క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్ రెఫరెన్సులు
జూన్ 3-9
దేవుని వాక్యంలో ఉన్న సంపద|గలతీయులు 4-6
“మనకు ఉపయోగపడే ‘అలంకారిక అర్థం’ ఉన్న ఉదాహరణ”
(గలతీయులు 4:24, 25) ఈ విషయాలకు అలంకారిక అర్థం ఉంది. ఈ ఇద్దరు స్త్రీలు రెండు ఒప్పందాలు. ఒక ఒప్పందం సీనాయి పర్వతం దగ్గర జరిగింది. ఈ ఒప్పందం కింద ఉన్నవాళ్లంతా దాసులు, ఇది హాగరు. 25 ఇక్కడ, హాగరు అంటే సీనాయి పర్వతం, ఇది అరేబియాలో ఉంది. ఆమె ఇప్పటి యెరూషలేమును సూచిస్తోంది, ఎందుకంటే యెరూషలేము తన పిల్లలతోపాటు దాసత్వంలో ఉంది.
it-1 1018వ పేజీ, 2వ పేరా
హాగరు
అపొస్తలుడైన పౌలు ప్రకారం, అలంకారిక అర్థంలో హాగరు సహజ ఇశ్రాయేలు జనాంగానికి సూచనగా ఉంది. ఆ జనాంగంలోని వాళ్లు, సీనాయి పర్వతం దగ్గర స్థాపించబడిన ధర్మశాస్త్ర ఒప్పందం కింద యెహోవాకు “దాసులు” అయ్యారు. అయితే వారసత్వంగా వచ్చిన పాపం కారణంగా వాళ్లు ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండలేకపోయారు. నిజానికి ఆ ఒప్పందం కింద ఇశ్రాయేలీయులు స్వతంత్రులు అవ్వలేదు గానీ మరణానికి అర్హులైన పాపులు అయ్యారు. అందుకే వాళ్లు దాసులు. (యోహా 8:34; రోమా 8:1-3) పౌలు కాలంనాటి, రాజధాని నగరమైన యెరూషలేము హాగరుతో పోల్చబడింది. అది సహజ ఇశ్రాయేలును సూచిస్తుంది. అది దాని పిల్లలతో సహా దాసత్వంలో ఉంది. దేవుని సూచనార్థక భార్య అయిన “పైనున్న యెరూషలేము”కు అభిషిక్త క్రైస్తవులు పిల్లలు. ఈ యెరూషలేము స్వతంత్రురాలైన శారాలానే ఎన్నడూ దాసత్వంలో లేదు. అయితే ఇష్మాయేలు ఇస్సాకును హింసించినట్లే దాసత్వంలో ఉన్న యెరూషలేము, కుమారుడు విడిపించిన “పైనున్న యెరూషలేము” పిల్లల్ని హింసించింది. హాగరు, ఆమె కుమారుడు వెళ్లగొట్టబడినట్టు యెహోవా సహజ ఇశ్రాయేలును వదిలేశాడు.—గల 4:21-31; యోహా 8:31-40 చూడండి.
(గలతీయులు 4:26, 27) కానీ పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది, ఆమె మన తల్లి. 27 ఎందుకంటే లేఖనాలు ఇలా చెప్తున్నాయి: “పిల్లలు లేని ఓ స్త్రీ, సంతోషించు; పురిటినొప్పులు అంటే ఏమిటో తెలియని స్త్రీ, సంతోషంతో కేకలువేయి. ఎందుకంటే, భర్త ఉన్న స్త్రీ పిల్లలకంటే భర్త వదిలేసిన స్త్రీ పిల్లలే ఎక్కువమంది.”
రాజ్యంపై అచంచలమైన విశ్వాసం ఉంచండి
11 అబ్రాహాము సంతతి వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ నిబంధన మొదటిసారిగా నెరవేరింది. అయితే ఆ నిబంధనలోని విషయాలు ఆధ్యాత్మిక భావంలో కూడా నెరవేరతాయని బైబిలు చూపిస్తుంది. (గల. 4:22-25) అబ్రాహాము సంతానంలో ప్రథమ లేదా ముఖ్యమైన భాగం యేసుక్రీస్తని అపొస్తలుడైన పౌలు దైవప్రేరణతో వివరించాడు. అందులోని రెండవ భాగం 1,44,000 మంది అభిషిక్త క్రైస్తవులను సూచిస్తుంది. (గల. 3:16, 29; ప్రక. 5:9,10; 14:1, 4) ఆ సంతానాన్ని కనే స్త్రీ, “పైనున్న యెరూషలేము” అంటే దేవుని సంస్థలోని పరలోక భాగం. అందులో నమ్మకమైన ఆత్మప్రాణులు ఉన్నారు. (గల. 4:26, 31) అబ్రాహాము నిబంధనలో దేవుడు వాగ్దానం చేసినట్లు, స్త్రీ సంతానం మానవజాతికి ఆశీర్వాదాలు తెస్తుంది.
(గలతీయులు 4:28-31) సోదరులారా, ఇస్సాకులా మీరు వాగ్దానం వల్ల పుట్టిన పిల్లలు. 29 అయితే ఆనాడు, మామూలుగా పుట్టినవాడు పవిత్రశక్తి వల్ల పుట్టినవాణ్ణి హింసించడం మొదలుపెట్టాడు. నేడూ అలాగే జరుగుతోంది. 30 అయినా, లేఖనం ఏం చెప్తోంది? “దాసిని, ఆమె కొడుకును బయటకు గెంటేయండి, ఎందుకంటే దాసి కొడుకు ఎట్టిపరిస్థితుల్లోనూ స్వతంత్రురాలి కొడుకుతోపాటు వారసుడు అవ్వడు.” 31 కాబట్టి, సోదరులారా మనం దాసి పిల్లలం కాదు, స్వతంత్రురాలి పిల్లలం.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
(గలతీయులు 4:6) ఇప్పుడు మీరు కుమారులు కాబట్టి, దేవుడు తన కుమారుడికి ఇచ్చిన పవిత్రశక్తినే మీ హృదయాల్లోకి పంపించాడు. ఆ పవిత్రశక్తి వల్ల మనం “నాన్నా, తండ్రీ!” అని పిలువగలుగుతున్నాం.
మీకిది తెలుసా?
యేసు ప్రార్థనలో యెహోవాను “నాయనా, తండ్రీ” అని ఎందుకు పిలిచాడు?
నాయనా అని అనువదించబడిన అబ్బా అనే అరామిక్ పదానికి “తండ్రి” లేదా “ఓ తండ్రీ” అని అర్థం. లేఖనాల్లో కనిపించే మూడు సందర్భాల్లోనూ అది ప్రార్థనలో పరలోక తండ్రియైన యెహోవాను సంబోధిస్తూ ఉపయోగించబడింది. యేసు భూమ్మీద జీవించిన కాలంలో, ఆ పదానికి ఎలాంటి ప్రత్యేకత ఉండేది?
ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బైబిల్ ఎన్‌సైక్లోపీడియా ఇలా తెలియజేస్తుంది: “యేసు జీవించిన కాలంలో తండ్రితో సన్నిహితంగావుండే, తండ్రిని గౌరవించే పిల్లలు సాధారణంగా తమ తండ్రిని అలా పిలిచేవాళ్ళు.” తండ్రిమీదున్న ఆప్యాయతతో పిల్లలు అలా పిలిచేవాళ్ళు. అంతేకాదు, వాళ్ళు నేర్చుకునే మొదటి మాటల్లో అదొకటి. ప్రాముఖ్యంగా యేసు తీవ్రంగా ప్రార్థిస్తున్నప్పుడు తన తండ్రిని అలా సంబోధించేవాడు. యేసు ఇంకా కొన్ని గంటల్లో మరణిస్తాడనగా గెత్సెమనే తోటలో యెహోవాకు ప్రార్థిస్తూ ఆయనను “నాయనా, తండ్రీ” అని పిలిచాడు.—మార్కు 14:36.
“గ్రీకు-రోమన్ కాలానికి చెందిన యూదుల సాహిత్యంలో దేవుణ్ణి నాయనా అని సంబోధించడం చాలా అరుదు. దేవునితో అంత సన్నిహితత్వం ఉన్నట్లు ఆయనను అలా పిలవడం ఎంతో తప్పుగా పరిగణించబడడమే అందుకు కారణం కావచ్చు,” అయితే “దేవునితో తనకు సన్నిహితత్వం ఉందని తాను అంతకు ముందు చెప్పిన అసాధారణమైన విషయాన్ని మళ్ళీ పరోక్షంగా ధృవీకరించడానికే యేసు ప్రార్థనలో ఆ పదాన్ని ఉపయోగించాడు” అని కూడా ఆ రెఫరెన్సు గ్రంథం చెప్తోంది. లేఖనాల్లో ఈ పదం అపొస్తలుడైన పౌలు రాసిన పత్రికల్లో మరో రెండుచోట్ల కనిపిస్తుంది. ఒకచోట “నాయనా” అనీ, మరోచోట “అబ్బా” అనీ ఆ పత్రికల్లో ఉంది. దీన్నిబట్టి మొదటి శతాబ్దపు క్రైస్తవులు కూడా తమ ప్రార్థనల్లో ఈ పదాన్ని ఉపయోగించేవారని తెలుస్తోంది.—రోమీయులు 8:15; గలతీయులు 4:6.
(గలతీయులు 6:17) ఇకమీదట నన్నెవరూ ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే నేను యేసు దాసుణ్ణని చూపించే ముద్రలు నా ఒంటి మీద ఉన్నాయి.
w10 11/1 15వ పేజీ
మీకు తెలుసా?
“యేసు దాసుణ్ణని చూపించే ముద్రలు నా ఒంటి మీద ఉన్నాయి” అని అన్న అపొస్తలుడైన పౌలు మాటలకు అర్థం ఏమిటి?—గలతీయులు 6:17.
▪ పౌలు మాటల్ని విన్నప్పుడు మొదటి శతాబ్దంలోని ప్రజలు వేర్వేరు విధాలుగా అర్థం చేసుకుని ఉంటారు. ఉదాహరణకు, యుద్ధ ఖైదీలను, గుళ్లను దోచుకునే దొంగలను, పారిపోయిన దాసులను గుర్తించడానికి బాగా కాల్చిన ఇనుముతో వాత పెట్టేవాళ్లు. అలాంటి ముద్రలు కలిగి ఉన్నవాళ్లను నీచంగా చూసేవాళ్లు.
కానీ కొన్ని ముద్రల్ని మాత్రం నీచంగా చూసేవాళ్లు కాదు. ప్రాచీనకాలంలో ఒక ప్రత్యేకమైన జాతి లేదా మతానికి చెందినవాళ్లను గుర్తించడానికి అలాంటి ముద్రల్ని వేసేవాళ్లు. థియలాజికల్ డిక్షనరీ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ ఇలా తెలియజేస్తుంది: “హడాడ్, అటార్గటిస్ దేవతలకు సమర్పించుకున్నామని చూపించుకోవడానికి సిరియా దేశస్థులు తమ మణికట్టు మీద లేదా మెడ మీద ముద్రలు వేయించుకునేవాళ్లు. . . . డియోనిసస్ భక్తులు ఐవీ ఆకుల ముద్ర వేయించుకునేవాళ్లు.”
మిషనరీ సేవలో హింస వల్ల ఆయన ఒంటిమీద అయిన గాయాల వల్ల ఏర్పడిన మచ్చలు లేదా గుర్తుల గురించి పౌలు అలా అనివుంటాడని చాలామంది ఆధునిక వ్యాఖ్యాతలు భావిస్తున్నారు. (2 కొరింథీయులు 11:23-27) అయితే, తాను క్రైస్తవుణ్ణని చూపించడానికి తన శరీరం మీద కనిపించే ముద్రలు కాదుగానీ, తన జీవన విధానమే ఒక గుర్తు లేదా ముద్ర అని పౌలు చెప్పివుండవచ్చు.
చదవాల్సిన బైబిలు భాగం
(గలతీయులు 4:1-20) ఇప్పుడు నేను చెప్పేదేమిటంటే, వారసుడు అన్నిటికీ యజమానే అయినా అతను పసివాడిగా ఉన్నంతకాలం అతనికీ, దాసునికీ ఏ తేడా ఉండదు. 2 తన తండ్రి నిర్ణయించిన సమయం వచ్చేవరకు అతను సంరక్షకుల, గృహనిర్వాహకుల అధీనంలో ఉంటాడు. 3 అలాగే మనం కూడా పిల్లలుగా ఉన్నప్పుడు లోకంలోని ప్రాథమిక విషయాలకు దాసులుగా ఉన్నాం. 4 కానీ, సమయం పూర్తయినప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు, ఆ కుమారుడు ఒక స్త్రీకి పుట్టాడు, ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. 5 ఆ కుమారుడు ధర్మశాస్త్రం కింద ఉన్నవాళ్లను కొని, విడుదల చేయాలనే ఉద్దేశంతో దేవుడు ఆయన్ని పంపించాడు. అలా దేవుడు మనల్ని కుమారులుగా దత్తత తీసుకోవడం సాధ్యమౌతుంది. 6 ఇప్పుడు మీరు కుమారులు కాబట్టి, దేవుడు తన కుమారుడికి ఇచ్చిన పవిత్రశక్తినే మీ హృదయాల్లోకి పంపించాడు. ఆ పవిత్రశక్తి వల్ల మనం “నాన్నా, తండ్రీ!” అని పిలువగలుగుతున్నాం. 7 కాబట్టి మీరిక దాసులు కాదు, కుమారులు. మీరు కుమారులైతే, దేవుడు మిమ్మల్ని వారసుల్ని కూడా చేసుకున్నట్టే. 8 అయినా, మీకు దేవుడు తెలియకముందు మీరు అసలు దేవుళ్లే కానివాటికి దాసులుగా ఉండేవాళ్లు. 9 కానీ ఇప్పుడు మీకు దేవుడు తెలుసు, ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడికి మీరు తెలుసు. అలాంటప్పుడు పనికిరాని, విలువలేని ప్రాథమిక విషయాల వైపుకు మీరు మళ్లీ ఎందుకు వెళ్తున్నారు? మళ్లీ ఎందుకు వాటికి దాసులు అవ్వాలనుకుంటున్నారు? 10 మీరు రోజుల్ని, నెలల్ని, కాలాల్ని, సంవత్సరాల్ని నిష్ఠగా ఆచరిస్తున్నారు. 11 మీ విషయంలో నేను పడ్డ శ్రమ వృథా అయిపోయిందేమోనని భయంగా ఉంది. 12 సోదరులారా, నేనూ ఒకప్పుడు మీలాగే ఉండేవాణ్ణి కానీ ఇప్పుడు మారాను. కాబట్టి, నాలా మారమని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. గతంలో మీరు నాతో చెడుగా వ్యవహరించలేదు. 13 మీకు మొదటిసారి మంచివార్త ప్రకటించే అవకాశం నాకు రావడానికి కారణం నా అనారోగ్యమేనని మీకు తెలుసు. 14 అప్పుడు నా ఆరోగ్య పరిస్థితి వల్ల మీకు ఇబ్బంది కలిగినా, మీరు నన్ను పట్టించుకోకుండా వదిలేయలేదు, అసహ్యించుకోలేదు; కానీ నన్ను ఓ దేవదూతలా, యేసుక్రీస్తులా చేర్చుకున్నారు. 15 ఆ సంతోషమంతా ఇప్పుడు ఏమైంది? ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, అవకాశమే గనుక ఉంటే మీరు మీ కళ్లు పీకి నాకు ఇచ్చివుండేవాళ్లు. 16 అలాంటిది, మీతో నిజం చెప్తున్నందుకు నేను మీకు శత్రువునయ్యానా? 17 ఆ మనుషులు మిమ్మల్ని తమవైపు లాక్కోవడానికి ఉత్సాహంగా ప్రయత్నిస్తున్నారు, కానీ అదంతా మీ మంచి కోరి కాదు. మిమ్మల్ని నాకు దూరం చేసి, తమ వెంట తిప్పుకోవాలనే అలా చేస్తున్నారు. 18 అయితే, మంచి ఉద్దేశంతో మీ విషయంలో ఉత్సాహం చూపించేవాళ్లు ఉండడం మంచిదే. నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే అలా ఉండడం కాదు, అన్ని సమయాల్లో వాళ్లు అలా ఉండాలి. 19 నా చిన్నపిల్లలారా, మీరు క్రీస్తు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే వరకు, పురిటినొప్పులు పడే స్త్రీలా నేను మళ్లీ మీ వల్ల బాధ అనుభవించాలి. 20 మీ విషయంలో ఏమి చేయాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే, ఇప్పటికిప్పుడు మీ దగ్గరకు వచ్చి మీతో ఇంకోలా మాట్లాడాలనుంది.
జూన్ 10-16
దేవుని వాక్యంలో ఉన్న సంపద|ఎఫెసీయులు 1-3
“యెహోవా ‘వ్యవహార నిర్వహణ,’ అది చేసే పని”
(ఎఫెసీయులు 1:8, 9) దేవుడు ఆ అపారదయను తెలివి, అవగాహన రూపంలో మనకు పుష్కలంగా ఇచ్చాడు, 9 తన సంకల్పం గురించిన పవిత్ర రహస్యాన్ని మనకు తెలియజేశాడు. ఈ రహస్యం ఆయన ఇష్టానికి, ఆయన సంకల్పానికి అనుగుణంగా ఉంది.
it-2 837వ పేజీ, 4వ పేరా
పవిత్ర రహస్యం
మెస్సీయ రాజ్యం. పౌలు తాను రాసిన పుస్తకాల్లో క్రీస్తు గురించిన పవిత్ర రహస్యం గురించి పూర్తిగా వివరించాడు. దేవుడు తన ఇష్టప్రకారం “పవిత్ర రహస్యం” గురించి తెలియజేశాడని రాస్తూ, ఎఫెసీయులు 1:9-11లో పౌలు ఇలా అన్నాడు: “ఈ రహస్యం ఆయన ఇష్టానికి, ఆయన సంకల్పానికి అనుగుణంగా ఉంది. నియమిత కాలం ముగిసినప్పుడు, అన్నిటినీ అంటే అటు పరలోకంలో ఉన్నవాటిని, ఇటు భూమ్మీద ఉన్నవాటిని క్రీస్తులో ఐక్యం చేసే ఒక వ్యవహార నిర్వహణను ఏర్పాటు చేయాలనేది ఆయన సంకల్పం. అవును, క్రీస్తులోనే అన్నీ ఐక్యమౌతాయి. యూదులమైన మేము ఆయనలో ఐక్యమై ఉన్నాం, వారసులుగా నియమితులమయ్యాం. ఎందుకంటే దేవుడు తన సంకల్పం ప్రకారం మమ్మల్ని ముందే ఎంచుకున్నాడు. ఆయన ప్రతీది తన ఇష్టప్రకారం చేస్తాడు.” ఈ “పవిత్ర రహస్యం”లో ఒక ప్రభుత్వం ఉంది, అది దేవుని మెస్సీయ రాజ్యం. పౌలు చెప్పిన ‘పరలోకంలో ఉన్నవి’ పరలోక రాజ్యంలో క్రీస్తుతోటి వారసులను సూచిస్తుంది. ‘భూమ్మీద ఉన్నవి’ భూమ్మీద ఉండే ఆ రాజ్య పౌరులను సూచిస్తుంది. యేసు తన శిష్యులతో, “దేవుని రాజ్యం గురించిన పవిత్ర రహస్యం మీకు వెల్లడి చేయబడింది” అని చెప్పడం ద్వారా ఆ పవిత్ర రహస్యానికి రాజ్యంతో సంబంధం ఉందని సూచించాడు.—మార్కు 4:11.
(ఎఫెసీయులు 1:10) నియమిత కాలం ముగిసినప్పుడు, అన్నిటినీ అంటే అటు పరలోకంలో ఉన్నవాటిని, ఇటు భూమ్మీద ఉన్నవాటిని క్రీస్తులో ఐక్యం చేసే ఒక వ్యవహార నిర్వహణను ఏర్పాటు చేయాలనేది ఆయన సంకల్పం. అవును, క్రీస్తులోనే అన్నీ ఐక్యమౌతాయి.
w12 7/15 27-28 పేజీలు, 3-4 పేరాలు
‘అద్వితీయుడైన యెహోవా’ తన కుటుంబాన్ని సమకూరుస్తున్నాడు
3 “మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా” అని మోషే ఇశ్రాయేలీయులతో అన్నాడు. (ద్వితీ. 6:4) యెహోవా చేసే ప్రతీ పని ఆయన సంకల్ప నెరవేర్పుకు దోహదపడుతుంది. “కాలము సంపూర్ణమైనప్పుడు,” తన సృష్టి ప్రాణులందరినీ ఐక్యం చేయడానికి దేవుడు ఒక ‘ఏర్పాటు’ చేశాడు. (ఎఫెసీయులు 1:8-10 చదవండి.) ఆ ఏర్పాటులో రెండు భాగాలు ఉన్నాయి. మొదటి భాగంగా, పరలోకంలో యేసుక్రీస్తు అధికారం కింద ఉండే అభిషిక్తుల్ని దేవుడు సమకూర్చడం మొదలుపెట్టాడు. అలా క్రీస్తుతో కలిసి పరిపాలించే వాళ్లను సమకూర్చడం సా.శ. 33 పెంతెకొస్తు రోజున మొదలైంది. (అపొ. 2:1-4) అభిషిక్తులు క్రీస్తు విమోచన క్రయధన బలి ఆధారంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు కాబట్టి తాము ‘దేవుని పిల్లలుగా’ దత్తత తీసుకోబడ్డామని వాళ్లు గుర్తిస్తారు.—రోమా. 3:23, 24; 5:1; 8:15-17.
4 ఆ ఏర్పాటులో రెండవ భాగంగా, క్రీస్తు రాజుగా ఉండే మెస్సీయ రాజ్యం కింద భూపరదైసులో జీవించే ప్రజల్ని దేవుడు సమకూరుస్తున్నాడు. ఆ గుంపులో ప్రాథమికంగా “గొప్పసమూహము” ఉంటుంది. (ప్రక. 7:9, 13-17; 21:1-5) వెయ్యేళ్ల పరిపాలనా కాలంలో పునరుత్థానం చేయబడే కోట్లాదిమంది ఆ గొప్ప సమూహంతో కలుస్తారు. (ప్రక. 20:12, 13) పునరుత్థానం జరిగిన తర్వాత మన మధ్య ఉన్న ఐక్యతను నిరూపించుకునేందుకు ఎన్ని అవకాశాలు దొరుకుతాయో ఒక్కసారి ఆలోచించండి! వెయ్యేళ్ల పరిపాలన ముగింపులో, ‘భూమ్మీదున్న’ వాళ్లకు చివరిగా ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో నెగ్గిన వాళ్లు భూమ్మీద నిరంతరం జీవించేందుకు ‘దేవుని పిల్లలుగా’ దత్తత తీసుకోబడతారు.—రోమా. 8:20, 21; ప్రక. 20:7, 8.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
(ఎఫెసీయులు 3:13) కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏమిటంటే, మీ కోసం నేను ఎదుర్కొన్న శ్రమలను చూసి నిరుత్సాహపడకండి. ఎందుకంటే అవన్నీ మీకు కీర్తిని తెస్తాయి.
మహిమ పొందకుండా చేసే ప్రతీదానికి దూరంగా ఉండండి
15 మనం పట్టువిడువకుండా యెహోవా చిత్తం చేస్తే ఇతరులు ఆయన దయచేసే మహిమను పొందగలుగుతారు. ఎఫెసు సంఘానికి పౌలు ఇలా రాశాడు: “మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను; ఇవి మీకు మహిమకరములైయున్నవి.” (ఎఫె. 3:13) తాను పడిన శ్రమలు ఎఫెసీయులకు “మహిమకరములైయున్నవి” అని పౌలు ఎందుకు అన్నాడు? శ్రమలు వచ్చినా వాళ్లకు పరిచారం చేయడానికి సంసిద్ధంగా ఉండడం ద్వారా పౌలు, క్రైస్తవులుగా వాళ్లకున్న అవకాశాలు ఎంతో ప్రాముఖ్యమైనవని, వెలకట్టలేనివని ఎఫెసీయులకు చూపించాడు. శ్రమలు వచ్చినప్పుడు ఒకవేళ పౌలు వాళ్లకు పరిచారం చేయడం మానేసి ఉంటే, ఎఫెసీయులకు యెహోవాతో ఉన్న స్నేహం, వాళ్ల పరిచర్య, వాళ్ల నిరీక్షణ నిజంగా అమూల్యమైనవని పౌలు చూపించి ఉండగలిగేవాడా? ఆయన పరిచర్యలో ఓర్పుగా కొనసాగడం ద్వారా క్రైస్తవత్వాన్ని ఉన్నతపర్చాడు, క్రీస్తు శిష్యులుగా ఉండడం కోసం ఎలాంటి త్యాగాలు చేసినా నష్టం లేదని చూపించాడు.
(ఎఫెసీయులు 3:19) జ్ఞానాన్ని మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోగలుగుతారు. అలా, దేవుడు ఇచ్చే లక్షణాలన్నిటినీ మీరు అలవర్చుకోగలుగుతారు.
‘క్రీస్తు ప్రేమను తెలుసుకోవడం’
21 ‘తెలుసుకొను’ అని అనువదించబడిన గ్రీకు పదానికి “ఆచరణాత్మకంగా, అనుభవపూర్వకంగా” తెలుసుకోవడమని అర్థం. ఇతరుల కోసం నిస్వార్థంగా శ్రమించడం ద్వారా, వారి అవసరతలపట్ల కనికరంతో ప్రతిస్పందించడం ద్వారా, వారిని మనస్ఫూర్తిగా క్షమించడం ద్వారా మనం యేసు చూపినట్లుగా ప్రేమ చూపినప్పుడు మనమాయన భావాలను నిజంగా అర్థంచేసుకోగలం. ఇలా అనుభవపూర్వకంగా మనం ‘జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొంటాము.’ మనమెంత ఎక్కువగా క్రీస్తులా తయారవుతామో, అంత ఎక్కువగా మనం క్రీస్తు సంపూర్ణంగా అనుకరించిన మన ప్రేమగల దేవుడైన యెహోవాకు సన్నిహితులమవుతామని ఎన్నటికీ మరచిపోకుండా ఉందాం.
చదవాల్సిన బైబిలు భాగం
(ఎఫెసీయులు 1:1-14) దేవుని ఇష్టప్రకారం క్రీస్తుయేసుకు అపొస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పవిత్రులకు, క్రీస్తుయేసు నమ్మకమైన శిష్యులకు రాస్తున్న ఉత్తరం. 2 మన తండ్రైన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు మీకు అపారదయను, శాంతిని ప్రసాదించాలి. 3 మన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవునికి స్తుతి కలగాలి; ఆయన క్రీస్తు శిష్యులమైన మనకు పవిత్రశక్తి ద్వారా పరలోకంలో ప్రతీ వరాన్ని ఇచ్చి దీవించాడు. 4 ఎందుకంటే, మనం క్రీస్తుతో ఐక్యంగా ఉండాలని ప్రపంచం పుట్టకముందే దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. మనం ప్రేమ చూపిస్తూ ఆయన ముందు పవిత్రులుగా, మచ్చలేనివాళ్లుగా ఉండాలని అలా చేశాడు. 5 ఆయన తన సంతోషం కోసం, తన ఇష్టప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనల్ని సొంత పిల్లలుగా దత్తత తీసుకోవాలనే ఉద్దేశంతో మనల్ని ముందే ఎంచుకున్నాడు. 6 ఆయన తన ప్రియ కుమారుడి ద్వారా మనపై అపారదయ చూపించినందుకు ప్రజలు తనను స్తుతించాలని అలా చేశాడు. 7 ఆ కుమారుడి ద్వారా మనం విడుదల పొందే మార్గం తెరవబడింది. అవును, ఆయన రక్తం ద్వారానే దేవుడు విమోచన క్రయధనం చెల్లించాడు. దాని ద్వారానే దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. దేవుని అపారదయ నిజంగా ఎంతో గొప్పది! 8 దేవుడు ఆ అపారదయను తెలివి, అవగాహన రూపంలో మనకు పుష్కలంగా ఇచ్చాడు, 9 తన సంకల్పం గురించిన పవిత్ర రహస్యాన్ని మనకు తెలియజేశాడు. ఈ రహస్యం ఆయన ఇష్టానికి, ఆయన సంకల్పానికి అనుగుణంగా ఉంది. 10 నియమిత కాలం ముగిసినప్పుడు, అన్నిటినీ అంటే అటు పరలోకంలో ఉన్నవాటిని, ఇటు భూమ్మీద ఉన్నవాటిని క్రీస్తులో ఐక్యం చేసే ఒక వ్యవహార నిర్వహణను ఏర్పాటు చేయాలనేది ఆయన సంకల్పం. అవును, క్రీస్తులోనే అన్నీ ఐక్యమౌతాయి. 11 యూదులమైన మేము ఆయనలో ఐక్యమై ఉన్నాం, వారసులుగా నియమితులమయ్యాం. ఎందుకంటే దేవుడు తన సంకల్పం ప్రకారం మమ్మల్ని ముందే ఎంచుకున్నాడు. ఆయన ప్రతీది తన ఇష్టప్రకారం చేస్తాడు. 12 క్రీస్తు మీద విశ్వాసం ఉంచినవాళ్లలో మేము మొదటివాళ్లం. మా ద్వారా స్తుతి, మహిమ పొందాలని దేవుడు మమ్మల్ని అలా ఎంచుకున్నాడు. 13 అయితే అన్యులైన మీరు కూడా సత్యాన్ని విన్నాక అంటే, మీ రక్షణ గురించిన మంచివార్తను విన్నాక క్రీస్తు మీద విశ్వాసం ఉంచారు. మీరు ఆయన్ని నమ్మిన తర్వాత, దేవుడు తాను వాగ్దానం చేసిన పవిత్రశక్తితో మీకు ముద్ర వేశాడు. దీని కోసం ఆయన క్రీస్తును ఉపయోగించుకున్నాడు. 14 మనం తప్పకుండా వారసత్వాన్ని పొందుతామనడానికి దేవుడు మనకు ముందుగా ఇచ్చిన గుర్తే ఆ పవిత్రశక్తి. దేవుడు మూల్యం చెల్లించి తన ప్రజల్ని విడిపించడానికి అలా ముద్ర వేశాడు. దానివల్ల ఆయనకు ఎంతో స్తుతి కలుగుతుంది.
జూన్ 17-23
దేవుని వాక్యంలో ఉన్న సంపద|ఎఫెసీయులు 4-6
“దేవుడు ఇచ్చే సంపూర్ణ యుద్ధ కవచాన్ని తొడుక్కోండి”
(ఎఫెసీయులు 6:11-13) మీరు అపవాది పన్నాగాలకు పడిపోకుండా స్థిరంగా నిలబడగలిగేలా దేవుడు ఇచ్చే సంపూర్ణ యుద్ధ కవచాన్ని తొడుక్కోండి. 12 మనం పోరాడుతున్నది మనుషులతో కాదు, ప్రభుత్వాలతో, నాయకులతో, ఈ చీకటి ప్రపంచ పాలకులతో, అంటే పరలోకంలోని ఎంతోమంది చెడ్డదూతలతో. 13 అందుకే, మీరు దేవుడు ఇచ్చే సంపూర్ణ యుద్ధ కవచాన్ని తొడుక్కోండి. అలా చేస్తే, శత్రువు దాడిచేసినప్పుడు మీరు అతన్ని ఎదిరించగలుగుతారు. మీరు చేయాల్సినవన్నీ చేస్తే, స్థిరంగా నిలబడి పోరాడగలుగుతారు.
w18.05 27వ పేజీ, 1వ పేరా
యౌవనులారా అపవాదిని ఎదిరించి స్థిరంగా నిలబడండి
అపొస్తలుడైన పౌలు క్రైస్తవుల్ని యుద్ధంలో పోరాడుతున్న సైనికులతో పోల్చాడు. మనం చేస్తున్న యుద్ధం ఆధ్యాత్మికమైనది కావచ్చు, కానీ మన శత్రువులు మాత్రం నిజమైన వ్యక్తులు. అయితే వాళ్లు మనుషులు కాదుగానీ సాతాను, అతని చెడ్డదూతలు. వాళ్లు యుద్ధం చేయడంలో ఎంతో అనుభవం, నైపుణ్యం ఉన్న యోధులు. అలాంటివాళ్లతో మనం పోరాడి గెలవడం అసాధ్యమని అనిపించవచ్చు. ఒకవేళ మనం యౌవనులమైతే, వాళ్లతో తలపడడం మనవల్ల కానిపని అనిపించవచ్చు. కానీ వాస్తవమేమిటంటే, యౌవనులు ఆ శక్తివంతమైన శత్రువులతో పోరాడి గెలవగలరు. ఇప్పటికే గెలుస్తున్నారు కూడా. ఎందుకంటే యెహోవా వాళ్లకు శక్తినిస్తున్నాడు. అంతేకాదు వాళ్లు “దేవుడు ఇచ్చే సంపూర్ణ యుద్ధ కవచాన్ని” తొడుక్కొని మంచి శిక్షణ పొందిన సైనికుల్లా యుద్ధానికి సిద్ధపడుతున్నారు.—ఎఫెసీయులు 6:10-12 చదవండి.
(ఎఫెసీయులు 6:14, 15) కాబట్టి, మీరు స్థిరంగా నిలబడడానికి మీ నడుముకు సత్యం అనే నడికట్టు కట్టుకోండి, నీతి అనే రొమ్ము-కవచం తొడుక్కోండి, 15 శాంతికరమైన మంచివార్తను ప్రకటించేలా మీ కాళ్లకు సంసిద్ధత అనే చెప్పులు వేసుకోండి.
w18.05 28-29 పేజీలు, 4, 7, 10 పేరాలు
యౌవనులారా అపవాదిని ఎదిరించి స్థిరంగా నిలబడండి
4 ఆ నడికట్టులాగే, దేవుని వాక్యం నుండి మనం నేర్చుకునే సత్యాలు మనల్ని అబద్ధ బోధల నుండి రక్షిస్తాయి. (యోహా. 8:31, 32; 1 యోహా. 4:1) ఆ సత్యాల్ని ప్రేమించే కొద్దీ మన “రొమ్ము-కవచాన్ని” తొడుక్కోవడం అంటే దేవుని ప్రమాణాలకు తగ్గట్లు జీవించడం మనకు మరింత తేలికౌతుంది. (కీర్త. 111:7, 8; 1 యోహా. 5:3) అంతేకాదు ఆ సత్యాల్ని ఎంత బాగా అర్థంచేసుకుంటే, మనల్ని వ్యతిరేకించేవాళ్ల ముందు వాటిని అంత ధైర్యంగా సమర్థించగలుగుతాం.—1 పేతు. 3:15.
7 ఆ రొమ్ము-కవచంలాగే, యెహోవా దేవుని నీతి ప్రమాణాలు కూడా మన సూచనార్థక హృదయాన్ని కాపాడతాయి. (సామె. 4:23) ఏ సైనికుడూ తన ఇనుప రొమ్ము-కవచాన్ని వదిలేసి, బలహీనమైన లోహంతో చేసిన కవచాన్ని తొడుక్కోడు. అదేవిధంగా మంచిచెడుల విషయంలో యెహోవా ఏర్పాటు చేసిన నీతి ప్రమాణాలకు బదులు మన సొంత ప్రమాణాల్ని పాటించాలని ఎన్నడూ కోరుకోం. మన హృదయాన్ని కాపాడుకునేంత జ్ఞానం మనకు లేదు. (సామె. 3:5, 6) కాబట్టి మన “రొమ్ము-కవచం” హృదయాన్ని కాపాడే విధంగా ఉందో లేదో ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి.
10 రోమా సైనికులు వేసుకునే చెప్పులు వాళ్లు యుద్ధంలో గెలవడానికి సహాయపడినట్లే, మనం వేసుకునే సూచనార్థకమైన చెప్పులు “శాంతికరమైన మంచివార్తను” ప్రకటించడానికి సహాయపడతాయి. (యెష. 52:7; రోమా. 10:15) అయినాసరే, ప్రకటించడానికి కొన్నిసార్లు ధైర్యం అవసరమౌతుంది. 20 ఏళ్ల బో అనే యువకుడు ఇలా చెప్తున్నాడు, “తోటి విద్యార్థులకు ప్రకటించడానికి నాకు భయమేసేది. ఇబ్బందిగా అనిపించడం వల్ల భయమేసేది అనుకుంట. ఇప్పుడు ఆ రోజుల్ని తలుచుకుంటే, నా భయానికి అర్థంలేదనిపిస్తుంది. ఇప్పుడైతే నా వయసువాళ్లకు సంతోషంగా మంచివార్త ప్రకటిస్తున్నాను.”
(ఎఫెసీయులు 6:16, 17) వాటన్నిటితోపాటు విశ్వాసం అనే పెద్ద డాలు పట్టుకోండి, దానితో మీరు దుర్మార్గుడి అగ్ని బాణాలన్నీ ఆర్పివేయగలుగుతారు. 17 అంతేకాదు, మీ తలకు రక్షణ అనే శిరస్త్రాణం పెట్టుకోండి, పవిత్రశక్తి ద్వారా ఇవ్వబడిన దేవుని వాక్యం అనే ఖడ్గం పట్టుకోండి.
w18.05 29-31 పేజీలు, 13, 16, 20 పేరాలు
యౌవనులారా అపవాదిని ఎదిరించి స్థిరంగా నిలబడండి
13 సాతాను మీపై ఎలాంటి ‘అగ్ని బాణాల్ని’ విసురుతాడు? బహుశా అవి యెహోవా గురించిన అబద్ధాలు కావచ్చు. యెహోవాకు మీపై ప్రేమ లేదనీ, ఎవ్వరికీ మీరంటే పట్టింపు లేదని మీరు అనుకోవాలనేది సాతాను కోరిక. 19 ఏళ్ల ఈడ అనే యువతి ఇలా చెప్తుంది, “యెహోవా నా నుంచి దూరంగా ఉంటున్నాడని, నాతో స్నేహం చేయడం ఆయనకు ఇష్టం లేదని చాలాసార్లు అనిపించేది.” అలా అనిపించినప్పుడు ఆమె ఏమి చేసేది? ఈడ ఇలా చెప్పింది, “మీటింగ్స్ నా విశ్వాసాన్ని చాలా బలపర్చేవి. ఇంతకుముందు మీటింగ్‌కి వచ్చి, నా వ్యాఖ్యానాల్ని ఎవ్వరు పట్టించుకుంటారులే అని ఆలోచిస్తూ నోరు మెదపకుండా కూర్చునేదాన్ని. కానీ ఇప్పుడు మీటింగ్స్‌కి సిద్ధపడి వస్తాను, కనీసం రెండు మూడు వ్యాఖ్యానాలు చేయడానికి ప్రయత్నిస్తాను. అది కష్టమైన పనేగానీ, దాన్ని చేసినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సహోదరసహోదరీలు నన్ను చాలా ప్రోత్సహిస్తారు. మీటింగ్ నుండి తిరిగొచ్చే ప్రతీసారి యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడనే నమ్మకంతో ఉంటాను.”
16 శిరస్త్రాణం సైనికుని మెదడుకు రక్షణగా ఉన్నట్లే, “రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణం” మన ఆలోచనలకు కాపుదలగా ఉంటుంది. (1 థెస్స. 5:8; సామె. 3:21) మన సమస్యల వల్ల నిరుత్సాహపడకుండా, దేవుని వాగ్దానాలపై మనసు నిలపడానికి నిరీక్షణ సహాయం చేస్తుంది. (కీర్త. 27:1, 14; అపొ. 24:15) కానీ మనం రక్షణ పొందాలంటే ఆ నిరీక్షణను వాస్తవమైనదిగా చూడాలి. అంటే ఆ ‘శిరస్త్రాణాన్ని’ తలకు పెట్టుకోవాలిగానీ చేత్తో పట్టుకుని ఉండకూడదు.
20 దేవుని వాక్యం ఖడ్గం లాంటిదని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. ఆ ఖడ్గాన్ని యెహోవా మనకిచ్చాడు. కానీ దాని సహాయంతో మన నమ్మకాల్ని సమర్థించాలన్నా, మన ఆలోచనల్ని సరిచేసుకోవాలన్నా దాన్ని నైపుణ్యవంతంగా వాడడం నేర్చుకోవాలి. (2 కొరిం. 10:4, 5; 2 తిమో. 2:15) దేవుని వాక్యాన్ని నైపుణ్యవంతంగా ఉపయోగించడం ఎలా నేర్చుకోవచ్చు? 21 ఏళ్ల సెబాస్టియన్ అనే యువకుడు ఇలా చెప్పాడు, “బైబిలు చదువుతున్నప్పుడు ప్రతీ అధ్యాయం నుండి ఒక లేఖనాన్ని పుస్తకంలో రాసుకుంటాను. ఆ విధంగా నాకు నచ్చిన లేఖనాల లిస్టును తయారు చేసుకుంటున్నాను.” యెహోవా ఆలోచనా విధానాన్ని మరింత బాగా అర్థంచేసుకోవడానికి అది సెబాస్టియన్‌కు సహాయం చేస్తుంది. డానియెల్ ఇలా చెప్పాడు, “నేను బైబిలు చదివేటప్పుడు, పరిచర్యలో కలిసే ప్రజలకు ఉపయోగపడే లేఖనాల్ని కనుగొనడానికి ప్రయత్నిస్తుంటాను. మీకు బైబిలుపై ఆసక్తి ఉందని, దాన్ని ఇతరులకు అర్థమయ్యేలా వివరించడానికి కృషిచేస్తున్నారని ప్రజలు గమనించినప్పుడు చక్కగా స్పందిస్తారని అనుభవంతో తెలుసుకున్నాను.”
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
(ఎఫెసీయులు 4:30) దేవుని పవిత్రశక్తిని బాధపెట్టకండి, విమోచన క్రయధనం ద్వారా మీరు విడుదల పొందే రోజు కోసం ఆ పవిత్రశక్తితోనే దేవుడు మీకు ముద్ర వేశాడు.
it-1 1128వ పేజీ, 3వ పేరా
పవిత్రత
పవిత్రశక్తి. యెహోవా శక్తి ఎప్పుడూ ఆయన అదుపులో ఉంటుంది, అన్నివేళలా ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది. అది స్వచ్ఛమైనది, పవిత్రమైనది, పరుశుద్ధమైనది. అది దేవుని ఉపయోగం కోసం ప్రత్యేకపర్చబడింది. అందుకే దాన్ని “పవిత్రశక్తి” అని పిలుస్తారు. (కీర్త 51:11; లూకా 11:13; రోమా 1:4; ఎఫె 1:13) ఎవరి మీదైనా పవిత్రశక్తి ఉంటే అది అతన్ని పవిత్రంగా, శుభ్రంగా ప్రవర్తించడానికి సహాయం చేస్తుంది. ఏదైనా అపవిత్రమైన లేదా తప్పుడు పని చేస్తే దేవుని పవిత్రశక్తిని ఎదిరించినవాళ్లం లేదా ‘బాధపెట్టినవాళ్లం’ అవుతాం. (ఎఫె 4:30) పవిత్రశక్తి ఒక వ్యక్తి కాదు, అయితే ఒకవిధంగా అది దేవుని పవిత్రమైన వ్యక్తిత్వానికి ప్రతిబింబం, కాబట్టి పవిత్రశక్తిని ‘బాధపెట్టడం’ అనే మాట ఉపయోగించడం సరైనదే. అలవాటుగా చెడ్డపనులు చేస్తే ‘దేవుని పవిత్రశక్తి జ్వాల ఆరిపోతుంది.’ (1 థెస్స 5:19) చెడ్డ పనులు చేస్తూ ఉంటే, దేవుని పవిత్రశక్తి బాధపడుతుంది ఫలితంగా అలాంటి తిరుగుబాటుదారునికి దేవుడు శత్రువుగా మారతాడు. (యెష 63:10) పవిత్రశక్తిని బాధపెట్టే వ్యక్తి దాన్ని దూషించే అవకాశం కూడా ఉంది. అలా దూషించేవాళ్లకు “ఈ వ్యవస్థలోనే కాదు రాబోయే వ్యవస్థలో కూడా క్షమాపణ ఉండదు” అని యేసుక్రీస్తు చెప్పాడు.—మత్త 12:31, 32; మార్కు 3:28-30.
(ఎఫెసీయులు 5:5) ఎందుకంటే లైంగిక పాపి గానీ, అపవిత్రుడు గానీ, విగ్రహపూజ చేసేవాళ్లతో సమానుడైన అత్యాశపరుడు గానీ క్రీస్తు పాలించే దేవుని రాజ్యంలో ప్రవేశించడని మీకు తెలుసు, ఈ విషయాన్ని మీరు పూర్తిగా అర్థంచేసుకున్నారు.
it-1 1006వ పేజీ, 2వ పేరా
అత్యాశ
పనుల్లో బయటపడుతుంది. అత్యాశ ఏదోక పనిలో బయటపడుతుంది. ఆ వ్యక్తికి ఉండే తప్పుడు లేదా మితిమీరిన కోరికను అది చూపిస్తుంది. బైబిలు రచయిత అయిన యాకోబు, తప్పుడు కోరిక వృద్ధి చెంది పాపాన్ని కంటుందని చెప్పాడు. (యాకో 1:14, 15) కాబట్టి ఒకరి పనుల్ని బట్టి వాళ్లు అత్యాశపరులో కాదో తెలిసిపోతుంది. అపొస్తలుడైన పౌలు అత్యాశపరులు విగ్రహపూజ చేసేవాళ్లతో సమానం అని రాశాడు. (ఎఫె 5:5) అలాంటివాళ్లు అత్యాశ వల్ల తమ కోరికనే దేవునిగా చేసుకుని, సృష్టికర్త సేవ కంటే, ఆయన ఆరాధన కంటే దాన్నే ప్రాముఖ్యంగా ఎంచుతారు.—రోమా 1:24, 25.
చదవాల్సిన బైబిలు భాగం
(ఎఫెసీయులు 4:17-32) కాబట్టి ప్రభువు పేరిట నేను మీకు చెప్పేది, మిమ్మల్ని వేడుకునేది ఏమిటంటే, మీరిక అన్యుల్లా అర్థంపర్థంలేని ఆలోచనల ప్రకారం జీవించకండి. 18 వాళ్లు తమ నిర్లక్ష్యం వల్ల, మొద్దుబారిపోయిన హృదయాల వల్ల చీకట్లో ఉన్నారు, దేవుడు ఇస్తానన్న శాశ్వత జీవితానికి దూరమైపోయారు. 19 వాళ్లు నైతిక విచక్షణ కోల్పోయి, అత్యాశతో అన్నిరకాల అపవిత్రమైన పనులు చేస్తూ లెక్కలేనట్టు ప్రవర్తిస్తున్నారు. 20 అయితే క్రీస్తు అలాంటివాడు కాదని మీరు తెలుసుకున్నారు. 21 ఎందుకంటే మీరు ఆయన మాటలు విన్నారు, ఆయన నుండి నేర్చుకున్నారు; ఆయనలో సత్యం ఉంది. 22 మీ పాత వ్యక్తిత్వాన్ని వదిలేయాలని మీరు నేర్చుకున్నారు. ఆ వ్యక్తిత్వం మీ పాత ప్రవర్తనకు అనుగుణంగా ఉంది, అది మీ మోసపూరిత కోరికల వల్ల దిగజారుతోంది. 23 మీరు కొత్త ఆలోచనా విధానాన్ని అలవర్చుకుంటూ ఉండాలి. 24 నిజమైన నీతికి, విశ్వసనీయతకు అనుగుణంగా దేవుని ఇష్టప్రకారం సృష్టించబడిన కొత్త వ్యక్తిత్వాన్ని మీరు అలవర్చుకోవాలి. 25 కాబట్టి, మోసం చేయడం మానేసిన మీరు సాటిమనిషితో నిజమే మాట్లాడండి. ఎందుకంటే మనమందరం ఒకే శరీరంలోని అవయవాలం. 26 మీకు కోపం వచ్చినా పాపం మాత్రం చేయకండి, సూర్యుడు అస్తమించే వరకు కోపంగా ఉండకండి; 27 అపవాదికి అవకాశం ఇవ్వకండి. 28 దొంగతనం చేసేవాళ్లు ఇకనుంచి దొంగతనం చేయకూడదు; వాళ్లు కష్టపడి పనిచేయాలి. అవసరంలో ఉన్నవాళ్లకు ఎంతోకొంత ఇవ్వగలిగేలా తమ సొంత చేతులతో నిజాయితీగల పని చేయాలి. 29 మీరు చెడ్డ మాటలు మాట్లాడకండి. వినేవాళ్లకు ప్రయోజనం కలిగేలా అవసరాన్ని బట్టి, బలపర్చే మంచి మాటలే మాట్లాడండి. 30 దేవుని పవిత్రశక్తిని బాధపెట్టకండి, విమోచన క్రయధనం ద్వారా మీరు విడుదల పొందే రోజు కోసం ఆ పవిత్రశక్తితోనే దేవుడు మీకు ముద్ర వేశాడు. 31 మీరు అన్నిరకాల ద్వేషాన్ని, కోపాన్ని, ఆగ్రహాన్ని వదిలేయండి. ఎదుటివాళ్లమీద అరవడం, వాళ్లను తిట్టడం మానేయండి, అలాగే గాయపర్చే పనులన్నీ ఆపేయండి. 32 ఒకరితో ఒకరు దయగా మెలగండి, కనికరం చూపించండి, క్రీస్తు ద్వారా దేవుడు మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించినట్టే మీరూ ఒకరినొకరు మనస్ఫూర్తిగా క్షమించుకోండి.
జూన్ 24-30
దేవుని వాక్యంలో ఉన్న సంపద|ఫిలిప్పీయులు 1-4
“ఏ విషయంలోనూ ఆందోళన పడకండి”
(ఫిలిప్పీయులు 4:6) ఏ విషయంలోనూ ఆందోళన పడకండి. కానీ ప్రతీ విషయంలో కృతజ్ఞతలు తెలుపుతూ ప్రార్థనల ద్వారా, అభ్యర్థనల ద్వారా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి;
w17.08 10వ పేజీ, 10వ పేరా
“మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి”
10 ‘ఏ విషయంలోనూ ఆందోళన పడకుండా’ “దేవుని శాంతి” కలిగివుండేలా ఏది మనకు సహాయం చేస్తుంది? మనం దేని గురించైనా ఆందోళన పడుతుంటే దానికి సరైన పరిష్కారం ప్రార్థనే అని పౌలు ఫిలిప్పీయులకు రాసిన మాటలు చూపిస్తున్నాయి. కాబట్టి మనం ఎప్పుడైనా ఆందోళనలతో సతమతమౌతుంటే, వాటి గురించి యెహోవాకు ప్రార్థించాలి. (1 పేతురు 5:6, 7 చదవండి.) అయితే అలా ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన మీపై శ్రద్ధ చూపిస్తాడనే పూర్తి నమ్మకంతో ఉండండి. మీరు పొందే ప్రతీ దీవెన బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయండి. మరిముఖ్యంగా, యెహోవా “మనం అడిగే వాటన్నిటికన్నా, ఊహించగలిగే వాటన్నిటికన్నా ఎంతో గొప్పవాటిని చేయగలడు” అని ఎన్నడూ మర్చిపోకండి.—ఎఫె. 3:20.
(ఫిలిప్పీయులు 4:7) అప్పుడు, మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి క్రీస్తుయేసు ద్వారా మీ హృదయాలకు, మీ మనసులకు కాపలా ఉంటుంది.
w17.08 10వ పేజీ, 7వ పేరా
“మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి”
7 ఫిలిప్పీలోని సహోదరులు పౌలు రాసిన ఉత్తరాన్ని చదివి వినిపించినప్పుడు సంఘంలోని వాళ్లకు ఏ విషయాలు గుర్తొచ్చి ఉంటాయి? చాలామందికి పౌలు–సీలను జైల్లో వేయడం, తర్వాత ఊహించని రీతిలో యెహోవా వాళ్లను కాపాడడం గుర్తొచ్చి ఉంటాయి. తన ఉత్తరం ద్వారా పౌలు వాళ్లకు ఒక విషయాన్ని నేర్పిస్తున్నాడు. అదేమిటంటే, ‘ఆందోళన పడకండి, ప్రార్థించండి. అప్పుడు మీరు దేవుని శాంతిని పొందుతారు.’ దేవుని శాంతి ‘మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైనది’ అని పౌలు వాళ్లకు చెప్పాడు. దానర్థమేమిటి? దేవుని శాంతి, ‘మన కలలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైనది’ లేదా ‘మనుషుల ప్రణాళికలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైనది’ అని కొన్ని బైబిలు అనువాదాలు చెప్తున్నాయి. కాబట్టి, “దేవుని శాంతి” మనం ఊహించగలిగే దానికన్నా ఎంతో అద్భుతమైనదని పౌలు చెప్తున్నాడు. కొన్నిసార్లు మన సమస్యలకు పరిష్కారం ఏమిటో మనకు తెలియకపోవచ్చు, కానీ యెహోవాకు తెలుసు. అంతేకాదు మన ఊహకందని దాన్ని ఆయన చేయగలడు.—2 పేతురు 2:9 చదవండి.
w17.08 12వ పేజీ, 16వ పేరా
“మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి”
16 ‘మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతిని’ మనం పొందినప్పుడు ఏమి జరుగుతుంది? అది మన హృదయాలకు, మనసులకు “కాపలా ఉంటుంది” అని బైబిలు చెప్తోంది. (ఫిలి. 4:7) ఆదిమ భాషలో “కాపలా” అనే మాట స్థానంలో, ఒక నగరాన్ని కాపాడడానికి నియమించిన సైనికుల గుంపును సూచించే పదాన్ని ఉపయోగించారు. ఫిలిప్పీ నగరాన్ని అలాంటి ఒక సైనికుల గుంపు కాపలా కాసేది. దాంతో ఆ నగరంలోని ప్రజలు తాము సురక్షితంగా ఉన్నామనే నమ్మకంతో రాత్రంతా హాయిగా నిద్రపోయేవాళ్లు. అదేవిధంగా మనం ‘దేవుని శాంతిని’ పొందినప్పుడు ఆందోళనపడం; మన హృదయాలు, మనసులు నెమ్మదితో ఉంటాయి. యెహోవాకు మన మీద శ్రద్ధ ఉందని, మనం విజయం సాధించాలని ఆయన కోరుకుంటున్నాడని మనకు తెలుసు. (1 పేతు. 5:10) ఆందోళన, నిరుత్సాహం వల్ల కృంగిపోకుండా ఉండేలా అది మనల్ని కాపాడుతుంది.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
(ఫిలిప్పీయులు 2:17) అయితే, మీ విశ్వాసం వల్ల మీరు చేసే పవిత్రసేవ అనే బలి మీద నేను పానీయ అర్పణగా పోయబడుతున్నా నాకు సంతోషమే, మీ అందరితో కలిసి నేను ఆనందిస్తాను.
it-2 528వ పేజీ, 5వ పేరా
అర్పణలు
పానీయార్పణలు. ఇశ్రాయేలీయులు మిగతా అర్పణలతో పాటు పానీయార్పణలను కూడా అర్పించేవాళ్లు, ముఖ్యంగా వాగ్దాన దేశంలో ప్రవేశించాక అలా అర్పించేవాళ్లు. (సంఖ్యా 15:2, 5, 8-10) ఈ అర్పణలో భాగంగా ద్రాక్షారసాన్ని (మత్తుపానీయాన్ని) బలిపీఠం మీద పోసేవాళ్లు. (సంఖ్యాకాండం 28:7, 14; నిర్గ 30:9 పోల్చండి; సంఖ్యా 15:10.) ఫిలిప్పీ ప్రాంతంలోని క్రైస్తవులకు అపొ స్తలుడైన పౌలు ఇలా రాశాడు: “మీ విశ్వాసం వల్ల మీరు చేసే పవిత్రసేవ అనే బలి మీద నేను పానీయ అర్పణగా పోయబడుతున్నా నాకు సంతోషమే.” ఆయన పానీయ అర్పణ ఉదాహరణను వాడుతూ, తన తోటి క్రైస్తవుల కోసం తనను తాను పూర్తిగా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చూపించాడు. (ఫిలి 2:17) తను చనిపోయే సమయానికి దగ్గర్లో ఉన్నప్పుడు పౌలు తిమోతికి ఇలా రాశాడు: “నేను ఇప్పటికే పానీయ అర్పణగా పోయబడుతున్నాను. నేను విడుదలయ్యే సమయం వచ్చేసింది.”—2 తిమో 4:6.
(ఫిలిప్పీయులు 3:11) సాధ్యమైతే నేను మొదటి పునరుత్థానంలో ఉండాలన్నదే నా ఉద్దేశం.
“మొదటి పునరుత్థానము” ఇప్పుడు జరుగుతోంది!
5 ఆ తర్వాత, “దేవుని ఇశ్రాయేలునకు” చెందిన అభిషిక్త సభ్యులు పరలోక మహిమలో ప్రభువైన యేసుక్రీస్తుతో కలిసి పనిచేయాలి, వారక్కడ “సదాకాలము ప్రభువుతోకూడా” ఉంటారు. (గలతీయులు 6:16; 1 థెస్సలొనీకయులు 4:17) అది “మొదటి పునరుత్థానము” అని పిలవబడింది. (ప్రకటన 20:6) ఆ పునరుత్థానం పూర్తైనప్పుడు, పరదైసు భూమిపై నిత్యజీవాన్ని దక్కించుకునే ఉత్తరాపేక్షగల లక్షలాదిమందిని భూమ్మీదికి పునరుత్థానంచేసే సమయం ఆసన్నమౌతుంది. కాబట్టి, మన నిరీక్షణ పరలోక సంబంధమైనదైనా లేక భూసంబంధమైనదైనా, “మొదటి పునరుత్థానము” మనకు కుతూహలం కలిగిస్తుంది. అదెలాంటి పునరుత్థానం? అది ఎప్పుడు జరుగుతుంది?
చదవాల్సిన బైబిలు భాగం
(ఫిలిప్పీయులు 4:10-23) ఇప్పుడు మీరు మళ్లీ నా గురించి ఆలోచిస్తున్నందుకు ప్రభువు సేవకుడినైన నేను ఎంతో సంతోషిస్తున్నాను. నా బాగోగుల విషయంలో మీకు ఎప్పుడూ శ్రద్ధ ఉంది, కానీ దాన్ని చూపించే అవకాశం కొంతకాలం మీకు దొరకలేదు. 11 ఇప్పుడు నాకు ఏదో అవసరం పడి అలా అనట్లేదు, ఎందుకంటే నా పరిస్థితులు ఎలా ఉన్నా సర్దుకుపోవడం నేర్చుకున్నాను. 12 తక్కువగా ఉన్నప్పుడు ఎలా సర్దుకుపోవాలో నాకు తెలుసు, ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో తృప్తిగా జీవించడానికిగల రహస్యం ఏమిటో తెలుసుకున్నాను. కడుపు నిండా తిన్నా, ఆకలితో ఉన్నా, ఎక్కువ ఉన్నా, అసలేమీ లేకున్నా ఎలా జీవించాలో నాకు తెలుసు. 13 ఎందుకంటే, నాలో శక్తిని నింపే దేవుని వల్ల దేన్నైనా ఎదుర్కొనే బలం నాకుంది. 14 అయినా, నా కష్టాల్లో మీరు నాకు సహాయం చేసినందుకు మీకు కృతజ్ఞుణ్ణి. 15 నిజానికి, ఫిలిప్పీయులారా, మీరు మొదటిసారి మంచివార్తను తెలుసుకున్న తర్వాత, నేను మాసిదోనియ నుండి వెళ్లిపోతున్న సమయంలో, మీరు తప్ప ఒక్క సంఘం కూడా నాకు సహాయం చేయలేదు, నా సహాయం తీసుకోలేదు. ఈ విషయం మీకూ తెలుసు. 16 నేను థెస్సలొనీకలో ఉన్నప్పుడు మీ నుండి నాకు కావాల్సిన సహాయం అందింది. ఒక్కసారి కాదు, రెండుసార్లు మీరు నాకు సహాయం చేశారు. 17 నేను మీ నుండి ఏ బహుమానం ఆశించట్లేదు కానీ, మీ సంపదను ఇంకా పెంచే ఆశీర్వాదాలు మీరు పొందాలని కోరుకుంటున్నాను. 18 నాకు కావాల్సిన ప్రతీది నా దగ్గర ఉంది, చెప్పాలంటే అంతకన్నా ఎక్కువే ఉంది. నాకు ఏ లోటూ లేదు, ఎపఫ్రొదితు ద్వారా మీరు పంపించింది నాకు అందింది. అది దేవుడు అంగీకరించే, ఇష్టపడే, సువాసనగల బలి. 19 మీరు చేసినదానికి ఫలితంగా, మహిమాన్విత సంపదలు ఉన్న దేవుడు మీకు కావాల్సినవన్నీ క్రీస్తుయేసు ద్వారా పూర్తిగా దయచేస్తాడు. 20 మన తండ్రైన దేవునికి యుగయుగాలు మహిమ కలగాలి. ఆమేన్. 21 క్రీస్తుయేసు శిష్యులుగా ఉన్న పవిత్రుల్లో ప్రతీ ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలపండి. నాతో ఉన్న సోదరులు కూడా మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 22 పవిత్రులంతా, ముఖ్యంగా కైసరు ఇంటివాళ్లు మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 23 ప్రభువైన యేసుక్రీస్తు అపారదయ మీరు చూపించే స్ఫూర్తికి తోడుండాలి.