పడం” (JB), “ప్రేరేపితం” (దొస్టెర్‌వాల్డ్; సెగోంద్ [ఫ్రెంచ్]), “ప్రవచనం రూపం” (NW), అని అనువదించాయి.
చదవాల్సిన బైబిలు భాగం
(2 థెస్సలొనీకయులు 1:1-12) మన తండ్రైన దేవునితో, ప్రభువైన యేసుక్రీస్తుతో ఐక్యంగా ఉన్న థెస్సలొనీకయుల సంఘానికి పౌలు, సిల్వాను, తిమోతి రాస్తున్న ఉత్తరం. 2 మన తండ్రైన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు మీకు అపారదయను, శాంతిని ప్రసాదించాలి. 3 సోదరులారా, మీ కోసం ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత మామీద ఉంది. మేము అలా చెప్పడం సరైనది, ఎందుకంటే మీ విశ్వాసం అంతకంతకూ ఎక్కువౌతోంది, మీలో ప్రతీ ఒక్కరికి ఒకరిమీద ఒకరికున్న ప్రేమ కూడా పెరుగుతోంది. 4 అందుకే దేవుని సంఘాల్లో మీ గురించి మేము గొప్పగా మాట్లాడుతుంటాం; మీరు మీ హింసలన్నిట్లో, మీరు ఎదుర్కొంటున్న కష్టాల్లో ఎంతో సహనాన్ని, విశ్వాసాన్ని చూపించారు. 5 దేవుని నీతిగల తీర్పుకు అది రుజువు. దీనివల్ల మీరు దేవుని రాజ్యానికి అర్హులౌతారు. నిజానికి, ఇందుకోసమే మీరు బాధలు అనుభవిస్తున్నారు. 6 మిమ్మల్ని శ్రమ పెట్టేవాళ్లను దేవుడు శ్రమలపాలు చేస్తాడు. నిజానికి, అది ఆయన దృష్టికి న్యాయమే. 7 పరలోకం నుండి మండుతున్న అగ్నిలో యేసు ప్రభువు శక్తిమంతులైన తన దేవదూతలతో కలిసి ప్రత్యక్షమైనప్పుడు, ప్రస్తుతం శ్రమలు అనుభవిస్తున్న మీరు మాతోపాటు విడుదల పొందుతారు. 8 అప్పుడు, దేవుడు తెలియనివాళ్ల మీద, మన ప్రభువైన యేసు గురించిన మంచివార్తకు లోబడనివాళ్ల మీద ఆయన పగ తీర్చుకుంటాడు. 9 శాశ్వత నాశనమనే శిక్ష పడిన వీళ్లు ప్రభువు కళ్ల ముందు నుండి వెళ్లగొట్టబడతారు. ఆయన గొప్ప శక్తిని వాళ్లు ఇక చూడరు. 10 ఆయన తన పవిత్రులతో కలిసి మహిమపర్చబడడానికి వచ్చినప్పుడు ఇది జరుగుతుంది. ఆయన మీద విశ్వాసం ఉంచినవాళ్లంతా ఆ రోజు ఆయన్ని ఆశ్చర్యంగా చూస్తారు. మేము ఇచ్చిన సాక్ష్యాన్ని మీరు నమ్మారు కాబట్టి మీకు కూడా అందులో భాగం ఉంటుంది. 11 అందుకే మేము మీ కోసం ఎప్పుడూ ప్రార్థిస్తున్నాం. దేనికోసమైతే దేవుడు మిమ్మల్ని పిలిచాడో దానికి ఆయన మిమ్మల్ని అర్హులుగా ఎంచాలనీ, ఆయన తన శక్తితో తనకు ఇష్టమైన ప్రతీ మంచిదాన్ని చేయాలనీ, విశ్వాసంతో మీరు చేసే ప్రతీదాన్ని ఆయన సంపూర్ణం చేయాలనీ ప్రార్థిస్తున్నాం. 12 మన ప్రభువైన యేసు పేరు మీ ద్వారా ఘనపర్చబడాలని, అలాగే మీరు ఆయనతోపాటు ఘనపర్చబడాలని మా ఉద్దేశం. ఆ ఘనత మన దేవుని అపారదయ వల్ల, ప్రభువైన యేసుక్రీస్తు అపారదయ వల్ల కలుగుతుంది.
జూలై 22-28
దేవుని వాక్యంలో ఉన్న సంపద|1 తిమోతి 1-3
“మంచిపని చేయడానికి కృషి చేయండి”
(1 తిమోతి 3:1) ఈ మాట నమ్మదగినది: ఓ వ్యక్తి సంఘంలో పర్యవేక్షకుడు అవ్వడానికి కృషి చేస్తుంటే, అతను మంచిపని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టే.
w16.08 21వ పేజీ, 3వ పేరా
ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తూ ఉండండి
3 1 తిమోతి 3:1 చదవండి. పర్యవేక్షకులుగా సేవచేసేందుకు అర్హత సంపాదించడానికి కృషిచేస్తున్న సహోదరులను అపొస్తలుడైన పౌలు మెచ్చుకున్నాడు. ఉదాహరణకు ఓ వ్యక్తి, దూరంలో ఉన్న ఏదైనా వస్తువును అందుకోవాలంటే కొంచెం కృషి చేయాలి, బహుశా తన చేతిని కాస్త ముందుకు చాపాల్సిన అవసరం కూడా రావచ్చు. ఇప్పుడు ఓసారి, సంఘ పరిచారకుడు అవ్వాలని కోరుకుంటున్న ఓ సహోదరుని గురించి ఆలోచించండి. ముందుగా అతను క్రైస్తవ లక్షణాల్ని మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరముందని గుర్తించి, దానికోసం కృషిచేస్తాడు. అతను సంఘ పరిచారకునిగా సేవ చేయడం మొదలుపెట్టాక, సంఘపెద్దగా సేవచేసేందుకు ఉండాల్సిన అర్హతల్ని సంపాదించడానికి కృషిచేస్తాడు.
(1 తిమోతి 3:13)చక్కగా పరిచారం చేసే పురుషులు మంచి పేరు సంపాదించుకుంటారు, క్రీస్తుయేసుకు సంబంధించిన విశ్వాసం గురించి ఎంతో ధైర్యంగా మాట్లాడగలుగుతారు.
km 9/78-E 4వ పేజీ, 7వ పేరా
వాళ్లు “మంచి పేరు సంపాదించుకుంటారు”
7 వాళ్లు “మంచి పేరు సంపాదించుకుంటారు” అని పౌలు అలాంటి పురుషుల గురించి ఎందుకన్నాడో అర్థం చేసుకోవడం కష్టంకాదు. అయితే కొంతమంది చెప్తున్నట్లు, అది చర్చీలో పై స్థాయికి ఎదగడం కాదు. బదులుగా, “చక్కగా పరిచర్య చేసే” సంఘ పరిచారకులు తమను యెహోవా, యేసు దీవిస్తారనే, సంఘమంతటి గౌరవాన్ని, మద్దతుని పొందుతామనే నమ్మకంతో ఉండవచ్చు. అందుకే వాళ్లు “క్రీస్తుయేసుకు సంబంధించిన విశ్వాసం గురించి ఎంతో ధైర్యంగా మాట్లాడగలుగుతారు.” తమకిచ్చిన బాధ్యతను నెరవేర్చడం ద్వారా, వాళ్లు తమ చక్కని సేవకు ఇతరుల కృతజ్ఞతల్ని పొందుతారు; వాళ్లు విశ్వాసంలో స్థిరంగా ఉంటారు, భయపడకుండా లేదా చెడ్డపేరు తీసుకొస్తామనే భయం లేకుండా తమ విశ్వాసం గురించి ఇతరులతో మాట్లాడతారు.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
(1 తిమోతి 1:4) అలాగే కట్టుకథల మీద, వంశావళుల వివరాల మీద మనసు పెట్టవద్దని వాళ్లకు ఆజ్ఞాపించు. ఎందుకంటే వాటివల్ల ఒరిగేదేమీ లేదు; అవి అనవసరమైన ఊహాగానాలకే దారితీస్తాయి. మన విశ్వాసాన్ని బలపర్చడానికి దేవుడు ఇస్తున్నవాటిలో అవి లేవు.
it-1-E 914-915 పేజీలు
వంశావళి
అలాంటి వాటిగురించి పరిశోధించడం, చర్చించుకోవడం వృథా. పౌలు తిమోతికి రాసిన కాలంలో అది ఇంకా అనవసరం. ఒకవ్యక్తి ఏ వంశం నుండి వచ్చాడో రుజువు చేసే వంశావళి పట్టికల్ని ఎప్పటికప్పుడు సరిగ్గా ఉండేలా చూసుకోవడం వల్ల అప్పట్లో ఇక ఏమాత్రం ప్రయోజనం లేదు. ఎందుకంటే దేవుడు క్రైస్తవ సంఘంలోని యూదుల్ని, యూదులు కానివాళ్లను ఒకేలా చూస్తున్నాడు. (గల 3:28) అలాగే, క్రీస్తు దావీదు వంశంలో వచ్చాడని పట్టికలు అప్పటికే తిరుగులేని విధంగా నిరూపించాయి. అంతేకాదు, పౌలు ఆ మాటలు రాసిన కొంతకాలానికే యెరూషలేము నాశనమైంది, యూదా వంశావళి పట్టికలు కూడా నాశనమయ్యాయి. దేవుడు వాటిని కాపాడలేదు. తిమోతి అలాగే సంఘాలంతా అలాంటి వంశవృక్షాలను పరిశోధించే పనిలో పడిపోయి వాళ్ల ధ్యాస పక్కకు మళ్లుతుందేమోనని పౌలు కంగారుపడ్డాడు, ఆ పనులు క్రైస్తవ విశ్వాసానికి ఏమాత్రం దోహదపడవు. యేసే మెస్సీయ అని నిరూపించడానికి బైబిల్లోని వంశావళి పట్టిక సరిపోతుంది, క్రైస్తవులకు ముఖ్యమైన వంశావళి పట్టిక అదే. బైబిల్లోని మిగతా వంశావళి పట్టికలు, లేఖనాల్లో ఉన్నది నిజమైన చరిత్ర అని నిరూపిస్తూ లేఖనాలు ప్రామాణికమైనవని రుజువు చేస్తాయి.
(1 తిమోతి 1:17) ఎన్నడూ నాశనం కాని, కంటికి కనిపించని, శాశ్వత కాలం రాజుగా ఉండే ఏకైక దేవునికి యుగయుగాలు ఘనత, మహిమ కలగాలి. ఆమేన్.
‘ఇదిగో! మన దేవుడు’
15 యెహోవాకు మాత్రమే అన్వయించబడే మరో బిరుదు, “సకల యుగములలో రాజు” అనేది. (1 తిమోతి 1:17; ప్రకటన 15:3) దీని అర్థమేమిటి? మన పరిమిత మేరకు దానిని పూర్తిగా గ్రహించడం కష్టం, అయితే యెహోవా ఇరువైపులా అంటే భూత భవిష్యత్ కాలాల్లో నిత్యుడు. కీర్తన 90:2 ఇలా చెబుతోంది: “యుగయుగములు నీవే దేవుడవు.” అందువల్ల యెహోవాకు ఆరంభంలేదు; ఆయన సర్వకాలాల్లో ఉనికిలో ఉన్నాడు. విశ్వంలో ఎవ్వరూ, ఏదీ ఉనికిలోకి రాకపూర్వమే ఆయన ఎప్పటినుండో ఉనికిలోవున్నాడు కాబట్టి, సముచితంగానే ఆయన “మహావృద్ధుడు” అని పిలువబడ్డాడు. (దానియేలు 7:9, 13, 22) మహోన్నతునిగా ఆయన హక్కు గురించి న్యాయంగా ఎవరు ప్రశ్నించగలరు?
చదవాల్సిన బైబిలు భాగం
(1 తిమోతి 2:1-15) కాబట్టి మొట్టమొదటిగా నేను మిమ్మల్ని కోరేదేమిటంటే, మీరు అన్నిరకాల ప్రజల కోసం అభ్యర్థనలు, ప్రార్థనలు, విన్నపాలు చేయండి, కృతజ్ఞతలు చెల్లించండి. 2 రాజుల కోసం, ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ల కోసం కూడా అలా చేయండి. అప్పుడు మనం అన్నివిషయాల్లో దైవభక్తిని, పట్టుదలను చూపిస్తూ నెమ్మది కలిగి, ప్రశాంతంగా జీవించగలుగుతాం. 3 ఇది మన రక్షకుడైన దేవుని దృష్టిలో మంచిది, ఆయనకు ఇష్టమైనది. 4 అన్నిరకాల ప్రజలు సత్యం గురించిన సరైన జ్ఞానాన్ని సంపాదించుకొని రక్షించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. 5 దేవుడు ఒక్కడే. దేవునికి, మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తుయేసు అనే మనిషి. 6 ఆయన అందరి కోసం సరిసమానమైన విమోచన క్రయధన బలిగా తనను తాను అర్పించుకున్నాడు. తగిన సమయంలో ప్రజలు దాని గురించి సాక్ష్యమిస్తారు. 7 దీని గురించి సాక్ష్యమివ్వడానికే నేను ప్రచారకుడిగా, అపొస్తలుడిగా నియమించబడ్డాను; విశ్వాసం విషయంలో, సత్యం విషయంలో అన్యులకు బోధకునిగా నియమించబడ్డాను. నేను నిజమే చెప్తున్నాను, అబద్ధమాడట్లేదు. 8 కాబట్టి, మీరు సమావేశమయ్యే ప్రతీచోట పురుషులు కోపానికి, వాదులాటలకు చోటివ్వకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. 9 అలాగే స్త్రీలు రకరకాల జడలతో, బంగారంతో, ముత్యాలతో లేదా ఖరీదైన బట్టలతో అలంకరించుకోవడం కాదుగానీ అణకువ, మంచి వివేచన ఉట్టిపడేలా గౌరవప్రదమైన బట్టలతో తమను తాము అలంకరించుకోవాలి. 10 అంతేకాదు దైవభక్తిగల స్త్రీలకు తగినట్టుగా మంచి పనులతో తమను తాము అలంకరించుకోవాలి. 11 స్త్రీలు పూర్తిగా లోబడివుంటూ, మౌనంగా ఉండి నేర్చుకోవాలి. 12 బోధించడానికి గానీ, పురుషుని మీద అధికారం చెలాయించడానికి గానీ స్త్రీకి నేను అనుమతి ఇవ్వను; ఆమె మౌనంగా ఉండాలి. 13 ఎందుకంటే ముందు ఆదాము సృష్టించబడ్డాడు, ఆ తర్వాతే హవ్వ సృష్టించబడింది. 14 అంతేకాదు, ఆదాము మోసపోలేదు కానీ స్త్రీయే పూర్తిగా మోసపోయింది, పాపం చేసింది. 15 ఏదేమైనా, పిల్లల్ని కనడం ద్వారా స్త్రీ సురక్షితంగా ఉంటుంది; అయితే, మంచి వివేచన చూపించడంతోపాటు విశ్వాసంతో, ప్రేమతో, పవిత్రతతో నడుచుకుంటూ ఉంటేనే ఆమె సురక్షితంగా ఉంటుంది.
జూలై 29–ఆగస్టు 4
దేవుని వాక్యంలో ఉన్న సంపద|1 తిమోతి 4-6
“దైవభక్తికి, సంపదలకు తేడా”
(1 తిమోతి 6:6-8) నిజమే, దైవభక్తితో జీవిస్తే గొప్ప లాభమే ఉంటుంది. అయితే దైవభక్తితో పాటు సంతృప్తి కలిగి జీవిస్తేనే లాభం. 7 మనం ఈ లోకంలోకి ఏమీ తీసుకురాలేదు, ఈ లోకం నుండి ఏమీ తీసుకుపోలేం. 8 కాబట్టి ఆహారం, బట్టలు ఉంటే చాలు; వాటితోనే తృప్తిపడదాం.
సంతృప్తి రహస్యాన్ని తెలుసుకోవడం
పౌలు సంతోషానికి కారణమైన ప్రధానాంశం, ఆయనకున్న సంతృప్తి స్వభావం. సంతృప్తితో ఉండడం అంటే ఏమిటి? సరళంగా చెప్పాలంటే, కనీస అవసరాలతో తృప్తిగా ఉండడమని దాని భావం. పరిచర్యలో తన సహచరుడైన తిమోతికి పౌలు ఆ విషయం గురించి ఇలా చెప్పాడు: “సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది. మనమీ లోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.”—1 తిమోతి 6:6-8.
పౌలు సంతృప్తిని దైవభక్తితో జతచేశాడని గమనించండి. నిజమైన సంతోషం దైవభక్తి నుండి వస్తుందని, అంటే భౌతిక సంపదలకు లేదా ధనానికి కాక దేవుని సేవకు మొదటి స్థానాన్నివ్వడం ద్వారా వస్తుందని ఆయన గ్రహించాడు. ఆయన దైవభక్తిని వెంటాడుతూనే ఉండడానికి “అన్నవస్త్రములు” కేవలం సహాయకాలుగానే ఉపయోగపడ్డాయి. కాబట్టి పౌలు సంతృప్తికి రహస్యం, పరిస్థితులు ఏవైనప్పటికీ యెహోవాపై ఆధారపడడమే.
(1 తిమోతి 6:9) ధనవంతులు అవ్వాలని నిశ్చయించుకున్నవాళ్లు ప్రలోభంలో, ఉరిలో, ఎన్నో హానికరమైన వెర్రి కోరికల్లో చిక్కుకుంటారు; అవి మనుషుల్ని నాశనం చేస్తాయి, కూలదోస్తాయి.
g 6/07-E 6వ పేజీ, 2వ పేరా
ధనవంతులు అవ్వాలనే నిశ్చయం—మీపై ఎలాంటి ప్రభావం చూపించవచ్చు?
నిజమే, బాగా డబ్బు సంపాదించాలనే ప్రయత్నం కారణంగా ఎక్కువమంది చనిపోకపోవచ్చు. కానీ అందులో మునిగిపోయినప్పుడు వాళ్ల జీవితం వాళ్లకు తెలియకుండానే గడిచిపోతుంది. అలాగే ఉద్యోగంలో ఉండే ఒత్తిడి, డబ్బు సంపాదించాలనే ఒత్తిడి వల్ల ఆందోళన, నిద్రలేమి, తీవ్రమైన తలనొప్పి, లేదా కడుపులో పుండ్లు రావచ్చు. వీటివల్ల ఆ వ్యక్తికి సంతోషం ఉండదు, అంతేకాదు అవి ఒక వ్యక్తి ఆయుష్షును తగ్గించేస్తాయి. కొన్నిసార్లు అతను తప్పు తెలుసుకొని సరిదిద్దుకోవాలనుకున్నా, అప్పటికే బాగా ఆలస్యం కావచ్చు. అతని భార్యకు అతనిపై నమ్మకం పోయుండొచ్చు, అతని పిల్లలు భావోద్వేగ సమస్యలతో పోరాడుతుండవచ్చు, అతని ఆరోగ్యం కూడా బాగా పాడైవుండవచ్చు. బహుశా అలాంటి కొన్ని నష్టాల్ని సరిచేయవచ్చు, కానీ అందుకోసం చాలా శ్రమపడాలి. అలాంటివాళ్లు నిజంగా “ఎన్నో బాధలతో తమను తామే పొడుచుకున్నారు.”—1 తిమోతి 6:10.
(1 తిమోతి 6:10) ఎందుకంటే డబ్బు మీద మోజు అన్నిరకాల హానికరమైన విషయాలకు మూలం. దాని మోజులో పడి కొందరు విశ్వాసం నుండి తొలగిపోయారు, ఎన్నో బాధలతో తమను తాము పొడుచుకున్నారు.
g 11/08-E 6వ పేజీ, 4-6 పేరాలు
విజయానికి ఆరు సూత్రాలు
మనం మొదటి ఆర్టికల్‌లో గమనించినట్లు, డబ్బు ఉంటేనే విజయం అనుకొని దానికోసం ప్రాకులాడేవాళ్లు ఎండమావుల వెనుక పరిగెడుతున్నారు. వాళ్లు నిరాశతోపాటు ఎన్నో బాధల్ని అనుభవిస్తారు. ఉదాహరణకు సంపదల కోసం పరుగెత్తేవాళ్లు, కుటుంబంతో, స్నేహితులతో ఉన్న సంబంధాన్ని పాడుచేసుకుంటారు. కొంతమంది అవసరమైన నిద్రను త్యాగం చేస్తారు, ఉద్యోగం కారణంగా కాకపోయినా ఆందోళన వల్ల, చింతల వల్ల వాళ్లకు నిద్రపట్టదు. “కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు; అయితే ఐశ్వర్యవంతులకు తమ ధనసమృద్ధిచేత నిద్రపట్టదు” అని ప్రసంగి 5:12 చెప్తోంది.
డబ్బు క్రూరమైన యజమాని మాత్రమే కాదు, మోసకరమైనది కూడా. “సిరిసంపదలకున్న మోసకరమైన శక్తి” గురించి యేసు మాట్లాడాడు. (మార్కు 4:19) ఇంకోమాటలో చెప్పాలంటే, సిరిసంపదలు ఆనందాన్ని ఇస్తాయని వాగ్దానం చేస్తాయి, కానీ ఇవ్వలేవు. అవి కేవలం ఇంకా సంపాదించాలనే కోరికను కలిగిస్తాయి అంతే. “ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యముచేత తృప్తినొందడు” అని ప్రసంగి 5:10 చెప్తోంది.
కాబట్టి, డబ్బు మీద మోజు ఓటమికే నడిపిస్తుంది; నిరాశకు, చిరాకుకు, చివరికి నేరాలకు కారణమౌతుంది. (సామెతలు 28:20) నిజానికి ఉదారంగా ఇవ్వడం, క్షమించే గుణం, నైతిక పవిత్రత, ప్రేమ, దేవునితో మంచి సంబంధం వంటివి సంతోషానికి, విజయానికి నడిపిస్తాయి.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
(1 తిమోతి 4:2) వాత వేయబడిన మనస్సాక్షి కలిగివున్న, అబద్ధాలాడే వేషధారుల వల్ల వాళ్లు అలా తప్పుదోవ పడతారు.
మీరెలా మంచి మనస్సాక్షితో ఉండవచ్చు?
17 ‘నిర్మలమైన మనస్సాక్షి కలిగివుండండి’ అని అపొస్తలుడైన పేతురు రాశాడు. (1 పేతురు 3:15, 16) యెహోవా దేవుని దృష్టిలో నిర్మలమైన అంటే మంచి మనస్సాక్షి కలిగివుండడం గొప్ప వరం. నేడు చాలామందికి అలాంటి మనస్సాక్షి లేదు. పౌలు “వాతవేయబడిన మనస్సాక్షిగల” వాళ్ళ గురించి మాట్లాడాడు. (1 తిమోతి 4:3) వాత వేసినచోట చర్మం కాలి, మచ్చపడి ఆ భాగం మొద్దుబారుతుంది. ఒక విధంగా చెప్పాలంటే చాలామంది మనస్సాక్షి అలాగే వాతవేయబడి మొద్దుబారిపోయింది. అందుకే అది వారిని తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరించదు, అడ్డుపడదు, తర్వాత అపరాధ భావాలతో బాధించదు. అయినా వాళ్లు అదేం పట్టనట్టు హాయిగా జీవించేస్తున్నారు.
(1 తిమోతి 4:13) నేను వచ్చేంతవరకు బహిరంగంగా చదివే విషయంలో, ప్రోత్సహించే విషయంలో, బోధించే విషయంలో నిమగ్నమవ్వు.
it-2-E 714వ పేజీ, 1-2 పేరాలు
బహిరంగంగా చదవడం
క్రైస్తవ సంఘంలో. మొదటి శతాబ్దంలో కొంతమంది దగ్గరే బైబిలు గ్రంథపు చుట్టలు ఉండేవి, కాబట్టి బహిరంగంగా చదివి వినిపించడం అప్పట్లో చాలా ప్రాముఖ్యం. అపొస్తలుడైన పౌలు తాను రాసిన పత్రికల్ని క్రైస్తవ సంఘ కూటాల్లో బహిరంగంగా చదవాలని, అలాగే వేరే సంఘాలకు రాసిన ఉత్తరాలను కూడా తమ కూటాల్లో చదవాలని ఆజ్ఞాపించాడు. (కొలొ 4:16; 1 థెస్స 5:27) పౌలు యువ పర్యవేక్షకుడైన తిమోతికి “బహిరంగంగా చదివే విషయంలో, ప్రోత్సహించే విషయంలో, బోధించే విషయంలో నిమగ్నమవ్వు” అని సలహా ఇచ్చాడు.—1 తిమో 4:13.
బహిరంగంగా చదివేవాళ్లు అనర్గళంగా చదవాలి. (హబ 2:2) బహిరంగంగా చదవడం వల్ల ఇతరులు నేర్చుకుంటారు కాబట్టి, అలా చదివేవాళ్లు తాము చదివే సమాచారాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి, రచయిత ఉద్దేశాన్ని స్పష్టంగా గ్రహించాలి, వినేవాళ్లు తప్పుగా అర్థం చేసుకునేలా చదవకుండా జాగ్రత్తపడాలి. ప్రకటన 1:3 చెప్తున్నట్లు, ఆ ప్రవచనాన్ని చదివి వినిపించేవాళ్లు, అలాగే వాటిని విని పాటించేవాళ్లు సంతోషంగా ఉంటారు.
చదవాల్సిన బైబిలు భాగం
(1 తిమోతి 4:1-16) అయితే, తర్వాతి కాలాల్లో కొందరు విశ్వాసాన్ని విడిచిపెడతారని దేవుని పవిత్రశక్తి స్పష్టంగా చెప్తోంది. వాళ్లు దేవుని నుండి వచ్చాయనిపించే మోసపూరిత సందేశాల్ని, చెడ్డదూతల బోధల్ని వినడం వల్ల అలా జరుగుతుంది. 2 వాత వేయబడిన మనస్సాక్షి కలిగివున్న, అబద్ధాలాడే వేషధారుల వల్ల వాళ్లు అలా తప్పుదోవ పడతారు. 3 వాళ్లు పెళ్లిని నిషేధిస్తారు. కొన్నిరకాల ఆహారపదార్థాల్ని తినకూడదని ప్రజలకు ఆజ్ఞాపిస్తారు. నిజానికి విశ్వాసం, అలాగే సత్యం గురించిన సరైన జ్ఞానం ఉన్నవాళ్లు కృతజ్ఞతలు చెల్లించి తినడానికి దేవుడు వాటిని సృష్టించాడు. 4 దేవుడు సృష్టించిన ప్రతీది మంచిదే; కృతజ్ఞతలు చెల్లించి తింటే, ఏదీ నిషిద్ధం కాదు. 5 ఎందుకంటే దేవుని మాట ద్వారా, ప్రార్థన ద్వారా అది పవిత్రమౌతుంది. 6 నువ్వు ఈ సలహాను సోదరులకు ఇస్తే విశ్వాసానికి సంబంధించిన మాటలతో, అలాగే నువ్వు జాగ్రత్తగా పాటించిన మంచి బోధకు సంబంధించిన మాటలతో పోషించబడుతూ క్రీస్తుయేసుకు మంచి పరిచారకునిగా ఉంటావు. 7 అయితే, ముసలమ్మలు చెప్పే కథల్లా ఉండే భక్తిహీనమైన కట్టుకథల్ని తిరస్కరించు. ఇంకోవైపున, దైవభక్తి చూపించడమే లక్ష్యంగా పెట్టుకొని నీకు నువ్వు శిక్షణ ఇచ్చుకో. 8 ఎందుకంటే శారీరక వ్యాయామం కొంతవరకు ప్రయోజనకరమే, కానీ దైవభక్తి అన్ని విషయాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. దానివల్ల ఇప్పుడు, అలాగే భవిష్యత్తులో దీవెనలు వస్తాయి. 9 ఆ మాట నిజమైనది, పూర్తిగా నమ్మదగినది. 10 ఇందుకే మనం కష్టపడి పనిచేస్తున్నాం, ప్రయాసపడుతున్నాం. ఎందుకంటే అన్నిరకాల ప్రజలకు, ముఖ్యంగా నమ్మకమైన వాళ్లకు రక్షకుడైన జీవంగల దేవుని మీద మనం నిరీక్షణ ఉంచాం. 11 ఈ ఆజ్ఞల్ని తెలియజేస్తూ, బోధిస్తూ ఉండు. 12 నీ యౌవనాన్ని బట్టి నిన్ను ఎవ్వరూ, ఎప్పుడూ చిన్నచూపు చూడకుండా జాగ్రత్తపడు. మాట్లాడే విషయంలో, ప్రవర్తన విషయంలో, ప్రేమ విషయంలో, విశ్వాసం విషయంలో, పవిత్రత విషయంలో నమ్మకస్థులకు ఆదర్శంగా ఉండు. 13 నేను వచ్చేంతవరకు బహిరంగంగా చదివే విషయంలో, ప్రోత్సహించే విషయంలో, బోధించే విషయంలో నిమగ్నమవ్వు. 14 నీలో ఉన్న వరాన్ని నిర్లక్ష్యం చేయకు. పెద్దల సభ నీమీద చేతులు ఉంచినప్పుడు ప్రవచనం ద్వారా నీకు ఆ వరం ఇవ్వబడింది. 15 వీటిని ధ్యానించు; నీ ప్రగతి అందరికీ స్పష్టంగా కనిపించేలా వీటిలో నిమగ్నమవ్వు. 16 నీ గురించి, నీ బోధ గురించి జాగ్రత్తగా ఉండు. వీటి విషయంలో పట్టుదల చూపించు. అలాచేస్తే నిన్ను నువ్వు రక్షించుకుంటావు, నువ్వు బోధించేది వినేవాళ్లను కూడా రక్షిస్తావు.