కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 5/1 పేజీలు 30-31
  • తలిదండ్రుల విశ్వాసం ప్రతిఫలాన్ని పొందింది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తలిదండ్రుల విశ్వాసం ప్రతిఫలాన్ని పొందింది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • విశ్వాసంతో ప్రవర్తించడం
  • బాబును కనుగొనడం జరిగింది
  • మన కొరకు పాఠం
  • ‘విశ్వాసం వల్ల మోషేను దాచిపెట్టారు’
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • మోషే యెహోవాను ఆరాధించాలని నిర్ణయించుకున్నాడు
    నా బైబిలు పుస్తకం
  • ఐగుప్తు సంపదలకంటే గొప్పది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • పసివాడైన మోషే రక్షించబడడం
    నా బైబిలు కథల పుస్తకము
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 5/1 పేజీలు 30-31

వారు యెహోవా చిత్తాన్ని చేశారు

తలిదండ్రుల విశ్వాసం ప్రతిఫలాన్ని పొందింది

ఇశ్రాయేలీయులకు మగ శిశువు జననం అత్యంత ఆనందకరమైన విషయం. వంశానుక్రమం కొనసాగుతుందనీ స్వాస్థ్యంగా పొందిన భూమి కుటుంబంలోనే మిగిలి ఉంటుందనీ దాని అర్థం. అయితే సా.శ.పూ. 1593వ సంవత్సరంలో, కుమారునికి జన్మనివ్వడం ఒక దీవెన కాదుగానీ శాపమని హెబ్రీయులకు అనిపించి ఉండవచ్చు. ఎందుకు? తన ఆధిపత్యం క్రిందవున్న యూదా జనాభా వర్ధిల్లడాన్ని చూసి భయభీతి చెందిన ఐగుప్తు ఫరో, ఇశ్రాయేలీయుల మగ శిశువులనందరినీ చంపేయమని ఆజ్ఞాపించాడు.—నిర్గమకాండము 1:12, 15-22.

జాతి సంహారాన్ని చేయాలన్న ఈ ఘోరమైన ప్రయత్నం జరుగుతున్న కాలంలోనే హెబ్రీ దంపతులైన అమ్రాము యోకెబెదులకు ఒక అందమైన మగ శిశువు జన్మించాడు. అయితే వారికి ఫరో ఆజ్ఞ జ్ఞాపకం వచ్చినప్పుడు వారి ఆనందాన్ని భయం ఎలా ఆవరించి ఉంటుందో ఊహించవచ్చు. అయినప్పటికీ, అమ్రాము యోకెబెదులు తమ మగ శిశువును చూసి, ఎలాంటి పర్యవసానాలు వచ్చినప్పటికీ వాడిని వదిలేయకూడదని దృఢంగా నిర్ణయించుకున్నారు.—నిర్గమకాండము 2:1, 2; 6:20.

విశ్వాసంతో ప్రవర్తించడం

మూడు నెలల వరకూ అమ్రాము యోకెబెదులు తమ బాబును దాచి ఉంచారు. (నిర్గమకాండము 2:2) అయితే, హెబ్రీయులూ ఐగుప్తీయులు కూడా అతి సమీపంలో నివసించేవారు గనుక ఇది ప్రమాదంతో కూడుకున్న పని. ఫరో ఆజ్ఞను ధిక్కరించేందుకు ప్రయత్నించి పట్టుబడిన వారెవరైనా మరణదండనను పొందుతారు, మరి బాబు కూడా మరణిస్తాడు. తమ కుమారున్నీ తమనూ కాపాడుకునేందుకు ఆ భక్తిగల తలిదండ్రులు ఏమి చేయగలరు?

యోకెబెదు కొంత జమ్ము (పపైరస్‌) గడ్డిని సేకరించింది. జమ్ముగడ్డి దృఢమైన నారగల మొక్క, అది పేములానే ఉంటుంది. ఒక వేలి మందంలో మూడు కోణాల కాండం ఉంటుంది. అది ఆరు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఐగుప్తీయులు కాగితం, చాపలు, తెరచాపలు, పాదరక్షలు, తేలికైన పడవలు తయారు చేసేందుకు ఈ మొక్కను ఉపయోగించేవారు.

జమ్ము గడ్డితో యోకెబెదు తన బాబు పట్టేంత పరిమాణంగల ఒక పెట్టెను తయారు చేసింది. తరువాత ఆ పెట్టె విడిపోకుండా ఉండేందుకూ దానిలోకి నీళ్లు పోకుండా ఉండేందుకు ఆమె దానికి జిగటమంటినీ కీలునూ పూసింది. యోకెబెదు తర్వాత తన బాబును ఆ పెట్టెలో పెట్టి, నైలు నది తీరానున్న నాచులో దాన్ని పెట్టింది.—నిర్గమకాండము 2:3.

బాబును కనుగొనడం జరిగింది

ఇప్పుడేమి జరుగనైయుందో చూసేందుకు యోకెబెదు కుమార్తె అయిన మిరియాము అక్కడికి దగ్గర్లోనే వేచి ఉంది. తర్వాత ఫరో కుమార్తె నైలు నదిలో స్నానం చేసేందుకు వచ్చింది.a నైలు నది యొక్క ఈ భాగానికి రాకుమార్తె తరచుగా వస్తుందని బహుశ యోకెబెదుకు తెలిసి ఉండే ఆమె ఆ పెట్టెను సులభంగా కనుగొనగలిగే స్థలంలో పెట్టి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ, నాచులో ఉంచబడిన ఆ పెట్టెను ఫరో కుమార్తె వెంటనే గమనించింది, దాన్ని తీసుకురమ్మని ఆమె తన చెలికత్తెలలో ఒకరికి చెప్పింది. దానిలో ఉన్న ఏడుస్తున్న బాబును ఆమె చూసినప్పుడు, ఆమెకు జాలి కలిగింది. ఆ బాబు హెబ్రీయుల కుమారుడని ఆమె గుర్తించింది. అయినప్పటికీ, అంతటి చక్కని పిల్లవాడు హత్య చేయబడేందుకు ఆమె వాన్ని ఎలా అప్పగించగలదు? మానవ సహజమైన దయతో పాటూ, ఒకరి జీవితంలో వారు చేసిన దయగల పనుల పట్టిక ఆధారంగానే వారు స్వర్గానికి వెళ్లగలరనే ప్రఖ్యాత ఐగుప్తు నమ్మకాన్నిబట్టి కూడా ఫరో కుమార్తె ప్రభావితం చెంది ఉండవచ్చు.b—నిర్గమకాండము 2:5, 6.

దూరంనుండి ఇదంతా గమనిస్తున్న మిరియాము, ఫరో కుమార్తె వద్దకు వచ్చింది. “నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా” అని ఆమె అడిగింది. రాకుమారి ఇలా సమాధానమిచ్చింది: “వెళ్లు!” మిరియాము తల్లి దగ్గరకు పరుగెత్తింది. కొంత వ్యవధిలోనే, యోకెబెదు ఫరో కుమార్తె ఎదుటకు వచ్చింది. “ఈ బిడ్డను తీసికొని పోయి నాకొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చెదనని” రాకుమారి ఆమెకు చెప్పింది. యోకెబెదే ఆ బిడ్డ తల్లి అనే విషయం ఇప్పటికల్లా ఫరో కుమార్తెకు అర్థమై ఉంటుంది.—నిర్గమకాండము 2:7-9.

వాడు పాలు విడిచేంత వరకూ యోకెబెదు వాడిని తన వద్ద పెట్టుకుంటుంది.c సత్య దేవుడైన యెహోవాను గురించి వానికి బోధించేందుకు ఇది ఆమెకు ఎన్నో ప్రశస్తమైన అవకాశాలనిచ్చింది. తర్వాత యోకెబెదు ఆ బాబును ఫరో కుమార్తె వద్దకు తీసుకువచ్చింది, ఆమె వానికి ‘నీటిలోనుండి రక్షించబడెను’ అనే అర్థంగల మోషే అనే పేరు పెట్టింది.—నిర్గమకాండము 2:10.

మన కొరకు పాఠం

అమ్రాము యోకెబెదులు స్వచ్ఛారాధనకు సంబంధించిన సూత్రాలను తమ కుమారునికి బోధించేందుకు తమకు లభించిన స్వల్ప అవకాశాన్ని కూడా సంపూర్ణంగా ఉపయోగించుకున్నారు. నేటి తలిదండ్రులు కూడా అలాగే చేయాలి. వాస్తవానికి, వారు అలా చేయడం తప్పనిసరి. అపవాదియైన సాతాను “గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.” (1 పేతురు 5:8) అతడు ప్రశస్తమైన యౌవనులను అంటే యెహోవా యొక్క చక్కని సేవకులు కాగల ఉత్తరాపేక్షను కలిగివున్న బాలబాలికలను బలిగొనాలని ఎంతో ఇష్టపడతాడు. వారి యౌవన సంవత్సరాలు అతడికి జాలినీ కరుణనూ కలిగించవు! ఈ విషయం దృష్ట్యా, జ్ఞానవంతులైన తలిదండ్రులు సత్య దేవుడైన యెహోవాకు భయపడాలని తమ పసి పిల్లలకు నేర్పిస్తారు.—సామెతలు 22:6; 2 తిమోతి 3:14, 15.

తమ పసి పిల్లవాన్ని మూడు నెలలు దాచేందుకు అమ్రాము యోకెబెదులు పడిన శ్రమ విశ్వాసంతో కూడిన క్రియగా హెబ్రీయులు 11:23 నందు నివేదించబడింది. దేవునికి భయపడే ఈ తలిదండ్రులు తమ పిల్లవాన్ని విడనాడే బదులు యెహోవా యొక్క రక్షించే శక్తియందు నమ్మకాన్ని కనపర్చారు, అందుకు వారు దీవించబడ్డారు. మనకు ఏమి సంభవించేందుకు యెహోవా అనుమతించినా, అది తుదకు మన క్షేమానికీ ఆనందానికీ దారి తీస్తుందనే నమ్మకాన్ని కలిగి ఉండి, మనం కూడా యెహోవా యొక్క చట్టాలనూ సూత్రాలనూ కచ్చితంగా హత్తుకోవాలి.—రోమీయులు 8:28.

[అధస్సూచీలు]

a ఐగుప్తీయులు నైలు నదిని ఫలవంతత ననుగ్రహించే దేవతగా ఆరాధించే వారు. దాని జలాలు ఒకరికి ఫలవంతతను చేకూర్చే శక్తిని, జీవితాన్ని కూడా పొడిగించగల శక్తిని కలిగి ఉన్నాయని వారు విశ్వసించే వారు.

b మరణమందు ఒక వ్యక్తి యొక్క ఆత్మ ఓసిరిస్‌ సమక్ష్యంలో “నేను ఏ మానవున్నీ పీడించలేదు,” “నేను పాలు త్రాగే పిల్లవానికి పాలు లభించకుండా చేయలేదు,” “నేను ఆకలి గొనిన వారికి అన్నమును దాహంతో ఉన్న వారికి నీళ్లను ఇచ్చాను” వంటి వాక్యాలను వల్లిస్తుందని ఐగుప్తీయులు విశ్వసించేవారు.

c ప్రాచీన కాలాల్లో, అనేకమంది పిల్లలకు నేడు సాధారణమైయున్న దానికంటే కూడా ఎక్కువకాలం వరకూ తల్లి స్తన్యమిచ్చి పెంచేది. బహుశ సమూయేలు కనీసం మూడు సంవత్సరాలు నిండాకే పాలు విడిచివుంటాడు, మరి ఇస్సాకు దాదాపు ఐదు సంవత్సరాల వయస్సులో విడిచివుంటాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి