రాజులు రెండో గ్రంథం
9 అప్పుడు ఎలీషా ప్రవక్త, ప్రవక్తల కుమారుల్లో ఒకతన్ని పిలిచి ఇలా చెప్పాడు: “నీ బట్టల్ని నడుము చుట్టూ గట్టిగా కట్టుకొని, త్వరగా ఈ నూనె బుడ్డి తీసుకొని రామోత్గిలాదుకు+ వెళ్లు. 2 అక్కడికి వెళ్లాక, నింషీ మనవడూ యెహోషాపాతు కుమారుడూ అయిన యెహూ+ కోసం వెతుకు; నువ్వు వెళ్లి అతని సహోదరుల మధ్యలో నుండి అతన్ని పిలిచి, లోపలి గదిలోకి తీసుకెళ్లు. 3 తర్వాత నూనె బుడ్డి తీసుకొని అతని తలమీద నూనె పోసి ఇలా అను, ‘యెహోవా చెప్పేదేమిటంటే: “నేను నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకిస్తున్నాను.” ’+ తర్వాత తలుపు తెరిచి వెంటనే అక్కడి నుండి పారిపో.”
4 కాబట్టి ఆ ప్రవక్త కుమారుడు రామోత్గిలాదుకు బయల్దేరాడు. 5 అతను అక్కడికి చేరుకున్నప్పుడు, సైన్యాధిపతులు అక్కడ కూర్చొని ఉన్నారు. అతను, “అధిపతీ, నీకు ఒక సందేశం తెచ్చాను” అన్నాడు. దానికి యెహూ, “మాలో ఎవరికి?” అని అడిగాడు. ఆ సేవకుడు, “అధిపతీ, నీకే” అని చెప్పాడు. 6 దాంతో యెహూ లేచి ఇంట్లోకి వెళ్లాడు; అతను యెహూ తలమీద నూనె పోసి ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమిటంటే: ‘నేను నిన్ను యెహోవా ప్రజల మీద, అంటే ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకిస్తున్నాను.+ 7 నువ్వు నీ ప్రభువైన అహాబు ఇంటివాళ్లను చంపాలి; యెజెబెలు చేతిలో చనిపోయిన నా సేవకులైన ప్రవక్తల రక్తం విషయంలో, యెహోవా సేవకులందరి రక్తం విషయంలో నేను ప్రతీకారం తీర్చుకుంటాను.+ 8 అహాబు ఇంటివాళ్లందరూ నశించిపోతారు; ఇశ్రాయేలులోని నిస్సహాయులతో, బలహీనులతో సహా అహాబు కుటుంబంలో ఉన్న ప్రతీ మగవాణ్ణి నేను నిర్మూలిస్తాను.+ 9 నేను అహాబు ఇంటిని, నెబాతు కుమారుడైన యరొబాము ఇంటిలా,+ అహీయా కుమారుడైన బయెషా ఇంటిలా+ చేస్తాను. 10 యెజెబెలు విషయానికొస్తే, యెజ్రెయేలు పొలంలో కుక్కలు ఆమెను తింటాయి.+ ఎవరూ ఆమెను పాతిపెట్టరు.’ ” ఆ సేవకుడు ఆ మాటలు చెప్పి, తలుపు తెరిచి పారిపోయాడు.+
11 యెహూ తన ప్రభువు సేవకుల దగ్గరికి తిరిగొచ్చినప్పుడు వాళ్లు, “అంతా బాగానే ఉంది కదా? నిన్ను కలవడానికి ఆ పిచ్చివాడు ఎందుకు వచ్చాడు?” అని అడిగారు. దానికి అతను, “మీకు అతని గురించి, అలాంటివాళ్లు మాట్లాడే మాటల గురించి తెలుసు కదా” అన్నాడు. 12 కానీ వాళ్లు, “విషయం అది కాదు! దయచేసి నిజం చెప్పు” అన్నారు. అప్పుడు యెహూ అతని మాటల్ని వాళ్లకు ఇలా తెలియజేశాడు: “ ‘ “నేను నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకిస్తున్నాను” అని యెహోవా చెప్తున్నాడు’ అని అతను నాతో అన్నాడు.”+ 13 వెంటనే వాళ్లలో ప్రతీ ఒక్కరు తమ బట్టల్ని తీసి అతని కాళ్ల కింద మెట్ల మీద పరిచారు;+ వాళ్లు బూర* ఊది, “యెహూ రాజయ్యాడు!” అని అరిచారు.+ 14 తర్వాత నింషీ మనవడూ యెహోషాపాతు కుమారుడూ అయిన యెహూ+ యెహోరాము మీద కుట్రపన్నాడు.
ఆ సమయంలో యెహోరాము, ఇశ్రాయేలు ప్రజలు రామోత్గిలాదు+ దగ్గర ఉండి, సిరియా రాజైన హజాయేలు+ నుండి దాన్ని కాపాడుతున్నారు. 15 తర్వాత రాజైన యెహోరాము యెజ్రెయేలుకు+ తిరిగొచ్చాడు. సిరియా రాజైన హజాయేలుతో యుద్ధం చేసినప్పుడు సిరియన్లు చేసిన గాయాల నుండి కోలుకోవడానికి యెహోరాము అక్కడికి వచ్చాడు.+
అప్పుడు యెహూ సైన్యాధిపతులతో ఇలా అన్నాడు: “మీరు నావైపు ఉంటే, ఈ నగరంలో నుండి ఎవరూ బయటికి వెళ్లకుండా, వాళ్లు వెళ్లి యెజ్రెయేలులో ఈ విషయం చెప్పకుండా చూడండి.” 16 తర్వాత యెహూ తన రథం ఎక్కి యెజ్రెయేలుకు వెళ్లాడు. ఎందుకంటే యెహోరాము అక్కడ గాయాలతో పడుకొని ఉన్నాడు; యెహోరామును చూడడానికి యూదా రాజైన అహజ్యా అక్కడికి వెళ్లాడు. 17 ఆ సమయంలో, యెజ్రెయేలు గోపురం మీద ఒక కావలివాడు నిలబడివున్నాడు; అతనికి యెహూ మనుషులు ఒక పెద్ద గుంపుగా రావడం కనిపించింది. అతను వెంటనే, “నాకు ఒక పెద్ద గుంపు కనిపిస్తుంది” అన్నాడు. అప్పుడు యెహోరాము, “వాళ్లను కలవడానికి ఒక గుర్రపురౌతును పంపించి, ‘మీరు శాంతిగా వస్తున్నారా?’ అని వాళ్లను అడగమను” అని చెప్పాడు. 18 కాబట్టి ఒక గుర్రపురౌతు యెహూ దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు: “ ‘నువ్వు శాంతిగా వస్తున్నావా?’ అని రాజు అడగమన్నాడు.” కానీ యెహూ, “శాంతితో నీకేం పని? నా వెనక రా!” అన్నాడు.
అప్పుడు కావలివాడు రాజుకు ఇలా తెలియజేశాడు: “ఆ సందేశకుడు వాళ్ల దగ్గరికి వెళ్లాడు, కానీ వెనక్కి రాలేదు.” 19 కాబట్టి రాజు రెండో గుర్రపురౌతును పంపించాడు; అతను వాళ్ల దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు: “ ‘నువ్వు శాంతిగా వస్తున్నావా?’ అని రాజు అడుగుతున్నాడు.” కానీ యెహూ, “శాంతితో నీకేం పని? నా వెనక రా!” అన్నాడు.
20 అప్పుడు కావలివాడు, “ఆ సందేశకుడు వాళ్ల దగ్గరికి వెళ్లాడు కానీ వెనక్కి రాలేదు; ఆ వచ్చే వ్యక్తి రథాన్ని నడిపే తీరు చూస్తుంటే, అతను నింషీ మనవడైన* యెహూ అనిపిస్తుంది; ఎందుకంటే అతను పిచ్చివాడిలా నడుపుతాడు” అని అన్నాడు. 21 అప్పుడు యెహోరాము, “రథాన్ని సిద్ధం చేయండి!” అన్నాడు. అతని యుద్ధ రథాన్ని సిద్ధం చేశారు. ఇశ్రాయేలు రాజైన యెహోరాము, యూదా రాజైన అహజ్యా+ యెహూను కలవడానికి తమ యుద్ధ రథాల్లో బయల్దేరారు. యెహూ వాళ్లకు యెజ్రెయేలువాడైన నాబోతు పొలంలో+ ఎదురయ్యాడు.
22 యెహోరాము యెహూను చూడగానే, “యెహూ, నువ్వు శాంతిగా వస్తున్నావా?” అని అడిగాడు. కానీ అతను, “మీ అమ్మ యెజెబెలు వ్యభిచారం చేస్తూ, విపరీతంగా మంత్రతంత్రాలు చేసినంత కాలం+ శాంతి ఎలా ఉంటుంది?”+ అన్నాడు. 23 ఆ మాట వినగానే యెహోరాము పారిపోవడానికి తన రథాన్ని తిప్పాడు. అతను అహజ్యాతో, “మనం మోసపోయాం అహజ్యా!” అన్నాడు. 24 అప్పుడు యెహూ తన విల్లును తీసుకొని యెహోరాము భుజాల మధ్య బాణం వేశాడు, ఆ బాణం అతని గుండెను చీల్చుకుని బయటికి వచ్చింది, దాంతో అతను తన యుద్ధ రథంలోనే కుప్పకూలాడు. 25 యెహూ తన సహాయాధికారి బిద్కరుతో ఇలా అన్నాడు: “అతన్ని ఎత్తి యెజ్రెయేలువాడైన నాబోతు పొలంలో పడేయి.+ నీకు గుర్తుందా, మనిద్దరం అతని తండ్రి అహాబు వెనక రథాల్లో వెళ్తున్నప్పుడు యెహోవాయే అతనికి వ్యతిరేకంగా ఈ తీర్పు ప్రకటించాడు:+ 26 ‘ “నేను నిన్న నాబోతు రక్తాన్ని, అతని కుమారుల రక్తాన్ని ఖచ్చితంగా చూశాను”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు, “ఈ పొలంలోనే నేను నీ మీద ప్రతీకారం తీర్చుకుంటాను”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.’ కాబట్టి యెహోవా మాట ప్రకారం, నువ్వు అతన్ని ఎత్తి పొలంలో పడేయి.”+
27 యూదా రాజైన అహజ్యా+ జరిగింది చూసి, తోటకు* వెళ్లే దారిలో పారిపోయాడు. (తర్వాత యెహూ అతన్ని తరిమి, “అతన్ని కూడా చంపండి!” అన్నాడు. అహజ్యా ఇబ్లెయాము+ పక్కన ఉన్న గూరుకు వెళ్తున్నప్పుడు, వాళ్లు రథంలో ఉన్న అతనిమీద దాడిచేశారు. అయితే, అతను మెగిద్దోకు పారిపోయి అక్కడ చనిపోయాడు. 28 తర్వాత అతని సేవకులు అతన్ని ఒక రథంలో యెరూషలేముకు తీసుకొచ్చారు. వాళ్లు అహజ్యాను దావీదు నగరంలో+ అతని పూర్వీకులతోపాటు అతని సమాధిలో పాతిపెట్టారు. 29 అహాబు కుమారుడైన యెహోరాము పరిపాలనలోని 11వ సంవత్సరంలో అహజ్యా+ యూదా మీద రాజయ్యాడు.)
30 యెహూ యెజ్రెయేలుకు+ వచ్చినప్పుడు, ఆ విషయం యెజెబెలుకు+ తెలిసింది. దాంతో ఆమె తన కళ్లకు కాటుక పెట్టుకుని, జుట్టును అలంకరించుకొని కిటికీలో నుండి కిందికి చూసింది. 31 యెహూ ద్వారం గుండా లోపలికి వస్తుండగా ఆమె, “తన ప్రభువును చంపిన జిమ్రీకి ఏం జరిగిందో గుర్తుందా?”+ అంది. 32 అప్పుడు యెహూ తల పైకెత్తి కిటికీ వైపు చూసి, “నా వైపు ఎవరు ఉన్నారు? ఎవరు?”+ అని అడిగాడు. వెంటనే ఇద్దరు ముగ్గురు ఆస్థాన అధికారులు పైనుండి అతనివైపు చూశారు. 33 అతను, “ఆమెను కిందికి పడేయండి!” అన్నాడు. వాళ్లు ఆమెను కిందికి పడేశారు, ఆమె రక్తంలో కొంచెం గోడమీద, గుర్రాలమీద చిమ్మింది. యెహూ తన గుర్రాలతో ఆమెను తొక్కించాడు. 34 తర్వాత యెహూ లోపలికి వెళ్లి తిని, తాగాడు. ఆ తర్వాత యెహూ ఇలా అన్నాడు: “దయచేసి ఈ శపించబడిన స్త్రీ సంగతి చూడండి, ఆమెను పాతిపెట్టండి. ఎంతైనా ఆమె రాజు కూతురు కదా.”+ 35 అయితే ఆమెను పాతిపెట్టడానికి వెళ్లినప్పుడు వాళ్లకు ఆమె పుర్రె, పాదాలు, అరచేతులు తప్ప ఇంకేమీ దొరకలేదు.+ 36 వాళ్లు వెనక్కి వచ్చి ఆ విషయం యెహూకు చెప్పారు; అప్పుడు అతను ఇలా అన్నాడు: “తిష్బీయుడైన ఏలీయా ద్వారా యెహోవా చెప్పిన ఈ మాట నేడు నెరవేరింది:+ ‘యెజ్రెయేలు పొలంలో కుక్కలు యెజెబెలు మాంసాన్ని తింటాయి.+ 37 “ఈమె యెజెబెలు” అని ఎవరూ గుర్తుపట్టకుండా ఈమె శవం యెజ్రెయేలులోని పొలంలో ఎరువుగా మారుతుంది.’ ”