1 యోహాను
5 యేసే క్రీస్తు అని నమ్మే ప్రతీ ఒక్కరు దేవుని పిల్లలే. తండ్రైన దేవుణ్ణి ప్రేమించే ప్రతీ ఒక్కరు ఆయన పిల్లల్ని కూడా ప్రేమిస్తారు. 2 మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞల్ని పాటించినప్పుడు మనం ఆయన పిల్లల్ని ప్రేమిస్తున్నామని మనకు అర్థమౌతుంది. 3 దేవుణ్ణి ప్రేమించడమంటే ఆయన ఆజ్ఞల్ని పాటించడమే; అయితే ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. 4 ఎందుకంటే, దేవుని పిల్లలంతా* లోకాన్ని జయిస్తారు. మనం మన విశ్వాసంతో లోకాన్ని జయించాం.
5 లోకాన్ని ఎవరు జయించగలరు? యేసు దేవుని కుమారుడని విశ్వసించేవాళ్లే కదా? 6 యేసుక్రీస్తే నీళ్ల ద్వారా, రక్తం ద్వారా వచ్చాడు; నీళ్లతో మాత్రమే కాదు, నీళ్లతో రక్తంతో వచ్చాడు. దీని గురించి పవిత్రశక్తే సాక్ష్యం ఇస్తోంది, ఎందుకంటే అది సత్యాన్ని వెల్లడి చేస్తుంది. 7 యేసు గురించి ఈ మూడు సాక్ష్యం ఇస్తున్నాయి: 8 పవిత్రశక్తి, నీళ్లు, రక్తం; ఈ మూడూ ఒకే విషయం గురించి సాక్ష్యం ఇస్తున్నాయి.
9 మనం మనుషుల సాక్ష్యాన్ని అంగీకరిస్తాం, అలాంటిది దేవుని సాక్ష్యం ఇంకా గొప్పది కదా. ఎందుకంటే స్వయంగా దేవుడే తన కుమారుడి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. 10 దేవుని కుమారుని మీద విశ్వాసం ఉంచే వ్యక్తి హృదయంలో, దేవుడు అతనికి ఇచ్చిన సాక్ష్యం ఉంటుంది. దేవుని సాక్ష్యం మీద విశ్వాసం చూపించని వ్యక్తి దేవుణ్ణి అబద్ధాలకోరుగా చేసినట్టే. ఎందుకంటే దేవుడు తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని అతను నమ్మలేదు. 11 ఆ సాక్ష్యం ఇదే, దేవుడు మనకు శాశ్వత జీవితాన్ని ఇచ్చాడు, మనం ఆ జీవితాన్ని ఆయన కుమారుని ద్వారా పొందుతాం. 12 కుమారుణ్ణి అంగీకరించే వాళ్లకు శాశ్వత జీవితం ఉంటుంది; దేవుని కుమారుణ్ణి అంగీకరించని వాళ్లకు శాశ్వత జీవితం ఉండదు.
13 దేవుని కుమారుని పేరు మీద విశ్వాసం ఉంచే మీరు శాశ్వత జీవితం పొందుతారనే విషయం తెలుసుకోవాలని మీకు ఈ విషయాలు రాస్తున్నాను. 14 మనకున్న నమ్మకం* ఏమిటంటే, దేవుని ఇష్టానికి తగ్గట్టు ప్రార్థనలో మనం ఏమి అడిగినా ఆయన వింటాడు. 15 మనం ఏమి అడిగినా ఆయన వింటాడని మనకు తెలుసు కాబట్టి, మనం ఆయన్ని అడిగిన వాటిని పొందుతామనే నమ్మకం మనకు ఉంది.
16 ఓ వ్యక్తి తన సోదరుడు పాపం చేయడం చూశాడనుకోండి. కానీ ఆ పాపం మరణశిక్ష పడేంత పాపం కాదు. అది చూసిన ఆ వ్యక్తి దేవునికి ప్రార్థించాలి, అప్పుడు దేవుడు ఆ సోదరునికి జీవాన్ని ఇస్తాడు. అవును, మరణశిక్ష పడేంత పాపం చేయని వాళ్లకు దేవుడు జీవాన్ని ఇస్తాడు. అయితే మరణశిక్ష పడేంత పాపం కూడా ఉంది. ఆ పాపం విషయంలో అతను దేవునికి ప్రార్థించాలని నేను చెప్పట్లేదు. 17 అన్నిరకాల చెడ్డ పనులు పాపమే, కానీ మరణశిక్షకు గురిచేయని పాపం కూడా ఉంది.
18 దేవుని పిల్లలెవ్వరూ అలవాటుగా పాపం చేయరని మనకు తెలుసు. అయితే దేవుని కుమారుడు* వాళ్లకు కాపలా ఉంటాడు, దుష్టుడు* వాళ్లను తాకలేడు.* 19 మనం దేవునివైపు ఉన్నామని మనకు తెలుసు, కానీ లోకమంతా దుష్టుని గుప్పిట్లో ఉంది. 20 అయితే దేవుని కుమారుడు వచ్చాడని మనకు తెలుసు. సత్యదేవుని గురించిన జ్ఞానాన్ని మనం సంపాదించుకునేలా ఆ కుమారుడు మనకు అవగాహన కల్పించాడు. మనం తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో ఐక్యంగా ఉన్నాం. ఆయనే సత్య దేవుడు, ఆయనే శాశ్వత జీవితాన్ని ఇస్తాడు. 21 చిన్నపిల్లలారా, విగ్రహాలకు దూరంగా ఉండండి.