-
మార్కు 9:17-29పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
17 అప్పుడు వాళ్లలో ఒకతను ఇలా చెప్పాడు: “బోధకుడా, మా అబ్బాయికి మూగ దూత* పట్టాడు. అందుకే అతన్ని నీ దగ్గరికి తీసుకొచ్చాను.+ 18 ఆ చెడ్డదూత పట్టినప్పుడల్లా అతను కింద పడిపోతాడు, అతని నోట్లో నుండి నురగ వస్తుంది, పళ్లు కొరుక్కుంటాడు, నీరసించిపోతాడు. ఆ చెడ్డదూతను వెళ్లగొట్టమని నీ శిష్యుల్ని అడిగాను కానీ వాళ్ల వల్ల కాలేదు.” 19 అప్పుడు యేసు వాళ్లతో, “విశ్వాసంలేని తరమా,+ ఎంతకాలం నేను మీతో ఉండాలి? ఎంతకాలం మిమ్మల్ని సహించాలి? ఆ అబ్బాయిని నా దగ్గరికి తీసుకురండి” అన్నాడు.+ 20 వాళ్లు ఆ అబ్బాయిని యేసు దగ్గరికి తీసుకొచ్చారు, కానీ ఆ చెడ్డదూత యేసును చూడగానే ఆ అబ్బాయిని గిలగిలా కొట్టుకునేలా చేశాడు. అతను కిందపడి అటూఇటూ దొర్లుతూ ఉన్నాడు, అతని నోట్లో నుండి నురగ వస్తూ ఉంది. 21 అప్పుడు యేసు, “అతనికి ఎంతకాలంగా ఇలా జరుగుతోంది?” అని వాళ్ల నాన్నను అడిగాడు. అతను ఇలా చెప్పాడు: “చిన్నప్పటి నుండీ ఇలాగే జరుగుతోంది. 22 చెడ్డదూత అతన్ని చంపేయాలని తరచూ మంటల్లోకి, నీళ్లలోకి తోసేస్తాడు. నువ్వు ఏమైనా చేయగలిగితే, మామీద జాలి చూపించి మాకు సహాయం చేయి.” 23 అప్పుడు యేసు అతనితో, “ ‘చేయగలిగితే’ అనే మాట ఎందుకు? విశ్వాసం ఉన్న వ్యక్తికి అన్నీ సాధ్యమే”+ అని చెప్పాడు. 24 వెంటనే అతను గట్టిగా, “నాకు విశ్వాసం ఉంది! ఒకవేళ విశ్వాసం తక్కువగా ఉంటే సహాయం చేయి”+ అన్నాడు.
25 ప్రజలు తమవైపు పరుగెత్తుకురావడం గమనించి, యేసు ఆ అపవిత్ర దూతను* గద్దిస్తూ, “చెవుడున్న మూగ దూతా, నీకు ఆజ్ఞాపిస్తున్నాను, బయటికి రా. ఇంకెప్పుడూ అతనిలోకి ప్రవేశించకు!” అన్నాడు.+ 26 ఆ అపవిత్ర దూత గట్టిగా అరిచి, ఆ అబ్బాయిని గిలగిల కొట్టుకునేలా చేసి అతనిలో నుండి బయటికి వచ్చేశాడు. అప్పుడు ఆ అబ్బాయి చనిపోయినవాడిలా పడివున్నాడు. దాంతో చాలామంది, “ఈ అబ్బాయి చనిపోయాడు!” అన్నారు. 27 అయితే యేసు ఆ అబ్బాయి చెయ్యి పట్టుకొని పైకి లేపాడు, అతను లేచి నిలబడ్డాడు. 28 ఆ తర్వాత యేసు ఒక ఇంట్లోకి వెళ్లాడు. యేసు ఒక్కడే ఉన్నప్పుడు శిష్యులు ఆయన్ని, “ఆ చెడ్డదూతను మేము ఎందుకు వెళ్లగొట్టలేకపోయాం?” అని అడిగారు.+ 29 అందుకు యేసు, “ఇలాంటి చెడ్డదూతల్ని వెళ్లగొట్టడం ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యమౌతుంది” అని చెప్పాడు.
-
-
లూకా 9:38-42పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
38 అప్పుడు ఇదిగో! వాళ్లలో ఒకతను ఇలా అరిచాడు: “బోధకుడా, ఒకసారి వచ్చి నా కుమారుణ్ణి చూడమని వేడుకుంటున్నాను. అతను నా ఒక్కగానొక్క కుమారుడు.+ 39 ఇదిగో! ఒక చెడ్డదూత నా కుమారుణ్ణి లొంగదీసుకుంటూ ఉంటాడు. దాంతో అతను ఉన్నట్టుండి పెద్దగా కేకలు వేస్తాడు. ఆ చెడ్డదూత అతన్ని గిలగిల కొట్టుకునేలా చేస్తాడు. అప్పుడు అతని నోటి నుండి నురగ వస్తుంది. ఆ చెడ్డదూత అతన్ని గాయపర్చి, అతి కష్టం మీద గానీ అతనిలో నుండి బయటికి రాడు. 40 ఆ చెడ్డదూతను వెళ్లగొట్టమని నేను నీ శిష్యుల్ని వేడుకున్నాను కానీ అది వాళ్లవల్ల కాలేదు.” 41 అప్పుడు యేసు, “విశ్వాసంలేని చెడ్డ* తరమా,+ ఎంతకాలం నేను మీతో ఉంటూ మిమ్మల్ని సహించాలి? నీ కుమారుణ్ణి ఇక్కడికి తీసుకురా” అన్నాడు.+ 42 అతను వస్తున్నప్పుడు కూడా ఆ చెడ్డదూత అతన్ని కిందపడేసి, అతను భయంకరంగా గిలగిల కొట్టుకునేలా చేశాడు. అయితే యేసు ఆ అపవిత్ర దూతను* గద్దించి, ఆ అబ్బాయిని బాగుచేసి, అతన్ని వాళ్ల నాన్నకు అప్పగించాడు.
-