క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్ రెఫరెన్సులు
సెప్టెంబరు 7-13
దేవుని వాక్యంలో ఉన్న సంపద|నిర్గమకాండం 23-24
“సమూహంతో పాటు వెళ్లకండి”
మీకు వాస్తవాలు తెలుసా?
7 స్నేహితులకు ఈ-మెయిల్స్, మెసేజ్‌లు పంపించడం మీకు ఇష్టమా? ఏదైనా ఆసక్తికరమైన విషయాన్ని వార్తల్లో చూసినప్పుడు లేదా విన్నప్పుడు ఒక రిపోర్టర్‌లా దాన్ని వెంటనే షేర్ చేయాలని మీకు అనిపిస్తుందా? ఈ-మెయిల్స్ లేదా మెసేజ్‌లు పంపించే ముందు ఇలా ప్రశ్నించుకోండి: ‘ఈ సమాచారం నిజమేనా? నాకు వాస్తవాలు తెలుసా?’ పూర్తి వివరాలు తెలీకపోతే, మీరు అబద్ధాల్ని వ్యాప్తి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఏదైనా విషయం నిజమో కాదో మీకు తెలీకపోతే దాన్ని పంపకండి. డిలీట్ చేయండి.
8 అనాలోచితంగా ఈ-మెయిల్స్, మెసేజ్‌లు పంపడం వల్ల మరో ప్రమాదం కూడా ఉంది. కొన్ని దేశాల్లో మన పనిపై ఆంక్షలు లేదా నిషేధాలు ఉన్నాయి. ఆ దేశాల్లో వ్యతిరేకులు మనల్ని భయపెట్టడానికి, ఒకరిమీద ఒకరికి అనుమానం కలిగేలా చేయడానికి కావాలనే అబద్ధాలు వ్యాప్తి చేయవచ్చు. ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో ఏమి జరిగిందో పరిశీలించండి. సంస్థలో పెద్దపెద్ద బాధ్యతల్లో ఉన్న కొంతమంది సహోదరులు యెహోవాసాక్షుల్ని మోసం చేశారని కె.జి.బి. అని పిలువబడే రహస్య పోలీసులు పుకార్లు పుట్టించారు. విచారకరంగా, చాలామంది సహోదరులు ఆ అబద్ధాల్ని నమ్మి యెహోవా సంస్థను విడిచిపెట్టారు. కాలం గడిచిన కొద్దీ వాళ్లలో చాలామంది తిరిగొచ్చారు. కానీ కొంతమంది మాత్రం ఇప్పటివరకు తిరిగి రాలేదు. వాళ్లు ఆ అబద్ధాల వల్ల విశ్వాసాన్ని కోల్పోయారు. (1 తిమో. 1:19) అలాంటి పరిస్థితి రాకుండా మనమెలా జాగ్రత్తపడవచ్చు? తప్పుడు సమాచారాన్ని లేదా ఎలాంటి ఆధారాల్లేని సమాచారాన్ని వ్యాప్తి చేయకండి. మీరు వినే ప్రతీదాన్ని నమ్మే బదులు వాస్తవాలు తెలుసుకోండి.
it-1-E 11వ పేజీ, 3వ పేరా
అహరోను
అహరోను తప్పు చేసిన మూడు సందర్భాలు గమనిస్తే, జరిగిన తప్పులకు ముఖ్య కారణం ఆయన కాదని స్పష్టమౌతుంది; బదులుగా పరిస్థితుల ప్రభావం వల్ల, ఇతరుల ఒత్తిడి వల్ల ఆయన తప్పు దారిలో వెళ్లుంటాడు. ముఖ్యంగా ఆయన మొదటిసారి తప్పు చేసినప్పుడు, “చెడు చేయడానికి సమూహంతో పాటు వెళ్లకూడదు” అనే ఆజ్ఞ వెనకున్న సూత్రాన్ని పాటించి ఉండాల్సింది. (నిర్గ 23:2) అయితే ఆ తర్వాత, ఆయన గురించి లేఖనాలు గౌరవపూర్వకంగానే ప్రస్తావిస్తున్నాయి. అంతేకాదు దేవుని కుమారుడు భూమ్మీద ఉన్నప్పుడు, అహరోను యాజకత్వం చట్టబద్ధమైనదని గుర్తించాడు.—కీర్త 115:10, 12; 118:3; 133:1, 2; 135:19; మత్త 5:17-19; 8:4.
it-1-E 343వ పేజీ, 5వ పేరా
గుడ్డితనం
న్యాయం తీర్చేవాళ్లు అవినీతికి పాల్పడి న్యాయాన్ని తప్పుదారి పట్టించడాన్ని గుడ్డితనంతో పోల్చబడింది. లంచాలు, బహుమానాలు తీసుకోకూడదని, పక్షపాతం చూపించకూడదని ధర్మశాస్త్రం పదేపదే చెప్తోంది. ఎందుకంటే అలాంటివి న్యాయమూర్తి కళ్లకు గుడ్డితనం కలుగజేస్తాయి, అప్పుడు అతను న్యాయాన్ని పక్కదారి పట్టిస్తాడు. “లంచం . . . స్పష్టంగా చూడగలిగేవాళ్లకు గుడ్డితనం కలిగిస్తుంది.” (నిర్గ 23:8) “లంచం తెలివిగలవాళ్ల కళ్లకు గుడ్డితనం కలిగిస్తుంది.” (ద్వితీ 16:19) న్యాయమూర్తి ఎంత నీతిగలవాడు, వివేకం ఉన్నవాడు అయినా, వివాదంలో ఉన్నవాళ్లు ఇచ్చే బహుమతులు తీసుకుంటే, అతను తెలిసిగానీ, తెలియకుండా గానీ న్యాయాన్ని పక్కదారి పట్టించే అవకాశం ఉంది. అయితే బహుమానాల వల్ల మాత్రమే కాదు, సొంత భావాలు-అభిప్రాయాల వల్ల కూడా న్యాయం పక్కదారి పట్టవచ్చు. అందుకే, దేవుని ధర్మశాస్త్రం ఈ తెలివైన సలహా ఇచ్చింది: “పేదవాళ్ల విషయంలో పక్షపాతం చూపించకూడదు లేదా ధనవంతుల మీద అభిమానం చూపించకూడదు.” (లేవీ 19:15) కాబట్టి, న్యాయమూర్తి తన సొంత భావాలు-అభిప్రాయాల వల్ల గానీ, పదిమందిలో మంచిపేరు తెచ్చుకోవాలని గానీ, ఒక వ్యక్తి ధనవంతుడనే ఒకేఒక్క కారణంతో అతనికి వ్యతిరేకంగా తీర్పు తీర్చకూడదు.—నిర్గ 23:2, 3.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
అపరిచితుల పట్ల దయచూపించడం మర్చిపోకండి
4 పరదేశులను గౌరవించమని ఇశ్రాయేలీయులను కేవలం ఆజ్ఞాపించడమే కాదుగానీ, పరదేశిగా జీవించడం ఎలా ఉంటుందో వాళ్లు గుర్తుతెచ్చుకోవాలని యెహోవా కోరుకున్నాడు. (నిర్గమకాండము 23:9 చదవండి.) తమకు బానిసలు అవ్వకముందు కూడా జాతి లేదా మత బేధాన్నిబట్టి ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను ఇష్టపడేవాళ్లు కాదు. (ఆది. 43:32; 46:33, 34; నిర్గ. 1:11-14) పరదేశులుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు చాలా కష్టాలుపడ్డారు. ఆ అనుభవాల్ని గుర్తుచేసుకొని, ఇశ్రాయేలీయులు పరదేశుల పట్ల దయ చూపించాలని యెహోవా కోరుకున్నాడు.—లేవీ. 19:33, 34.
it-2-E 393
మిఖాయేలు
1. గబ్రియేలు కాకుండా బైబిల్లో ప్రస్తావించబడిన మరో దేవదూత మిఖాయేలు; “ప్రధానదూత” అనే బిరుదు మిఖాయేలుకు మాత్రమే ఉంది. (యూదా 9) ఆ పేరు గురించి మొట్టమొదటి ప్రస్తావన దానియేలు పదవ అధ్యాయంలో కనిపిస్తుంది, అక్కడ మిఖాయేలు “ప్రధాన అధిపతుల్లో ఒకడు” అని వర్ణించబడ్డాడు; తక్కువ శ్రేణికి చెందిన ఒక దేవదూతను “పారసీక రాజ్యాధిపతి” వ్యతిరేకించినప్పుడు మిఖాయేలు ఆ దేవదూతకు సహాయం చేయడానికి వచ్చాడు. మిఖాయేలు ‘[దానియేలు] అధిపతి’ అని, “[దానియేలు] ప్రజల పక్షాన నిలబడుతూవున్న గొప్ప అధిపతి” అని పిలువబడ్డాడు. (దాని 10: 13, 20, 21; 12:1) దీన్నిబట్టి, ఎడారిలో ఇశ్రాయేలీయుల్ని నడిపించిన దేవదూత మిఖాయేలు అని తెలుస్తోంది. (నిర్గ 23:20, 21, 23; 32:34; 33:2) ఆ విషయం, ‘ప్రధానదూత మిఖాయేలు మోషే శరీరం గురించి అపవాదితో వాదించాడు’ అనే సంఘటన ద్వారా కూడా రుజువౌతుంది.—యూదా 9.
సెప్టెంబరు 14-20
దేవుని వాక్యంలో ఉన్న సంపద|నిర్గమకాండం 25-26
“గుడారంలో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన వస్తువు”
it-1-E 165
ఒప్పంద మందసం
నమూనా, రూపం. ప్రత్యక్ష గుడారానికి, ఇశ్రాయేలీయులకు సంబంధించిన అత్యంత ప్రాముఖ్యమైన వస్తువు ఒప్పంద మందసం; అందుకే గుడారాన్ని కట్టమని యెహోవా మోషేకు సూచనలు ఇస్తున్నప్పుడు, ముందుగా ఒప్పంద మందసం నమూనాకు, రూపానికి సంబంధించిన నిర్దేశాలు తెలియజేశాడు. ఆ మందసం పొడవు 2.5 మూరలు, వెడల్పు 1.5 మూరలు, ఎత్తు 1.5 మూరలు. (దాదాపు 111 × 67 × 67 సెంటిమీటర్లు; 44 × 26 × 26 అంగుళాలు). అది తుమ్మ చెక్కతో చేయబడింది, దాని లోపల, బయట స్వచ్ఛమైన బంగారు రేకు తొడిగించబడింది. “దాని చుట్టూ” అందమైన అలంకరణగా “బంగారంతో అంచు” తయారుచేయబడింది. మందసంలోని రెండవ భాగం, దాని మూత. దాన్ని చెక్కతో తయారుచేసి బంగారపు రేకు తొడిగించలేదుగానీ, పూర్తిగా స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది. దాని పొడవు, వెడల్పు కూడా మందసంతో సమానంగా ఉన్నాయి. ఆ మూత మీద సుత్తితో మలచబడిన రెండు బంగారు కెరూబులు ఉన్నాయి, ఒక్కో కెరూబు ఒక్కో కొన మీద ఎదురెదురుగా ఉన్నాయి, వాటి ముఖాలు మూత వైపు తిరిగి ఉన్నాయి; వాటి రెక్కలు పైకి విప్పి, మందసాన్ని కప్పి ఉంచాయి. (నిర్గ 25:10, 11, 17-22; 37:6-9) ఆ మూత “ప్రాయశ్చిత్త మూత” అని కూడా పిలువబడింది.—నిర్గ 25:17; హెబ్రీ 9:5. “ప్రాయశ్చిత్త మూత” చూడండి.
it-1-E 166వ పేజీ, 2వ పేరా
ఒప్పంద మందసం
పవిత్రమైన మందసం ముఖ్యమైన వస్తువుల్ని అంటే, సాక్ష్యంగా ఉండే రాతి పలకల్ని లేదా పది ఆజ్ఞల్ని భద్రపర్చడానికి ఉపయోగపడేది. (నిర్గ 25:16) ఆ మందసంలో “మన్నా ఉన్న బంగారు పాత్ర, చిగురించిన అహరోను కర్ర” కూడా ఉండేవి, కానీ సొలొమోను ఆలయం కట్టడానికి కొంతకాలం ముందు అవి తీసేయబడ్డాయి. (హెబ్రీ 9:4; నిర్గ 16:32-34; సం 17:10; 1రా 8:9; 2ది 5:10) మోషే చనిపోవడానికి కాస్త ముందు, ఆయన యాజకులైన లేవీయులకు ‘ధర్మశాస్త్రాన్ని’ ఇచ్చి, దాన్ని మందసం లోపల కాదుగానీ ‘ఒప్పంద మందసం పక్కన పెట్టాలని, అది వాళ్ల మీద సాక్షిగా పనిచేస్తుందని’ ఆయన చెప్పాడు.—ద్వితీ 31:24-26.
it-1-E 166వ పేజీ, 3వ పేరా
ఒప్పంద మందసం
దేవుని ప్రత్యక్షతకు సంబంధించినది. మందసం ఉన్నంతకాలం అది దేవుని ప్రత్యక్షతకు గుర్తుగా పనిచేసింది. యెహోవా ఇలా మాటిచ్చాడు, “అక్కడ నేను నీకు కనిపించి, ఆ మూత మీద నుండి నీతో మాట్లాడతాను. సాక్ష్యపు మందసం మీదున్న కెరూబుల మధ్య నుండి నేను నీతో మాట్లాడతాను.” “నేను ఆ మందసం మూత మీద మేఘంలో కనిపిస్తాను.” (నిర్గ 25:22; లేవీ 16:2) యెహోవా ‘కెరూబుల పైన కూర్చున్నాడు’ అని సమూయేలు రాశాడు (1స 4:4); కాబట్టి కెరూబులు యెహోవా ‘రథానికి ప్రతీకగా’ ఉన్నారు. (1ది 28:18) అందుకే, “[యెహోవాతో] మాట్లాడడం కోసం మోషే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్లినప్పుడల్లా, సాక్ష్యపు మందసం మూత పైనుండి, అంటే రెండు కెరూబుల మధ్య నుండి ఒక స్వరం తనతో మాట్లాడడం అతను వినేవాడు; అప్పుడు దేవుడు అతనితో మాట్లాడేవాడు.” (సం 7:89) కొంతకాలానికి యెహోషువ, అలాగే ప్రధాన యాజకుడైన ఫీనెహాసు మందసం ముందు యెహోవా దగ్గర విచారణ చేశారు. (యెహో 7:6-10; న్యా 20:27, 28) అయితే, సంవత్సరానికి ఒక రోజు ప్రధాన యాజకుడు మాత్రమే అతి పవిత్ర స్థలంలోకి వెళ్లి మందసాన్ని చూసేవాడు; ఆయన అక్కడికి యెహోవాతో మాట్లాడడానికి కాదుగానీ, ప్రాయశ్చిత్త రోజును ఆచరించడానికి వెళ్లేవాడు.—లేవీ 16:2, 3, 13, 15, 17; హెబ్రీ 9:7.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
it-1-E 432వ పేజీ, 1వ పేరా
కెరూబు
ఎడారిలో ఉన్నప్పుడు నిలబెట్టిన ప్రత్యక్ష గుడారం నమూనాలో, కెరూబు రూపాలు కూడా చేర్చబడ్డాయి. సుత్తితో మలచిన రెండు బంగారు కెరూబులు మందసం మూత ఈ కొన మీద ఒకటి, ఆ కొన మీద ఇంకొకటి ఉండేవి. అవి ఎదురెదురుగా ఉండేవి, దేవున్ని ఆరాధిస్తున్నట్టుగా వాటి ముఖాలు మూత వైపు తిరిగి ఉండేవి. ఒక్కో కెరూబుకు రెండు రెక్కలు ఉన్నాయి, అవి పైకి విప్పుకొని, మందసాన్ని కాపాడుతున్నట్టు మూతను కప్పి ఉంచేవి. (నిర్గ 25:10-21; 37:7-9) అలాగే, గుడారాన్ని తయారుచేయడానికి ఉపయోగించిన లోపలివైపు తెరల మీద; పవిత్ర స్థలానికి, అతి పవిత్ర స్థలానికి మధ్య ఉన్న తెర మీద కూడా కెరూబుల్ని బుట్టాపనిగా చేశారు.—నిర్గ 26:1, 31; 36:8, 35.
it-2-E 936
సముఖపు రొట్టెలు
గుడారంలోని లేదా ఆలయంలోని పవిత్ర స్థలంలో బల్లమీద ఉండే పన్నెండు రొట్టెల్ని సముఖపు రొట్టెలు అనేవాళ్లు. ప్రతీ సబ్బాతు రోజున వాటిని తీసేసి, తాజా రొట్టెలు పెట్టేవాళ్లు. (నిర్గ 35:13; 39:36; 1రా 7:48; 2ది 13:11; నెహె 10:32, 33) హెబ్రీ భాషలో సముఖపు రొట్టెకు ఉపయోగించిన పదానికి అక్షరార్థంగా “ముఖపు రొట్టె” అనే అర్థం ఉంది. “ముఖం” అనే పదానికి కొన్నిసార్లు “సన్నిధి” అనే అర్థం కూడా వస్తుంది (2రా 13:23), కాబట్టి సముఖపు రొట్టె యెహోవా ఎదుట లేదా ఆయన సన్నిధిలో ఒక అర్పణగా ఎప్పుడూ ఉంచబడేది.—నిర్గ 25:30, అధస్సూచి.
సెప్టెంబరు 21-27
దేవుని వాక్యంలో ఉన్న సంపద|నిర్గమకాండం 27-28
“యాజకుల వస్త్రాల నుండి మనం ఏ విషయాలు నేర్చుకోవచ్చు?”
it-2-E 1143
ఊరీము, తుమ్మీము
ఊరీము, తుమ్మీము అనేవి చీట్లు అని చాలామంది బైబిలు వ్యాఖ్యాతలు నమ్ముతున్నారు. జేమ్స్ మొఫా అనువాదంలోని, నిర్గమకాండం 28:30 లో వాటిని “పవిత్ర చీట్లు” అని అన్నారు. కొంతమంది అవి మూడు చీట్లని, ఒక దానిమీద “అవును,” రెండో దానిమీద “కాదు” అని చెక్కబడి ఉంటుందని, మూడోది ఖాళీ చీటీ అని అంటారు. ఎవరికైనా ఒక ప్రశ్న వచ్చినప్పుడు, దానికి జవాబు తెలుసుకోవడానికి ఈ చీట్లు వేసేవాళ్లు. ఒకవేళ ఖాళీ చీటీ వస్తే, వాళ్లకు జవాబు రాలేదని అర్థం. ఇంకొంతమంది ఊరీము, తుమ్మీము అనేవి బల్లపరుపుగా ఉన్న రెండు రాళ్లు అని, అవి ఒకవైపు తెల్లగా, మరోవైపు నల్లగా ఉండేవని అంటారు. వాటిని వేసినప్పుడు, రెండూ తెలుపు పడితే “అవును” అని, రెండూ నలుపు పడితే “కాదు” అని, ఒకటి నలుపు ఇంకోటి తెలుపు పడితే జవాబు రాలేదని అంటారు. ఒక సందర్భంలో సౌలు, ఫిలిష్తీయుల మీద యుద్ధం కొనసాగించాలో వద్దో యాజకుడి ద్వారా విచారణ చేసినప్పుడు ఆయనకు ఏ జవాబూ రాలేదు. దాంతో సౌలు తన మనుషుల్లో ఎవరో పాపం చేసివుంటారు అనుకొని, “ఇశ్రాయేలు దేవా, తుమ్మీము ద్వారా జవాబు ఇవ్వు” అని అడిగాడు. అక్కడున్నవాళ్లలో సౌలు, యోనాతాను ఎంపిక చేయబడ్డారు. ఆ తర్వాత వాళ్లిద్దరిలో ఒకర్ని ఎంపిక చేయడానికి చీట్లు వేయబడ్డాయి. ఈ వృత్తాంతంలో, “తుమ్మీము ద్వారా జవాబు ఇవ్వు” అని అడగడానికి, చీట్లు వేయడానికి మధ్య సంబంధం ఉన్నట్టు అనిపించినా, నిజానికి అవి రెండు వేర్వేరు పద్ధతులని అనిపిస్తోంది.—1స 14:36-42.
it-1-E 849వ పేజీ, 3వ పేరా
నుదురు
ఇశ్రాయేలు ప్రధాన యాజకుడు. ఇశ్రాయేలు ప్రధాన యాజకుడి తలపాగా ముందుభాగంలో, అంటే నుదుటి మీద పవిత్రమైన బంగారు రేకు ఉండేది. ఆ రేకు మీద “ముద్రమీద చెక్కినట్టు,” “పవిత్రత యెహోవాకు చెందుతుంది అనే మాటలు” చెక్కి ఉండేవి. ఆ బంగారు రేకు “సమర్పణకు గుర్తుగా” ఉండేది. (నిర్గ 28:36-38; 39:30) ఇశ్రాయేలు ప్రధాన యాజకుడు యెహోవా ఆరాధనకు ముఖ్య ప్రతినిధి కాబట్టి, ఆయన పనిచేసే చోటును శుభ్రంగా ఉంచుకోవడం తగినది. ఆ రేకు మీద చెక్కిన మాటలు, యెహోవా సేవ చేసే ఇశ్రాయేలీయులందరూ ఎప్పుడూ శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉందని వాళ్లకు గుర్తుచేసేది. అంతేకాదు, యెహోవా చేత గొప్ప ప్రధాన యాజకుడిగా నియమించబడి, దేవుని పవిత్రతను సమర్థించే యేసుక్రీస్తుకు అది సూచనగా ఉంది.—హెబ్రీ 7:26.
గౌరవపూర్వకంగా ప్రవర్తించడం ద్వారా యెహోవాను ఘనపరచండి
17 యెహోవాను ఆరాధిస్తున్నప్పుడు మనం గౌరవప్రదంగా ప్రవర్తించడం మరింత ప్రాముఖ్యం. “నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము” అని ప్రసంగి 5:1 చెబుతోంది. పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు చెప్పులు తీసేయాల్సిందిగా మోషే, యెహోషువలకు ఆజ్ఞాపించబడింది. (నిర్గ. 3:5; యెహో. 5:15) గౌరవానికి లేదా పూజ్యభావానికి సూచనగా అలా చేయమని చెప్పబడ్డారు. ఇశ్రాయేలు యాజకులు “మానమును కప్పుకొనుటకు” నారలాగులను వేసుకోవాలని ఆదేశించబడ్డారు. (నిర్గ. 28:42, 43) అలా చేయడం, వారు బలిపీఠం దగ్గర సేవచేస్తున్నప్పుడు అసభ్యకరంగా కనిపించకుండా ఉండేందుకు దోహదపడింది. యాజకుని కుటుంబంలోని వారందరూ గౌరవప్రదంగా ప్రవర్తించే విషయంలో దేవుని ప్రమాణాన్ని అనుసరించాల్సివచ్చేది.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
w12-E 8/1 26వ పేజీ, 1-3 పేరాలు
మీకు తెలుసా?
ప్రధాన యాజకుని వక్షపతకం మీదున్న విలువైన రాళ్లను ఇశ్రాయేలీయులు బహుశా ఎక్కడి నుండి తీసుకొచ్చి ఉంటారు?
ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టి, ఎడారిలోకి అడుగుపెట్టిన తర్వాత, వక్షపతకాన్ని తయారు చేయమనే ఆజ్ఞను దేవుడు వాళ్లకు ఇచ్చాడు. (నిర్గమకాండం 28:15-21) ఆ వక్షపతకంలో మాణిక్యం, పుష్యరాగం, మరకతం, లేత నీలం రాయి, నీలం రాయి, సూర్యకాంతపు రాయి, లెషెము రాయి, మలచబడిన రాయి, ఊదారంగు రాయి, లేతపచ్చ రాయి, సులిమాని రాయి, పచ్చ రాయి ఉండేవి. ఈ విలువైన రాళ్లన్నీ ఇశ్రాయేలీయులు దగ్గర ఉండేవా?
బైబిలు కాలాల్లో, ప్రజలు రత్నాలను విలువైనవిగా ఎంచేవాళ్లు, అందుకే వాటిని కొనుక్కునేవాళ్లు, అమ్మేవాళ్లు. ఉదాహరణకు ఆ కాలంనాటి ఐగుప్తీయులు సుదూర దేశాల నుండి, అంటే ఇప్పుడు ఇరాన్, అఫ్గనిస్తాన్ అని పిలువబడుతున్న దేశాల నుండి, బహుశా భారతదేశం నుండి కూడా విలువైన రాళ్లను కొనుక్కునేవాళ్లు. ఐగుప్తు దేశంలోని గనుల్లో రకరకాల విలువైన రాళ్లు దొరికేవి. ఐగుప్తును పాలించిన నియంతలకు, వాళ్ల కిందున్న ప్రాంతాల్లో దొరికే ఖనిజాలను వెలికితీయడానికి సర్వహక్కులు ఉండేవి. పూర్వీకుడైన యోబు, తన కాలంలోని ప్రజలు సొరంగాల్లో, గుహల్లో సంపదల కోసం ఏవిధంగా వెదికేవాళ్లో వర్ణించాడు. భూమి నుండి ఎన్నో రకాల విలువైన రాళ్లను వెలికి తీసినప్పటికీ నీలం రాయిని, పుష్యరాగం రాయిని యోబు ముఖ్యంగా ప్రస్తావించాడు.—యోబు 28:1-11, 19.
ఇశ్రాయేలీయులు ఐగుప్తు విడిచి వస్తున్నప్పుడు అక్కడి ప్రజల దగ్గరున్న విలువైనవాటిని దోచుకున్నారని నిర్గమకాండం తెలియజేస్తుంది. (నిర్గమకాండం 12:35, 36) కాబట్టి ప్రధాన యాజకుడి వక్షపతకంలో పొదిగిన రాళ్లను, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండే తీసుకొచ్చి ఉండవచ్చు.
it-1-E 1130వ పేజీ, 2వ పేరా
పవిత్రత
జంతువులు, పంట. మొదట పుట్టిన ఎద్దు, గొర్రె, మేక యెహోవా కోసం పవిత్రమైన అర్పణగా ఎంచబడేవి, వాటిని విడిపించకూడదు. అవి బలిగా అర్పించబడాలి, వాటి మాంసంలోని కొంతభాగం ప్రతిష్ఠిత యాజకులకు చెందాలి. (సం 18:17-19) ప్రథమఫలం, అలాగే పంటలోని పదోవంతు పవిత్రమైనవి. పవిత్రమైన స్థలంలో అర్పించడానికి పక్కకు తీసిన జంతువులు, కానుకలు ఎంత పవిత్రమైనవో; ప్రథమఫలాలు, పదోవంతు కూడా అంతే పవిత్రమైనవి. (నిర్గ 28:38) యెహోవా పవిత్రంగా ఎంచేవన్నీ పవిత్రమైనవి; వాటిని చులకనగా, అగౌరవంగా చూడకూడదు, లేదా మామూలు పనుల కోసం వాడకూడదు. ఉదాహరణకు, పదోవంతుకు సంబంధించిన ఈ నియమాన్ని పరిశీలించండి. ఒకవ్యక్తి తన గోధుమ పంటలోని పదోవంతును పక్కకు తీసి పెట్టిన తర్వాత, అనుకోకుండా అతను లేదా అతని ఇంట్లో ఎవరైనా అందులోని కొంతభాగం ఇంట్లోవాళ్లకు భోజనం తయారుచేయడానికి ఉపయోగించారు అనుకుందాం. అప్పుడు ఆ వ్యక్తి, పవిత్రమైన వాటికి సంబంధించిన దేవుని నియమాన్ని మీరినట్లు అవుతుంది. దానికి పరిహారంగా అతను మందలో నుండి ఏ లోపంలేని పొట్టేలును బలిగా అర్పించడంతోపాటు, పదోవంతుకు మరో 20 శాతం కలిపి చెల్లించాలి. ఆ విధంగా, యెహోవాకు చెందిన పవిత్రమైన వాటిపట్ల ప్రజలకు గొప్ప గౌరవం ఏర్పడింది.—లేవీ 5:14-16.
సెప్టెంబరు 28–అక్టోబరు 4
దేవుని వాక్యంలో ఉన్న సంపద|నిర్గమకాండం 29-30
“యెహోవాకు ఇచ్చే కానుక”
it-2-E 764-765
పేర్ల నమోదు
సీనాయి దగ్గర. యెహోవా ఆజ్ఞ ప్రకారం, మొట్టమొదటిసారిగా ప్రజల పేర్లు నమోదు చేయడం సీనాయి దగ్గర జరిగింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చిన రెండో సంవత్సరం, రెండో నెలలో అది జరిగింది. ఆ పనిలో మోషేకు సహాయంగా ఉండేలా, ఒక్కో గోత్రం నుండి ఒక వ్యక్తి ప్రధానుడిగా ఎంచుకోబడ్డాడు. అతను వాళ్లందరి పేర్లు నమోదు అయ్యేలా చూస్తూ ఆ పనిని పర్యవేక్షించాలి. 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉండి సైన్యంలో సేవ చేయగలిగే మగవాళ్లందరి పేర్లను నమోదు చేయాలి. అలా పేర్లు నమోదైన ప్రతీ వ్యక్తి ప్రత్యక్ష గుడారపు సేవకు మద్దతుగా అర షెకెల్ ($1.10) ఇవ్వాలి. (నిర్గ 30:11-16; సం 1:1-16, 18, 19) అలా పేర్లు నమోదైనవాళ్ల మొత్తం సంఖ్య 6,03,550. అయితే లేవీయుల్ని ఆ లెక్కలో నమోదు చేయలేదు. వాళ్లకు దేశంలో స్వాస్థ్యం ఉండదు. వాళ్లు ప్రత్యక్ష గుడారపు సేవకు పన్ను కట్టాల్సిన అవసరం లేదు, సైన్యంలో పనిచేయాల్సిన అవసరం లేదు.—సం 1:44-47; 2:32, 33; 18:20, 24.
it-1-E 502
కానుక
ధర్మశాస్త్రం ప్రకారం, ప్రజలు కొన్ని రకాల కానుకలు ఇవ్వాల్సి వచ్చేది. మోషే ఇశ్రాయేలీయుల జనాభా లెక్క తీసుకున్నప్పుడు, 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న మగవాళ్లందరూ తమ ప్రాణ విమోచన కోసం, “పవిత్ర స్థల షెకెల్ కొలమానం ప్రకారం అర షెకెల్‌ను [సుమారు $1.10]” ఇచ్చారు. “తమ ప్రాణాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి,” “ప్రత్యక్ష గుడారపు సేవకు మద్దతుగా” అది వాళ్లు యెహోవాకు ఇచ్చే కానుక. (నిర్గ 30:11-16) యూదా చరిత్రకారుడైన జోసిఫస్ ప్రకారం, (ద జ్యూష్ వార్, VII, 218 [vi, 6]), ఆ తర్వాతి కాలం నుండి ఈ “పవిత్రమైన పన్నును” ప్రతీ సంవత్సరం చెల్లించేవాళ్లు.—2ది 24:6-10; మత్త 17:24; పన్ను చూడండి.
w11-E 11/1 12వ పేజీ, 1-2 పేరాలు
మీకు తెలుసా?
యెరూషలేములోని యెహోవా ఆలయంలో జరిగే పనులకు అవసరమయ్యే డబ్బు ఎలా వచ్చేది?
పన్నుల రూపంలో, ముఖ్యంగా దశమ భాగంగా వచ్చే డబ్బును ఆలయంలో జరిగే వివిధ పనులకు ఉపయోగించేవాళ్లు. ఇతర రకాల పన్నులు కూడా ఆలయ ఖర్చులకు ఉపయోగపడేవి. ఉదాహరణకు, ప్రత్యక్ష గుడారం నిర్మాణం జరుగుతున్నప్పుడు, పేరు నమోదైన ప్రతీ ఇశ్రాయేలీయుని నుండి అర వెండి షెకెల్‌ను ‘యెహోవాకు కానుకగా’ సేకరించమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు.—నిర్గమకాండం 30:12-16.
అప్పటినుండి యూదులందరూ ప్రతీ సంవత్సరం అర వెండి షెకెల్‌ను ఆలయ పన్నుగా చెల్లించడం ఆనవాయితీగా మారి ఉండవచ్చు. యేసు పేతురుతో, చేప నోట్లో దొరికిన నాణెంను కట్టమని చెప్పింది బహుశా ఆలయ పన్నుగానే అయ్యుండవచ్చు.—మత్తయి 17:24-27.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
it-1-E 1029వ పేజీ, 4వ పేరా
చెయ్యి
చేతులు ఉంచడం. ఒక మనిషిని లేదా వస్తువును మామూలుగా పట్టుకోవడానికే కాకుండా, వేర్వేరు కారణాల చేత అతని మీద లేదా దాని మీద చేతులు ఉంచేవాళ్లు. సాధారణంగా ఒకరి మీద చేతులు ఉంచడం ఏదైనా హోదా ఇవ్వడానికి, ఒక మనిషికి లేదా వస్తువుకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడానికి సూచనగా ఉండేది. యాజకత్వం ఏర్పాటు చేసేటప్పుడు, అహరోను అలాగే ఆయన కుమారులు బలిగా అర్పించబోతున్న కోడెదూడ తలమీద, రెండు పొట్టేళ్ల తలమీద చేతులు ఉంచారు. వాళ్లు యెహోవా దేవుని యాజకులు అయ్యేలా ఆ జంతువులు వాళ్ల కోసం బలిగా అర్పించబడుతున్నాయని అది సూచించింది. (నిర్గ 29:10, 15, 19; లేవీ 8:14, 18, 22) దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, తన స్థానంలో యెహోషువను నియమిస్తున్నప్పుడు మోషే యెహోషువ మీద తన చెయ్యి ఉంచాడు. అప్పుడు యెహోషువ “తెలివితో నిండిపోయాడు,” ఇశ్రాయేలీయుల్ని సరైన దారిలో నడిపించగలిగాడు. (ద్వితీ 34:9) ఎవరైనా వ్యక్తిని దీవించేటప్పుడు కూడా అతని మీద చేతులు ఉంచేవాళ్లు. (ఆది 48:14; మార్కు 10:16) యేసుక్రీస్తు కొంతమందిని బాగుచేస్తున్నప్పుడు వాళ్లను ముట్టుకున్నాడు, లేదా వాళ్ల మీద చేతులు ఉంచాడు. (మత్త 8:3; మార్కు 6:5; లూకా 13:13) కొన్ని సందర్భాల్లో, అపొస్తలులు ప్రజల మీద చేతులు ఉంచినప్పుడు వాళ్లు పవిత్రశక్తి వరాన్ని పొందారు.—అపొ 8:14-20; 19:6.
it-1-E 114వ పేజీ, 1వ పేరా
అభిషిక్తులు, అభిషేకించడం
యెహోవా మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో, అభిషేక తైలాన్ని తయారు చేసే పద్ధతి తెలియజేశాడు. అది అత్యంత శ్రేష్ఠమైన పదార్థాలను, అంటే బోళం, సుగంధభరిత దాల్చిన చెక్క, సుగంధభరిత వస, లవంగిపట్ట, ఒలీవ నూనె కలిపి తయారుచేసే ప్రత్యేకమైన తైలం. (నిర్గ 30:22-25) ఈ తైలాన్ని తయారుచేసి, దాన్ని సామాన్య పనులకు లేదా ఆమోదంలేని పనులకు ఉపయోగించే వ్యక్తిని చంపేవాళ్లు. (నిర్గ 30:31-33) అవును, అభిషేక తైలాన్ని చులకనగా చూడకూడదు, ఎందుకంటే పవిత్రమైన తైలంతో అభిషేకించబడిన వ్యక్తిని బరువైన బాధ్యతల కోసం యెహోవా ఎంచుకున్నాడని సూచించింది.